పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథ

  •  
  •  
  •  

7-21-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన నారదుం డిట్లనియె "నొక్కనాఁడు బ్రహ్మమానసపుత్రు లైన సనకసనందనాదులు దైవయోగంబున భువనత్రయంబు నందును సంచరించుచు నై దా ఱేండ్ల ప్రాయంపు బాలకుల భావంబున దిగంబరు లయి హరిమందిరంబునకు వచ్చి చొచ్చునెడ మొగసాల నున్న పురుషు లిరువురు వారలం జూచి.

టీకా:

అనినన్ = అనగా; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఒక్కనాడు = ఒకరోజు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; మానస = మానస; పుత్రులు = కొడుకులు; ఐన = అయిన; సనకసనందనాదులు = సనక సనంద నాదులు {సనక సనంద నాదులు - 1సనక 2సనందన 3సనత్కుమార 4సనత్సుజాత అను నలుగురు, కుమారవర్గము}; దైవ = దేవుని యొక్క; యోగంబునన్ = సంకల్పమువలన; భువనత్రయంబున్ = ముల్లోకములు; అందునున్ = లోను; సంచరించుచు = తిరుగుతూ; ఐదు = ఐదు (5); ఆఱు = ఆరు (6); ఏండ్ల = సంవత్సరముల; ప్రాయంపు = వయసుగల; బాలకుల = పిల్లవారి; భావంబునన్ = రూపమున; దిగంబరులు = నగ్నముగా నున్నవారు {దిగంబరులు - దిక్ (దిక్కులే) అంబరులు (బట్టలుగా గలవారు)}; అయి = అయ్యి; హరి = విష్ణుమూర్తి; మందిరమున్ = నిలయమున; కున్ = కు; వచ్చి = చేరి; చొచ్చున్ = ప్రవేశించెడి; ఎడన్ = సమయములో; మొగసాలన్ = వాకిటముందర; ఉన్న = ఉన్నట్టి; పురుషులు = వ్యక్తులు; ఇరువురు = ఇద్దరు (2); వారలన్ = వారిని; చూచి = చూసి.

భావము:

అలా ధర్మరాజు అడుగగా నారదమహర్షి ఇలా అన్నాడు “బ్రహ్మదేవుడి సంకల్ప మాత్రం చేత జనించిన “సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతుడు” అనే నలుగురు విప్రులు ఒకమారు ముల్లోకాలలో అయిదు, ఆరు సంవత్సరాల వయసు బాలురులు అయి దిగంబరులుగా సంచరిస్తున్నారు. దైవనిర్ణయం వల్ల వారు వైకుంఠం చేరి విష్ణుమూర్తిని దర్శించాలని వచ్చారు. వారు విష్ణుమందిరంలో ప్రవేశించబోగా, వాకిట్లో ద్వారం వద్ద ఉన్న పురుషులు ఇద్దరు వారిని చూసి.

7-22-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డింకుల ననర్గళ వి
స్రంకుల రమాధినాథ ల్లాప సుఖా
రంకుల ముక్తమానస
దంకులం జొరఁగనీక ఱిమి రధీశా!

టీకా:

డింభకులన్ = బాలురను; అనర్గళ = అడ్డులేని; విస్రంభకులన్ = చొరవగలవారిని; రమాధినాథ = విష్ణుని గురించిన {రమాధినాథుడు - రమ (లక్ష్మీదేవి)కి అధినాథుడు (భర్త), విష్ణువు}; సత్ = మంచి; ఆలాప = మాటలు వలన; సుఖ = సుఖమున; ఆరంభకులన్ = పూనినవారిని; ముక్త = విడువబడిన; మానస = మనసునందలి; దంభకులన్ = గంర్వములు గలవారిని; చొరంగనీక = ప్రవేశింపనీయక; తఱిమిరి = తరిమిరి; అధీశా = మహారాజా.

భావము:

ఓ యుధిష్ఠర మహారాజా! సనకాదులు గర్వం అంటే తెలియని నిర్మలమైన బాలుర రూపంలో ఉన్నారు. లక్ష్మీపతి అయిన విష్ణువుతో మంచిమాటలు మాట్లాడాలనే ఆసక్తిలో మునిగి మిక్కిలి చొరవగా విష్ణుమందిరంలో ప్రవేశించబోతున్నారు. అట్టి వారిని ఆ ద్వారపాలకులు అడ్డుకొని గెంటేశారు.

7-23-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారించిన తమకంబున
వా రించుక నిలువలేక డిఁ దిట్టిరి దౌ
వారికుల నసురయోని న
వారితులై పుట్టుఁ డనుచు సుధాధీశా!

టీకా:

వారించిన = అడ్డుకొన్న; తమకంబునన్ = తొందరలో; వారు = వారు; ఇంచుకన్ = కొంచెము కూడ; నిలువలేక = సహింపలేక; వడిన్ = వేగముగా; తిట్టిరి = శపించిరి; దౌవారికులన్ = ద్వారాపాలకులను; అసుర = రాక్షస {అసురులు - సురులు కానివారు, రాక్షసులు}; యోనిన్ = గర్భమునందు; అవారితులు = అడ్డగింపబడనివారు; ఐ = అయ్యి; పుట్టుడు = జన్మించుడు; అనుచున్ = అని; వసుధాధీశా = రాజా {వసుధాధీశుడు - వసుధ (భూమి)కి ఈశుడు (ప్రభువు), రాజు}.

భావము:

భూమండాలాన్ని ఏలే మహారాజా! యుధిష్ఠరా! ఆ సనకసనందాదులు ఎంతో నిగ్రహం కలవారు అయినప్పటికీ, విష్ణుసందర్శనం కోసం తొందరపడుతూ ఉన్నవారు, కనుక అలా ద్వారపాలకులు అడ్డుకోగా సహించలేక, కోపంతో వారిని రాక్షస పుట్టుకలు తప్పక పుట్టెదరు గాక! అని శపించారు.

7-24-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నా పిన్నపెద్దలు వారలం జూచి "మీర లి య్యెడ నుండ నర్హులు గారు; నారాయణచరణకమలంబు విడిచి రజస్తమోగుణులై రాక్షసయోనిం బుట్టుం" డని శపియించిన, వారు నా శాపవశంబునఁ బదభ్రష్టులై కూలుచు మొఱలిడిన న మ్మహాత్ములు దయాళులై క్రమ్మఱం గరుణించి "మూఁడు జన్మంబులకు వైరంబున భగవత్సన్నిధానంబు గలిగెడు" మని నిర్దేశించి చని; రివ్విధంబున శాపహతు లై హరి పార్శ్వచరులైన పురుషు లిరువురు హిరణ్యకశిపు హిరణ్యాక్షు లన దితికి జన్మించి; రందుఁ గనిష్ఠుఁడైన హిరణ్యాక్షుని హరి వరాహ రూపంబున సంహరించె; నగ్రజుండయిన హిరణ్యకశిపుండు నరసింహ మూర్తి యయిన శ్రీహరిచేత విదళితుం డయ్యె; నతని కొడుకు ప్రహ్లాదుండు దండ్రిచేత హింసితుఁడయ్యును నారాయణపరాయణుండై శాశ్వతుం డయ్యె; రెండవ భవంబునఁ గైకశి యను రాక్షసికి రావణ కుంభకర్ణులయి సంభవించిన, విశ్వంభరుడు రఘుకులంబున రాఘవుండయి యవతరించి వారల వధియించె; న మ్మహాత్ముని పరాక్రమంబులు మార్కండేయ ఋషి వలన నెఱింగెదవు; తృతీయ జన్మంబున మీ తల్లి చెలియలికి శిశుపాల దంతవక్త్రు లన నుద్భవించి.

