పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షి జ్జన్మంబు

  •  
  •  
  •  

1-289-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత ననుకూల శుభగ్రహోదయంబును, సర్వగుణోత్తర ఫలసూచకంబును నైన శుభలగ్నంబునం బాండవ వంశోద్ధారకుం డయిన కుమారుండు జన్మించిన ధర్మనందనుండు ధౌమ్యాది భూసురవర్గంబు రప్పించి, పుణ్యాహంబు సదివించి జాతకర్మంబులు సేయించి కుమారు జన్మమహోత్సవ కాలంబున భూసురులకు విభవాభిరామంబు లయిన గో భూ హిరణ్య హయానేక గ్రామంబులును స్వాదురుచిసంపన్నంబు లయిన యన్నంబు లిడిన వారలు తృప్తులై ధర్మపుత్రున కిట్లనిరి.

టీకా:

అంతన్ = అంతట; అనుకూల = అనుకూలమైన; శుభ = శుభప్రదమైన; గ్రహ = గ్రహములు; ఉదయంబును = కలుగుటయును; సర్వ = సమస్త; గుణ = మంచిగుణములకు; ఉత్తర = భవిష్యత్తులోని; ఫల = ఫలములను; సూచకంబునున్ = సూచించునవియును; ఐన = అయినట్టి; శుభ = శుభకరమైన; లగ్నంబునన్ = లగ్నములో; పాండవ = పాండురాజు పుత్రులకు; వంశ = వంశమును; ఉద్ధారకుండు = ఉద్ధరించువాడు; అయిన = అయినట్టి; కుమారుండు = పుత్రుడు; జన్మించినన్ = పుట్టగా; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మనందనుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; ధౌమ్య = ధౌమ్యుడు; ఆది = మొదలగు; భూసుర = బ్రాహ్మణుల {భూసురుడు - భూమికి సురుడు (దేవుడు), బ్రాహ్మణుడు}; వర్గంబున్ = సమూహమును; రప్పించి = పిలిపించి; పుణ్యాహంబు = పుణ్యాహము అను శుద్ధి మంత్రములు; సదివించి = చదివించి; జాతకర్మంబులు = పిల్లలు పుట్టినప్పుడు చేయు కార్యక్రమము; చేయించి = చేయించి; కుమారు = పుత్రుని; జన్మ = పుట్టిన సందర్భపు; మహా = గొప్ప; ఉత్సవ = పండుగ; కాలంబునన్ = సమయమున; భూసురులు = బ్రాహ్మణులు {భూసురుడు - భూమికి సురుడు (దేవుడు), బ్రాహ్మణుడు}; కున్ = కి; విభవ = వైభవముతో; అభిరామంబులు = మనోజ్ఞములు; అయిన = అయినట్టి; గో = గోవులను; భూ = భూములను; హిరణ్య = బంగారము; హయ = గుఱ్ఱములను; అనేక = అనేకమైన; గ్రామంబులును = గ్రామములను; స్వాదు = చక్కని; రుచి = రుచితో; సంపన్నంబులు = సమృద్ధములు; అయిన = అయినట్టి; అన్నంబులు = ఆహారములును; ఇడిన = ఇచ్చిన; వారలు = వారు; తృప్తులు = తృప్తి చెందిన వారు; ఐ = అయి; ధర్మపుత్రున = ధర్మరాజు {ధర్మపుత్రుడు - యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు}; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

అనంతరం శుభగ్రహాలన్నీ ఉచ్చస్థానాల్లో ఉండగా, సర్వసౌభాగ్య సముదాత్తమైన ఉత్తమ ముహూర్తంలో, ఉత్తరకు పాండవ వంశోద్ధారకుడైన బాలుడు ఉద్భవించాడు. ధర్మరాజు ధౌమ్యుడు మొదలైన పురోహితులను పిలిపించి పుణ్యాహవాచనం, జాతకర్మాదులు జరిపించాడు. పుత్రోదయ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వర్తించి, భూసురోత్తములకు షడ్రసోపేత భోజనాలు పెట్టించి, గోవులూ భూములూ సువర్ణాలూ అశ్వాలూ అగ్రహారాలూ దానం చేసాడు. సంతుష్టులైన బ్రాహ్మణ శ్రేష్ఠులు యుధిష్ఠిరుణ్ణి చూసి...

