పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నృగుడు యూసరవి ల్లగుట

  •  
  •  
  •  

10.2-476-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని వేగంబున ద్రొబ్బించిన నేను బుడమిం బడునపు డీనికృష్టంబయిన యూసరవెల్లి రూపంబుఁ గైకొంటి; నింతకాలంబు దద్దోష నిమిత్తంబున నిద్దురవస్థం బొందవలసెఁ; బ్రాణులకుఁ బుణ్య పాపంబు లనుభావ్యంబులు గాని యూరక పోనేరవు; నేఁడు సమస్త దురితనిస్తారకంబయిన భవదీయ పాదారవింద సందర్శనంబునం జేసి యీ ఘోరదుర్దశలంబాసి నిర్మలాత్మకుండ నైతి" నని పునఃపునః ప్రణామంబు లాచరించి, మఱియు నిట్లనియె.

టీకా:

అని = అని; వేగంబునన్ = వడిగా; ద్రొబ్బించినన్ = తోయించగా; నేనున్ = నేను; పుడమిన్ = భూమిపై; పడున్ = పడిపోవు; అపుడు = సమయము నందు; ఈ = ఈ; నికృష్టంబు = నీచము; అయిన = ఐన; ఊసరవెల్లి = ఊసరవెల్లి; రూపంబున్ = స్వరూపమును; కైకొంటిని = గ్రహించితిని; ఇంత = ఇన్ని; కాలంబున్ = దినములు; తత్ = ఆ; దోష = పాపము; నిమిత్తంబునన్ = కారణముచేత; ఈ = ఈ; దురవస్థన్ = చెడ్డ అవస్థను; పొందవలసెన్ = అనుభవించ వలసి వచ్చెను; ప్రాణుల్ = జీవుల; కున్ = కు; పుణ్య = పుణ్యకర్మల ఫలము; పాపంబులన్ = పాపకర్మల ఫలము; అనుభావ్యంబులు = అనుభవించవలసినవే; కాని = అంతే తప్పించి; ఊరక = అనుభవించకుండగ; పోనేరవు = తొలగిపోలేవు; నేడు = ఇవాళ; సమస్త = ఎల్ల; దురిత = పాపములను; నిస్తారకంబు = పూర్తిగా దాటించునవి; అయిన = అగు; భవదీయ = నీ యొక్క; పాద = పాదములు అను; అరవింద = పద్మముల; సందర్శనంబునన్ = చూచుట; చేసి = వలన; ఈ = ఈ; ఘోర = భయంకరమైన; దుర్దశలన్ = నీచ అవస్థలను; పాసి = దూరమై; నిర్మల = విమలమైన; ఆత్మకుండను = మనస్సు కలవాడను; ఐతిని = అయ్యాను; అని = అని; పునఃపునః = మళ్ళీమళ్ళీ; ప్రణామంబులు = నమస్కారములు; ఆచరించి = చేసి; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా పలికి యముడు నన్ను అక్కడ నుండి త్రోసివేయించాడు. భూమిపై పడేటప్పుడే నాకు ఈ ఊసరవెల్లి రూపం సంభవించింది. ఇంతకాలం ఆ దోషం పోవడానికే, ఈ దురవస్థ పొందవలసివచ్చింది, ప్రాణులు తమ తమ పుణ్యపాప ఫలాలను రెండింటినీ అనుభవించాలి తప్పదు. అవి ఊరకేపోవు. ఇదిగో ఇవాళ సమస్త దోషాలను పోగొట్టగల నీ పాదపద్మాలను దర్శించడంతో, ఆ ఘోరదుర్దశ నుండి బయటపడ్డాను. నిర్మల హృదయుడను అయ్యాను.” అని నమస్కరించి ఇంకా ఇలా ప్రార్థించాడు.

