పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : పోతన - తెలుగుల ఆధ్యాత్మిక ఔన్నత్యం

శిరా కదంబం జాలసాహితీ పత్రిక వారు సహృదయంతో, తెలుగు మీది, పోతన మీది, భాగవతం మీది అభిమానంతో వారి
(శిరా కదందం - పంచమ స్వరం)
పంచమ వార్షికోత్సవ సంపుటి - [06_001 సంపుటి] - 2016,ఆగస్టు - 15 పత్రిక - పంచమ స్వరంలో "పుట 14"
నుండి
గణనాధ్యాయి రచన ; "పోతన - తెలుగుల ఆధ్యాత్మి ఔన్నత్యం" ప్రచురించారు.
దాని నకలు ప్రతి ఇది; ఎడమ కుడి బాణం గుర్తులు వాడి 14వ పుటకు వెళ్ళి చదువగలరు.
శిరా కదందం - పంచమ స్వరం


: : చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం : :
శిరాకదంబంలో ప్రచురితమైన పాఠం ప్రతి


పోతన – తెలుగుల ఆధ్యాత్మిక వైశిష్ఠ్యం

శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.

ప్రాచీన కాలం నుండీ భారతీయ దేశభాషా సమాజాలలో తెలుగువారి ముద్ర బలంగానే ఉంది. వీరిలో అత్యధికులు సంస్కృతభాషలో ఆధ్యాత్మిక సాహిత్యంలో మన అధిక్యతను చాటారు. ఆంధ్రులు అనేకులు భారతీయ ఆధ్యాత్మికతపై తమ విశిష్టతను చూపారు. తెలుగు భాషలో ఆద్యాత్మిక, భక్తి తత్వాలలో మునుముందు వరుసలో చెప్పుకొనవలసిన మహితాత్ముడు మన బమ్మెర పోతనామాత్యుల వారు. తన రచనలో తను నమ్మిన విలువలు సాక్షాత్కరింపజేసిన మహా పండితుడు. అదికూడా జనసామాన్యుల నోటిలో నానేటంత సరళ భాషాప్రయోగం చేసిన ప్రజాకవి. సంస్కృత పలుకుబడులే సాహిత్యం అని భావించే ఆ రోజులలో తెలుగు నానుడులను అలవోకగా ప్రయోగించి మెప్పించిన విప్లవ కవి మన పోతన్న.

కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ
గొందఱకును సంస్కృతంబు గుణమగు రెండుం
గొందఱికి గుణములగు నే
నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్.

“ఇంపారెడి పద్యంబుల సొంపార కృతిచేసిన కంకాలకు టంకాలకు లొంగని తెలుగన్న మన పోతన్న.” అంతేనా తను నమ్మిన దానిని అద్భుతంగా చెప్పటమే కాదు, తాను త్రికరణ సుద్ధిగా నిజజీవితంలో అనురించి జీవించిన మహానుభావుడు. వారి ఆధ్యాత్మిక వైశిష్ఠ్యం బహుధా ఆదర్శనీయం కనుక తలచుకుందాం.

పోతన ఆధ్యాత్మిక వైశిష్ఠ్యత తెలుగు భాగవతంలో ప్రస్ఫుటమవుతుంది. మూల కృతి కర్త వ్యాసభగవానుని అపరావతారంగా ప్రసిద్ధుడైన “మన పోతన్న భాగవతంలోనే, వ్యాసభగవానుని మనసు, మరింతగా ఆవిష్కృతం అయింది అనటం అత్యోక్తి కాదు.” వ్యాసకృతులలోనే కాదు, ఆధ్యాత్మిక గ్రంథాలలోనే ఇహపరాలు రెండింటి సాధనలోనూ అత్యున్నత స్థాయి గల గ్రంథం, మహా భాగవత పురాణం. వేదవిభాగం పిమ్మట, భారత ఇతిహాసం, సమస్త పురాణాలు మున్నగు గ్రంథాలు వ్రాసిన పిమ్మట వ్రాసినది ఈ భాగవతపురాణం. అందుకే సర్వ గ్రంథ సారం దీనిలో ప్రతిఫలిస్తూ పరిపూర్ణ పరిపక్వతతో విలసిల్లుతూ ఉంటుంది. ఈ మాతృకలోని భక్తి తత్వాన్ని వంటబట్టించుకుని, తత్వబోధలు పట్టుకుని దేశభాషలలోనే ప్రప్రథమంగా ఆంధ్రభాషలోనికి సమగ్రంగా తీసుకువచ్చారు పోతన్నగారు. భక్తి ప్రపత్తికి, ఏకాంత భక్తికి స్వానుభవ పరాకాష్ట “పలికెడిది భాగవతమట”. ఇంత పద్ద కార్యక్రమం చేస్తూ నేను నిమిత్త మాత్రుడను, అని చెప్పుకోవడం దానిని జీవితాతం అనుసరించడం సామాన్య విషయం కాదు.

పలికెడిది భాగవత మఁట,
పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ
బలికిన భవహర మగునఁట,
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?