టీకా:

మఱియున్ = ఇంకను; ఆ = ఆ; పిన్నపెద్దలు = బాలరూప మహా జ్ఞానులు; వారలన్ = వారిని; చూచి = చూసి; మీరలు = మీరు; ఈయెడ = ఇక్కడ; ఉండన్ = ఉండుటకు; అర్హులు = అర్హతగలవారు; కారు = ఐనవారుకాదు; నారాయణ = విష్ణుని; చరణ = పాదములు యనెడి; కమలంబున్ = పద్మములను; విడిచి = వదలి; రజస్తమోగుణులు = రజోగుణము తమోగుణము గలవారు; ఐ = అయ్యి; రాక్షస = రాక్షస; యోనిన్ = గర్భమున, వంశములో; పుట్టుండు = జన్మించుడు; అని = అని; శపియించినన్ = శపింపగా; వారున్ = వారు; ఆ = ఆ; శాప = శాపమునకు; వశంబునన్ = లోనగుటవలన; పదభ్రష్టులు = అధికారచ్యుతులు; ఐ = అయ్యి; కూలుచున్ = పడిపోతూ; మొఱలిడినన్ = విన్నవించుకొనగా; ఆ = ఆ; మహాత్ములు = గొప్పవారు; దయాళులు = దయగలవారు; ఐ = అయ్యి; క్రమ్మఱన్ = మరల; కరుణించి = కృపచూపి; మూడు = మూడు (3); జన్మంబుల్ = జన్మల; కున్ = కు; వైరంబునన్ = విరోధభావముతో; భగవత్ = భగవంతుని; సన్నిధానంబున్ = ఆశ్రయము, వద్దనుండుట; కలిగెడుము = కలుగుగాక; అని = అని; నిర్దేశించి = నిర్ణయించి; చనిరి = వెళ్ళిరి; ఇవ్విధంబునన్ = ఈ విధముగా; శాప = శాపముచే; హతులు = దెబ్బతిన్నవారు; ఐ = అయ్యి; హరి = విష్ణుని; పార్శ్వచరులు = అనుచరులు; ఐన = అయిన; పురుషులు = వారు; ఇరువురు = ఇద్దరు (2); హిరణ్యకశిపు = హిరణ్యకశిపుడు; హిరణ్యాక్షులు = హిరణ్యాక్షులు; అనన్ = అనగా; దితి = దితి; కిన్ = కి; జన్మించిరి = పుట్టిరి; అందున్ = వారిలో; కనిష్ఠుడు = చిన్నవాడు; ఐన = అయినట్టి; హిరణ్యాక్షుని = హిరణ్యాక్షుని; హరి = నారాయణుడు; వరాహ = వరాహము, పంది; రూపంబునన్ = రూపముతో; సంహరించెన్ = చంపెను; అగ్రజుండు = పెద్దవాడు; అయిన = ఐన; హిరణ్యకశిపుండు = హిరణ్యకశిపుడు; నరసింహ = నరసింహుని; మూర్తి = రూపమునగలవాడు; అయిన = ఐన; శ్రీ = శోభాకరమైన; హరి = నారాయణుని; చేతన్ = వలన; విదళితుండు = సంహరింపబడినవాడు; అయ్యెన్ = అయ్యెను; అతని = అతని యొక్క; కొడుకు = కుమారుడు; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; తండ్రి = నాన్న; చేతన్ = వలన; హింసితుండు = బాధింపబడినవాడు; అయ్యును = అయినప్పటికిని; నారాయణ = విష్ణుని యందు; పరాయణుండు = లగ్నమైనవాడు; ఐ = అయ్యి; శాశ్వతుండు = ఎల్లప్పుడు నుండువాడు; అయ్యెన్ = అయ్యెను; రెండవ = రెండవ (2); భవంబునన్ = జన్మములో; కైకశి = కైకశి; అను = అనెడి; రాక్షసి = రాక్షసస్త్రీ; కిన్ = కి; రావణ = రావణుడు; కుంభకర్ణులు = కుంభకర్ణులు; అయి = ఐ; సంభవించిన = పుట్టగా; విశ్వంభరుడు = విష్ణుమూర్తి {విశ్వంభరుడు - విశ్వము (జగత్తును) భరుడు (ప్రోచువాడు), విష్ణువు}; రఘుకులంబునన్ = రఘువంశములో; రాఘవుండు = రాఘవుడు; అయి = ఐ; అవతరించి = జన్మించి; వారలన్ = వారిని; వధియించెన్ = సంహరించెను; ఆ = ఆ; మహాత్ముని = గొప్పవాని; పరాక్రమంబులు = విక్రమములు; మార్కండేయ = మార్కండేయుడు యనెడి; ఋషి = ఋషి; వలనన్ = ద్వారా; ఎఱింగెదవు = తెలుసుకొనెదవు; తృతీయ = మూడవ (3); జన్మంబునన్ = పుట్టుకలో; మీ = మీ; తల్లి = తల్లి యొక్క; చెలియలి = చెల్లెలు; కిన్ = కు; శిశుపాల = శిశుపాలుడు; దంతవక్త్రులు = దంతవక్త్రులు; అనన్ = అని; ఉద్భవించి = పుట్టి.

భావము:

ఇంకా ఆ బాలుర రూపంలో ఉన్న జ్ఞానవృద్ధులు అయిన సనకసనందాదులు ఆ ద్వారపాలకులను ఇలా శపించారు. “మీరు ఇక్కడ ఉండటానికి అర్హులు కారు; విష్ణుపాదపద్మాల సాన్నిధ్యం వదలిపొండి; రజోగుణ, తమోగుణ ప్రధానులైన రాక్షస గర్భాలలో పుట్టండి;” అది విని, ఆ ద్వారపాలకులు పదభ్రష్టులై పశ్చాత్తాపంతో కుమిలిపోతూ మునులను శరణు వేడుకున్నారు. దయాహృదయులైన వారి మనసులు కరిగాయి. “వైరానుబంధ భక్తితో మూడు జన్మలకు భగవంతుని సాన్నిధ్యాన్ని పొందగలరు.” అని కరుణా మూర్తులు శాపవిమోచనం అనుగ్రహించారు. ఇలా శాపగ్రస్తులైన ఆ వైకుంఠ ద్వారపాలకులు ఇద్దరూ ఒకటవ జన్మలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అను పేర్లతో దితికి పుట్టారు. వారిలో చిన్నవాడు హిరణ్యాక్షుడు భూమిని ఎత్తుకుపోయి సముద్రంలో ఉంటే, విష్ణువు వరాహ అవతారం ఎత్తి వానిని సంహరించి, భూమిని ఉద్ధరించాడు. పెద్దవాడు హిరణ్యకశిపుడు తమ్ముని మరణానికి విష్ణువుపై పగ పెంచుకున్నాడు హిరణ్యకశిపుడి కొడుకు పరమ భక్తాగ్రేశ్వరుడైన ప్రహ్లాదుడు. తండ్రి ఎంత హింసించినా విష్ణు భక్తితో ముక్తుడు అయ్యాడు. ప్రహ్లాద రక్షణార్థ మిషతో హిరణ్యకశిపుడిని నరసింహావతారం ఎత్తి విష్ణువు సంహరించాడు. రెండవ జన్మలో కైకశి అనే రాక్షసికి రావణుడు, కుంభకర్ణుడు అను పేర్లతో పుట్టారు. అపుడు సీతాపహరణ కారణంగా శ్రీమహావిష్ణువు రఘువంశంలో శ్రీరాముడిగా అవతరించి వారిని సంహరించాడు. మహాత్ముడైన రఘురాముని పరాక్రమాలు మార్కండేయ మహర్షి నీకు వివరంగా చెప్తాడు. మూడవ జన్మలో మీ పినతల్లి అయిన సాత్వతి(శ్రుతశ్రవ)కి భర్త దమఘోషుని వలన శిశుపాలుడు, దంతవక్త్రుడు అయి పుట్టారు.

