పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : భక్త పోతన భాగవత వైభవం

భక్త పోతన్న భాగవత వైభవం

* భక్త పోతన తన తపస్సుశక్తిని ధార పోసి, తెలుగు భాషలోని అక్షరాలలో ఉన్న అమృతాన్ని పిండి, తన రామ భక్తిని రంగరించి , భాగవత పద్యాలలోకి మంత్ర శక్తిని ఆవహింపచేసిన మహా గ్రంథం- భాగవతం
* బతుకుతెరువు కోసమో లేదా రాజులిచ్చే అగ్రహారాల కోసమో కవులు కావ్యాలు రాస్తారన్న అపవాదు భాగవతానికి రాకూడదని, తనకున్న కాసింత పొలాన్ని పండించుకుని ఎంతో నిరాడంబరంగా జీవించిన మహా ఋషి, మహా యోగి రాసిన మహా గ్రంథం - భాగవతం
* భగవంతుడు అను భద్ర శబ్దమునకు అర్థము, ఆకృతి గా అతిశయించి నిలబడగలిగిన రామభద్రుడు, శ్రీరామనారాయణుడే స్వయంగా పోతనచే రాయించుకున్న మహా కావ్యం - భాగవతం
* సాక్షాత్తూ శ్రీకృష్ణుడే స్వయంగా భాగవతం నా అక్షర స్వరూపంగా ఉంటుందని వెల్లడి చేసిన మహా గ్రంథం - భాగవతం
* భక్తి వైభవాన్ని, గొప్పతనాన్ని పతాకస్థాయిలో మేరు పర్వత శిఖరాలు దాటించి, వైకుంఠం అంచుల దాకా తీసుకెళ్ళి వివరించిన మహా కావ్యం- భాగవతం
*లక్ష్మీ దేవి కౌగిటిలో ఉన్నా కూడా, పరమాత్మున్ని తన భక్తుల రక్షణకై పరుగులు పెట్టించిన లీలలు తెలిపే గ్రంథం (గజేంద్ర మోక్షం) - భాగవతం
* ఏ శ్రీమన్నారాయణుని పాద పద్మములచే పునీతమైన భూమాత రోమాంచితమైనపుడు నిక్కబొడుచుకున్న రోమాలే, ఈ పచ్చదనమంతా అని అప్పుడు మోహపరవశయై రంజిల్లగా, ఆనంద పరవశయైన భూమాత రాల్చిన ఆనంద భాష్పధారలే ఈ సెలయేరులన్నీ అని అట్టి శ్రీహరి పాదారవిందముల శుభ చిహ్నముల వైభవాన్ని కీర్తించే మహా కావ్యం - భాగవతం
* హరియశస్సుదాబ్ది (హరికీర్తి అనే పాలసముద్రం) నుండి ఎగిసిన పాల తుంపరలే ఆకాశములో మెరసే తారలు అని హరికీర్తి వైభవాన్ని, హరిభక్తులైన ధ్రువ తారల కీర్తి వైభవాన్ని అనంతంగా వర్ణించే మహా కావ్యం - భక్త పోతన భాగవతం
* ఎవ్వాని పాదపద్మపరాగము అఖిల తీర్థములను కడు మిక్కిలి పవిత్రము చేయునో అట్టి మంగళతీర్థపాదుడైన వాసుదేవుని అబ్జ వజ్రాంకుశ శంఖ చక్ర చాప మీన గదా కేతు చిహ్నితములైన శ్రీ చరణములు, శ్రీహరి చరణముల వైభవాన్ని తెలిపే మహాకావ్యం - భాగవతం
* ఎవ్వని భద్ర గుణములు వర్ణించలేక బ్రహ్మాదులు ఆతని అనంతుడని, అనంత పద్మనాభుడనీ కీర్తింతురో అట్టి శ్రీ భూనీలా సమేత శ్రీమన్నారాయణుని వైభవాన్ని పరిపూర్ణంగా కీర్తించి పరవశించే గాథలున్న గ్రంథం - భక్త పోతన భాగవతం
