పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2016, ఆగస్టు - 25 భాగవత జయంతి

2016,ఆగస్టు-25
తెలుగుభాగవతం.ఆర్గ్ తృతీయ వార్షికోత్సవము - పోతన భాగవత జయంతి - శ్రీ కృష్ణ జయంతి.

నారసింహ విజయం ఆండ్రాయిడు ఆప్పు ఆవిష్కరణ
తెలుగుభాగవతం.ఆర్గ్ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా పోతన భాగవతం జయంతి కార్యక్రమం సుసంపన్నంగా పెద్దల, సహృదయుల సమక్షంలో, ఆదరాభిమానాలతో జరిగింది. . .
చి. భావన తల్లి చక్కటి కృష్ణకీర్తనలతో ఈ తృతీయ వార్షికోత్సవంలో కూడా సభాసదులను అలరించింది. ఆమెకు ఆమె తల్లిదండులకు శుభాభినందనలు. ఆమెకు బంగారు భవిష్యత్తును మా నల్లనయ్య అనుగ్రహించుగాక.
చి. వేద తల్లి చక్కగా ప్రార్థనా గీతం పాడి శుభారంభం చేసింది. ఆ పాపకు చక్కటి ఆయురారోగ్యాలు, చదువుసంధ్యలు, భోగభాగ్యాలూ మా నల్లనయ్య అనుగ్రహించుగాక.
ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు విభాగాధిపతి, విశిష్ఠ తెలుగు పరిశోధకులు, ప్రముఖ రచయిత ప్రాచార్య వెలిదండ నిత్యానందం గారు అనివార్య వ్యక్తిగత కారణాల వలన విచ్చేయ లేకపోయినా ఈ భాగవత ఉత్సవాలు సుసంపన్నంగా జరగాలని తమ సాదర శుభాశీస్సులు అందించారు. వారికి కృతజ్ఞతలు. . .
పుష్పగిరి పీఠ ఆస్థాన భాగవతులు శ్రీ ప్రభల సుబ్రహ్మణ్యం గారూ; ప్రముఖ నటులు, రచయిత, భాగవతులు శ్రీ తనికెళ్ళ భరణి గారూ; తాళ్ళపాక అన్నమాచార్య వంశస్థులు, తిరుమల దివ్యక్షేత్రంలో గీతాలాపనలు చేసే భాగవతులు శ్రీ హరినారాయణ స్వామి గారు; తెలుగుభాగవతం.ఆర్గ్ వ్యవస్థాపక అధ్యక్షులు భాగవత గణనాధ్యాయీ: తెలుగుభాగవతం.ఆర్గ్ ప్రథాన పద్యపఠన కర్త శ్రీ వేంకట కణాద గారూ వేదికను అలంకరించి సభను శోభాయమానం చేశారు. వారికి కృతజ్ఞతా పూర్వక ప్రణామములు.
జ్యోతి ప్రజ్వలన చేసి వేదిక అలంకరించిన పెద్దలు లోకకల్యాణాన్ని ఆకాంక్షించారు.

కొసమెరుపు:- దేశ రాజధానిలో ఈ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది ఉత్సవాల సందర్భంగా తెలుగుభాగవతం.ఆర్గ్ వాగ్దానం చేసిన నారసింహ విజయం అనే ఆప్పును విడుదల చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెడుతూ, అనేక అవాంతరాలనూ, అడ్డంకులనూ అధిగమించి శ్రీ ఫణి కిరణ్ ఉచిత ఆండ్రాయిడు ఆప్పు నారసింహ విజయం నిర్మించి ప్రచురించారు. ఆ పవిత్ర చరవాణి గ్రంధాన్ని శ్రీ తాళ్ళపాక హరినారాయణ స్వామి వారి అమృత హస్తాలతో ఈ పోతనభాగవత జయంతి వేదికపై ఆవిష్కరించబడింది. వారికి చక్కటి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలూ మరియు శ్రీ ఫణి కిరణ్ కు చక్కటి ఆయురారోగ్యాలను, భోగభాగ్యాలను, మరిన్ని బాగవత ప్రచురణలు చేసే శక్తి సామర్థ్యాలూ అవకాశాలు మా నల్లనయ్య అనుగ్రహించు గాక.
ఈ మీట నారసింహ విజయం పైనొక్కి మీమీ చరవాణులలో ఈ చరవాణి గ్రంథాన్ని ఉచితంగా పొందగలరు.

