పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పూర్ణి

  •  
  •  
  •  

10.1-1790-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కులయరక్షాతత్పర!
కులయదళ నీలవర్ణ కోమలదేహా!
కులయనాథ శిరోమణి!
కులయజన వినుత విమలగుణ సంఘాతా!

టీకా:

కువలయరక్షాతత్పర = శ్రీరామా {కువలయ రక్షా తత్పరుడు - కు (భూమి) వలయ (మండలమును) రక్షా (కాపాడుట యందు) తత్పరుడు (ఆసక్తి కలవాడు), శ్రీరాముడు}; కువలయదళనీలవర్ణకోమలదేహా = శ్రీరామా {కువలయ దళ నీలవర్ణ కోమల దేహుడు - కువలయ (నల్లకలువ) యొక్క దళ (రేకులవంటి) వర్ణ (రంగు కలిగిన) కోమల (మృదువైన) దేహుడు (శరీరము కలవాడు), శ్రీరాముడు}; కువలయనాథశిరోమణి = శ్రీరామా {కువలయనాథ శిరోమణి - కు (భూమి) వలయ(మండలమును) నాథ (ఏలువారిలో) శిరోమణి (తలమీది మణివలె శ్రేష్ఠమైన వాడు), శ్రీరాముడు}; కువలయజనవినుత = శ్రీరామా {కువలయజన వినుత - కువలయ (భూమండలము యొక్క) జన (సర్వ ప్రజలచేత) వినుత (స్తుతింపబడువాడు), శ్రీరాముడ}; విమలగుణసంఘాతా = శ్రీరామా {విమల గుణ సంఘాతుడు - విమల (స్వచ్ఛమైన) గుణ (సుగుణముల) సంఘాత (సమూహములు కలవాడు), శ్రీరాముడు}.

భావము:

భూమండలాన్ని రక్షించటంలో ఆసక్తి కలవాడా! కలువ రేకుల వంటి నల్లని కాంతితో విరాజిల్లే మృదువైన దేహం కలవాడా! భూమండలంలోని భూపతు లందరికి శిరోభూషణ మైన వాడా! పుడమి మీదనుండే జనులందరిచే పొగడబడే సుగుణాల సమూహం కలవాడా! శ్రీ రామచంద్ర ప్రభో! నీకు వందనం.
ఈ శ్రీరాముని ప్రార్థనలోని చమత్కర మాధుర్యం తొణికిసలాడుతోంది. కువలయ అని నాలుగు పాదాలు ఆరంభిస్తు లోకం, కలువలు, రాజులు, మానవులు అని నాలుగు రకాల అర్థబేధంతో యమకం పండించిన తీరు అద్భుతం. రెండు గాని అంతకంటె ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు, అర్థభేదం కలిగి, మరల మరల వస్తూ ఉంటే యమకాలంకారం.

10.1-1791-మాలి.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సిజనిభ హస్తా! ర్వలోక ప్రశస్తా!
నిరుపమ శుభమూర్తీ! నిర్మలారూఢ కీర్తీ!
హృదయ విదారీ! క్తలోకోపకారీ!
గురు బుధజన తోషీ! ఘోరదైతేయ శోషీ!

టీకా:

సరసిజనిభహస్తా = శ్రీరామా {సరసిజనిభహస్తుడు - సరసిజ (పద్మము) నిభ (వంటి) హస్తుడు (అరచేతులు కలవాడు), శ్రీరాముడు}; సర్వలోకప్రశస్తా = శ్రీరామా {సర్వలోకప్రశస్తుడు - సర్వ (సమస్తమైన) లోక (లోకములలోను) ప్రశస్తుడు (శ్లాఘింపబడువాడు), శ్రీరాముడు}; నిరుపమశుభమూర్తీ = శ్రీరామా {నిరుపమశుభమూర్తి - నిరుపమ (సాటిలేని) శుభ (మేళ్ళు కలిగించెడి) మూర్తి (ఆకృతి కలవాడు), శ్రీరాముడు}; నిర్మలారూఢకీర్తీ = శ్రీరామా {నిర్మలారూఢకీర్తి - నిర్మల (పరిశుద్ధమైన) ఆరూఢ (నిలకడైన) కీర్తి (కీర్తి కలవాడు), శ్రీరాముడు}; పరహృదయవిదారీ = శ్రీరామా {పరహృదయవిదారి - పర (విరోధుల) హృదయ (గుండెలను) విదారి (చీల్చెడి వాడు), శ్రీరాముడు}; భక్తలోకోపకారీ = శ్రీరామా {భక్తలోకోపకారి - భక్తులను లోక (ఎల్లరకు) ఉపకారి (ఉపకారము చేయువాడు), శ్రీరాముడు}; గురుబుధజనతోషీ = శ్రీరామా {గురుబుధజనతోషి - గురు (గొప్ప) బుధ (ఙ్ఞానము కల) జన (వారికి) తోషి (సంతోషము కలిగించు వాడు), శ్రీరాముడు}; ఘోరదైతేయశోషీ = శ్రీరామా {ఘోరదైతేయశోషి - ఘోర (క్రూరమైన) దైతేయ (రాక్షసులను) శోషి (నశింపజేయు వాడు), శ్రీరాముడు}.

