పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రమోక్షణ కథా ప్రారంభము

  •  
  •  
  •  

8-19-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నీరాట వనాటములకుఁ
బోరాటం బెట్లు కలిగెఁ? బురుషోత్తముచే
నారాట మెట్లు మానెను?
ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్.

టీకా:

నీరాట = మొసలి {నీరాటము -- నీటిలో చరించునది, మొసలి}; వనాటముల = ఏనుగుల {వనాటము -అడవిలో చరించునది, ఏనుగు}; కున్ = కు; పోరాటంబు = కలహము; ఎట్లు = ఏ విధముగ; కలిగెన్ = కలిగినది; పురుషోత్తముని = విష్ణుమూర్తి; చేన్ = చేత; ఆరాటమున్ = సంకటమును; ఎట్లు = ఏ విధముగ; మానెను = తీరినది; ఘోర = భయంకరమైన; అటవి = అడవి; లోని = అందలి; భద్రకుంజరమున్ = గజరాజున {గజభేదములు - 1భద్రము 2మందము 3మృగము}; కున్ = కు.

భావము:

‘‘నీటిలో బతుకుతుంది మొసలి. అడవిలో తిరుగుతుంది ఏనుగు. వాటిలో అది భద్రగజం. అయితే ఆ రెంటికి అసలు పోరాటం ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అలా జరిగిన ఆ పోరాటంలో పురుషోత్తముడైన శ్రీహరి ఆ గజేంద్రుడి ఆరాటాన్ని ఎలా పోగొట్టి కాపాడాడు?
ప్రత్యేకతలు- 1. కంద పద్యాలకు ప్రతిపంక్తిలో రెండో అక్షరం ఒకటే రావాలి. దీనిని ప్రాస అంటారు. ఈ పద్యంలో చూడండి నాలుగు పాదాల్లోనూ ‘రాట’ వచ్చింది.
2.ఈ పద్యంలో యమకాలంకారం ఎంత అందంగా అలంకరించారో చూడండి. రాట 5 సార్లు ప్రయోగించారు.
3. సందేహం అడుగుతున్నాడు కదా, అందుకని, పద్యం చదువుతుంటేనే ఏదో ఊగిసలాటలా ఉందనిపించేలా ఇటూ అటూ ఊగుతునట్లు వ్రాసారు చూసారా?
4. మన గజరాజు, ఏనుగుల రకాలలో, ఉత్తమమైన భద్రగజాలకు రాజట.
వ్యాఖ్య-భాగవతం బహుళార్థ సాధక గ్రంధం. అందులో పంచరత్న ఘట్టాలలో ఒకటైన గజేంద్రమోక్షంలోని ఎత్తుగడ పద్యం ఇది. చక్కటి ఏకేశ్వరోపాసనతో కూడుకున్న ఘట్టమిది. మంచి ప్రశ్న వేస్తే మంచి సమాధానం వస్తుంది. ఇంత మంచి ప్రశ్న పరీక్షిత్తు వేసాడు కనుకనే శుకుని నుండి గజేంద్ర మోక్షణం అనే సుధ జాలువారింది. ఇక్కడ పోతనగారి చమత్కారం ఎంతగానో ప్రకాశించింది. ఇందులో త్రిప్రాసం ఉంది “నీరాట, పోరాట, నారాట, ఘోరాట” అని. భాషకి అలంకారాలు అధ్భుతమైన సౌందర్యాన్ని చేకూరుస్తాయి. రెండు లేక అంత కంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు మరల మరల వస్తూ అర్థ భేదం కలిగి ఉంటే అది యమకాలంకారం. ఛేకాను ప్రాసంలో పదాల మధ్య ఎడం ఉండాలి. యమకంలో ఎడం ఉండటం లేకపోవడం అనే భేదం లేదు. ఇక్కడ పోతనగారు ప్రయోగించిన యమకం అనే అలంకారం అమిత అందాన్ని ఇచ్చింది. యమకానికి చక్కటి ఉదాహరణ ఇదే అని చెప్పవచ్చు. ఏనుగులు భద్రం, మందం, మృగం అని మూడు రకాలు. వాటిలో భద్రగజాన్ని దైవ కార్యాదులలో వాడతారు. అట్టి కోటి భద్రగజాలకు రాజు మన కథానాయకుడు గజేంద్రుడు. అఖిలలోకేశ్వరుడు, దయా సాగరుడైన శ్రీహరి మొసలి నోటికి చిక్కిన ఒక గజరాజుని ప్రాణభయం నుండి కాపాడి రక్షించాడు. ఈ అధ్భుత ఘట్టంలోని “ఎవ్వనిచే జనించు...” మున్నగు పద్యాలన్నీ అమృతగుళికలే కదా.
రహస్యార్థం -నీరు అనగా చిత్స్వరూపి, బుద్ధి. (ప్రమాణం చిత్స్వరూపం, సర్వ వ్యాపకుడు అయిన విష్ణువే ద్రవ (జల) రూపం అయి నిస్సంశయంగా గంగారూపం పొందుతున్నాడు. అట్టి బుద్ధి రూపమే సంకల్ప రూపం పొందుతుంది. సంకల్పం మనస్సు ఒకటే. అది నీరాటము. సంకల్పం నుండి పుట్టేది కామము. వనమునకు వ్యుత్పత్తి “వన్యతే సేవ్యతే ఇతి వనం” అనగా జీవులచే సేవింపబడునది వనం. అలా కామం వనాటం. అంటే ఆత్మ యొక్క కళ అనే ప్రతిబింబం జీవుడు కదా! ఆ నీరాటమునకూ వనాటం అయిన కామమునకు సంసారం అనే ఘోర అడవిలో కలహం ఎలా కలిగింది? అని ప్రశ్న. పురుషోత్తముడు అయిన విష్ణువు పోరు అనే భవదుఃఖాన్ని ఎలా తొలగించాడని ప్రశ్న.