ఈ ఉత్సవాల సందర్బంగా గత జూలైలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులకు నిర్వహించిన కృష్ణాష్టమి క్విజ్, వ్యాసరచన పోటీలలో అనేకమంది బాలబాలికలు అమిత ఉత్యాహంగా పాల్గొని, నవనవీన తరంలో మన సంస్కృతి విలువల మీద, సాహితీ ఔన్నత్యం మీద గల అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించారు. తరతరానికి నవతరంలో పెరుగుతున్న చురుకుదనంతో మన జాతి పునరుత్థానం చెందుతోందన్న నమ్మకాన్ని ఋుజువు చేశారు.
వారందరికీ బంగారు భవిష్యత్తు మా నల్లనయ్య అనుగ్రహించుగాక అని ఆశీర్వాద పూర్వక అభినందనలు.
ఈ బాలబాలికలకు శిక్షణ ఇచ్చే, ఉపాధ్యాయులు వారికిచ్చిన ప్రోత్సాహానికి, కృషికి, మార్గదర్శనానికి సర్వదా అభినందనీయులు. వారికి హృదయపూర్వక వందనములు.
ఈ భావిభారత పౌరుల తల్లిదండ్రులకు, ఎందరో మిత్రులకు మాకు అందించిన ప్రోత్సాహానికి సహాయ సహకారాలకు ధన్యవాదాలు.
ఈ పోటీలో అత్యుత్సాహంగా పాల్గొనిన బాలబాలికలకు, వారికి తగిన ప్రోత్సాహ సహకారాలు అందించిన వారి ఉపాధ్యాయులకు వారందరికీ పేరుపేరునా అభినందన పత్రాలు అందించడమైనది.
ఈ పోటీలలో గట్టి పోటీని ఎదుర్కొని ఉన్నత పాఠశాల స్థాయికి నిర్వహించిన వ్యాస రచన పోటీలలో చి. చాగంటి సాయి శ్రీజా, హైదరాబాదు ప్రథమ స్థానంలోనూ. చి. పిఎస్ఆర్ కె శర్మ, హైదరాబాదు ద్వితీయ స్థానంలోనూ విజయం సాధించారు.
అలాగే ప్రాథమిక స్థాయిలో నిర్వహించిన డజను ప్రశ్నల క్విజ్ పోటీలో చి కె. జాహ్నవి, గుంటూరు ప్రథమ స్థానంలోనూ, డి. అశ్విత,గుంటూరు ద్వితీయ స్థానంలోనూ ఎన్నుకోబడ్డారు.
ఈ విజేతలను ఆభినందిస్తూ, మా నల్లనయ్య అనుగ్రహంతో జీవితంలో ఉన్నతోన్నత స్తాయిలకు ఎదుగుతూ, నలుగురికీ మంచి పంచుతూ భోగభాగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని దీవిస్తూ నగదు బహుమతులు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం శ్రీ తనికెళ్ళ భరణిగారి అమృతహస్తాల మీదుగా చాగంటి సాయి శ్రీజా : చి. పిఎస్ఆర్ కె శర్మ లకు అందించాము; తాళ్ళపాక హరినారాయణ స్వామి వారి అమృత హస్తాలమీదుగా చి. కె. జాహ్నవి, (గుంటూరు), చి. డి. అశ్విత (గుంటూరు) లకు అందించాము. వారికి మా నల్లనయ్య చక్కటి ఆయురారోగ్యాలు, పేరు ప్రతిష్ఠలు అనుగ్రహించు గాక.
తెలుగుభాగవతం.ఆర్గ్ సభ్యులు శ్రీ బండి శ్రీనివాస శర్మ గారు వ్యాఖ్యాతగానూ, శ్రీ మోపూరు ఉమామహేశ్వర రావుగారు వేదికపై సహకారం, శ్రీ అన్నపరెడ్డి సత్యన్నారాయణ గారు, శ్రీమతి లలిత ప్రభృతులు సభాసదులలో మమేకమై సహకారం అందించి సభను జయప్రదం శుభప్రదం చేశారు. వారికి ధన్యవాద సమేత నమస్కారములు. .

వేదికను అలంకరించిన పెద్దలు భాగవతులు శ్రీ హరినారాయణ స్వామి, శ్రీ తనికెళ్ళ భరణి, శ్రీ ప్రభల సుబ్రహ్మణ్యం వార్లకు సగౌరవంగా శాలువాలు, జ్ఞాపికలతో చిరు సత్కారాలు చేసి ధన్యులము అయ్యాము.
వివాహాది అనేక శుభకార్యాలూ, విపరీతమైన కుండపోత వర్షాలూ వంటి ఆటంకాలు ఎన్ని ఉన్నా పోతన భాగవతంపై ఆసక్తితో ఎంతో శ్రమకోర్చి విచ్చేసి, ధనికొండ రవి ప్రసాదు గారూ, పిల్లల తల్లిదండ్రులు, కుటుంబ సమేతంగా మురళి, నాగరాజు మున్నగు సభాసదులు సభను అలంకరించి శుభప్రదంగా, శోభాయమానంగా జరిపించిన సభాసదులు అందరకూ పేరుపేరునా ధన్యవాద పూర్వక వందనములు.

