పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : కృతిపతి నిర్ణయము

  •  
  •  
  •  

6-14-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

య్యది కర్మబంధముల నెల్ల హరించు విభూతికారణం
బెయ్యది సన్మునీంద్రులకు నెల్లఁ గవిత్వసమాశ్రయంబు ము
న్నెయ్యది సర్వమంత్రముల నేలిన దెయ్యది మోక్షలక్ష్మి రూ
పెయ్యది దానిఁ బల్కెద సుహృద్యము భాగవతాఖ్య మంత్రమున్.

టీకా:

ఎయ్యది = ఏది ఐతే; కర్మ = కర్మము యొక్క; బంధములన్ = బంధనములను; ఎల్లన్ = సమస్తమును; హరించు = నశింపజేసెడి; విభూతి = వైభవమునకు; కారణంబు = కారణమైనది; ఎయ్యది = ఏదైతే; సత్ = మంచి; ముని = మునులలో; ఇంద్రుల్ = ఇంద్రుని వంటివారి; కున్ = కి; ఎల్లన్ = అందరి; కవిత్వ = కవిత్వమునకు; సమాశ్రయంబు = చక్కటి ఆశ్రయమైనది; మున్ను = పూర్వము నుండి యున్నది; ఎయ్యది = ఏదైతే; సర్వ = సమస్తమైన; మంత్రములన్ = మంత్రములను; ఏలినది = పాలించునది; ఎయ్యది = ఏదైతే; మోక్ష = మోక్ష మనెడి; లక్ష్మీ = సంపదల; రూపు = స్వరూపము; ఎయ్యది = ఏదైతే; దానిన్ = దానిని; పల్కెద = చెప్పెదను; సు = మంచి; హృద్యము = మనసులకు నచ్చు నట్టిది; భాగవత = భాగవతము యనెడి; ఆఖ్య = పేరు గల; మంత్రమున్ = మంత్రము యైన దానిని.

భావము:

ఏది కర్మబంధాల నన్నిటినీ నశింపజేస్తుందో, ఏది మునిశ్రేష్ఠుల కవితాసంపదకు సమాశ్రయ మైనదో, ఏది మంత్రాలన్నిటికీ మొదటి పెన్నిధియై పరిపాలిస్తుందో, ఏది మహాలక్ష్మీ స్వరూప మైనదో ఆ భాగవతమనే మనోహర మంత్రాన్ని పలుకుతాను.

6-15-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని శ్రీమహాభాగవత పురాణంబునందు షష్ఠస్కంధం బాంధ్రభాష రచియింపంబూని యీ కృతికిం బతిగా నద్దేవుండు గలం డని వితర్కించి నాకుం గవిత్వమహత్వంబు సంప్రాప్తంబగు కాలంబు దలంచి నారాయణుండె దైవం బని యెఱింగి మనోరథంబు సఫలంబయ్యె నని యీ కృతిఁ గృష్ణార్పణంబు చేసితిని; అది యెట్లనిన నేను విద్యాభ్యాసంబునం దగిలి కొండొక నై యుండ నొక్కనాఁడు దివంబున.

టీకా:

అని = అని; శ్రీ = శుభకరమైన; భాగవత = భాగవతమనెడి; పురాణంబు = పురాణము; అందున్ = లోని; షష్ఠ = ఆరవ (6); స్కంధంబున్ = స్కంధమును; ఆంధ్ర = తెలుగు; భాషన్ = భాషలో; రచియింపన్ = వ్రాయుటకు; పూని = పూనుకొని; ఈ = దీనిని; కృతి = చేయుట; కిన్ = కు; పతిగా = భర్తగా; ఆ = ఆ యొక్క; దేవుండు = భగవంతుడు; కలండు = ఉన్నాడు; అని = అని; వితర్కించి = విచారించుకొని; నా = నా; కున్ = కు; కవిత్వ = కవిత్వము యనెడు; మహత్వము = గొప్పదనము; సంప్రాప్తంబు = కలుగుట; అగు = అయినట్టి; కాలంబున్ = కాలమును; తలంచి = తలచుకొని; నారాయణుండె = విష్ణుమూర్తి మాత్రమే; దైవంబు = భగవంతుడు; అని = అని; ఎఱింగి = తెలిసికొని; మనోరథంబున్ = కోరుతున్నవి; సఫలంబు = తీరుచున్నవని; అయ్యెను = అయినవి; అని = అని; ఈ = ఈ; కృతిన్ = కావ్యమును; కృష్ణ = శ్రీకృష్ణునికి; అర్పణంబు = సమర్పించుట; చేసితిని = చేసితిని; అది = అది; ఎట్టిది = ఎటువంటిది; అనినన్ = అనగా; నేను = నేను; విద్యాభ్యాసంబునన్ = చదువుకొనుట యందు; తగిలి = లగ్నమై; కొండొకన్ = అప్రసిద్ధుని, బాలుని; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; ఒక్కనాడు = ఒక దినమున; దివసంబున = పగలు సమయములో.