భావము:

పద్మాల వంటి హస్తములు కలవాడా! ఎల్లలోకాలలోను శ్రేష్ఠతమమైన వాడా! సాటిలేని మంగళ స్వరూపము కలవాడా! స్వచ్ఛమైన వన్నెకెక్కిన కీర్తి కలవాడా! శత్రువుల గుండెలను ఖండించు వాడా! భక్త సమూహానికి మేలు చేయువాడా! పెద్దలను, పండితులను సంతోషపరచేవాడా! భయంకరులైన రక్కసులను నాశనము చేయువాడా! శ్రీరామచంద్రప్రభూ! వందనములు.

10.1-1792-గ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

pothana at bammera
ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బయిన శ్రీమహాభాగతం బను మహాపురాణంబు నందు దేవకీదేవి వివాహంబును; గగనవాణీ శ్రవణంబును; గంసోద్రేకంబును; వసుదేవ ప్రార్థనయును; యోగమాయా ప్రభావంబును; బలభద్రుని జన్మంబును; బ్రహ్మాది సుర స్తోత్రంబును; గృష్ణావతారంబును; ఘోష ప్రవేశంబును; యోగనిద్రా చరితంబును; నంద పుత్రోత్సవంబును; బూతనా సంహారంబును; శకట భంజనంబును; దృణావర్తు మరణంబును; గ ర్గాగమనంబును; నారాయణాది నామ నిర్దేశంబును; బాలక్రీడయును; మృ ద్భక్షణంబును; వాసుదేవ వదనగహ్వర విలోక్యమా నాఖిల లో కాలోకనంబును; నవనీత చౌర్యంబును, యశోదా రోషంబు; నులూఖల బంధనంబు; నర్జునతరుయుగళ నిపాతనంబును; నలకూబర మణిగ్రీవుల శాప మోక్షణంబును; బృందావన గమనంబును; వత్స పాలనంబును; వత్సాసుర వధయును; బకదనుజ విదారణంబు; నఘాసుర మరణంబును; వ త్సాపహరణంబును; నూతన వత్స బాలక కల్పనంబును; బ్రహ్మ వినుతియు; గో పాలకత్వంబును; గార్దభాసుర దమనంబును; కాళియ ఫణి మర్దనంబును; గరుడ కాళియ నాగ విరోధ కథనంబును; బ్రలంబాసుర హింసనంబును; దవానల పానంబును; వర్షర్తు వర్ణనంబును; శరత్కాల లక్షణంబును; వేణు విలాసంబును; హేమంత సమయ సమాగమంబును; గోపక న్యాచరిత హవిష్య వ్రతంబును; గాత్యాయనీ సేవనంబును; వల్లవీ వస్త్రాపహరణంబును; విప్రవనితా దత్తాన్న భోజనంబు; నింద్రయాగ నివారణంబును; నంద ముకుంద సంవాదంబును; పర్వత భజనంబును; బాషాణ సలిల వర్షంబును; గోవర్ధ నోద్ధరణంబును; వరుణకింకరుండు నందుని గొనిపోయిన హరి తెచ్చుటయును; వేణు పూరణంబును; గోపికాజన ఘోష నిర్గమంబును; యమునాతీర వన విహరణంబును; గృ ష్ణాంతర్ధానంబును; ఘోషకామనీ గ ణాన్వేషణంబును; గోపికా గీతలును; హరి ప్రసన్నతయును; రాస క్రీడనంబును; జలకేళియును, సర్పరూపకుం డైన సుదర్శన విద్యాధరుండు హరిచరణ తాడనంబున నిజరూపంబు పడయుటయును; శంఖచూడుం డను గుహ్యకుని వధించుటయును; వృషభాసుర విదళనంబును; నారదోపదేశంబున హరి జన్మకథ నెఱంగి కంసుండు దేవకీవసుదేవుల బద్ధులం జేయుటయును; ఘోటకాసురుం డైన కేశియను దనుజుని వధియించుటయును; నారద స్తుతియును; వ్యోమదానవ మరణంబు; నక్రూ రాగమంబు; నక్రూర రామకృష్ణుల సల్లాపంబును; ఘోష నిర్గమంబును; యమునా జలాంతరాళంబున నక్రూరుండు హరి విశ్వరూపంబును గాంచుటయు; నక్రూర స్తవంబును; మథురానగర ప్రవేశంబును; రజక వధయును; వాయక మాలికులచే సమ్మానంబు నొందుటయును; కుబ్జా ప్రసాద కరణంబును; ధను ర్భంగంబును; గంసు దుస్వప్నంబును; గువలయాపీడ పీడనంబును; రంగస్థల ప్రవేశంబును; జాణూర ముష్టికుల వధయును; గంస వధయును; వసుదేవదేవకీ బంధ మోక్షణంబు; నుగ్రసేను రాజ్య స్థాపనంబును; రామకృష్ణులు సాందీపుని వలన విద్య లభ్యసించుటయును; సంయమనీ నగర గమనంబును; గురుపుత్ర దానంబు; నుద్ధవుని ఘోష యాత్రయును; భ్రమరగీతలును; గు బ్జావాస గమనంబును; గరినగరంబునకు నక్రూరుండు చని కుంతీదేవి నూరార్చుటయును; గంసభార్య లగు నస్తి ప్రాస్తులు జరాసంధునకుఁ గంసు మరణం బెఱింగించుటయును; జరాసంధుని దండయాత్రయును; మథురానగర నిరోధంబును; యుద్ధంబున జరాసంధుండు సప్తదశ వారంబులు పలాయితుం డగుటయును; నారద ప్రేరితుండై కాలయవనుండు మథురపై దాడివెడలుటయును; ద్వారకానగర నిర్మాణంబును; మథురాపుర నివాసులం దన యోగబలంబున హరి ద్వారకానగరంబునకుం దెచ్చుటయును; కాలయవనుడు హరి వెంటజని గిరిగుహ యందు నిద్రితుండైన ముచికుందుని దృష్టి వలన నీఱగుటయును; ముచికుందుండు హరిని సంస్తుతి చేసి తపంబునకుం జనుటయును; జరాసంధుండు గ్రమ్మఱ రామకృష్ణులపై నేతెంచుటయును; బ్రవర్షణ పర్వతారోహణంబును; గిరి దహనంబును; గిరి డిగ్గనుఱికి రామకృష్ణులు ద్వారకకుం జనుటయును; రుక్మిణీ జననంబును; రుక్మిణీ సందేశంబును; వాసుదే వాగమనంబును; రుక్మిణీ గ్రహణంబును; రాజలోక పలాయనంబును; రుక్మి యనువాని భంగంబును; రుక్మిణీ కల్యాణంబును యను కథలుఁ గల దశమస్కంధంబు నందుఁ బూర్వభాగము సమాప్తము.

టీకా:

ఇది = ఇది; శ్రీ = సంపత్కరమైన; పరమేశ్వర = భగవంతుని; కరుణా = దయతో; కలిత = జన్మించిన; కవితా = కవిత్వము చెప్పుటలో; విచిత్ర = అద్భుతమైనవాడు; కేసనమంత్రి = కేసనమంత్రి; పుత్ర = కుమారుడు; సహజ = సహజసిద్ధముగ; పాండిత్య = పాండిత్యము కలవాడు; పోతన = పోతన; అమాత్య = మంత్రిచేత; ప్రణీతంబు = చెప్పబడినది; అయిన = ఐన; శ్రీ = గొప్పదైన; మహాభాగవతము = మహాభాగవతము; అను = అనెడి; మహా = గొప్ప; పురాణంబున్ = పురాణము; అందున్ = లో; దేవకీదేవి = దేవకీదేవి యొక్క; వివాహంబును = పెండ్లి; గగనవాణీ = ఆకాశవాణి యొక్క; శ్రవణంబునున్ = పలుకుటలు; కంస = కంసుని యొక్క; ఉద్రేకంబును = ఉద్రేకము; వసుదేవ = వసుదేవుని; ప్రార్థనయును = ప్రార్థన; యోగమాయా = యోగమాయ యొక్క; ప్రభావంబును = ప్రభావము; బలభద్రుని = బలరాముని; జన్మంబును = పుట్టుక; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగు; సుర = దేవతల; స్తోత్రంబునున్ = స్తోత్రము; కృష్ణా = కృష్ణుని యొక్క; అవతారంబును = పుట్టుట; ఘోషప్రవేశంబును = వ్రేపల్లను; ప్రవేశంబును = జేరుట; యోగనిద్రా = యోగనిద్ర (మాయాదేవి); చరితంబును = చరిత్ర; నంద = నందుని; పుత్ర = పుత్రుడు కలిగిన; ఉత్సవంబును = ఉత్సాహము; పూతన = పూతనను; సంహారంబును = చంపుట; శకట = శకటాసురుని; భంజనంబు = చంపుట; తృణావర్తు = తృణావర్తుని; మరణంబును = చావు; గర్గ = గర్గమహర్షి; ఆగమనంబును = వచ్చుట; నారాయణ = నారాయణుడు; ఆది = మున్నగు; నామ = నామములను; నిర్దేశంబును = నిర్ధారించుట; బాల = బాలునిగా; క్రీడయును = క్రీడించుట; మృత్ = మట్టి; భక్షణంబును = తినుట; వాసుదేవ = కృష్ణుని; వదనగహ్వరన్ = నోటి యందు; విలోక్యమాన = కనబడుచున్న; అఖిల = సమస్తమైన; లోక = లోకములను; ఆలోకనంబును = చూచుట; నవనీత = వెన్నను; చౌర్యంబును = దొంగిలించుట; యశోదా = యశోదాదేవి యొక్క; రోషంబును = కోపము; ఉలూఖల = రోటికి; బంధనంబునున్ = కట్టుట; అర్జున = మద్ది; తరు = చెట్ల; యుగళ = జంటను; నిపాతనంబును = పడగొట్టుట; నలకూబర = నలకూబరుని; మణిగ్రీవుల = మణిగ్రీవుల యొక్క; శాప = శాపము నుండి; మోక్షణంబును = విముక్తి; బృందావన = బృందావనమునకు; గమనంబును = వెళ్ళుట; వత్స = దూడలను; పాలనంబు = మేపుట; వత్స = వత్స ఆకృతిని వచ్చిన; అసుర = రాక్షసుని; వధయును = చంపుట; బక = బకుడు అను; దనుజ = రాక్షసుని; విదారణంబును = చంపుట; అఘాసుర = అఘాసురుని యొక్క; మరణంబును = చావు; వత్సా = దూడలు గోపబాలకులను; అపహరణంబును = దొంగిలించుట; నూతన = సరికొత్త; వత్స = దూడలు; బాలక = పిల్లల; కల్పనంబు = పుట్టించుడ; బ్రహ్మ = బ్రహ్మదేవుని; వినుతియున్ = స్తోత్రము; గో = ఆవులను; పాలకత్వంబును = పాలించుట; గార్దభాసురున్ = గార్దభరాక్షసుని; దమనంబును = శిక్షించుట; కాళియ = కాళియుడను; ఫణి = పాము; మర్దనంబును = మర్ధించుట; గరుడ = గరుడుడు; కాళియు = కాళీయుడను; నాగ = సర్పము; విరోధ = శత్రుత్వము యొక్క; కథనంబును = కథ; ప్రలంబ = ప్రలంబుడను; అసుర = రాక్షసుని; హింసనంబును = చంపుట; దవానల = కార్చిచ్చును; పానంబును = తాగివేయుట; వర్షర్తు = వర్షఋతువు; వర్ణనంబును = వర్ణించుట; శరత్కాల = శరదృతువు యొక్క; లక్షణంబును = వర్ణించుట; వేణు = మురళితో; విలాసనంబును = విహరించుటలు; హేమంత = హేమంత ఋతువు; సమయ = సమయమునందు; సమాగమంబును = కలియుట; గోపకన్యా = గోపికలచే; చరిత = ఆచరింపబడిన; హవిష్య = హవిష్యము అను; వ్రతంబును = వ్రతము; కాత్యాయనీ = కాత్యాయనీ దేవి; సేవనంబును = పూజించుట; వల్లవీ = గొల్లపడచుల; వస్త్ర = బట్టలను; అపహరణంబును = దొంగిలించుట; విప్ర = బ్రాహ్మణ; వనితా = స్త్రీలచేత; దత్త = ఇవ్వబడిన; అన్న = అన్నమును; భోజనంబును = తినుట; ఇంద్రయోగ = ఇంద్రయోగమును; నివారణంబును = ఆపుట; నంద = నందుని; ముకుంద = కృష్ణుల; సంవాదంబును = సంభాషణ; పర్వత = కొండకు; భజనంబును = పూజించుట; పాషాణ = బండరాళ్ళ; సలిల = నీటి; వర్షంబునున్ = వాన; గోవర్ధన = గోవర్ధన పర్వతమును; ఉద్ధరణంబును = పైకి ఎత్తుట; వరుణ = వరుణుని; కింకరుండు = సేవకుడు; నందునిన్ = నందుడిని; కొనిపోయినన్ = తీసుకుపోగా; హరి = కృష్ణుడు; తెచ్చుటయును = తీసుకొని వచ్చుట; వేణు = మురళిని; పూరణంబును = ఊదుట; గోపికా = గొల్లభామల; జన = సమూహము; ఘోష = వ్రేపల్లెను; నిర్గమంబును = వెడలుట; యమునా = యమునానది యొక్క; తీర = ఒడ్డున ఉన్న; వన = అడవిలో; విహరణంబును = విహరించుటలు; కృష్ణ = కృష్ణుని; అంతర్ధానంబును = మాయమగుట; ఘోషకామినీ = గోపికల; గణ = సమూహము యొక్క; అన్వేషణంబును = వెదకుట; గోపికా = గోపికల; గీతలును = పాటలు; హరి = కృష్ణుని యొక్క; ప్రసన్నతయును = ప్రసన్నము; రాసక్రీడనంబును = రాసక్రీడ ఆడుట; జల = నీటిలో; కేళియును = క్రీడించుట; సర్ప = పాము; రూపకుండు = రూపము కలవాడు; ఐన = అయినట్టి; సుదర్శన = సుదర్శనుడు అను; విద్యాధరుండు = విద్యాధరుడు; హరి = కృష్ణుని; చరణ = పాదము యొక్క; తాడనంబునన్ = తాకుడుచేత; నిజరూపంబున్ = తన స్వరూపమును; పడయుటయును = పొందుట; శంఖచూడుండు = శంఖచూడుడు; అను = అనెడి; గుహ్యకుని = గుహ్యకుడిని; వధించుటయునున్ = చంపుట; వృషభ = వృషభుడు అను; అసురన్ = రాక్షసుని; విదళనంబును = చంపుట; నారద = నారదుని యొక్క; ఉపదేశంబునన్ = చెప్పిన ప్రకారము; హరి = కృష్ణుని; జన్మ = పుట్టుక; కథన్ = వృత్తాంతము; ఎఱింగి = తెలిసి; కంసుండు = కంసుడు; దేవకీ = దేవకీదేవి; వసుదేవులన్ = వసుదేవుడులను; బద్ధులన్ = బంధింపబడినవారిగా; చేయుటయును = చేయుట; ఘోటకాసురుండు = అశ్వాసురుడు; ఐన = అయిన; కేశి = కేశి; అను = అనెడి; దనుజుని = రాక్షసుని; వధియించుటయును = చంపుట; నారద = నారదుడు చేసిన; స్తుతియును = స్తోత్రము; వ్యోమదానవ = వ్యోమాసురుని; మరణంబును = చావు; అక్రూర = అక్రూరుని; ఆగమనంబును = రాక; అక్రూర = అక్రూరుడు; రామ = బలరాముడు; కృష్ణుల = కృష్ణుడుల; సల్లాపంబును = సంభాషణము; ఘోష = వ్రేపల్లెనుండి; నిర్గమంబును = వెడలుట; యమునా = యమునా నది యొక్క; జల = నీటి; అంతరాళంబునన్ = లోపల; అక్రూరుండు = అక్రూరుడు; హరి = విష్ణుమూర్తి యొక్క; విశ్వరూపంబును = విశ్వరూపమును; కాంచుటయున్ = చూచుట; అక్రూర = అక్రూరుడు చేసిన; స్తవంబునున్ = స్తోత్రము; మథురానగర = మథురాపురమును; ప్రవేశంబును = ప్రవేశించుట; రజక = రజకుని; వధయును = చంపుట; వాయక = బట్టలునేయువాని; మాలికుల = మాలాకారుల; చేన్ = చేత; సమ్మానంబును = సన్మానించుట; ఒందుటయును = పొందుట; కుబ్జా = కుబ్జను; ప్రసాదకరణంబును = అనుగ్రహించుట; ధనుః = విల్లును; భంగంబునున్ = విరుచుట; కంసు = కంసుని యొక్క; దుస్వప్నంబును = దుస్వప్నములు; కువలయాపీడ = కువలయాపీడ గజమును; పీడనంబును = చంపుట; రంగస్థల = మల్లయుద్ధ క్షేత్రమును; ప్రవేశంబును = ప్రవేశించుట; చాణూర = చాణూరుడు; ముష్టికుల = ముష్టికుడులను; వధయును = చంపుట; కంస = కంసుని; వధయును = చంపుట; వసుదేవ = వసుదేవుని; దేవకీ = దేవకీదేవిల యొక్క; బంధ = బంధములను; మోక్షణంబును = విడిపించుట; ఉగ్రసేనున్ = ఉగ్రసేనుని; రాజ్య = రాజ్యపాలనను; స్థాపనంబును = స్థిరపరచుట; రామ = బలరాముడు; కృష్ణులు = కృష్ణులు; సాందీపుని = సాందీపుని; వలన = నుండి; విద్యన్ = విద్యలను; అభ్యసించుట = నేర్చుకొనుట; సంయమనీనగర = సంయమనీ పురమునకు; గమనంబును = వెళ్ళుట; గురు = గురువునకు; పుత్ర = కొడుకును; దానంబును = ఇచ్చుట; ఉద్ధవుని = ఉద్ధవుడి; ఘోష = వ్రేపల్లె; యాత్రయును = వెళ్లుట; భ్రమరగీతలును = భ్రమరగీతలు; కుబ్జ = కుబ్జ యొక్క; ఆవాస = ఇంటికి; గమనంబును = వెళ్లుట; కరినగరంబున్ = హస్తినాపురమున; కున్ = కు; అక్రూరుండు = అక్రూరుడు; చని = వెళ్ళి; కుంతీదేవిని = కుంతిని; ఊరార్చుటయును = ఊరుకోబెట్టుట; కంస = కంసుని; భార్యలు = భార్యలు; అగు = ఐన; అస్తి = అస్తి; ప్రాస్తులు = ప్రాస్తులు; జరాసంధున్ = జరాసంధుని; కంసు = కంసుని; మరణంబున్ = చావును; ఎఱింగించుటయును = తెలుపుట; జరాసంధుని = జరాసంధుడి; దండయాత్రయును = దండయాత్ర; మథురానగర = మథురాపురమును; నిరోధంబును = చుట్టుముట్టుట; యుద్ధంబును = యుద్ధము; జరాసంధుండు = జరాసంధుడు; సప్తదశ = పదిహేడు; వారంబులు = పర్యాయంబులు; పలాయితుండు = ఓడినవాడు; అగుటయును = అగుట; నారద = నారదునిచేత; ప్రేరితుండు = ప్రేరింపబడినవాడు; ఐ = అయ్యి; కాలయవనుండు = కాలయవనుడు; మథుర = మథురాపురము; పైన్ = మీద; దాడి = యుద్ధమునకు; వెడలుటయునున్ = వెళ్ళుట; ద్వారకానగర = ద్వారకాపురమును; నిర్మాణంబును = కట్టుటు; మథురాపుర = మథురాపురములోని; నివాసులన్ = ఉండువారిని; తన = అతని యొక్క; యోగబలంబునన్ = యోగశక్తిచేత; హరి = కృష్ణుడు; ద్వారకానగరంబున్ = ద్వారకాపురమున; కున్ = కు; తెచ్చుటయును = తీసుకు వచ్చుట; కాలయవనుడు = కాలయవనుడు; హరి = కృష్ణుని; వెంటన్ = వెనుక; చని = వెళ్ళి; గిరి = కొండ; గుహ = గుహ; అందున్ = లోపల; నిద్రితుండు = నిద్రించినవాడు; ఐన = అయిన; ముచికుందుని = ముచికుందుడి యొక్క; దృష్టి = దృష్టి; వలన = వలన; నీఱగుటయును = బూడిదైపోవుట; ముచికుందుండు = ముచికుందుడు; హరిని = కృష్ణుని; సంస్తుతి = స్తోత్రము; చేసి = చేసి; తపంబున్ = తపస్సుచేసికొనుటకు; చనుటయును = వెళ్ళుట; జరాసంధుండు = జరాసంధుడు; క్రమ్మఱ = మరల; రామ = బలరాముడు; కృష్ణుల = కృష్ణుల; పైన్ = మీదకు; ఏతెంచుటయును = వచ్చుట; ప్రవర్షణ = ప్రవర్షణము అను; పర్వత = కొండను; ఆరోహణంబును = ఎక్కుట; గిరిన్ = కొండను; దహనంబును = కాల్చివేయుట; గిరిన్ = కొండను; డిగ్గన్ = దిగి; ఉఱికి = పారిపోయి; రామ = బలరాముడు; కృష్ణులు = కృష్ణులు; ద్వారక = ద్వారకాపురమున; కున్ = కు; చనుటయును = వెళ్ళుట; రుక్మిణీ = రుక్మిణిదేవి యొక్క; జననంబును = పుట్టుక; రుక్మిణీ = రుక్మిణిదేవి పంపిన; సందేశంబును = సందేశము; వాసుదేవ = కృష్ణుని; ఆగమనంబును = రాక; రుక్మిణీ = రుక్మిణీదేవిని; గ్రహణంబును = అపహరించుట; రాజ = రాజుల; లోక = సమూహము యొక్క; పలాయనంబును = పారిపోవుట; రుక్మి = రుక్మి; అనువాని = అనెడి వాడి; భంగంబునున్ = అవమానముపొందుట; రుక్మిణీ = రుక్మణీదేవితో; కల్యాణంబును = పెండ్లి; అను = అనెడి; కథలు = కథలు; కల = కలిగిన; దశమ = పదవ; స్కంధంబు = స్కంధము; అందున్ = లో; పూర్వ = ముందరి; భాగము = భాగము; సమాప్తము = పూర్తి అగుట