7-25-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్రం బింతయు లేక పాయని మహావైరంబునన్ నిత్యజా
క్రోధ స్మరణంబులన్ విదళితోద్యత్పాప సంఘాతులై
క్రచ్ఛిన్న శిరస్కులై మునివచశ్శాపావధి ప్రాప్తులై
క్రిం జెందిరి వారు పార్శ్వచరులై సారూప్య భావంబునన్."

టీకా:

వక్రంబు = కొరత; ఇంతయు = కొంచెముకూడ; లేక = లేకుండగ; పాయని = విడువని; మహా = గొప్ప; వైరంబునన్ = పగతో, శత్రుత్వముతో; నిత్య = ఎప్పుడును; జాత = పుట్టెడు; క్రోధ = కోపమువలని; స్మరణంబులన్ = తలంపులతో; విదళిత = పోగొట్టబడిన; ఉద్యత్ = ఎగసిపడెడి; పాప = పాపముల; సంఘాతలు = రాసులుగలవారు; ఐ = అయ్యి; చక్ర = విష్ణుచక్రముచేత; ఛిన్న = నరకబడిన; శిరస్కులు = శిరస్సులుగలవారు; ఐ = అయ్యి; ముని = మునులచే; వచః = పలుకబడిన; శాప = శాపము; అవధిన్ = చివరలు; ప్రాప్తులు = పొందినవారు; ఐ = అయ్యి; చక్రిన్ = నారాయణుని {చక్రి – చక్రాయుధము గలవాడు,విష్ణువు}; చెందిరి = పొందిరి; వారున్ = వారు; పార్శ్వచరులు = అనుచరులు; ఐ = అయ్యి; సారూప్య = ఒకేరూపుకలిగెడి; భావంబునన్ = ధర్మమునందు.

భావము:

ఈ శిశుపాలుడు, దంతవక్త్రుడు ఇద్దరూ పుట్టుకతోటే కృష్ణునిపై ఎడతెగని ద్వేషం, రోషం, క్రోధం పెట్టుకుంటూ నిత్యం హరిని నిందించేవారు. ప్రతి క్షణం ఆయన్నే తలుస్తూ, వేరే ఆలోచన లేకుండా, ఆయన చుట్టూరా ఊహలన్నీ పెట్టుకొని ఉండేవారు. అలా హరి వాళ్ళ హృదయాలలో నిండి ఉండేవాడు. హరి సుదర్శన చక్రంతో వారి శిరస్సులతోపాటు సమస్త పాపాలను ఖండిచాడు. కనుక వారు సనకాది మునుల శాపం నుండి విముక్తులై, విష్ణు సారూప్యము, విష్ణు సాన్నిధ్యము పొంది, వారి పదవులకు తిరిగి వెళ్ళారు.”

7-26-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని ధర్మనందనుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; విని = విని; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మనందనుడు - యమధర్మరాజు యొక్క నందనుడు (పుత్రుడు), ధర్మరాజు}; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.

భావము:

అలా నారద మహర్షి చెప్పగా విని ధర్మరాజు ఇలా అన్నాడు.

7-27-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"బాలున్ హరిపదచింతా
శీలున్ సుగుణాలవాలు శ్రీమన్మేధా
జాలున్ సంతోషింపక
యేలా శిక్షించె రాక్షసేంద్రుం డనఘా!

టీకా:

బాలున్ = పిల్లవానిని; హరి = నారాయణుని; పద = పాదములను; చింతా = స్మరించెడి; శీలున్ = స్వభావము గలవానిని; సు = మంచి; గుణాల = గుణములకు; వాలున్ = పాదైనవానిని; శ్రీమత్ = శోభాయుక్తమైన; మేధా = బుద్ధి; జాలున్ = విశేషములు కలవానిని; సంతోషింపక = సంతృప్తుడుగాక; ఏలా = ఎందులకు; శిక్షించెన్ = దండించెను; రాక్షస = రాక్షసులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; అనఘా = పుణ్యుడా.

భావము:

“పుణ్యాత్ముడా! నారద మహర్షీ! హిరణ్యకశిపుడు దానవ మహారాజు బాగా మంచి తెలివైనవాడు, సుగుణాల ప్రోగూ అయిన తన కొడుకు ప్రహ్లాదుడుని చూసి సంతోషించకుండా ఎందుకు శిక్షించాడు. దానికి అతనికి చేతులు ఎలా వచ్చాయి? పైగా పరమ విష్ణుభక్తుడు కూడా అయిన తన కుమారుణ్ణి బాధించడానికి మనస్సు ఎలా ఒప్పింది?

7-28-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిభూత వ్యధనంబులు,
నిరుపమ సంసారజలధి నిర్మథనంబుల్
కేసరి కథనంబులు,
రిరక్షిత దేవ యక్ష ణి మిథునంబుల్.

టీకా:

పరిభూత = పూర్తిగా పోగొట్టబడిన; వ్యధనంబులు = బాధలు కలవి; నిరుపమ = సాటిలేని; సంసార = సంసారము అనెడి; జలధిన్ = సాగరమును; నిర్మథనంబులు = మిక్కిలి మథించెడివి; నరకేసరి = నరసింహుని; కథనంబులు = చారిత్రములు; పరిరక్షిత = చక్కగా రక్షింపబడిన; దేవ = దేవతల; యక్ష = యక్షుల; ఫణి = నాగుల; మిథునంబుల్ = దంపతులు కలవి.

భావము:

విష్ణుమూర్తి యొక్క నారసింహావతార కథలు వ్యథలు పోగొట్టేవి, సుధలు కురిపించేవి, అనంత సంసార సాగరాన్ని దాటింపజేసేవి. దేవతలు, యక్షులు, పక్షులు మున్నగు దాంపత్య జీవితం కలిగిన జాతులు అన్నిటికి క్షేమములు కలిగించేవి.

7-29-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునీంద్రా! వినిపింపు" మనిన నారదుం డిట్లనియె "కమలోదరుచేతం దన సహోదరుండు హతుం డయ్యె నని విని హిరణ్యకశిపుండు రోష శోక దందహ్యమాన మానసుం డయి ఘూర్ణిల్లుచు నాభీలదావదహన జ్వాలా కరాళంబు లయిన విలోకన జాలంబుల గగనంబునం బొగలెగయ నిరీక్షించుచుఁ దటిల్లతాంకుర సంకాశ ధగద్ధగిత దంత సందష్ట దశనచ్ఛదుండును, నదభ్ర భయంకర భ్రుకుటిత ఫాలభాగుండును, నిరంతరాక్రాంత దురంత వైర వేగుండును నై మహాప్రభాజాల జటాలంబగు శూలంబుఁ గేల నందుకొని సభామండపంబున నిలువంబడి త్రిమస్తక, త్రిలోచన, శకుని, శంబర, శతబాహు, నముచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి ప్రముఖులైన దైత్య దానవుల నాలోకించి యిట్లనియె.

