పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : అంబరీషోపాఖ్యానము

  •  
  •  
  •  

9-80-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నాభాగునకు నంబరీషుండు జనియించె; నతని యందు జగ దప్రతిహతంబైన బ్రాహ్మణశాపంబు నిరర్థకం బయ్యె” ననిన విని “యేమి కారణంబున దురంతంబైన బ్రహ్మదండంబు వలన నతండు విడువంబడియె” ననిన నప్పుడమిఱేనికి శుకుం డిట్లనియె.

టీకా:

అంతన్ = ఆతరువాత; నాభాగున్ = నాభాగుని; కున్ = కి; అంబరీషుండు = అంబరీషుడు; జనియించెన్ = పుట్టెను; అతని = అతని; అందున్ = ఎడల; జగత్ = లోకమున; అప్రతిహతంబు = తిరుగులేనిది; ఐన = అయినట్టి; బ్రాహ్మణ = బ్రాహ్మణుని; శాపంబున్ = శాపముకూడ; నిరర్దకంబు = వ్యర్థమైనది; అయ్యెన్ = అయిపేయినది; అనినన్ = అనగా; విని = విని; ఏమి = ఎట్టి; కారణంబునన్ = కారణముచేత; దురంతంబు = దాటరానిది; ఐన = అయినట్టి; బ్రహ్మదండంబున్ = బ్రహ్మశాపము; వలనన్ = నుండి; అతండు = అతడు; విడువంబడియెన్ = తప్పించుకొనబడెను; అనినన్ = అనగా; ఆ = ఆ; పుడమిఱేని = రాజున; కిన్ = కు; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అటుపిమ్మట, నాభాగునికి అంబరీషుడు పుట్టాడు. బ్రాహ్మణ శాపం లోకంలో తిరుగులేనిది అంటారు. అంతటి శాపం కూడ అతని ఎడల వ్యర్థం అయిపోయింది.” అంటున్న శుకునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. “ఎందుచేత అంతటి దాటరాని బ్రహ్మణశాపం నుండి అతడు తప్పించుకొన గలిగాడు.” ఇలా అడిగిన ఆ రాజుతో శుకుడు ఇలా పలికాడు.

9-81-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ప్తద్వీప విశాలభూభరము దోః స్తంభంబునం బూని, సం
ప్రాప్తశ్రీయుతుఁడై, మహావిభవసంచ్ఛాతురిం గల్గి, దు
ర్వ్యాప్తిం జెందక, వైష్ణవార్చనలమేరం గాలముం బుచ్చుచున్,
సుప్తిం బొందక, యొప్పె సద్గుణగరిష్టుం డంబరీషుం డిలన్.

టీకా:

సప్తద్వీప = సప్తద్వీపములకూడిన {సప్తద్వీపములు - 1జంబూ 2ప్లక్ష 3శాల్మలీ 4కుశ 5క్రౌంచ 6శాక 7పుష్కర అనెడి ఏడు ద్వీపములు}; విశాల = విశాలమైన; భూ = భూమండల; భారమున్ = బాధ్యతను; దోః = భుజములు అనెడి; స్తంభంబునన్ = స్తంభములపైన; పూని = ధరించి; సంప్రాప్త = లభించిన; శ్రీయుతుండు = శుభములుగలవాడు; ఐ = అయ్యి; మహావిభవ = రాజభోగములు; సంపత్ = సంపదలు; చాతురిన్ = చాతుర్యము; కల్గి = పొంది; దుర్వ్యాప్తిన్ = చెడునడతను; చెందక = లోనుగాక; వైష్ణవ = హరి; అర్చనలన్ = పూజలందు; మేరన్ = మాత్రమే; కాలమున్ = సమయమంతను; పుచ్చుచున్ = గడుపుతూ; సుప్తిన్ = ఏమరుపాటును; పొందక = చెందకుండగ; ఒప్పెన్ = పేరుపొందెను; సద్గుణ = మంచిగుణములతో; గరిష్ఠుండు = గొప్పవాడు; అంబరీషుండు = అంబరీషుడు; ఇలన్ = ఈలోకమునందు.

భావము:

“మహాత్ముడు అంబరీషుడు సప్తద్వీప సమన్వితమైన విశాల భూమండల బాధ్యతను ధరించి, సకల శుభాలు అందుకుంటూ, చాతుర్యంతో సకల రాజభోగాలు, సంపదలు అనుభవిస్తూ, చెడు నడత లేకుండా, నిత్యం హరి పూజలతో గడుపుతూ, ఏమరుపాటు చెందకుండ రాజ్యపాలన చేస్తున్నాడు. కనుక అంబరీషుడు తన సద్గుణాలతో లోకప్రసిద్ధుడు అయ్యాడు.

