పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : అపరిగ్రహం

 పోతనామాత్యుడు నిరాడంబరంగా పొలం దున్నుకుంటూ వచ్చిన దానితో బ్రతుకుతుండే వాడు. తను వ్రాసిన గ్రంథాలను శ్రీరాముడికి అంకిత మిచ్చేవాడు. . శ్రీనాథుడు తను వ్రాసిన గ్రంథాలను రెడ్డి రాజులకు అంకిత మిచ్చి వారిచ్చిన ధనం తో దర్జాగా బ్రతికే వాడు. ఆయన పోతన గారికి యిలా సలహా యిస్తున్నాడు.

 "కమ్మని గ్రంథం బొక్కటి
 యిమ్ముగ నే నృపతి కైన గృతి యిచ్చిన
 కొమ్మని యీయరే యర్థం
 బిమ్మహి దున్నంగ నేల యిట్టి మహాత్ముల్ "
అర్థము:-- నీవు వ్రాసిన గ్రంథము భాగవతాన్ని ఏ రాజుకైనా అంకిత మిచ్చినా వారు చాలా ధనం యిస్తారు కదా!దానితో తో హాయిగా బ్రతుక రాదా?ఈ పొలం దున్ని బీదతనం తో బ్రతుకుట ఎందుకు?

అందుకు పోతనగారిచ్చిన సమాధానం.
 "బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యక న్
 కూళల కిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్
 హాలికు లైన నేమి గహనాంతర సీమల కంద మూల కౌ
 ద్ధాలికు లైన నేమి నిజ దార సుతోదర పోషణార్థ మై"
అర్థము:-- లేత మామిడి చిగురు లాగా కోమలమైన కావ్య మనే కన్యను దుర్మార్గులైన రాజులకు అంకిత మిచ్చి ఆ పడుపు కూడు (వేశ్యా వృత్తిని పడుపు వృత్తి అంటారు) తినే దానికంటే సత్కవులు భార్యా బిడ్డలను పోషించుటకు భూమిదున్నిబ్రతికినా ,అడవిలోని కందమూలాలు తిని బ్రతికినా తప్పులేదు.

 పోతన దగ్గరికి అప్పటి రెడ్డి రాజు సర్వజ్ఞ సింగ భూపాలుడు వచ్చి భాగవతాన్ని నాకు అంకిత మిమ్మని అడుగు తాడు. ఆయన లోపలి వెళ్ళితే అక్కడ సరస్వతీ దేవి కన్నీరు పెట్టుకుంటూ దీనంగా చూసిందట అప్పుడు పోతన  "కాటుక కంటి నీరు చన్కట్టు పయిన్ బడ నేల నేడ్చేదో  కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో  హాటక గర్భు రాణి! నిన్నాకటికిన్ గొనిపోయి అల్ల క ర్ణాట కిరాత కీచకుల కమ్మ త్రిశుద్ధి గ నమ్ము భారతీ!"అర్థము:-- అమ్మా!విష్ణువు కోడలివి, బ్రహ్మ యొక్క భార్యవుఅయిన నీవు కన్నుల కాటుక కరిగి పోయే లాగ యిలా యెందుకు యేడుస్తావు?నిన్నుధనం కోసము ఆ కిరాతకులైన కర్నాట ప్రభువులకు త్రికరణ శుద్ధిగా నేను అమ్మను. నన్ను నమ్ము మమ్మా సరస్వతీ!

  - రూపన్ గుడి సుగుణ
  2020-06-18