1-290-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ప్రటిత దైవయోగమునఁ బౌరవ సంతతి యంతరింపఁగా
విలత నొందనీక ప్రభవిష్ణుఁడు విష్ణుఁ డనుగ్రహించి శా
కుఁ బ్రతికించెఁ గావున నృపాలక! శాబకుఁ డింక శాత్రవాం
కుఁ డగు; విష్ణురాతుఁ డన ధాత్రిఁ బ్రసిద్ధికి నెక్కుఁ బూజ్యుఁడై"

టీకా:

ప్రకటిత = వ్యక్తమైన; దైవ = దైవముచే నిర్దేశించబడిన; యోగమునన్ = యోగము వలన; పౌరవ = పురువు; సంతతి = వంశము; అంతరింపఁగా = అంతరించుచుండగా; వికలత = చెదిరిపోవుట; ఒందనీక = సంభవించకుండగ; ప్రభవిష్ణుఁడు = కృష్ణుడు {ప్రభవిష్ణుడు, ప్రభవిష్ణువు - అవతరించు శీలము కలవాడు, సృష్టిగా పుట్టుకువచ్చే స్వభావము కలవాడు, విష్ణువు}; విష్ణుఁడు = కృష్ణుడు {విష్ణువు - 1. శ్రీమన్నారాయణుడు, హరి, 2. సృష్టికి లోపల బయట నిండి (వ్యాపించి) ఉన్నవాడు, 3. ద్వాదశాదిత్యులలో ఒకడు., 4వ్యు. విష - వ్యాప్తౌ + నుక్, విశ - ప్రవేశే + నుక్ పృషో, అన్నింటిలోనూ వ్యాపించిన యున్నవాడు, అన్నింటిలోనూ ప్రవేశించి యున్నవాడు}; అనుగ్రహించి = అనుగ్రహించి; శాబకున్ = పిల్లవాడిని; బ్రతికించెన్ = బ్రతుకునట్లు కాపాడెను; కావునన్ = అందువలన; నృపాలక = రాజా {నృపాలకుడు - నృ (నరులను) పాలకుడు (పరిపాలించెడివాడు), రాజు}; శాబకుడు = పిల్లవాడు; ఇంక = ఇక; శాత్రవ = శత్రువులను; అంతకుఁడు = అంతముచేయువాడు; అగున్ = అగును; విష్ణురాతుడు = విష్ణురాతుడు; అనన్ = అని; ధాత్రిన్ = భూమిమీద; ప్రసిద్ధి = మంచిపేరు; కిన్ = ను; ఎక్కున్ = పొందును; పూజ్యుఁడు = పూజింప తగువాడు; ఐ = అయి.

భావము:

"మహారాజా! ప్రఖ్యాతమైన దైవనియోగం వల్ల భారతవంశం అంతరించి పోకుండా ప్రభవిష్ణువైన శ్రీమహావిష్ణువు పరమానుగ్రహంతో ఈ పసిపాపను బ్రతికించాడు. ఈ బాలుడు, పగవారిపాలిటి లయకాలుడై విష్ణువుచేత రక్షించబడినందున విష్ణురాతు డనే నామంతో విఖ్యాతుడై, జగన్మాన్యుడౌతాడు."

1-291-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని భూదేవోత్తములకు నరదేవోత్తముం డిట్లనియె.

టీకా:

అనినన్ = అని పలుకగా; విని = విన్నవాడై; భూదేవ = బ్రాహ్మణులలో {భూదేవులు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; ఉత్తములు = ఉత్తములు; కున్ = కు; నరదేవ = రాజులలో {నరదేవుడు - నరులకు దేవుడు, రాజు}; ఉత్తముండు = ఉత్తముడు; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.

భావము:

బాలుడు జగన్మాన్యు డౌతాడు అనుచున్న విప్రోత్తములను ధర్మరాజు ఇలా అడిగాడు

1-292-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

" పుణ్యాత్మకులార! నాపలుకు మీ రూహింపుఁడా మ్రొక్కెదన్
మా పెద్దల్ శ్రుతకీర్తులై సదయులై న్నారు రాజర్షులై,
యీ పిన్నాతఁడు వారిఁ బోలెడిఁ గదా యెల్లప్పుడున్? మాధవ
శ్రీపాదాంబుజ భక్తియుక్తుఁ డగుచున్ జీవించునే? చూడరే."

టీకా:

ఓ = ఓ; పుణ్య = పుణ్యవంతమైన; ఆత్మకులార = ఆత్మకలవారలు; నా = నా యొక్క; పలుకులు = మాటలు; మీరు = మీరు; ఊహింపుఁడా = ఆలోచించండి; మ్రొక్కెదన్ = వేడెదను; మా = మా యొక్క; పెద్దల్ = పెద్దలు, పూర్వీకులు; శ్రుత = వినపడుతున్న; కీర్తులు = కీర్తి కలవారు; ఐ = అయి; సదయులు = మంచి దయ కల వారు; ఐ = అయి; మన్నారు = బ్రతికితిరి; రాజర్షులు = రాజులలో ఋషులు; ఐ = అయి; ఈ = ఈ; పిన్న = చిన్న; అతఁడు = వాడు; వారిన్ = వారిని; పోలెడిన్ = పోల్చుటకు తగి ఉంటాడు; కదా = కదా; ఎల్లప్పుడున్ = ఎప్పుడును; మాధవ = కృష్ణుని {మాధవుడు - 1. మా (లక్ష్మీదేవి) ధవ (భర్త ఐనవాడు) , 2. మధు అను రాక్షసుని జయించినవాడు విష్ణువు, 3. మనసును రంజింపజేయువాడు, 4. మాధవి భర్త, 5. యదువు తరువాతి తరపు మధువు యొక్క వంశము వాడు, శ్రీకృష్ణుడు,}; శ్రీ = శుభకరమైన; పాద = పాదములనెడి; అంబుజ = పద్మములయందు; భక్తి = భక్తి; యుక్తుఁడు = కలిగినవాడు; అగుచున్ = అవుతూ; జీవించునే = బ్రతుకునా; చూడరే = చూడండి.