10.2-477-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కృష్ణ! వాసుదేవ! కేశవ! పరమాత్మ!
ప్రమేయ! వరద! రి! ముకుంద!
నిన్నుఁ జూడఁ గంటి, నీ కృపం గనుగొంటి
ఖిల సౌఖ్యపదవు లందఁ గంటి. "

టీకా:

కృష్ణ = కృష్ణా {కృష్ణుడు - నల్లనివాడు, భక్తుల హృదయములను ఆకర్షించు వాడు}; వాసుదేవ = కృష్ణా {వాసుదేవుడు - సర్వము తన యందు సర్వమునందు తానువసించి ఉండువాడు, విష్ణువు}; కేశవ = కృష్ణా {కేశవుడు - విష్ణువు. వ్యు1. కేశాః ప్రశస్తాః అస్య – కేశ+ వ, త.ప్ర., చక్కని వెంట్రుకలు కలవాడు, వ్యు2. కేశమ్ (కేశి రాక్షసమ్) వాతి – హంతి, కేశ+వా+క, కృ.ప్ర. కేశుడు అను రాక్షసుని సంహరించినవాడు, విష్ణువు, 3.కశ్చ ఈశశ్చ కేశౌ అజ రుద్రౌ – కేశాస్తః సంబంధిత్వేన అస్య – కేశ+వ, త.ప్ర., బ్రహ్మ శివుడు సంబంధులై ఉన్నవాడు}; పరమాత్మ = కృష్ణా {పరమాత్మ - పరబ్రహ్మస్వరూపమున ఉండువాడు, విష్ణువు}; అప్రమేయ = కృష్ణా {అప్రమేయుడు - కొలది తెలియబడని వాడు, అష్టప్రమాణములను మీరినవాడు, విష్ణువు}; వరద = కృష్ణా {వరదుడు - వరములను ఇచ్చువాడు, విష్ణువు}; హరి = కృష్ణా {హరి - భక్తుల పాపములను హరించువాడు, విష్ణువు}; ముకుంద = కృష్ణా {ముకుంద - మోక్షమును ఇచ్చువాడు, విష్ణువు}; నిన్నున్ = నిన్ను {ప్రమాణములు - 1 ప్రత్యక్షము 2అనుమానము 3ఉపమానము 4శాబ్దము 6అర్థాపత్తి 7అనుపలబ్ధి 8ఐతిహ్యము, వీనిలో మొదటి నాలుగు (4) తార్కికుల మతమునందు ఆరు (6) వేదాంతుల మతమునందు ఎనిమిది (8) పౌరాణికుల మతమందు చెల్లును}; చూడగంటి = చూడగలిగితిని; నీ = నీ యొక్క; కృపన్ = దయను; కనుగొంటిన్ = పొందితిని; అఖిల = సర్వ; సౌఖ్య = సుఖవంతమైన; పదవులన్ = స్థితులను; అందగంటి = పొందగలిగితిని.

భావము:

“శ్రీకృష్ణా! వాసుదేవా! కేశవా! పరమాత్మా! అప్రమేయా! వరదా! హరీ! ముకుందా! నిన్ను దర్శించగలిగాను. నీ కృపను పొందగలిగాను. సమస్త సౌఖ్య పదవులను అందుకోగలిగాను.”

10.2-478-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యనేకభంగులం గొనియాడి గోవిందుని పదంబులు దన కిరీటంబు సోఁకం బ్రణమిల్లి “దేవా! భవదీయ పాదారవిందంబులు నా హృదయారవిందంబును బాయకుండునట్లుగాఁ బ్రసాదింపవే?” యని తదనుజ్ఞాతుండై యచ్చటి జనంబులు సూచి యద్భుతానందంబులం బొంద నతుల తేజోవిరాజిత దివ్యవిమానారూఢుండై దివంబున కరిగె; నంత నమ్మాధవుండు నచ్చట నున్న పార్థివోత్తములకు ధర్మబోధంబుగా నిట్లనియె.

టీకా:

అని = అని; అనేక = నానా; భంగులన్ = విధములుగా; కొనియాడి = స్తుతించి; గోవిందున్ = కృష్ణుని {గోవిందుడు - గోవులకు ఒడయుడు, కృష్ణుడు}; పదంబులున్ = పాదములను; తన = తన యొక్క; కిరీటంబున్ = కిరీటము; సోకన్ = తగులునట్లు; ప్రణమిల్లి = నమస్కరించి; దేవా = భగవంతుడా; భవదీయ = నీ యొక్క; పాద = పాదములు అను; అరవిందంబులు = పద్మములు; నా = నా యొక్క; హృదయ = అంతరంగము అను; అరవిందంబున్ = పద్మమును; పాయక = విడువకుండా; ఉండునట్లుగా = ఉండేటట్లుగా; ప్రసాదింపవే = అనుగ్రహింపుము; అని = అని పలికి; తత్ = అతని (కృష్ణుని); అనుఙ్ఞాతుండు = అనుమతి పొందినవాడు; ఐ = అయ్యి; అచ్చటి = అక్కడున్న; జనంబులు = వారు; చూచి = చూసి; అద్భుత = ఆశ్చర్యమును; ఆనందంబులన్ = సంతోషములను; పొందన్ = పొందుతుండగా; అతుల = సాటిలేని; తేజః = తేజస్సుచేత; విరాజిత = విరాజిల్లుచున్న; దివ్య = దేవసంబంధమైన; విమాన = విమానము నందు; ఆరూఢుండు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; దివంబున్ = స్వర్గలోకమున; కున్ = కు; అరిగెన్ = వెళ్ళెను; అంత = అంతట; ఆ = ఆ ప్రసిద్ధుడైన; మాధవుండు = కృష్ణుడు; అచ్చటన్ = అక్కడ; ఉన్న = ఉన్నట్టి; పార్థివ = రాజులలో; ఉత్తములు = శ్రేష్ఠుల; కున్ = కు; ధర్మ = ధర్మమును; బోధంబు = బోధించుట; కాన్ = అగుటకు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా అనేక విధాలుగా స్తుతించి ఆ నృగుడు గోపాల ప్రభువు శ్రీకృష్ణుడి చరణారవిందాలకు నమస్కరించాడు. “దేవా! నీ పాదపద్మాలు నా హృదయ పద్మ మందు స్థిరపడునట్లు అనుగ్రహింపుము.” అని ప్రార్థించాడు. శ్రీకృష్ణుని అనుజ్ఞ గైకొని అక్కడ చేరిన వారందరూ ఆశ్చర్యానందాలు పొందుతుండగా నృగమహారాజు ఒక దివ్యవిమానాన్ని ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న రాకుమార శ్రేష్ఠులకు ఇలా ధర్మబోధ గావించాడు.

10.2-479-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రనాథకుల కానము దహించుటకును-
వనీసురులవిత్త గ్నికీల;
ననాయకుల నిజైశ్వర్యాబ్ధి నింకింప-
బ్రాహ్మణక్షేత్రంబు బాడబంబు;
పార్థివోత్తముల సంచ్ఛైలములఁ గూల్ప-
భూసురధనము దంభోళిధార;
గతీవరుల కీర్తి చంద్రిక మాప వి-
ప్రోత్తము ధనము సూర్యోదయంబు;

10.2-479.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విప్రతతి సొమ్ముకంటెను విషము మేలు
రళమునకును బ్రతికృతి లదు గాని
దాని మాన్పంగ భువి నౌషములు లేవు
గాన బ్రహ్మస్వములు గొంట గాదు పతికి.

టీకా:

నరనాథ = రాజుల; కుల = వంశములు అను; కాననమున్ = అడవిని; దహించుట = కాల్చిబూడిదచేయుట; కునున్ = కు; అవనిసురుల = విప్రుల; విత్తము = ధనము, సంపద; అగ్ని = నిప్పు; కీల = మంట; జననాయకుల = రాజుల; నిజ = స్వంత; ఐశ్వర్య = ఐశ్వర్యము అను; అబ్ధిన్ = సముద్రమును; ఇంకింపన్ = ఆవిరిచేయుటకు; బ్రాహ్మణ = విప్రుల; క్షేత్రంబు = పొలము; బాడబంబు = బడబానలము; పార్థివోత్తముల = రాజోత్తముల; సంపత్ = సంపదలు అను; శైలములన్ = పర్వతములను; కూల్పన్ = పడగొట్టుటకు; భూసుర = విప్రుల; ధనము = ధనము; దంభోళి = వజ్రాయుధము యొక్క; ధార = అంచు, పదును, వాయి; జగతీవరుల = రాజుల యొక్క; కీర్తిన్ = కీర్తి అను; చంద్రికన్ = వెన్నెలను; మాపన్ = తొలగించుటకు; విప్రోత్తము = బ్రాహ్మణశ్రేష్ఠుని; ధనము = ధనము; సూర్యోదయంబు = పొద్దుపొడుపు; విప్ర = బ్రాహ్మణ; తతి = సమూహము యొక్క; సొమ్మున్ = ధనము; కంటెను = కంటె; విషము = విషము; మేలు = మంచిది; గరళమున్ = విషమున; కున్ = నకు; ప్రతికృతి = విరుగుడు; కలదు = ఉన్నది; కాని = కాని; దానిన్ = దానిని; మాన్పంగన్ = తొలగించుటకు; భువిని = భూలోకమున; ఔషధములు = మందులు; లేవు = లేవు; కాన = కాబట్టి; బ్రహ్మస్వములు = విప్రులకు చెందినవానిని; కొంటన్ = తీసుకొనుట; కాదు = పనికిరాదు; పతి = రాజున; కిన్ = కి.

