పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : భోగినీలాస్యం - భోగినీ దండకం

 పురుషులు చేసే నృత్తాన్ని తాండవం అంటారు. ఈశబ్దానికిఇలా నిర్వచనం ఉంది-
 శ్లో.
  ఆసారితాదిభి ర్గీతైః రుద్ధత ప్రాయ వర్తితైః,
  కరణై రంగహారైశ్చ నివృత్తం విషమై రిహ,
  తాండవం తండునా ప్రోక్తం నృత్తం నృత్త విదో విదుః
 (తండు-నందికేశ్వరుడు)
 లలనలు అభినయ, ముఖవైఖరులచేత తమ కామవికార భావాన్ని తెలిపే నృత్యాన్ని లాస్యం అంటారు.ఈ శబ్దాన్ని ఇలా నిర్వచించారు-
 శ్లో.
  లలనా లాలితాంగైర్య త్సాధితం కామవర్ధనమ్
  తాండవం పురుషులుచేసేనృత్తం,లాస్యంలలనలుచేసేనృత్యం
  పుంనృత్యం తాండవంప్రోక్తం, స్త్రీనృత్యం లాస్యముచ్యతే< /p>

  తాండవ నృత్తానికి, లాస్య నృత్యానికి తగిన గేయ ఛందస్సులో మన పండితకవులు రచనలు చేశారు. శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు శివతాండవం అనే రచన చేశారు. శ్రీమాన్ వానమామలై వరదాచార్యులవారు భోగినీలాస్యం అనే రచన చేశారు. భోగినీలాస్య రచనకు మూల కారణం ప్రేరణం బమ్మెరపోతన భోగినీదండకం. సింగభూపాలుని ఎదుట భోగిని చేసిన లాస్యంనాట్య భంగిమల లోని హస్తవిన్యాస పాదవిన్యాస, ముద్రలు, భ్రమణ విశేషాలతో అలరారింది. భోగిని తనూలతిక చంచలించి పోగా సింగభూపాలుని మనసు చంచలిత మయ్యేలా లాస్యం చేసింది. అది ఎలా ఉందో దర్శిద్దా౦-

భోగినీ లాస్యం

(ద్విరద గతి రగడ)

జాల విడు బొంగరము లీల గిఱ్ఱున దిరుగు|
బూలబంతిం బోలె దేలాడు నొక పరుగు||

లాలించు పూల యూయేల చేరుల లాగు|
నోలి ముందును వెనుక కొయ్యారమున దూగు||

నటునిటుల్ విసరు ముత్యాల వీవనబోలి|
యటుసోలి యిటు వ్రాలి యందాల నడదేలి||

యల డోలికలదేలు కలహంసగతి నేలి|
మలకలగు నాగకోమలి సొంపునడ గ్రాలి||

చిలిపి యందెలు మ్రోగ వలయంపు గతిసాగ|
బులకించి తనువెల్ల బూలబంతిగ రేగ||

జోడుగన్గొని కుల్కి యాడు పారావతము|
క్రీడాగతికి నడుగుజాడలిడు స్వాగతము||

పాడు నాగస్వర ప్రస్థానమున నూగి|
యాడు వొయ్యారంపు కోడెనాగనసాగి||

వెసనిల్చి ఫణమెత్తి విప్పియాడెడురంగు|
కసుబుస్సులం గసరి కాటువేయు తెఱంగు||

పాలేరు లుప్పొంగి పాయవేసిన లీల|
ప్రాకులాడుచు మ్రోల బరువు లెత్తిన హేల||

గిరుల దొరలుచు దూకి తరుల నొరసిన కరణి|
వడులు బేనుచు బ్రాకి సుడులుదిరిగిన సరణి||

మదమరాళము భాతి మత్తేభముల రీతి|
గొదమహంసలజాతి కదము ద్రొక్కు కపోతి||

తకధిమిత తకఝణుత తకఝంత ఝంతరిత|
తకిలు జతి ప్రకటగతి నొకటొకటి జతపఱచి||

కలికి మెయిదండచెయి కదలికల వంపులవి|
నలువైన నాగు గున్నల నడల సొంపులవి||

కేలుదమ్ముల గరుచ్ఛాలనమ్ము లెసంగ|
నేలపై రివ్వుమని వ్రాలు హంసియనంగ||

ఆలీఢ గతి నేల నాని కూర్చొనినాతి|
కేల జువ్వునవంగి వ్రాలి మారునిచేతి||

యుండీల చువ్వయై యూగాడ నెన్నడుము|
కాండ మిడునట్టు లాకర్ణాంత మిడుకరము||

వెనువ్రాలి తనకాలి పెనువ్రేలి స్పృశియించి|
మునువ్రాలి రతిపతికి మ్రొక్కు శిరమునువంచి||

విడిన పయ్యెద కొసలు పిఱుచుట్టురా జెక్కి|
సడలు మువ్వలపేరు లెడనెడను ముడినొక్కి||

యడరు చిఱుచెమ్మటల గడెగడెకు తడినద్ది|
వడి జిక్కువడు సరము లొడుపుగా సరిదిద్ది||

గలుఘల్లుమని కాలి గజ్జియలు రవళింప|
దెలిచీరయంచు జలతారు ఝరి ప్రవహింప||

గురులు కనుదమ్ములం బెరసె బంభరములై|
కరమొరసె బిగిచనుల్ కంతుబొంగరములై||

ఫణులు గగనములోకి బాఱాడె గరములై|
మణులు జీవములు పడి పెనగె నుంగరములై||

చెలినవ్వు నెలవంక చలువ వెన్నెలగాయ|
గలికి కన్నుల సొగసు కలువపూవులు బూయ||

గులుకు గళ రవములో గొసరి కోకిలగూయ|
వలరాజు పువ్వు క్రొవ్వాడి ముక్కలనేయ||

సలలితాంగుళులన్ రసాలశిఖి పులకింప|
నలరు తరుణాంగకము లామనుల తెరదింప||

ఒడల పుత్తడి నిగ్గు తడలు మత్తడి దూక|
బడతి కనుసన్నల న్నడచు జెల్వపువాక||

ఆటపాటలలోన నందచందము నించి|
యలరించి సభకు సభ నాడించి పాడించి||

మురిపించి మఱపించి కరగించి కదలించి|
ముదము నిచ్చుచునట్టె నిదురబుచ్చుచు మించి||

లాలినూపెడి శివా లాస్యమ్ములను బోల|
బాలకృష్ణునిలీల శూలితాండవహేల||

సవ్యమోహినివోలె నాట్యముల వలపించె|
భవ్యభారతివోలె భరతమ్ము నొనరించె||

***

 శివతాండవం; కృష్ణతాడవం; శివాని లాస్యం; మోహినీ లాస్యం; భోగినీలాస్యం - ఇవి సుప్రసిద్ధాలు.
- సమర్పణ-వైద్యంవేంకటేశ్వరాచార్యలు.