భావము:

"ఓ మహాత్ములారా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా పలుకులు ఆలకించి నా సందేహం తీర్చండి. మా పెద్దలంతా దిగంత విశ్రాంత కీర్తులై, కారుణ్యమూర్తులై, రాజర్షులై విరాజిల్లారు. ఈ చిన్నారి బాలుడు సైతం తన తాతముత్తాతల అడుగుజాడల్లో నడుస్తూ వారిలాగనే ఎల్లప్పుడూ శ్రీ వల్లభుని పాద పద్మాలను భక్తితో సేవిస్తూ జీవిస్తాడు గదా దయచేసి కొంచెము సెలవీయండి."

1-293-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని ”నరేంద్రా! భవదీయపౌత్రుండు మనుపుత్రుం డయిన యిక్ష్వాకుని చందంబునఁ బ్రజల రక్షించు; శ్రీరామచంద్రుని భంగి బ్రహ్మణ్యుండు సత్యప్రతిజ్ఞుండు నగు; డేగ వెంటనంటిన బిట్టు భీతంబై వెనుకకు వచ్చిన కపోతంబుఁ గాచిన శిబిచక్రవర్తి రీతి శరణ్యుండును వితరణఖనియు నగు; దుష్యంతసూనుం డైన భరతు పగిది సోమాన్వయ జ్ఞాతివర్గంబులకు యజ్వలకు ననర్గళ కీర్తి విస్తరించు; ధనంజయ కార్తవీర్యుల కరణి ధనుర్ధరాగ్రేసరుం డగుఁ; గీలి పోలిక దుర్ధర్షుం డగు; సముద్రుని తెఱంగున దుస్తరుం డగు; మృగేంద్రంబు కైవడి విక్రమశాలి యగు; వసుమతివోలె నక్షయక్షాంతియుక్తుం డగు; భానుని లాగునఁ బ్రతాపవంతుం డగు; వాసుదేవు వడువున సర్వభూతహితుం డగుఁ; దల్లిదండ్రులమాడ్కి సహిష్ణుం డగు; మఱియును.

టీకా:

అనినన్ = అని పలికిన; విని = విన్నవారై; నరేంద్రా = నరులలో ఉత్తముడా; భవదీయ = నీయొక్క; పౌత్రుండు = మనుమడు; మను = మనువు యొక్క; పుత్రుండు = పుత్రుడు; అయిన = అయిన; ఇక్ష్వాకుని = ఇక్ష్వాకుని; చందంబునన్ = వలె; ప్రజలన్ = ప్రజలను; రక్షించు = కాపాడును; శ్రీరామచంద్రుని = శ్రీరామచంద్రుని; భంగిన్ = వలె; బ్రహ్మణ్యుండు = బ్రాహ్మణహితుడు; సత్య = సత్యమును; ప్రతిజ్ఞుండున్ = ప్రతిజ్ఞలు కలవాడును; అగున్ = అగును; డేగ = డేగ; వెంటనంటిన = వెంట తరుమగా; బిట్టు = మిక్కిలి; భీతంబు = భయము చెందినది; ఐ = అయి; వెనుకకు = వెనుకకు; వచ్చిన = మరలి వచ్చిన; కపోతంబున్ = పావురమును; కాచిన = కాపాడిన; శిబి = శిబి అను; చక్రవర్తి = రారాజు; రీతి = వలె; శరణ్యుండును = శరణ మిచ్చువాడును; వితరణ = దాన మిచ్చుటలో; ఖనియున్ = గని వంటివాడును; అగున్ = అగును; దుష్యంత = దుష్యంతుని; సూనుండు = పుత్రుడు; ఐన = అయినట్టి; భరతు = భరతుని; పగిదిన్ = వలె; సోమ = చంద్ర; అన్వయ = వంశపు; జ్ఞాతి = బంధువుల; వర్గంబులు = సమూహములు; కున్ = కు; యజ్వలు = యజ్ఞముచేయువారి; కున్ = కు; అనర్గళ = అడ్డులేని; కీర్తిన్ = కీర్తిని; విస్తరించున్ = విస్తరింపజేయును; ధనంజయ = అర్జునుడు; కార్తవీర్యుల = కార్తవీర్యార్జనుడుల; కరణిన్ = వలె; ధనుస్ = ధనుస్సును; ధర = ధరించువారిలో; అగ్రేసరుడు = మిక్కిలి గొప్పవాడు; అగున్ = అగును; కీలి = అగ్ని {కీలి - కీలలు కలవాడు, అగ్ని}; పోలికన్ = వలె; దుర్ధర్షుండు = తిరస్కరింపదగనివాడు; అగున్ = అగును; సముద్రుని = సాగరుని; తెఱంగునన్ = వలె; దుస్తరుండు = దాటుటకు వీలుకానివాడు; అగున్ = అగును; మృగేంద్రంబు = సింహము {మృగేంద్రము - మృగములలో గొప్పది, సింహము}; కైవడిన్ = వలె; విక్రమశాలి = పరాక్రమవంతుడు; అగున్ = అగును; వసుమతి = భూదేవి; వోలెన్ = వలె; అక్షయ = తరుగని; క్షాంతి = ఓర్పు; యుక్తుండు = కలవాడు; అగున్ = అగును; భానుని = భానుని; లాగునన్ = వలె; ప్రతాపవంతుండు = ప్రతాపముకలవాడు; అగున్ = అగును; వాసుదేవు = కృష్ణుని {వాసుదేవుడు - 1.ఆత్మలందు వసించెడి దేవుడు, 2.విష్ణువు, 3.కృష్ణుడు, 4.వసుదేవుని పుత్రుడు, 5.వ్యు. వాసుదేవః - సర్వత్రాసౌ వసత్యాత్మ రూపేణ, విశంభరత్వాదితి, (ఆంధ్ర వాచస్పతము) ఆత్మ యందు వసించు దేవుడు, 6. చతుర్వ్యూహముల లోని వాసుదేవుడు, బుద్ధికి అధిష్టానదేవత}; వడువునన్ = వలె; సర్వ = సమస్త; భూత = జీవులకు; హితుండు = హితవుచేయువాడు; అగున్ = అగును; తల్లిదండ్రుల = తల్లిదండ్రుల; మాడ్కిన్ = వలె; సహిష్ణుండు = సహనము కలవాడు, ఓర్పు కల వాడు; అగున్ = అగును; మఱియును = ఇంకా.

