పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : బ్రహ్మవరము లిచ్చుట

  •  
  •  
  •  

7-80-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని దేవతలు విన్నవించిన స్వయంభూతుండును భగవంతుండును నైన నలుమొగంబులప్రోడ భృగుదక్షాదులతోడ మందరపర్వతంబునకు వచ్చి యందు నియమయుక్తుండును, బిపీలకావృత మేదోమాంసచర్మరక్తుండును, వల్మీక తృణ వేణు పటల పరిచ్ఛన్నుండును, మహాతపః ప్రభావ సంపన్నుండును నై నీరంధ్ర నిబిడ నీరద నికర నివిష్ట నీరజబంధుండునుం బోలె నివసించి యున్న నిర్జరారాతిం జూచి వెఱఁగుపడి నగుచు నిట్లనియె.

టీకా:

అని = అని; దేవతలు = దేవతలు; విన్నవించిన = మనవి చేయగా; స్వయంభూతుండును = తనంతతనే పుట్టినవాడు; భగవంతుండు = ఐశ్వర్యములు కలుగుటచే పూజ్యు డైనవాడు; ఐన = అయిన; నలుమొగములప్రొడ = బ్రహ్మదేవుడు {నలు మొగముల ప్రోడ - నలు (నాలుగు 4) మొగముల (ముఖములుగల) ప్రోడ (పెద్ద), బ్రహ్మ}; భృగు = భృగువు; దక్ష = దక్షుడు; ఆదుల = మొదలగువారి; తోడ = తోటి; మందర = మందరము యనెడి; పర్వతంబున్ = పర్వతమున; కున్ = కు; వచ్చి = వచ్చి; అందున్ = అక్కడ; నియమ = తపోనియములతో; యుక్తుండును = కూడినవాడు; పిపీలకా = చీమలు; ఆవృత = పట్టిన; మేద = కొవ్వు; మాంస = మాంసము; చర్మ = చర్మము; రక్తుండును = రక్తములు గలవాడును; వల్మీక = పుట్టల; తృణ = గడ్డిదుబ్బుల; వేణు = వెదురుపొదల; పటల = సమూహములచే; పరిచ్ఛన్నుండును = కప్పబడినవాడు; మహా = గొప్ప; తపస్ = తపస్సు యొక్క; ప్రభావ = మహిమ అనెడి; సంపన్నుండును = సంపదలుగలవాడు; ఐ = అయ్యి; నీరంధ్ర = తెఱపిలేక; నిబిడ = మూగిన; నీరద = మబ్బుల; నికర = సమూహములందు; నివిష్ట = చుట్టబడినట్టి; నీరజబంధుండున్ = సూర్యుని; పోలెన్ = వలె; నివసించి = నిలబడి; ఉన్న = ఉన్నట్టి; నిర్జరారాతి = హిరణ్యకశిపుని {నిర్జరారాతి - నిర్జర (ముసలితనము లేనివారి, దేవతల) ఆరాతి (శత్రువు), రాక్షసుడు}; చూచి = గమనించి; వెఱగుపడి = నివ్వెరపోయి; నగుచున్ = నవ్వుతు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ విధంగా దేవతలు హిరణ్యకశిపుడి తపస్సు ఆపించమని మనవి చేసారు. స్వయంభువుడు, చతుర్ముఖుడు అయిన ఆ భగవంతుడు భృగు మహర్షి, దక్ష ప్రజాపతి మెదలగు ప్రముఖులను వెంటపెట్టుకుని అతను తపస్సు చేస్తున్న మంథర పర్వతానికి బయలుదేరాడు. అక్కడ ఆ రాక్షసుడు కఠోర నియమాలతో దీక్షపట్టి మహా గొప్ప తపస్సు చేస్తున్నాడు. వంటినిండా చీమలు పట్టేసి మజ్జ, మాంసం, చర్మం కొరుక్కుతింటున్నాయి. చుట్టూ పుట్టలూ, గడ్డిదుబ్బులూ, వెదురుపొదలూ పెరిగిపోయి, వాటి మధ్య మరుగుపడి కనిపించటంలేదు. నల్లటి దట్టమైన నీటిమేఘాలచే కప్పబడిన సూర్యునిలా, మహా తపస్సు యొక్క ప్రభావంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇది చూసి చతుర్ముఖబ్రహ్మ ఆశ్చర్యంతో చిరునవ్వులు నవ్వుతూ హిరణ్యకశిపుడితో ఇలా అన్నాడు.

7-81-మత్త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"! సురారికులేంద్ర! నీ క్రియ నుగ్రమైన తపంబు మున్
చేసి చూపినవారు లే; రిఁకఁ జేయువారును లేరు; నే
నీ మాధికి మెచ్చితిన్ విను నీ యభీష్టము లిత్తు నా
యా మేటికి? లెమ్ము! లెమ్ము! మహాత్మ! కోరుము కోరికల్

టీకా:

ఓ = ఓ; సురారికులేంద్రా = హిరణ్యకశిపుడా {సురారి కులేంద్రుడు - సుర (దేవతల) అరి (శత్రువుల) కుల (వంశము లంన్నిటికి) ఇంద్ర (ప్రభువు), హిరణ్యకశిపుడు}; నీ = నీ; క్రియన్ = వలె; ఉగ్రము = తీవ్రమైనది; ఐన = అయిన; తపంబున్ = తపస్సును; మున్ = ఇంతకు పూర్వము; చేసి = చేసి; చూపిన = చూపించిన; వారు = వారు; లేరు = లేరు; ఇక = ఇకపైన; చేయు = చేయబోవు; వారును = వారు; లేరు = లేరు; నేన్ = నేను; నీ = నీ యొక్క; సమాధి = తపోసమాధి; కిన్ = కి; మెచ్చితిన్ = మెచ్చుకొంటిని; విను = వినుము; నీ = నీ; అభీష్టములు = కోరికలు; ఇత్తును = ఇచ్చెదను; ఆయాసము = శ్రమపడుట; ఏటికిన్ = ఎందులకు; లెమ్ము = లేచిరమ్ము; లెమ్ము = లేచిరమ్ము; మహాత్మ = గొప్పవాడ; కోరుము = కోరుకొనుము; కోరికల్ = కోరికలు.

భావము:

“ఓ రాక్షసకులోత్తముడవైన హిరణ్యకశిప! నువ్వు చేస్తున్నంత ఉగ్రమైన తపస్సు ఇంతకు పూర్వం ఎవరూ చేసినవారు ఎవరూ లేరు. ఇకముందు ఎవరూ చేయలేరు. నీ తపో దీక్షకు మెచ్చుకుంటున్నాను. కోరిన కోరికలు ఇస్తాను. ఇంక కష్టపడి తపస్సు చేయటం ఆపెయ్యి. వరాలు కోరుకో ఇస్తాను.

7-82-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దంవ్రాతములుం బిపీలికలు మేదః క్రవ్య రక్తంబులన్
సంశీర్ణంబులు జేసి పట్టితినఁగా ల్యావశిష్టుండ వై
వంచ్ఛన్న తృణావళీ యుత మహాల్మీకమం దింద్రియ
భ్రంశం బింతయు లేక నీకు నిలువం బ్రాణంబు లెట్లుండెనో?

టీకా:

దంశ = అడవియీగల; వ్రాతములున్ = గుంపులు; పిపీలికలు = చీమలు; మేదస్ = కొవ్వు; క్రవ్య = మాంసము; రక్తంబులన్ = రక్తములను; సంశీర్ణంబులు జేసి = చీల్చి; పట్టి = కొరికి; తినగా = తినివేయగా; శల్య = ఎముకలు; అవశిష్టుండవు = మాత్రము మిగిలినవాడవు; ఐ = అయ్యి; వంశ = వెదురుపొదలుతో; చ్ఛన్న = కప్పబడిన; తృణ = గడ్డి; ఆవళీ = దుబ్బులుతో; యుత = కూడిన; మహా = పెద్ద; వల్మీకము = పుట్ట; అందున్ = లో; ఇంద్రియ = ఇంద్రియములు; భ్రంశంబు = చలించిపోవుట, చెదరుట; లేక = లేకుండగ; నీకు = నీకు; నిలువన్ = నిలబడుటకు; ప్రాణంబుల్ = ప్రాణములు; ఎట్లు = ఏ విధముగ; ఉండెనో = ఉన్నవోకదా.

భావము:

ఈగలు, చీమలు పట్టి చీల్చి, చీము, నెత్తురు, కండలు తినేయటంతో ఉట్టి ఎముకల పోగులా మిగిలి ఉన్నావు. నీ మీద వెదురు పొదలు, గడ్డి దుబ్బులు కప్పేసిన పుట్ట పెరిగిపోయి నువ్వు కనబడటంలేదు. అయినా ఇంద్రియాలను నిగ్రహించుకొని తపస్సు చేస్తూనే ఉన్నావు. విచిత్రంగా ఇలా నువ్వు ఇన్నేళ్ళు ఎలా జీవించి ఉన్నావయ్యా! హిరణ్యకశిపా!

7-83-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్సుకతన్ జలాన్నముల నొల్లక యీ క్రియ నూఱుదివ్య సం
త్సరముల్ శరీరమున వాయువులన్ నిలుపంగ వచ్చునే
యుత్సవ మయ్యెఁ జూచి మము నుగ్రతపంబున గెల్చి తీవు నే
త్సలతన్ నినుం గదియ చ్చితిఁ గోరిక లెల్ల నిచ్చెదన్."

టీకా:

ఉత్సుకతన్ = పూనికతో; జల = నీరు; అన్నమున్ = ఆహారము; ఒల్లక = తీసుకొనకుండగ; ఈ = ఈ; క్రియన్ = విధముగ; నూఱు = వంద (100); దివ్యసంవత్సరముల్ = దివ్యసంవత్సరములు; శరీరమున = దేహమునందు; వాయువులన్ = ప్రాణవాయువులను; నిలుపంగన్ = నిలబెట్టుకొనుట; వచ్చునే = సాధ్యమా; ఉత్సవము = సంతోషము; అయ్యెన్ = ఆయెను; చూచి = గమనించి; మమున్ = మమ్ములను; ఉగ్ర = తీవ్రమైన; తపంబునన్ = తపస్సుతో; గెల్చితివి = జయించితివి; నేన్ = నేను; వత్సలతన్ = ప్రేమతో; నినున్ = నిన్ను; కదియన్ = దగ్గరకు చేర; వచ్చితి = వచ్చితిని; కోరికల్ = కోరికలు; ఎల్లన్ = అన్నియును; ఇచ్చెదన్ = ప్రసాదించెదను.

భావము:

అన్నపానీయాలు ముట్టుకోకుండా ఇలా వంద దివ్య సంవత్సరాలపాటు పట్టుబట్టి ప్రాణాలను ఎలా నిలబెట్టుకున్నావయ్యా! చాలా సంతోషం. నీ ఘోరతపస్సు తో మమ్మల్ని గెలిచావు. అత్యంత ప్రేమతో దర్శనం ఇచ్చాము, కావలసిన వరాలుకోరుకో ఇస్తాము.”

7-84-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి వనమక్షికాపిపీలికా భక్షితం బైన రక్షోవిభుని దేహంబు మీఁదం గమండలు జలంబులు ప్రోక్షించిన న ద్దానవేంద్రుండు గమలాసన కరకమల కమనీయ కనకమయ దివ్యామోఘ కమండలు నిర్గత నిర్మల నీరధారా బిందుసందోహ సంసిక్త సకలాంగుం డయి తపంబు చాలించి సాంద్ర కీచక సంఘాత సంఛాదిత వామలూరుమధ్యంబు వెలువడి మహా ప్రభావ బల సౌందర్య తారుణ్య సహితుండును, వజ్రసంకాశ దేహుండును, దప్తసువర్ణ వర్ణుండును నై నీరసేంధననికర నిర్గత వహ్నియునుం బోలె వెలుంగుచుం జనుదెంచి.

