పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : భరతుండు వనంబుఁ జనుట

  •  
  •  
  •  

5.1-97-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నా భరతుండు శ్రీవత్స కౌస్తుభ వనమాలాలంకృతుండును, సుదర్శనాద్యాయుధోపలక్షితుండును, నిజభక్తజనహృదయారవింద నివాసుండును, బరమపురుషుండును నైన వాసుదేవుని యందు నధికభక్తి ననుదినంబును జేయుచుఁ నేఁబదిలక్షలవేలేండ్లు రాజ్యంబు చేసి పితృ పితామహాద్యాయాతంబగు నా ధనంబును యథార్హంబుగఁ బుత్రులకుఁ బంచియిచ్చి బహువిధ సంపదలుగల గృహంబును బాసి పులహాశ్రమంబున కరిగె; నంత.

టీకా:

మఱియున్ = ఇంకను; ఆ = ఆ; భరతుండు = భరతుడు; శ్రీవత్స = శ్రీవత్స మనెడు పుట్టుమచ్చ; కౌస్తుభ = కౌస్తుభమణి; వనమాల = వనమాలలచే; అలంకృతుండును = అలంకరింపబడినవాడు; సుదర్శన = సుదర్శన చక్రము; ఆది = మొదలగు; ఆయుధ = ఆయుధములతో; ఉపలక్షితుండును = దర్శింపబడువాడు; నిజ = తన; భక్త = భక్తులైన; జన = వారి; హృదయ = హృదయము లనెడి; అరవింద = పద్మములందు; నివాసుండును = నివసించెడివాడు; పరమపురుషుడు = పరమపురుషుడు; ఐన = అయినట్టి; వాసుదేవుని = నారాయణుని {వాసుదేవుడు - వసించెడి (స్థితికి) దేవుడు, విష్ణువు}; అందున్ = ఎడల; అధిక = అధికమైన; భక్తిన్ = సేవించుటను; అనుదినంబున్ = ప్రతిదినమును; చేయుచున్ = ఆచరించుతూ; ఏబదిలక్షల = ఏభైలక్షల (50, 00, 000); వేలేండ్లు = దివ్యసంవత్సరములు; రాజ్యంబున్ = రాజ్యమును; చేసి = పాలించి; పితృపితామహాది = వంశపారంపర్యముగా {పితృపితామహాది - తండ్రి తాత మొదలగు వారినుండి వచ్చెడివి, వంశపారంపర్యము}; ఆయతంబున్ = వచ్చినది; అగున్ = అయిన; ఆ = ఆ; ధనంబునున్ = సంపదలను; యథా = తగిన; అర్హంబుగన్ = అర్హతల ప్రకారముగ; పుత్రుల్ = కుమారుల; కున్ = కి; పంచియిచ్చి = పంచేసి; బహు = అనేక; విధ = విధములైన; సంపదలు = సంపదలు; కల = ఉన్నట్టి; గృహంబునున్ = ఇంటిని; పాసి = విడిచి; పులహ = పులహుని; ఆశ్రమంబున్ = ఆశ్రమమున; కున్ = కు; అరిగెన్ = వెళ్లెను; అంత = అప్పుడు.

భావము:

ఇంకా శ్రీవత్సం, కౌస్తుభం, వనమాలల చేత అలంకరింపబడిన వాడు; సుదర్శనం మొదలైన ఆయుధాలను ధరించేవాడు, తన భక్తుల హృదయ పద్మాలలో నివసించేవాడు, పరమ పురుషుడు అయిన వాసుదేవుని పట్ల ఆ భరతుడు ఎల్లప్పుడు భక్తి ప్రపత్తులు కలిగి యాభై లక్షల వేల సంవత్సరాలు రాజ్యపరిపాలన సాగించాడు. తాత తండ్రుల కాలంనుండి తరతరాలుగా సంక్రమించిన ధనరాశిని తగినట్లు తన కుమారులకు పంచి ఇచ్చి అపార సంపదలు గల రాజసౌధాన్ని వదలిపెట్టి పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు. అప్పుడు…

5.1-98-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యాశ్రమంబున నిందిరాధీశ్వరుఁ-
చ్చటి వారల నాదరించి
ప్రత్యక్షమున నుండుఁ బాయక యెప్పుడు-
ట్టి రమ్యం బైన యాశ్రమమున
నిలిచి సాలగ్రామములు గల గండకీ-
ది యెందు నెంతయుఁ దిసి యుండు
చ్చోట నేకాకి గుచును భరతుండు-
హువిధ నవపుష్ప ల్లవముల

5.1-98.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తుల తులసీ దళంబుల నంబువులను
గందమూలాది ఫలములఁ గంజములను
నత నర్చించి నిచ్చలు నివిలేక
సేవ చేయుచు నుండె నా శ్రీపు హరిని.

టీకా:

ఏ = ఏ; ఆశ్రమంబునన్ = ఆశ్రమములో; ఇందిరాధీశ్వరుడు = విష్ణుమూర్తి {ఇందిరాధీశ్వరుడు - ఇందిర (లక్ష్మీదేవి)కి ఈశ్వరుడు (భర్త), విష్ణువు}; అచటి = అక్కడి; వారలన్ = జనులను; ఆదరించి = మన్నించి; ప్రత్యక్షమునన్ = ప్రత్యక్షముగ; ఉండున్ = ఉండనో; పాయక = విడువక; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; అట్టి = అటువంటి; రమ్యంబు = చక్కటిది; ఐన = అయిన; ఆశ్రమమున = ఆశ్రమమునందు; నిలిచి = ఉండి; సాలగ్రామములున్ = సాలగ్రామశిలలు {సాలగ్రామము - విష్ణుమూర్తి చిహ్నిత శిలావిశేషము}; కల = కలిగిన; గండకీ = గండకి యనెడి; నది = నది; ఎందున్ = ఎక్కడైతే; ఎంతయున్ = మిక్కిలి; కదిసి = సమీపించి; ఉండున్ = ఉండనో; అచ్చోటన్ = అక్కడ; ఏకాకి = ఒంటరి; అగుచునున్ = అగుచు; భరతుండు = భరతుడు; బహు = అనేక; విధ = రకములైన; నవ = కొత్త; పుష్ప = పూలు; ఫలములన్ = పండ్లతోను; అతుల = సాటిలేని.
తులసీదళంబులన్ = తులసీదళములతోను; అంబువులను = నీటితోను; కందమూల = కందదుంపలు; ఆది = మొదలగు; ఫలములన్ = పండ్లతోను; కంజములను = పద్మములతోను; ఘనతన్ = గొప్పగా; అర్చించి = పూజించి; నిచ్చలున్ = నిత్యము; తనివి = తృప్తి; లేక = తీరక; సేవచేయుచున్ = సేవించుతూ; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ; శ్రీపు = నారాయణుని {శ్రీపు - శ్రీ (లక్ష్మీదేవి) యొక్క పు (పురుషుడు), విష్ణువు}; హరిని = నారాయణుని.

భావము:

ఏ ఆశ్రమంలో విష్ణువు అక్కడి వాళ్ళను ఆదరిస్తూ ప్రత్యక్ష రూపంలో నిలిచి ఉంటాడో, సాలగ్రామాలకు ఆలవాలమైన గండకీనది ఏ ఆశ్రమ సమీపంలో ప్రవహిస్తూ ఉంటుందో అటువంటి ఆ రమణీయమైన పులహ ఆశ్రమంలో భరతుడు ఒంటరిగా ఉంటూ శ్రీహరిని నానావిధాలైన పువ్వులతో, చిగుళ్ళతో, తులసీదళాలతో, తీర్థజలాలతో, కందమూల ఫలాలతో, కమలాలతో నిత్యం గొప్పగా అర్చిస్తూ తనివితీరా సేవ చేస్తున్నాడు.

