పృథుశక్తిన్ గజ మా జలగ్రహముతోఁ బెక్కేండ్లు పోరాడి, సం శిథిలంబై, తన లావు వైరిబలముం జింతించి, మిథ్యామనో రథమిం కేటికి? దీని గెల్వ సరి పోరంజాలరా దంచు స వ్యథమై యిట్లనుఁ బూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్.
టీకా:
పృథు = అధికమైన; శక్తిన్ = బలముతో; గజము = ఏనుగు; ఆ = ఆ; జలగ్రహము = మొసలి; తోన్ = తోటి; పెక్కు = అనేక; ఏండ్లు = సంవత్సరములు; పోరాడి = పోరాటము చేసి; సంశిథిలంబు = పూర్తిగా నశించినది; ఐ = అయ్యి; తన = తన యొక్క; లావు = సామర్థ్యము; వైరి = శత్రువు యొక్క; బలమున్ = శక్తిని; చింతించి = తరచి చూసికొని; మిథ్యా = వ్యర్థమైన; మనోరథము = కోరిక; ఇంక = ఇంకను; ఏటికిన్ = ఎందుకని; దీనిన్ = దీనిని; గెల్వన్ = జయించుటకు; సరి = సమానంగా; పోరన్ = పోరుటకు; చాలరాదు = సాధ్యము కాదు; అంచున్ = అనుచు; సవ్యథము = దుఃఖముతో కూడినవాడు; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అనున్ = పలికెను; పూర్వ = పూర్వము చేసిన; పుణ్య = పుణ్యము యొక్క; ఫల = ఫలిత మైన; దివ్య = దివ్య మైన; జ్ఞాన = జ్ఞానము యనెడి; సంపత్తి = సంపదల; తోన్ = తోటి.
భావము:
గజరాజు గొప్పబలంతో అనేక సంవత్సరాలు యుద్ధం జేసి చేసి చివరికి చితికిపోయాడు. తన సత్తువ శత్రువు బలం సరిపోల్చుకొని ఆలోచించుకొన్నాడు “అనవసర ప్రయత్నాలు నాకు ఎందుకు. దీనిని జయించటం, సరిసమంగా పోరాడటం రెండు నాకు సాధ్యంకావు.” అని దుఃఖించాడు. పూర్వజన్మల పుణ్య ఫలం వలన కలిగిన మేలైన జ్ఞానం వల్ల అతడు ఈ విధంగా అనుకోసాగాడు.
“ఈ మొసలిని ఏ విధంగా జయించగలను? ఇకపై నేను ఏదేవుణ్ణి ప్రార్థించను? ఎవరిని పిలవాలి? ఎవరు నన్ను రక్షిస్తారు? ఈ మహామొసలిని ఆపేశక్తి కలవారు ఎవరు? సర్వకార్యాలలో దిట్టలు, గొప్ప పుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా? అట్టి వారికి మొరపెట్టుకుంటాను.
చాలాకాలం నుంచి అడవిలో ఎన్నో ఏనుగు గుంపుల గౌరవాన్ని పొందుతున్నాను. పదిలక్షలకోట్ల ఆడ ఏనుగులకు నాథుడుగా ఉన్నాను. నా దానజలధారలతో బలంగా పెరిగిన మంచి గంధంచెట్ల నీడలలో సుఖంగా ఉండకుండ, నీటిమీద ఆశతో ఇక్కడకి ఎందుకు వచ్చాను. భగవంతుడా! చాలా భయం వేస్తోంది. ఎలానో? ఏమిటో?. విశేషము -ప్రమాదంలో పడి అయ్యో ఇలా చేయకుండా ఉంటే. అనిపిస్తుంది కదా. మన గజరాజు లెక్కలేనన్ని ఆడఏనుగులు. గున్న ఏనుగులు కొలుస్తుంటే తిన్నగా ఉండక ఇక్కడికెందుకు వచ్చాన్రా దేవుడా అంటున్నాడు.