టీకా:

అని = అని; పలికి = చెప్పి; వన = అడవి; మక్షికా = ఈగలు; పిపీలికా = చీమలచేతను; భక్షితంబు = పీకబడినది; ఐన = అయిన; రక్షోవిభుని = హిరణ్యకశిపుని {రక్షోవిభుడు - రక్షః (రాక్షసులకు) విభుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు}; దేహంబు = శరీరము; మీదన్ = పైన; కమండలు = కమండలములోని; జలంబులు = నీరు; ప్రోక్షించినన్ = జల్లగా; ఆ = ఆ; దానవేంద్రుండు = హిరణ్యకశిపుడు {దానవేంద్రుడు - దానవ (రాక్షసుల)కు ఇంద్రుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు}; కమలాసన = బ్రహ్మదేవుని {కమలాసనుడు - కమలమును ఆసనముగా కలవాడు, బ్రహ్మదేవుడు}; కర = చేతులు యనెడి; కమల = పద్మముల; కమనీయ = అందమైన; కనకమయ = బంగారపు; దివ్య = దివ్యమైన; అమోఘ = వ్యర్థముకాని, తిరుగులేని; కమండలు = కమండలమునుండి; నిర్గత = వెలువడిన; నిర్మల = స్వచ్ఛమైన; నీర = నీటి; ధారా = ధారలయొక్క; బిందు = చుక్కల; సందోహ = సమూహములచే; సంసిక్త = తడసిన; సకల = సర్వ; అంగుండు = అవయవములుగలవాడు; అయి = ఐ; తపంబున్ = తపస్సును; చాలించి = ఆపివేసి; సాంద్ర = దట్టమైన; కీచక = వెదురుపొదల; సంఘాత = సమూహములచే; సంఛాదిత = కప్పబడిన; వామలూరు = పుట్ట; మధ్యంబు = నడుమనుండి; వెలువడి = బయటకు వచ్చి; మహా = గొప్ప; ప్రభావ = మహిమ; బల = శక్తి; సౌందర్య = అందము; తారుణ్య = ప్రాయములతో; సహితుండును = కూడినవాడు; వజ్ర = వజ్రముతో; సంకాశ = పోల్చదగిన; దేహుండును = శరీరముగలవాడు; తప్త = పుటముపెట్టిన; సువర్ణ = బంగారపు; వర్ణుండును = రంగు మేను గలవాడు; ఐ = అయ్యి; నీరస = ఎండిన, తడిలేని; ఇంధన = కట్టెలనుండి; నిర్గత = వెలువడిన; వహ్నియున్ = అగ్ని; పోలెన్ = వలె; వెలుంగుచున్ = ప్రకాశించుచు; చనుదెంచి = వచ్చి.

భావము:

బ్రహ్మదేవుడు ఇలా అని ఈగలు, చీమలు కొరికిన ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుని శరీరంపై కమండలంలోని నీళ్ళు చిలకరించాడు. అతను తపస్సు చాలించి, ఆ దట్టమైన వెదురుపొదలతో నిండిన పుట్టలోంచి బయటకు వచ్చాడు. ఆ కమండలం సామాన్యమైనదా. అది పద్మాసనుడు తన హస్తపద్మాలతో పట్టుకొనే బహు దివ్యమైన బంగారు కమండలం. అంతటి అమోఘమైన కమండలం లోంచి వెలువడిన నీటి బిందువులతో అతను తడిసాడు. గొప్ప తేజస్సు, బలం, సౌందర్యం, యౌవనం సంతరించుకున్నాడు. అతని దేహం వజ్రంలా దృఢంగా అయింది. పుటంపెట్టిన బంగారంలా మెరిసిపోతోంది. అలా అతను ఎండిన కట్టెలలోనుండి వచ్చే మంటలలా ఉజ్వలంగా మెరిసిపోతున్నాడు.

7-85-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దివిజానీకవిరోధి మ్రొక్కెఁ, గని వాగ్దేవీమనోనేతకున్
విశేషోత్సవ సంవిధాతకు, నమత్సంత్రాతకున్, సత్తపో
నిహాభీష్ట వర ప్రదాతకు, జగన్నిర్మాతకున్, ధాతకున్,
వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాతకున్.

టీకా:

దివిజానీకవిరోధి = హిరణ్యకశిపుడు {దివిజానీకవిరోధి - దివిజ (దేవతా) అనీక (సేనల) కు విరోధి (శత్రువు), హిరణ్యకశిపుడు}; మ్రొక్కెన్ = నమస్కరించెను; వాగ్దేవీమనోనేత = బ్రహ్మదేవుని {వాగ్దేవీ మనోనేత - వాగ్దేవి (సరస్వతీ దేవి)యొక్క మనస్ (మనస్సున) కు నేత (ప్రభువు), బ్రహ్మ}; కున్ = కి; సవిశేషోత్సవసంవిధాత = బ్రహ్మదేవుని {సవిశేషోత్సవ సంవిధాత - సవిశేష (విశిష్టలతోకూడిన) ఉత్సవ (సంతోషమును) సంవిధాత (చక్కగాకలిగించెడివాడు), బ్రహ్మ}; కున్ = కి; నమత్సంత్రాత = బ్రహ్మదేవుడు {నమత్సంత్రాత - నమత్ (మ్రొక్కువారిని) సంత్రాత (చక్కగాకాపాడువాడు), బ్రహ్మ}; కున్ = కి; సత్తపోనివహాభీష్టవరప్రదాత = బ్రహ్మదేవుని {సత్తపో నివహాభీష్టవర ప్రదాత - సత్ (మంచి, సత్యమైన) తపః (తపస్వుల) నివహా (సమూహముల) అభీష్ట (కోరిన) వర (వరములను) ప్రదాత (ప్రసాదించువాడు), బ్రహ్మ}; కున్ = కి; జగన్నిర్మాత = బ్రహ్మదేవుని {జగన్నిర్మాత - జగత్తును నిర్మాత (సృష్టించినవాడు), బ్రహ్మ}; కున్ = కి; ధాత = బ్రహ్మదేవుని; కున్ = కి; వివిధప్రాణిలలాటలేఖనమహా విద్యానుసంధాతకున్ = బ్రహ్మదేవుని {వివిధ ప్రాణి లలాటలేఖన మహావిద్యాను సంధాత – వివిధ (అఖిలమైన) ప్రాణి (జీవుల) లలాట (నొసటి) లేఖన (వ్రాయుట యందు) మహా (గొప్ప) విద్యా (విద్యను) అనుసంధాత (కలిగినవాడు), బ్రహ్మ}; కున్ = కి.

భావము:

ఆ దేవతలపాలిటి శత్రువు అయిన హిరణ్యకశిపుడు అప్పుడు, సరస్వతీ దేవీ హృదయాధిపతియు, ఆనందమును ఇచ్చువాడును, భక్తులను కాదనక కాపాడువాడును, మంచి తాపసులకు మించిన వరాలిచ్చువాడును. లోకాలను పుట్టించిన వాడును, సకల ప్రాణుల నుదుటివ్రాతను వ్రాసేవాడును అయిన బ్రహ్మదేవుడికి నమస్కరించాడు.

7-86-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు దైత్యేశ్వరుండు దివి నున్న హంసవాహనునకు ధరణీతలంబున దండప్రణామంబు లాచరించి సంతోషబాష్పసలిలసంవర్ధిత పులకాంకురుండై యంజలి జేసి కంజాతగర్భుని మీఁద దృష్టి యిడి గద్గదస్వరంబున నిట్లని వినుతించె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; దైత్యేశ్వరుండు = హిరణ్యకశిపుడు {దైత్యేశ్వరుడు - దైత్య (రాక్షసుల)కు ఈశ్వరుండు (ప్రభువు), హిరణ్యకశిపుడు}; దివిన్ = ఆకాశమున; ఉన్న = ఉన్నట్టి; హంసవాహనున్ = బ్రహ్మదేవుని {హంసవాహనుడు - హంస వాహనముగా కలవాడు, బ్రహ్మ}; కున్ = కి; ధరణీతలంబునన్ = నేలపైన; దండప్రణామంబులు = దండవన్నమస్కారములు {దండప్రణామము - కఱ్ఱవలె సాగి మ్రొక్కుట}; ఆచరించి = చేసి; సంతోష = ఆనందపు; బాష్పసలిల = కన్నీటిచే; సంవర్ధిత = అతిశయించిన; పులకాంకురుండు = గగుర్పాటు గలవాడు; ఐ = అయ్యి; అంజలి = నమస్కారము; చేసి = పెట్టి; కంజాతగర్భుని = బ్రహ్మదేవుని {కంజాత గర్భుడు - కంజాత (నీట పుట్టినది పద్మము)న గర్భుడు (పుట్టిన వాడు), బ్రహ్మ}; మీదన్ = పైన; దృష్టి = చూపు; ఇడి = పెట్టి; గద్గదస్వరంబునన్ = డగ్గుతికతో; ఇట్లు = ఈ విధముగ; అని = పలికి; వినుతించె = స్తోత్రము చేసెను.

భావము:

ఇలా ఆ హిరణ్యకశిప రాక్షస రాజు ఆకాశంలో హంసవాహనుడై ఉన్న బ్రహ్మదేవుడికి నేలమీద పడిపడి నమస్కారాలు చేసాడు. ఆనంద భాష్పాలతో, పులకరించిన ఒంటితో అంజలి ఘటించి నమస్కారం చేసి, కమలాసనుపైనే దృష్టి నిలుపుకొని బొంగురుపోయిన కంఠంతో ఇలా స్తుతించసాగాడు.

7-87-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ల్పాంతమున నంధకారసంవృత మైన-
గము నెవ్వఁడు దన సంప్రకాశ
మున వెలిగించుచు మూఁడుభంగుల రజ-
స్సత్త్వతమోగుణహితుఁ డగుచుఁ
ల్పించు రక్షించుఁ డపటఁ బ్రహరించు-
నెవ్వఁ డాద్యుఁడు సర్వహేతు వగుచు
శోభితుండై స్వయంజ్యోతియై యొక్కట-
విలసిల్లు నెవ్వఁడు విభుత మెఱసి

7-87.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మయ మయిన మాన ప్రాణ బుద్ధీంద్రి
ములతోడ నెవ్వఁ లఘు మహిమ
డరు నట్టి సచ్చిదానందమయునకు,
హితభక్తి నే నస్కరింతు.

టీకా:

కల్పాంతమునన్ = ప్రళయమునందు; అంధకార = చీకటి; సంవృతము = క్రమ్మినది; ఐన = అయిన; జగమున్ = జగత్తును; ఎవ్వడు = ఎవడైతే; తన = తన యొక్క; సంప్రకాశమునన్ = మిక్కిలి తేజస్సుచే; వెలిగించుచు = ప్రకాశింపజేయుచు; మూడు = మూడు (3); భంగులన్ = విధములుగ; రజస్ = రజస్సు; సత్త్వ = సత్వము; తమస్ = తమస్సు; గుణ = గుణములతో; సహితుండు = కూడినవాడు; అగుచున్ = అగుచు; కల్పించున్ = సృష్టించును; రక్షించున్ = పాలించును; కడపటన్ = చివరకు; ప్రహరించున్ = సంహరించును; ఎవ్వండు = ఎవడైతే; ఆద్యుండు = మూలకారణము; సర్వ = సమస్తమునకు; హేతువు = కారణభూతము; అగుచున్ = అగుచు; శోభితుండు = ప్రకాశించువాడు; ఐ = అయ్యి; స్వయం = తనకుతానే; జ్యోతి = వెలుగునది; ఐ = అయ్యి; ఒక్కటన్ = ఏకమాత్రుడై; విలసిల్లున్ = ప్రకాశించును; ఎవ్వడు = ఎవడైతే; విభుతన్ = ఠీవితో; మెఱసి = విలసిల్లి. సమయము = సమయము; అయిన = వచ్చినప్పుడు; మానస = మనస్సు; ప్రాణ = ప్రాణములు; బుద్ధి = బుద్ధి; ఇంద్రియముల = ఇంద్రియముల; తోడన్ = తోటి; అలఘు = గొప్ప; మహిమన్ = సామర్థ్యముతో; అడరున్ = అతిశయించును; అట్టి = అటువంటి; సచ్చిదానందమయున్ = బ్రహ్మదేవున {సచ్చిదానందమయుడు - సత్ (సత్య మైనది శాశ్వతమైనది) చిత్ (శుద్ధ చైతన్యమైనది) ఆనంద (ఆనందము) లతో మయుండు(నిండినవాడు), బ్రహ్మ}; కున్ = కు; మహిత = గొప్ప; భక్తిన్ = భక్తితో; నేన్ = నేను; నమస్కరింతు = నమస్కరించెదను.