* ఎవ్వాని పదాంబుజ చారు రజో వితానము(పాదపద్మపరాగము, పాద ధూళిని) తమ కిరీటములందు అలంకరించుకొని బ్రహ్మరుద్రాదులు గర్వముతో పరవశించిపోవుదురో అటువంటి శ్రీమహావిష్ణువు, శ్రీహరి పాదారవిందముల వైభవాన్ని పరిపూర్ణంగా కీర్తించే మహా కావ్యం - భాగవతం
* ఏ దేవు పదయుగంబు ఏప్రొద్దు సేవించు అఖిల జగన్మాతయైన లక్ష్మికమల ఎవ్వాని పాదకమలంబు సేవించు కౌతుకమున కమలాదేవి సుకుమారంగా ఒత్తినంతనే కమలనాభుడైన శ్రీహరి పాదకమలములు కందిపోతున్నాయని విలవిల్లాడిపోయే మహా భక్తుల భాధలు వివరించి, అటువంటి అతి సౌకుమార్యమైన శ్రీమన్నారాయణుని పాదపద్మముల వైభవాన్ని గురించి అదే సమయమున భక్త జనులను కరుణించి రక్షింప యుగయుగముల తరబడి వజ్ర సదృశమైన పాదములతో వేంకటాచలపతియై, విఠలుడై నిలబడినట్టి అట్టి శ్రీహరి, శ్రీకృష్ణుని శ్రీచరణముల వైభవాన్ని పరిపూర్ణంగా కీర్తించునట్టి మహా కావ్యం - భాగవతం
* ఏ దేవదేవుని పాదపద్మములు దర్శింప, మునులు యుగయుగముల తరబడి తపింతురో ఏ దేవదేవుని పాదకమలములు వీక్షింప,జనులు కల్పముల తరబడి కలవరింతురో అటువంటి శ్రీహరి శ్రీచరణముల వైభవాన్ని పరిపూర్ణంగా కీర్తించే మహా కావ్యం - భాగవతం
* బ్రహ్మ ఎవ్వాని పాదములు కడుగంగ జలములు ఆకాశగంగలై, ఆ విశ్వాత్ము కీర్తి ప్రభలై, ఆ విష్ణు దేవుని పదనదీ జలములై, సమస్త తీర్థ సారములై, లోక పావన జలములై గగనసీమలలో ప్రవహించిన గాథలు తెలిపే గ్రంథం - భాగవతం
* బ్రహ్మ ఎవ్వాని పాదములు కడుగంగ జలములందు మునుగంగ గౌరీశుండు ఉత్సాహపడి శిరమున దాల్చగా పరవశాన శిరసున గంగ ధరకు జారెనా శివగంగ అన్నట్లుగా ఎవ్వాని పదనదీ జలములు శిరస్సున దాల్చగా పరమశివుడు ఆ రీతిగా పరవశించెనో ఆ విష్ణు దేవుని పాదపద్మముల నుండి ఉద్భవించిన ఆకాశగంగ జలముల వైభవాన్ని వర్ణించే గాథలు తెలిపే గ్రంథం - భాగవతం
* భగవంతుణ్ని పట్టి తీసుకురాగలిగిన మహా గ్రంథం - భాగవత గ్రంథం భగవంతుణ్ని నిలబెట్టగలిగిన మహా గ్రంథం
* శ్రీమన్నారాయణుని, శ్రీ మహావిష్ణువుని, భక్తులు తమ భక్తి పాశాలతో కట్టివేసిన భక్తుల గాథలు తెలిపే గ్రంథం
ఇందీవరున్ని ఇటుక మీద నిలబెట్టగలిగిన మహాభక్తుల గాథలు తెలిపే గ్రంథం
* యశోదాదేవి వాత్సల్య భక్తికి లొంగి ,పొంగి శ్రీ కృష్ణపరమాత్మ రోటికి కట్టివేయబడిన లీలలు తెలిపే గ్రంథం - భాగవతం