భావము:

అప్పుడు అజాతశత్రునితో విప్రులు ఈ విధంగా అన్నారు -ధర్మపుత్రా! ఈ నీ పౌత్రుడు మనువు కుమారుడైన ఇక్ష్వాకు నరేంద్రునిలాగా ప్రజలను పాలిస్తాడు. కారుణ్యసాంద్రుడైన శ్రీరామచంద్రునిలాగా సత్యసంధుడూ సౌజన్యసింధుడూ ఔతాడు. ఆకలిగొన్న డేగ వెన్నంటి తరమగా, అత్యంత భయసమేతమైన కపోతానిక అభయ మిచ్చిన శిబిచక్రవర్తిలాగా ఆర్తశరణ్యుడై వదాన్యులలో అగ్రగణ్యు డౌతాడు. దుష్యంతుని కుమారుడైన భరతునిలాగా యజన క్రియానిరతుడై. అఖండయశోభరితుడై చంద్రవంశానికి పేరు తెస్తాడు. అర్జునుని వలె, కార్తవీర్యార్జునునివలే విలుకాండ్రలో మేలుంబంతి అవుతాడు. అగ్నిహోత్రుడులా చెనకరాని వాడూ, సముద్రునిలా అతిక్రమింపరాని వాడూ, సింహంవంటి పరాక్రమశాలీ, వసుంధరవంటి క్షమాశీలీ అవుతాడు. దినకరునిలా తేజో మహితుడూ, దేవకీనందనునిలా సకలభూత హితుడూ, జననీ జనకులులా సహన సహితుడూ అవుతాడు. అంతేకాదు...

1-294-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మదర్శనంబున లజాతభవుఁడనఁ-
రమప్రసన్నత ర్గుఁ డనగ
నెల్లగుణంబుల నిందిరావిభుఁడన-
ధికధర్మమున యయాతి యనఁగ
ధైర్యసంపద బలిదైత్యవల్లభుఁడన-
చ్యుతభక్తిఁ బ్రహ్లాదుఁ డనఁగ
రాజితోదారత రంతిదేవుండన-
నాశ్రితమహిమ హేమాద్రి యనఁగ

1-294.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శము నార్జించుఁ, బెద్దల నాదరించు,
శ్వమేధంబు లొనరించు, నాత్మసుతుల
నులఁ బుట్టించు, దండించు లులఁ బట్టి,
మానధనుడు నీ మనుమఁడు మానవేంద్ర!