భావము:

“బ్రహ్మదేవా! నీవు ప్రళయకాలమున చిమ్మచీకటిలో మునిగిన లోకానికి నీ స్వయం ప్రకాశంతో వెలుగు ఇస్తావు; రజోగుణ, సత్వగుణ, తమోగుణాలనే త్రిగుణాలచే మువ్విధాల లోకాన్ని పుట్టించి, పెంచి, నశింపజేస్తావు; మొదలు, మూలకారణం అంతా నువ్వే; నీ అంతట నువ్వే కేవలుడవై ప్రకాశిస్తూ ఉంటావు; కాలం ప్రకారం మనస్సు, ప్రాణాలు, బుద్ధి, ఇంద్రియాలతో కూడినవాడిగా తోస్తూ, మహామహిమతో గోచరముకాకుండా మెలుగుతుంటావు; అట్టి ఓ సచ్చిదానంద స్వరూపా! నీకు నమస్కారములు.

7-88-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవా! నీవు ముఖ్యప్రాణం బగుటంజేసి ప్రజాపతివి; మనోబుద్ధి చిత్తేంద్రియంబులకు నధీశ్వరుండవు; మహాభూతగణంబులకు నాధారభూతుండవు; త్రయీతనువునం గ్రతువులు విస్తరింతువు; సకల విద్యలు నీ తనువులు; సర్వార్థసాధకులకు సాధనీయుండ; వాత్మనిష్ఠాగరిష్ఠులకు ధ్యేయంబగు నాత్మవు; కాలమయుండవై జనులకు నాయుర్నాశంబు జేయుదువు; జ్ఞానవిజ్ఞానమూర్తి; వాద్యంతరహితుండ; వంతరాత్మవు; మూఁడు మూర్తులకు మూలంబగు పరమాత్మవు; జీవలోకంబునకు జీవాత్మవు; సర్వంబును నీవ, నీవుగానిది లేశంబును లేదు; వ్యక్తుండవు గాక పరమాత్మవై పురాణపురుషుండవై యనంతుడవైన నీవు ప్రాణేంద్రియ మనోబుద్ధి గుణంబుల నంగీకరించి, పరమేష్ఠిపద విశేషంబున నిలిచి, స్థూలశరీరంబునం జేసి యింతయుం బ్రపంచింతువు; భగవంతుఁడవైన నీకు మ్రొక్కెద" నని మఱియు నిట్లనియె.

టీకా:

దేవా = బ్రహ్మదేవుడా; నీవు = నీవు; ముఖ్యఫ్రాణంబు = సూత్రాత్మ; అగుటన్ = అగుట; చేసి = వలన; ప్రజాపతివి = ప్రజలకు జపన హేతువవు; మనః = మనసు; బుద్ధి = బుద్ధి; చిత్ = చిత్తు; ఇంద్రియంబుల్ = ఇంద్రియముల; కున్ = కు; అధీశ్వరుండవు = ప్రభువవు; మహా = గొప్ప; భూత = జీవ; గణంబుల్ = రాశుల; కున్ = కు; ఆధారభూతుండవు = ఆధారమైనవాడవు; త్రయీ = వేదత్రయమయమైన; తనువునన్ = శరీరముతో; క్రతువులు = యజ్ఞములు; విస్తరింతువు = వ్యాప్తిచేసెదవు; సకల = సమస్తమైన; విద్యలు = విద్యలు; నీ = నీ యొక్క; తనువులున్ = శరీరములు; సర్వార్థసాధకుల్ = సర్వార్థసాధకులు {సర్వార్థసాధకులు - సర్వోత్తమైన ప్రయోజనమనకై (పరమహంస పదవికై) సాధన చేయువారు}; కున్ = కు; సాధనీయుండవు = సాధనచేయబడదగినవాడవు; ఆత్మ = బ్రహ్మవిద్యా; నిష్ఠా = నిష్ఠగలవారియందు; గరిష్ఠల్ = శ్రేష్ఠుల; కున్ = కు; ధ్యేయంబు = ధ్యానింపదగినది; అగు = అయిన; ఆత్మవు = పరమాత్మవు; కాలమయుండవు = కాలస్వరూపివి; ఐ = అయ్యి; జనుల్ = ప్రజల; కున్ = కు; ఆయుః = జీవితకాలమును; నాశంబు = హరించుట; చేయుదువు = చేసెదవు; జ్ఞాన = పరావిద్య; విజ్ఞాన = అపరవిద్యల; మూర్తివి = స్వరూపివి; ఆద్యంతరహితుండవు = మొదలు తుది లేనివాడవు; అంతరాత్మవు = జీవులలోపలి చైతన్యమవు; మూడుమూర్తుల = త్రిమూర్తుల తత్వమున {త్రిమూర్తులు - బ్రహ్మవిష్ణుమహేశ్వరులు}; కున్ = కు; మూలంబు = మూలాధారము; అగు = అయిన; పరమాత్మవు = పరమాత్మవు; జీవ = ప్రాణులు; లోకంబున్ = సర్వుల; కున్ = కు; జీవ = ప్రాణస్వరూపమై; ఆత్మవు = లోపలనుండెడివాడవు; సర్వంబును = సమస్తమును; నీవ = నీవే; నీవు = నీవు; కానిది = కానట్టిది; లేశంబును = కొంచెముకూడ; లేదు = లేదు; వ్యక్తుండవు = తెలియగలవాడవు; కాక = కాకుండగ; పరమాత్మవు = పరమాత్మవు; ఐ = అయ్యి; పురాణపురుషుండవు = ఆదిమూర్తివి; ఐ = అయ్యి; అనంతుడవు = అంతములేనివాడవు; ఐన = అయిన; నీవు = నీవు; ప్రాణ = ప్రాణములు; ఇంద్రియ = ఇంద్రియములు; మనః = మనస్సు; బుద్ధి = బుద్ధి; గుణంబులన్ = త్రిగుణములను; అంగీకరించి = స్వీకరించి; పరమేష్ఠి = బ్రహ్మదేవ {పరమేష్ఠి - పరమ (అత్యుత్తమమైన) ఇష్ఠి (యత్నముగలవాడు), బ్రహ్మ}; పదవిన్ = అధికారమైన; విశేషంబునన్ = విశిష్ఠతయందు; నిలిచి = స్థిరుడవై; స్థూలశరీరంబునన్ = బాహ్యశరీరము; చేసి = వలన; ఇంతయున్ = ఈ సృష్టినంతను; ప్రపంచింతువు = విస్తరింపజేయుదువు; భగవంతుడవు = పూజ్యుడవు; ఐన = అయిన; నీకున్ = నీకు; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

బ్రహ్మదేవా! నువ్వు సూత్రాత్మవు. ప్రాణానికి ప్రాణానివి. ప్రజాపతివి. ప్రజలుచే జపించ తగినవాడవు. మనస్సుకి, బుద్ధికి, చిత్తానికి, ఇంద్రియాలకి అధిపతివి. భూమి, నీరు, వాయువు, తేజస్సు, ఆకాశము అనే పంచమహాభూతాలకు ఆధారమైనవాడవు. వేదం అనే శరీరంతో యజ్ఞయాగాదులను వ్యాప్తి చేయువాడవు. సమస్త విద్యలు నీ శరీరమే. అత్యున్నత ఆధ్యాత్మిక విద్యా సాధకులచే ధ్యానింప బడువాడవు. బ్రహ్మవిద్యావేత్తల చేత ధ్యానింప బడువాడవు. పరమాత్మవు. కాలస్వరూపుడవు అయి ప్రజల ఆయుస్సులను నశింపచేసే వాడవు నీవే. జ్ఞాన విజ్ఞానాలు మూర్తీభవించినవాడవు. మొదలు తుది లేని వాడవు. జీవులలోని అంతరాత్మవు. త్రిమూర్తులు అగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలమైన పరమాత్మవు. జీవకోటికి జీవాత్మవు. ఈ సృష్టిలోని సర్వం నీవే. నీవు కానిది మరేదీ లేదు. నిన్ను ఎవరు తెలిసికోలేరు. నీవు పరమాత్మవు. పురాణపురుషుడవు. అనంతుడవు. అట్టి నీవు ప్రాణం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, గుణాలు పొంది పరమేష్ఠి పదవిని అందుకున్నావు. స్థూల శరీరంతో ఈవిధంగా విస్తరిస్తావు. నీవు భగవానుడవు. నీకు నమస్కారములు.” అని స్తుతించి ఇంకా ఇలా అన్నారు.

7-89-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కోరినవారల కోర్కులు
నేరుపుతో నిచ్చి మనుప నీ క్రియ నన్యుల్
నేరు కరుణాకర నేఁ
గోరెద నీ విచ్చెదేనిఁ గోరిక లభవా!

టీకా:

కోరినవారల = కోరినవారి యొక్క; కోర్కులు = కోరికలు; నేరుపు = నేర్పు; తోన్ = తోటి; ఇచ్చి = ఇచ్చి; మనుప = సంరక్షించుటకు; నీ = నీ; క్రియన్ = వలె; అన్యుల్ = ఇతరులు; నేరరు = సమర్థులుగారు; కరుణాకర = దయాసముద్రుడ; నేన్ = నేను; కోరెదన్ = కోరుకోనెదను; నీవు = నీవు; ఇచ్చెద = ఇచ్చెదవు; ఏనిన్ = అయినచో; కోరికల్ = కోరికలను; అభవా = బ్రహ్మదేవుడా {అభవుడు - భవము (పుట్టుక) లేనివాడు, బ్రహ్మ}.

భావము:

“బ్రహ్మదేవుడా! దయాసాగరా! కోరినవారి వరాలను ప్రసాదించి పాలించుటలో నిన్ను మించిన వారు ఎవరూ లేరు. నువ్వు వరాలు ప్రసాదిస్తాను అంటున్నావు. అయితే, నేను నా కోరికలను కోరుకుంటాను.

7-90-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గాలిం, గుంభిని, నగ్ని, నంబువుల, నాకాశస్థలిన్, దిక్కులన్,
రేలన్, ఘస్రములం, దమఃప్రభల, భూరిగ్రాహ, రక్షో, మృగ
వ్యా ళాదిత్య, నరాది జంతు కలహవ్యాప్తిన్, సమస్తాస్త్ర శ
స్త్రాళిన్, మృత్యువు లేని జీవనము లోకాధీశ! యిప్పింపవే."
{హిరణ్యకశిపుని వరాలు}

టీకా:

గాలిన్ = వాయువునందు; కుంభినిన్ = నేలయందు; అంబువులన్ = నీటిలోను; ఆకాశస్థలిన్ = ఆకాశప్రదేశములోను; దిక్కులన్ = దిక్కులందు; రేలన్ = రాత్రికాలమునందు; ఘస్రములన = పగటికాలమునందు; తమః = చీకటియందును; ప్రభలన్ = వెలుగునందు; భూరి = గొప్పగొప్ప; గ్రాహ = మోసళ్ళు; రక్షః = రాక్షసులు; మృగ = క్రూరమృగములు; వ్యాళ = పాములు; ఆదిత్య = దేవతలు {ఆదిత్యులు - అదితి పుత్రులు, దేవతలు}; నర = మానవులు; ఆది = మొదలగు; జంతు = జంతువులతో; కలహ = పోరాటము; వ్యాప్తిన్ = సంభవించినప్పుడు; సమస్త = అన్నిరకముల; అస్త్ర = అస్త్రముల; శస్త్ర = శస్త్రముల; ఆవళిన్ = సమూహముచేతను; మృత్యువు = చావు; లేని = లేనట్టి; జీవనమున్ = బ్రతుకును; లోకాధీశ = బ్రహ్మదేవుడా {లోకాధీశుడు - లోకా (లోకములన్నిటికి) అధీశ (ప్రభువు), బ్రహ్మ}; ఇప్పించవే = అనుగ్రహించుము.