9-82-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద-
లుకులు హరిగుణఠనమంద;
రములు విష్ణుమందిర మార్జనములంద-
శ్రవములు హరికథాశ్రవణమంద;
చూపులు గోవింద రూపవీక్షణమంద-
శిరము కేశవ నమస్కృతుల యంద;
దము లీశ్వరగేహరిసర్పణములంద-
కామంబు చక్రికైంర్యమంద;

9-82.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సంగ మచ్యుతజన తనుసంగమంద;
ఘ్రాణ మసురారి భక్తాంఘ్రి మలమంద;
సనఁ దులసీదళములంద; తులు పుణ్య
సంగతుల యంద యా రాజచంద్రమునకు.

టీకా:

చిత్తంబున్ = మనసు; మధురిపు = నారాయణుని {మధురిపుడు - మధుయనెడి రాక్షసుని శత్రువు, విష్ణువు}; శ్రీ = శుభకరమైన; పాదములన్ = పాదాల; అందన్ = మీదమాత్రమే; పలుకులు = మాటలు; హరి = నారాయణుని {హరి - భక్తుల హృదయములను ఆకర్షించువాడు, విష్ణువు}; గుణ = గుణములను; పఠనము = సంకీర్తనములు; అంద = మీదమాత్రమే; కరములున్ = చేతులు; విష్ణు = నారాయణుని {విష్ణువు - విశ్వమున వ్యాపించువాడు, హరి}; మందిర = గుడి; మార్జనములు = శుభ్రపరచుట; అంద = మీదమాత్రమే; శ్రవములు = చెవులు; హరి = నారాయణుని; కథా = వృత్తాంతములను; శ్రవణము = వినుట; అంద = మీదమాత్రమే; చూపులు = చూపులు; గోవింద = నారాయణుని {గోవిందుడు - గోవుల (ఆవుల, నీళ్ళు, జీవుల)కు ఒడయుడు, విష్ణువు}; రూప = స్వరూపములను; వీక్షణము = చూచుట; అంద = మీదమాత్రమే; శిరము = తల; కేశవ = నారాయణుని {కేశవుడు - కేశియనెడి రాక్షసిని చంపినవాడు, విష్ణువు}; నమస్కృతులు = తలవంచినమస్కరించుట; అంద = మీదమాత్రమే; పదములు = కాళ్లు; ఈశ్వర = నారాయణుని; గేహన్ = గుడిలో; పరిస్పరణములు = చుట్టిరావడము; అంద = మీదమాత్రమే; కామంబున్ = కోరికలు; చక్రి = నారాయణుని {చక్రి - చక్రము ఆయుధముగాగలవాడు, విష్ణువు}; కైంకర్యము = సేవించుటలు; అంద = మీదమాత్రమే.
సంగము = తగులము; అచ్యుత = నారాయణుని {అచ్యుతుడు - భ్రంశములేనివాడు, విష్ణువు}; జనత = అనుయాయుల; అనుసంగము = అనుసరించుట; అంద = మీదమాత్రమే; ఘ్రాణము = ముక్కు; అసురారి = నారాయణుని {అసురారి - అసురుల (రాక్షసుల) అరి (శత్రువు), విష్ణువు}; భక్త = భక్తుల; అంఘ్రి = పాదముల; అంద = మీదమాత్రమే; రసనన్ = నాలుక; తులసీదళములు = తులసీదళములు; అంద = మీదమాత్రమే; రతులు = అనురాగములు; పుణ్య = పుణ్యుని, నారాయణుని; సంగతుల = విషయములు; అంద = మీదమాత్రమే; ఆ = ఆ; రాజ = రాజులనెడి తారకలలో; చంద్రమున్ = చంద్రునివంటివాని; కున్ = కి.

భావము:

అబరీషునికి సదా మనసు మధురిపు శుభకరమైన పాదాల మీద మాత్రమే; మాటలు హరి గుణములను సంకీర్తనములు మీద మాత్రమే; చేతులు వైష్ణవాలయాలను శుభ్రపరచుట మీద మాత్రమే; చెవులు విష్ణుకథలు వినుట మీద మాత్రమే; చూపులు గోవిందుని రూపాలను దర్శించుట మీద మాత్రమే; తల కేశవునికి తలవంచి నమస్కరించుట మీద మాత్రమే; కాళ్లు నారాయణుని గుడిలో ప్రదక్షిణలు మీద మాత్రమే; కోరికలు చక్రిసేవలు మీద మాత్రమే; హరిభక్తులతో మాత్రమే సాంగత్యం; వాసన చూసేది విష్ణుభక్తుల పాదపద్మాలను మాత్రమే; రుచి తులసీదళాలమీద మాత్రమే; పుణ్యవిషయాలపై మాత్రమే ఆసక్తి ఆ మహారాజుకు.

