పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : అంబనవోంబుజోజ్వల

ఈ పద్యం కడు హృద్యం : శారదాంబకు నైవేద్యం "

******************************************

అంబ! నవాంబుజోజ్వల కరాంబుజ!శారద చంద్రచంద్రికా
డంబర చారుమూర్తి! ప్రకటస్ఫుట భూషణ రత్నరోచిరా
చుంబిత దిగ్విభాగ! శ్రుతిసూక్త వివిక్త నిజప్రభావ! భాచేర
వాంబరవీథి విశ్రుతవిహారి! ననుం గృప జూడు భారతీ!

ఇది ఎర్రాప్రగడ వ్రాసిన పద్యం.

["అంబ నంవాంబుజోజ్వల. . . " పద్యాన్ని పోతన తెలుగు భాగవతంలో 1-9-ఉ. పద్యంగా "ఎఱ్ఱన భారతం" నుండి గ్రహించబ బడింది. ఇది మన "బమ్మఱ పోతనామాత్యులు" పూర్వకవులపై నుండే గౌరవం కొలది / ఈ పద్యంపై గల ఇష్టం చేత తన భాగవతారంభ పద్యాలలో చేర్చారు. చిన్న పాఠ్యంతరం 2వ పాదం చివర" రోచిరా" బదులు "దీపికా" వాడబడింది]

భావము :-

ఓ తల్లీ సరస్వతీ! క్రొత్త తామరపూలతో వెలుగొందే తామరలవంటి చేతులుగలదానా! శరత్కాలపు చంద్రుని వెన్నెలతో సమానమైన చక్కనిరూపు గలదానా! ప్రస్ఫుటమైన ఆభరణ రత్నాల కాంతులచే ముద్దాడబడిన దిక్కులు గలదానా! వేదసూక్తాలచే వివేచింపబడిన మహిమ గలదానా! మనస్సు అనే ఆకాశంలో విహరించుదువను కీర్తి గలదానా! నన్ను దయతో చూడవమ్మా!

- - - - 

తల్లీ! అనే చక్కని సంభోదనతో ప్రార్థన మొదలయింది. తల్లులందరూ పాలిచ్చి తమ బిడ్డలను పెంచుతారు. ఈ తల్లి వాగ్ధారలనిచ్చి పెంచుతుంది. ఈమె ఎంతచల్లని తల్లి కాకపోతే బోయవాడైన వాల్మీకికి,  కుమ్మరికుల వంశ సంజాతయైన ' మొల్ల ' కు అపూర్వమైన కవితాధారలను అనుగ్రహించి వారిని జగత్ప్రసిద్ధులను జేస్తుంది! రెండవ విశేషణంలో  'అంబుజ' శబ్దం రెండుసార్లు వచ్చింది. అంబుజం అంటే పద్మం. ఒకేచోట ఒకే అర్థంలో శబ్దం పునరుక్తి కావటం దోషమే! అయితే అర్థవిశేషంవలన ఆ దోషం తొలగిపోతుంది. ఆమె చేతులే పద్మాలవంటివట. పద్మంవంటి చేతిలో కొత్తగా విరిసిన పద్మం తాల్చిందన్నమాట! అదీ ఆహ్లాదకరమైన విశేషం. అంతేకాదు పద్మం జ్ఞానానికి సంకేతం. 

సరస్వతి రూపు తెల్లన. తెలుపు స్వచ్ఛతకి గుర్తు. అందువల్లనే వెన్నెలతో పోల్చాడు కవి. మబ్బులుండని శరత్కాలపు వెన్నల మరీ తెల్లగా ఉంటుంది కదా! సరిగ్గా ఇదే పోలికతో పోతనామాత్యుడు తన భాగవత రచనలో  " శారద నీరదేందు ఘనసార పటీర........."  అనే పద్యంలో సరస్వతిని స్తుతించాడు. ఆయన పద్యంలో వాడిన విశేషాలన్నీ తెలుపును సూచించేవే! వేదసూక్తంలో భారతీదేవి మహిమ వెల్లివిరిసింది. 

' భావము ' అంటే మానసిక ఆలోచన. మనసులోనుంచి పుట్టేది. మన్మథునికి అందుకే   ' భావజుడు ' అనే పేరు వచ్చింది. 