భావము:

సమస్త లోకాలకు అధిపతివి అయిన ఓ బ్రహ్మదేవా! గాలిలోగాని; నేలమీద కాని; నిప్పుతో కాని; నీటిలో కాని; ఆకాశంలో కాని; దిక్కులలో కాని; రాత్రి సమయంలో కాని; పగటి సమయంలో కాని; చీకట్లో కాని; వెలుగులో కాని; జంతువులచే కాని; జలజంతువులచే కాని; పాములచే కాని; రాక్షసులు, దేవతలు, మానవులు మున్నగు వారితో యుద్ధంలో, సమస్త అస్త్రాలు, శస్త్రాలు వలన కాని –మరణం లేని వరం ప్రసాదించు."
గమనిక – ఆయన ఏదో వరం కోరుకోమన్నాడు సరే, అది తను పట్టుపడితేనే కదా. ఈయన పద్దెనిమిది (18) కోరికలు కలిపి కూరేసి వరం అని కోరుతున్నాడు. ఇంతే కాదుట ఇంకో మూడు ఉన్నాయిట (తరువాత వచనంలో). తన కోసం కాదట తమ్ముడి మరణానికి ప్రతీకారం కోసం ఈ అజరామరత్వం అది (7-71-క.) అట. అది కూడా ప్రతీకారం ఎవరి మీద తీర్చుకోవాలో వారి కొడుకును వరాలు కోరుతున్నాడు. (విష్ణుమూర్తి నాభి కమలంలో బ్రహ్మదేవుడు పుట్టాడు) అందుకే హిరణ్యాక్షవరాలు అని అసంబద్ధ కోరికలు అంటారు ఏమో?

7-91-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియు రణంబులందుఁ దన కెదురులేని శౌర్యంబును, లోకపాలుర నతిక్రమించు మహిమయును, భువనత్రయజయంబును, హిరణ్యకశిపుండు గోరిన నతని తపంబునకు సంతోషించి దుర్లభం బయిన వరంబు లన్నియు నిచ్చి కరుణించి విరించి యిట్లనియె.
{హిరణ్యకశిపుని వరాలు}

టీకా:

అని = అని; మఱియున్ = ఇంకను; రణంబుల్ = యుద్ధముల; అందున్ = లోను; తన = తన; కున్ = కు; ఎదురు = తిరుగు; లేని = లేని; శౌర్యంబును = శూరత్వమును; లోకపాలురన్ = సర్వలోకముల ప్రభువులను; అతిక్రమించు = ఓడించెడి; మహిమయునున్ = సమర్థతను; భువనత్రయ = ముల్లోకములందు {భువనత్రయము - 1భూలోకము 2స్వర్గలోకము 3పాతాళలోకములు}; జయంబునున్ = విజయములు; హిరణ్యకశిపుండు = హిరణ్యకశిపుడు; కోరినన్ = కోరుకొనగ; అతని = అతని; తపంబున్ = తపస్సున; కున్ = కు; సంతోషించి = ఆనందించి; దుర్లభంబు = పొందశక్యముగానివి; అయిన = ఐన; వరంబులు = వరములు; అన్నియున్ = అన్నిటిని; ఇచ్చి = ఇచ్చి; కరుణించి = దయచేసి; విరించి = బ్రహ్మ; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇంకా యుద్ధాలలో తనకి ఎవరూ ఎదురు నిలువ లేని అంతటి శౌర్యం మరియు సమస్త లోకాలను పాలించే వారందరిని ఓడించే చేవ (సమర్థత), భూ, భువః, సువః అనే ముల్లోకాలు మూటి పైన జయం కావాలని హిరణ్యఖశిపుడు వరం కోరాడు. అతని తపస్సుకు సంతోషించి, అట్టి వరాలు దుర్లభాలు అయినా బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు.

7-92-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"న్నా! కశ్యపపుత్ర! దుర్లభము లీ ర్థంబు లెవ్వారికిన్;
మున్నెవ్వారలుఁ గోర రీ వరములన్; మోదించితిన్ నీ యెడన్
న్నుం గోరిన వెల్ల నిచ్చితిఁ బ్రవీత్వంబుతో బుద్ధి సం
న్నత్వంబున నుండు మీ సుమతివై ద్రైకశీలుండవై."
{హిరణ్యకశిపుని వరాలు}

టీకా:

అన్నా = అయ్యా; కశ్యపపుత్రా = హిరణ్యకశిపుడ {కశ్యపపుత్రుడు - కశ్యపుని పుత్రుడు}; దుర్లభములు = పొందరానివి; ఈ = ఈ; అర్థంబులు = ప్రయోజనములు; ఎవ్వరికిన్ = ఎవరికైనను; మున్ను = ఇంతకు పూర్వము; ఎవ్వారలున్ = ఎవరునుకూడ; కోరరు = కోరలేదు; ఈ = ఇట్టి; వరములన్ = వరములను; మోదించితిన్ = సంతోషించితిని; నీ = నీ; యెడన్ = అందు; నన్నున్ = నన్ను; కోరినవి = కోరినట్టివి; ఎల్లన్ = అన్నియును; ఇచ్చితిన్ = ప్రసాదించితిని; ప్రవీణత్వంబు = నేరుపు; తోన్ = తోటి; బుద్ధి = జ్ఞానము యనెడి; సంపన్నత్వంబునన్ = సంపదతో; ఉండుమీ = ఉండుము; సుమతివి = మంచి బుద్ధిగలవాడవు; ఐ = అయ్యి; భద్ర = మంగళ; ఏక = ప్రధానమైన; శీలుండవు = స్వభావములుగలవాడవు; ఐ = అయ్యి.

భావము:

“ఓ కశ్యప పుత్రా! హిరణ్యకశిపా! విను, నువ్వు నన్ను అడిగిన వరాలు ఎవరికైనా పొందశక్యంకానివి. ఇలాంటి వరాలు ఇంతకు ముందు ఎవరూ కోరలేదు. నీ తపస్సుకు చాలా సంతోషించాను. నీ యందలి కరుణతో ఈ వరాలు అన్నీ (21 వరాలు) ప్రసాదిస్తున్నాను. నేర్పు, న్యాయం కలిగి మంచి బుద్ధితో మెలగుతూ బ్రతుకుము”

7-93-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యి ట్లమోఘంబు లయిన వరంబు లిచ్చి దితినందనుచేతం బూజితుండై యరవిందసంభవుండు బృందారక సందోహ వంద్యమానుం డగుచు నిజ మందిరంబునకుం జనియె; ని వ్విధమ్మున నిలింపారాతి వరపరంపరలు సంపాదించుకొని.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; అమోఘంబులు = సఫలములైనవి; అయిన = ఐన; వరంబుల్ = వరములను; ఇచ్చి = ప్రసాదించి; దితినందనున్ = హిరణ్యకశిపుని {దితినందనుడు - దితియొక్కనంద నుడు (పుత్రుడు), హిరణ్యకశిపుడు}; చేతన్ = వలన; పూజితుండు = పూజింపబడినవాడు; ఐ = అయ్యి; అరవిందసంభవుండు = బ్రహ్మదేవుడు {అరవిందసంభవుడు - అరవిందము (పద్మము)నందు సంభవుండు (పుట్టినవాడు), బ్రహ్మ}; బృందారక = దేవతల; సందోహ = సమూహములచేత; వంద్యమానుండు = మ్రొక్కబడినవాడు; అగుచున్ = అగుచు; నిజ = తన; మందిరంబున్ = నివాసమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; ఈ = ఈ; విధమ్మునన్ = విధముగ; నిలింపారాతి = హిరణ్యకశిపుడు {నిలింపారాతి - నిలింప (దేవతల) ఆరాతి (శత్రువు), హిరణ్యకశిపుడు}; వర = వరముల; పరంపరలు = సమూహములను; సంపాదించుకొని = పొంది.

భావము:

అలా బ్రహ్మదేవుడు తిరుగులేని వరాలను దితి కొడుకు హిరణ్యకశిపునికి ప్రసాదించాడు. అతనిచేత పూజలు పొంది, దేవతలు అందరి స్తుతి స్తోత్రాలు అందుకుంటూ స్వస్థలానికి వెళ్ళిపోయాడు. ఆ రాక్షసుడు ఇలా కోరుకున్న వరాలన్నీ పొందాడు. ఆపైన. . .

7-94-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సోరుఁ జంపిన పగ కై
యార మించుకయు లేక సురేంద్రుఁడు కం
జోరుపై వైరము దు
ర్మారతుం డగుచుఁ జేసె నుజాధీశా!

టీకా:

సోదరు = తమ్ముని; చంపిన = సంహరించిన; పగ = కక్ష; కై = కై; ఆదరము = మన్నన; ఇంచుకయున్ = కొంచెముకూడ; లేక = లేకుండగ; అసురేంద్రుడు = హిరణ్యకశిపుడు {అసురేంద్రుడు - అసురుల (రాక్షసుల)కు ఇంద్రుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు}; కంజోదరు = నారాయణుని {కంజోదరుడు - కంజము (పద్మము) ఉదరమునగలవాడు, విష్ణువు}; పైన్ = మీద; వైరము = శత్రుత్వము; దుర్మాద = చెడ్డ మదమునందు; రతుండు = మిక్కిలి ఆపేక్షగలవాడు; అగుచున్ = అగుచు; చేసెన్ = చేసెను; మనుజాధీశ = రాజా {మనుజాధీశుడ - మనుజు (మానవు)లకు అధీశుడు, రాజు}.

భావము:

ఓ ధర్మరాజా! ఇలా కొవ్వెక్కిన రాక్షసరాజు హిరణ్యకశిపుడు తన తమ్ముడిని చంపాడు అని పగబూని నీతిమాలి పద్మనాభస్వామి విష్ణుమూర్తి మీద విడువని శత్రుత్వం పెంచుకున్నాడు.

7-95-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కనాఁడు గంధర్వ యూధంబుఁ బరిమార్చు-
దివిజుల నొకనాఁడు దెరలఁ దోలు;
భుజగుల నొకనాఁడు భోగంబులకుఁ బాపు-
గ్రహముల నొకనాఁడు ట్టివైచు;
నొకనాఁడు యక్షుల నుగ్రత దండించు-
నొకనాఁడు విహగుల నొడిసిపట్టు;
నొకనాఁడు సిద్ధుల నోడించి బంధించు-
నుజుల నొకనాఁడు ద మడంచు;

7-95.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డిమి నొకనాఁడు కిన్నర చర సాధ్య
చారణ ప్రేత భూత పిశాచ వన్య
త్త్వ విధ్యాధరాదుల సంహరించు
దితితనూజుండు దుస్సహ తేజుఁ డగుచు.