9-83-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నమ్మహీవిభుండు.

టీకా:

మఱియున్ = ఇంకను; ఆ = ఆ; మహీవిభుండు = రాజు {మహీవిభుడు - మహి (భూమి)కి విభుడు(ప్రభువు), రాజు}.

భావము:

అంతేకాక ఆ మహారాజు.....

9-84-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న వైభవంబునఁ ల్మషదూరుఁడై-
జ్ఞేశు, నీశు, నబ్జాక్షుఁ గూర్చి,
మొనసి వసిష్ఠాది మునివల్లభులతోడఁ-
గిలి, సరస్వతీ టమునందు
మేధతో బహువాజిమేథంబు లొనరించె-
ణుతింపరాని దక్షిలు బెట్టి;
మలోష్టహేముఁడై, ర్వకర్మంబులు-
రిపరంబులు గాఁగ వని యేలె;

9-84.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విష్ణుభక్తులందు, విష్ణువునందుఁ, గ
లంక యెడల, మనసు లంకె వెట్టి,
విహితరాజ్యవృత్తి విడువనివాఁడునై,
తఁడు రాచతపసి నఁగ నొప్పె.

టీకా:

ఘన = గొప్ప; వైభవంబునన్ = వైభవముతో; కల్మష = పాపములకు; దూరుడు = దూరముగనున్నవాడు; ఐ = అయ్యి; యజ్ఞేశున్ = నారాయణుని {యజ్ఞేశుడు - యజ్ఞములకు అధిపతి, విష్ణువు}; ఈశున్ = నారాయణుని; అబ్జాక్షున్ = నారాయణుని {అబ్జాక్షుడు - పద్మములవంటి కన్నులు గలవాడు, విష్ణువు}; కూర్చి = గురించి; మొనసి = పూని; వసిష్ఠ = విసిష్ఠుడు; ఆది = మున్నగు; ముని = మునులలో; వల్లభులు = శ్రేష్ఠుల; తోడన్ = తోటి; తగిలి = చేరి; సరస్వతీ = సరస్వతీనదియొక్క; తటమున్ = ఒడ్డు; అందున్ = పైన; మేధ = చుఱుకైనబుద్ధి {మేధ - చురుకుదనముగల బుద్ధి (జ్ఞాపకశక్తి కలదికానిది)}; తోన్ = తోటి; బహు = అనేకమైన; వాజిమేథంబులు = అశ్వమేథయాగములు; ఒనరించె = చేసెను; గణుతింప = లెక్కపెట్టుటకు; రాని = సాధ్యముకానన్ని; దక్షిణలు = దక్షిణలు; పెట్టి = ఇచ్చి; సమలోష్టహేముఁడు = సమదృష్టికలవాడు {సమలోష్టహేముడు -సమ (సమదృష్టి) లోష్ట (మట్టిపెళ్ళలు) హేమ (బంగారము)లందు గలవాడు, సమదృష్టిగలవాడు}; ఐ = అయ్యి; సర్వ = సమస్తమైన; కర్మంబులున్ = కర్మలను; హరి = నారాయణుని; పరంబులు = సమర్పించినది; కాగన్ = అయినట్లు; అవనిన్ = భూమండలమును; ఏలెన్ = పరిపాలించెను.
విష్ణు = హరి; భక్తులు = భక్తులు; అందున్ = ఎడల; విష్ణువున్ = హరి; అందున్ = ఎడల; కలంక = గురి; ఎడల = అతిశయించగ; మనసు = మనసును; లంకె = లగ్నము; పెట్టి = చేసి; విహిత = నియమించబడిన; రాజ్య = రాజ్యపాలన; వృత్తిన్ = ధర్మమును; విడువని = వదలివేయని; వాడున్ = వాడు; ఐ = అయ్యి; అతడు = అతడు; రాచతపసి = రాజర్షి; అనగన్ = అనుటకు; ఒప్పెన్ = తగియుండెను.

భావము:

ఆ అంబరీషుడు గొప్ప వైభవంతో కల్మషాలకు దూరంగా ఉండేవాడు. యజ్ఞేశుని, నారాయణుని, అబ్జాక్షుని గురించి వసిష్ఠాది మహామునులతో చేరి సరస్వతీనది ఒడ్డున లెక్కపెట్టలేనన్ని దక్షిణలు ఇచ్చి అనేక అశ్వమేథయాగాలు చేసాడు. సమదృష్టికలవాడు సర్వ కర్మలను నారాయణ పరంగా ఆచరిస్తూ రాజ్య పరిపాలన సాగించాడు. విష్ణు భక్తులు ఎడల, హరి ఎడల చక్కటి గురి కలిగి ఉండి రాజ్యపాలన ధర్మాన్ని; విడువక చేసేవాడు. కనుక, ఆయన రాజర్షి అనుటకు తగినవాడు.