5.1-99-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దానం జేసి విగత విషయాభిలాషుండై శమదమాది గుణంబులు గలిగి యథేచ్ఛంజేసి యెడతెగక పరమపురుషుని పరిచర్యా భక్తిభరంబున శిథిలీకృత హృదయగ్రంథిఁ గలిగి సంతోషాతిశయంబునం బులకితాంగుండు, నానంద బాష్పనిరుద్ధావలోక నయనుండు నగుచు నిజస్వామి యైన హరిచరణారవిందానుధ్యాన పరిచిత భక్తియోగంబునం బరమానంద గంభీర హృదయంబను నమృతహ్రదంబున నిమగ్నుం డగుచుఁ దానపుడు పూజించు పూజ నెఱుంగక యిట్లు భగవద్వ్రతంబు ధరియించి యేణాజిన వాసస్త్రిషవణ స్నానంబుల నార్ద్రకుటిల కపిశ వర్ణ జటాకలాపంబులు గలిగి మార్తాండాంతర్గతుం డయిన పరమేశ్వరుని హిరణ్మయ పురుషునింగాఁ దలంచుచు నిట్లనియె.

టీకా:

దానన్ = దాని; చేసి = వలన; విగత = నశించిన; విషయ = ఇంద్రియార్థము లందు; అభిలాషుండు = ఆసక్తి గలవాడు; ఐ = అయ్యి; శమ = శాంతి {శమము - కామక్రోధాది లేక ఉండుట, శాంతి}; దమ = ఇంద్రియనిగ్రహము, ఓర్పు; ఆది = మొదలగు; గుణంబులున్ = సుగుణములు; కలిగి = కలిగి; యథేచ్చ = ఇష్టానుసారము; చేసి = వలన; ఎడతెగక = వ్యవధానము లేకుండ; పరమపురుషుని = నారాయణుని; పరిచర్యా = సేవించుట; భక్తిన్ = పూజించుటవలని; భరంబునన్ = భారముతో; శిథలీ = విప్పివేయుట; కృత = చేయబడిన; హృదయ = హృదయ మనెడి; గ్రంథి = ముడి; కలిగి = కలిగి; సంతోష = సంతోషము; అతిశయంబునన్ = అధిక మగుటచేత; పులకిత = పులకరించిన; అంగుండున్ = దేహము గలవాడు; ఆనంద = ఆనందము యొక్క; బాష్ప = బాష్పముల వలన; నిరుద్ధ = అడ్డుపడుతున్న; అవలోకన = చూపు గల; నయనుండున్ = కన్నులు గలవాడు; అగుచున్ = అగుచు; నిజ = తన యొక్క; స్వామి = ప్రభువు; ఐన = అయినట్టి; హరి = నారాయణుని; చరణ = పాదములు యనెడి; అరవింద = పద్మములను; అనుధ్యాన = మిక్కిలి ధ్యానించుటచే; పరిచిత = అలవాటైన; భక్తియోగంబునన్ = భక్తియోగమువలన; పరమానంద = పరమానందము కలిగినది; గంభీర = గంభీరమైనది యైన; హృదయంబు = హృదయము; అను = అనెడి; అమృత = అమృతపు; హ్రదంబునన్ = సరస్సులో; నిమగ్నుండు = నిండామునిగినవాడు; అగుచున్ = అగుచూ; తాన్ = తాను; అపుడున్ = అప్పుడు; పూజించు = పూజించెడి; పూజన్ = పూజను; ఎఱుంగక = తెలియక; ఇట్లు = ఈ విధముగ; భగవత్ = భగవంతుని యెడ; వ్రతంబున్ = నిష్ఠను; ధరియించి = పూని; ఏణ = లేడి; అజిన = చర్మపు; వాసత్ = వస్త్రము; త్రిషవణస్నానంబులన్ = త్రిషవణస్నానములతో {త్రిషవణస్నానములు – ముప్పొద్దుల చేయు స్నానములు, మూడు సవనముల ముందు చేయు స్నానములు}; ఆర్ద్ర = తడసి; కుటిల = ఉంగరాలు తిరిగిన; కపిశ = కందు, పసుపు కలసిన యెరుపు; వర్ణ = రంగు గల; జటా = జటల; కలాపంబులున్ = చుట్టలు; కలిగి = కలిగి; మార్తాండ = సూర్యమండలము; అంతర్గతుండు = లోపల ఉన్నవాడు; అయిన = అయిన; పరమేశ్వరుని = భగవంతుని; హిరణ్ = బంగారముతో, కిరణములతో; మయ = నిండిన; పురుషునిన్ = పురుషునిగా; తలంచుచున్ = భావించుతూ; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అటువంటి హరిసేవ వల్ల అతనికి విషయవాంఛలు నశించాయి. శమ దమాది గుణసంపద అలవడింది. పరమపురుషుణ్ణి భక్తి భావంతో ఎడతెగకుండా భజిస్తుంటే అహంకారమనే ముడి విడిపోయి ఆనందానుభూతి కలిగింది. అతని మేను పులకించింది. కన్నులలో ఆనందాశ్రువులు పొంగిపొరలాయి. ఇష్టదైవమైన శ్రీహరి పాదపద్మాలను ధ్యానించడం వల్ల ప్రాప్తమైన భక్తియోగం కారణంగా అతని హృదయం పరమానందంతో నిండింది. ఆ ఆనందానుభవం అమృత సరోవరంలో అవగాహన చేసినట్లుగా అనిపించింది. ఆ అనుభూతితో భరతునికి తాను చేస్తున్న పూజకూడా తెలియనంత తన్మయత్వం కలిగించింది. ఈ విధంగా భగవంతుని సేవావ్రతంలో మునిగిపోయిన భరతుడు జింక చర్మం ధరించాడు. మంత్ర పూర్వకంగా మూడు వేళలా స్నానం ఆచరించాడు. నిత్యం స్నానం చేయడం వల్ల తల వెంట్రుకలు తడిసి వంపులు తిరిగి జడలు కట్టి రాగి రంగుతో మెరువసాగాయి. సూర్యమండల మధ్యవర్తి అయిన పరమేశ్వరుణ్ణి హిరణ్మయ పురుషునిగా భావిస్తూ భరతుడు ఇలా అన్నాడు.

5.1-100-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్మఫలంబులఁ డఁక నిచ్చుచు మనో-
వ్యాపారమున నిట్టి ఖిలలోక
ములఁ జేసి యా లోకములకు నంతర్యామి-
గుచుఁ బ్రవేశించి యంత మీఁద
నానంద రూప మైట్టి బ్రహ్మముఁ గోరు-
చున్న జీవునిఁ దనలోని యోగ
క్తిచేఁ దగ ననిశంబుఁ బాలన చేయు-
చుండి యంతటను మార్తాండమధ్య

5.1-100.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్తి యగుచు నిట్లు ఱలుచు జగముల
యందు నుండి ప్రకృతిఁ బొంద కంత
తుల దివ్యమూర్తియైన యానంద రూ
మును శరణ మొందె రతవిభుఁడు.

టీకా:

కర్మ = చేసిన కర్మలకు; ఫలంబులన్ = ఫలితములను; కడకన్ = పూని; ఇచ్చుచున్ = ఇచ్చుచూ; మనః = మనసు యొక్క; వ్యాపారమునన్ = వర్తనముతో; ఇట్టి = ఇటువంటి; అఖిల = సర్వ; లోకములన్ = జగములను; చేసి = సృష్టించి; ఆ = ఆ; లోకముల్ = జగముల; కున్ = కు; అంతర్యామి = లోనవ్యాపించియుండువాడు; అగుచున్ = అగుచు; ప్రవేశించి = చొచ్చి; అంతమీదన్ = ఆ తరువాత; ఆనంద = ఆనందమే; రూపము = స్వరూపముగలిగినది; ఐనట్టి = అయినట్టి; బ్రహ్మమున్ = పరబ్రహ్మమును; కోరుచున్న = కోరుకుంటున్న; జీవునిన్ = వానిని; తన = తన; లోని = లో యున్న; యోగశక్తి = యోగశక్తి; చేన్ = తోటి; తగన్ = అవశ్యము; అనిశంబున్ = ఎల్లప్పుడు; పాలన = పరిపాలించుట; చేయుచుండి = చేయుచూ; = అంతటను = అప్పుడు; మార్తాండ = సూర్యమండలము; మధ్యన్ = మధ్యలో; వర్తి = వర్తించెడివాడు; అగుచున్ = అగుచూ; ఇట్లు = ఈ విధముగ.
వఱలుచున్ = ప్రసిద్ధిచెందుతూ; జగములన్ = లోకముల; అందున్ = అందు; ఉండి = ఉండి; ప్రకృతిన్ = ప్రకృతిని; పొందక = చెందకుండ; అంతన్ = అంతట; అతుల = సాటిలేని; దివ్య = దివ్యమైన; మూర్తి = స్వరూపముగలవాడు; ఐన = అయినట్టి; ఆనంద = అనందమే; రూపమునున్ = స్వరూపమైనవాని; శరణము = శరణు; ఒందెన్ = పొందెను; భరత = భరతుడు యనెడి; విభుడు = ప్రభువు.