టీకా:

ఒకనాడు = ఒకరోజు; గంధర్వ = గంధర్వుల; యూధంబున్ = సమూహములను; పరిమార్చున్ = సంహరించును; దివిజులన్ = దేవతలను {దివిజులు - దివి (స్వర్గమున) ఉండువారు, దేవతలు}; ఒకనాడు = ఒకరోజు; తెరలన్ = చెదిరిపోవునట్లు; తోలున్ = తరుమును; భుజగులన్ = నాగలోకవాసులను; ఒకనాడు = ఒకరోజు; భోగంబుల్ = భోగములను; పాపు = దూరము చేయును; గ్రహములన్ = గ్రహములను; ఒకనాడు = ఒకరోజు; కట్టివైచున్ = కట్టవేయును; ఒకనాడు = ఒకరోజు; యక్షులన్ = యక్షులను; ఉగ్రతన్ = తీవ్రతన్; దండించున్ = శిక్షించును; ఒకనాడు = ఒకరోజు; విహగులన్ = పక్షులను; ఒడిసిపట్టున్ = ఒడిసి పట్టుకొనును; ఒకనాడు = ఒకరోజు; సిద్ధులన్ = సిద్ధులను; ఓడించి = ఓడించి; బంధించున్ = బంధించును; మనుజులన్ = మానవులను; ఒకనాడు = ఒకరోజు; మదమున్ = పొగరు; అడంచున్ = అణచును; కడిమిన్ = పరాక్రమముతో; ఒకనాడు = ఒకరోజు;
కిన్నర = కిన్నరుల; ఖచర = ఖేచరుల; సాధ్య = సాధ్యుల; చారణ = చారణుల; ప్రేత = ప్రేతముల; భూత = భూతముల; పిశాచ = పిశాచముల; వన్యసత్త్వ = అడవి జంతువుల; విద్యాధర = విద్యాధరులు; ఆదుల = మొదలగువారిని; సంహరించున్ = చంపును; దితితనూజుండు = హిరణ్యకశిపుడు {దితితనూజుడు - దితి యొక్కతనూ జుడు (పుత్రుడు), హిరణ్యకశిపుడు}; దుస్సహ = భరింపశక్యముగాని; తేజుడు = తేజస్సుగలవాడు; అగుచున్ = అగుచు.

భావము:

ఆ దైత్యుడు హిరణ్యకశిపుడు ఒకరోజు తేరిచూడలేని పరాక్రమంకలవాడు అయి, ఒకరోజు గంధర్వులను చావగొడతాడు. ఇంకొక రోజు దేవతలను తరుముతాడు. మరొక రోజు నాగులను సంహరిస్తాడు. మరొక నాడు నవగ్రహాలను కట్టేస్తుంటాడు. ఇంకోనాడు యక్షులను తీవ్రంగా బాధిస్తాడు. ఒకరోజు పక్షులను ఎగురనీయకుండ పట్టుకుంటాడు. ఒకనాడు సిద్ధులను జయించి చెరపడతాడు. మరోరోజు మానవులను భయపెడతాడు. ఒక్కొక్కనాడు కిన్నరులను, ఖేచరులను, చారణులను, భూత ప్రేత పిశాచాలను, అడవి మృగాలను, విద్యాధరులను చావగొడుతూ ఉంటాడు.

7-96-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టళ్ళతోడఁ గోటలఁ
ట్టలుకం గూలఁ ద్రోచి క్రవ్యాదులతోఁ
జుట్టు విడిసి దిక్పాలుర
ట్టణములు గొనియె; నతఁడు లమున నధిపా!
{అష్ట దిక్పాలకులు}

టీకా:

అట్టళ్ళ = బురుజుల; తోడన్ = తోటి; కోటలన్ = కోటలను; కట్ట = నిండు; అలుకన్ = కోపముతో; కూలద్రోచి = కూలగొట్టి; క్రవ్యాదుల = రాక్షసుల {క్రవ్యాదులు - క్రవ్యము (మాంసము) ఆదులు (భుజించువారు), రాక్షసులు}; తోన్ = తోటి; చుట్టువిడిసి = చుట్టుముట్టి; దిక్పాలుర = దిక్పాలకుల; పట్టణములున్ = పట్టణములను; కొనియెన్ = తీసుకొనెను; అతడు = అతడు; బలమునన్ = శక్తిసామర్థ్యములతో; అధిపా = రాజా.

భావము:

ధర్మరాజా! ఆ హిరణ్యకశిపుడు మితిమీరిన బలంతో, రాక్షసులను వెంటబెట్టుకొని బయలుదేరాడు. దిక్పాలకుల పట్టణాలమీద దాడిచేసాడు. వారి కోటలు, బురుజులు కూలగొట్టి ఆక్రమించుకొన్నాడు.

7-97-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కృలై సంప్రాపిత దు
ర్దలై సర్వంకషోగ్ర దైతేయాజ్ఞా
లై నిశలును దివములు
ది లెల్లను గట్టుబడియె దీనత ననఘా!

టీకా:

కృశలు = కృశించినవి; ఐ = అయ్యి; సంప్రాపిత = పొందింపబడిన; దుర్దశలు = హీనమైన స్థితులనుగలవి; ఐ = అయ్యి; సర్వంకష = దుష్ట; ఉగ్ర = భయంకరమైన; దైతేయ = రాక్షసుని; ఆజ్ఞా = ఉత్తరములకు; వశలు = లోనైనవి; ఐ = అయ్యి; నిశలున్ = రాత్రులు; దివముల్ = పగళ్ళు; దిశలు = దిక్కులు; ఎల్లను = సమస్తమును; కట్టుబడియెన్ = కట్టుబడిపోయెను; దీనతన్ = జాలికిలోనై; అనఘా = పుణ్యుడా.

భావము:

ఓ పుణ్యాత్ముడైన ధర్మరాజు! దిక్కులన్నీ రాత్రింబవళ్ళు కృంశించి, ఎల్లెడలా రాక్షసుల ధిక్కారాలకు లోనౌతూ ఎంతో దీనావస్థలను పొందుతూ ఉన్నాయి.

7-98-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు న ద్దానవేంద్రుండు విద్రుమ సోపానంబులును, మరకత మణిమయ ప్రదేశంబులును, వైడూర్యరత్నస్తంభ సముదయంబులును, జంద్రికాసన్నిభ స్ఫటికసంఘటిత కుడ్యంబులును, పద్మరాగపీఠ కనక కవాట గేహళీ విటంక వాతాయనంబులును, విలంబమాన ముక్తాఫలదామ వితానశోభిత ధవళ పర్యంకంబులును, వివిధ చిత్ర విమానంబులును, నిరంతర సురభి కుసుమ ఫల భరిత పాదపమహోద్యానంబులును, హేమారవింద సౌగంధి కబంధుర సరోవరంబులును, రమణీయ రత్న ప్రసాద విశేషంబులును మనోహర పరిమళ శీతల మందమారుతంబులును, మృదుమధురనినద కీరకోకిలకుల కోలాహలంబును గలిగి విశ్వకర్మ నిర్మితంబై త్రైలోక్యరాజ్యలక్ష్మీ శోభితంబైన మహేంద్ర భవనంబు చొచ్చి.

టీకా:

మఱియున్ = ఇంకను; ఆ = ఆ; దానవేంద్రుండు = హిరణ్యకశిపుడు {దానవేంద్రుడు - దానవ (రాక్షసుల)కు ఇంద్రుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు}; విద్రుమ = పగడపు; సోపానంబులును = మెట్లును; మరకత = మరకతములు; మణి = మణులు; మయ = తాపడము చేసిన; ప్రదేశంబులును = చోటులు; వైడూర్య = వైడూర్యములు; రత్న = రత్నముల; స్తంభ = స్తంభముల; సముదాయంబునున్ = బారులు; జంద్రిక = వెన్నెలతో; సన్నిభ = సాటిరాగల; స్ఫటికి = స్ఫటికములతో; సంఘటిత = కట్టిన; కుడ్యంబులును = గోడలు; పద్మరాగ = పద్మరాగమణుల; పీఠ = పీఠములుగల; కనక = బంగారపు; కవాట = తలుపులు; గేహళీ = గుమ్మములు; విటంక = చూరుపట్టీలు; వాతాయనంబులును = కిటికీలు; విలంబమాన = వేలాడుతున్న; ముక్తాఫల = ముత్యపు; దామ = దండలు; వితాన = చాందినీలచే; శోభత = ఒప్పుచున్న; ధవళ = తెల్లని; పర్యంకములును = మంచములును; వివిధ = పలురకముల; విచిత్ర = చిత్రములైన; విమానంబులును = విమానములును; నిరంతర = ఎల్లప్పుడును; సురభి = గుమగుమలాడెడి; కుసుమ = పూలు; ఫల = పండ్లుతో; భరిత = నిండిన; పాదప = చెట్లుగల; మహా = పెద్దపెద్ద; ఉద్యానంబులును = తోటలు; హేమా = బంగారు; అరవింద = పద్మముల; సౌగంధిక = చెంగల్వలుతో; బంధుర = నిండినట్టి; సరోవరంబులును = చెరువులు; రమణీయ = అందమైన; రత్న = రత్నాల; ప్రసాద = మేడల; విశేషంబులును = విశిష్టతలు; మనోహర = ఇంపైన; పరిమళ = సువాసనలుగలిగినట్టి; శీతల = చల్లని; మంద = మెల్లని; మారుతంబులును = గాలులు; మృదు = మెత్తగ; మధుర = తీయగ; నినద = పలికెడి; కీర = చిలుకల; కోకిల = కోకిలల; కుల = సమూహముల యొక్క; కోలాహలంబును = కలకలలు; కలిగి = ఉండి; విశ్వకర్మ = విశ్వకర్మచే; నిర్మితంబు = నిర్మింపబడినది; ఐ = అయ్యి; త్రైలోక్య = ముల్లోకములయొక్క; రాజ్యలక్ష్మీ = రాజ్యాధికారసంపదలతో; శోభితంబు = శోభిల్లుతున్నది; ఐన = అయిన; మహేంద్ర = దేవేంద్రుని; భవనంబున్ = భవనమును; చొచ్చి = ప్రవేశించి.

భావము:

విశ్వకర్మచే నిర్మింపబడిన దేవేంద్రభవనం పగడపు మెట్లు; మరకతమణులు తాపడము చేసిన తావులు; వైడూర్య స్తంభముల, రత్నస్తంభముల బారులు; వెన్నెలతో సాటిరాగల మెరుపు గల స్ఫటికపు గోడలుతో అలరారుతోంది; పద్మరాగమణుల పీఠములు; బంగారపు తలుపులు, గుమ్మములు, చూరుపట్టీలు, కిటికీలు; వేలాడుతున్న ముత్యపు దండలు, చాందినీలుతో చక్కగా ఉన్న తెల్లని పరుపులుతో మెరిసిపోతోంది; రకరకాల చిత్రవిచిత్రమైన విమానములును; ఎల్లప్పుడును గుమగుమలాడుచుండే పూలు, పండ్లుతో నిండిన పెద్దపెద్ద తోటలు; బంగారు పద్మములు, చెంగల్వలుతో నిండిన చెరువులు; అందమైన రత్నాల మేడలు; మనోహర పరిమళలుగల చల్లని మందమారుత గాలులు; మృదుమధురంగా పలికెడి చిలుకల, కోకిలల కోలాహలాలతో కలకలలాడుతూ ఉంటుంది. అట్టి ముల్లోకాల రాజ్యాధికార సంపదలతో శోభిల్లుతున్న దేవేంద్రభవనం లోకి ఆ రాక్షసుల ప్రభువు హిరణ్యకశిపుడు ప్రవేశించి.

7-99-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దితిపుత్రుండు జగత్త్రయైకవిభుఁడై దేవేంద్రసింహాస నో
ద్ధతుఁడై యుండ హరాచ్యుతాంబుజభవుల్ ప్పించి భీతిన్ సమా
తులై తక్కిన యక్ష కిన్నర మరుద్గంధర్వ సిద్ధాదు లా
తులై కానుక లిచ్చి కొల్తు రతనిన్ నానా ప్రకారంబులన్.

టీకా:

దితిపుత్రుండు = హిరణ్యకశిపుడు {దితిపుత్రుడు - దితి యొక్క పుత్రుడు, హిరణ్యకశిపుడు}; జగత్రయ = ముల్లోకములకు; ఏక = ఒక్కడే; విభుడు = ప్రభువు; ఐ = అయ్యి; దేవేంద్ర = దేవేంద్రుని; సింహాసన = పీఠమును; ఉద్ధతుడు = అధిష్టించినవాడు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; హర = శివుడు; అచ్యుత = విష్ణుమూర్తి; అంబుజభవుల్ = బ్రహ్మదేవుళ్ళు; తప్పించి = కాకుండగ; భీతిన్ = భయముతో; సమాగతులు = పొందికగలవారు; ఐ = అయ్యి; తక్కిన = మిగిలినవారు; యక్ష = యక్షులు; కిన్నర = కిన్నరలు; మరుత్ = మరుత్తులు; గంధర్వ = గంధర్వులు; సిద్ధుల్ = సిద్ధులు; ఆనతులు = నమ్రతగలవారు; ఐ = అయ్యి; కానుకలు = బహుమతులు; ఇచ్చి = సమర్పించి; కొల్తురు = సేవింతురు; అతనిన్ = అతనిని; నానప్రకారంబులన్ = పలువిధములుగ.