ఈ లోకము ఎవరి వల్ల పుడుతుందో, ఎవరిలో కలిసి ఉంటుందో, ఎవరి లోపల లయమై పోతుందో,ఎవరు పరమాత్ముడో, ఎవరు సృష్టికి ప్రధాన కారణమై ఉన్నాడో, ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో, తుది, మొదలు, మధ్య లేని అనంతుడో, ఎవరైతే సమస్తసృష్టి తానే అయి ఉంటాడో, అటువంటి స్వయంభువు, ప్రభువైన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను. అద్భుతమైన అమృత గుళిక, ఈ పద్యం 1, 2 తరగతులు చదివే టప్పుడు ప్రార్థనగా నేర్పేవారు. చెరకు గడలాగా ఎన్నిసార్లు నమలినా రసం ఊరుతూనే ఉంటుంది.
ఒకపరి = ఒకసారి; జగములు = లోకములను; వెలినిడి = బయటపెట్టి, సృష్టించి; ఒకపరి = ఒకసారి; లోపలికిన్ = తన లోపలికి; కొనుచున్ = లయము చేసికొనుచు; ఉభయంబున్ = ఆ రెండు లోకములును; తాను = తనే; ఐ = అయ్యి; సకల = సమస్తమైన; అర్థ = విషయములకు; సాక్షి = అతీతముగ చూచువాడు; అగున్ = అయినట్టి; ఆ = ఆ; అకలంకున్ = దోషములు లేనివానికి; ఆత్మమూలున్ = పరమాత్మను; అర్థిన్ = కోరి; తలంతున్ = ధ్యానము చేసెదను;
భావము:
ఒకసారి లోకాలను సృష్టి చేసి, ఇంకొక సారి తనలో లయం చేసుకుంటూ, ఆ లోకాలు రెండు తానే అయి, అన్ని విషయాలను సాక్షీభూతంగా ఆలోకిస్తూ, ఆత్మలకు ఆత్మ అకళంకుడైన ఆ పరమాత్మను ఆసక్తితో ధ్యానం చేస్తాను.
అనేక వేషాలు వేసే నటుడి లాగ పెక్కు రూపాలతో ఎవరు క్రీడిస్తుంటాడో? ఋషులు దేవతలు కూడా ఎవరి గొప్పదనాన్ని వర్ణించ లేరో? ఎవరి ప్రవర్తన ఇతరులకు అగోచరంగా ఉంటుందో? అట్టి ఆ మహాదేవుణ్ణి నేను సంస్తుతిస్తాను.
ముక్త = పరిత్యజించిన; సంగులు = తగులములు గలవారు; ఐన = అయిన; మునులు = మునులు; దిదృక్షులున్ = దేవుని దర్శింపగోరువారు; సర్వ = సమస్తమైన; భూత = ప్రాణుల; హితులు = మేలు కోరువారు; సాధు = మంచి; చిత్తులు = మనసు గలవారు; అసదృశ = సాటిలేని; వ్రత = దీక్షలు కలవారిలో; ఆఢ్యులు = శ్రేష్ఠులు; ఐ = అయ్యి; కొల్తురు = సేవించెదరు; ఎవ్వని = ఎవని; దివ్య = దివ్యమైన; పదమున్ = పాదములను; వాడు = వాడు; దిక్కు = శరణము; నాకు = నాకు.
భావము:
ప్రపంచంతో సర్వ సంబంధాలు వదలివేసిన మునులు, భగవద్దర్శనం కోరేవారు, సమస్త జీవుల మేలు కోరేవారు, మంచి మనసు కలవారు, సాటిలేని వ్రతాలు ధరించి ఎవరి పాదాలను సేవిస్తారో అట్టి భగవంతుడు నాకు దిక్కు అగు గాక.
