పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : అమ్మా! లక్కసానమ్మా!

అమ్మా!
లక్కసానమ్మా
లక్ష్మమ్మతల్లీ!
అక్షరంగా ఉండే చిరంజీవిని అందించావమ్మా! వందనాలు.
మానినులీడుగారు,బహుమాన నివారిత దీన మానస
గ్లానివి,దాన ధర్మమతిగౌరవ మంజులతా గభీరతా
స్థానివి,ముద్దసానివి, సదాశివ పాదయుగార్చనానుకం
పానయవాగ్భవాని!మది భక్తి భజించెద లక్కమా!నినున్
అమ్మా! లక్కమ్మా!! నీకు ఏ మహిళలు సాటివస్తారమ్మా!
బీదసాదలపై ఔదార్యం చూపించినావు,వారిహృదయాల్లో
దైన్యాన్ని పోగొట్టినావు,దానధర్మాలుచేసినావు, గౌరవాదరా లను
చూపించడంలో నీకు సాటి ఎవరమ్మా!గాంభీర్యం నీ
సహజగుణంతల్లీ! నీవు కల్లాకపటం ఎరుగనిదానివమ్మా!
మృదుభాషిణివి మాతా! పరమేశ్వరుని పాదపద్మాలు సే
వించి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందిన భవానితో సమాన
మమ్మానీవు.అయ్య కేశవయ్యగారికి అర్థాంగివైన లక్ష్మీ
దేవివమ్మానీవు. సామాన్యకాంతలు నీకు సాటి వస్తారా?
రాలేరమ్మా.నిన్నుగురించి నీ కొడుకూ - మా వీరాభిమానీ
అయిన పోతన తెలిపినాడమ్మా! నిన్ను భక్తితో భజిస్తాం తల్లీ!
తెలుగువాళ్లకు భాగవత హృద్యపద్యామృతాన్ని అందించిన
కొడుకును కన్నావమ్మా! నీవు సామాన్యవు కాదు,మాన్యవు.
నీ పాదాలకు దండాలమ్మా
- వేంకటేశ్వరాచార్యులు వైద్యం.