టీకా:

ముని = మునులలో; ఇంద్రా = ఉత్తముడా; వినిపింపుము = చెప్పుము; అనినన్ = అనగా; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను; కమలోదరు = నారాయణుని; చేతన్ = వలన; సహోదరుండు = సోదరుడు, తమ్ముడు; హతుండు = చంపబడినవాడు; అయ్యెన్ = అయ్యెను; అని = అని; విని = విన్నవాడై; హిరణ్యకశిపుండు = హిరణ్యకశిపుడు; రోష = కోపము; శోక = దుఃఖములచే; దందహ్యమాన = కాల్చబడిన; మానసుండు = చిత్తముగలవాడు; అయి = అయ్యి; ఘూర్ణిల్లుచున్ = కలవరపడుతూ; ఆభీల = క్రూరమైన; దావదహన = కార్చిచ్చు; జ్వాలా = మంటలచే; కరాళంబులు = భయముగొల్పునవి; అయిన = ఐన; విలోకన = చూపుల; జాలంబులన్ = సమూహలతో; గగనంబునన్ = ఆకాశము నందు; పొగలు = పొగలు; ఎగయన్ = లేచుచుండగ; నిరీక్షించుచున్ = చూచుచు; తటిల్లతా = మెరుపుతీగల; అంకుర = చివరలచే; సంకాశ = పోల్చదగిన; ధగధగిత = ధగధగ మెరయుచున్న; దంత = పళ్శచే; సందష్ట = గట్టిగా కొరకబడుతున్న; దశనచ్ఛదుండును = పెదవులు గలవాడును; అదభ్ర = మిక్కిలి; భయంకర = భయంకరమైన; భ్రుకుటిత = ముడిపడిన; ఫాలభాగుండును = నొసలు గలవాడును; నిరంతర = ఎడతగని; ఆక్రాంత = క్రమ్మిన; దురంత = దాటరాని; వైర = విరోధముచేత; వేగుండును = తొందర గలవాడు; ఐ = అయ్యి; మహా = గొప్ప; ప్రభా = ప్రకాశముల; జాల = సమూహములనెడి; జటాలంబు = జటలుగలది; అగు = అయిన; శూలంబున్ = శూలమును; కేలన్ = చేత; అందుకొని = పట్టుకొని; సభామండపంబునన్ = సభాస్థలిని; నిలువంబడి = నిలబడి; త్రిమస్తక = త్రిమస్తకుడు {త్రిమస్తకుడు - త్రి (మూడు) మస్తక (శిరములు గలవాడు)}; త్రిలోచన = త్రిలోచనుడు {త్రిలోచనుడు - త్రి (మూడు) లోచనుడు (కన్నులుగలవాడు)}; శకుని = శకుని {శకుని – ఒక దానవుడు, పదహారు తలలు కలిగి, శంఖము వంటి మెడ కలవాడు, రాంబందు వలె శత్రువును వేటాడు వాడు, లేదా పౌండ్రక శక జాతులలో శకజాతి వాడు}; శంబర = శంబరుడు {శంబరుడు – ఒక దానవుడు, మాయలు, గారడీలు చేయు వృత్తి కల శంబర జాతి వాడు, మహా మాయావి అయిన రాక్షసుడు}; శతబాహు = శతబాహుడు {శతబాహుడు - ఒక అసురుడు, శత (నూరు) బాహుడు (చేతులు గలవాడు)}; నముచి = నముచి {నముచి – ఒక దానవుడు, ఇంద్రునిచేతిలో మరణించినవాడు}; హయగ్రీవ = హయగ్రీవుడు {హయగ్రీవుడు - హయ (గుఱ్ఱపు) గ్రీవుడు (శిరస్సు గలవాడు)}; పులోమ = పులోముడు {పులోముడు – ఒక దైత్యుడు, ఇంద్రుని మామ (భార్య శచీదేవి తండ్రి)}; విప్రచిత్తి = విప్రచిత్తి {విప్రచిత్తి – దానవులలో ప్రదానుడు, సింహిక అను రాక్షసి భర్త}; ప్రముఖులు = మొదలగు ముఖ్యుల; ఐన = అయిన; దైత్య = రాక్షసులు {దైత్యుడు - దితికశ్యపుల పుత్రులు, రాక్షసులు}; దానవులన్ = రాక్షసులను {దానవులు - దనువుకశ్యపుల పుత్రులు, రాక్షసులు}; ఆలోకించి = చూసి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.

భావము:

ఓ ఋషీశ్వరా! నారదా! ఈ నా సందేహం తీర్చు, అట్టి అద్భుతమైన నారసింహావతార వృత్తాంతం చెప్పు” అని ధర్మరాజు అన్నాడు. అప్పుడు నారదుడు ఇలా చెప్పసాగాడు “సృష్టికర్త బ్రహ్మదేవుడికి జన్మస్థానం అయిన కమలం ఉదరము అందు కలిగిన విష్ణుమూర్తి యజ్ఞవరాహావతారం ఎత్తి తన తమ్ముడు హిరణ్యాక్షుణ్ణి చంపాడు అని హిరణ్యకశిపుడు విన్నాడు. క్రోధంచేత, దుఃఖంచేత అతని మనస్సు అగ్నిగుండంలా మండిపోయింది. అసహనంతో తిరుగుతున్నాడు. చూసే చూపులు నిప్పులు గ్రక్కుతూ దావాగ్ని జ్వాలలు వెదజల్లుతూ ఉన్నాయి, పొగలు ఆకాశంలోనికి విరజిమ్ముతున్నాయి. మెరుపు తీగల ధగధగలతో సమానంగా మెరుస్తున్న పళ్ళు పటపట లాడించాడు. అసలే భయంకరమైన భృకుటిని ముడివేయటంతో నుదురు మరింత భయంకరంగా ఉంది. అతడు నిరంతర శత్రు భావంతో ఎగిరి పడుతూ మిక్కిలి క్రోధంతో వేగిపోతున్నాడు. జ్వాలల జటలు కట్టినట్లున్న కాంతులతో భయంకరంగా ప్రకాశిస్తున్న శూలాన్ని చేతబట్టాడు. సభామండపంలో నిలబడి; త్రిమస్తకుడు, త్రిలోచనుడు, శకుని, శతబాహువు, నముచి, హయగ్రీవుడు, పులోముడు, విప్రచిత్తి మున్నగు రాక్షసులను చూసి.

7-30-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నాకుం దమ్ముఁడు మీకు నెచ్చెలి రణన్యాయైకదక్షుండు బా
హాకుంఠీకృత దేవయక్షుఁడు హిరణ్యాక్షుండు వానిన్ మహా
సౌర్యాంగము దాల్చి దానవవధూ సౌకర్యముల్ నీఱుగా
వైకుంఠుండు వధించిపోయెనఁట! యీ వార్తాస్థితిన్ వింటిరే?

