పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శంతనుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-662-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవాపి రాజ్యంబు దీర్పనొల్లక వనం-
బునకేఁగెఁ దమ్ముండు పూర్వజన్మ
మందు మహాభిషుఁ నియెడు వాఁడు శం-
నుఁ డయ్యె వాఁడె యీ ధాత్రినెల్ల
నేలుచుఁ గరముల నే వృద్ధు ముట్టిన-
వాఁడెల్ల నిండు జవ్వనము నొందు;
తఁడు శాంతిప్రాప్తుఁడై యున్నదానఁ బం-
డ్రెండేండ్లు వజ్రి వర్షింపకున్న

9-662.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వృష్టి లేని చొప్పు విప్రుల నడిగిన
న్న యుండఁ దమ్ముఁ గ్నిహోత్ర
దార సంగ్రహంబు దాల్చినఁ బరివేత్త
యండ్రు గాన నీవ తఁడ వైతి.

టీకా:

దేవాపి = దేవాపి; రాజ్యంబున్ = రాజ్యమును; తీర్పన్ = ఏలుటకు; ఒల్లక = అంగీకరింపక; వనంబున్ = అడవి; కిన్ = కి; ఏగెన్ = వెళ్ళెను; తమ్ముండు = తమ్ముడు; పూర్వజన్మము = పూర్వజన్మ; అందున్ = లో; మహాభిషుడు = మహాభిషుడు; అనియెడు = అనెడి; వాడు = వాడు; శంతనుడున్ = శంతనుడు; అయ్యెన్ = అయ్యెను; వాడె = అతనె; ఈ = ఈ; ధాత్రిన్ = భూమండలమును; ఎల్లన్ = అంతటిని; ఏలుచున్ = పరిపాలించుతు; కరములన్ = చేతులతో; ఏ = ఏ; వృద్ధున్ = ముసలివానిని; ముట్టినన్ = తాకినను; వాడు = అతను; ఎల్లన్ = అందరును; నిండు = పూర్తి; జవ్వనమున్ = యౌవ్వనమును; ఒందున్ = పొందును; అతడు = అతను; శాంతిప్రాప్తుడు = స్థిమితపడినవాడు; ఐ = అయ్యి; ఉన్నన్ = ఉండగా; దానన్ = అప్పుడు; పండ్రెండు = పన్నెండు (12); ఏండ్లు = సంవత్సరములు; వజ్రి = ఇంద్రుడు {వజ్రి - వజ్రాయుధముగలవాడు, ఇంద్రుడు}; వర్షింపక = వర్షముకురియకుండ; ఉన్నన్ = పోగా.
వృష్టి = వర్షము; లేని = లేకపోవుటకు; చొప్పున్ = కారణమును; విప్రులన్ = బ్రాహ్మణులను; అడిగినన్ = అడుగగా; అన్న = పెద్దసోదరుడు; ఉండన్ = వెనక ఉండిపోగా; తమ్ముడు = తమ్ముడు; అగ్నిహోత్రన్ = అగ్నిహోత్రమును; దార = భార్యను; సంగ్రహంబున్ = కూర్చుకొని; తాల్చినన్ = స్వీకరించినచో; పరివేత్త = పరివేత్త; అండ్రు = అంటారు; కాన = కనుక; నీవ = నీవే; అతడున్ = అతడు; ఐతి = అయితివి.

భావము:

దేవాపి రాజ్యం ఏలడానికి అంగీకరించక అడవికి వెళ్ళిపోయాడు. తమ్ముడు శంతనుడు రాజ్య పాలన చేపట్టాడు. పూర్వజన్మలో అతని పేరు మహాభిషుడు. ఆ శంతనుడు చేతులతో పండు ముసలివాడిని తాకినా, పూర్తి యౌవ్వనం పొందేవాడు. అతను రాజ్యం చేస్తూ ఉండగా పన్నెండు ఏళ్ళపాటు ఇంద్రుడు వర్షం కురిపించ లేదు. బ్రాహ్మణులను వర్షాలు లేకపోడానికి కారణం ఏమిటని అడిగాడు. అన్న వుండగా తమ్ముడు అగ్నిహోత్రాన్ని స్వీకరించిన, వివాహం చేసుకొనిన తమ్ముణ్ణి పరివేత్త అంటారు. నీవు అటువంటి వాడవు అయ్యావు.

9-663-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అది కారణంబుగా నన్న యుండఁ దమ్ముండుఁ రాజ్యార్హుండుగాఁడు; నీవు పరివేత్తవు; మీ యన్నకు రాజ్యంబిచ్చిన, ననావృష్టిదోషంబు చెడు” నని బ్రాహ్మణులు పల్కిన, శంతనుండు వనంబునకుం జని, దేవాపికిఁ బ్రియంబు జెప్పి, రాజ్యంబు చేకొమ్మని పల్కె; నంతకు మున్న వానిమంత్రి దేవాపిని రాజ్యంబున కనర్హుంజేయందలంచి విప్రులం బిలిచిన నా విప్రులు పాషాండమత వాక్యంబులు దేవాపికి నుపదేశించిన, దేవాపి వేదంబుల నిందించిన పాషాండుండును దేవదూషకుండును నయ్యెం గావున దేవాపికి రాజ్యంబు లేదని బ్రాహ్మ ణులు జెప్పిన శంతనుండు మగిడి వచ్చి రాజ్యంబుఁ జేకొనియె; నంత వర్షంబును గురిసె; నివ్విధంబున.