భగవంతుడికి పుట్టుక, పాపము, ఆకారం, కర్మలు, నామాలు, గుణాలు లేవు. అతడు లోకాలను పుట్టించడానికి, నశింప జేయడానికి తన మాయా ప్రభావంతో ఇవన్నీ ధరిస్తాడు. అతడు పరమేశ్వరుడు, అంతులేని శక్తి కలవాడు, బ్రహ్మ, నిండైన రూపం గలవాడు, ఏ రూపం లేనివాడు, చిత్రమైన ప్రవర్తన కలవాడు, సర్వసాక్షి, ఆత్మ ప్రకాశమైన వాడు, పరమాత్మ, పరబ్రహ్మ, మాటలకు, ఊహలకు అందనివాడు, పరిశుద్ధుడు, సత్వగుణంతో దరిజేర దగిన వాడు. నేర్పరులు చేసే ఫలాపేక్ష లేని కర్మలను మెచ్చువాడైన ఆ దేవదేవునికి నేను నమస్కారాలు చేస్తాను.
భగవంతుడు శాంతస్వరూపుడు. పరలోక సౌఖ్యప్రదాత. మోక్షానికి అధిపతి. నిర్విశేషుడు. దుష్టులకు భయంకరుడు. సంసారబద్దులకు అందనివాడు. సర్వ గుణ ధర్మాలు కలవాడు. సరళ స్వభావి. విశేషమైన జ్ఞానము కలవాడు. సర్వేంద్రియాల కార్యాలను చూసేవాడు. సమస్తానికి ప్రభువు. బహు క్షేత్రజ్ఞుడు. దయారసానికి సముద్రం వంటివాడు. సర్వానికి ఆది మూల పురుషుడు. ఆత్మకు ఆధారమైనవాడు. సకల ఇంద్రియాలకు నియామకుడు. దుఃఖాన్ని తొలగించేవాడు. మాయ అనే నీడతో ప్రకాశించే బహు నేర్పరి. మిక్కిలి గొప్పవాడు. సమస్తానికి ఆది బీజం అయినవాడు. తనకి మూల కారణం ఏది లేనివాడు. అట్టి ఆ దేవ దేవునికి నన్ను కాపాడ మంటూ నమస్కరిస్తున్నాను.
యోగీంద్రులు యోగం అనే అగ్నితో తమ సర్వ పూర్వ కర్మలను కాల్చివేసి. ఇతరమైనది మరేది తలచకుండ ప్రకాశించే తమ మనసులలో ఆ దేవదేవుని చూస్తుంటారు. అట్టి ఆ మహానుభావుడిని నేను సేవిస్తాను.
పరమేశ్వరుడు సమస్త ఆగమాలు వేదాలు అనే నదులకు సంగమరూపమైన సముద్రం వంటివాడు. మోక్షస్వరూపుడు. గొప్ప గుణాలకు నిలయమైన వాడు. ఆరణి కొయ్యలలోని అగ్నివలె సుగుణాలలో దాగి ఉండేవాడు. స్వయం ప్రకాశకుడు. గొప్ప మనస్సు కలవాడు. ప్రళయాన్ని, సృష్టిని నడిపేవాడు. నాలాంటి ఏ దిక్కులేని జీవుల పాపాలను శమింపజేసేవాడు. సర్వులలోను ఆత్మయై వెలుగువాడు. నాశనం లేనివాడు. పూజింప దగినవాడు. భార్యాపుత్రులు, ఇల్లు, పశువులు వంటి వాటి యందు ఆసక్తి కలవారికి అందరానివాడు. అటువంటి ప్రభువునకు నమస్కారాలు చేస్తాను.