భావము:

“జీవులకు కర్మఫలాలను ప్రసాదించేవాడవు. కేవలం సంకల్పమాత్రాన ఈ లోకాలను సృష్టించావు. మరి నీవే ఈ లోకాలలో అంతర్యామివై ఉన్నావు. ఆనంద స్వరూపమైన బ్రహ్మాన్ని అందుకోవాలనే జీవులను నీ యందలి యోగశక్తితో ఎల్లప్పుడు కాపాడుతున్నావు. సూర్య మండలం మధ్యభాగంలో ప్రకాశిస్తూ సమస్త లోకాలలో నిండి ప్రకృతికి అతీతంగా ప్రకాశిస్తున్నావు” అంటూ ఆనందమయుడు, దివ్యమంగళ స్వరూపుడు అయిన భగవంతుని భరతుడు శరణు వేడాడు.

5.1-101-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నా భరతుం డొక్కనాఁ డా మహానదిం గృతాభిషేకుండయి ముహూర్తత్రయం బంతర్జలంబులందుఁ బ్రణవోచ్ఛారణంబు చేయుచుండు సమయంబున, నిర్భరగర్భిణియగు నొక్క హరిణి జలార్థినియై యొంటి జలాశయ సమీపంబునకు వచ్చి, జలపానంబు చేయు నెడ నా సమీపంబున మృగపతి గర్జించి లోకభయంకరంబుగ నాదంబు సేయ నా హరిణి స్వభావంబున భీత యగుటం జేసి బెగ్గడిలి హరి విలోకనవ్యాకుల చిత్తయై దిగ్గన నదిరి గగనంబునకు నెగిరి; యపగత తృష యగుచు నది నుల్లంఘించు నెడ నధిక భయంబునం జేసి యా గర్భంబు యోని ద్వారంబున గళితంబై జలంబులం బడియె; నా హరిణి యుల్లంఘనాది భయంబునం జేసి తత్తీరీరంబున నుండు గిరిదరిం బడి శరీరంబుఁ బాసె; నంత నా హరిణపోతంబు జలంబులం దేలుచున్న భరతుండు గను విచ్చి చూచి కరుణార్ద్ర చిత్తుండై మృతజనని యగు నా హరిణపోతంబును దన యాశ్రమంబునకుం గొంపోయి మిక్కిలి ప్రీతిం జేసి యుపలాలనంబు చేయుచుండఁ బోషణ పాలన ప్రీణన లాలనాను ధ్యానంబుల భరతునకు నాత్మనియమంబు లైన యష్టాంగయోగంబులును బరమపురుష పూజా పరిచర్యాదులు నొక్కొక్కటిగఁ గ్రమక్రమంబునం గొన్ని దినంబులకు సమస్తంబును నుత్సన్నం బయ్యె; నంత.

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; భరతుండు = భరతుడు; ఒక్క = ఒక; నాడు = దినమున; ఆ = ఆ; మహా = గొప్ప; నదిన్ = నదిలో; కృత = చేసిన; అభిషేకుండు = స్నానము చేసినవాడు; అయి = అయ్యి; ముహూర్త = ముహూర్తములు {ముహూర్తము - అల్పకాలము, అరగంట}; త్రయంబున్ = మూటి సమయము; అంతర్ = లోపలి, లోతున్న; జలంబులన్ = నీటి; అందున్ = అందు; ప్రణవ = ఓంకారము; ఉచ్ఛారణంబున్ = ఉచ్చరించుట; చేయుచున్ = చేయుచూ; ఉండు = ఉండెడి; సమయంబునన్ = సమయము నందు; నిర్భర = నిండు; గర్భిణి = గర్భిణి; అగు = అయినట్టి; ఒక్క = ఒక; హరిణి = ఆడులేడి; జల = నీటిని; అర్థిని = కోరునది; ఐ = అయ్యి; ఒంటిన్ = ఒంటరిగా; జలాశయ = నీటికొలను; సమీపంబున్ = దగ్గర; కున్ = కు; వచ్చి = వచ్చి; జల = నీటిని; పానంబుచేయు = తాగెడి; ఎడన్ = సమయములో; ఆ = ఆ; సమీపంబునన్ = దగ్గరలోని; మృగపతి = సింహము; గర్జించి = గర్జించి; లోక = మిక్కిలి; భయంకరంబుగన్ = భయంకరముగ; నాదంబున్ = శబ్దము; చేయన్ = చేయగా; ఆ = ఆ; హరిణి = లేడి; స్వభావంబునన్ = స్వభావము రీత్యా; భీత = భయపడునది; అగుటన్ = అగుట; చేసి = వలన; బెగ్గడిల్లి = భయపడి; హరి = సింహమును; విలోకన = చూసిన; వ్యాకుల్ = వికలమైన, చీకాకు చెందిన; చిత్త = మనసు గలది; ఐ = అయ్యి; దిగ్గన = తటాలున; అదిరి = ఉలికిపడి; గగనంబున్ = ఆకాశమున; కున్ = కు; ఎగిరి = గెంతి; అపగత = తీరని; తృష = దాహము గలది; అగుచున్ = అగుచు; నదిన్ = నదిని; ఉల్లంఘించు = దాటెడి; ఎడన్ = సమయములో; అధిక = అధికమైన; భయంబునన్ = భయము; చేసి = వలన; ఆ = ఆ; గర్భంబున్ = గర్భము; యోని = యోని; ద్వారంబునన్ = ద్వారా; గళితంబు = జారినది; ఐ = అయ్యి; జలంబులన్ = నీటిలో; పడియెన్ = పడిపోయెను; ఆ = ఆ; హరిణి = లేడి; ఉల్లంఘన = దాటుట; ఆది = మొదలైన; భయంబునన్ = భయముల; చేసి = వలన; తత్ = ఆ; తీరంబునన్ = ఒడ్డున; ఉండు = ఉండెడి; గిరి = కొండ; దరిన్ = పక్కన; పడి = పడిపోయి; శరీరంబున్ = దేహమును; పాసెన్ = విడిచెను; అంతన్ = అంతట; ఆ = ఆ; హరిణ = లేడి; పోతంబున్ = పిల్ల; జలంబులన్ = నీటిలో; తేలుచున్న = తేలుతుండగా; భరతుండు = భరతుడు; కనువిచ్చి = కళ్ళువిప్పి; చూచి = చూసి; కరుణా = దయతో; అర్ద్ర = ఆర్ద్రమైన; చిత్తుండు = మనసు గలవాడు; ఐ = అయ్యి; మృత = మరణించిన; జనని = తల్లిగలది; అగు = అయినట్టి; ఆ = ఆ; హరిణ = లేడి; పోతంబున్ = పిల్లని; తన = తన యొక్క; ఆశ్రమంబున్ = ఆశ్రమమున; కున్ = కు; కొంపోయి = తీసుకువెళ్లి; మిక్కిలి = అధికమైన; ప్రీతిన్ = ప్రేమ; చేసి = కలిగి; ఉపలాలనంబు = బుజ్జగింపు; చేయుచుండన్ = చేయుచుండగా; పోషణ = పోషించుట; పాలన = రక్షించుట; ప్రీణన = తృప్తిపరచుట; లాలన = లాలించుట; అనుధ్యానంబులన్ = దానినే స్మరించుటలవలన; భరతున్ = భరతుని; కున్ = కి; ఆత్మ = స్వంతముగా ఏర్పరచుకొన్న; నియమంబులు = నియమములు; ఐన = అయినట్టి; అష్టాంగయోగంబులునున్ = అష్టాంగయోగములు {అష్టాంగ యోగములు - యోగమునకైన ఎనిమిది విధములు, 1యమము 2నియమము 3ఆసనము 4ప్రాణాయామము 5ప్రత్యాహారము 6ధారణ 7ధ్యానము 8సమాధి}; పరమపురుష = భగవంతుని; పూజ = పూజించుట; పరిచర్య = సేవించుట; ఆదులు = మొదలైనవి; ఒక్కొక్కటిన్ = ఒకటొకటే; క్రమక్రమంబునన్ = వరుసగా; కొన్ని = కొన్ని; = దినంబుల్ = దినముల; కున్ = కు; సమస్తంబునున్ = అన్నియును; ఉత్సన్నంబు = మిక్కిలి తగ్గిపోయినవి; అయ్యెన్ = అయినవి; అంతన్ = అంతట.