భావము:

అని శ్రీ మహాభాగవత పురాణంలోని షష్ఠస్కంధాన్ని ఆంధ్రభాషలో రచించటానికి సంకల్పించి, నా కృతికన్యకు శ్రీమన్నారాయణుడే అధిపతి కనుక దీనిని శ్రీకృష్ణునకే సమర్పించాను. అది ఎలాగంటే నేను విద్యార్థినై బాల్యదశలో ఉండగా ఒకనాటి పట్టపగలు....

6-16-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లిత విశేషవస్త్రములు ట్టి హిమాంబు సుగంధ చందనం
లఁది వినూత్న భూషణము లారఁగఁ దాల్చి వినోదలీల నిం
పు మృదుశయ్య నిద్రఁదగఁ బొందినచోఁ గనుపట్టెఁ బల్మఱుం
మునఁ గమ్ము క్రొమ్మెఱుఁగుదండము రూపున నిల్చు పోలికిన్.

టీకా:

కలిత = కూర్చబడిన; విశేష = విశిష్టమైన; వస్త్రములున్ = బట్టలు; కట్టి = కట్టుకొని; హిమాంబు = మంచునీటి బిందువుల వంటి; సుగంధ = సువాసనలు గల; చందనంబున్ = చందనమును; అలది = రాసుకొని; వినూత్న = సరికొత్త; భూషణములున్ = నగలను; ఆరగన్ = చక్కగా; తాల్చి = ధరించి; వినోదలీలన్ = సంతోషముగా; ఇంపుల = నిండైన; మృదు = మెత్తని; శయ్యన్ = పక్కపై; నిద్రన్ = నిద్రను; తగ = చక్కగా; పొందిన = పొందిన; చోన్ = అప్పుడు; కనుపట్టెన్ = కనబడెను; పల్మఱున్ = అనేక మారులు; తలమునన్ = ఆకాశమున; కమ్ము = కమ్ముకొనెడి; క్రొమ్మెఱుగుదండము = కొత్తమెరుపుతీగ; రూపునన్ = స్వరూపముతో; నిల్చు = సరిపడు; పోలికిన్ = పోలున్నట్టిది.

భావము:

విలువైన వస్త్రాలను ధరించి, పన్నీరు కలిపిన సుగంధాన్ని పూసుకొని, అభినవాలైన ఆభరణాలను అలంకరించుకొని వినోదంగా సరిక్రొత్త మెత్తని శయ్యపై నిద్రిస్తుండగా ఒక కల వచ్చింది. ఆ కలలో దట్టమైన క్రొమ్మెరుపులు దండాకృతి ధరించినట్లు ఒకానొక తేజోమయ రూపం నా ముందు సాక్షాత్కరించింది.