టీకా:

నా = నా; కున్ = కు; తమ్ముడు = సోదరుడు; మీ = మీరల; కున్ = కు; నెచ్చెలి = ప్రియమిత్రుడు; రణ = యుద్ధ; న్యాయ = నీతి; ఏక = సమస్తమునందు; దక్షుండు = సమర్థుడు; బాహా = చేతులచేత; కుంఠీకృత = లోబరుచుకొనబడిన; దేవ = దేవతలు; యక్షుడు = యక్షులుగలవాడు; హిరణ్యాక్షుండు = హిరణ్యాక్షుడు; వానిన్ = అతనిని; మహా = గొప్ప; సౌకర్య = (సూకర) వరాహపు; అంగమున్ = దేహమును; తాల్చి = ధరించి; దానవ = రాక్షస; వధూ = వనితల; సౌకర్యముల్ = సౌభాగ్యములు; నీఱుగాన్ = నీరుగారి నశించునట్లు; వైకుంఠుండు = విష్ణుమూర్తి {వైకుంఠుడు - వైకుంఠముననుండు వాడు, విష్ణువు}; వధించిపోయెన్ = చంపివేసినాడు; అటన్ = అట; ఈ = ఇట్టి; వార్తా = వృత్తాంతము; స్థితిన్ = సంభవించుటను; వింటిరే = విన్నారా.

భావము:

“ఓ రాక్షసోత్తములారా! ఈ కబురు విన్నారా? వైకుంఠవాసి విష్ణువు హిరణ్యాక్షుణ్ణి చంపేసాడట. సౌకర్యంగా ఉంటుందని వరాహం రూపుతో వచ్చి ముట్టి కొమ్ముతో కుమ్మి మరీ చంపేసాడట. అవును సాక్షాత్తు నాకు తమ్ముడు, మీ అందరికి ఆత్మీయ మిత్రుడు అయిన హిరణ్యాక్షుడు సామాన్యమైన వాడా. యుద్ధ ధర్మం మర్మం బాగా తెలిసిన వాడు. బాహు బలంతో దేవగణ, యక్షగణాలను నిర్వీర్యులను చేసిన మహా పరాక్రమశాలి. అంతటి వానిని ఆ హరి సంహరించి అంతఃపురాలలోని రాక్షసకాంతల సౌభాగ్యాలు హరించి పోయాడట.

7-31-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముల నుండుఁ జొచ్చు ముని ర్గములోపల ఘోణిగాఁడు సం
న మెఱుంగ రెవ్వరును జాడ యొకింతయు లేదు తన్ను డా
సి మఱి డాయు వెంటఁబడి చిక్కక చిక్కఁడు వీని నొక్క కీ
లు మన మెల్ల లోఁబడక లోఁబడఁ బట్టుకొనంగవచ్చునే?

టీకా:

వనములన్ = అడవులందు, నీటియందు; ఉండున్ = ఉండును; చొచ్చున్ = ప్రవేశించును; ముని = మునుల; వర్గము = సమూహముల; లోపల = మనసులలోపల; ఘోణిగాడు = వరాహస్వరూపుడు; సంజననము = అసలు పుట్టుక; ఎఱుంగరు = తెలిసికొనలేరు; ఎవ్వరును = ఎవరూకూడ; జాడ = గుర్తించుటకు; ఒకింతయున్ = కొంచెముకూడ; లేదు = అవకాశములేదు; తన్ను = తనను; డాసినన్ = సమీపించెదమంటే; మఱి = మరి; డాయున్ = దగ్గరగును, దాగికొనును; వెంటబడి = వెనుకనంటినను; చిక్కక = ఆశ్రయించక, దొరకనే; చిక్కడు = దొరకడు; వీనిన్ = ఇతనిని; ఒక్క = ఒక; కీలునన్ = ఉపాయముచే, యుక్తిచే; మనము = మనము; ఎల్లన్ = అందరము; లోబడక = అతనికివశముగాక, వెనుదీయక; లోబడన్ = చిక్కునట్లు; పట్టుకొనంగ = పట్టుకొనుట; వచ్చునే = సాధ్యమా ఏమి.

భావము:

ఆ సూకరం గాడు మహా మాయగాడు. నీళ్ళల్లో దాక్కుంటాడు. అడవులలో దాక్కుంటాడు. మునుల మనసులలో దూరుతాడు. పుట్టుపూర్వోత్తరాలు ఏవీ ఎవరికీ తెలియవు. అసలు ఎక్కడివాడో కూడా తెలియదు. దరిచేరిన వారిని ఆదరిస్తాడట. కాని వెంటబడి పట్టుకుందాం అంటే దొరకనే దొరకడు, అలసిపోడు. కాబట్టి మనం ఒక ఉపాయం పన్నాలి. మనం వాడికి లొంగకుండా వాడిని లొంగదీసుకుందాం, సరేనా? (ఇది సాధ్యమా?)

7-32-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భుజశక్తి నాతోడఁ బోరాడ శంకించి-
మున్నీట మునిఁగిన మునుఁగుఁ గాక;
లయించి పెనఁగు నా చలసంభ్రమమున-
కెఱఁగి వెన్నిచ్చిన నిచ్చుఁ గాక;
గడంబు సైఁపక సౌకర్యకాంక్షియై-
యిల క్రింద నీఁగిన నీఁగుఁ గాక;
క్రోధించి యటుగాక కొంత పౌరుషమున-
రి భంగి నడరిన డరు గాక;

7-32.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఠినశూలధారఁ గంఠంబు విదళించి,
వాని శోణితమున వాఁడి మెఱసి,
త్సహోదరునకు హిఁ దర్పణము జేసి,
మెఱసివత్తు మీకు మేలు దెత్తు.

టీకా:

భుజ = బాహువుల; శక్తిన్ = బలముతో; నా = నా; తోడన్ = తోటి; పోరాడన్ = యుద్ధముచేయుటకు; శంకించి = జంకి; మున్నీటన్ = సముద్రములో; మునిగినన్ = మునిగినచో; మునుగుగాక = మునుగుగాక (మత్యావతార సూచన); అలయించి = శ్రమించి; పెనగు = పోరెడి; నా = నా యొక్క; అచల = గట్టి; సంభ్రమమున్ = పూనిక; కున్ = కి; ఎఱగి = నమస్కరించి; వెన్నిచ్చినన్ = వీపుచూపిన (కూర్మావతార సూచన); ఇచ్చుగాక = చూపుగాక; జగడంబున్ = పోరాటముచేయుటను; సైపక = సహింపలేక; సౌకర్య = సౌఖ్యము, సూకరాకారము; కాంక్షి = కోరువాడు; ఐ = అయ్యి; ఇల = భూమి; క్రిందన్ = కింద; ఈగినన్ = దూరినచో; నీగుగాక = దూరుగాక (వరాహవతార సూచన); క్రోధించి = పౌరుషపడి; అటుగాక = అలా కాకుండగ; కొంత = కొంచము; పౌరుషమున = పొరుషముతో; హరి = సింహము; భంగిన్ = వలె; అడరినన్ = అతిశయించిన; అడరుగాక = అతిశయించుగాక.
కఠిన = కరకు; శూల = శూలముయొక్క; ధారన్ = వాడిదనముచే; కంఠంబున్ = కంఠమును; విదళించి = ఖండించి; వాని = అతని; శోణితమునన్ = రక్తముతో; వాడి = మగటిమ; మెఱసి = చెలరేగి; మత్ = నా యొక్క; సహోదరున్ = సోదరున; కున్ = కు; మహిన్ = భూమిపై; తర్పణముజేసి = తర్పణలువదలి; మెఱసి = అతిశయించి; వత్తున్ = వచ్చెదను; మీ = మీరల; కున్ = కు; మేలున్ = శుభములను; తెత్తున్ = తీసుకొచ్చెదను.

