పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : రాజుల యుత్పత్తి

  •  
  •  
  •  

12-4-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అందు రాజులప్రకారం బెఱింగించెద; బృహద్రథునకుఁ బురంజయుండు పుట్టు; వానికి శునకుం డనెడివాఁడు మంత్రి యై పురంజయునిం జంపి తా రాజ్యం బేలుచుండు; నంతఁ గొంతకాలంబున కతనికిం గుమారుండు దయించిన వానికిఁ బ్రద్యోతననామం బిడి పట్టంబుగట్టు; నా భూభుజునకు విశాఖరూపుం డుదయింపంగలం; డాతనికి నందివర్ధనుండు జన్మించు; నీ యేవురు నూటముప్పది యెనిమిది సంవత్సరములు వసుంధరా పరిపాలనంబునం బెంపు వడయుదురు; తదనంతరంబ శిశునాగుం డను పార్థివుం డుదయించు; నా మూర్ధాభిషిక్తునకుఁ గాకవర్ణుండు, నా రాజన్యునకు క్షేమవర్ముఁ డుదయింపఁగలం; డా పృథ్వీపతికి క్షేత్రజ్ఞుం, డతనికి విధిసారుఁడును, విధిసారున కజాతశత్రుండు, నా భూపాలునకు దర్భకుండును, దర్భకునికి నజయుండు, నతనికి నందివర్ధనుండు, నతనికి మహానందియు ననంగల శైశునాగులు పదుండ్రు నరపాలకు లుద్భవించి షష్ట్యుత్తరత్రిశతి హాయనంబులు గలికాలంబున ధరాతలం బేలుదు; రంతట మహానందికి శూద్రస్త్రీ గర్బంబున నతి బలశాలి యయిన మహాపద్మవతి యను నందనుం డుదయించు; నతనితో క్షత్రియవంశం బడంగిపోఁ గల దా సమయంబున నరపతులు శూద్రప్రాయులై ధర్మవిరహితులై తిరుగుచుండ మహాపద్మునకు సుమాల్యుం డాదిగాఁ గల యెనమండ్రు కుమారు లుదయించెదరు; వారు నూఱు సంవత్సరంబులు క్షోణితలం బేలెద; రంతటఁ గార్ముకుండు మొదలుగా రాజనవకంబు నందాఖ్యలం జనియించు; నా నవనందులనొక భూసురోత్తముం డున్మూలనంబు సేయు; నప్పుడు వారు లేమిని మౌర్యులు గొంతకాలం బీ జగతీతలంబు నేలుదు; రత్తఱి నా భూదేవుండు చంద్రగుప్తుండనువానిం దన రాజ్యం బందు నభిషిక్తుంగాఁ జేయంగలం; డంత నా చంద్రగుప్తునకు వారిసారుండును, వానికి నశోకవర్ధనుండు, నతనికి సుయశస్సును, వానికి సంయుతుఁ డమ్మహనీయునకు శాలిశూకుం, డతనికి సోమశర్ముండు, వానికి శతధన్వుండు, నవ్వీరునకు బృహద్రథుండు నుదయించెదరు; మౌర్యులతోఁజేరిన యీ పదుగురును సప్తత్రింశదుత్తర శతాబ్దంబులు నిష్కంటకంబుగా భూపరిపాలనంబు సేసెద; రా సమయంబున బృహద్రథుని సేనాపతి యగు పుష్యమిత్రుఁడు, శుంగాన్వయుఁ డతని వధించి రాజ్యంబు గైకొను; నతనికి నగ్నిమిత్రుండను నరపతి బుట్టఁగలవాఁ; డాతనికి సుజ్యేష్ఠుండు, సుజ్యేష్ఠునకు వసుమిత్రుండు, నతనికి భద్రకుండును, భద్రకునకుఁ బుళిందుండు, నా శూరునకు ఘోషుండును, వాని కి వజ్రమిత్రుండును, నతనికి భాగవతుండును, వానికి దేవభూతియు నుద్భవించెద; రీ శుంగులు పదుండ్రును ద్వాదశోత్తరశత హాయనంబు లుర్వీపతు లయ్యెద; రంతమీదఁట శుంగకుల సంజాతుండైన దేవభూతిని గణ్వామాత్యుండగు వసుదేవుండనువాఁడు వధియించి, రాజ్యం బేలు; వానికి భూమిత్రుండు, నమ్మహానుభావునకు నారాయణుండునుఁ గలిగెదరు; కణ్వవంశజులైన వీరలు మున్నూటనలువదేను సంవత్సరంబులు మేదినీతలం బేలుదురు; మఱియును.

టీకా:

అందు = ఆ కాలమునందు; రాజుల = రాజుల; ప్రకారంబున్ = విషయములను; ఎఱింగించెదన్ = తెలిపెదను; బృహద్రథున్ = బృహద్రథుని; కున్ = కి; పురంజయుండు = పురంజయుడు; పుట్టున్ = పుడతాడు; వాని = అతని; కిన్ = కి; శునకుండు = శునకుడు; అనెడివాడు = అనెడి; మంత్రి = అమాత్యునిగా; ఐ = ఉండి; పురంజయునిన్ = పురంజయుని; చంపి = సంహరించి; తాన్ = తానే; రాజ్యంబున్ = రాజ్యమును; ఏలుచుండున్ = పాలించుచుచుండును; అంత = అప్పుడు; కొంతకాలంబున్ = కొన్నాళ్ళ; కున్ = కి; కుమారుండు = కొడుకు; ఉదయించిన = పుట్టగా; వాని = అతని; కిన్ = కి; ప్రద్యోతన్ = ప్రద్యోతుడు; అనన్ = అనెడి; నామంబు = పేరు; ఇడి = పెట్టి; పట్టంబుగట్టున్ = పట్టాభిషేకము చేయును; ఆ = ఆ యొక్క; భూభుజున్ = రాజున; కున్ = కు; విశాఖరూపుండు = విశాఖరూపుడు; ఉదయింపంగలండు = పుడతాడు; ఆతని = అతని; కిన్ = కి; నందివర్ధనుండు = నందివర్ధనుడు; జన్మించున్ = పుట్టును; ఈ = ఈ; ఏవురున్ = ఐదుగురు; నూటముప్పదియెనిమిది = నూటముప్పైయెనిమిది (138); సంవత్సరములు = ఏళ్ళు; వసుంధరా = రాజ్యమును; పరిపాలనంబునన్ = పాలించుటలో; పెంపున్ = వృద్ధిని; బడయుదురు = చెందెదరు; తదనంతరంబ = పిమ్మట; శిశునాగుండు = శిశినాగుడు; అను = అనెడి; పార్థివుండు = రాజు; ఉదయించును = జన్మించును; ఆ = ఆ యొక్క; మూర్ధాభిషిక్తున్ = పట్టపురాజు; కున్ = కి; కాకవర్ణుండు = కాకవర్ణుడు; ఆ = ఆ యొక్క; రాజన్యున్ = రాజు; కున్ = కి; క్షేమవర్ముండు = క్షేమవర్ముడు; ఉదయింపగలండు = పుడతాడు; ఆ = ఆ యొక్క; పృథ్వీపతి = రాజు; కిన్ = కి; క్షేత్రఙ్ఞుండు = క్షేత్రఙ్ఞుడు; అతను = అతని; కిన్ = కి; విధిసారుడును = విధసారుడు; విధిసారున్ = విధిసారున; కున్ = కు; అజాతశత్రుండున్ = అజాతశత్రుడు; ఆ = ఆ; భూపాలున్ = రాజు; కున్ = కి; దర్భకుండును = దర్భకుడు; దర్భకున్ = దర్భకుని; కిన్ = కి; అజయుండును = అజయుడు; అతను = అతని; కిన్ = కి; నందివర్ధనుండున్ = నందివర్ధనుడు; అతను = అతని; కిన్ = కి; మహానందియున్ = మహానంది; అనంగల = అనబడెడువారైన; శైశునాగులు = శైశునాగులు; పదుండ్రున్ = పదిమంది; నరపాలకులు = రాజులు; ఉద్భవించి = పుట్టి; షష్ట్యుత్తరత్రిశతి = మూడువందలరవై (360); హాయనంబులున్ = సంవత్సరములు; కలికాలంబునన్ = కలికాలమునందు; ధరాతలంబున్ = భూమండలమును; ఏలుదురు = పాలించెదరు; అంతట = అప్పుడు; మహానంది = మహానంది; కిన్ = కి; శూద్ర = శూద్రజాతి; స్త్రీ = యువతి; గర్భంబునన్ = కడుపులో; అతి = మహా; బలశాలి = బలవంతుడు; అయిన = ఐన; మహాపద్మవతి = మహాపద్ముడు; అను = అనెడి; నందనుండున్ = కొడుకు; ఉదయించున్ = పుట్టును; అతని = అతని; తోన్ = తోటి; క్షత్రియవంశంబు = క్షత్రియవంశము; అడంగిపోగలదు = నశించిపోవును; ఆ = ఆ యొక్క; సమయంబునన్ = కాలమునందు; నరపతులు = రాజులు; శూద్ర = శూద్రులతో; ప్రాయులు = సమానమైనవారు; ఐ = అయ్యి; ధర్మ = ధర్మముగానడచుట; విరహితులు = లేనివారు; ఐ = అయ్యి; తిరుగుచుండన్ = మెలగుచుండగా; మహాపద్మున్ = మహాపద్ముని; కున్ = కి; సుమాల్యుండు = సుమాల్యుడు; ఆదిగాగల = మున్నగు; ఎనమండ్రు = ఎనిమిదిమంది; కుమారులు = కొడుకులు; ఉదయించెదరు = పుట్టెదరు; వారు = వారు; నూఱు = వంద (100); సంవత్సరంబులు = సంవత్సరములు; క్షోణితలంబున్ = భూమండలమును; ఏలెదరు = పాలించెదరు; అంతటన్ = పిమ్మట; కార్ముకుండు = కార్ముకుడు; మొదలగు = మున్నగు; రాజ = రాజుల; నవకంబున్ = తొమ్మిదిమంది (9); నంద = నందులు అని; ఆఖ్యలన్ = పిలవబడువారు; జనియించున్ = పుట్టెదరు; ఆ = ఆ యొక్క; నవ = తొమ్మిదిమంది (9); నందులన్ = నందులను; ఒక = ఒకానొక; భూసుర = విప్ర; ఉత్తముండు = శ్రేష్ఠుడు; ఉన్మూలనంబు = అంతరింపగా; చేయున్ = చేస్తాడు; అప్పుడు = అప్పుడు; వారు = వాళ్ళు; లేమిని = లేకపోవుటచేత; మౌర్యులు = మౌర్యులు {మౌర్యులు - ముర అనునామె వంశము వారు}; కొంతకాలంబున్ = కొన్నాళ్ళు; ఈ = ఈ; జగతీతలంబున్ = భూమండలమును; ఏలుదురు = పాలించెదరు; ఆ = ఆ యొక్క; తఱిన్ = సమయమునందు; ఆ = ఆ; భూదేవుండు = బ్రాహ్మణుడు; చంద్రగుప్తుండు = (మౌర్య)చంద్రగుప్తుడు; అను = అనెడి; వానిన్ = అతనిని; తన = అతని యొక్క; రాజ్యంబున్ = రాజ్యమున; అందున్ = కు; అభిషిక్తున్ = పట్టముకట్టబడిన వానిగా; చేయంగలండు = చేస్తాడు; అంతన్ = పిమ్మట; ఆ = ఆ యొక్క; చంద్రగుప్తున్ = చంద్రగుప్తుని; కున్ = కి; వారిసారుండును = వారిసారుండు; వాని = అతని; కిన్ = కి; అశోకవర్ధనుండున్ = అశోకవర్ధనుడు; అతని = వాని; కిన్ = కి; సుయశస్సును = సుయశస్సుడు; వాని = అతని; కిన్ = కి; సంయుతుడు = సంయుతుడు; ఆ = ఆ యొక్క; మహనీయున్ = గొప్పవాని; కున్ = కి; శాలిశూకుండున్ = శాలిశూకుండు; అతని = వాని; కిన్ = కి; సోమశర్ముండు = సోమశర్మ; వాని = అతని; కిన్ = కి; శతధన్వుండు = శతధన్వుడు; ఆ = ఆ; వీరున్ = శూరుని; కున్ = కి; బృహద్రథుండున్ = బృహద్రథుడు; ఉదయించెదరు = పుడతారు; మౌర్యులు = మౌర్యులు; తోన్ = తోటి; చేరిన = కలిసి; ఈ = ఈ; పదుగురును = పదిమంది; సప్తత్రింశదుత్తరశతాబ్దంబులు = నూటముప్పైయేడేళ్ళు (137); నిష్కంటకంబుగాన్ = తిరుగులేకుండా; భూ = రాజ్యమును; పరిపాలనంబున్ = ఏలుట; చేసెదరు = చేస్తారు; ఆ = ఆ యొక్క; సమయంబునన్ = కాలమునందు; బృహద్రథుని = బృహద్రథుని; సేనాపతి = సేనానాయకుడు; అగు = ఐన; పుష్యమిత్రుడు = పుష్యమిత్రుడు; శుంగ = శుంగ; అన్వయుండు = వంశమువాడు; అతనిన్ = వానిని; వధించి = చంపి; రాజ్యంబున్ = రాజ్యాధికారమును; కైకొనున్ = చేపట్టును; అతని = వాని; కిన్ = కి; అగ్నిమిత్రుండు = అగ్నిమిత్రుడు; అను = అనెడి; నరపతి = రాజు; పుట్టగలవాడు = పుడతాడు; అతని = వాని; కిన్ = కి; సుజేష్ఠుండున్ = సుజేష్ఠుడు; సుజేష్ఠున్ = సుజేష్ఠుని; కున్ = కి; వసుమిత్రుండున్ = వసుమిత్రుడు; అతని = వాని; కిన్ = కి; భద్రకుండును = భద్రకుడు; భద్రకున్ = భద్రకుని; కున్ = కి; పుళిందుండు = పుళిందుడు; ఆ = ఆ; శూరున్ = శూరుని; కున్ = కి; ఘోషుండునున్ = ఘోషుడు; వాని = ఆతని; కిన్ = కి; వజ్రమిత్రుండును = వజ్రమిత్రుడు; అతని = వాని; కిన్ = కి; భాగవతుండును = భాగవతుడు; వాని = అతని; కిన్ = కి; దేవభూతియున్ = దేవభూతి; ఉద్భవించెదరు = పుడతారు; ఈ = ఈ; శుంగులు = శుంగవంశస్థులు; పదుండ్రును = పదిమంది; ద్వాదశోత్తరశత = నూటపన్నెండు (112); హాయనంబులున్ = సంవత్సరములు; ఉర్వీపతులున్ = రాజులుగా; అయ్యెదరు = ఉంటారు; అంతమీదట = ఆ తరువాత; శుంగ = శుంగ; కుల = వంశమున; జాతుండు = పుట్టినవాడు; ఐన = అగు; దేవభూతినిన్ = దేవభూతిని; కణ్వామాత్యుండు = కణ్వుడు మంత్రిగా కలవాడు; అగు = ఐన; వసుదేవుండు = వసుదేవుడు; అను = అనెడి; వాడు = అతను; వధియించి = చంపి; రాజ్యంబున్ = రాజ్యమును; ఏలున్ = పాలించును; వాని = అతని; కిన్ = కి; భూమిత్రుండున్ = భూమిత్రుడు; ఆ = ఆ; మహానుభావున్ = గొప్పవాని; కున్ = కి; నారాయణుండునున్ = నారాయణుడు; కలిగెదరు = పుడతారు; కణ్వ = కణ్వ; వంశజులు = వంశస్థులు; ఐన = అగు; వీరలు = వీరు; మున్నూటనలువదేను = మూడొందలనలభైయైదు (345); సంవత్సరంబులు = సంవత్సరాలు; మేదినీతలంబున్ = రాజ్యమును; ఏలుదురు = పాలిస్తారు; మఱియును = పిమ్మట.