భావము:

రాజవంశం అనే అడవిని దహించే అగ్నిజ్వాల బ్రాహ్మణుల ధనం; జగపతుల ఐశ్వర్యం అనే సముద్రాన్ని ఇంకించే బడబానలం విప్రక్షేత్రం; నరనాథుల సంపద అనే పర్వతాలకు భూసురుల ధనం వజ్రాయుధం; భూపతుల కీర్తి అనే వెన్నెలను తొలగించే సూర్యోదయం విప్రుల సంపద; బ్రాహ్మణుల ధనం కంటే విషం మేలు; విషానికి విరుగుడు ఉన్నది కానీ, బ్రాహ్మణ ధనాపహరణ వలన ప్రాప్తించే పాపానికి ప్రాయశ్చిత్తం లేదు; అందుచేత, క్షత్రియులు బ్రాహ్మణుల ధనాన్ని అపహరించడం మంచిది కాదు.

10.2-480-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఱుఁగమి నైనను భూసుర
రులధనం బపహరింప లవదు పతికిన్;
పున ననలము ముట్టిన
రికొని వెసఁ గాల్పకున్నె ను వెరియంగన్?

టీకా:

ఎఱుగమిన్ = తెలియక; ఐననున్ = అయినప్పటికి; భూసుర = బ్రాహ్మణ; వరుల = ఉత్తముల; ధనంబున్ = సంపదలను; అపహరింపన్ = తీసుకొనుట; వలవదు = వద్దే వద్దు; పతి = రాజున; కిన్ = కు; మఱపునన్ = మరచిపోయి ఐనప్పటికి; ముట్టినన్ = తాకినంత మాత్రమున; దరికొని = రగుల్కొని; వెసన్ = వడిగా; కాల్పక = కాల్చకుండా; ఉన్నె = ఉండునా, ఉండదు; తనువు = దేహము; ఎరియంగన్ = పరితపించిపోగా.

భావము:

తెలిసి కాని, తెలియక కాని, విప్రుల సొమ్ము రాజు అపహరించ రాదు, తెలియక అగ్నిని ముట్టుకున్నా, శరీరం బొబ్బలెక్కి బాధపెడుతుంది తప్ప, ఆ అగ్ని దహించకుండా ఉండదు కదా.

10.2-481-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియును దన ధనంబు పరులచేతఁ గోల్పడిన విప్రుండు దుఃఖమున రోదనంబు సేయ రాలిన యశ్రుకణంబుల నవనిరేణువు లెన్ని తడియు నన్ని వేలేండ్లు తదుపేక్షాపరుండైన పతి దారుణ వేదనలుగల కుంభీపాక నరకంబు నొందు; మఱియు నతనితోడఁ గ్రిందటఁ బది తరంబులవారును, ముందటఁ బది తరంబులవారును మహానరకవేదనలం బొందుదురు; స్వదత్తంబైన నర్ధలోభంబునం జేసి దుశ్శీలుండై యెవ్వఁడు బ్రాహ్మణక్షేత్ర సంభూత ధాన్యధనాదికంబు భుజించు నప్పాపాత్ముం డఱువదివేల సంవత్సరంబులు మలకూపంబునం గ్రిమిరూపంబున వర్తించు; నట్లగుట యెఱింగి విప్రుడెంత తప్పు చేసిన నెన్ని గొట్టిన, నెన్ని దిట్టిన నతని కెదురు పలుకక వినయంబున వందనం బాచరించు పుణ్యాత్ములు నాదు పాలింటివా; రదియునుంగాక యేనును బ్రతిదినంబును భూసురుల నతి వినయంబునఁ బూజింతు; నిట్లు సేయక విపరీతవర్తనులైన తామసుల నేను వెదకి దండింతు; నదిగావున మీరలును బ్రాహ్మణజనంబుల వలనం బరమభక్తి గలిగి మెలంగుం" డని యానతిచ్చి యాదవప్రకరంబులు సేవింప నఖిలలోకశరణ్యుండైన యప్పుండరీకాక్షుండు నిజ నివాసంబునకుం జనియె” నని చెప్పి శుకుం డిట్లనియె.