భావము:

విష్ణుడు నా బాహుబల పరాక్రమాలు విని భయపడి సముద్రంలో దాగినప్పటికీ, నా శౌర్యసాహసాలు చూసి వెన్నిచ్చి పారిపోయినప్పటికీ, నాతో పోరు ఎందుకులే, బ్రతికి ఉంటే చాలు అనుకుని భయపడిపోయి వరాహంగా భూమిని తవ్వుకుంటూ పాతాళానికి పోయినా సరే, లేదా అలా కాకుండా కోపంతో, పౌరుషంతో నాతో ఎదిరి రణరంగంలో సింహ పరాక్రమం చూపుతూ పోరాటానికి సిద్ధపడినా ఎలాగైనా సరే, ఏమైనా సరే వాడిని మాత్రం ఎప్పటికి వదలి పెట్టను. ఈ వాడి బల్లెంతో వాడి తల నరికేస్తాను. ఆ వేడి నెత్తురుతో మా తమ్ముడికి తర్పణం వదులుతాను. తప్పక విజయం సాధించి తిరిగి వస్తాను. మీ అందరికి మేలు జేస్తాను.

7-33-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఖండిత మూలద్రుమమున
నెండిన విటపముల భంగి నితఁడు పడిన, నా
ఖంల ముఖ్యులు పడుదురు,
భంనమున నితఁడు దమకుఁ బ్రాఁణము లగుటన్.

టీకా:

ఖండిత = నరకబడిన; మూల = వేళ్ళుగల; ద్రుమమున = చెట్టునందలి; ఎండిన = ఎండిపోయిన; విటపముల = కొమ్మల; భంగిన్ = వలె; ఇతండు = ఇతడు; పడినన్ = మరణించిన; ఆఖండల = ఇంద్రుడు {ఆఖండలుడు - ఆఖండలులు (నాశనము లేనివా రైన దేవతల)కి ప్రభువు, ఇంద్రుడు}; ముఖ్యులు = మొదలగు ముఖ్యమైనవారు; పడుదురు = పడిపోవుదురు; భండనమునన్ = యుద్ధమునందు; ఇతడు = ఇతను; తమ = వారల; కున్ = కు; ప్రాణములు = మూలాధారుడు; అగుటన్ = అగుటచేత.

భావము:

విష్ణుడు వీళ్ళందరికి మూలం ప్రాణం. కాబట్టి హరిని సంహరించానంటే, వీళ్ళ పనైపోతుంది. వృక్షం కూలిపోతే, దాని కొమ్మలు ఎండిపోతాయి కదా. అలాగే నారాయణుని సంహరించేస్తే అమరుల ప్రభువు అయిన ఇంద్రుడు మొదలగు ప్రముఖులు అందరూ కూడా యద్ధంలో ఓడిపోయి పడిపోతారు.

7-34-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పొండు దానవులార! భూసురక్షేత్ర సం-
తయైన భూమికి ములు గట్టి
ఖతపస్స్వాధ్యాయ మౌనవ్రతస్థుల-
వెదకి ఖండింపుఁడు విష్ణుఁ డనఁగ
న్యుఁ డొక్కఁడు లేఁడు జ్ఞంబు వేదంబు-
తఁడె భూదేవ క్రి యాదిమూల
తఁడు దేవర్షి పిత్రాదిలోకములకు-
ర్మాదులకు మహాధార మతఁడె

7-34.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యే స్థలంబుల గో భూసురేంద్ర వేద
ర్ణధర్మాశ్రమంబులు రుస నుండు
నా స్థలంబుల కెల్ల మీ రిగి చెఱచి
గ్ధములు జేసి రండు మీ ర్ప మొప్ప."

టీకా:

పొండు = వెళ్ళండి; దానవులార = రాక్షసుల్లారా; భూసుర = బ్రాహ్మణులుండెడి {భూసురులు - భూమికి సురులు (దేవతలు), బ్రాహ్మణులు}; క్షేత్ర = ప్రదేశములతో; సంగత = కూడినది; ఐన = అయిన; భూమి = భూమండలమున; కిన్ = కు; గములు = గుంపులు; కట్టి = కొని; మఖ = యాగములు; తపః = తపస్సులు; సాధ్యాయ = వేదపఠనములు; మౌన = మునిత్వములు; వ్రతస్థుల = నిష్ఠగాజేయువారలను; వెదకి = వెతికి; ఖండింపుడు = నరకండి; విష్ణుడు = హరి; అనగన్ = అనగా; అన్యుడు = వేరే ఇతరుడు; ఒక్కడు = ఏ ఒక్కడును; లేడు = లేడు; యజ్ఞంబున్ = యాగములు; వేదంబున్ = వేదములును; అతడె = అతడే; భూదేవ = బ్రాహ్మణులుచేసెడి; క్రియా = కార్యములకు; ఆది = ముఖ్య; మూలము = మూలాధారము; అతడు = అతడు; దేవర్షి = దేవఋషులు; పిత్ర = పితృదేవతలు; ఆది = మొదలగువారి; లోకముల్ = సర్వుల; కున్ = కు; ధర్మాదులు = ధర్మార్థకామముల; కున్ = కు; మహా = గొప్ప; ఆధారము = మూలాధారము; అతడె = అతడె.
ఏ = ఏ; స్థలంబులన్ = ప్రదేశములలో; గో = గోవులు; భూసురేంద్ర = బ్రాహ్మణులు; వేద = వేదములు; వర్ణధర్మములు = కులాచారములు; ఆచారములు = వేదాచారములు; వరుసన్ = చక్కగా; ఉండున్ = ఉండునో; ఆ = ఆ; స్థలంబులన్ = ప్రదేశముల; కున్ = కు; ఎల్లన్ = అన్నిటికిని; మీరు = మీరు; అరగి = వెళ్ళి; చెఱచి = పాడుచేసి; దగ్దములు = కాల్చబడినవిగా; చేసి = చేసి; రండు = రండి; మీ = మీ యొక్క; దర్పము = పౌరుషము; ఒప్పన్ = ఒప్పునట్లు.

భావము:

ఓ దానవ శ్రేష్ఠులారా! బయలుదేరండి. ముందుగా బ్రాహ్మణులు ఉండే ప్రదేశాలకు గుంపులు గుంపులుగా వెళ్ళండి; యజ్లాలు, జపతపాలు, వేదాధ్యయనాలు, వ్రతాలూ, వాటిని చేసే విప్రులనూ, మౌన వ్రతాలు చేసే మునులనూ వెదికి మరీ నాశనం చేయండి; విష్ణుడు అంటూ ఎక్కడా వేరే ఎవడూ లేడు; యజ్మమే అతడు, వేదాలే అతడు, బ్రాహ్మణ వైదిక కర్మలే అతడు, జపతపాలే అతడు; సర్వ దేవతా సమూహాలకూ, ముని సంఘాలకూ, పైతృక లోకాలకూ, సర్వధర్మాలకూ అతడే మూలం ఆధారం; ఎక్కడైతే గోవులూ, బ్రాహ్మణులూ సుఖంగా జీవిస్తుంటారో; ఎక్కడైతే వైదిక ధర్మాలూ, ఆశ్రమాలూ చక్కగా నడుస్తూ ఉంటాయో; ఆయా చోట్లన్నిటికీ వెళ్ళి వాటిని ధ్వంసం చేయండి; మీ గర్వం, దర్పం శోభించేలా వాటన్నిటినీ దగ్ధం చేసేయండి.”