భావము:

అంత ఒకనాడు భరతుడు గండకీనదిలో స్నానంచేసి మూడు ముహూర్తాల కాలం నీటిలో నిలబడి ప్రణవం జపిస్తున్నాడు. అప్పుడు నిండు చూలాలైన లేడి ఒకటి నీరు త్రాగాలని ఒంటరిగా నదీ తీరానికి వచ్చింది. అది నీరు త్రాగుతుండగా ఆ నదీ సమీపంలో ఒక సింహం దిక్కులు పిక్కటిల్లే విధంగా భయంకరంగా గర్జించింది. పుట్టుకతోనే భయ స్వభావం గలిగిన లేడి ఆ ధ్వనిని విని అదిరిపడింది. ఆ ఆడజింక తత్తరపాటుతో దప్పిక తీర్చుకోకుండానే అమాంతం పైపైకిఎగిరి ఆవల గట్టుకు ఒక్క దూకు దూకింది. అలా అకస్మాత్తుగా కలిగిన భయంతో లంఘించడంలో దాని గర్భంలోని పిల్ల జారి నదీ జలాలలో పడింది. ఆందోళనగా ఒక్కసారిగా దూకటంలో తల్లి జింక ఆ నదీ తీరంలోని కొండరాతి మీద పడి ప్రాణాలు విడిచింది. అపుడు నదీ జలాలలో విలవిలలాడుతూ మునిగి తేలుతున్న లేడిపిల్లను చూచిన భరతుని హృదయం తల్లడిల్లింది. దయార్ద్రచిత్తుడై అతడా లేడిపిల్లను తన ఆశ్రమంలోనికి తీసికొని వచ్చాడు. ఆ బాలకురంగాన్ని ఎంతో గారాబంగా సాకడం మొదలు పెట్టాడు. దానిని లాలించడం పాలించడంలో, దానిని ముద్దుగా పెంచి పెద్ద చేయడంలో ఆసక్తుడై క్రమంగా భరతుడు తన నిత్యకృత్యాలైన అష్టాంగ యోగాలను, భగవంతుని పూజాకైంకర్యాలను మరిచిపోయాడు. క్రమక్రమంగా అతని నిత్యనైమిత్తిక క్రియాకలాపాలు ఒక్కటొక్కటే మూలబడ్డాయి.

5.1-102-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తపము చలన మొందుట
యును భరతుం డెఱుఁగ కాత్మయోగంబునఁ జ
య్యనఁ బాసె హరిణపోతముఁ
మదిలో నిల్పి ప్రీతి ప్పక పలికెన్.

టీకా:

ఘన = గొప్ప; తపమున్ = తపస్సు; చలనమున్ = చెదిరి; ఒందుటయునున్ = పోవుటను; భరతుండు = భరతుడు; ఎఱుగక = తెలిసికొనక; ఆత్మ = స్వంత; యోగంబున్ = యోగాభ్యాసమును; చయ్యన = క్రమక్రమముగా; పాసెన్ = దూరమయ్యెను; హరిణ = లేడి; పోతమున్ = పిల్లని; తన = తన యొక్క; మది = మనసు; లోన్ = లో; నిల్పి = నిలుపుకొని; ప్రీతిన్ = ప్రేమను; తప్పక = వదలక; పలికెన్ = పలికెను.

భావము:

భరతుడు తన తపస్సు చెదరిపోవడాన్ని తెలిసికోకుండా యోగాభ్యాసానికి క్రమక్రమంగా దూరమయ్యాడు. ఆ జింకపిల్ల మీది గారాబంతో తన మనస్సులో ఇలా అనుకున్నాడు.

5.1-103-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్కట! తల్లిఁ బాసి హరిణార్భక మాప్తులు లేమిఁజేసి యే
దిక్కునులేక యున్న నిటఁ దెచ్చితి; నా యెడ నీ మృగార్భకం
బెక్కుడు ప్రేమ చేసి చరియించుచు నున్నది; నాదు సన్నిధిన్
క్కువ చేసి దీనిఁ గడు న్ననలం దగఁ బ్రోతు నెంతయున్.

టీకా:

అక్కట = అయ్యో; తల్లిన్ = తల్లిని; పాసి = దూరమై; హరిణ = లేడి; అర్భకమున్ = పిల్ల; ఆప్తులు = తనవారు; లేమి = లేకపోవుట; చేసి = వలన; ఏ = ఏ; దిక్కున్ = ఆశ్రయము; లేక = లేకుండగ; ఉన్నన్ = ఉండగా; ఇటన్ = ఇక్కడికి; తెచ్చితిన్ = తీసుకొని వచ్చితిని; నా = నా; ఎడన్ = అందు; ఈ = ఈ; మృగ = లేడి; అర్భకంబు = పిల్ల; ఎక్కుడు = మిక్కిలి; ప్రేమన్ = ప్రేమ; చేసి = కలిగి; చరియించుచునున్నది = తిరుగుతు ఉన్నది; నాదు = నా యొక్క; సన్నిధిని = దగ్గరలో; మక్కువ = ప్రేమ; చేసి = చూపి; దీనిన్ = దీనిని; కడు = మిక్కిలి; మన్ననలన్ = ఆదరములుతో; తగన్ = అవశ్యము; ప్రోతున్ = కాపాడెదను; ఎంతయున్ = ఎంతగానో.

భావము:

“పాపం! ఈ జింక పిల్లకు తల్లి లేదు. ఆప్తులు లేరు. దిక్కెవ్వరూ లేని కారణం వల్ల దీనిని ఇక్కడికి తీసుకొని వచ్చాను. నేనంటే ఎంతో ప్రేమతో నన్ను అంటిపెట్టుకొని తిరుగుతున్నది. అందుచేత నాచేత నయినంత వరకు దీనిని తప్పక కాపాడుతాను.

5.1-104-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణని వచ్చిన జంతువుఁ
రుణం గను విచ్చి చూచి కాచిన పుణ్యం
యఁగ నధికం బని ము
న్గ మెఱిఁగించిరి మునీంద్రణములు ప్రేమన్.

టీకా:

శరణు = కాపాడు; అని = అని; వచ్చిన = వచ్చినట్టి; జంతువున్ = జంతువును; కరుణన్ = దయతో; కనువిచ్చి = కళ్ళువిప్పి; చూచి = చూసి; కాపాడినన్ = కాపాడితే; పుణ్యంబు = పుణ్యము; అరయగన్ = తరచి చూసిన; అధికంబు = ఎక్కువ; అని = అని; మున్ = పూర్వము; కరమున్ = మిక్కిలిగ; ఎఱిగించిరి = తెలిపిరి; ముని = మునులలో; ఇంద్ర = ఇంద్రుని వంటివారి; గణములున్ = సమూహములు; ప్రేమన్ = ప్రేమతో.