టీకా:

మఱియునున్ = ఇంకను; తన = తన యొక్క; ధనంబున్ = సంపదలను; పరుల = ఇతరుల; చేతన్ = వలన; కోల్పడిన = పోగొట్టుకున్న; విప్రుండు = బ్రాహ్మణుడు; దుఃఖమునన్ = దుఃఖముతో; రోదనంబున్ = విలపించుట; చేయన్ = చేయుటవలన; రాలిన = రాలినట్టి; అశ్రు = కన్నీటి; కణంబులు = బిందువులు; అవని = మట్టి; రేణువులు = రేణువులు; ఎన్ని = ఎన్ని; తడియున్ = తడిసిపోవునో; అన్ని = అన్ని; వేల = వేలకొలది (1000); ఏండ్లు = సంవత్సరములు; తత్ = ఆ; ఉపేక్షాపరుండు = అలక్ష్యము చేయువాడు; ఐన = అయిన; పతి = రాజు; దారుణ = భయంకరమైన; వేదనలు = బాధలు; కల = కలిగిన; కుంభీపాక = కుంభీపాకము అను; నరకంబున్ = నరకమును; ఒందున్ = పొందును; మఱియున్ = ఇంకను; అతని = వాని; తోడన్ = తోటి; కిందటన్ = గడచిపోయిన; పది = పది (10); తరంబుల = తరముల; వారును = వారు; ముందటన్ = రాబోవు; పది = పది (10); తరంబుల = తరముల; వారును = వారు; మహా = గొప్ప; నరక = నరకలోకపు; వేదనలన్ = బాధలను; పొందుదురు = పొందుతారు; స్వ = తనచే; దత్తంబు = ఇవ్వబడినది; ఐన = అయినట్టి; అర్థ = ధనము నందలి; లోభమునన్ = లోభము, లాలస; చేసి = వలన; దుశ్శీలుండు = చెడ్డస్వభావము కలవాడు; ఐ = అయ్యి; ఎవ్వడు = ఎవరైతే; బ్రాహ్మణ = విప్రుల; క్షేత్ర = పొలములో; సంభూత = పండిన; ధాన్య = ధాన్యము; ధన = సంపదలు; ఆదికంబున్ = మున్నగువవానిని; భుజించున్ = అనుభవించునో; ఆ = అట్టి; పాపాత్ముండు = పాపబుద్ధి కలవాడు; అఱువదివేల = అరవైవేల (60000); సంవత్సరంబులున్ = ఏళ్ళు; మల = మలము కల; కూపంబునన్ = గుంటలో; క్రిమి = పురుగు; రూపంబునన్ = రూపముతో; వర్తించున్ = తిరుగును; అట్లు = ఆ విధముగా; అగుటన్ = జరుగుట; ఎఱింగి = తెలిసికొని; విప్రుడు = బ్రాహ్మణుడు; ఎంత = ఎంతపెద్ద; తప్పు = తప్పు; చేసినను = చేసినప్పటికి; ఎన్ని = ఎంత ఎక్కువగా; కొట్టినను = కొట్టినప్పటికి; ఎన్ని = ఎంత ఎక్కువగా; తిట్టినన్ = తిట్టినప్పటికి; అతని = ఆ విప్రుని; కిన్ = కి; ఎదురు = విరుద్ధముగా; పలుకక = మాట్లాడకుండ; వినయంబునన్ = వినయముతో; వందనంబు = నమస్కారము; ఆచరించి = చేసెడి; పుణ్యాత్ములు = సజ్జనులు; నాదు = నాకు; పాలింటి = సంబంధించిన; వారు = వారు; అదియునున్ = అంతే; కాక = కాకుండ; ఏనునున్ = నేనుకూడ; ప్రతి = ప్రతీ; దినంబునున్ = రోజు; భూసురులన్ = విప్రులను; అతి = మిక్కిలి; వినయంబునన్ = వినయముతో; పూజింతున్ = కొలుస్తాను; ఇట్లు = ఇలా; చేయక = చేయకుండ; విపరీత = వ్యతిరేకముగా; వర్తనులు = మెలగువారు; ఐన = అయిన; తామసులన్ = మూర్ఖులను; నేను = నేను; వెదికి = వెతికి మరీ; దండింతున్ = శిక్షిస్తాను; అదిగావున = కాబట్టి; మీరలును = మీరు కూడ; బ్రాహ్మణ = విప్రుల; జనంబుల = అందరి; వలనన్ = ఎడల; పరమ = అధికమైన; భక్తి = భక్తి; కలిగి = కలిగి; మెలంగుండు = జీవించండి; అని = అని; ఆనతిచ్చి = చెప్పి; యాదవ = యాదవుల; ప్రకరంబులు = సమూహములు; సేవింపన్ = కొలచుచుండగా; అఖిల = సర్వ; లోక = లోకములకు; శరణ్యుండు = రక్షించువాడు; ఐన = అయిన; ఆ = ఆ; పుండరీకాక్షుండు = కృష్ణుడు; నిజ = తన; నివాసంబు = గృహము; కున్ = నకు; చనియె = వెళ్ళెను; అని = అని; చెప్పి = చెప్పి; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;