7-35-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు నిర్దేశించిన దివిజమర్దను నిర్దేశంబులు శిరంబుల ధరియించి రక్కసులు పెక్కండ్రు భూతలంబునకుం జని.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగా; నిర్దేశించిన = నియమించగా; దివిజమర్దను = దేవాంతకుడగు హిరణ్యాక్షుని; నిర్దేశంబులు = ఆజ్ఞలను; శిరంబులన్ = తలలపై; ధరియించి = పూని; రక్కసులు = రాక్షసులు; పెక్కండ్రు = అనేకమంది; భూతలంబున్ = భోలోకమున; కున్ = కు; చని = వెళ్ళి.

భావము:

దేవతలను మర్దించే ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడి ఆజ్ఞను ఆ రాక్షసప్రముఖులు అందరూ శిరసావహించి, మూకలు గట్టి వచ్చి భూలోకంపై పోయి పడ్డారు.

7-36-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గ్రామ పుర క్షేత్ర ర్వట ఖేట ఘో-
షారామ నగరాశ్రమాదికములు
గాలిచి, కొలఁకులు లఁచి, ప్రాకార గో-
పుర సేతువులు త్రవ్వి, పుణ్య భూజ
యములు ఖండించి, సౌధ ప్రపా గేహ-
ర్ణశాలాదులు పాడుచేసి,
సాధు గో బ్రాహ్మణ సంఘంబులకు హింస-
గావించి, వేదమార్గములు జెఱచి,

7-36.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుతల మెల్ల నిట్లు కోలాహలంబుగా
దైత్యు లాచరింపఁ ల్లడిల్లి
ష్టమూర్తు లగుచు నాకలోకము మాని
డవులందుఁ జొచ్చి మరవరులు.

టీకా:

గ్రామ = ఊళ్ళు; పుర = పట్టణములు; క్షేత్ర = పుణ్యక్షేత్రములు; ఖర్వట = పేటలు {ఖర్వట - ఒకప్రక్క గ్రామము ఒకప్రక్క పట్టణము కలిగినది, కొండను ఆనుకొనిన గ్రామము, పేట}; ఖేట = పాలెములు {ఖేట - పంటకాపులుండుపల్లె, పాలెము}; ఘోష = గొల్లపల్లెలు; నగర = నగరములు; ఆశ్రమ = ఆశ్రమములు; ఆదికములు = మొదలగునవి; గాలిచి = వెదకి; కొలకులున్ = మడుగులను; కలచి = కలియబారజేసి; ప్రాకార = ప్రహారీగోడలు; గోపుర = బురుజులు; సేతువులు = ఆనకట్టలు, వంతెనలు; త్రవ్వి = తవ్వేసి; పుణ్య = పుణ్యవంతమైన; భూజ = చెట్ల {భూజము - భూమినుండి జము (పుట్టునది), వృక్షము}; చయములున్ = సమూహములను; ఖండించి = నరకి; సౌధ = మేడలు; ప్రపా = చలివేంద్రములు; గేహ = ఇండ్లు; పర్ణశాల = పాకలు; ఆదులున్ = మొదలగునవానిని; పాడుచేసి = పాడుచేసి; సాధు = సజ్జనుల; గో = గోవుల; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; సంఘంబుల్ = సమూహముల; కున్ = కు; హింస = బాధించుట; కావించి = చేసి; వేద = వేదములందు విధింపబడిన; మార్గములున్ = విధానములను; చెఱచి = పాడుచేసి.
కుతలము = భూలోకము; ఎల్లన్ = అంతటిని; ఇట్లు = ఈ విధముగా; కోలాహలంబు = సంకులము; కాన్ = అగునట్లు; దైత్యులు = రాక్షసులు; ఆచరింపన్ = చేయగా; తల్లడిల్లి = బెగ్గడిల్లి; నష్ట = నాశనమైన; మూర్తులు = రూపములుగలవారు; అగుచున్ = అగుచు; నాకలోకము = స్వర్గలోకము; మాని = వదలి; అడవుల్ = అడవుల; అందున్ = లోనికి; చొచ్చిరి = దూరిరి; అమర = దేవతలలో; వరులు = శ్రేష్ఠులు.

భావము:

గ్రామాలు, పట్టణాలు, పుణ్యక్షేత్రాలు, పేటలు, పల్లెలు, గొల్లపల్లెలు, రాచనగరులు, నగరాలు, ఆశ్రమాలు మొదలైనవాటిని ఆ రాక్షసులు ధ్వంసంచేశారు; చెరువులను కలచివేసారు; ప్రహారీ గోడలు, గోపురాలు త్రవ్వేసారు; వంతెనలు, ఆనకట్టలు కూల్చేసారు; మంచి చెట్లను, మహావృక్షాలను నరికేసారు; మేడలు, మిద్దెలు, చల్లని మంచినీళ్ళ పందిళ్ళు, ఇళ్ళు, పాకలు మొదలైనవానిని పాడుచేశారు; సాదువులను, గోవులను, బ్రాహ్మణులను హింసించారు; వేద సంప్రదాయాలను నాశనం చేశారు; ఇలా ఆ రాక్షసులు భూలోకం అంతా అల్లకల్లోలం చేసారు; దేవతలు అందరూ భయపడిపోయి తేజస్సులు కోల్పాయి అడవులలోకి పారిపోయారు;

7-37-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత హిరణ్యకశిపుండు దుఃఖితుండై, మృతుం డయిన సోదరునకు నుదక ప్రదానాది కార్యంబు లాచరించి, యతని బిడ్డల శకుని, శంబర, కాలనాభ, మదోత్కచ ప్రముఖుల నూఱడించి, వారల తల్లితోఁ గూడ హిరణ్యాక్షుని భార్యల నందఱ రావించి, తమ తల్లియైన దితి నవలోకించి యిట్లనియె.

టీకా:

అంతన్ = తర్వాత; హిరణ్యకశిపుండు = హిరణ్యకశిపుడు; దుఃఖితుండు = దుఃఖించెడివాడు; ఐ = అయ్యి; మృతుండు = మరణించినవాడు; అయిన = అయిన; సోదరున = సహోదరున; కును = కు; ఉదకప్రదాన = తిలోదకప్రదానములు; ఆది = మొదలగు; కార్యంబులు = క్రియలు; ఆచరించి = చేసి; అతని = అతని; బిడ్డలన్ = పిల్లలను; శకుని = శకుని; శంబర = శంబరుడు; కాలనాభ = కాలనాభుడు; మదోత్కచ = మదోత్కచుడు; ప్రముఖులన్ = మొదలగుముఖ్యులను; ఊఱడించి = ఊరడించి; వారల = వారియొక్క; తల్లి = తల్లి; తోన్ = తో; కూడ = పాటు; హిరణ్యాక్షుని = హిరణ్యాక్షుని; భార్యలన్ = భార్యలను; అందఱన్ = అందరిని; రావించి = పిలిపించి; తమ = తమయొక్క; తల్లి = తల్లి; ఐన = అయిన; దితిన్ = దితిని; అవలోకించి = చూసి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.