భావము:

శరణు కోరి వచ్చిన ఏ జంతువునైనా కనికరంతో కన్నెత్తి చూచి కాపాడటం కంటే మహాపుణ్యం మరేదీ లేదని మునీంద్రులు చెప్పారు.”

5.1-105-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు హరిణపోతంబుం దన యాశ్రమంబున నత్యాసక్తిం జేసి యాసన శయనాటన స్నాన సమిత్కుశ కుసుమ ఫల ఫలాశ మూలోదకాహరణ దేవపూజాజపాదుల యెడం దన యొద్దన యునిచి కొనుచు వృక సాలావృకాది క్రూరమృగంబుల వలని భయంబున వనంబుల వెనువెంటం దిరగుచు నధిక ప్రణయభరపరీతహృదయుం డగుచు నతి స్నేహంబునంజేసి కొంతసేపు స్కంధంబుల వహించుచు; మఱికొంతతడ వురంబున నుత్సంగంబున నుంచికొని లాలించుచు సంతసంబు నొందు; మఱియు నా భరతుండు నిత్యనైమిత్తికాది క్రియా కలాపంబు నిర్వర్తించు నెడ నంతనంత లేచి హరిణకుణకంబుఁ జూచుచుఁ గించిత్స్వస్థ హృదయుండై దాని నాశీఃపరంపరల నభినందించుచుఁ జుంబనాదులఁ బ్రీతిచేయుచు నతిమోహంబునం బెంచుచుండు నెడ.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; హరిణ = లేడి; పోతంబున్ = పిల్లను; తన = తన యొక్క; ఆశ్రమంబునన్ = ఆశ్రమములో; అతి = మిక్కిలి; ఆసక్తిన్ = లాలస; చేసి = వలన; ఆసన = కూర్చొనుట; శయన = పండుకొనుట; అటన = అటునిటు తిరుగుట; స్నాన = స్నానము చేయుట; సమిత్ = ఏరి తెచ్చెడి; కుశ = సమిధలు; కుసుమ = పూలు; ఫల = పండ్లు; ఫలాశ = పత్రి; మూల = దుంపలు; ఉదక = నీరు; ఆహరణన్ = తెచ్చుట; దేవ = దేముని; పూజ = పూజించుట; జప = జపము చేయుట; ఆదులు = మొదలగువాని; ఎడన్ = సమయములో; తన = తన; ఒద్దనన్ = దగ్గర; ఉనిచికొని = ఉంచుకొనుచు; వృక = తోడేలు; సాలావృక = నక్క; ఆది = మొదలగు; క్రూర = క్రూరమైన; మృగంబుల = జంతువుల; వలని = మూలమున; భయంబునన్ = భయముతో; వనంబులన్ = అడవులలో; వెనువెంటన్ = కూడా కూడా; తిరుగుచున్ = తిరుగుతూ; అధిక = మిక్కిలి; ప్రణయ = ప్రేమ; భర = భారముతో; పరీత = నిండిన; హృదయుండు = హృదయము గలవాడు; అగుచున్ = అగుచూ; అతి = మించిన; స్నేహంబునన్ = ప్రీతి; చేసి = వలన; కొంత = కొంచము; సేపు = సమయము; స్కంధంబులన్ = భుజములపైన; వహించుచున్ = మోయుచు; మఱికొంత = ఇంకొంచము; తడవున్ = సమయము; ఉరంబుననున్ = గుండెలపైన; ఉత్సంగంబుననున్ = ఒడిలోను; ఉంచికొని = ఉంచికొని; లాలించుచున్ = బుజ్జగించుచు; సంతసంబున్ = సంతోషమును; ఒందున్ = పొందును; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; భరతుండు = భరతుడు; నిత్య = ప్రతిదినము చేసెడివి; నైమిత్తిక = నియమించుకొని చేసెడివి; ఆది = మొదలగు; క్రియాకలాపంబున్ = కార్యక్రమములు; నిర్వర్తించున్ = ఆచరించెడి; ఎడన్ = సమయములో; అంతనంత = అప్పు డప్పుడు; లేచి = లేచి; హరిణ = లేడి; కుణకంబున్ = పిల్లను; చూచుచున్ = చూసుకుంటూ కించిత్ = కొంత; స్వస్థ = కుదుటబడిన; హృదయుండు = హృదయము గలవాడు; ఐ = అయ్యి; దానిన్ = దానిని; ఆశీస్ = ఆశీర్వాదములుతో; పరంపరలన్ = మరల మరల; అభినందించుచున్ = అభినందించుతూ; చుంబన = ముద్దు పెట్టుకొనుట; ఆదులన్ = మొదలగువానిచే; ప్రీతిన్ = ఆపేక్ష; చేయుచున్ = చూపుతూ; అతి = మిక్కిలి; మోహంబునన్ = మోహముతో; పెంచుచున్ = పెంచుతూ; ఉండు = ఉండెడి; ఎడన్ = సమయములో.

భావము:

అని భావించినవాడై భరతుడెంతో ఆసక్తితో, అనురాగంతో ఆ లేడిపిల్లను సాకడం మొదలు పెట్టాడు. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, అటు ఇటు తిరిగినపుడు, స్నానం చేసేటప్పుడు, సమిధలను పూలను పండ్లను ఆకులను దుంపలను ఏరి తెచ్చుకొనేటప్పుడు, నీరు తెచ్చుకొనేటప్పుడు, దేవతార్చన చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు అతడా బాల హరిణాన్ని తన ప్రక్కనే అట్టిపెట్టుకొనేవాడు. తోడేళ్ళు, నక్కలు మొదలైన క్రూరమృగాలు జింకపిల్లను ఏం చేస్తాయో అని దాని వెనువెంట అడవులకు వెళ్ళేవాడు. రానురాను ఆ జింకపై మమకారం ఎక్కువవుతుంటే దాన్ని భుజాలపై కెక్కించుకొనేవాడు. గుండెలపై పడుకోబెట్టుకొనేవాడు. ఒడిలో చేర్చుకుని బుజ్జగించేవాడు. నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించేటప్పుడు కూడా అప్పుడప్పుడు లేచి జింకపిల్ల ఏమయిందో అని చూచేవాడు. అది కనబడగానే మనసు కుదుట పరచుకొనేవాడు. ఒక్కొక్కప్పుడు ఆ లేడిపిల్లను దీవించేవాడు. నానాటికి ముద్దు మురిపాలతో పెంచుకుంటూ దానిమీద మోహం పెంచుకున్నాడు. ఆ సమయంలో…

5.1-106-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గురువులు వాఱి బిట్టుఱికి కొమ్ములఁ జిమ్ముచు నంతనంత డ
గ్గఱుచును గాలు ద్రవ్వుచు నఖంబుల గీఱుచు గాసి చేయుచు
న్నొగుచు ధారుణీశ్వరుని యూరువులన్ శయనించి యంతలో
కడ మెక్కుచుం బొదిలి యాడుచు నా హరిణంబు లీలతోన్.

టీకా:

గురువులువాఱి = పరుగులు పెడుతూ; బిట్టుఱికి = గభాలున దుముకుతూ; కొమ్ములన్ = కొమ్ములను; చిమ్ముచున్ = విసురుతూ; అంతనంత = అప్పుడప్పడు; డగ్గఱుచునున్ = దగ్గరకు వచ్చుచు; కాలున్ = కాళ్ళతో; త్రవ్వుచున్ = తవ్వుతూ; నఖంబులన్ = గిట్టలతో; గీఱుచున్ = గోకుతూ; గాసి = చీకాకు; చేయుచున్ = చేయుచున్; ఒఱగుచున్ = కూర్చొనుచు; ధారుణీశ్వరునిన్ = రాజుని {ధారుణీశ్వరుడు - ధారుణి (భూమి)కి ఈశ్వరుడు, రాజు}; ఊరువులన్ = తొడలపై; శయనించి = పండుకొని; అంత = ఆ; లోన్ = లో; అఱకడమున్ = మూపుపైన; ఎక్కుచున్ = ఎక్కుతూ; పొదలి = బలిసి; ఆడుచున్ = ఆడుతూ; ఆ = ఆ; హరిణంబున్ = లేడి; లీలతోన్ = క్రీడచేత.