భావము:

ఇది సంపత్కరమైన భగవంతుని దయతో జనించిన అద్భుత కవితా నిపుణుడు, కేసనమంత్రి పుత్రుడు, సహజ సిద్ధ పాండిత్య ప్రావీణుడు ఐన పోతనామాత్యునిచేత చెప్పబడిన శ్రీ మహాభాగవతము అనెడి గొప్ప పురాణములో దేవకీదేవి వివాహము; ఆకాశవాణి పలుకుట; కంసుని ఉద్రేకము; వసుదేవుని ప్రార్థన; యోగమాయ యొక్క ప్రభావము; బలరాముని జన్మము; బ్రహ్మదేవుడు మొదలగు దేవతల స్తోత్రము; కృష్ణావతారము, వ్రేపల్ల ప్రవేశించుట; యోగ మాయాదేవి చరిత్ర; నందునికి పుత్రుడు కలిగిన ఉత్సాహము; పూతనను చంపుట; శకటాసురుని చంపుట; తృణావర్తుని చావు; గర్గమహర్షి; ఆగమనము; నారాయణుడు మున్నగు నామములను; నిర్ధారించుట; బాలునిగా క్రీడించుట; మృత్ భక్షణము; కృష్ణుని నోటి యందు కనబడుతున్న; సమస్తమైన లోకములను చూచుట; వెన్న దొంగిలించుట; యశోదాదేవి రోషము; రోటికి బంధించుట; మద్ది చెట్ల జంటను పడగొట్టుట; నలకూబరుని మణిగ్రీవుని శాప మోక్షణము; బృందావనమునకు వెళ్ళుట; దూడలను మేపుట; వత్సాసుర వధ; బకాసురుని చంపుట; అఘాసురుని యొక్క చావు; వత్సా గోపబాలకుల అపహరణము; నూతన దూడలు పిల్లల కల్పనము; బ్రహ్మ స్తోత్రము; గోవులను పాలించుట; గార్దభాసురుని దమనము; కాళియ మర్దనము; గరుడ కాళియుల శత్రుత్వ కథ; ప్రలంబాసురుని చంపుట; దవానల పానము; వర్షఋతువు వర్ణన; శరత్కాల వర్ణన; మురళితో విహరించుటలు; హేమంత ఋతు సమాగమము; గోపకన్యలు ఆచరించిన హవిష్యము అను వ్రతము; కాత్యాయనీ దేవి పూజ; గొల్లపడుచుల వస్త్రాపహరణము; విప్ర స్త్రీలచేతి అన్నము భుజించుట; ఇంద్రయాగమును ఆపుట; నంద కృష్ణుల సంభాషణ; గోవర్ధనపర్వత పూజ; పాషాణ సలిల వర్షము; గోవర్ధనగిరి ఉద్ధరణము; వరుణుని సేవకుడు నందుడిని తీసుకుపోగా, కృష్ణుడు తీసుకొని వచ్చుట; మురళిని ఊదుట; గొల్లభామలు వ్రేపల్లెనుండి వెడలి, యమునాతీర వనములో విహరించుట; కృష్ణుడు మాయమగుట; గోపికల కృష్ణాన్వేషణము; గోపికాగీతలు; కృష్ణుడు ప్రసన్న మగుట; రాసక్రీడ ఆడుట; జలకేళి క్రీడించుట; సర్ప రూపి సుదర్శనుడు అను విద్యాధరుడు కృష్ణుని పాదము తాకుడుతో; తన స్వరూపమును పొందుట; శంఖచూడుడు అనెడి గుహ్యకుని చంపుట; వృషభాసురుని చంపుట; నారదుని ఉపదేశం