భావము:

అక్కడ హిరణ్యకశిపుడు మరణించిన తన తమ్ముడు హిరణ్యాక్షుడి కోసం దుఃఖించాడు. తిలోదకాలు మొదలైన అంత్యక్రియలు చేసాడు. అతని కొడుకులు శకుని, శంబరుడు, కాలనాభుడు, మదోత్కచుడు ఆది ప్రముఖులను పలకరించి ఉపశమనపు మాటలు పలికాడు. వాళ్ళ తల్లి, సవితి తల్లు అయిన హిరణ్యాక్షుని భార్యలను పిలిచి, వారి సమక్షంలో తన తల్లి దితితో ఇలా అన్నాడు.

7-38-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీరాగారనివిష్ట పాంథుల క్రియన్ నిక్కంబు సంసార సం
చారుల్ వత్తురు గూడి విత్తురు సదా; సంగంబు లే దొక్కచో;
శూరుల్ పోయెడి త్రోవఁ బోయెను భవత్సూనుండు దల్లీ! మహా
శూరుం డాతఁడు త ద్వియోగమునకున్ శోకింప నీ కేటికిన్.

టీకా:

నీరాగార = చలివేంద్రములందు; నివిష్ట = ప్రవేశించిన; పాంథుల్ = బాటసారుల; క్రియన్ = వలె; నిక్కంబున్ = నిజముగ; సంసార = సంసారమునందు; సంచారుల్ = తిరిగెడివారు; వత్తురు = వచ్చెదరు; కూడి = కలయుచు; విత్తురు = విడిపోదురు; సదా = శాశ్వతమైన; సంగంబున్ = కలయిక; లేదు = లేదు; ఒక్కచోన్ = ఒక్కసారి; శూరుల్ = శూరులు; పోయెడి = వెళ్ళెడి; త్రోవన్ = దారిలో; పోయెన్ = వెళ్ళెను; భవత్ = నీ యొక్క; సూనుండు = పుత్రుడు; తల్లీ = తల్లీ; మహా = గొప్ప; శూరుండు = మగటిమ గలవాడు; అతడు = అతడు; తత్ = అతని; వియోగమున్ = ఎడబాటున; కున్ = కు; శోకింపన్ = దుఃఖించగా; నీకు = నీకు; ఏటికిన్ = ఎందుకు.

భావము:

“ఈ లోకం చల్లని నీళ్ళను అందించే చలివేంద్రం వంటిది. దాహం తీర్చుకోడానికి వచ్చే బాటసారులు కలుస్తారు, విడిపోతారు. వాళ్ళ పని పూర్తికాగానే తమ దారిని తాము వెళ్ళిపోతారు కదా. శాశ్వత అనుబంధాలు ఉండవు. అలాగే ఇక్కడ జీవులు వస్తుంటారు, తమ సమయం తీరగానే వెళ్ళి పోతారు. నీ కొడుకు మహావీరులు వెళ్శే దారిలో వెళ్శాడు. అతను గొప్ప శూరుడు అతని వియోగానికి మీరు దుఃఖించకండి. అవును వీరమాత, వీరపత్ని కంటతడి పెట్టరాదు కదా.

7-39-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్వజ్ఞుఁ డీశుండు ర్వాత్ముఁ డవ్యయుం-
మలుండు సత్యుఁ డనంతుఁ డాఢ్యుఁ
డాత్మరూపంబున శ్రాంతమును దన-
మాయాప్రవర్తన హిమవలన
గుణములఁ గల్పించి గుణసంగమంబున-
లింగశరీరంబు లీలఁ దాల్చి
కంపిత జలములోఁ దలెడి క్రియఁ దోచు-
పాదపంబుల భంగి భ్రామ్యమాణ

7-39.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్షువుల ధరిత్రి లితయై కానంగఁ
డిన భంగి, వికల భావరహితుఁ
డాత్మమయుఁడు గంపి తాంతరంగంబునఁ
దలినట్లు తోఁచుఁ దలకుండు.

టీకా:

సర్వజ్ఞుండు = అన్నియుతెలిసినవాడు; ఈశుండు = ప్రభువు; సర్వాత్ముడు = అందరిలోనునుండువాడు; అవ్యయుండు = నాశములేనివాడు; అమలుండు = స్వచ్ఛమైనవాడు; సత్యుడు = సత్యమేతానైనవాడు; అనంతుడు = అవధులులేనివాడు; ఆఢ్యుడు = శ్రేష్ఠుడు; ఆత్మ = ఆత్మ యొక్క; రూపంబునన్ = స్వరూపముతో; అశ్రాంతమున్ = ఎల్లప్పుడును; తన = తన యొక్క; మాయా = మాయను; ప్రవర్తన్ = నడిపెడి; మహిమ = సామర్థ్యము; వలన = వలన; గుణములన్ = త్రిగుణములను; కల్పించి = సృష్టించి; గుణ = గుణముల యొక్క; సంగమంబునన్ = చేరికలవలన; లింగశరీరంబున్ = సూక్ష్మశరీరము {లింగశరీరము - నామరూపాదులుగల దేహము}; లీలన్ = క్రీడగా; తాల్చి = ధరించి; కంపిత = కదలెడి; జలము = నీటి; లోన్ = అందు; కదలెడి = కదులుతున్న; క్రియన్ = వలె; తోచు = కనబడెడి; పాదపంబులన్ = చెట్లను; భంగిన్ = వలె; భ్రామ్యమాణ = తిరుగుతున్న.
చక్షువులన్ = కళ్ళకు; ధరిత్రి = భూమి; చలిత = కదులునది; ఐ = అయ్యి; కానంగబడిన = కనబడిన; భంగిన్ = వలెను; వికల = వికారములనెడి; భావము = స్వభావము; రహితుడు = లేనివాడు; ఆత్మమయుడు = ఆత్మయందుండువాడు; కంపిత = చలించెడి; అంతరంగంబునన్ = మనసులలో; కదలిన = కదులుచున్న; అట్లు = విధముగ; తోచున్ = అనిపించును కాని; కదలకుండు = చలనములేక యుండును.

భావము:

భగవంతుడు సర్వమూ తెలిసినవాడు; సర్వానికి ఆయనే అధిపతి; సర్వేసర్వత్రా నిండి ఉండేవాడు; ప్రభువు సత్యుడూ; నిత్యుడూ, ఆద్యంతాలు లేనివాడూ, సర్వ సంపన్నుడూ; అటువంటి ఆ విభుడు, ఆత్మరూపంలో నిరంతరం తన మాయా ప్రవర్తన ఆదులతో త్రిగుణాలను కల్పించుకుంటాడు; ఆ గుణాల సంయోగాలతో లింగశరీరాలు ధరిస్తాడు; కదలని చెట్లు కదులుతున్న నీటిలో కదలాడుతున్నట్లు కనపడుతుంది కదా; భ్రమతో కూడి ఉన్న కన్నులకు భూమి కదులుతున్నట్లు తోచుతుంది కదా; అలాగే, బావ వికారాలు లేనట్టి ఆత్మస్వరూపుడైన ఆ భగవంతుడు చలించే మనస్సుకల వాళ్ళకు చంచలుడుగానే కనబడతాడు; కానీ ఆ పరమేశ్వరుడు అచంచలుడు;