భావము:

ఆ లేడిపిల్ల పరుగులు తీస్తూ, చెంగున దుముకుతూ, కొమ్ములతో విసురుతూ, అప్పుడప్పుడు దగ్గరికి వస్తూ, కాళ్ళతో త్రవ్వుతూ, గిట్టలతో గీరుతూ మారాం చేసేది. ఆ భరతుని తొడలపై పడుకొంటూ, భుజాలమీద ఎక్కి ఆడుకొనేది.

5.1-107-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిమ నీ గతి మెల్లన కెలు వొడిచి
చెలఁగి యాడంగ భరతుండు చిత్త మందు
సంతసిల్లుచు నుండె నాశ్రమముఁ బాసి
రిణడింభక మంతలో సురిఁగి చనిన.

టీకా:

గరిమన్ = గొప్పగా; ఈ = ఈ; గతిన్ = విధముగ; మెల్లన = మెల్లగా; కెరలు పొడిచి = విజృంభించి; చెలగి = చెలరేగి; ఆడంగన్ = ఆడుతుండగా; భరతుండు = భరతుడు; చిత్తమున్ = మనసు; అందున్ = లో; సంతసిల్లుచున్ = సంతోషించుతూ; ఉండెన్ = ఉండెను; ఆశ్రమమున్ = ఆశ్రమ స్థలమును (తన వానప్రస్తాశ్రమమును); పాసి = విడిచి; హరిణ = లేడి; డింభకమున్ = పిల్ల; అంత = ఆ; లోన్ = లోపల; సురిగి = కనిపించకుండగ; చనినన్ = పోగా.

భావము:

ఆ జింకపిల్ల ఈ విధంగా తనపై బడి ఆట లాడుతూ ఉంటే భరతుడు సంతోషించేవాడు. ఒకనాడు అది ఆశ్రమ స్థలాన్ని విడిచి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడు…

5.1-108-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భరతుం డంతం దన్మృగశాబకంబు గానంబడమికి వ్యాకులిత చిత్తుం డగుచు నష్టధనుండునుం బోలె నతిదీనుండై కరుణతోడం గూడి తద్విరహవిహ్వల మతియై దానిన తలంచుచు నతి శోకంబుతో మనంబున దుఃఖించి యిట్లనియె.

టీకా:

భరతుండు = భరతుడు; అంతన్ = అంతట; తత్ = ఆ; మృగ = లేడి; శాబకంబున్ = పిల్ల; కానంబడమికిన్ = కనబడకపోవుటకు; వ్యాకులిత = కలతబారిన; చిత్తుండు = మనసు గలవాడు; అగుచున్ = అగుచూ; నష్ట = పోగొట్టుకొన్న; ధనుండునున్ = ధనము గలవాని; పోలెన్ = వలె; అతి = మిక్కిలి; దీనుండు = దీనుడు; ఐ = అయ్యి; కరుణ = దయ; తోడన్ = తో; కూడి = కలిసి; తత్ = దాని; విరహ = ఎడబాటునకు; విహ్వల = వాపోవుచున్న; మతి = మనసు కలవాడు; ఐ = అయ్యి; దానినిన్ = దానినే; తలంచుచు = తలచుకొనుచూ; అతి = మిక్కిలి; శోకంబు = వగ; తోన్ = తోటి; మనంబునన్ = మనసులో; దుఃఖించి = దుఃఖించి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

భరతుడు ఆ జింకపిల్ల కనిపించక పోయేసరికి మనసు చెదరిపోగా ధనం పోగొట్టు వానివలె దిగులు పడ్డాడు. అది ఎడబాసినందుకు బెంగతో మనస్సులో మాటిమాటికి జింకను తలచుకొంటూ దుఃఖించి ఇలా అన్నాడు.

5.1-109-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రిణపోతంబ! నీకు వనాంతమందుఁ
గ్రూర మృగబాధ లేకుండఁ గోరుచుండఁ
లఁగి పోయితె" యనుచుఁ జిత్తంబునందు
రాజవృషభుండు భరతుఁ డారాట మంది.

టీకా:

హరిణ = లేడి; పోతంబ = పిల్లా; నీకున్ = నీకు; వనాంతము = అడవిమధ్య; అందున్ = లో; క్రూరమృగ = క్రూరజంతువుల; బాధ = బాధ; లేకుండన్ = లేకపోవుటను; కోరుచుండన్ = కోరుకుంటుండగా; తలగి =విడిచి; పోయితె = పోయితివి కదా; అనుచున్ = అనుచూ; చిత్తంబున్ = మనసు; అందున్ = లో; రాజ = రాజులలో; వృషభుండున్ = వృషభమువంటివాడు; భరతుడు = భరతుడు; ఆరాటమున్ = ఆరాటమును; అంది = చెంది.

భావము:

“ఓ జింకపిల్లా! నీకు అడవిలో క్రూరమృగాల బెడద లేకుండా జాగ్రత్త పడ్డాను. అయినా నన్ను విడిచి పోయావా?” అని భరతుడు మనస్సులో ఆరాటపడి…

5.1-110-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లిచచ్చిన హరిణపోతంబు వచ్చి
పుణ్యహీనుండ నగు నన్నుఁ బొంది పాసె;
నేమి చేయుదు? నే నింక నెట్లు గందుఁ?
జేరి యే రీతిఁ గాంచి రక్షించుకొందు?

టీకా:

తల్లి = తల్లి; చచ్చిన = చనిపోయిన; హరిణ = లేడి; పోతంబున్ = పిల్ల; వచ్చి = తిరిగి వచ్చి; పుణ్యహీనుండను = దౌర్భాగ్యుండను; అగు = అయిన; నన్నున్ = నన్ను; పొంది = కలిసి; పాసెన్ = దూరమయ్యెను; ఏమి = ఏమిటి; చేయుదున్ = చేయవలెను; నేనున్ = నేను; ఇంకన్ = ఇంక; ఎట్లు = ఏ విధముగ; కందు = చూచెదను; చేరి = చేరి; ఏ = ఏ; రీతిన్ = విధముగ; కాంచి = కనుగొని; రక్షంచుకొందు = కాపాడుకొనగలను.

భావము:

“తల్లి చచ్చిన జింకపిల్ల దురదృష్టవంతుణ్ణైన నన్ను చేరి ఇప్పుడు విడిచిపోయింది. నేనేం చేయాలి? దానిని మళ్ళీ ఎలా చూస్తాను? చూచి ఎలా దానిని కాపాడుకొంటాను?

5.1-111-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కట్టా! యీ యాశ్రమమునఁ
బుట్టిన తృణచయము మేసి పొదలిన హరిణం
బిట్టట్టుఁ దిరుగు చుండఁగఁ
ట్టి మృగేంద్రుండు గొట్టి బాధించెనొకో?"

టీకా:

కట్టా = అయ్యో; ఈ = ఈ; ఆశ్రమమునన్ = ఆశ్రమములో; పుట్టిన = మొలచిన; తృణ = గడ్డి; చయమున్ = పరకలను; మేసి = తిని; పొదలిన = బలిసిన; హరిణంబున్ = లేడి; ఇట్టట్టు = ఇటునటు; తిరుగుచున్ = తిరుగుతూ; ఉండగన్ = ఉండగా; పట్టి = పట్టుకొని; = మృగేంద్రుండు = సింహము {మృగేంద్రుడు - మృగములలో ఇంద్రునివంటిది, సింహము}; కొట్టి = కొట్టి; బాధించెనొకో = బాధించినదేమో.