9-85-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెండియు నమ్మహాభాగవతుండు

టీకా:

వెండియు = ఇంకను; ఆ = ఆ; మహా = గొప్ప; భాగవతుండు = భాగవతుడు.

భావము:

ఇంకా ఆ మహా భాగవతుడు......

9-86-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి! యని సంభావించును;
రి! యని దర్శించు; నంటు; నాఘ్రాణించున్;
రి! యని రుచిగొనఁ దలఁచును;
రిహరి; ఘను నంబరీషు లవియె పొగడన్?

టీకా:

హరి = నారాయణుడు; అని = అనుచు; సంభావించును = పలకరించును; హరి = మాధవ; అని = అనుచు; దర్శించునున్ = చూచును; అంటున్ = తాకును; ఆఘ్రాణించును = వాసమచూచును; హరి = గోవింద; అని = అనుచు; రుచిగొనదలచును = రుచిచూచును; హరిహరి = ఆహా; ఘనున్ = గొప్పవాడు; అంబరీషున్ = అంబరీషును; అలవియె = సాధ్యమా, కాదు; పొగడన్ = కొనియాడుట.

భావము:

హరి అనుచు పలకరిస్తాడు. మాధవ అనుచు చూస్తాడు. తాకుతాడు, ఆఘ్రాణిస్తాడు. గోవింద అనుచు రుచి చూస్తాడు. ఆహా ఆ మహాత్ముడు అంబరీషుని కొనియాడుట ఎంతటివారికైనా సాధ్యం కాదు.......

9-87-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పుణ్యచిత్తుండు, నీశ్వరాయత్తుండునై యల్లనల్లన రాజ్యంబు చేయుచున్న సమయంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; పుణ్యచిత్తుండు = పుణ్యాత్ముడు; ఈశ్వర = నారాయణుని; ఆయత్తుండున్ = లగ్నమైనచిత్తంగలవాడు; ఐ = అయ్యి; అల్లనల్లన = అనాయాసముగ; రాజ్యంబున్ = రాజ్యపాలన; చేయుచున్న = చేస్తున్న; సమయంబున = సమయమునందు.

భావము:

ఈ మాదిరిగా పుణ్యాత్ముడు; నారాయణుని యందు లగ్నమైన చిత్తం గలవాడు; అంబరీషుడు అనాయాసముగ రాజ్యపాలన చేస్తున్న సమయంలో.

9-88-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తని కీహ మానె రులందుఁ గరులందు
నములందుఁ గేళినములందుఁ
బుత్రులందు బంధుమిత్రుల యందును
బురమునందు నంతిపురమునందు.

టీకా:

అతని = అతని; కిన్ = కి; ఈహ = ఆసక్తి; మానెన్ = ఉడిగిపోయినది; హరులు = గుఱ్ఱముల; అందున్ = ఎడల; కరులు = ఏనుగుల; అందున్ = ఎడల; ధనములు = సంపదల; అందున్ = ఎడల; కేళీవనములు = ఉద్యానవనముల; అందున్ = ఎడల; పుత్రులు = కొడుకుల; అందున్ = ఎడల; బంధు = బంధువులు; మిత్రుల = స్నేహితులు; అందునున్ = ఎడల; పురము = రాజధాని; అందున్ = ఎడల; అంతిపురము = స్త్రీసౌఖ్యములు; అందు = ఎడల;

భావము:

అతనికి భార్యా బిడ్డలపైన; ధనధాన్యాలపైన; రాజ్యం పైన; గుఱ్ఱాలు, ఏనుగులు, కేళీవనములు, బంధుమిత్రులు, పుర అంతిపురాలు పైన ఆసక్తి ఉడిగిపోయినది.

9-89-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంతఁ గొంతకాలంబున కమ్మేదినీకాంతుండు సంసారంబువలని తగులంబు విడిచి నిర్మలుండై యేకాంతంబున భక్తిపరవశుండై యుండ నా రాచతపసికి భక్తలోకవత్సలుండగు పురుషోత్తముండు ప్రతిభటశిక్షణంబును, నిజజనరక్షణంబును, నిఖిలజగదవక్రంబును నగు చక్రంబు నిచ్చి చనియె; అంత.