భావము:

వీటిలో ముందుగా రాజుల గురించి చెప్తాను, రాజు బృహద్రథుడికి పురంజయుడు పుడతాడు. అతనికి శునకుడు మంత్రిగా ఉంటాడు. అతడు పురంజయుని సంహరించి తానే గద్దె నెక్కి, రాజ్యం పరిపాలిస్తాడు. అతనికి ప్రద్యోతుడు అని కొడుకు పుడతాడు. అతనికి పట్టాభిషేకం చేసి రాజ్యం అప్పజెప్తాడు. ప్రద్యోతునికి విశాఖరూపుడు, అతనికి నందివర్ధనుడు పుడతారు. ఈ రాజులు అయిదుగురు వృద్ధిచెందుతూ నూటముప్పైయ్యెనిమిది సంవత్సరాలు రాజ్యపాలన చేస్తారు. అటుపిమ్మట శిశునాగుడు అనే రాజు పుడతాడు. అతనికి కాకవర్ణుడు, కాకవర్ణునికి క్షేమవర్ణుడు, క్షేమవర్ణమహారాజుకు క్షేత్రజ్ఞుడు, అతనికి విధిసారుడు, అతనికి అజాతశత్రువు, అతనికి దర్భకుడు, అతనికి అజయుడు, అతనికి నందివర్థనుడు, అతనికి మహానంది పుడతారు. ఈ పదిమంది రాజులు శైశునాగులు అన్న పేరుతో ప్రసిద్ధులై కలికాలంలో మూడువందలఅరవై ఏళ్ళు అవిచ్ఛిన్నంగా రాజ్యపాలన చేస్తారు.
ఆ తరువాత, మహానందికి శూద్రస్త్రీ కడుపున మహాపద్ముడు పుడతాడు. అతడు మహా బలవంతుడు అవుతాడు. కానీ అతనితో క్షత్రియ వంశం అంతరించి పోతుంది. అప్పుడు రాజులు శూద్రప్రాయులు ధర్మహీనులు అయిపోతారు. పోతారు మహాపద్మునికి సుమాల్యుడు మున్నగు తనయులు ఎనమండుగురు పుడతారు. వారి పాలన వందసంవత్సరాలపాటు సాగుతుంది. అటుపిమ్మట కార్ముకుడు మొదలయిన రాజులు తొమ్మండుగురు పుడతారు. వారిని నవనందులు అని అంటారు. ఆ నవనందులను ఒక విప్రశ్రేష్ఠుడు అంతరింప జేస్తాడు. నందులు లేకపోవడంచేత కొంతకాలం మౌర్యులు పరిపాలన చేస్తారు.
నందులను తొలగించిన ఆ విప్రోత్తముడు చంద్రగుప్తుని అభిషేక్తుని చేసి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆ చంద్రగుప్తునికి వారిసారుడు పుడతాడు. క్రమంగా వారిసారుని కొడుకు అశోకవర్థనుడు, అతని తనయుడు సుయశస్సు, వాని సుతుడు సంయుతుడు, అతని పుత్రుడు శాలిశూకుడు, వాని నందనుడు సోమశర్ముడు, వాని తనూభవుడు శతధన్వుడు, వాని కొమరుడు బృహద్రథుడు వరుసగా రాజులు అవుతారు. మౌర్యునితో కలసి ఆ పదిమందిరాజులు మొత్తంమీద నూటముప్ఫయేడు సంవత్సరములు నిరాటంకంగా రాజ్య పాలన చేస్తారు. అప్పుడు, బృహద్రథుని సైన్యాధినేత శుంగవంశపు పుష్యమిత్రుడు అతనిని చంపి రాజ్యాన్ని అపహరిస్తాడు. అతనికి అగ్నిమిత్రుడు పుట్టి రాజు అవుతాడు. అతని తరువాత సుజ్యేష్ఠుడు, వసుమిత్రుడు, భద్రకుడు, పుళిందుడు, ఘోషుడు, వజ్రమిత్రుడు, భాగవతుడు, దేవభూతి వరుసగా వంశపారంపర్యంగా రాజ్యాన్ని గ్రహించి పరిపాలిస్తారు. పైన చెప్పిన పదిమంది శుంగులు నూటపన్నెండు ఏళ్ళు రాచరికం నిలుపుకుంటారు. శుంగవంశం వారిలో చివరివాడు అయిన దేవభూతిని, వసుదేవుడు కణ్వుడు అను తన మంత్రితో కలిసి వధించి తానే రాజ్యాధిపతి అవుతాడు. అతనికి భూమిపుత్రుడు కలుగుతాడు. ఆ మహానుభవుడికి నారాయణుడనే కొడుకు పుడతాడు. కణ్వవంశస్థులు మొత్తం మీద మూడువందలనలభైఅయిదు ఏళ్ళు ప్రభవులై పరిపాలన చేస్తారు.

12-5-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తురత నీ క్షితి నేలియు
తిమోహము విడువలేక మానవనాథుల్
తముఁ దమ కీ కాలం
తిచంచల మగుట నెఱుఁగయ్య మహాత్మా!

టీకా:

చతురతన్ = ఎంతోనేర్పుతో; ఈ = ఈ; క్షితిన్ = భూమండలమును; ఏలియు = పాలించినప్పటికిని; మతి = అంతరంగములోని; మోహమును = మోహాన్ని; విడువ = వదల; లేక = లేక; మానవనాథుల్ = రాజులు; సతతమున్ = ఎప్పటికిని; తమ = వారి; కిన్ = కి; ఈ = ఈ; కాలంబు = కాలము; అతి = మిక్కిలి; చంచలంబు = చంచలమైనది; అగుటన్ = ఐయుండుటను; ఎఱుగరు = తెలిసికొనలేరు; అయ్య = నాయనా; మహాత్మా = గొప్పవాడా.

భావము:

ఓ మహాత్మా! వీరు ఎంతో నేర్పుతో పరిపాలన కొనసాగిస్తారు. కానీ, తమ అంతరంగాలలో మోహాన్ని వీడలేరు. కాలం మిక్కిలి చంచలమైనది అని తెలుసుకోలేరు.

12-6-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పతులమహిమ నంతయు
నుగాధిపుఁ డైన నొడువ నోపఁడు; ధాత్రిం
జికాల మేలి యిందే
రువడి నడఁగుదురు వారు భ్రాంతులు నగుచున్.

టీకా:

నరపతుల = ఆ రాజుల; మహిమన్ = గొప్పతనాన్ని; అంతయున్ = సమగ్రముగ; ఉరగాధిపుడు = వెయ్యితలల ఆదిశేషుడు {ఉరగాదిఫుడు - ఉరగముల (సర్పముల)కు అధిపతి, ఆదిశేషుడు}; ఐనన్ = అయినప్పటికిని; నొడువన్ = చెప్పుటకు; ఓపడు = సరిపడడు; ధాత్రిన్ = రాజ్యాన్ని; చిరకాలంబు = చాలాకాలము; ఏలి = పాలించి; ఇందే = ఇక్కడనే; పరు = అతి; వడిన్ = శీఘ్రముగా; అడగుదురు = నశించెదరు; వారు = వాళ్ళు; భ్రాంతులు = భ్రాంతిమగ్నులు; అగుచున్ = ఔతూ.

భావము:

ఆ రాజుల గొప్పతనాన్ని ఆ వెయ్యితలల ఆదిశేషుడైనా సమగ్రంగా చెప్పలేడు. వారు చాలాకాలం భూమిని ఏలుతారు. అయినా భ్రాంతి మగ్నులై ఇక్కడే అణగిపోతారు.

12-7-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తురగాదిశ్రీలను
ని మని నమ్మంగరాదు; నిత్యమును హరిన్
జిబిజి లేక తలంచిన
సునులకును నతనియందుఁ జొరఁగా వచ్చున్.

