పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : పోతన గంగాప్రవాహ వర్ణన


ఆహా! జాతీయ మహాకవి పోతనామాత్యుని చేతిలో పదాలు పరుగులు పెడతాయి, పందాలు వేస్తాయి, పరవళ్ళు తొక్కుతాయి. అవును, చూడండి, ఈ గంగానది పరవళ్ళతో పోటీపడుతున్న మన పోతన్నగారి ముక్తగ్రస్తాలంకార డెబ్బది.యైదు (75) సోయగాల పరవళ్ళ పరుగులను.

పోతన గంగా ప్రవాహ వర్ణన

9-230-వ.

ఇట్లమ్మహానదీప్రవాహంబు, పురారాతిజటాజూటరంధ్రంబుల వలన వెలువడి, నిరర్గళాయమానంబై, నేలకుఁ జల్లించి, నెఱసి నిండి పెల్లు వెల్లిగొని, పెచ్చు పెరిగి విచ్చలవిడిం గ్రేపువెంబడి నుఱక క్రేళ్ళుఱుకు మఱక ప్రాయంపుఁ గామధేనువు చందంబున ముందఱికి నిగుడు ముద్దుఁ జందురు తోడి నెయ్యంబునఁ గ్రయ్య నడరి చొప్పుదప్పక సాఁగి చనుదెంచు సుధార్ణవంబు కైవడిఁ బెంపుఁ గలిగి మహేశ్వరు వదనగహ్వరంబు వలన నోంకారంబు పిఱుంద వెలువడు శబ్దబ్రహ్మంబు భంగి నదభ్రవిభ్రమంబై య మ్మహీపాల తిలకంబు తెరువు వెంటనంటి వచ్చు వెలియేనుఁగు తొండంబుల ననుకరించి పఱచు (1)వఱదమొగంబులును, వఱదమొగంబుల పిఱుందనందంద క్రందుకొని పొడచూపి తొలంగు బాలశారదా కుచకుంభంబులకు నగ్గలం బైన (2)బుగ్గలును, బుగ్గలసంగడంబునం బారిజాతకుసుమ స్తబకంబుల చెలువంబులం దెగడు (3)వెలినురువులును, వెలినురువుల చెంగట నర్థోన్మీలిత కర్పూరతరుకిసలయంబులఁ చక్కందనముఁ గేలిగొను (4)సుళ్ళును, సుళ్ళ కెలంకుల ధవళజలధరరేఖాకారంబుల బాగు మెచ్చని నిడుద (5)యేఱులును, (6)నేఱులం గలసి వాయువశంబున నొండొంటిం దాఁకి బిట్టు మిట్టించి, మీఁది కెగయు దురితభంగంబులైన (7)భంగంబులును, భంగంబులకొనల ఛిన్నభిన్నంబులై కుప్పించి, యుప్పరం బెగసి, ముత్తియంపు సరుల వడుపున, మల్లికాదామంబుల తెఱంగునఁ గర్పూరఖండకదంబంబుల చెలువంబున నిందుశకలంబుల తేజంబునఁ, దారకానికరంబుల పొలుపున మెఱయుచు, ముక్తి కన్యా వ<8>శీకరంబులైన శీకరంబులునుం గలిగి, మధ్యమలోక <9>శ్రీకరంబై, శ్రీకరంబు తెఱంగున (10)విష్ణుపదంబు ముట్టి, విష్ణుపదంబు భాతి నుల్లసితహంస(11)రుచిరంబై, రుచిరపక్షంబురీతి నతిశోభిత (12)కువలయంబై, కువలయంబు చెన్నున బహు(13)జీవనంబై, జీవనంబులాగున సుమనోవికాస(14)ప్రధానంబై, ప్రధాన పర్వంబు పొలుపున నేకచక్ర బక భీమ మహాభంగ సుభద్రార్జున చరిత్రా(15)రామంబై, రామచిత్తంబు మెలఁపువం దనవారిలోఁజొచ్చిన దోషాచరుల కభయ(16)ప్రదాన చణంబై, ప్రదానచణ వర్తనంబు భాతి సముపాసిత (17)మృత్యుంజయంబై, మృత్యంజయురూపంబుపోలిక విభూతి సు(18)కుమారంబై, కుమారచరిత్రంబుఠేవను గ్రౌంచప్రముఖ(19)విజయంబై, విజయ రథంబుభాతి హరిహయా(20)మంథరంబై, మంథరవిచారంబు గ్రద్దన మహారామగిరివనప్రవేశ(21)కామంబై, కామకేతనంబు పెల్లున నుద్దీపిత (22)మకరంబై, మకరకేతను బాణంబు కైవడి విలీనపరవాహినీకలిత (23)శంబరంబై, శంబరారాతి చిగురు గొంతంబుసూటి నధ్వగవేదనా(24)శమనంబై, శమనదండంబు జాడ నిమ్నోన్నత సమ(25)వృత్తంబై, వృత్తశాస్త్రంబు విధంబున వడిగలిగి సదా గురులఘువాక్యచ్ఛటా పరి(26)గణితంబై, గణితశాస్త్రంబు కొలఁదిని ఘనఘనమూల వర్గమూల సంకలిత భిన్నమిశ్ర ప్రకీర్ణఖాత(27)భీష్మంబై, భీష్మపర్వంబు పెంపున ననేక భగవ(28)ద్గీతంబై, గీతశాస్త్రంబు నిలుకడను మహాసుషిరతను ఘన నానా(29)శబ్దంబై, శబ్దశాస్త్రంబు మర్యాద నచ్చువడి హల్లు గలిగి, మహాభాష్యరూపావతారవృత్తి