భావము:

పరుల వలన తన ధనాన్ని కోల్పోయిన బ్రాహ్మణుడు దుఃఖించి నపుడు, స్రవించిన కన్నీటిధారల వలన భూమిమీద ఎన్ని రేణువులు తడుస్తాయో, అన్ని వేల సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పాలించేరాజు కుంభీపాక నరకంలో బాధలు అనుభవిస్తాడు. అంతేకాదు అతడికి పదితరాల పూర్వులూ, తర్వాత పదితరాల వారూ నరకవేదనలను పొందుతారు. తాను ఇచ్చినదైనా, మరొకరు ఇచ్చినదైనా బ్రాహ్మణ భూముల నుండి వచ్చిన ధనధాన్యాలను రాజు దుశ్శీలుడై ఆశించకూడదు. అట్లాశించిన పాపాత్ముడు అరవైవేల సంవత్సరములు మలకూపంలో పురుగై బ్రతుకుతాడు. కనుక, ఈ విశేషాలు గ్రహించి బ్రాహ్మణుడు ఎంత తప్పుచేసినా, ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా, అతనికి ఎదురు చెప్పకుండా వినయంతో నమస్కరించాలి. అటువంటివారే పుణ్యాత్ములు. అటువంటివారే నా అనుగ్రహానికి పాత్రులవుతారు. అంతేకాదు, నేను కూడా ప్రతిరోజూ బ్రాహ్మణులను మిక్కిలి వినయంతో పూజిస్తాను. ఇలా కాకుండా విపరీతంగా ప్రవర్తించే తామసులను నేను వెదకి దండిస్తాను. అందువలన, మీరు బ్రాహ్మణుల పట్ల మిక్కిలి భక్తిపరులై ప్రవర్తించండి.” అని శ్రీకృష్ణుడు ఆనతిచ్చాడు. ఇలా ధర్మబోధ చేసి, యాదవులు సేవిస్తుండగా శ్రీకృష్ణుడు తన మందిరం చేరాడు.” ఇలా చెప్పిన పిమ్మట శుకమహర్షి ఇలా అన్నాడు.

10.2-482-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఈ థఁ జదివిన వారలుఁ
గైకొని వినువారు విగత లుషాత్మకులై
లౌకికసౌఖ్యము నొందుదు
రా కైవల్యంబుఁ గరతలామలక మగున్.

టీకా:

ఈ = ఈ; కథన్ = వృత్తాంతమును; చదివిన = చదివిని; వారలున్ = వారు; కైకొని = పూని; విను = వినెడి; వారున్ = వారు; విగత = తొలగిన; కలుషా = పాపములు; ఆత్మకులు = కలవారు; ఐ = అయ్యి; లౌకిక = ఇహలోకపు; సౌఖ్యమున్ = సౌఖ్యములను; ఒందుదురు = పొందుతారు; ఆ = ఆ; కైవల్యంబున్ = మోక్షముకూడ; కరతలామలకము = సులువుగా లభించునది {కరత లామలకము - కరతల (అరచేతిలోని) అమలకము (ఉసరికాయ) వలె సులభముగ అందునది}; అగున్ = అగును.

భావము:

“ఈ కథను చదివినవారికీ, విన్నవారికీ, సర్వపాపాలు తొలగిపోతాయి. ఇహలోకంలో సౌఖ్యం ప్రాప్తిస్తుంది. పరలోకంలో మోక్షం సులభంగా లభిస్తుంది.