టీకా:

గజ = ఏనుగలు; తురగ = గుఱ్ఱములు; ఆది = మున్నగు; శ్రీలను = సంపదలను; నిజము = శాశ్వతము; అని = అని; నమ్మంగన్ = నమ్ముట; రాదు = కూడదు; నిత్యమున్ = నిరంతరము; హరిన్ = విష్ణుమూర్తిని; గజిబిజి = గజిబిజి; లేక = లేకుండ; తలంచిన = స్మరించెడి; సుజనుల్ = మంచివారల; కున్ = కు; అతని = అతని; అందున్ = అందే; చొరగవచ్చున్ = చేరుకొనవీలగును.

భావము:

గుఱ్ఱములు ఏనుగులు వంటి సంపదలను శాశ్వతమని నమ్మరాదు. ప్రశాంత హృదయంతో నిరంతరం హరిని స్మరించే సజ్జనులు అతని యందే చేరుతారు.

12-8-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుఁ గణ్వవంశజుండగు సుశర్ముండను రా జుదయించిన వాని హింసించి తద్భృత్యుం డంధ్ర జాతీయుం డయిన వృషలుం, డధర్మమార్గవర్తి యై, వసుమతీచక్రం బవక్రుండై యేలు నంత వాని యనుజుండు కృష్ణుం డనువాఁడు రాజై నిలుచు; నా మహామూర్తికి శాంతకర్ణుండును, వానికి బౌర్ణమాసుండును, వానికి లంబోదరుండును, వానికి శిబిలకుండు, నతనికి మేఘస్వాతియు, వానికి దండమానుండును, వానికి హాలేయుం డగు నరిష్టకర్మయు, వానికి దిలకుండు, నతనికిఁ బురీషసేతుండును, వానికి సునందనుండును, నా రాజశేఖరునకు వృకుండును, వృకునకు జటాపుండును, జటాపునకు శివస్వాతియు, వానికిఁ నరిందముండు, నా భూమీశునకు గోమతియును, వానికిఁ బురీమంతుండును, నతనికి దేవశీర్షుండును, వానికి శివస్కందుండును, నతని కి యజ్ఞశీలుండు, నా భవ్యునకు శ్రుతస్కందుండు, వానికి యజ్ఞశత్రుండు, వానికి విజయుం, డ వ్విజయునికిఁ జంద్రబీజుం డతనికి సులోమధియు నిట్లు పెక్కం డ్రుదయించి నన్నూటయేఁబదియాఱు హాయనంబులు ధాత్రిం బాలించెద; రంత నాభీరులేడ్వురు, గర్దభులు పదుండ్రు, గంక వంశజులు పదాఱుగురు, మేదినీభరంబు దాల్చి యుండెద; రటమీఁద యవను లెనమండ్రు, బర్బరులు పదునల్గురు, దేశాధీశులై యేలెదరు; మఱియుం బదుమువ్వురు గురుండులును, బదునొకండ్రు మౌనులును, వేయుందొమ్మన్నూటతొమ్మిది హాయనంబులు గర్వాంధులయి యేలెద; రటమీఁద నా మౌనవంశజు లగు పదునొకండ్రు త్రిశతయుతం బైన వత్సరంబులు మత్సరంబున నేలెద ; రా సమయంబునఁ, గైలికిలు లను యవనులు భూపతు లగుదు; రంత భూతనందుండు నవభంగిరుండు శిశునందుండుఁ దద్భ్రాతయగు యశోనందుండుఁ బ్రవీరకుండు వీరలు వీరులై షడుత్తరశత హాయనంబు లేలెద; రంత నా రాజులకుఁ బదుమువ్వురు కుమారు లుదయించి యందు నార్గురు బాహ్లికదేశాధిపతు లయ్యెదరు; కడమ యేడ్వురును గోసలాధిపతు లయ్యెద; రంత వైఢూర్య పతులు నిషధాధిపతులై యుండెదరు; పురంజయుండు మగధదేశాధిపతియై పుట్టి, పుళింద యదు మద్రదేశవాసు లగు హీనజాతి జనులు బ్రహ్మజ్ఞానహీనులై హరిభక్తి విరహితులై యుండ, వారికి ధర్మోపదేశంబు సేసి, నారాయణభక్తి నిత్యంబు నుండునట్లుగాఁ జేసి, బలపరాక్రమవంతు లైన క్షత్రియవంశంబు లడంచి, పద్మావతీనగర పరిపాలకుండై యాగంగా ప్రయాగ పర్యంతం బగు భూమినేలఁ గలండు; శూద్రప్రాయు లగు రాజులును, వ్రాత్యులును, బాషండులు నగు విప్రులును గలిగి సౌరాష్ట్రావంత్యాభీరార్భుద మాళవ దేశాధిపతు లయ్యెదరు, సింధుతీరంబులఁ జంద్రభాగా ప్రాంతంబులఁ గాశ్మీరమండలంబున మేధావిహీనులై మ్లేచ్ఛాకారు లగు రాజులు భూభాగం బేలుచు, ధర్మసత్యదయాహీనులై, క్రోధమాత్సర్యంబుల, స్త్రీ బాల గో ద్విజాతులఁ వధియింప రోయక, పరధన పరస్త్రీపరు లై, రజస్తమోగుణరతు లై, యల్పజీవు లై, యల్పబలు లై హరి చరణారవిందమకరంద రసాస్వాదులు గాక తమలో నన్నోన్య వైరానుబంధులై సంగ్రామరంగంబుల హతు లయ్యెద; రా సమయంబునఁ బ్రజలు తచ్చీల వేష భాషాదుల ననుసరించి యుండెదరు; కావున.

టీకా:

మఱియున్ = పిమ్మట; కణ్వ = కణ్వుల; వంశజుండు = వంశస్థుడు; అగు = ఐన; సుశర్ముండు = సుశర్మ; అను = అనెడి; రాజు = రాజు; ఉదయించినన్ = కలుగగా; వానిన్ = అతనిని; హింసించి = చంపి; తత్ = అతని; భృత్యుండు = సేవకుడు; అంధ్ర = ఆంధ్ర; జాతీయుండు = జాతివాడు; అయిన = అగు; వృషలుండు = శూద్రుడు; అధర్మ = ధర్మవిరుద్ధమైన; మార్గ = మార్గమున; వర్తి = సంచరించువాడు; ఐ = అయ్యి; వసుమతీచక్రంబున్ = భూమండలమును; అవక్రుండు = అవక్రవిక్రమముగలవాడు; ఐ = అయ్యి; ఏలున్ = పాలించును; అంతన్ = అప్పుడు; వాని = అతని; అనుజుండు = సోదరుడు; కృష్ణుండు = కృష్ణుడు; అను = అనెడి; వాడు = అతను; రాజు = రాజు; ఐ = అయ్యి; నిలుచున్ = నిలబడును; ఆ = ఆ యొక్క; మహామూర్తి = గొప్పవాని; కిన్ = కి; శాంతకర్ణుండును = శాంతకర్ణుడు; వాని = అతని; కిన్ = కి; పౌర్ణమాసుండును = పౌర్ణమాసుడు; వాని = అతని; కిన్ = కి; లంబోదరుండును = లంబోదరుడు; వాని = అతని; కిన్ = కి; శిబిలకుండున్ = శిబిలకుండు; అతని = వాని; కిన్ = కి; మేఘస్వాతియున్ = మేఘస్వాతి; వాని = అతని; కిన్ = కి; దండమానుండును = దండమానుడు; వాని = అతని; కిన్ = కి; హాలేయుండు = నాగలిపట్టువాడు; అగు = ఐన; అరిష్టకర్మయున్ = అరిష్టకర్మ; వాని = అతని; కిన్ = కి; తిలకుండు = తిలకుడు; అతని = వాని; కిన్ = కి; పురీషసేతుండును = పురీషసేతుడు; వాని = అతని; కిన్ = కి; సునందనుండునున్ = సునందనుడు; ఆ = ఆ యొక్క; రాజ = రాజులలో; శేఖరున్ = శ్రేష్ఠుని; కున్ = కి; వృకుండును = వృకుడు; వృకున్ = వృకుని; కున్ = కి; జటాపుండునున్ = జటాపుడు; జటాపున్ = జటాపుని; కున్ = కి; శివస్వాతియు = శివస్వాతి; వాని = అతని; కిన్ = కి; అరిందముండున్ = అరిందముడు; ఆ = ఆ; భూమీశున్ = రాజున; కున్ = కు; గోమతియునున్ = గోమతి; వాని = అతని; కిన్ = కి; పురీమంతుండునున్ = పురీమంతుడు; అతని = వాని; కిన్ = కి; దేవశీర్షుండును = దేవశీర్షుడు; వాని = అతని; కిన్ = కి; శివస్కందుండునున్ = శివస్కందుడు; అతని = వాని; కిన్ = కి; యజ్ఞశీలుండున్ = యజ్ఞశీలుడు; ఆ = ఆ; భవ్యున్ = యోగ్యుని; కున్ = కి; శ్రుతస్కందుండు = శ్రుతస్కందుడు; వాని = అతని; కిన్ = కి; యజ్ఞశత్రుండున్ = యజ్ఞశత్రుడు; వాని = వాని; కిన్ = కి; విజయుండున్ = విజయుడు; ఆ = ఆ; విజయున్ = విజయుని; కిన్ = కి; చంద్రబీజుండున్ = చంద్రబీజుడు; అతని = వాని; కిన్ = కి; సులోమధియున్ = సులోమధి; ఇట్లు = ఈ విధముగ; పెక్కండ్రు = అనేకమంది; ఉదయించి = కలిగి; నన్నూటయేబదియాఱు = నాలుగువందల ఏభైయ్యారు (456); హాయనంబులున్ = సంవత్సరాలు; ధాత్రిన్ = భూమండలమును; పాలించెదరు = ఏలెదరు; అంతన్ = పిమ్మట; ఆభీరులు = ఆభీరవంశస్థులు; ఏడ్వురున్ = ఏడుగురు (7); గర్దభులు = గర్దభవంశస్థులు; పదుండ్రును = పదిమంది (10); కంక = కంక; వంశజులు = వంశస్థులు; పదాఱుగురు = పదహారుమంది (16); మేదినీభారంబున్ = రాజ్యాధికారమును; తాల్చి = ధరించి; ఉండెదరు = ఉంటారు; అటమీద = పిమ్మట; యవనులు = యవనులు; ఎనమండ్రు = ఎనిమిదిమంది (8); బర్బరులున్ = బర్బరులు; పదునల్గురు = పద్నాలుగుమంది (14); దేశాధీశులు = ప్రభువులు; ఐ = అయ్యి; ఏలెదరు = పరిపాలించెదరు; మఱియున్ = తరువాత; పదుమువ్వురు = పదమూడుమంది (13); గురుండులునున్ = గురుడులు; పదునొకండ్రు = పదకొండుమంది (11); మౌనులునున్ = మౌనులు; వేయుందొమ్మన్నూటతొమ్మిది = పందొమ్మిదొందలతొమ్మిది (1909); హాయనంబులున్ = సంవత్సరాలు; గర్వ = గర్వముతో; అంధులు = కన్నూమిన్నూకాననివారు; అయి = అయ్యి; ఏలెదరు = పాలిస్తారు; అటమీద = పిమ్మట; ఆ = ఆ; మౌన = మౌన; వంశజులు = వంశమువారు; అగు = ఐన; పదునొకండ్రు = పదకొండుమంది (11); త్రిశతియుతంబు = మూడుందలుపాటి; ఐన = అయిన; వత్సరంబులు = సంవత్సరాలు; మత్యరంబునన్ = క్రోధబుద్ధితో; ఏలెదరు = పాలిస్తారు; ఆ = ఆ; సమయంబునన్ = కాలమునకు; కైలకీలులు = కైలకీలులు; అను = అనెడి; యవనులు = యవనులు (అరబ్బీలు); భూపతులు = ప్రభువులు; అగుదురు = ఔతారు; అంతన్ = పిమ్మట; భూతనందుండు = భూతనందుడు; నవభంగిరుండు = నవభంగిరిడు; శిశునందుండు = శిశునందుడు; తత్ = అతని; భ్రాత = తమ్ముడు; అగు = ఐన; యశోనందుండు = యశోనందుడు; ప్రవీరకుండు = ప్రవీరకుడు; వీరలు = అనువీరు; వీరులు = శూరులు; ఐ = అయ్యి; షడుత్తరశత = నూటారు(106); హాయనంబులున్ = సంవత్సరాలు; ఏలెదరు = పాలించెదరు; అంతన్ = ఆ తరువాత; ఆ = ఆ; రాజుల్ = రాజుల; కున్ = కు; పదుమువ్వురు = పదమూడుమంది (13); కుమారులు = కొడుకులు; ఉదయించి = పుట్టి; అందున్ = వారిలో; ఆర్గురు = ఆరుమంది (6); బాహ్లిక = బాహ్లిక; దేశా = దేశములకు; అధిపతులు = ప్రభులు; అయ్యెదరు = ఔతారు; కడమ = మిగిలిన; ఏడ్వురును = ఏడుమంది (7); కోసలా = కోసలదేశమునకు; అధిపతులు = ప్రభువులు; అయ్యెదరు = ఔతారు; అంతన్ = పిమ్మట; వైడూర్యపతులు = వైడూర్యపతులు; నిషధా = నిషధదేశానికి; అధిపతులు = ప్రభువులు; ఐ = అయ్యి; ఉండెదరు = ఉంటారు; పురంజయుండు = పురంజయుడు; మగధ = మగధ దేశానికి; దేశాధిపతి = ప్రభువు; ఐ = అయ్యి; పుట్టి = జనించి; పుళింద = పుళింద; యదు = యదు; మద్ర = మద్ర; దేశవాసులు = ప్రజలు; అగు = ఐన; హీనజాతి = తక్కువకులపు; జనులు = ప్రజలు; బ్రహ్మఙ్ఞాన = ఆత్మఙ్ఞానము; హీనులు = లేనివారు; ఐ = అయ్యి; హరిభక్తి = విష్ణుభక్తి; రహితులు = లేనివారు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; వారి = వారల; కిన్ = కు; ధర్మోపదేశంబు = ధర్మాన్ని ఉంపదేశించుట; చేసి = చేసి; నారాయణభక్తి = విష్ణుభక్తి; నిత్యంబున్ = నిత్యమై; ఉండునట్లు = ఉండేలాగ; చేసి = చేసి; బల = అధికసైన్యాలు; పరాక్రమవంతులు = శౌర్యములు కలవారు; ఐన = అగు; క్షత్రియ = రాజుల; వంశంబుల్ = వంశాలని; అడంచి = అణచివేసి; పద్మావతీ = పద్మావతీ అనెడి; నగర = పట్టణంనుండి; పరిపాలకుండు = రాజ్యమునేలువాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; గంగా = గంగానది; ప్రయాగ = ప్రయాగ పట్టణము; పర్యంతంబు = వరకుగలది; అగు = ఐన; భూమిన్ = భూభాగమును; ఏలంగలండు = పాలిస్తాడు; శూద్ర = శూద్రులు, నీచజాతివారు; ప్రాయులు = వంటివారు; అగు = ఐన; రాజులును = ప్రభువులు; వ్రాత్యులునున్ = సంస్కారరహితులు {వ్రాత్యుడు - ఉపనయనాది సంస్కారములు లేని ద్విజుడు, సంస్కారరహితుడు}; పాషండులును = నాస్తికులు, వేదబాహ్యులు; అగు = ఐన; విప్రులును = బ్రాహ్మణులు; కలిగి = ఐ ఉండి; సౌరాష్ట్ర = సౌరాష్ట్రము; అవంతి = అవంతి; ఆభీర = ఆభీరము; అర్బుద = ఆర్బుదము; మాళవ = మాళవము; దేశ = దేశములకు; అధిపతులు = ప్రభువులు; అయ్యెదరు = ఔతారు; సింధు = సింధునదీ; తీరంబులన్ = పరివాహకప్రదేశాలలో; చంద్రభాగ = చంద్రభాగానది; ప్రాంతంబులన్ = పరిసరప్రాంతములలో; కాశ్మీర = కాశ్మీరు; మండలంబునన్ = దేశమునందు; మేధావిహీనులు = తెలివితక్కువవారు; ఐ = అయిన; మ్లేచ్ఛాకారులు = అనాచారరూపులు; అగు = ఐనట్టి; రాజులు = ప్రభువులు; భూభాగంబుల్ = రాజ్యములను; ఏలుచు = పాలిస్తూ; ధర్మ = ధర్మపాలన; సత్య = సత్యశోధన; దయ = కరుణా; హీనులు = లేనివారు; ఐ = అయ్యి; క్రోధ = క్రౌర్యము; మాత్సర్యంబుల = మచ్చరములతో; స్త్రీ = ఆడవారిని; బాల = పిల్లలను; గో = గోవులను; ద్విజాతులన్ = విప్రులను; వధియింపన్ = చంపుటకు; రోయక = వెనుదీయక; పరధన = తనదికానిసంపదలందు; పరస్త్రీ = తనదికానిస్త్రీలందు; పరులు = ఆసక్తికలవారు; ఐ = అయ్యి; రజస్ = రజోగుణము; తమోగుణ = తమోగుణములందు; రతులు = తగిలివర్తించువారు; ఐ = అయ్యి; అల్ప = నీచ; జీవులు = ప్రాణులు; ఐ = అయ్యి; అల్ప = చిన్న; బలులు = బలములుగలవారు; ఐ = అయ్యి; హరి = విష్ణుమూర్తి; చరణ = పాదములనెడి; అరవింద = పద్మముల; మకరందరస = తేనెలను; ఆస్వాదులు = అనుభవించువారు; కాక = కాకుండపోయి; తమ = వారి; లోన్ = లో; అన్యోన్య = ఒకరిపైనొకరు; వైరానుబంధులు = పగలుపెంచుకొన్నవారు; ఐ = అయ్యి; సంగ్రామ = యుద్ధ; రంగంబులన్ = భూములలో; హతులు = ప్రాణాలుకోల్పోయినవారు; అయ్యెదరు = ఔతారు; ఆ = ఆ; సమయంబునన్ = కాలమునందు; ప్రజలు = లోకులు; తత్ = అట్టి; శీల = వర్తనలు; వేషభాష = వేషభాషలు; ఆదులన్ = మున్నగువానిని; అనుసరించి = ప్రకారమే; ఉండెదరు = ఉంటారు; కావున = కనుక.