భావము:

ఇలా దితి కశ్యపుల కొడుకు హిరణ్యకశిపుడు ముల్లోకాలపై ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్నాడు. ఇంద్రుని సింహాసనం ఎక్కి కూచుని గర్విస్తున్నాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అయిన త్రిమూర్తులు తప్పించి, మిగతా దేవతలు, తమ తమ నేర్పుల కొలది కానుకలు ఇచ్చి సేవిస్తున్నారు.

7-100-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

" దిక్పాలురఁ జూచి నేఁ డలుగునో యే దేవు బంధించునో
యే దిగ్భాగముమీఁద దాడి చనునో యే ప్రాణులం జంపునో
యీ దైత్యేశ్వరుఁ డంచు నొండొరులు దా రింద్రాదు లాస్థాన భూ
వేదిన్ మెల్లన నిక్కి చూతురు భయావిర్భూత రోమాంచు లై."

టీకా:

ఏ = ఏ; దిక్పాలురన్ = దిక్పాలకులని; చూచి = చూసి; నేడు = ఈ దినమున; అలుగునో = కోపించునో; ఏ = ఏ; దేవున్ = దేవుని; బంధించునో = బంధించివేయునో; ఏ = ఏ; దిగ్భాగము = దిక్కునగల ప్రదేశముల; మీద = పైన; దాడి = యుద్ధమునకు; చనునో = వెళ్ళునో; ఏ = ఏ; ప్రాణులన్ = జీవులను; చంపునో = సంహరించునో; ఈ = ఈ; దైత్యేశ్వరుడు = రాక్షసరాజు; అంచున్ = అనుచు; ఒండొరుల = ఒక్కొక్కరు; తారు = వారు; ఇంద్రా = ఇంద్రుడు; ఆదులు = మొదలగువారు; ఆస్థాన = రాజాస్థానపు సభా; భూవేదిన్ = మండపము మీద; మెల్లన = మెల్లగా; నిక్కి = సాగి; చూతురు = చూచెదరు; భయా = భయముచేత; ఆవిర్భూత = కలిగిన; రోమాంచులు = గగుర్పాటుగలవారు; ఐ = అయ్యి.

భావము:

ఆ రాక్షసుడి సభలో ఇంద్రాది దిక్పాలకులు ఏ దిక్పాలుని చూసి కోపిస్తాడో, ఏ దేవుడిని చెరబడతాడో, దాడి చేయడానికి ఎటు పక్కకు వెళ్తాడో, ఇవాళ జీవులు ఎవరికి వీడి చేతిలో మూడుతుందో అని బెదురిపోతూ సందడి కాకుండా గగుర్పాటుతో నిక్కి చూస్తున్నారు.

7-101-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కోలాహలము మాని కొలువుఁడీ సురలార!-
లఁగి దీవింపుఁడీ పసులార!
ణు లెత్తకుఁడు నిక్కి న్నగేంద్రములార!-
ప్రణతులై చనుఁడి దిక్పాలులార!
గానంబు చేయుఁడీ గంధర్వవరులార!-
సందడిఁ బడకుఁడీ సాధ్యులార!
యాడుఁడీ నృత్యంబు ప్సరోజనులార!-
చేరిక మ్రొక్కుఁడీ సిద్ధులార!

7-101.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శుద్ధకర్పూర వాసిత సురభిమధుర
వ్య నూతన మైరేయపాన జనిత
సుఖవిలీనత నమరారి సొక్కినాఁడు
శాంతి లే" దండ్రు నిచ్చలుఁ జారు లధిప!

టీకా:

కోలాహలము = అల్లరి, గొడవచేయుట; మాని = మానేసి; కొలువుఁడీ = సేవించండి; సురలార = దేవతలారా; తలగి = దూరముగాపోయి, తొలగి; దీపింపుడీ = ఆశీర్వదించండి; తపసులారా = తాపసులారా; ఫణులు = పడగలు; ఎత్తకుడు = ఎత్తకండి; నిక్కి = సాగదీసుకొని; పన్నగ = నాగులల; ఇంద్రములారా = ఉత్తములారా; ప్రణతులు = వంగినవారు; ఐ = అయ్యి; చనుడి = వెళ్ళండి; దిక్పాలకులారా = దిక్పాలురులారా; గానంబు = పాటలు పాడుట; చేయుడీ = చేయండి; గంధర్వ = గంధర్వులలో; వరులార = శ్రేష్ఠులారా; సందడి = చప్పుడు చేస్తూ గుంపులు; పడకుడీ = కట్టకండి; సాధ్యులార = సాధ్యులార; ఆడుడీ = ఆడండి; నృత్యంబుల్ = నాట్యములను; అప్సరసః = అప్సరసలైన; జనులారా = ప్రజలారా; చేరి = దగ్గరకు వచ్చి; ఇక = ఇప్పుడు; మ్రొక్కుడీ = నమస్కరించండి; సిద్ధులారా = సిద్ధులూ.
శుద్ధ = స్వచ్ఛమైన; కర్పూర = పచ్చ కర్పూరపు; వాసిత = వాసనకలిగిన; సురభి = మనోజ్ఞమైన; మధుర = తీయనైన; భవ్య = మంచి; నూతన = కొత్త; మైరేయ = మధ్యము; పాన = తాగుటచే; జనిత = కలిగిన; సుఖవిలీనతన్ = కైపుచేత; అమరారి = రాక్షసుడు; సొక్కినాడు = మైమరచినాడు; శాంతి = నెమ్మది; లేదు = లేదు; అండ్రు = అంటున్నారు; నిచ్చలున్ = నిత్యము; చారులు = సేవకులు; అధిప = రాజా.

భావము:

ఓ ధర్మరాజా! ఆ రాక్షసరాజు సేవకులు “ప్రభువు స్వచ్ఛమైన పచ్చ కర్పూరపు వాసనలతో గమగమలాడే మనోజ్ఞమైన మాంచి తియ్యని సరికొత్త మధ్యం సేవించాడు. ఆ ఆనందంలో సోలిపోతున్నాడు, పూర్తి అశాంతితో తూలిపోతున్నాడు.” అని చెప్తూ “దేవతలారా! గొడవ చేయకుండా నిశబ్దంగా సేవించుకోండి; ఓ మునుల్లారా! పక్కకి తప్పుకొని నిలబడి ఆశీర్వచనాలు పలకండి; నాగరాజులూ! పడగలు ఎత్తకండి; దిక్పాలురూ! మీరు మర్యాదతో వంగి నడవండి; గంధర్వులూ! పాటలు పాడండి; గోల చేయకండి సాధ్యులారా! మీరు అందరు నాట్యాలు చేయండి అప్సరసల్లారా! ఓ సిద్ధులూ! ఇలా దగ్గరకి వచ్చి ప్రభువుకు మొక్కుకోండి” అంటూ నిత్యం అందరి మీద హడావిడి చేస్తున్నారు.

7-102-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లీలోద్యాన లతా నివాసములలో లీలావతీ యుక్తుఁడై
హాలాపాన వివర్ధమాన మద లోలావృత్త తామ్రాక్షుఁడై
కేళిం దేలఁగ నేనుఁ దుంబురుఁడు సంగీత ప్రసంగంబులన్
వాలాయంబుఁ గరంగఁ జేయుదుము దేద్వేషి నుర్వీశ్వరా!

టీకా:

లీలోద్యాన = శృంగారపు పూతోటలోని; లతా = తీగ; నివాసముల = పొదరిళ్ళ; లోన్ = అందు; లీలావతీ = లీలావతితో {లీలావతి - హిరణ్యకశిపుని భార్య}; యుక్తుడు = కూడినవాడు; ఐ = అయ్యి; హాలా = కల్లు, మద్యము; పాన = తాగుటచే; వివర్ధమాన = పెద్దవియైన; మద = మత్తెక్కి; లోలావృత్త = గుండ్రముగా తిరుగుచున్న; తామ్ర = ఎఱ్ఱని; అక్షుడు = కన్నులు గలవాడు; ఐ = అయ్యి; కేళిన్ = విలాసములలో; తేలగా = తేలుతుండగా; నేనున్ = నేను; తుంబురుడు = తుంబురుడు; సంగీత = సంగీతపు; ప్రసంగంబులన్ = ఆలాపనలతో; వాలాయంబున్ = ఎల్లప్పుడును; కరగన్ = శాంతించి కరిగిపోవునట్లు; చేయుదుము = చేసెదము; దేవద్వేషిన్ = హిరణ్యకశిపుని {దేవద్వేషి - దేవతల యెడ ద్వేషముగల వాడు, హిరణ్యకశిపుడు}; ఉర్వీశ్వరా = రాజా {ఉర్వీశ్వరుడు - ఉర్వి (భూమి)కి ఈశ్వరుడు (ప్రభువు), రాజు}.

భావము:

ఓ మహారాజా! దేవతల శత్రువు అయిన హిరణ్యకశిపుడు లీలావతి మహారాణి తో కూడి పొదరిళ్ళ యందు విలాసాల్లో తేలుతున్నాడు. ఇంకా మద్యం తాగిన మత్తుతో వాడి ఎఱ్ఱని కళ్ళు పెద్దవి అయ్యాయి, గుండ్రంగా తిరుగున్నాయి. అలాంటప్పుడల్లా, వాడిని మా సంగీత ఆలాపనలతో తుంబురుడు, నేను శాంతింప జేస్తూ ఉంటాం.

7-103-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యాములు బుధులు ధరణీ
భాములం జేయుచుండఁ ఱతెంచి హవి
ర్భాములు దాన కైకొనుఁ
జాగింపఁడు దైత్యుఁ డమరసంఘంబునకున్.

టీకా:

యాగములు = యజ్ఞములకై; బుధులు = జ్ఞానులు; ధరణీభాగములన్ = భూప్రదేశముల; చేయుచుండ = చేస్తూ ఉండగ; పఱతెంచి = పరుగున వచ్చి; హవిర్భాగములను = యజ్ఞహవిస్సులను; తాన = తనే; కైకొను = తీసుకొనును; చాగింపడు = పోనీయడు, సాగనీయడు; దైత్యుడు = రాక్షసుడు; అమర = దేవతల {అమరులు - మరణము లేనివారు, దేవతలు}; సంఘంబున్ = సమూహమున; కున్ = కు.

భావము:

భూలోకంలో జ్ఞానులు అక్కడక్కడ యజ్ఞాలు చేయటం ఆలస్యం, పరుగున వచ్చి ఆ రాక్షసుడు హవిస్సులు అన్నీ తనే కాజేస్తాడు. దేవతలకు దక్కనివ్వడు.

7-104-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కల మహాద్వీప హిత విశ్వంభరా-
స్థలిని దున్నక పండు స్యచయము;
కామధేన్వాదుల రణి నర్ధులు గోరు-
కోర్కులు గగనంబు గురియుచుండు;
ననిధు లేడును వాహినీసందోహ-
ములును వీచుల రత్నములు వహించు;
నుర్వీరుహంబులు నొక్కకాలంబున-
ఖిలర్తు గుణముల తిశయిల్లు;

7-104.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నంబు సంపూరిత ద్రోణు గుచు నొప్పుఁ
ర్వతంబులు; సర్వదిక్పాల వివిధ
గుణము లెల్లను తానె కైకొనుచు దైత్య
విభుఁడు త్రైలోక్యరాజ్య సంవృద్ధి నుండ.

