పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2020 ఆన్ లైన్ భాగవత జయంత్యుత్సవాలు

సింగపూర్, 16 ఆగస్టు 2020 :  తెలుగు భాగవత ప్రచార సమితి వారి ఆధ్వర్యములో సింగపూర్ నుండి 4వ అంతర్జాతీయ భాగవత జయంత్యుత్సవములు ఆన్ లైన్ పద్దతిలో ఫేస్బుక్ మరియు యూ ట్యూబ్ లైవ్ ద్వారా ఘనంగా నిర్వహించబడినవి. ఈ సారి ఈ ఉత్సవములు రెండు రోజులపాటు నిర్వహించబడినవి . ఆగష్టు 11, 2020 కృష్ణాష్టమి నాడు రాత్రి 7 గం నుండి రాత్రి 8.30 వరకు భాగవత పారాయణం, భాగవత పద్య పఠనము, శ్రీ సూక్త పఠనము పోటీలు నిర్వహించబడినవి. మరల ఆగష్టు 15 న పిల్లల పాటలు, పద్యాలు, నృత్యము మొదలగు సాంస్కృతిక కార్యక్రమము లు కొనసాగినవి. అంతర్జాలం ద్వారా తెలుగు వారందరు ఈ కార్యక్రమాన్ని వీక్షించ గలిగినారు. ఈ వేడుకలకు 200 మంది పిల్లలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలలో నమోదుచేసుకోగా, వారి నుండి ఎంపికైన 25 మంది పిల్లలు పెద్దలు వివిధ ప్రాంతముల నుండి తమ కళలను ప్రదర్శించి అందరినీ అలరించారు. సింగపూర్, భారత దేశములనుండియే కాక ఇతర దేశముల నుండి కూడా పాల్గొనుట ఈ సారి కార్యక్రమమునకు మంచి శోభను చేకూర్చినది. ఈ కార్యక్రమాన్ని ప్రపంచం నలుమూలలనుండి 500 మందికి పైగా వీక్షకులు ప్రత్యక్ష ప్రసారంలో చూసి ఆనందించారు.

 ముఖ్యంగా ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ అమృతానంద సరస్వతి సంయమీంద్ర మహాస్వాములవారు విశిష్ట అతిథిగా పాల్గొని భాగవత ప్రాశస్త్యాన్ని గురించి చక్కటి సందేశమును ఇచ్చినారు. ఈ ఉత్సవాల సందర్భముగా భాగవత ప్రచారానికి విశేష కృషి జరుపుతున్న గౌరవనీయులు డాక్టర్ శ్రీ మురళీ మోహన్ గారిని భాగవతరత్న పురస్కార ప్రదానంతో సత్కరించటం జరిగినది.

 అలాగే, ఈ కార్యక్రమంలో శ్రీ పెద్ది సాంబశివరావు గారు తెలుగుభాగవతం.ఆర్గ్ నుండి సమకూర్చిన "పోతనామాత్య భాగవత పరిచయము - అష్టమ స్కంధం" అనే డిజిటల్ పుస్తకాన్ని కినిగె ద్వారా ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అంతర్జాలంలోని తెలుగు వారందరికీ ఉచితంగా అందచేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు. ఈ పుస్తకాన్ని ఇక్కడఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాక విన్నూత్నమైన పద్ధతిలో కథల పుస్తకాలను ఆగ్మెంటేడ్ రియాలిటీ (Augmented Reality) మొబైల్ అప్ తో కలిపి ప్రపంచంలోనే మొట్టమొదటి "లైవ్ కథల పుస్తకం" ను కథ.AR అనే పేరుతో ఆవిష్కరించారు (www.katha-ar.com).

 ఈ అంతర్జాతీయ భాగవత జయంత్యుత్సవములకు చక్కటి వార్తా కథనాలాతో మాకు ఎంతో ప్రోత్సాహాన్ని - మా భాగవత ప్రచారానికి ఇతోధిక సహాయాన్ని అందించిన ఈటీవీ, సాక్షి, నమస్తే తెలంగాణా యూట్యూబ్, ఫేస్బుక్, మున్నగు వార్తా మాధ్యమాల యాజమాన్యాలకు, వీటికి కారణభూతులైన ఆయా ఉద్యోగులకు విలేఖరులకు; అనుసంధానం చేసిన మా శ్రేయోభిలాషులకు; విజయవంతంగా నిర్వహించటానికి సహకరించిన తెలుగు భాగవత ప్రచార సమితి సభ్యులందరికి నిర్వహణ కమిటీ తరపున హృదయ పూర్వక ధన్యవాదములు. ఈ మహత్కార్యక్రమాన్ని చూసిన వారికి, సహకరించిన వారికి హృదయ పూర్వక కృతజ్ఞతాభి వందనములు.

ఇట్లు
తెలుగు భాగవత ప్రచార సమితి, సింగపూరు

Links: www.katha-ar.com
https://kinige.com/book/Potanamatya+Bhagavata+Parichayamu+Ashtama+Skandhamu