భావము:

అయ్యో! ఈ ఆశ్రమంలో మొలిచిన గడ్డిపరకలను తిని నవనవలాడుతూ అటూ ఇటూ తిరుగుతున్న జింకను సింహం కొట్టి బాధించిందేమో?”

5.1-112-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు భరతుండు హరిణకుణక క్షేమంబు గోరుచు “నెప్పుడు వచ్చి నన్ను సంతోషపఱచు? నానా ప్రకారంబులైన తన గతులచేత నన్ను నెప్పు డానందంబు నొందించు? ధ్యానసమాధి నున్నప్పుడు నన్నుఁ గొమ్ముల గోఁకుచు నుండు; నట్టి వినోదంబు లెప్పుడు గనుఁగొందు దేవ పూజాద్రవ్యంబులు ద్రొక్కి మూర్కొనినం గోపించి చూచినం గుమారుడుంబోలె దూరంబునకుం జని నిలిచి మరల నేఁ బిలిచిన వెనుక నిలిచి యుండు; నిట్టి మెలఁకువ స్వభావంబులు గలుగుట యెట్టు? లీ భూదేవి యెంత తపంబు చేసినదియో? యా హరిణ పాదస్పర్శంబులం బవిత్రయైన భూమి స్వర్గాపవర్గకాములైన మునులకు యజ్ఞార్హ యగు నట్టి హరిణపోతంబు నెట్లు గనుఁగొందు? నదియునుంగాక భగవంతుండగు చంద్రుండు మృగపతిభయంబున మృతజననియు, స్వాశ్రమపరిభ్రష్టంబునైన మృగశాబకంబును గొనిపోయి పెంచుచున్నవాఁడో? మున్ను పుత్రవియోగతాపంబునం జంద్రకిరణంబులం బాపుదు; నిప్పుడు హరిణపోతంబు దన శరీర స్పర్శంజేసి చంద్రకిరణంబులకన్న నధికం బగుచుం బుత్ర వియోగతాపంబు నివర్తింపం జేసె” ననుచుం బెక్కు భంగుల హరిణ నిమిత్తంబులైన మనోరథంబులచేతం బూర్వకర్మవశంబున యోగభ్రష్టుండగు భరతుండు భగవదారాధనంబు వలన విభ్రంశితుం డగుచు నితరజాతిం బుట్టిన హరిణపోతంబుమీఁది మోహం బగ్గలం బగుచుండ నుండె;” నని పలికి శుకయోగీంద్రుండు మఱియు నిట్లనియ.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; భరతుండు = భరతుడు; హరిణ = లేడి; కుణక = పిల్ల యొక్క; క్షేమంబున్ = క్షేమమును; కోరుచున్ = కోరుతూ; ఎప్పుడు = ఎల్లప్పుడు; వచ్చి = చేరవచ్చి; నన్నున్ = నన్ను; సంతోష = సంతోష; పఱచున్ = పెట్టును; నానా = వివిధ; ప్రకారంబులు = రకములు; ఐన = అయిన; తన = తన యొక్క; గతుల = వర్తనల; చేతన్ = వలన; నన్నున్ = నన్ను; ఎప్పుడు = ఎప్పుడు; ఆనందంబున్ = ఆనందము; ఒందించు = కలిగించును; ధ్యాన = ధ్యానము నందలి; సమాధిన్ = సమాధిస్థితిలో; ఉన్న = ఉండిన; అప్పుడు = సమయములో; నన్నున్ = నన్ను; కొమ్ములన్ = కొమ్ములతో; గోకుచున్ = గీరుతూ; ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; వినోదంబుల్ = వేడుకలు; ఎప్పుడున్ = ఎప్పుడు; కనుగొందున్ = చూడగలను; దేవ = భగవంతుని; పూజా = పూజకైన; ద్రవ్యంబులున్ = పదార్థములను; త్రొక్కి = తొక్కి; మూర్కొనినన్ = వాసనచూసినందుకు; కోపించి = కోపముచేసి; చూచినన్ = చూసినచో; కుమారుడున్ = పిల్లవాని; పోలెన్ = వలె; దూరంబున్ = దూరమున; కున్ = కు; చని = వెళ్ళి; నిలిచి = నిలుచుండి; మరలన్ = మరల; ఏన్ = నేను; పిలిచినన్ = పిలిచిన; వెనుకన్ = వెనుక తట్టున; నిలిచి = నిలబడి; ఉండున్ = ఉండును; ఇట్టి = ఇటువంటి; మెలకువ = నేర్పు గల; స్వభావంబుల్ = స్వభావములు; కలుగుట = కలుగుట; ఎట్టులు = ఎలావీలయినది; ఈ = ఈ; భూదేవి = భూమాత; ఎంత = ఎంతటి; తపంబున్ = తపస్సును; చేసినదియో = చేసెనో; ఆ = ఆ యొక్క; హరిణ = లేడి; పాద = కాళ్ళ; స్పర్శంబులన్ = తగులుటవలన; పవిత్రము = పవిత్రము; ఐన = అయినట్టి; భూమి = నేల; స్వర్గ = స్వర్గమును; అపవర్గ = మోక్షమును; కాములు = కోరెడివారు; ఐన = అయిన; మునుల్ = మునుల; కున్ = కు; యజ్ఞ = యజ్ఞములు చేయుటకు; అర్హ = తగినది; అగున్ = అగునో; అట్టి = అటువంటి; హరిణ = లేడి; పోతంబున్ = పిల్లను; ఎట్లు = ఏ విధముగా; కనుగొందున్ = కనిపెట్టగలను; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; భగవంతుండు = భగవంతుడు; అగు = అయిన; చంద్రుండు = చంద్రుడు; మృగపతి = సింహము యొక్క {మృగపతి - మృగములకు ప్రభువు, సింహము}; భయంబునన్ = భయముచేత; మృత = మరణించిన; జననియున్ = తల్లి గలది; స్వ = తనయొక్క; ఆశ్రమ = ఆశ్రమమునుండి; పరిభ్రష్టంబున్ = తప్పిపోయినది; ఐన = అయినట్టి; మృగ = లేడి; శాబకంబునున్ = పిల్లను; కొనిపోయి = తీసుకెళ్ళి; పెంచుచున్ = పెంచుతూ; ఉన్నవాడో = ఉన్నాడేమో; మున్ను = ఇంతకు ముందు; పుత్ర = కుమారుల; వియోగ = ఎడబాటు యొక్క; తాపంబునన్ = బాధల; చంద్ర = చంద్రుని యొక్క; కిరణంబులన్ = కిరణములచేత; పాపుదున్ = పోగొట్టుకొనెదను; ఇప్పుడు = ఇప్పుడు; హరిణ = లేడి; పోతంబు = పిల్ల; తన = తన యొక్క; శరీర = దేహము; స్పర్శన్ = తాకుట; చేసి = వలన; చంద్ర = చంద్రుని యొక్క; కిరణంబుల్ = కిరణముల; కన్నన్ = కంటెను; అధికంబు = ఎక్కువ; అగుచున్ = అగుచూ; పుత్ర = పుత్రుల; వియోగ = ఎడబాటు యొక్క; తాపంబునన్ = సంతాపము; నివర్తింపన్ = తొలగించునట్లు; చేసెన్ = చేసెను; అనుచున్ = అంటూ; పెక్కు = అనేకమైన; భంగులన్ = విధములుగ; హరిణ = లేడి; నిమిత్తంబులు = కోసము; ఐన = అయిన; మనోరథంబుల్ = కోరికల; చేతన్ = వలన; పూర్వ = పూర్వకాలపు లేదా జన్మజన్మల; కర్మ = కర్మములకు; వశంబునన్ = విధేయమగుటచే; యోగ = యోగాభ్యాసము; భ్రష్టుండు = జారిపోయినవాడు; అగు = అయిన; భరతుండు = భరతుడు; భగవత్ = భగవంతుని; ఆరాధనంబున్ = పూజ; వలన = నుండి; విభ్రంశితుండు = మిక్కిలి జారిపోయినవాడు; అగుచున్ = అగుచూ; ఇతర = మరియొక; జాతిన్ = జాతిలో; పుట్టిన = జనించిన; హరిణ = లేడి; పోతంబున్ = పిల్ల; మీది = పైని; మోహంబు = లాలస; అగ్గలంబు = పెంచుకొనుట; అగుచుండ = చేసుకొనుచు; ఉండెన్ = ఉండెను; అని = అని; పలికి = చెప్పి; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రుండు = ఇంద్రుడు; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ విధంగా భరతుడు లేడిపిల్ల క్షేమంగా ఉండాలని కోరుకుంటూ “ అది ఎప్పుడు వచ్చి నన్ను సంతోషపెడుతుందో? రకరకాలైన తన నడకలతో నన్ను ఎప్పుడు మురిపిస్తుందో? నేను ధ్యానసమాధిలో ఉండగా కొమ్ములతో గోకేది. అలాంటి వినోదాలను మళ్ళీ ఎప్పుడు చూస్తానో? దేవుని పూజకై తెచ్చిన ద్రవ్యాలను తొక్కి వాసన చూసినప్పుడు నేను కోపంగా చూస్తే చప్పున చిన్నబిడ్డలాగా దూరంగా పోయి నిలబడి, నేను పిలిచినప్పుడు వచ్చి నా వెనుక నిలబడేది. దానికి ఇంతటి తెలివి ఎలా అబ్బింది? ఈ భూదేవి ఎంత పుణ్యం చేసుకుందో? ఇటువంటి జింకపిల్ల పాదస్పర్శ వల్ల ముక్తి కాములైన మునుల యజ్ఞవాటిక కావడానికి యోగ్యత సంపాదించుకుంది. ఆ జింకపిల్లను నేనెక్కడ వెదకాలి? భగవంతుడైన చంద్రుడు సింహం బారిన పడకుండా తల్లి, ఆశ్రయం లేని ఆ జింకపిల్లను తీసికొని పోయి పెంచుకుంటున్నాడేమో? పూర్వం నేను పుత్ర వియోగ తాపాన్ని చంద్ర కిరణాలతో శాంతింప జేసుకొనేవాణ్ణి. తరువాత ఈ జింకపిల్ల చంద్రకిరణాల కంటే చల్లనైన తన శరీర స్పర్షతో ఆ సంతాపాన్ని పోగొట్టింది” అనుకుంటూ ఎన్నో విధాలుగా జింకపిల్లను గురించి భావించి బాధపడుతున్న భరతుడు యోగభ్రష్టు డయ్యాడు. భగవంతుణ్ణి ఆరాధించడం మానుకున్నాడు. మృగజాతిలో పుట్టిన జింకపిల్ల మీద మోహం పెంచుకున్నాడు” అని శుకమహర్షి మళ్ళీ ఇలా అన్నాడు.