భారతీయతత్వంలో జీర్ణించుకుపోయిన ఆదర్శం అయాచితం, అపరిగృహం. ఈ ఆద్యాత్మిక విలువలకు కట్టుబడి ఉండుటలోని విశిష్ఠతను బమ్మెర వారిలో ప్రత్యక్షంగా చూడగలం. పండిత జీవనం అంటే రాజాశ్రమం అనీ, విలాసాల భోగజీవనం అని బహు సామాన్యం భావింపబడెడి రోజులలో. హలం పట్టి భృతి, కలం పట్టి కృతి కొనసాగించాడు మహానుభావుడు. మహారాజ పోషణను తృణీకరించి, నరులకు అంకితమివ్వ నని కొనసాగిన మహా యోగి. సామదాన ప్రయోగాలు సాయశక్తులా చేసిన మహాకవి శ్రీనాథ సార్వభౌముడు, రాజంకితం చేయడానికి ఒప్పించలేకపోయాడు. రాజదండన భయంకూడా చూపటం పరాకాష్ఠకు చేరినప్పుడు. “కాటుక కంటినీరు. “ అన్న పద్యం వెలుకురికిందని జన నానుడి.

కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో
హాటకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల క
ర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!

ఎంతటి తపనను ఓర్చుకున్నాడో పాపం. అసలే బాలరసాలసాల “నవపల్లవ కోమల కావ్యకన్యకన్. .” అని భావించే సుమ సున్నిత మనస్కుడు.

బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ
ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.

అవి గజేంద్ర మోక్షం పోతన అమృత గంటం నుండి ఆవిష్కరింపబడుతున్న రోజులు.

అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై.

ఈ పద్యం రెండు పాదాలు వ్రాసిన పిమ్మట ఎంత ప్రయత్నించినా గంటం సాగటంలేదు. దానితో ఆ తాళపత్రం, గంటం అక్కడే పూజా మందిరంలో ఉంచి, పొలంకేసి వెళ్ళాడు. తిరిగి ఇంటికి వచ్చిన తరువాత, తను అపద్యం పూర్తిచేసి ఉంది. కూతురును పిలిచి అడిగితే “నాన్నగారూ! ఇందాక మీరే వెనక్కి వచ్చి “వెంటనే వెనక్కి వచ్చారు ఏమిటి?” అని అడిగితే పూరించవసిన పద్య భాగం గుర్తు వచ్చిందిమ్మా” అని వచ్చి ఆ తాళపత్రంపై వ్రాశారు కదండీ . . .” అని చెప్పింది. ఆహా స్వామీ నాకోసం వచ్చి పద్యం పూరించావా అనుకుంటూ మైమరచాడట భక్త పోతన.

అవును అంతటి ఆధ్యాత్మిక పరిణతి పొందిన మహా పండితుడు కనుకనే వారి గజేంద్ర మోక్షం పద్యం చిన్నపిల్లలకు ఇప్పటివారు రైమ్యు పేర చెప్పే వాటిలా, మొన్నటి వరకూ తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు నేర్పేవారు . ఆ పద్యం తలచుకుందాం . . .

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

వారి వామనుని త్రివిక్రమ స్ఫురణ వలెనే, భాగవత తెలుగీకరణతో, పోతనామాత్యులవారు ఆద్యాత్మికంగా సంవర్ధియై ఎదిగి పోయారేమో . . .


ఎంతగా కృష్ణతత్వంలో మమేకం కాకపోతే శ్రీకృష్ణబాలుడు గోపాలురతో చల్దులు గుడుచు సందర్భంలో వేళ్ళ మధ్యనున్న ఆవకాయ ముక్క ఇంత చక్కగా చిత్రీకరించగలడు

కడుపున దిండుగాఁ గట్టిన వలువలో;
లాలిత వంశనాళంబు జొనిపి
విమల శృంగంబును వేత్రదండంబును;
జాఱి రానీక డాచంక నిఱికి
మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది;
ముద్ద డాపలిచేత మొనయ నునిచి
చెలరేఁగి కొసరి తెచ్చిన యూరుగాయలు;
వ్రేళ్ళ సందులయందు వెలయ నిఱికి
సంగడీల నడుమఁ జక్కగఁ గూర్చుండి
నర్మభాషణముల నగవు నెఱపి
యాగభోక్త కృష్ణుఁ డమరులు వెఱఁగంద
శైశవంబు మెఱసి చల్ది గుడిచె.

పోతన భాగవతం, వారు ఇంతటి మహానుభావుడైనా, వారి జీవితకాలంలో బయటకు రాలేదు. వారి పిమ్మట కొడుకు పూజామందిరంలో ఆ బృహద్గంథరాజాన్ని కనుగొని విస్మయాత్మకుడై, తబ్బిబ్బు పడి, తన ఆప్త మిత్రుడు, తండ్రి శిష్యరత్నం అయిన గంగనకు చెప్పాడుట. దానిని పరిష్కరించుకుని ప్రజలలోకి తెచ్చారట. అంటే తన కవన వ్యవసాయంలో జీవితాతం లీనమై పోయిన విశిష్ఠ ఏకాంత భక్తి యోగ స్థాయికి చేరాడనన్నమాట మన పోతన్నగారు. అందుకే శతాబ్దాల చరిత్రలో నీ అడుగుజాడలను అనుసరించి ఎందరో జీవించారు. ఇక ముందు జీవిస్తారు. ఆహా నీ విలువల వైశిష్ఠ్యం అటువంటిది మహాత్మా! నీకు జోహార్లు . .

: : చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం : :

- బాగవత గణనాధ్యాయి.