భావము:

అటుపిమ్మట, కణ్వవంశంలో సుశర్ముడనే రాజు పుడతాడు. కాని, అతని భృత్యుడు, ఆంధ్ర జాతీయుడు అయిన వృషలుడు అధర్మమార్గంలో అతనిని వధిస్తాడు. రాజ్యాన్ని చేపట్టి అవక్రవిక్రమంతో పరిపాలిస్తాడు. అతని పిమ్మట, అతని తమ్ముడు కృష్ణుడు రాజవుతాడు. తరువాత శాంతకర్ణుడు, పౌర్ణమాసుడు, లంబోదరుడు, శిబిలకుడు, మేఘస్వాతి, దండమానుడు, నాగలి పట్టేవాడైన అరిష్టకర్మ, తిలకుడు, పురీషసేతుడు, సునందనుడు, వృకుడు, జటాపుడు, శివస్వాతి, అరిందముడు, గోమతి, పురీమంతుడు, దేవశీర్షుడు, శివస్కంధుడు, యజ్ఞశీలుడు, శ్రుతస్కంధుడు, యజ్ఞశత్రుడు, విజయుడు, చంద్రబీజుడు, సులోమధి అనే రాజులు వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యాన్ని క్రమంగా అనుభవిస్తారు. వారందరు కలిసి పరిపాలించే కాలం నాలుగువందలయేభైఆరు సంవత్సరములు.
ఆ తరువాత నాభీరవంశం వారు ఏడుగురు, గర్దభవంశం వారు పదిమంది, కంకవంశం వారు పదహారుమంది రాజ్యభారాన్ని ధరించి పరిపాలిస్తారు. అటు పిమ్మట ఎనిమిదిమంది యవనులు, పదునాలుగురు బర్బరులు ప్రభువులు అవుతారు. అటు తరువాత గురుండులు పదముగ్గురు, మౌనులు పదకొండుమంది ప్రభులు అవుతారు. గురుండులు గర్వంతో కన్నూమిన్నూ కానకుండా పంతొమ్మిదివందలతొమ్మిది ఏళ్ళు పరిపాలన సాగిస్తారు. అటు పిమ్మట మౌనవంశంలో పుట్టిన పదకొండుమంది మూడువందల సంవత్సరాలపాటు క్రోధబుద్ధితో పరిపాలన సాగిస్తారు. అదే సమయంలో కైలికిలులు అనే యవనులు భూపాలన చేస్తారు. ఆ తరువాత భూతనందుడు, నవభంగిరుడు, శిశునందుడు, అతని తమ్ముడు యశోనందుడు, ప్రవీరకుడు అనేవారు వీరులై నూటఆరు ఏళ్ళు పాలకులు అవుతారు. ఆ రాజుకు పదముగ్గురు కొడుకులు పుడతారు. వారిలో ఆరుగురు బాహ్లిక దేశానికి అధిపతులు అవుతారు. మిగిలిన ఏడుగురు కోసల దేశానికి అధిపతులు అవుతారు.
అపుడు వైడూర్యపతులు నిషధదేశానికి ఏలికలు అవుతారు. పురంజయుడు మగధదేశ ప్రభువుగా ప్రభవిస్తాడు. పుళిందులూ, యదువంశస్థులూ మద్రదేశీయులూ అయిన హీనజాతి జనులు బ్రహ్మజ్ఞాన హీనులూ హరిభక్తి విహీనులు కాగా వారికి ధర్మాన్ని ఉపదేశించి నారాయణుని పట్ల భక్తి తాత్పర్యాలు కలిగిస్తాడు. శక్తిశౌర్యసమన్వితులైన క్షత్రియుల వంశాలను తొక్కిపెట్టి పద్మావతీనగరం రాజధానిగా చేసుకుని గంగనుంచి ప్రయాగవరకూ ఉన్న భూమిని పరిపాలిస్తాడు.
శూద్రప్రాయులైన రాజులు, సంస్కారరహితులు, నాస్తికులు అయిన బ్రాహ్మణులు, సౌరాష్ట్రము, అవంతి, ఆభీరము, అర్భుదము, మాళవము అనే దేశాలకు ప్రభులు అవుతారు. సిందుతీరంలోను, చంద్రభాగ పరిసరాలలోను, కాశ్మీరదేశంలోను, మ్లేచ్ఛ రాజులు పరిపాలన చేస్తారు. వారికి తెలివితేటలు ఉండవు. ధర్మము, సత్యము, దయ ఉండవు. పెచ్చరిల్లిన క్రోధ మాత్సర్యాలతో స్త్రీలనూ బాలకులనూ గోవులనూ బ్రాహ్మణులనూ వధించడానికి సైతం వెనుతీయరు. పరధనాశక్తి, పరవనితాశక్తి కలిగి రజోగుణంలోనూ తమోగుణంలోనూ మునిగి అల్పాయువులు, అల్పబలులు అవుతారు. శ్రీవిష్ణు పాదపద్మ మకరందంలోని రుచి వారికి తెలియదు. ఒకరి పట్ల ఒకరు వైరాలు పెంచుకుని యుద్ధాలకు సిద్ధపడి ప్రాణాలు కోల్పోతారు. ఆ కాలంలోని ప్రజలు కూడ వారి వేషభాషలను శీలవృత్తులను అనుకరిస్తారు.