5.1-113-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ననాథ! మున్ను మోక్షవిరోధ మని పాయఁ-
గా రాని పుత్రాదికంబు నెల్లఁ
బాసి తపస్వియై రతుండు హరిణ శా-
క పోషణంబునఁ బాలనమున
తి లాలనప్రీణనానుషంగంబుల-
మూషకబిల మతిరోషమునను
ర్పంబు చొచ్చిన చందంబునను యోగ-
విఘ్నంబు మిక్కిలి విస్తరిల్లెఁ

5.1-113.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గాన యెంతవానికైనను గాలంబు
డవ రామి నట్లు గాక పోదు
రమమునుల కైనఁ బాయవు కర్మంబు
లొరు లనంగ నెంత? వరేణ్య!

టీకా:

జననాథ = రాజా {జననాథుడు - జనులకు నాథుడు, రాజు}; మున్ను = ఇంతకు ముందు; మోక్ష = మోక్షమునకు; విరోధము = వ్యతిరేకము; అని = అని; పాయగరాని = విడువలేని; పుత్ర = కుమారులు; ఆదికంబున్ = మొదలగునవి; ఎల్లన్ = అన్నిటిని; పాసి = దూరముచేసికొని; తపస్వి = తపస్సుచేయివాడు; ఐ = అయ్యి; భరతుండు = భరతుడు; హరిణ = లేడి; శాబక = పిల్లను; పోషణంబునన్ = పోషించుటలోను; పాలనమునన్ = పరిపాలించుటలోను; అతి = మిక్కిలి; లాలన = బుజ్జగించుట; = ప్రీణ = ప్రీతికలిగించుట; అనుషంగంబులన్ = సహవాసములతో; మూషక = ఎలుక; బిలమున్ = కన్నమున; అతి = మిక్కలి; రోషముననున్ = రోషముతో; సర్పంబున్ = పాము; చొచ్చిన = ప్రవేశించిన; చందమునను = విధముగ; యోగ = యోగాభ్యాసమునకు; విఘ్నంబు = అంతరాయము; మిక్కిలి = అదికముగా; విస్తరిల్లెన్ = పెరిగిపోయెను; కాన = కావున.
ఎంత = ఎంతటి; వాని = జనుని; కైనను = కి అయినప్పటికి; కాలంబు = కాలము; కడవరామిన్ = దాటరానిదికనుక; అట్లు = జరగవవలసిన ఆ విధముగ; కాకన్ = కాకుండగ; పోదు = పోదు; = పరమ = అత్యుత్తమ; మునుల్ = మునుల; కైనన్ = కి అయినప్పటికిని; పాయవు = విడువవు; కర్మంబుల్ = కర్మబంధనములు; ఒరులు = ఇతరులు; అనగన్ = అనగా; ఎంత = ఎంత; నరవరేణ్య = రాజా {నరవరేణ్యుడు - నరులలో వరేణ్యుడు (మన్నింపదగినవాడు), రాజు}.

భావము:

“రాజా! పూర్వం భరతుడు మోక్షమార్గానికి ఆటంకమనే భావంతో విడువరాని కొడుకులు ఇల్లు మొదలైన వన్నీ వదలిపెట్టి తపస్వి అయ్యాడు. కాని ఇంతలో జింకపిల్ల తటస్థపడగా దానిని పెంచడం, లాలించడం, దాని కోరికలు తీర్చడంలో నిమగ్నుడైపోయాడు. కోడెత్రాచు ఎలుక కన్నంలో ప్రవేశించినట్లు వారింపరాని విఘ్నం అతనిలో చోటు చేసికొని భ్రష్టుణ్ణి చేసింది. ఎటువంటి వారికైనా విధిని దాటడం సాధ్యం కాదు. మహర్షులకైనా కర్మబంధాలను తప్పుకొనడం సాధ్యం కాదు. అటువంటప్పుడు సామాన్యుల సంగతి చెప్పేదేముంది?

5.1-114-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు భరతుండు మృగవియోగ తాపంబు నొందుచుండు నెడ నా మృగశాబకంబు చనుదెంచిన సంతసిల్లుచుండె; నంత నొక్కనాఁడు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; భరతుండు = భరతుడు; మృగ = లేడి; వియోగ = ఎడబాటువలన; తాపంబున్ = సంతాపమును; ఒందుచున్ = పొందుతూ; ఉండున్ = ఉండెడి; ఎడన్ = సమయములో; ఆ = ఆ; మృగ = లేడి; శాబకంబున్ = పిల్ల; చనుదెంచినన్ = రాగా; సంతసిల్లుచున్ = సంతోషించుతూ; ఉండెన్ = ఉండెను; అంతన్ = అంతట; ఒక = ఒక; నాడు = దినమున.

భావము:

ఈ విధంగా భరతుడు జింకపిల్ల గురించి బాధపడుతున్న సమయంలో అది తిరిగి వచ్చింది. దానిని చూసి అతడెంతో సంబరపడ్డాడు. అంతలో ఒకరోజు…