సభా వేదికను సాలంకారంగా అందించిన రవీంద్రభారతి యాజమాన్యంవారికి, తదుద్యోగులు చేసిన సహాయాలకు మేలుకు తెలుగు భాగవతం ప్రచార సమితి నమస్కార పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటోంది.
మాకు ఎల్లవేళలా మా కార్యక్రమాలకు, ప్రస్తుత సభకు విస్తృత ప్రచారం తమ మాధ్యమాల ద్వారా అందించిన విలేఖరులు; పత్రికా, టివీ మాధ్యమాల యాజమాన్యాలకు, ఉద్యోగులకు చేసిన అమూల్య సహాయ సహకారాలకు కృతజ్ఞతా నమస్కారములు.
ఇది భాగవతానికి సంబంధించిన కార్యక్రమం కనుక సాహిత్య ఆధ్యాత్మికాల పవిత్ర సంగమంగా నడిచింది.
పుష్పగిరి పీఠం వేదపండితులైన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనేక మూల వ్యాస భాగవతంలోని శ్లోకాలూ, పోతన పద్యాలూ మున్నగునవి ఉదహరిస్తూ చక్కని ఆధ్యాత్మికోపన్యాసం ఇచ్చారు. భాగవత తత్వాన్ని ప్రవచించారు. తెలుగుభాగవతం.ఆర్గ్ ఆవశ్యకతను శ్లాఘించారు

శ్రీ తనికెళ్ల భరణి గారు పోతన భాగవతం లోని వామనావతారం లోని అద్భుతమైన పద్యాలని రసస్ఫోరకం గా వివరించారు. io>ఇంతింతై వటుడింత యై" అనే పద్యాన్ని, రవిబింబం పురమింప" అనే పద్యాన్ని ఉదహరిస్తూ వామనుడు త్రివిక్రముడుగా నభోవీధికి విజృంభిస్తున్న సమయం లో సూర్య బింబం కిరీటంగా, కంఠాభరణంగా , చేతి కంకణంగా, కాలి అందెగా వివిధస్థాయిలలో కెమెరా లేకుండా పోతనామాత్యులు ఫొటోగ్రఫిక్ ఎఫెక్ట్స్ తో చూపించారని అత్యద్భుతంగా వ్యాఖ్యానించిన తీరు శ్రోతలకు అద్భుత రసానుభూతిని, భక్తి పారవశ్యాన్నీ కలిగించి తన్మయింప జేసింది . పోతన వ్రాసిన పది పద్యాలైనా చదవని వారు తెలుగువారమని చెప్పుకోటానికి సిగ్గు పడాలి అన్నారు భరణి గారు. తెలుగుభాగవతం.ఆర్గ్ చేస్తున్న అపూర్వ కృషిని అభినందిచారు.

తాళ్లపాక అన్నమాచార్య వంశజులైన శ్రీ హరినారాయన స్వామి వారు అన్నమాచార్యకీర్తనలని అద్భుతంగా గానం చేసి శ్రోతలు వానికి అనుగుణంగా తాళం వేసేటంత తన్మయత్వాన్ని కలిగించారు . భక్తి తత్వాన్ని వివరించారు
శ్రీ హరినారాయణ స్వామి వారు సభ్యు లందరితో గోవిందనామాన్ని ఎలుగెత్తి స్మరణ చేయించారు. తెలుగుభాగవతం.ఆర్గ్ విశిష్ఠతలను పేర్కొని, ఇది దినదినాభివద్ధి చెందాలని అన్నారు

సభానిర్వహకులు తెలుగుభాగతం జాలగూడు సాధించిన చక్కటి పురోభివృద్ధి, నెలకు ముప్పైవేల వీక్షణలు స్థాయికి; సాంఘిక మాధ్యమాలలో వేలకొలది ఇష్టాలకు కారణమైన వీక్షకమహాశయులకు, భాగవత ప్రియులకు, పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. సాదరంగా సహకారం అందించిన కార్యకర్తలు, మిత్రులు అందరికి ధన్యవాదాలు తెలుపుకున్నారు.