6-17-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రవడిఁ బ్రాగ్వీథి నుదయించు మార్తాండ-
కోటిబింబచ్ఛాయ గూడినట్లు
రిహర బ్రహ్మల యాత్మలలో నుబ్బి-
రుణ యొక్కట మూర్తి బెసినట్లు
రకర కర తీవ్ర తినిఁ గరంగుచు-
హేమాద్రి చెంతఁ బె ల్లెగసినట్లు
ణిరాజ ఫణరాజి ణిగణ విస్ఫూర్తి-
సుషిరంపు వెలిఁదల చూపినట్టు

6-17.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లుట్టిపడ్డట్లు కట్టెఱ్ఱ నూఁదినట్లు
తేజ మెసఁగంగ నా మ్రోల దివ్యవాణి
పూని సాక్షాత్కరించి సంపూర్ణదృష్టిఁ
జూచి యిట్లని పలికె మంజులముగాను

టీకా:

ఉరవడిన్ = అతివేగముగా; ప్రాగ్వీథిన్ = ఉదయపు దిక్కున; ఉదయించు = ఉదయిండెడి; మార్తాండ = సూర్యుల; కోటి = అనేకమైన; బింబ = మండలముల; ఛాయన్ = ప్రకాశముతో; కూడినట్లు = కలిసినట్లు; హరి = విష్ణుమూర్తి; హర = శివుడు; బ్రహ్మ = బ్రహ్మదేవు లయొక్క; ఆత్మలు = మనసుల; లోన్ = లోపల; ఉబ్బి = మిక్కిలి సంతోషించిన; కరుణ = దయ; ఒక్కటన్ = ఒకటైపోయి; మూర్తిన్ = స్వరూపమును; పెరసినట్లు = ఏర్పడినట్లు; ఖరకర = సూర్య {ఖరకరుడు - ఖర (తీవ్రమైన) కరుడు (కిరణములు గలవాడు), సూర్యుడు}; కర = కిరణముల; తీవ్ర = తీవ్రత యొక్క; గతిన్ = విధముచేత; కరంగుచు = కరిగిపోతున్న; హేమాద్రి = హిమాలయముల; చెంతన్ = దగ్గర; పెల్లెగసినట్లు = అతిశయించినట్లు; ఫణిరాజ = ఆదిశేషుని; ఫణ = పడగల; రాజిన్ = సమూహము నందలి; మణి = మణుల; గణ = సమూహముల; విస్ఫూర్తిన్ = మిక్కిలి ప్రకాశముతో; సుషిరంపు = పాతాళమునుండి చేసికొన్న రంధ్రము ద్వారా; వెలిన్ = వెలుపలికి; తలచూపినట్టులు = కనబడినట్లు; ఉట్టిపడ్డట్లు = ఊడిపడినట్లు.
కట్టెన్ = కొరివిని; ఎఱ్ఱగా = ఎఱ్ఱగా అగునట్లు; ఊదినట్లు = ఊదినట్లు; తేజము = ప్రకాశము; ఎసగంగన్ = అతిశయించగా; నా = నాకు; మ్రోల = ఎదురుగా; దివ్యవాణి = సరస్వతీదేవి {దివ్యవాణి - దివ్యమైన వాణి గలామె, సరస్వతి}; పూని = పూనుకొని; సాక్షాత్కరించి = దర్శన మిచ్చి; సంపూర్ణ = పరిపూర్ణమైన; దృష్టిన్ = చూపులతో; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగా; అని = అని; పలికె = పలికెను; మంజులముగాను = వినుట కింపుగాను.

భావము:

ఒక్కసారిగా కోటి సూర్య బింబాలు తూర్పు దిక్కున ఉదయించినట్లు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దయ మూర్తీభవించినట్లు, సూర్య కిరణాల వేడికి కరిగిన మేరుపర్వతం బంగారు నీటిని క్రుమ్మరించినట్లు, నాగరాజైన ఆదిశేషుని పడగల మీది రత్న సమూహాల రమణీయ కాంతులు పుట్ట రంధ్రాలనుండి వెలువడినట్లు, కట్టెఱ్ఱ కాంతులు ఉట్టిపడే సరస్వతీదేవి నా ఎదుట ప్రత్యక్షమై సంపూర్ణ దృష్టితో నన్ను వీక్షించి మృదు భాషణాలతో ఈ విధంగా అన్నది.