8-20-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునినాథ! యీ కథాస్థితి
వినిపింపుము వినఁగఁ నాకు వేడుక పుట్టెన్;
వినియెదఁ గర్ణేంద్రియముల
బెనుఁబండువు సేయ మనముఁ బ్రీతిం బొందన్.

టీకా:

ముని = మునులలో; నాథ = ప్రభువా; ఈ = ఈ; కథా = కథ యొక్క; స్థితిన్ = వివరమును; వినిపింపుము = చెప్పుము; వినగన్ = వినవలె నని; నా = నా; కున్ = కు; వేడుక = కుతూహలము; పుట్టెన్ = కలిగినది; వినియెదన్ = విందును; కర్ణేంద్రియముల = చెవులకు; పెను = మహా; పండువు = ఉత్సవము; చేయన్ = చేయగా; మనమున్ = మనసునకు; ప్రీతిన్ = సంతోషము; పొందన్ = కలుగగా.

భావము:

ఓ మునీంద్రా! నాకు ఈ గజేంద్రమోక్షణం కథ వినాలని కుతూహలంగా ఉంది. చెప్పు. చెవులకు పెద్దపండుగలా మనస్సుకు ప్రీతి కలిగేలా వింటాను.
రహస్యార్థం -ఈ కథాస్థితి, వృత్తాంతపు వివరాలు చెప్పమని అడుగుతున్నాడు. మామూలు కోరిక కాదు వేడుక పుట్టిందిట. పెనుపండువు అంటే మోక్షం కావాలట.
గమనిక -ఇది అష్టమ స్కంధంలో పరీక్షించే పరీక్షిత్తు అడుగుతున్నాడు. చతుర్థ స్కంధంలో హరీ! భవ దుఃఖ పద్యం గుర్తుకు వస్తోంది కదండి. దాని భావం గుర్తు చేసుకుందాం."“శ్రీహరీ! సంసార దుఃఖం అనే భయంకరమైన కార్చిచ్చుకు చిక్కి మా "మనస్సు అనే ఏనుగు తపించి దప్పిగొన్నది". ఇప్పుడు నీ పవిత్ర గాథలనే అమృత స్రవంతిలో మునిగి తేలి సంసార తాపాన్ని పోగొట్టుకున్నది. పరబ్రహ్మతో ఐక్యాన్ని సంపాదించిన ధీరునివలె ఆ నదిలో నుండి తిరిగి బయటికి రావటం లేదు.”

8-21-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

థల యందుఁ బుణ్య
శ్లోకుఁడు హరి చెప్పఁబడును సూరిజనముచే
నా థలు పుణ్యకథలని
యార్ణింపుదురు పెద్ద తి హర్షమునన్."

టీకా:

ఏ = ఏ; కథల = కథల; అందున్ = లో; పుణ్యశ్లోకుడు = నారాయణుడు {పుణ్యశ్లోకుడు - పుణ్యవంతులచే శ్లోకుడు (కీర్తింపబడువాడు), విష్ణువు}; హరి = నారాయణుడు గురించి; చెప్పబడును = చెప్పబడునో; సూరి = పండితులైన; జనము = వారి; చేన్ = చేత; ఆ = ఆ; కథలు = కథలు; పుణ్యకథలు = పుణ్యవంత మైన కథలు; అని = అని; ఆకర్ణింపుదురు = వింటారు; పెద్దలు = పెద్దవారు; అతి = మిక్కిలి; హర్షమునన్ = సంతోషముతో.