టీకా:

అంతన్ = అప్పుడు; కొంతకాలంబున్ = కొన్నాళ్ళ; కున్ = కు; ఆ = ఆ; మేదినీకాంతుండు = రాజు {మేదినీకాంతుడు - మేదిని (భూమి)కి కాంతుడు (భర్త), రాజు}; సంసారంబున్ = సంసారము; వలని = అందు; తగులంబు = మోహమును; విడిచి = వదలిపెట్టి; నిర్మలుండు = పరిశుద్ధుడు; ఐ = అయ్యి; ఏకాంతంబునన్ = అనన్యముగ; భక్తి = భక్తివలన; పరవశుండు = మేనుమరచినవాడు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; ఆ = ఆ; రాచతపస్ = రాజర్షి; కిన్ = కి; భక్త = భక్తులు; లోక = అందరకు; వత్సలుండు = వాత్సల్యముగలవాడు; అగు = ఐన; పురుషోత్తముండు = నారాయణుడు; ప్రతి = శత్రు; భట = వీరులను; శిక్షణంబునున్ = శిక్షించెడిది; నిజ = తన; జన = వారిని; రక్షణంబును = కాపాడెడిది; నిఖిల = సమస్తమైన; జగత్ = లోకములందు; అవక్రంబునున్ = అడ్డులేనిది; అగు = ఐన; చక్రంబున్ = (సుదర్శన) చక్రమును; ఇచ్చి = ఇచ్చి; చనియె = వెళ్ళెను; అంతన్ = అంతట.

భావము:

అప్పుడు, కొన్నాళ్ళకు ఆ మహారాజు సంసారంపై మోహము విడిచిపెట్టి నిర్మలుడు ఏకాంతభక్తి పరవశుడు అయ్యి ఉండగా, ఆ రాజర్షికి; భక్తవత్సలుడైన నారాయణుడు శత్రు వీరులను శిక్షించెడిది, తనవారిని కాపాడెడిది; నిఖిల లోకములందు అడ్డులేనిది ఐన సుదర్శన చక్రమును అనుగ్రహించాడు. అంతట.....

9-90-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తోడినీడ కైవడి
నురూప గుణాఢ్య యైన యాత్మమహిషితో
విభుఁడు ద్వాదశీవ్రత
మొరన్ హరిఁగూర్చి చేసె నొక యేఁ డధిపా!

టీకా:

తన = తన; తోడి = తోపాటు; నీడ = నీడ; కైవడి = వలె; అనురూప = అనుకూలవిధమైన; గుణ = సుగుణములతో; ఆఢ్య = సంపన్నురాలు; ఐన = అయినట్టి; ఆత్మ = పట్టపు; మహిషి = రాణి; తోన్ = తోటి; జనవిభుడు = రాజు {జనవిభుడు - జనులకు ప్రభువు, రాజు}; ద్వాదశీవ్రతమున్ = ద్వాదశీవ్రతమును {ద్వాదశీవ్రతము -ప్రతి ఏకాదశినాడు ఉపవాసముండి కార్తీక శుక్ల ద్వాదశిగడియలలో పారణము ఉద్వాసన చేసెడి వ్రతము}; ఒనరన్ = చక్కగా; హరిన్ = నారాయణుని; గూర్చి = ఉద్దేశించి; చేసెన్ = ఆచరించెను; ఒక = ఒకానొక; ఏడు = సంవత్సరము; అధిపా = రాజా.

భావము:

రాజా! తనకు తోడునీడలా అనుకూలమైన వర్తనతో ఉండే సుగుణ సంపన్నురాలు ఐన పట్టపురాణి తాను కలిసి ఆ అంబరీష మహారాజు నారాయణుని గురించి ద్వాదశీవ్రతం ఆచరిస్తున్నాడు. అంతట ఒక ఏడు.....

9-91-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వ్రతంబు చేసి, యా వ్రతాంతంబునం గార్తికమాసంబున మూఁడు రాత్రు లుపవసించి, కాళిందీజలంబుల స్నాతుండయి, మధువనంబున మహాభిషేక విధానంబున విహిత పరికర సుసంపన్నుం డయి, హరి నభిషేకంబు జేసి, మనోహరంబు లయిన గంధాక్షతంబులు సమర్పించి యభినవామోదంబులైన పుష్పంబులం బూజించి తదనంతరంబ.

టీకా:

ఇట్లు = ఇలా; వ్రతంబున్ = వ్రతమును; చేసి = ఆచరించి; ఆ = ఆ; వ్రత = వ్రతముయొక్క; అంతం = పూర్తిఅయినప్పుడు; కార్తిక = కార్తీక; మాసంబునన్ = నెలలో; మూఁడు = మూడు (3); రాత్రులు = రోజులురాత్రులందు; ఉపవసించి = నిరాహారముగనుండి; కాళిందీ = యమునానదిలోని; జలంబులన్ = నీటిలో; స్నాతుండు = స్నానముచేసినవాడు; అయి = అయ్యి; మధు = మధు యనెడి; వనంబునన్ = తోటలో; మహాభిషేక = మహాభిషేకపు; విధానంబునన్ = పద్దతితో; విహిత = అవసరమైన; పరికర = సాధనములు; సుసంపన్నుండు = పుష్కలముగాగలవాడు; అయి = అయ్యి; హరిన్ = హరిప్రతిమకు; అభిషేకంబున్ = అభిషేకము; చేసి = ఆచరించి; మనోహరంబులు = చక్కటివి; అయిన = ఐన; గంధ = గంధములు; అక్షతంబులన్ = అక్షింతలు; సమర్పించి = నివేదించి; అభినవ = సరికొత్త; ఆమోదంబులు = సువాసనులుగలవి; ఐన = అయినట్టి; పుష్పంబులన్ = పూలతో; పూజించి = పూజచేసి; తదనంతరంబ = ఆతరువాత.