6-18-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"లుఁ బాటలుం జదువు ద్భుతముల్ విననొప్పు వాద్యముల్
సాటి దలంపరాని బలుసాములు మున్నగు విద్యలెల్ల నీ
కాటఁలు బాట లయ్యె విను న్నిటికిన్ మెఱుఁగిడ్డభంగి నా
చాటునఁ జాటుకారపద సాధుకవిత్వముఁ జెప్పు మింపుగన్"

టీకా:

ఆటలు = ఆటలాడుట; పాటలు = పాటలుపాడుట; చదువుల్ = చదువుటలు; అద్భుతముల్ = ఆశ్చర్యకరములు; వినన్ = వినుటకు; ఒప్పు = సరి యగు; వాద్యముల్ = వాద్యములను వాయించుటలు; సాటిదలంపరాని = సాటిలేని; పలు = గట్టి; సాములు = సాముగారడీలు; మున్నగు = మొదలైన; విద్యలు = విద్యలు; ఎల్లన్ = సమస్తము నందు; నీ = నీ; కున్ = కు; బాటలు = నేర్పులు; అయ్యెన్ = అయినవి; వినుము = వినుము; అన్నిటి = వీటన్నిటి; కిన్ = కి; మెఱుగు = మెరుగు; ఇడ్డ = పరచబడిన; భంగిన్ = విధముగ; నా = నా; చాటున = ఆశ్రయముతో; చాటుకార = సరసమైన; పద = పదములతో; సాధు = మృదువైన; కవిత్వమున్ = కవిత్వమును; చెప్పుము = చెప్పుము; ఇంపుగన్ = చక్కగా.

భావము:

"నీ ఆటపాటలు, చదువు సంధ్యలు అద్భుతంగా సాగాయి. వీనుల విందైన వాద్యాలు, సాటిలేని సాము గరిడీలు మొదలైన విద్యలన్నీ నీకు అలవోకగా అలవడ్డాయి. విను. వీటి నన్నింటినీ మెరుగు పెట్టే రీతిగా మృదుపదాలతో కమ్మని కవిత్వాన్ని చెప్పు. నా అండదండలు నీకుంటాయి”.

6-19-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యానతిచ్చు జగన్మాతృ కృపావలోకన సుశ్లోకుండనై యే నొక్క శ్లోకంబు నా క్షణంబ నుడివితి; నది యెట్టి దనిన.

టీకా:

అని = అని; ఆనతిచ్చు = ఆజ్ఞ నిచ్చెడి; జగన్మాతృ = జగన్మాత యొక్క; కృప = దయాకలిత; అవలోకన = చూపులచేత; సుశ్లోకుండను = కవిత్వము చెప్ప గల వాడను; ఐ = అయ్యి; ఏను = నేను; ఒక్క = ఒక; శ్లోకంబున్ = శ్లోకమును; ఆ = ఆ; క్షణంబ = క్షణములోనే; నుడివితిని = చెప్పితిని; అది = అది; ఎట్టిది = ఎటువంటిది; అనినన్ = అనగా.

భావము:

అని ఆజ్ఞాపించిన జగన్మాత కరుణాకటాక్ష వీక్షణం వల్ల కృతార్థుడనై వెంటనే నేనొక శ్లోకాన్ని రచించాను. అది ఇది...

6-20-శ్లో.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హంసాయ సత్త్వనిలయాయ సదాశ్రయాయ
నారాయణాయ నిఖిలాయ నిరాశ్రయాయ
సత్సంగ్రహాయ సగుణాయ సదీశ్వరాయ
సంపూర్ణ పుణ్యపతయే హరయే నమస్తె.

టీకా:

హంసాయ = పరమహంస రూప మైనవాడ; సత్త్వనిలయాయ = సత్త్వ గుణములకు నివాసుడ; సదా = ఎల్లప్పుడును; ఆశ్రయాయ = ఆశ్రయుడ; నారాయణాయ = నారాయణుడ; నిఖిలాయ = సర్వము తానైనవాడ; నిరాశ్రయాయ = ఆశ్రయములు అవసరము లేనివాడ; సత్ = సత్యము, మంచిని; సంగ్రహాయ = గ్రహించువాడ; సగుణాయ = సకల గుణములు తనలోనే గలవాడ; సత్ = సత్యమైన; ఈశ్వరాయ = ఈశ్వరుడ; సంపూర్ణ = పరిపూర్ణమైన; పుణ్య = పుణ్యములకు; పతయే = భర్తయైనవాడ; హరయే = విష్ణుమూర్తి; (తే) నమస్తే = నీకు నమస్కారము.