ఇంతేకాకుండా, దేవదేవుడు ధర్మం కామం ధనం అన్నిటి మీద ఆశలు విడిచేసిన పండితుల పూజ లందుకొని వారు కోరుకొన్న ఉత్తమ వరాలు ప్రసాదిస్తాడు. భక్తితో దరిజేరి కోరిన వారికి దయతో నాశనంలేని శరీరాన్ని ఇస్తాడు. ఆనంద సాగరంలో మునిగిన మనస్సులు కల ఏకాంతిక ముక్తులు ఆ దేవదేవుని అనునిత్యం ఆరాధదేవదేవుడు ధర్మం, కామం, ధనం అన్నిటి మీద ఆశలు పండితుల పూజలందుకొని వారు కోరుకొన్న వదిలిన ఉత్తమ వరాలు ప్రసాదిస్తాడు. భక్తితో దరిజేరి కోరిన వారికి దయతో నాశనం లేని శరీరాన్ని ఇస్తాడు. ఆనందసాగరంలో మునిగిన మనస్సులు కల ఏకాంతిక ముక్తులు ఆ దేవదేవుని అనునిత్యం ఆరాధిస్తారు. వారు దేవదేవుని పవిత్ర చరిత్రను కోరికలేమీ లేకుండ కీర్తిస్తుంటారు. ఆ మహాదేవుడు సృష్టికన్న ఆద్యుడు. ఇంద్రియ జ్ఞానానికి అందనివాడు, అధ్యాత్మయోగం వలన చేరదగినవాడు. పరిపూర్ణుడు. మహాత్ముడు. బ్రహ్మస్వరూపుడు. సర్వానికి పరమైనవాడు. ఇంద్రియములకు అతీతుడు. స్థూలస్వరూపుడు, సూక్ష్మ రూపుడు. అటువంటి పరాత్పరుని నేను సేవిస్తాను.
సూర్యుడు అగ్ని మంటలను, వెలుగుని ప్రసరింపజేసి మళ్ళీ శమింపజేసే విధంగానే భగవంతుడు తన కిరణాలచేత బ్రహ్మదేవుడు మొదలైన దేవతలను, సకల జీవరాసులను, సమస్త లోకాలను నానా విధాలైన నామ రూప భేదాలతో సృష్టించి లయింపజేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ తానే అయి గుణాలను ప్రవర్తింప జేస్తాడు. ఆయన స్త్రీ, పురుష, నపుంసక, జంతు, దేవతల, నరులు వంటి వాటిలో ఏ ఒక్క రూపము కలవాడు కాదు. ఆయన కర్మ గుణ భేదాలకి సత్తు, అసత్తులకి అతీతుడు. అంతే కాకుండా అవన్నికూడ తానే అయి ఉంటాడు. అటువంటి ఆ ప్రభువును నేను స్మరిస్తాను.
దేవుడు ఆర్తులైన వారి వెంట, ఉత్తమయోగుల చెంత, అన్ని దిక్కులలో ఉంటాడంటారు. “ఉన్నాడు, ఉన్నాడు” అనే ఆ దేవుడు మరి ఉన్నాడో! లేడో! విశేషము- అర్థం చెప్పనక్కరలేని సుళువైన పదాలలోని ఈ ప్రార్థన ఒక అమృత గుళిక. అలంకారం యమకం, ‘కలడ’ అంటూ ప్రాస ప్రక్క అక్షరానికి కూడా పాకింది. ఇక ఓపిక సన్నగిలింది, ఇంకో దిక్కులేదు. ఓపక్క ఉన్నాడు ఉన్నాడు అంటూనే,. ఆయన కాపాడటానికి రావటంలేదు కనుక సందేహం వస్తోందిట.