భావము:

ఇలా కార్తిక మాసంలో వ్రతము ఆచరించి ఆ వ్రతాంతమున మూడు రాత్రులు ఉపవాసం ఉన్నాడు. పిమ్మట యమునానది నీటిలో స్నానము చేసాడు. మధువనంలో మహాభిషేకానికి కావలసిన పరికరాలు అన్నీ పుష్కలంగా సమకూర్చుకున్నాడు. హరిప్రతిమకు అభిషేకం చేసి మనోహరములైన గంథాక్షతలను సమర్పించాడు. సువాసనా భరితాలైన నవనవలాడే పూలతో పూజించి, తరువాత....

9-92-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పా లేఱై ప్రవహింప నంగరుచులం బ్రాయంబులున్ రూపము
ల్మేలై ధూర్తులుగాక వెండిగొరిజల్హేమోరు శృంగంబులుం
గ్రాలం గ్రేపుల యఱ్ఱు నాఁకుచును రంచ్చేలలై యున్న మం
దాలన్ న్యర్బుదషట్క మిచ్చె విభుఁ డుద్యద్వైదికశ్రేణికిన్

టీకా:

పాలు = క్షీరములు; ఏఱై = కాలువలుగట్టి; ప్రవహింపన్ = పారెడివు; అంగ = శరీరములు; రుచులున్ = కాంతులుగలవి; ప్రాయంబులున్ = మంచివయసులోనున్నవి; రూపములు = స్వరూపములు; మేలు = మంచిగానున్నవి; ఐ = అయ్యి; ధూర్తులు = పొగరుమోతువి; కాక = కానివి; వెండి = వెండితొడుగులుగల; గొరిజలున్ = కాలిగిట్టలు; హేమ = బంగారుకుప్పెలుగల; ఉరు = పెద్ద; శృంగంబులున్ = కొమ్ములుతో; క్రాలన్ = విలసిల్లుతుండగా; క్రేపులన్ = దూడల; అఱ్ఱు = మెడవంపును; నాకుచునున్ = నాకుతూ; రంగత్ = మెరుస్తున్న; చేలలు = వస్త్రములుగలవి; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; మందాలన్ = పాడి పశువులను; న్యర్బుదషట్కము = ఆరువందలకోట్లు; ఇచ్చెన్ = దానముచేసెను; విభుడు = రాజు; ఉద్యత్ = మిక్కిలి; వైదిక = వేదజ్ఞానముగలవిప్రుల; శ్రేణి = సమూహము; కిన్ = కి.

భావము:

రాజు అంబరీషుడు వేదపండితులకు; పాలు సమృద్ధిగా ఇచ్చేవి, చక్కటి శరీర కాంతులు గలవి, మంచి ప్రాయం స్వరూపం కలవి, పొగరుమోతువి కానివి, వెండి తొడుగులు గల కాలిగిట్టలు, బంగారు కుప్పెలు గల పెద్ద కొమ్ములుతో విలసిల్లేవి, దూడల అఱ్ఱులు నాకుతూ ఉన్నవి, తళతళలాడే వస్త్రాలు అలంకరించినవి అయిన పాడిపశువులను ఆరువందలకోట్లు దానం చేసాడు.

9-93-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పెక్కండ్రు విప్రవరులకు
గ్రక్కున నతిభక్తితోడఁ డుపులు నిండం
జొక్కపు టన్నంబిడి విభుఁ
డొక్కెడఁ బారణము చేయ నుద్యోగింపన్.

టీకా:

పెక్కండ్రు = అనేకమంది; విప్ర = బ్రహ్మణ; వరులు = శ్రేష్ఠుల; కున్ = కు; గ్రక్కునన్ = శ్రీఘ్రముగా; అతి = మిక్కిలి; భక్తి = శ్రద్ధ; తోడన్ = తోటి; కడుపులు = కడుపులు; నిండన్ = నిండేటట్లుగ; చొక్కపు = చక్కటి; అన్నంబున్ = భోజనము; ఇడి = పెట్టి; విభుడు = రాజు; ఒక్క = ఒక; ఎడన్ = సమయమున; పారణమున్ = ఉపవాసానంతరభాజనము; చేయన్ = చేయుటకు; ఉద్యోగింపన్ = సిద్ధపడుతుండగ.