భావము:

పరమహంస స్వరూపుడు, సత్త్వగుణ సంపూర్ణుడు, సుజనులకు ఆశ్రయభూతుడు, సర్వం తానే అయినవాడు, ఆశ్రయము అక్కర లేనివాడు, మంచిని గ్రహించేవాడు, సకల గుణాలతో కూడినవాడు, సత్యమైన ఈశ్వరుడు, సంపూర్ణ పుణ్యపురుషుడు అయిన నారాయణునకు నమస్కారం.

6-21-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఈ శ్లోకం బద్దేవి యంగీకరించె; నంత మేలుకాంచి యానంద భరితుండ నై నాఁటనుండి, చంద్రానుగత యగు చంద్రికయుం బోలె, నారాయణాంకితం బయిన కవిత్వ తత్త్వజ్ఞానంబు గోచరం బయ్యె; దానికి ఫలంబుగా గోపికావల్లభుని నుల్లంబున నిడికొని.

టీకా:

ఈ = ఈ; శ్లోకంబున్ = శ్లోకమును; ఆ = ఆ; దేవి = దేవత; అంగీకరించెన్ = అంగీకరించెను; అంత = అంతట; మేలుకాంచి = మేలుకొని; ఆనందభరితుండను = ఆనందముతో నిండినవాడిని; ఐ = అయ్యి; నాట = ఆనాటి; నుండి = నుండి; చంద్ర = చంద్రుని; అనుగత = అనుసరించునది; అగు = అయిన; చంద్రికయున్ = వెన్నెల; పోలెన్ = వలె; నారాయణ = విష్ణుమూర్తికి; అంకితంబున్ = సమర్పింపబడినది; అయిన = ఐన; కవిత్వ = కవిత్వము యొక్క; తత్త్వజ్ఞానంబు = లక్షణములు జ్ఞానములు; గోచరంబు = తెలిసినవి; అయ్యెన్ = అయినవి; దానికి = దానికి; ఫలంబుగా = ఫలితముగా; గోపికావల్లభుని = శ్రీకృష్ణుని; ఉల్లంబునన్ = మనసులో; ఇడుకొని = ఉంచుకొని.

భావము:

ఈ నా శ్లోకాన్ని ఆ దేవి ఆమోదించింది. అప్పుడు నేను మేలుకొని ఆనందంతో ఆనాటినుండి చంద్రుణ్ణి అనుసరించే వెన్నెల వలె నారాయణునకు సమర్పింపబడే కవిత్వ తత్త్వం తెలుసుకున్నాను. దానికి ఫలితంగా గోపికానాయకుడైన శ్రీకృష్ణుని నా మనస్సులో నిలుపుకొన్నాను.

6-22-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లుకఁ గలిగె మొదల భాగవతార్థంబు
ర్త గృష్ణుఁ డయ్యె భాగ్య మొదవె
మృతరసముఁ గోర లరు చింతామణి
పాత్ర సంభవించు భంగి నిపుడు.

టీకా:

పలుక = చెప్పెడి; కలిగె = నేర్పు అలవడెను; మొదల = ముందు; భాగవత = భాగవతము యొక్క; అర్థంబున్ = అర్థమును, ప్రయోజనమును; భర్త = నాయకుడు; కృష్ణుడు = శ్రీకృష్ణుడు; అయ్యెన్ = అయ్యెను; భాగ్యము = అదృష్టము; ఒదవెన్ = కలిగెను; అమృత = అమృతము యనెడి; రసమున్ = రసమును; కోరన్ = కోరుగొనగా; అలరు = అలరించెడి; చింతామణి = చింతామణి యైన; పాత్ర = గిన్నె; సంభవించు = లభించు; భంగిన్ = విధముగా; ఇపుడు = ఇప్పుడు.