* ముక్తినిచ్చె ముకుందున్ని నిలబెట్టగలిగిన గ్రంథం
నన్ను రక్షించకుండ నిన్ను పోనిచ్చెదనా సీతారామా అని నిలదీసిన భక్తుల గాథలు తెలిపే గ్రంథం
* శ్రీమన్నారాయణుని భక్తుల గాథల భక్తి సముద్రం-భాగవతం
* నారాయణా అని ఆర్తితో పిలిచిన భక్తుల పిలుపులు సమస్త బ్రహ్మాండాలు నిండి, ఆ వైకుంఠ వరదుని, వరాలు వరదలా కుమ్మరించే ఆ వరదరాజుని కదిలించి తీసుకువచ్చిన మహా భక్తుల గాథలు తెలిపే గ్రంథం
* పరమ భాగవతుల పాదధూళి సమస్త తీర్థాలసారం అని తెలిపే గ్రంథం
* పరమ భాగవతులైన హరిదాసుల పాదాలు కడిగిన జలాలు నింపుకున్న అరచేతుల్లో అమృతం ఉంటుందని తెలిపే గ్రంథం
* పరమాత్ముడైన హరిపట్టపురాణి శ్రీమహాలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా ఇవ్వగలిగిన గ్రంథం
* హరి భక్తులతో మాటలు ధర నెన్నడు చెడని పుణ్య ధనముల మూటలు అని తెలిపిన గ్రంథం
* అచ్చమే దేవుని నారాయణ నామమే గతి చచ్చేటి వారికి, సన్యాసము వారికి అని తెలిపే గ్రంథం
* పరమ పురుషుడు గోపాల బాలుడై వచ్చి, గోవులు కాసిన లీలలు తెలిపే గ్రంథం - భాగవతం
* రామ భక్తిని పోతపోస్తే వచ్చిన పోతన్న రచించిన మహా గ్రంథం భాగవతం
* కృష్ణ భక్తిని కణ కణంలో నింపుకున్న పోతన్న రాసిన మహా గ్రంథం
* తన నర నరాల్లో నారాయణున్ని, నారసింహుని నింపుకున్న పోతన రాసిన మహా కావ్యం
* గుండెల నిండా గోవిందున్ని నింపుకున్న పోతన రాసిన మహా గ్రంథం
* తన శ్వాస శ్వాసలో శ్రీనివాసున్ని నింపుకున్న పోతన రాసిన మహా గ్రంథం
* తన మనస్సు నిండా మాధవుణ్ణి నింపుకున్న పోతన రాసిన మహా గ్రంథం
* తన రోమ రోమాల నిండా రామున్ని నింపుకున్న పోతన రాసిన మహా గ్రంథం
* ఇలలో మరియు కలలో కూడా ఆ కమలనాథుని,కమలాపతి స్మృతులే నింపుకున్న పోతన్న రాసిన మహా గ్రంథం - భాగవతం
*చిత్త శుద్ధి, చిత్త శాంతి, మనశ్శాంతి, ఆత్మ శాంతి ప్రసాదించగలిగిన గ్రంథం
* మరణ భయం తొలగించగలిగిన గ్రంథం
* ధర్మబద్దమైన కోరికలు తీర్చగలిగిన గ్రంథం
* గొప్ప రక్షణ ప్రసాదించే గ్రంథం - భక్త పోతన్న భాగవతం
* తెలుగు వారందరికీ నిత్య పారాయణ గ్రంథం - భాగవతం
గోవింద గోవింద గోవింద
జై శ్రీసీతారామా
శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్
జై శ్రీలక్ష్మీనారసింహా ప్రహ్లాద వరదా గోవిందా
జై శ్రీలక్ష్మీనారాయణా