భావము:

ఆ మహారాజు ఎందరో బ్రహ్మణవరులకు మిక్కిలి భక్తిశ్రద్ధలతో కడుపులు నిండా చక్కటి భోజనము పెట్టి, ఏకాదశ వ్రతాంతంలో ఉపవాసానంతరం భుజించే ద్వాదశీపారణ చేయడానికి సిద్ధపడుతుండగ......

9-94-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అయ్యవసరంబున.

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయమున.

భావము:

అలా అంబరీషుడు ద్వాదశీపారణకు సిద్దం అవుతున్న సమయంలో.

9-95-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భాసుర నిగమ పదోప
న్యాసుఁడు సుతపోవిలాసుఁ నుపమ యోగా
భ్యాసుఁడు రవిభాసుఁడు దు
ర్వాసుఁ డతిథి యయ్యెఁ దన్నివాసంబునకున్.

టీకా:

భాసుర = ప్రసిద్దముగ; నిగమ = వేద; పద = మార్గమునందు; ఉపన్యాసుడు = ఉండువాడు; సు = మంచి; తపస్ = తపశ్శక్తితో; విలాసుడున్ = విలసిల్లెడివాడు; అనుపమ = సాటిలేని; యోగ = యోగమును; అభ్యాసుడు = అభ్యాసమున నిపుణుడు; రవి = సూర్యునివంటి; భాసుడు = ప్రకాశించువాడు; దుర్వాసుడు = దుర్వాసుడు; అతిథి = అతిథిగా; అయ్యెన్ = వచ్చెను; తత్ = అతని; నివాసంబున్ = ఇంటి; కిన్ = కి.

భావము:

ఆ అంబరీషుని గృహానికి; ప్రసిద్ధ వేదవేత్త, మహా తపశ్శాలి, అనుపమ యోగాభ్యాస నిపుణుడు, సూర్య సమ ప్రకాశి అయిన దుర్వాసమహర్షి అతిథిగా వచ్చాడు.

9-96-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లతిథి యై వచ్చిన నమ్మునివల్లభునకుఁ బ్రత్యుత్థానంబు చేసి, కూర్చుండ గద్దియ యిడి పాదంబులు గడిగి పూజించి క్షేమం బరసి తన యింట నన్నంబు గుడువు మని నమస్కరించిన నమ్మహా త్ముండు సంతసించి భోజనంబునకు నంగీకరించి, నిర్మలంబులగు కాళిందీజలంబులం బరమధ్యానంబు చేయుచు, మునింగి లేచి రాక తడవు చేసిన, ముహుర్తార్ధావశిష్ట యగు ద్వాదశి యందుఁ బారణ చేయవలయుటఁ జింతించి బ్రాహ్మణాతిక్రమదోషంబునకు శంకించి విద్వజ్జనంబుల రావించి వారల నుద్దేశించి.

టీకా:

అట్లు = అలా; అతిథి = అతిథి; ఐ = కాగ; వచ్చినన్ = రాగా; ఆ = ఆ; ముని = మునులలో; వల్లభున్ = ప్రభువు; కున్ = కి; ప్రత్యుత్థానంబన్ = లేచి ఎదురువెళ్ళుట; చేసి = చేసి; కూర్చుండన్ = కూర్చొనుటకు; గద్దియ = ఉన్నతాసనము; ఇడి = ఇచ్చి; పాదంబులన్ = కాళ్లు; కడిగి = నీటితోశుభ్రపరచి; పూజించి = పూజచేసి; క్షేమంబున్ = కుశలప్రశ్నలు; అరసి = అడిగి; తన = తనయొక్క; ఇంటన్ = నివాసమునందు; అన్నంబున్ = భోజనము; కుడువుము = తినుము; అని = అని; నమస్కరించినన్ = ప్రార్థించగా; ఆ = ఆ; మహాత్ముండు = గొప్పవాడు; సంతసించి = సంతోషించి; భోజనంబున్ = అన్నముతినుట; కున్ = కు; అంగీకరించి = ఒప్పుకొని; నిర్మలంబు = స్వచ్ఛమైనవి; అగు = ఐన; కాళిందీ = కాళిందిమడుగు; జలంబులన్ = నీటిలో; పరమ = అధికమైన; ధ్యానంబున్ = ధ్యానము; చేయుచున్ = చేస్తూ; మునింగి = స్నానముచేయుచు; లేచిరాక = బయటకురాకుండగ; తడవు = ఆలస్యము; చేసినన్ = చేయగా; ముహుర్త = ముహుర్తకాలములో; అర్థ = సగముమాత్రమే; అవశిష్ఠ = మిగిలినది; అగు = అయినట్టి; ద్వాదశి = ద్వాదశితిథి; అందున్ = సమయములోనే; పారణ = పారణ; చేయవలయుటన్ = చేయవలసియుండుటను; చింతించి = ఆలోచించుకొని; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; అతిక్రమ = అలక్ష్యముచేసిన; దోషంబున్ = తప్పున; కున్ = కు; శంకించి = అనుమానపడి; విద్వత్ = జ్ఞానులైన; జనంబులన్ = వారిని; రావించి = పిలిపించి; వారలన్ = వారి; ఉద్దేశించి = తోటి.