భావము:

మొదట భాగవతాన్ని చెప్పే అదృష్టం లభించింది. తరువాత ఆ భాగవతానికి శ్రీకృష్ణుడే కృతిపతి అయ్యే అదృష్టం దక్కింది. అమృతరసాన్ని త్రాగడానికి చింతామణిపాత్ర లభించినట్లయింది.

6-23-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భాగవతము దేటఱుప నెవ్వఁడు జాలు
శుకుఁడు దక్క నరుని కుఁడు దక్క
బుద్ధిఁ దోచినంత బుధులచే విన్నంత
క్తి నిగిడినంత లుకువాఁడ.

టీకా:

భాగవతమున్ = భాగవతమును; తేటపఱుపన్ = తెలియ జెప్పుటకు; ఎవ్వడు = ఎవరు; చాలున్ = సరిపోగలరు; శుకుడు = శుకయోగి; తక్క = తప్పించి; నరునిసఖుడు = కృష్ణుడు {నరునిసఖుడు - నరుడు (అర్జునుడు) యొక్క సఖుడు, కృష్ణుడు}; తక్క = తప్పించి; బుద్ధిన్ = నా బుధ్ధికి; తోచినంత = అందినంతవరకు; బుధుల్ = జ్ఞానుల; చేన్ = చేత; విన్నంత = వినినంత; భక్తి = నాభక్తి; నిగిడినంత = సాగినంతవరకు; పలుకువాడ = చెప్పెదను.

భావము:

భాగవత పరమార్థాన్ని తేటతెల్లంగా వెల్లడించడానికి శుకమహర్షి లేదా శ్రీకృష్ణుడు ఇద్దరే సమర్థులు. ఐనా నా బుద్ధికి తోచినంత, పండితులవల్ల విన్నంత, నా భక్తికి సాధ్యమైనంత చెప్తాను.

6-24-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుట్టిననాఁటనుండియును, బుట్టద యెట్టియ దట్టు నైనఁ జేఁ
ట్టి నుతింపఁ జిత్తము శుభం బగు మద్వరవాక్యసీమకుం
ట్టము గట్టినాఁడ హరిఁబాయక తత్కథనామృతంబు నే
నుట్టిపడంగఁ జెప్పుదు బుధోత్తము లానుఁడు శ్రోత్రపద్ధతిన్.

టీకా:

పుట్టిన = జన్మించిన; నాట = దినము; నుండియున్ = నుండికూడ; పుట్టద =కలుగదు; ఎట్టిది = ఎటువంటి; దట్టునన్ = దంభముతో; ఐనన్ = అయినను; పట్టి = కోరి; నుతింపన్ = పొగడుకొనుటకు; చిత్తము = మనసు; శుభంబున్ = శుభకరము; అగు = అగును; మత్ = నా యొక్క; వాక్యసీమ = కృతి; కున్ = కి; పట్టముగట్టినాడ = లగ్నమైనాడను; హరిన్ = నారాయణుని; పాయక = విడువక; తత్ = అతని; కథ = కథ లనెడి; అమృతంబున్ = అమృతమును; నేను = నేను; ఉట్టిపడంగ = ఊరికారునట్లు; చెప్పుదున్ = చెప్పెదను; బుధ = జ్ఞానులలో; ఉత్తములు = శ్రేష్ఠులు; ఆనుడు = వినండి; శ్రోత్రపద్ధతిన్ = వినవలసిన పద్ధతిలో.

భావము:

పుట్టినప్పుటినుండి ఎటువంటి గర్వాన్ని నే నెరుగను. శ్రీహరిని చేపట్టి కొనియాడితే చిత్తం నిర్మలమౌతుంది. అందుకని రమ్యమైన నా కవితరాజ్యానికి శ్రీహరిని పట్టం గట్టాను. ఆ మధుసూదనుని కథల సుధలు చిందిపడే చందాన చెప్తాను. పండితోత్తములు వీనుల విందుగా గ్రోలండి.

6-25-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని.

టీకా:

అని = అని;

భావము:

ఈ విధంగా చెప్పి...