టీకా:

సమదర్శనంబునన్ = సమస్తమును సమానముగా చూచుటయందు; జలజాతభవుఁడు = బ్రహ్మ {జలజాతాక్షుడు - (నీటిలో పుట్టునది) పద్మము నందు పుట్టిన వాడు, బ్రహ్మ}; అనన్ = అనగా; పరమ = మిక్కిలి; ప్రసన్నతన్ = ప్రసన్నముగ ఉండుటలో; భర్గుఁడు = శివుడు; అనగన్ = అనగా; ఎల్ల = సమస్త; గుణములన్ = మంచి గుణములలోను; ఇందిరావిభుఁడు = లక్ష్మీపతి, విష్ణువు; అనన్ = అనగా; అధిక = అధికమైన; ధర్మమున = ధర్మపాలనలో; యయాతి = యయాతి; అనఁగన్ = అనగా; ధైర్య = ధైర్యము అనే; సంపద = సంపద కలిగి ఉండుటలో; బలి = బలి అను; దైత్య = రాక్షసులకు; వల్లభుఁడు = ప్రభువు; అనన్ = అనగా; అచ్యుత = హరి మీది; భక్తిన్ = భక్తిలో; ప్రహ్లాదుఁడు = ప్రహ్లాదుడు; అనఁగన్ = అనగా; రాజిత = ప్రకాశించు; ఉదారతన్ = దానగుణములో; రంతిదేవుండు = రంతిదేవుడు; అనన్ = అనగా; ఆశ్రిత = ఆశ్రయింపదగిన; మహిమన్ = గొప్పదనములో; హేమాద్రి = హిమాలయము; అనఁగ = అనగా;
యశమున్ = కీర్తిని; ఆర్జించున్ = సంపాదించును; పెద్దలన్ = పెద్దవారిని; ఆదరించున్ = ఆదరించును; అశ్వమేధంబులు = అశ్వమేధ యజ్ఞములు; ఒనరించు = చేయును; ఆత్మ = తన; సుతులన్ = పుత్రులను; ఘనులన్ = గొప్పవారిని; పుట్టించు = కనును; దండించున్ = శిక్షించును; ఖలులన్ = దుష్టులను; పట్టి = పట్టుకొని; మాన = మానము అను; ధనుడు = ధనము కలవాడు; నీ = నీ; మనుమఁడు = మనుమడు; మానవేంద్ర = రాజా {మానవేంద్రుడు - మానవులకు ప్రభువు, రాజు}.

భావము:

ఇతడు సమదృష్టిలో జలజభవుడు-ప్రసాదంలో పరమశివుడు. రమణీయ గుణసంపదలో రమాధవుడు-అనిపించుకొంటాడు. ధర్మాతిశయంలో యయాతిగా, ధైర్యంలో బలిచక్రవర్తిగా, భక్తిద్రఢిమలో ప్రహ్లాదుడుగా, దాతృత్వగరిమలో రంతిదేవుడుగా, ఆశ్రయమహిమలో హిమగిరిగా ఖ్యాతి గాంచుతాడు. కీర్తిపై అనురక్తీ, పెద్దలపై భక్తీ, కలిగి అశ్వమేధాలు ఆచరిస్తాడు. తనవంచి తనయులకు తండ్రియై వంశాన్ని పండిస్తారు. దుర్మార్గులను దండిస్తాడు. నీ మనుమడ మానధనులో మాననీయు డౌతాడు.

1-295-భు.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రించుం గలిప్రేరితాఘంబు లెల్లన్,
రించున్ ధరన్ రామద్రుండుఁ బోలెన్,
రించున్ సదా వేదశాస్త్రానువృత్తిన్,
రించున్ విశేషించి వైకుంఠుభక్తిన్.

టీకా:

హరించున్ = పోగొట్టును; కలి = కలిచేత; ప్రేరిత = ప్రేరేపింపబడిన; అఘంబులు = పాపములు; ఎల్లన్ = అన్నిటిని; భరించున్ = పోషించును; ధరన్ = భూమిని; రామభద్రుండున్ = రామచంద్రుడు; పోలెన్ = వలె; చరించున్ = మెలగును; సదా = ఎల్లప్పుడు; వేద = వేదమును; శాస్త్ర = శాస్త్రమును; అనువృత్తిన్ = అనుసరించి; వరించున్ = కోరి స్వీకరించును; విశేషించి = ప్రత్యేకించి; వైకుంఠు = విష్ణుమూర్తి మీది {వైకుంఠుడు - విష్ణువు, వైకుంఠవాసుడు, చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమెకు జన్మించినవాడు, కుంఠనము (మొక్కపోవుట) లేని వాడు, వ్యు., వికుంఠమే (జ్ఢానమ్) + అణ్, త.ప్ర., జడమైన ప్రకృతికి జ్ఞానమొసగి యుద్దరించిన వాడు.}; భక్తిన్ = భక్తితో.

భావము:

ఇతడు కలికల్మషాలను హరిస్తాడు. శ్రీరామచంద్రుడులాగా భూభారాన్ని భరిస్తాడు. వేదశాస్త్రాలను అనుసరించి సదా చరిస్తాడు విశిష్టమైన విష్ణుభక్తిని వరిస్తాడు.