వృద్ధిగుణసమ(30)ర్థంబై, యర్థశాస్త్రంబు మహిమను బహుప్రయోజన ప్రమాణ (31)దృష్టాంతంబై, దృష్టాంతంబు తెఱంగున సర్వసామాన్య గుణవి(32)శేషంబై, శేషవ్యాపారంబు కరణిని సుస్థిరోద్ధరణతత్పరంబై, పరబ్రహ్మంబుగరిమ నతిక్రాంతానేక (33)నిగమంబై, నిగమంబు నడవడిని బ్రహ్మవర్ణపదక్రమసం(34)గ్రహంబై, గ్రహశాస్త్రంబు పరిపాటిని గర్కట మీన మిథున మకరరాశి (35)సుందరంబై, సుందరి ముఖంబు పోఁడిమిని నిర్మల చంద్ర(36)కాంతంబై, కాంతాధరంబు రుచిని శోణచ్ఛాయా(37)విలాసంబై, విలాసవతి కొప్పునొప్పునఁ గృష్ణనాగాధికంబై, యధికమతిశాస్త్రసంవాదంబు సొంపున నపార సరస్వతీ విజయ (38)విభ్రమంబై, విభ్రమవతిచనుదోయి పగిది నిరంతర పయో వ్యాప్తాఖిలలోక జీవనప్రద తుంగభద్రాతిరేఖా స(39)లలితంబై, లలితవతి నగవు మించున నపహసిత చంద్ర(40)భాగధేయంబై, భాగధేయవంతుని వివాహంబు లీల మహామేఖలకన్యకావి(41)స్తారంబై, తారకెంగేలి యొడికంబున నాక్రాంత (42)సూర్యతనయంబై, సూర్యతనయు శరవర్షంబు పోలిక భీమరథ్యాటోప(43)వారణంబై, వారణంబు పరుసునం బుష్కరోన్నత సం(44)రంభంబై, రంభ నెమ్మోము డాలున సురసాతిశయ (45)దశంబై, దశరథ తనయు బొమముడి చాడ్పున సింధుగర్వ (46)ప్రభంజనంబై, ప్రభంజతనయు గదపెట్టు మాడ్కిని సమీపగత దుశ్సాసన దుర్మద ని(47)వారకరంబై, వారకన్యక ముంజేతి గతిని ముహుర్ముహరుచ్చలిత కంకణాలం(48)కృతంబై, కృతయుగంబు నోజ న(49)పంకంబై, పంకజాసనుముఖంబు నొఱపునఁ బ్రభూతముఖ్య(50)వర్ణంబై, వర్ణగుణితంబు తెఱకువను బహుదీర్ఘబిందు వి(51)సర్గంబై, సర్గబంధకావ్యంబు విన్ననువున గంభీరభావ(52)మధురంబై, మథురాపురంబు సొబగున మహానంద(53)నందనంబై, నందనవనంబు పొందున విహరమాణ (54)కౌశికంబై, కౌశికహయంబు రీతి సుదశ(55)ధ్రువంబై, ధ్రువు తలంపు (56)క్రియం గ్రియాబరిశీలిత (57)విశ్వంభరంబై, విశ్వంభరుని శంఖంబు రూపున దక్షిణావ(58)ర్తోత్తరంబై, యుత్తరావివాహంబు చందంబునఁ బ్రముదిత (59)నరంబై, నరసింహు నఖరంబుల భాతి నాశ్రిత ప్రహ్లాద గురువిభవ ప్ర(60)దానంబై, దానకాండంబు సిరిం గామధేను కల్పలతాద్యభివనంబై, నవసూతికాకుచంబు పేర్మిని నిరంతర పయోవర్ధనంబై, ధనదు నిలయంబు తూనికను సంభృత మకర పద్మ మహాపద్మ (61)కచ్ఛపంబై, కచ్ఛప కర్పరంబు బలిమిని బతితశైలసము(62)ద్ధరణంబై, ధరణీధరంబు సాటి నుత్తుంగ తట(63)ముఖ్యంబై, ముఖ్యవరాహంబు గరిమ నున్నత (64)క్షమంబై, క్షమాసుర హస్తంబు గరగరికను సత్పవిత్ర మనో(65)రామంబై, రామచంద్రుని బాణంబుకడింది నభాగ్యత ఖరదూషణ మదాపహరణ (66)ముఖరంబై, ముఖర రామ కుఠారంబు రీతిని భూభృన్మూలచ్ఛే దన ప్ర(67)బలంబై, బలరామహలంబుభాతిని బ్రతికూలసన్నికర్షణ ప్ర(68)బుద్ధంబై, బుద్ధదేవునిమేని యొఱపున నభియాతి రక్షోదార మనో(69)హరంబై, హరతాండవంబు మేర నుల్లసి(70)తానిమిషంబై, యనిమిషావతారంబు కీర్తిని శ్రుతి మంగళ(71)ప్రదంబై, ప్రదాత యీగి సూటినర్థ పరంపరా (72)వామనంబై, వామనచరణరేఖను బలివంశవ్యప(73)నయంబై, నయశాస్త్రంబు మార్గంబున సామభేదమాయోపాయ (74)చతురంబై, చతురాననాండంబు భావంబున నపరిమిత భువన జంతుజాల సేవ్య(75)మానంబై, మానినియన లోఁతు చూపక, గరితయన చడిచప్పుడు చేయక, ముగుద యన బయలు పడక, ప్రమద యన గ్రయ్యంబాఱుచుఁ, బతివ్రత యన నిట్టట్టుఁ జనక, తల్లియన నెవ్వియైన లోఁగొనుచు, దైవంబన భక్త మనోరథంబు లిచ్చుచు, నంతకంతకు విస్తరించి గుఱిగడచి, యవాఙ్మానస గోచరంబై ప్రవహించి.