కలుగడే = సహాయముగా రాడేమి; నా = నా; పాలిన్ = విషయములో; కలిమి = ఉండుటను; సందేహింపన్ = అనుమానించను; కలిమి = సంపద కలుగుట; లేములు = పేదరికములు; లేకన్ = చూడక; కలుగు = సహాయపడెడి; వాడు = వాడు; నాకున్ = నా యాపదకు; అడ్డపడన్ = సహాయపడుటకు; రాడె = రాడా యేమి; నలిన్ = అధికముగ; అసాధువుల్ = దుర్జనుల; చేన్ = చేతిలో; పడిన = చిక్కినట్టి; సాధుల్ = సజ్జనుల; కున్ = కు; అడ్డపడెడి = సహాయపడెడి; వాడు = వాడు; చూడడే = చూడడా యేమి; నా = నా యొక్క; పాటున్ = దురవస్థను; చూపులన్ = ఇతర చూపులు; చూడక = చూడకనే; చూచువారలన్ = తననే చూచువారిని; కృపన్ = దయతో; చూచువాడు = చూచెడివాడు; లీలన్ = లీల; తోన్ = తోటి; నా = నా యొక్క; మొఱన్ = ఆర్తనాదమును; ఆలింపడే = వినడా యేమి; మొఱగుల = దీనుల; మొఱలు = ఆర్తనాదములను; ఎఱుంగుచున్ = తెలియుచు; తన్ను = తననుతానే; మొఱగు = మరచు; వాడు = వాడు. అఖిల = సర్వ; రూపముల్ = రూపములు; తన = తన యొక్క; రూపము = స్వరూపము; ఐన = అయిన; వాడు = వాడు; ఆది = మొదలు; మధ్య = మధ్య; అంతములున్ = తుదిలు; లేక = లేకుండగ; అడరు = అతిశయించెడి; వాడు = వాడు; భక్తజనములన్ = భక్తు లైనవారిని; దీనులన్ = దీనుల; పాలి = అండగా నుండెడి; వాడు = వాడు; వినడె = వినడా యేమి; చూడడె = చూడడా యేమి; తలపడె = రక్షింప తలచడా యేమి; వేగన్ = శ్రీఘ్రమే; రాడె = రాడా యేమి.
భావము:
ఎంత చక్కటి సీసపద్యం! ఎంతచక్కగా వర్ణించాడు!! నా విషయంలో ఆ భగవంతుడిని అనుమానించ వలసిన పని లేదు. అతడు ఐశ్వర్యం, పేదరికం లాంటివి చూడకుండా అందరికి అండగా ఉంటాడు. కాబట్టి నాకు అండగా ఉంటాడు. దుర్జనుల చేతిలో చిక్కుకున్న సజ్జనులకు సాయపడతాడు. అందువల్ల నాకు సాయం చేస్తాడు. బయటి చూపులు వదిలిపెట్టి తననే చూసేవారిని దయతో చూస్తాడు. కనుక నా కష్టాన్ని చూస్తాడు. దీనుల మొరలు విని తన్ను తానే మరచి పోతాడు కదా. నా మొర తప్పక వింటాడు. అన్ని రూపాలూ ఆయన రూపాలే. మొదలు, నడుమ, తుద అన్నవి ఆయనకు లేవు. భక్తులకు దిక్కులేని వారికి ఆయనే ఆధారం. మరి అటువంటి ప్రభువు ఇంకా నా మొర వినడేం? నా బాధ చూడడేం? నన్ను దయ చూడడేం? తొందరగా రాడేం?
సుళువైన పదాల ఈ ప్రార్థన మరో అమృత గుళిక. ప్రభువు లోకాన్ని సృష్టించేవాడు. లోకులు అందుకోలేని వాడు. లోకానికి అంతరాత్మ అయినవాడు.లోకంలో బాగా తెలుసుకో దగిన వాడు లోకమే తానైన వాడు. లోకాతీతుడు. ఎల్లప్పుడు ఉండేవాడు. పుట్టుక లేనివాడు. బ్రహ్మదేవునికి అధి నాయకుడు. లోకాన్ని నడిపించేవాడు. పరమాత్మ. అట్టి ఆది పురుషుని నేను ఆరాధిస్తాను.