1-296-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పెక్కేండ్లు జీవించి భూసుర కుమార ప్రేరితం బయిన తక్షకసర్ప విషానలంబునం దనకు మరణం బని యెఱింగి, సంగవర్జితుం డయి, ముకుంద పదారవింద భజనంబు సేయుచు, శుకయోగీంద్రుని వలన నాత్మవిజ్ఞాన సంపన్నుం డై, గంగాతటంబున శరీరంబు విడిచి, నిర్గత భయశోకం బయిన లోకంబుఁ బ్రవేశించు"నని, జాతకఫలంబు సెప్పి లబ్ధకాము లయి భూసురులు సని రంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; పెక్రు = చాలా; ఏండ్లు = సంవత్సరములు; జీవించి = బ్రతికి; భూసుర = బ్రాహ్మణ {భూసురుడు - భూమికి సురుడు (దేవుడు), బ్రాహ్మణుడు}; కుమార = పుత్రునిచేత; ప్రేరితంబు = ప్రేరేపించబడినది; అయిన = అయినట్టి; తక్షక = తక్షకుడు అను; సర్ప = పాముయొక్క; విష = విషము అను; అనలంబునన్ = అగ్నివలన; తన = తన; కున్ = కు; మరణంబు = చావు కలుగును; అని = అని; ఎఱింగి = తెలిసికొన్నవాడై; సంగ = బంధములను; వర్జితుండు = విడిచిపెట్టిన వాడు; అయి = అయి; ముకుంద = హరియొక్క; పద = పాదములు అను; అరవింద = పద్మములమీద; భజనంబు = భక్తి; చేయుచు = చేయుచు; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; ఇంద్రుని = శ్రేష్ఠుని; వలనన్ = వలన; ఆత్మ = ఆత్మ పరమాత్మల గురించిన; విజ్ఞాన = విశిష్ట జ్ఞానము అను; సంపన్నుండు = సంపద కలవాడు; ఐ = అయి; గంగా = గంగ యొక్క; తటంబునన్ = ఒడ్డున; శరీరంబు = శరీరమును; విడిచి = విడిచిపెట్టి; నిర్గత = తొలగింపబడిన; భయ = భయము; శోకంబు = శోకము కలది; అయిన = అయినట్టి; లోకంబున్ = లోకమును; ప్రవేశించును = చేరును; అని = అని; జాతక = జాతకము గణన చేయగా వచ్చిన; ఫలంబు = ఫలితమును; చెప్పి = చెప్పి; లబ్ధ = పొంద బడిన; కాములు = కామములు కలవారు; అయి = అయిన; భూసురులు = బ్రాహ్మణులు; సనిరి = వెళ్ళిపోయిరి; అంతన్ = అంతట.

భావము:

ఈ బాలుడు ఈ విధంగా అనేక సంవత్సరాలు గడిపి, మునికుమారునివల్ల ప్రేరేపించబడిన తక్షకుని విషాగ్నిజ్వాలలచే తాను చనిపోతానని తెలుసుకొని సర్వసంగ పరిత్యాగియై, గోవింద చరణారవింద భజనానురాగియై, శుకయోగీంద్రులవల్ల బ్రహ్మజ్ఞాన సంపన్నుడై గంగానదీతీరంలో శరీరాన్ని పరిత్యజించి భయశోకాలు లేని పుణ్య లోకానికి చేరుకుంటాడు-అని ఈ ప్రకారంగా బాలకుని భవిష్యత్తు ప్రకటించి, ధర్మరాజు ఇచ్చిన కానుకలు అందుకొని, భూసురోత్తములు సంతుష్టచిత్తులై వెళ్లిపోయారు.

1-297-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తల్లి కడుపులోపల
మును సూచిన విభుఁడు విశ్వమున నెల్లఁ గలం
నుచుఁ బరీక్షింపఁగ జను
ఘుఁ బరీక్షన్నరేంద్రుఁ డండ్రు మునీంద్రా!

టీకా:

తన = తనయొక్క; తల్లి = తల్లి; కడుపు = కడుపు; లోపలన్ = లోపల; మును = ఇంతకు ముందు; సూచిన = చూచిన; విభుఁడు = ప్రభువు; విశ్వమున = లోకమునకు; ఎల్లన్ = ఎల్లెడల; కలండు = ఉన్నాడు; అనుచున్ = అని; పరీక్షింపఁగన్ = పరీక్షించుండుటచేత; జనులు = ప్రజలు; అనఘున్ = పాపములేని వానిని; పరీక్షిత్ = పరీక్షిత్తు అను; నరేంద్రుడు = రాజు; అండ్రు = అందురు; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా.

భావము:

శౌనక మునీంద్రా తన కన్నతల్లిగర్భంలో మున్ను తాను సందర్శించిన భగవంతుడు విశ్వమంతటా విరాజిల్లుతున్నాడేమో నని పరీక్షించినందువల్ల ఆ బాలుణ్ణి లోకులు పరీక్షిత్తు అని పిలుస్తారు.