వలన శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతము తెలిసి కంసుడు దేవకీదేవి వసుదేవులను బంధించుట; ఘోటకాసురుడు అయిన కేశిని వధించుట; నారద స్తోత్రము; వ్యోమాసురుని చావు; వ్రేపల్లెకు అక్రూరుని రాక; అక్రూర బలరామ కృష్ణుల సల్లాపములు; ఘోష నిర్గమము; యమునా నదీ జలాలలో అక్రూరుడు విష్ణుమూర్తి విశ్వరూపమును కాంచుట; అక్రూర స్తవము; మథురానగర ప్రవేశము; రజక వధ; బట్టలునేయువాడు మాలాకారులచేత సమ్మానము పొందుట; కుబ్జను అనుగ్రహించుట; విల్లు విరుచుట; కంసుని దుస్వప్నములు; కువలయాపీడ గజమును చంపుట; మల్లరంగము ప్రవేశించుట; చాణూర ముష్టికుల వధ; కంస వధ; వసుదేవ దేవకీదేవిల బంధములను విడిపించుట; ఉగ్రసేనుని రాజ్యపాలనను స్థాపించుట; బలరామ కృష్ణులు సాందీపుని నుండి విద్యలను నేర్చుకొనుట; సంయమనీ పురమునకు వెళ్ళుట; గురుపుత్ర ప్రదానము; ఉద్ధవుని వ్రేపల్లె యా; భ్రమరగీతలు; కుబ్జ ఇంటికి వెళ్లుట; హస్తినాపురమునకు అక్రూరుడు వెళ్ళి కుంతీదేవిని ఊరడించుట; కంసుని భార్యలు ఐన అస్తి ప్రాస్తులు జరాసంధునికి కంసుని మరణము తెలుపుట; జరాసంధుడి దండయాత్ర; మథురానగరం ముట్టడించి, జరాసంధుడు పదిహేడు పర్యాయములు పలాయనం చిత్తగించుట; నారదునిచేత ప్రేరింపబడి కాలయవనుడుమథురాపురముపై దాడిచేయుట; ద్వారకానగరము నిర్మించుట; మథురాపురవాసులను తన యోగశక్తిచేత కృష్ణుడు ద్వారకాపురమునకు చేర్చుట; కాలయవనుడు కృష్ణుని తరుముకుని వెళ్ళి కొండ గుహ లోపల నిద్రించిన ముచికుందుని దృష్టి వలన బూడిదైపోవుట; ముచికుందుడు కృష్ణుని స్తుతించి తపస్సుచేసికొనుటకు చనుట; జరాసంధుడు; మరలబలరామ కృష్ణుల మీదకు వచ్చుట; ప్రవర్షణ పర్వతారోహణము; గిరిని కాల్చివేయుట; కొండను డిగ్గన ఉఱికి బలరామ కృష్ణులు ద్వారకకు చనుట; రుక్మిణీ జననము; రుక్మిణీ సందేశము; కృష్ణుని ఆగమనము; రుక్మిణీదేవిని అపహరించుట; రాజుల పలాయనము; రుక్మి భంగము; రుక్మణీదేవితో కల్యాణము అనెడి కథలు కలిగిన పదవ స్కంధములో పూర్వ భాగము సమాప్తము అగుట.


ఓం నమో భగవతే వాసుదేవాయ!!
ఓం! ఓం! ఓం!
ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!
సర్వే జనా స్సుఖినో భవతు!!