ఈపోతన పద్యం తెలియని తెలుగువాడు ఉండడు.అలాంటి మహాద్భుత ప్రార్థన. చిన్నతనంలో అందరూ కంఠతా పట్టి, మాటిమాటికీ చదువుకునే పద్యం. దేవా! నాలో శక్తి కొంచెం కూడా లేదు. ధైర్యం సడలి పోయింది.ప్రాణాలు కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప ఇతరులెవ్వరు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు, పుణ్యాత్ముడా!
ఓ దయాసాగరా! నీవు సర్వ ప్రాణుల పిలుపులు వింటావట. వారిపై దయ చూపడానికి పోరాని చోట్లకైనా పోతావట. శరణన్న వారికి వెంటనే ‘ఓయ్’ అంటావుట. కాని ఇప్పుడు ఇదంతా సత్యమేనా అని అనుమానంగా ఉంది.
ఓ = ఓ; కమలాప్త = నారాయణ {కమలాప్తుడు - కమల (లక్ష్మీదేవికి) ఆప్తుడైనవాడ, విష్ణువు}; ఓ = ఓ; వరద = నారాయణ {వరదుడు - వరములను ఇచ్చువాడు, విష్ణువు}; ఓ = ఓ; ప్రతిపక్షవిపక్షదూర = నారాయణ {ప్రతిపక్షవిపక్షదూరుడు - ప్రతిపక్ష (శత్రుపక్షము) యందును విపక్ష (వైరము) విదూర (లేనివాడు), విష్ణువు}; కుయ్యో = ఓ; కవియోగివంద్య = నారాయణ {కవియోగివంద్యుడు - కవులచేతను యోగులచేతను వంద్యుడు (కీర్తింపబడువాడు), విష్ణువు}; సుగుణోత్తమ = నారాయణ {సుగుణోత్తముడు - సుగుణములు గల ఉత్తముడు, విష్ణువు}; ఓ = ఓ; శరణాగతామరానోకహ = నారాయణ {శరణాగతామరానోకహ - శరణాగత (శరణువేడినవారికి) అమర (దేవ, కల్ప) అనోకహ (వృక్షమువంటివాడు), విష్ణువు}; ఓ = ఓ; మునీశ్వరమనోహర = నారాయణ {మునీశ్వరమనోహరుడు - మునీశ్వరుల మనసులను హర (దొంగిలించినవాడు), విష్ణువు}; ఓ = ఓ; విమలప్రభావ = నారాయణ {విమలప్రభావుడు - విమల (స్వచ్ఛమైన) ప్రభావుడు (మహిమ గలవాడు), విష్ణువు}; రావే = రమ్ము; కరుణింపవే = దయచూపుము; తలపవే = భావించుము; శరణార్థిని = శరణుకోరెడివాడను; నన్నున్ = నన్ను; కావవే = కాపాడుము.
భావము:
ఎంతందంగా కుయ్యో, మొర్రో అంటున్నాడో చూడండి. ఓ కమలాక్షుడా! ఓ వరాలు ఇచ్చే ప్రభూ! శత్రువులపై కూడ వైరం లేనివాడా! పండితులచే నమస్కారాలు అందుకొనే వాడా! ఉత్తమ సుగుణాలు కలవాడా! శరణు కోరు వారికి కల్పవృక్షం వంటివాడా! మునీంద్రులకు ప్రియమైనవాడా! నిర్మలమైన మహిమ కల వాడా! నా మొర విను. వెంటనే రా. కనికరించు. కరుణించి శరణు వేడుతున్న నన్ను కాపాడు.
ఇలా ప్రార్థించి “రక్షణ లేనివారిని రక్షించే ఆ భగవంతుడు నన్ను కాపాడుగాక!” అని గజరాజు మొర పెట్టుకొన్నాడు. ఆకాశం వైపు నిక్కి నిట్టూర్చాడు. ఆకాశానికి చెవులు అప్పగించి ఆక్రోశించాడు. ఆ సమయంలో...