భావము:

అలా అతిథిగ వచ్చిన దూర్వాస మునివరునికి ఎదురువెళ్ళి ఉన్నతాసనంపై ఆసీనుని చేసి, కాళ్లు కడిగి, పూజించాడు. కుశలప్రశ్నలు అడిగి తన ఇంట భోజనం చేయమని ప్రార్థించాడు. ఆ మహాత్ముడు సంతోషించి, అంగీకరించాడు. స్నానం చేసి వస్తాను అని, నిర్మల కాళిందీ జలంలో ధ్యాన స్నానాలు చేస్తూ ఉండగా చాలా ఆలస్యం అవుతోంది. పైగా ద్వాదశి ఘడియలు కొద్దిసేపటిలో గడచిపోతాయి. ద్వాదశితిథి ఉండగానే పారణ చేయాలి. అందుచేత, అటు పారణ చేస్తే బ్రాహ్మణ అతిక్రమణ దోషం, ఇటు పారణ చేయకపోతే ఏకాదశవ్రత భంగం ఎలాగ అని శంకించి, సలహా కోసం విద్వజ్జనులను పిలిపించి

9-97-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ముని నీరు జొచ్చి వెడలడు
నియెడు ద్వాదశియు నింత నియెన్నీలో
పారణయున్ వలయును
వినిపింపుం డర్హధర్మవిధ మెట్టిదియో?'

టీకా:

ముని = ఋషి; నీరు = నీటిలోనికి; చొచ్చి = స్నానమునకువెళ్ళి; వెడలడు = బయటకురాడు; చనియెడున్ = వెళ్ళిపోవుచున్నది; ద్వాదశియున్ = ద్వాదశితిథి; ఇంతన్ = ఇంతసమయము; చనియెన్ = అయిపోయినది; ఈలోనన్ = ఈలోపల; పారణయున్ = ఆహారముగ్రహించుట; వలయును = చేయవలెను; వినిపింపుండు = చెప్పండి; అర్హ = తగిన; ధర్మ = ధర్మమైన; విధము = చేయవలసినది; ఎట్టిదియో = ఎలానో.

భావము:

“దూర్వాస మహర్షి స్నానమునకు వెళ్ళి ఇంకా రావడం లేదు, కొద్ది సమయంలోనే ద్వాదశితిథి వెళ్ళిపోతోంది ఈ లోపల ఆహారము గ్రహించాలి కదా. ఇప్పుడు నేను ఏం చేయాలో తగిన ధర్మం నిర్ణయించి చెప్పండి.”

9-98-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికిన నా రాజునకు బ్రాహ్మణజను లిట్లనిరి.

టీకా:

అని = అని; పలికినన్ = అడుగగా; ఆ = ఆ; రాజున్ = రాజున; కున్ = కు; బ్రాహ్మణ = విప్రుల; జనులు = సమూహము; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

అని అంబరీషుడు అడిగాడు. ఆ బ్రాహ్మణులు ఇలా పలికారు.

9-99-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"తిథి పోయిరామి ధిప! యీ ద్వాదశి
పారణంబు మానఁ బాడి గాదు
గుడువకుంట గాదు కుడుచుటయును గాదు
లిలభక్షణంబు మ్మతంబు."

టీకా:

అతిథి = భోజనార్థమువచ్చినవాడు; పోయి = వెళ్ళి; రామిన్ = రాకపోవుటచేత; అధిప = రాజా; ఈ = ఈ; ద్వాదశి = ద్వాదశిగడియలలోనే; పారణంబు = తినుట; మానన్ = మానివేయుట; పాడి = ధర్మము; కాదు = కాదు; కుడువకుంటన్ = తినకుండుట; కాదు = కాదు; కుడుచుటయును = తినుట; కాదు = కాదు; సలిల = మంచినీరు; భక్షణంబు = తీసుకొనుట; సమ్మతంబు = అంగీకారయోగ్యమైనది.

భావము:

“వెళ్ళిన అతిథి రాకపోతే ద్వాదశి పారణ మానడం ధర్మం గాదు. నీళ్ళు తాగితే భోజనం చేసినట్టు కాదు. చేయనట్టు కాదు. అందుచేత నీళ్ళు తాగడం ధర్మసమ్మతమే.”