టీకా:

సకల = అఖిలమైన; మహాద్వీప = సప్తమహాద్వీపములతో {సప్తద్వీపములు - 1జంబూద్వీపము 2ప్లక్షద్వీపము 3శాల్మలీద్వీపము 4కుశద్వీపము 5క్రౌంచద్వీపము 6శాకద్వీపము 7పుష్కరద్వీపములు}; సహిత = సహా; విశ్వంభరాస్థలిని = భూమండలమునందు; దున్నక = పొలములు దున్నకుండగనే; పండున్ = పండును; సస్య = ధాన్యములు; చయము = అన్నియును; కామధేనువు = కామధేనువు; ఆదుల = మొదలగువాని; కరణిన్ = విధముగ; అర్థులు = కోరికలుకోరువారు; కోరు = కోరెడి; కోర్కులు = కోరికలు; గగనంబున్ = ఆకాశము; కురియుచుండున్ = వర్షించును; వననిధులు = సముద్రములు; ఏడును = ఏడు (7); వాహనీ = నదుల; సందోహములును = సమూహములు; వీచులన్ = తరంగములందు; రత్నములు = రత్నములు; వహించు = కలిగియుండును; ఉర్వీరుహంబులు = చెట్లు; ఒక్కకాలంబునన్ = అన్నికాలములలోను; అఖిలర్తు = అన్నిరుతువుల; గుణములన్ = లక్షణములతోను; అతిశయిల్లున్ = సమృద్ధిగానుండును;
అంబు = నీళ్లు; సంపూరిత = నిండిన; ద్రోణులు = గుంటలు,; అగుచున్ = కలిగినవయ్యి; ఒప్పున్ = చక్కగానుండును; పర్వతంబులు = పర్వతములు; సర్వ = అఖిలమైన; దిక్పాల = దిక్పాలకుల; వివిధ = అన్నిరకముల; గుణములు = ఐశ్వర్యములు; ఎల్లను = అన్నిటిని; తానె = తనే; కైకొనుచు = తీసేసుకొనుచు; దైత్యవిభుడు = హిరణ్యకశిపుడు; త్రైలోక్య = ముల్లోకములను; రాజ్య = ఏలెడి; సంవృద్ధిన్ = అభివృద్దితో; ఉండన్ = ఉండగా.

భావము:

ఆ రాక్షసుడు దిక్పాలకులు అందరి రాజ్యాధికారాలు అన్నీ లాగేసుకున్నాడు. ముల్లోకాల లోకి తన రాజ్యాధికారాన్ని పెంచుకుంటూ పోయాడు. అలా ఏలుతుండగా, సప్త మహా ద్వీపాలతో సహా భూమండలంలో అన్ని చోట్లా పొలాలు దున్నకుండానే అన్ని పంటలూ పండుతూ ఉన్నాయి. కామధేనువులాగా ఆకాశం కావలసిన అంత కురుస్తోంది. సప్త సముద్రాలు అన్నీ, నదులు అన్నీ తమ అలలతో రత్నాలను కుమ్మరిస్తు ఉన్నాయి. చెట్లు అన్నీ ఆరు ఋతువుల ధర్మాలు ఏక కాలంలోనే పొందుతూ ఉన్నాయి. పర్వతాల మీది గుంటలు అన్నీ నిత్యం నీటితో నిండి ఉంటున్నాయి.

7-105-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సకల దిక్కులు నిర్జించి లోకైకనాయకుండై తన యిచ్ఛాప్రకారంబున నింద్రియసుఖంబు లనుభవించుచుఁ దనియక శాస్త్రమార్గంబు నతిక్రమించి విరించి వరజనిత దుర్వారగర్వాతిరేకంబున సుపర్వారాతి యైశ్వర్యవంతుండై పెద్దకాలంబు రాజ్యంబు జేయునెడ.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సకల = అన్ని; దిక్కులు = దిక్కులు; నిర్జించి = జయించి; లోక = అఖిలలోకములకు; ఏక = ఒకడే; నాయకుండు = నాయకుడు; ఐ = అయ్యి; తన = తన యొక్క; ఇచ్ఛా = ఇష్టము; ప్రకారంబునన్ = వచ్చినట్లు; ఇంద్రియసుఖంబుల్ = ఇంద్రియసుఖములను; అనుభవించుచు = అనుభవించుచు; తనియక = తృప్తిచెందక; శాస్త్ర = శాస్త్రము; మార్గంబు = నిర్దేశించినవిధమును; అతిక్రమించి = దాటి; విరించి = బ్రహ్మదేవుడిచ్చిన; వర = వరములవలన; జనిత = కలిగిన; దుర్వార = దాటశక్యముగాని; గర్వ = గర్వము; అతిరేకంబునన్ = పెరుగుటవలన; సుపర్యారాతి = హిరణ్యకశిపుడు {సుపర్యారాతి - సుపర్వులు (దేవతలు)కు ఆరాతి (శత్రువు), హిరణ్యకశిపుడు}; ఐశ్వర్యవంతుండు = ఐశ్వర్యములుగలవాడు; ఐ = అయ్యి; పెద్ద = ఎక్కువ; కాలంబు = కాలము; రాజ్యంబున్ = రాజ్యము; చేయున్ = చేసెడి; ఎడన్ = సమయమునందు.

భావము:

ఈ విధంగా దిక్కులన్నీ జయించి, లోకాలు అన్నింటి పై ఏకఛత్రాధిపత్యం సాధించాడు. తన ఇష్టానుసారం ఇంద్రియ సుఖాలను అనుభవిస్తున్నాడు. అయినా తృప్తి చెందటం లేదు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలతో మితిమీరిన గర్వంతో విఱ్ఱవీగుతూ శాస్త్రం చెప్పిన మార్గం అతిక్రమించి మరీ మెలగుతున్నాడు. ఈ విధంగా సకల ఐశ్వర్యాలతో తులతూగుతూ, హిరణ్యకశిపుడు పెద్ద కాలంగా రాజ్యం చేయసాగాడు. అప్పుడు.

7-106-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"న్నఁడు మాకు దిక్కు గల? దెన్నఁడు దైత్యునిబాధ మాను? మే
మెన్నఁడు వృద్ధిఁ బొందఁ గల? మెవ్వరు రక్షకు?" లంచు దేవతా
కిన్నర సిద్ధ సాధ్య ముని ఖేచర నాయకు లాశ్రయించి రా
న్నగతల్పు భూరిభవబంధవిమోచనుఁ బద్మలోచనున్.

టీకా:

ఎన్నడు = ఎప్పుడు; మా = మా; కున్ = కు; దిక్కు = శరణ్యము; కలదు = కలుగును; ఎన్నడు = ఎప్పుడు; దైత్యుని = రాక్షసుని; బాధ = బాధ; మాను = పోవును; మేము = మేము; ఎన్నడు = ఎప్పుడు; వృద్ధిన్ = అభివృద్దిని; పొందగలము = పొందగలము; ఎవ్వరు = ఎవరు; రక్షకులు = కాపాడెడివారు; అంచున్ = అనుచు; దేవతా = దేవతలు; కిన్నర = కిన్నరలు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; ముని = మునులు; ఖేచర = ఖేచరులు యొక్క; నాయకులు = ప్రభువులు; ఆశ్రయించిరి = ఆశ్రయించిరి; ఆ = ఆ; పన్నగతల్పున్ = విష్ణుమూర్తిని {పన్నగతల్పుడు - పన్నగము (ఆదిశేష సర్పము) తల్పము (పాన్పుగాగల వాడు), విష్ణువు}; భూరిభవబంధవిమోచనున్ = విష్ణుమూర్తిని {భూరిభవబంధవిమోచనుడు - భూరి (అత్యధికమైన) భవ(సంసారమనెడి) బంధ (బంధనములను) విమోచనుడు (విడిపించువాడు), విష్ణువు}; పద్మలోచనున్ = విష్ణుమూర్తిని {పద్మలోచనుడు - పద్మములవంటిలోచ నుడు(కన్నులుగలవాడు), విష్ణువు}.

భావము:

“దిక్కులేక ఉన్నాం మాకు దిక్కు ఎక్కడ దొరుకుతుంది, ఈ రాక్షసుడి బాధ ఎప్పుడు తప్పుతుంది, ఎప్పుడు బాగుపడతాం, మమ్మల్ని ఎవరు కాపాడ గలరు” అని బాధ పడుతూ దేవతలు, కిన్నరలు, సిద్ధులు, సాధ్యులు, మునులు, ఖేచరుల నాయకులు అందరూ శేషతల్పశాయిని, సంసారబంధాలనుండి ముక్తి ప్రసాదించు వాడిని, పద్మాక్షుని, విష్ణుమూర్తిని ఆశ్రయించారు.

7-107-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు దానవేంద్రుని యుగ్రదండంబునకు వెఱచి యనన్యశరణ్యులై రహస్యంబున నందఱుం గూడికొని.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; దానవేంద్రుని = హిరణ్యకశిపుని; ఉగ్ర = కఠినమైన; దండంబున్ = శిక్షల; కున్ = కు; వెఱచి = భయపడి; అనన్యశరణ్యులు = వేరెదిక్కులేనివారు; ఐ = అయ్యి; రహస్యంబునన్ = ఏకాంతమునందు; అందఱున్ = అందరును; కూడికొని = కలుసుకొని.

భావము:

ఇలా రాక్షస రాజు హిరణ్యాక్షుని భయంకర దండనలకు బెదిరి, విష్ణుమూర్తి తప్ప మరో దిక్కు లేని వారు అయ్యారు. అందరూ కలిసి ఇలా ప్రార్థించసాగారు.

7-108-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"క్కడ నున్నవాఁడు జగదీశ్వరుఁ డాత్మమయుండు మాధవుం
డెక్కడి కేఁగె శాంతులు మునీశులు భిక్షులు రారు క్రమ్మఱన్
దిక్కుల నెల్ల నెక్కుడు తుదిం జొర దిక్కగు నట్టి దిక్కుకై
మ్రొక్కెద మేము హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకున్."

టీకా:

ఎక్కడన్ = ఎక్కడ; ఉన్నవాడు = ఉన్నాడు; జగదీశ్వరుడు = నారాయణుడు {జగదీశ్వరుడు - జగత్తునకు ఈశ్వరుడు (ఫ్రభువు), విష్ణువు}; ఆత్మమయుండు = నారాయణుడు {ఆత్మమయుడు - ఆత్మరూపమున నుండువాడు, విష్ణువు}; మాధవుండు = నారాయణుడు {మాధవుడు - మాధవి (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు}; ఎక్కడ = ఎక్కడ; కిన్ = కి; ఏగెన్ = వెళ్ళెను; శాంతులు = శమప్రధానచిత్తముగలవారు; ముని = మునులలో; ఈశులు = నాయకులు; భిక్షులు = విరాగులు; రారు = రారు; క్రమ్మఱన్ = మరల; దిక్కులన్ = రక్షిండెడువారిలో; ఎల్లన్ = అందరికన్నను; ఎక్కుడు = అధికుడు; తుదిన్ = అంతమున; చొరన్ = చేరుటకు; దిక్కు = స్థానము; అగునట్టి = అయినట్టివాని; దిక్కు = ప్రాపున; కై = కోసము; మ్రొక్కెదము = నమస్కరించెదము; మేము = మేము; హస్త = చేతులు; యుగముల్ = రెంటిని (2); ముకుళించి = మోడ్చి; మదీయ = మమ్ముల; రక్షకున్ = రక్షించువానిని.

భావము:

విష్ణువు ఎక్కడ ఉన్నాడో? ఏమిటో? ఆయన సకల లోకాలకు ప్రభువు, అందరిలోను ఆత్మరూపంగా నిండి ఉండు వాడు, లక్ష్మీదేవి భర్త. ఆయనను చేరిన శాంతచిత్తులు, మహా మునులు, విరాగులు మరల పునర్జన్మ పొందరు. ఆయన రక్షకులలో కెల్ల బహు శ్రేష్ఠమైన రక్షకుడు. శరణువేడతగినవాడు. ఆయనను రక్షించమని రెండు చేతులు మోడ్చి మొక్కుతున్నాము.

7-109-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియు నాహారనిద్రలు మాని చిత్తంబులు పరాయత్తంబులు గానీక సమాహిత బుద్ధులై; భగవంతుఁడును, మహాపురుషుండును, మహాత్ముండును, విశుద్ధ జ్ఞానానంద మయుండును నైన హృషీకేశునకు నమస్కరించుచున్న యెడ; మేఘరవసమాన గంభీర నినదంబున దిశలు మ్రోయించుచు, సాధులకు నభయంబు గావించుచు, దృశ్యమానుండు గాక పరమేశ్వరుండైన హరి యిట్లనియె.