ఆలోచనాకాశ వీథుల్లో సరస్వతి సంచారమన్నమాట. ఆలోచనలన్నీ వాగ్రూపాలే! భావానికి భాష తోడు కావాలి. ఈ ఆలోచనా లోకాన్ని ఆకాశంగా భావించి, అందులో ఆ తల్లి విహరిస్తుంది అనటం అద్భుతమైన ఊహ. అంతేకాదు 'భావము' అంటే రసభావం అనికూడా చెప్పుకోవచ్చు. అది కవుల మనస్సుల్లో మెదిలేది. ఆ రసభావసంచారమంతా సరస్వతీ విహారమే గదా! ఆమెను వాజ్మయ రూపిణిగా దర్శించాడు ఎర్రన. అందుకే నేటికినీ చిరస్థాయిగా నిలిచే పద్యరచనను చేయగలిగాడు. కానీ అత్యంత ప్రసిద్ధిపొందిన ఈ సరస్వతీ స్తోత్రం కొన్ని భాగవత ప్రతులలో పోతన రచనగా చేరిపోయింది. 

వేదకాలాన సరస్వతి అనే నది ప్రస్తావన ఉంది.  ' సరస్+వతి' అంటే నీరుగలది అని అర్థం. కాగా విద్యాదేవతగా సరస్వతి స్థిరపడింది. ఆమెది మూలా నక్షత్రమని, వసంతపంచమి ఆమె జన్మదినమని అంటారు. మనకిప్పుడు క్యాలెండరు మీది బొమ్మల్లో నదీతీరాన అక్షమాలా వీణా పుస్తకపాణిగా, పక్కన నెమలితో కనబడే సరస్వతి,  రాజా రవివర్మ చిత్ర కల్పన.

- - - - - 

పై పద్యానికి ' కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ' గారి వ్యాఖ్యానం చదివి మరిన్ని కొత్త విషయాలను తెలుసుకుందాం!

" తార్ష్యుడను ముని సరస్వతీదేవిని నారాధించెను. ఆమె ప్రత్యక్షమయ్యెను. ఆ సమయమున తార్ష్యుడు భారతీదేవిని స్తోత్రము జేసెను. ఇది ఆ పద్యము.

నవాంబుజోజ్జ్వల కరాంబుజ! ...... క్రొత్త తామరపువ్వుచేత ప్రకాశించుచున్న కరపద్మము కలదానా!

ప్రకటస్ఫుట .......దిగ్విభాగ! .....

విస్ఫష్టముగా గనిపించుచున్న నగలయందలి రత్నముల కాంతిచేత ముద్దుపెట్టుకొనబడుచున్న దిగ్విభాగములు గలదానా!

శ్రుతి .....ప్రభావ.....

వేదసూక్తులయందు విస్ప‌ష్టముగానున్న నిజమైన ప్రభావము గలదానా!

భావాంబర.......విహార......

భావమను నాకాశవీథియందు విశ్రుతమైన విహారము జేయుదానా!

నన్ను కృప చూడుము.

విశ్రుత విహారిణి నన్ గృపజూడు భారతీ!

అని యొక పాఠమున్నది.

ఈ పద్యము పూర్వకాలమున సర్వ జనులు చదువుచుండెడివారు. పుస్తకము చేబూనినంతనే దేవతా స్తోత్రములు చేసెడివారు. ఆ స్తోత్రములలో నిదియొక పద్యము. 

ఈ పద్యము యొక్క శైలి నిజముగా నన్నయగారి శైలివంటిది. తెలుగుజాతి యొక్క నోటికొచ్చిన పద్యము.

ఇది ప్రార్థనా పద్యమొగుటచేత భాగవతము మొదట ప్రార్థనా పద్యములలో నచ్చువేయబడియుండును. 

మరియు తిక్కన గారి భారతములో వ్యాసుని స్తోత్రమైన యొక పద్యమున్నది. " ప్రాంశు పయోదనీల....." మొదలైన పద్యము. ఈ పద్యమును కూడ భాగవతము మొదట నచ్చు వేసియుందురు.

" అంబ ! నవాంబుజోజ్జ్వల " ఎర్రాప్రగడ రాసిన పద్యము. ' ప్రాంశు పయోదనీల ' తిక్కన గారు వ్రాసిన పద్యము. సామాన్యముగా ఈ రెండు పద్యములు పోతనగారు వ్రాసినవనకుందురు. ఈ పద్యములలోని రచన అంత మధురముగా నంత హృదయంగముగా నుండును. మొత్తముమీద పోతనగారిదేమో అనిపించును."

       - విశ్వనాథ సత్యనారాయణ 

పైపద్యంపై ఉదహరించిన వ్యాఖ్యానాలను చదివినవారు .......ఆ పద్యాన్ని ఆ పద్య భావాన్ని చదివి అర్థంచేసుకోవడమే కాక ఇంటనున్న చిన్నారులచేత కంఠస్తము చేయించండి. ఇది తెలుగువారిగ మీ కర్తవ్యము. మనందరి కర్తవ్యము.

భవదీయుడు

డా!! సోమయాజుల త్యాగరాజ శాస్త్రి