పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : పోతరాజు - త్యాగరాజు

బమ్మెర పొతనా, త్యాగరాజూ, కంచర్ల రామదాసూ--ఈ శ్రీరామభక్త త్రయము--- భక్తులను వందల యేళ్ళు మైమరపించారు. సంగీతప్రపంచానికి సాక్షాత్తూ దైవసమానులు. శ్రీ కాకర్ల త్యాగబ్రహ్మం సాంప్రదాయ బ్రాహ్మణ ములకనాడు కుటుంబములో రామబ్రహ్మం, సీతమ గార్లకు మూడవ పుత్రుడుగా జన్మించారు. తన మేనమేమ అయిన గిరిరాజ కవి (కాకర్ల, కంబం తాలుకా, ఇప్పటి ప్రకాశం జిలా) ఇంట్లో తమిళనాడు లోని తంజావూరు జిల్లా, తిరువారూరు గ్రామము లో పుట్టారు. ఆయన గొప్ప సంగీత విద్వాంసులయిన శొంఠి వెంకటరమణయ్య గారి వద్ద సాహిత్య, సంగీతాలు అభ్యసించారు. విద్యాభ్యాసము సంపూర్తి అయిన తరువాత గురువుగారి ఆదేశానుసారము త్యాగరాజు సంగీత కచ్చేరీ చేశారు. పంచరత్నకీర్తనలలో అయిదవది అయిన "ఎందరో మహానుభావులు" అద్భుతముగా గానము చేశారు. గురువుగారు ముగ్ధుడై తనతోబాటు రాజాస్థానములో సంగీత విద్వాంసుడుగా చేరమని ఆహ్వానించారు. మహాకవి భక్త పోతన లాగా, త్యాగరాజు కూడా రాజాశ్రయాన్ని తిరస్కరించారు. పోతన గారి లాగానే "అప్పడుపు కూడు" భుజించనన్నారు. పోతన గారిలాగా, ఆయనా శ్రీరాముడి పాదసన్నిధినే అభిలషించారు. "నిధి చాల సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా" అని గానం చేశి ధనాపేక్షని విసర్జించి, రాముడి పాదసేవకు అంకితమయినారు. ఎన్నో వందల కీర్తనలను భక్తిరసస్పోరకముగా రచించి, ఎన్నో అద్భుతమైన రాగాలు సృష్టించి, ఆ కీర్తనలను ఆ రాగాలలో శ్రావ్యముగా కూర్చి గానము చేశారు కారణజన్ముడైన త్యాగరాజస్వామి.