టీకా:

అని = అని; మఱియున్ = ఇంకను; ఆహారాదులు = ఆహారమునిద్రమొదలైనవి; మాని = విడిచిపెట్టి; చిత్తంబులు = మనసులు; పరా = ఇతరములపై; ఆయత్తంబులు = లగ్నమైనవి; కానీక = కానీయకుండగ; సమాహిత = కూడగొట్టుకొన్న; బుద్ధులు = చిత్తములు; ఐ = అయ్యి; భగవంతుడును = నారాయణుడు {భగవంతుడు - షడ్గుణైశ్వర్యయుక్తుడు, విష్ణువు}; మహాపురుషుడును = నారాయణుడు {మహాపురుషుడు - గొప్ప పురుషుడు, విష్ణువు}; మహాత్ముండును = నారాయణుడు {మహాత్ముడు - గొప్ప ఆత్మగలవాడు, విష్ణువు}; విశుద్ధజ్ఞానానందమయుం డును = నారాయణుడు {విశుద్ధజ్ఞానానందమయుడు - విశుద్ధ (స్వచ్ఛమైన) జ్ఞానముయొక్క రూపుడు (స్వరూపమైనవాడు),విష్ణువు}; ఐన = అయిన; హృషీకేశున్ = నారాయణుని {హృషీకేశుడు - హృషీకముల (ఇంద్రియముల)ను ఈశుడు (శాసించువాడు), విష్ణువు}; కున్ = కు; నమస్కరించుచున్న = మొక్కుతున్న; ఎడన్ = సమయమునందు; మేఘ = మేఘముల; రవ = ధ్వనికి; సమాన = సమానమైన; గంభీర = గంభీరమైన; నినదంబునన్ = స్వరముతో; దిశలు = దిక్కులు; మ్రోయించుచున్ = మారుమోగించుచు; సాధుల్ = దేవతల; కున్ = కు; అభయంబు = నిర్భయమును; కావించుచున్ = కలిగించుచు; దృశ్యమానుండు = కనబడెడివాడు; కాక = కాకుండగ; పరమేశ్వరుండు = నారాయణుడు {పరమేశ్వరుడు - పరమ (అత్యున్నత మైన) ఈశ్వరుడు, విష్ణువు}; హరి = విష్ణువు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా పలుకుతూ ఆహార పానీయాలు విడిచిపెట్టారు. మనస్సులు మరే ఇతరమైన వాటి పైకి పోకుండా నిగ్రహించుకుంటు. బుద్ధిని చిక్క బట్టుకొన్న వారై సాక్షాత్తు భగవంతుడు, మహా పురుషుడు, మహాత్ముడు, పరమేశ్వరుడు, ఆత్మ జ్ఞానానంద స్వరూపుడు, హృషీకేశుడు అయిన విష్ణువును మ్రొక్కారు. హరి కన్నులకు కనబడకుండా, దిక్కులన్నీ ప్రతిధ్వనించేలా మేఘ గంభీర స్వరంతో ఇలా అన్నాడు.

7-110-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ముం జెందకుఁ డయ్య! నిర్జరవరుల్! ద్రంబు మీ కయ్యెడున్
మున్ లాభము భూతసంతతికి మత్సందర్శన ప్రాప్తి న
వ్యమై చేరు; నెఱుంగుదున్ దితిసుత వ్యాపార భాషా విప
ర్యముల్; కాలము గూడఁ జంపెదఁ జనుం డందాఁక మీ త్రోవలన్.

టీకా:

భయమున్ = భయమునందు; చెందకుడు = పడిపోకుడు; అయ్య = తండ్రి; నిర్జర = దేవతల; వరుల్ = ఉత్తములారా; భద్రంబు = మేలు; మీ = మీ; కున్ = కు; అయ్యెడున్ = జరుగును; జయమున్ = విజయములు; లాభము = లాభము; భూత = జంతు; సంతతి = జాలమున; కిన్ = కు; మత్ = నా యొక్క; సందర్శన = దర్శనము; ప్రాప్తిన్ = లభించుటవలన; అవ్యయము = నాశనములేనిది; ఐ = అయ్యి; చేరున్ = కలుగును; ఎఱుంగుదున్ = తెలియుదును; దితిసుత = హిరణ్యకశిపుని {దితిసుత - దితి యొక్క సుత (పుత్రుడు), హిరణ్యాక్షుడు}; వ్యాపార = చేతలు; భాషా = మాటలయందుగల; విపర్యయముల్ = అపరాధములు; కాలము = సమయము; కూడన్ = కలిసివచ్చినప్పుడు; చంపెదన్ = సంహరించెదను; చనుండు = వెళ్లండి; అందాక = అప్పటివరకు; మీ = మీ; త్రోవలన్ = దార్లువెంట.

భావము:

దేవతలారా! భయపడకండి నాయనలారా! నా దర్శనము వలన తప్పక మీకు, సకల ప్రాణులకు మేలు జరుగును. జయము కలుగును. ఆ దైత్యుడు హిరణ్య కశిపుడి దుడుకు చేతలు, దురుసు మాటలు అన్నీ నాకు తెలుసు. సమయం వచ్చి నప్పుడు సంహరిస్తాను. అప్పటిదాకా మీ దారుల్లో మీరు వెళ్ళండి.

7-111-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శుద్ధసాధు లందు, సుర లందు, శ్రుతు లందు,
గోవు లందు, విప్రకోటి యందు,
ర్మపదవి యందుఁ గిలి నా యందు వాఁ
డెన్నఁ డలుగు నాఁడె హింస నొందు.

టీకా:

శుద్ధ = స్వచ్ఛమైన; సాధులు = సజ్జనుల; అందున్ = లోను; సురలు = దేవతలు; అందున్ = లోను; శ్రుతుల = వేదముల; అందున్ = లోను; గోవుల = గోవుల; అందున్ = లోను; విప్ర = బ్రాహ్మణుల; కోటి = సమూహము; అందున్ = లోను; ధర్మ = ధర్మముయొక్క; పదవి = మార్గము; అందున్ = లోను; తగిలి = పూని; నా = నా; అందున్ = ఎడల; వాడు = వాడు; ఎన్నడు = ఏప్పుడైతే; అలుగు = కోపగించునో; నాడె = ఆ దినముననే; హింసన్ = మరణమును; ఒందున్ = పొందును.

భావము:

కపటములేని సాధుజనులు తోను, దేవతల తోను, వేదాల తోను, గోవుల తోను, బ్రాహ్మణుల తోను, ధర్మముతోను, నాతోను ఎప్పుడైతే పట్టుబట్టి శత్రుత్వం వహిస్తాడో అప్పుడే వాడు చస్తాడు.

7-112-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నకొడుకు శమ దమ సం
న్నుఁడు నిర్వైరుఁ డనక ప్రహ్లాదుని వాఁ
డెన్నఁడు రోషంబున నా
న్నత నొందించు నాఁడె ట్టి వధింతున్.

టీకా:

కన్న = స్వంత, తనకు జన్మించిన; కొడుకు = పుత్రుడు; శమ = శాంతి; దమ = దాంతి యనెడి; సంపన్నుడు = సంపదలుగలవాడు; నిర్వైరుడు = విరోధములేనివాడు; అనక = అనిచూడక; ప్రహ్లాదుని = ప్రహ్లాదుని; వాడు = అతడు; ఎన్నడు = ఎప్పుడు; రోషంబునన్ = కక్షతో; ఆపన్నతన్ = కీడు; ఒందించున్ = కలిగించును; నాడె = అప్పుడె; పట్టి = పట్టుకొని; వధింతున్ = చంపెదను.

భావము:

ఎప్పుడైతే వాడు కక్షగట్టి, ఎట్టి వైరభావం లేని వాడు, శాంతి దాంతి మిన్నగా కలవాడు అని కూడ చూడకుండా తన కన్నకొడుకు ప్రహ్లాదుడికి కీడు తలపెడతాడో, అప్పుడే వాడిని చంపుతాను.

7-113-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వేధోదత్త వరప్రసాద గరిమన్ వీఁ డింతవాఁడై మిమున్
బాధం బెట్టుచు నున్నవాఁ డని మదిన్ భావింతు, భావించి నే
సాధింపం దఱిగాదు; కావునఁ గడున్ సైరించితిన్, మీఁదటన్
సాధింతున్ సురలార! నేఁడు చనుఁడా శంకింప మీ కేటికిన్."

టీకా:

వేధ = బ్రహ్మదేవునిచే; దత్త = ఇవ్వబడిన; వర = వరముల యొక్క; గరిమనే = బలముతో; వీడు = ఇతడు; ఇంతవాడు = ఇంతటివాడు; ఐ = అయ్యి; మిమున్ = మిమ్ములను; బాధన్ = బాధలను; పెట్టుచున్నాడు = పెడుతున్నాడు; అని = అని; మదిన్ = మనసున; భావింతున్ = అనుకొనెదను; భావించి = తలచి; నేన్ = నేను; సాధింపన్ = నిర్జించుటకు; తఱి = సమయము; కాదు = కాదు; కావునన్ = అందుచేత; కడున్ = మిక్కిలి; సైరించితిన్ = సహించితిని; మీదటన్ = ఇకపైన; సాధింతున్ = నెరవేర్చెదను; సురలారా = దేవతలారా; నేడు = ఇప్పుడు; చనుడా = వెళ్ళండి; శంకింపన్ = అనుమానించుట; మీ = మీ; కున్ = కు; ఏటికిన్ = ఎందులకు.

భావము:

దేవతలారా! హిరణ్యాక్షుడు బ్రహ్మ ప్రసాదించిన వరాల బలంతో ఇంతటి వాడు అయి ఇలా మిమ్మల్ని బాధపెడుతున్నాడు అనుకుంటాను. అందుకే ఇప్పుడు వాడిని ఏమి చేయడానికైనా సమయం కాదు అని చూసికూడ ఊరుకున్నాను. ఇకపై ఊరుకోను. మీరు ఏ సందేహం పెట్టుకోకుండా వెళ్ళండి.

7-114-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు దనుజమర్దనుండు నిర్దేశించిన నిలింపులు గుంపులుగొని మ్రొక్కి రక్కసుండు మ్రగ్గుట నిక్కం బని తమతమ దిక్కులకుం జనిరి; హిరణ్యకశిపునకు విచిత్ర చరిత్రులు నలువురు పుత్రు లుద్భవించిరి; అందు.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; దనుజమర్దనుండు = నారాయణుడు {దనుజమర్దనుడు - దనుజ (రాక్షసులను) మర్దనుడు (శిక్షించువాడు), విష్ణువు}; నిర్దేశించినన్ = నిర్ణయించి చెప్పగా; నిలింపులు = దేవతలు; గుంపులు = సమూహములుగా; కొని = కూడుకొని; మ్రొక్కి = నమస్కరించి; రక్కసుండు = రాక్షసుడు; మ్రగ్గుట = నాశన మగుట; నిక్కంబు = తథ్యము; అని = అని; తమతమ = వారివారి; దిక్కుల = గమ్యముల; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; హిరణ్యకశిపున్ = హిరణ్యకశిపుని; కున్ = కి; విచిత్ర = అబ్బురమైన; చరిత్రులు = నడవడికలు గలవారు; నలువురు = నలుగురు (4); పుత్రులు = కొడుకులు; ఉద్భవించిరి = పుట్టిరి; అందు = వారిలో.

భావము:

ఇలా అసురవైరి విష్ణువు, దేవతలకు ధైర్యం చెప్పి పంపాడు. వారు రాక్షసుడు ఎలాగైనా చావటం ఖాయం అనే ధైర్యంతో గుంపులుకట్టి, వారి వారి నివాసాలకు వెళ్ళారు. ఇంతలో హిరణ్యకశిపుడికి అబ్బురమైన చరిత్ర కల నలుగురు కొడుకులు పుట్టారు.