భావము:

పండితులు వర్ణించే విష్ణుని కథలను పుణ్యకథలు అంటారు. వాటిని పెద్దలు కడు సంతోషంతో వింటారు కదా.”
రహస్యార్థం -హరికి వ్యుత్పఅంత్తి “హరిర్హతి పాపాని” పాపాలను హరించు వాడు హరి. అతనే పరబ్రహ్మ. అతని కథలు అంటే బ్రహ్మజ్ఞానం. దానిని ఆకర్ణించుటకు తెలుసుకొనుటకు పెద్దలు, జ్ఞానులు సహజంగానే ఇష్టపడతారు.

8-22-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇవ్విధంబునఁ బ్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు బాదరాయణి నడిగె" నని చెప్పి సభాసదులైన మునుల నవలోకించి సూతుండు పరమహర్ష సమేతుండై చెప్పె;" నట్లు శుకుండు రాజున కిట్లనియె.

టీకా:

ఈ = ఈ; విధంబునన్ = విధముగ; ప్రాయోపవిష్టుండు = ప్రాయోపవేశము చేయువాడు {ప్రాయోపవేశము - మరణాంతమువరకు ఉపవాశ ముండుట (ఆహారాదులను విసర్జించుట)}; ఐన = అయిన; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్రుండు = రాజు; బాదరాయణిన్ = శుకుని; అడిగెన్ = అడిగెను; అని = అని; చెప్పి = చెప్పి; సభాసదులు = సభయం దున్నవారు; ఐన = అయిన; మునులన్ = మునులను; అవలోకించి = చూసి; సూతుండు = సూతుడు; పరమ = మిక్కిలి; హర్ష = సంతోషముతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; చెప్పెన్ = చెప్పెను; అట్లు = ఆ విధముగ; శుకుండు = శుకుడు; రాజున్ = రాజున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ విధంగా తక్షక భయంతో ప్రాయోపవేశం చేపట్టిన పరీక్షిత్తు వ్యాసుని కొడుకైన శుకుణ్ణి అడిగాడు” అని చెప్పి సూతమహర్షి శౌనకాది మహర్షులకు సంతోషంగా ఇలా చెప్పాడు. “శుకుడు పరీక్షిత్తునకు ఇలా చెప్పసాగాడు.
రహస్యార్థం -తక్షకుడు సర్పం. సర్పం కాలానికి సంకేతం. తత్ క్షణ కాలానికి అంటే ఆయా తగిన కాలానికి లేదా సంకేతం అనుకోవచ్చు. తక్షకుడు కాటేయటం అంటే కాలం కాటేయటం కదా మరి. మృత్యువు అనివార్య మహారహస్యం. చేరిన వానికి కాని తెలియనిది. మరి పరీక్షిత్తు ప్రాయోప విష్ఠుడై ఉన్నాడు కనుక తెలిసికొన అర్హుడు కావచ్చు. ఆ పైన పరీక్షించి చూసిన వాడు కనుక అన్నిటికన్నా ఉత్తమతమము అయిన విష్ణు సాయుజ్యం అపేక్షించాడు. చిలుక మధుర ఫలాలను అందించటానికి సంకేతం. శుకుడు కావలసిన దారి వివరిస్తున్నాడు. రండి మనం కూడా విందాం. అర్హత వచ్చి వెళ్ళేటప్పుడు ముందే దారి గురించి తెలిసి ఉంటే ఎంతో సులువుగా ఉంటుంది. పరీక్షిత్తు ముముక్షువు, ప్రాయోపవిష్టుడు అయి ఉన్నాడు అనగా, జనన మరణాది వృత్తులను అభిలషించక, ఉద్యోగి కార్యాలయం కట్టేసే సమయం కోసం ఎదురు చూసే విధంగా ప్రారబ్ధక్షయ సమయం అయిన మరణాసన్నం కోసం ఎదురు చూస్తున్నాడు. అలా పరీక్షిత్తు అపేక్షిస్తున్న సద్యోముక్తి మార్గం అను విహంగమార్గ నిర్దేశకుడు అనుయాయి అయిన శుకుడు చెప్పసాగాడు.