1-298-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ళలచేత రాజు గ్రమమునఁ బరిపూర్ణు
యిన భంగిఁ దాత నుదినంబుఁ
బోషణంబు సేయఁ బూర్ణుఁ డయ్యెను ధర్మ
టలపాలకుండు బాలకుండు

టీకా:

కళల = చంద్ర కళల; చేతన్ = వలన; రాజు = చంద్రుడు; క్రమమునన్ = క్రమముగ; పరిపూర్ణుడు = పూర్ణ చంద్రుడు; అయిన = అయిన; భంగిన్ = విధముగ; తాతలు = పితామహులు; అనుదినంబున్ = ప్రతిరోజు; పోషణంబు = పోషణ; చేయన్ = చేయుచుండగ; పూర్ణుండు = పరిపూర్ణుండు; అయ్యెను = ఆయెను; ధర్మ = ధర్మముల; పటల = సమూహమునకు; పాలకుండు = పరిపాలకుడు; బాలకుండు = బాలుడు.

భావము:

తాతలు దినదినమూ అనురాగంతో పెంచి పెద్దచేయగా ఆ బాలకుడు, షోడశకళలచేత పరిపూర్ణుడైన చంద్రునివలే క్రమంగా వృద్ధిపొందసాగాడు.

1-299-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు ధర్మనందనుండు బంధు సంహారదోషంబు వాయుకొఱకు నశ్వమేధయాగంబు సేయం దలఁచి, ప్రజలవలనం గరదండంబుల నుపార్జితం బయిన విత్తంబు సాలక చిత్తంబునఁ జింతించు నెడ; నచ్యుతప్రేరితులై భీమార్జునాదులు, దొల్లి మరుత్తుండను రాజు మఖంబు సేసి పరిత్యజించి నిక్షేపించిన సువర్ణ పాత్రాదికంబైన విత్తం బుత్తరదిగ్భాగంబువలన బలవంతులై తెచ్చిన; నా రాజసత్తముండు సమాయత్త యజ్ఞోపకరణుండై సకలబంధు సమేతంబుగఁ గృష్ణుని నాహ్వానంబు సేసి, పురుషోత్తము నుద్దేశించి మూడు జన్నంబులు గావించెఁ; దదనంతరంబ కృష్ణుండు బంధుప్రియంబు కొఱకుఁ గరి నగరంబునఁ గొన్ని నెల లుండి ధర్మపుత్రాదులచే నామంత్రణంబు పడసి యాదవ సమేతుం డయి ధనుంజయుడు దోడరా నిజనగరంబునకుం జనియె; నంతకు మున్ను విదురుండు తీర్థయాత్ర సని మైత్రేయు ముందటఁ గర్మయోగవ్రతాది విషయంబు లయిన ప్రశ్నంబులఁ కొన్నింటిం జేసి, యతనివలన నాత్మవిజ్ఞానంబు దెలిసి, కృతార్థుండై హస్తినాపురంబునకు వచ్చిన.

టీకా:

మఱియు = ఇంకా; ధర్మనందనుండు = ధర్మరాజు; బంధు = బంధువులను; సంహార = సంహరించిన; దోషంబు = దోషము; పాయు = పోగొట్టుకొనుట; కొఱకున్ = కోసము; అశ్వమేధ = అశ్వమేధ; యాగంబు = యజ్ఞము; చేయన్ = చేయ వలనని; తలఁచి = నిశ్చయించుకొని; ప్రజల = ప్రజల; వలనన్ = వలన; కరదండంబులు = కానుకలు కప్పములు రూపములో; ఉపార్జితంబు = ఆర్జింపబడినది; అయిన = అయినట్టి; విత్తంబు = ధనము; చాలక = చాలక; చిత్తంబునన్ = మనసులో; చింతించు = విచారించు; ఎడన్ = సమయమున; అచ్యుత = కృష్ణునిచే; ప్రేరితులు = ప్రేరింపబడిన వారు; ఐ = అయి; భీమ = భీముడు; అర్జున = అర్జునుడు; ఆదులు = మొదలగు వారు; తొల్లి = పూర్వము; మరుత్తుండు = మరుత్తుడు; అను = అని పేరు కల; రాజు = రాజు; మఖంబు = యజ్ఞము; చేసి = చేసి; పరిత్యజించి = వదిలివేసి; నిక్షేపించిన = భూమిలో దాచిన, నిధి; సువర్ణ = బంగారు; పాత్ర = పాత్రలు; ఆదికంబు = మొదలైనవి; ఐన = అయిన; విత్తంబున్ = ధనము; ఉత్తర = ఉత్తరపు; దిక్ = దిక్కు; భాగంబు = వైపు భూభాగము; వలనన్ = నుండి; బలవంతులు = బలము కలవారు; ఐ = అయి; తెచ్చినన్ = తీసుకొని వచ్చిన; ఆ = ఆ; రాజ = రాజులలో; సత్తముండు = శ్రేష్ఠుడు; సమాయత్త = కూర్చుకొనబడిన; యజ్ఞ = యజ్ఞమునకు కావలసిన; ఉపకరణుండు = పరికరములు కలవాడు; ఐ = అయి; సకల = సమస్త; బంధు = బంధువులతో; సమేతంబుగన్ = కలుపుకొని; కృష్ణుని = కృష్ణుని; ఆహ్వానంబు = ఆహ్వానము; చేసి = చేసి; పురుషోత్తమున్ = పురుషోత్తముని; ఉద్దేశించి = కొఱకు; మూడు = మూడు; జన్నంబులు = యజ్ఞములు; కావించెన్ = నిర్వహించెను; తత్ = ఆ; అనంతరంబ = తరువాత; కృష్ణుండు = కృష్ణుడు; బంధు = బంధువులకు; ప్రియంబు = ప్రీతి కలిగించుట; కొఱకున్ = కోసము; కరినగరంబునన్ = హస్తినాపురములో; కొన్ని = కొన్ని; నెలలు = నెలలు; ఉండి = ఉండి; ధర్మపుత్ర = ధర్మరాజు {ధర్మపుత్రుడు - యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు}; ఆదుల = మొదలగువారు; చేన్ = చేత; ఆమంత్రణంబు = అనుమతి; పడసి = పొంది; యాదవ = యాదవులతో; సమేతుండు = కూడిన వాడు; అయి = అయి; ధనుంజయుడు = అర్జునుడు; తోడ = తోడు; రాన్ = రాగా; నిజ = తనయొక్క; నగరంబు = నగరము; కున్ = కు; చనియెన్ = వెళ్లెను; అంతకు = అంతకన్న; మున్ను = ముందు; విదురుండు = విదురుడు; తీర్థయాత్ర = పుణ్యస్థలములను సేవించుటకు; చని = వెళ్ళి; మైత్రేయు = మైత్రేయుని; ముందటన్ = ఎదురుగ; కర్మయోగ = కర్మయోగమును; వ్రత = వ్రతములును; ఆది = మొదలగు; విషయంబులు = విషయములను గురించినవి; అయిన = అయినట్టి; ప్రశ్నంబులన్ = ప్రశ్నలను; కొన్నింటిన్ = కొన్నిటిని; చేసి = వేసి; అతని = అతని; వలనన్ = వలన; ఆత్మ = ఆత్మ పరమాత్మ ల గురించిన; విజ్ఞానంబున్ = విజ్ఞానమును; తెలిసి = తెలిసికొని; కృతార్థుండు = ధన్యుడు; ఐ = అయి; హస్తినాపురంబు = హస్తినాపురము; కున్ = కు; వచ్చిన = రాగా.

భావము:

తర్వాత ధర్మనందనుడు చుట్టాలను చంపిన పాపం పోగొట్టుకోవటం కోసం అశ్వమేధయజ్ఞం చేయాలనుకొన్నాడు. పన్నుల రూపంలోనూ, శిక్షలరూపంలోనూ ప్రజలనుంచి రాబట్టిన ధనం సరిపోదే అని అతడు విచారించసాగాడు. అప్పుడు పూర్వం మరుత్త మహారాజు యజ్ఞంచేసి మిగిలిన ధనాన్ని భూమిలో నిక్షేపించాడని విని శ్రీకృష్ణభగవానునిచే ప్రేరితులైన భీమార్జునులు ఉత్తరానికి వెళ్లి సువర్ణరాసులు కొని తెచ్చారు. అనంతరం రాజవరేణ్యుడైన ధర్మనందనుడు యజ్ఞానికి కావలసిన ఉపకరణాలన్నీ సిద్ధంచేసుకొన్నాడు. శ్రీకృష్ణుణ్ణి బంధుసమేతంగా ఆహ్వానించాడు. పురుషోత్తముణ్ణి యజ్ఞపురుషుడుగా భావించి మూడు అశ్వమేధాలు కావించాడు. ఆ తర్వాత గోవిందుడు బంధువులైన పాండవుల సంతోషంకోసం హస్తినానగరంలో కొన్ని మాసాలపాటు ఉన్నాడు. అనంతరం ఆయన పాండవులను వీడ్కొని సకలబంధు సమేతుడై, అర్జునుణ్ణి వెంటబెట్టుకొని ద్వారకా నగరానికి వెళ్లిపోయాడు. కొంతకాలానికి తీర్థయాత్రలకని బయలదేరిన విదురుడు మైత్రేయ మహాముని సన్నిధి చేరుకొన్నాడు. కర్మాలు, యోగాలు, వ్రతాలు మొదలైన అంశాలపై ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి కావించుకొన్నాడు. పరమార్థజ్ఞానం సంపాదించిన విదురుడు కృతార్థుడై తిరిగి హస్తినకు అరుదెంచాడు.