టీకా:

అది = అది; కారణంబు = కారణము; కాన్ = వలన; అన్న = అన్న; ఉండన్ = ఉండగా; తమ్ముండు = తమ్ముడు; రాజ్య = రాజ్యాధికారమునకు; అర్హుడు = తగినవాడు; కాడు = కాడు; నీవున్ = నీవు; పరివేత్తవున్ = పరివేత్తవు; మీ = మీ యొక్క; అన్న = అన్న; కున్ = కు; రాజ్యంబున్ = రాజ్యమును; ఇచ్చినన్ = ఇచ్చినచో; అనావృష్టి = వర్షములు పడనీయని; దోషము = దోషము; చెడును = తొలగిపోవును; అని = అని; బ్రాహ్మణులు = విప్రులు; పల్కినన్ = చెప్పగా; శంతనుండు = శంతనుడు; వనంబున్ = అడవి; కున్ = కి; చని = వెళ్ళి; దేవాపి = దేవాపి; కిన్ = కి; ప్రియంబున్ = మంచిమాటలు; చెప్పి = చెప్పి; రాజ్యాంబున్ = రాజ్యాధికారమును; చేకొమ్ము = స్వీకరించుము; అని = అని; పల్కెన్ = చెప్పెను; అంత = దాని; కున్ = కి; మున్న = ముందు; వాని = అతని; తండ్రి = తండ్రి; దేవాపిని = దేవాపిని; రాజ్యంబున్ = రాజ్యాధికారమున; కున్ = కు; అనర్హున్ = తగనవానిగా; చేయన్ = చేయవలెనని; తలచి = భావించి; విప్రులన్ = బ్రాహ్మణులను; పిలిచినన్ = పిలువగా; ఆ = ఆ; విప్రులున్ = బ్రాహ్మణులు; పాషాండమత = పాషాండమతపు; వాక్యంబులున్ = సిద్ధాంతములను; దేవాపి = దేవాపి; కిన్ = కి; ఉపదేశించినన్ = చెప్పగా; దేవాపి = దేవాపి; వేదంబులన్ = వేదములను; నిందించినన్ = ఖండించుటచేత; పాషాండుండునున్ = పాషాండుడు; దేవ = దేవుని; దూషకుండునున్ = దూషించినవాడు; అయ్యెన్ = అయ్యెను; కావునన్ = కనుక; దేవాపి = దేవాపి; కిన్ = కి; రాజ్యంబున్ = రాజ్యాధికార అర్హత; లేదు = లేదు; అని = అని; బ్రాహ్మణులు = విప్రులు; చెప్పినన్ = నిర్ణయింపగా; శంతనుండు = శంతనుడు; మగిడి = వెనుకకు; వచ్చి = వచ్చి; రాజ్యంబున్ = రాజ్యమును; చేకొనియెన్ = స్వీకరించెను; అంతన్ = అంతట; వర్షంబున్ = వర్షములు; కురిసెను = కురిసినవి; ఈ = ఈ; విధంబునన్ = విధముగ.

భావము:

అన్న ఉండగా తమ్ముడు రాజ్యార్హుడు కాడు. అందుచేత నీవు పరివేత్తవు. మీ అన్నకు రాజ్యం ఇచ్చేస్తే అనావృష్టి దోషం తొలగిపోతుంది అని విప్రులు చెప్పారు. శంతనుడు అడవికి వెళ్ళి దేవాపిని మంచిమాటలతో ఒప్పించి రాజ్యాధికారం స్వీకరించమని కోరాడు. అంతకు ముందు అతని మంత్రి దేవాపిని రాజ్యాధికారానికి అనర్హునిగా చేయమని బ్రాహ్మణులకు చెప్పాడు. ఆ బ్రాహ్మణులు పాషాండమతం దేవాపికి ఎక్కించారు. దేవాపి వేదాలను ఖండించ సాగాడు. అలా పాషాండుడు, దేవుదూషకుడు అయ్యాడు. కనుక, దేవాపికి రాజ్యాధికారం లేదు అని బ్రాహ్మణులు నిర్ణయించారు. అంతట శంతనుడు తిరిగి వచ్చి రాజ్యం చేపట్టాడు. అంతట వర్షాలు కురిసాయి.

9-664-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవాపి కలాపపురం
బావాసము గాఁగ యోగి యై యున్నాఁ డు
ర్వీర! కలి నష్టంబగు
జై వాతృకకులముమీఁద సంస్థాపించున్.

టీకా:

దేవాపి = దేవాపి; కలాప = కలాప అనెడి; పురంబున్ = నగరమును; ఆవాసంబు = నివాసము; కాగన్ = అయ్యుండగ; యోగి = యోగి; ఐ = అయ్యి; ఉన్నాడు = ఉన్నాడు; ఉర్వీవర = రాజ; కలి = కలికాలమున; నష్టంబు = నాశనము; అగు = అయ్యెడి; జైవాతృకకులమున్ = చంద్రవంశమును {జైవాతృకుడు - దీర్ఘాయువు, చంద్రుడు}; మీదన్ = ఆ తరువాతకాలమున; సంస్థాపించున్ = నెలకొల్పును.

భావము:

రాజా పరీక్షిత్తూ! ఆ దేవాపి యోగి అయి ఇప్పటికీ కలాపగ్రామంలో నివసిస్తూ ఉన్నాడు. కలియుగంలో నాశనం అయ్యే చంద్రవంశాన్ని తరువాతి యుగాలలో నెలకొల్పుతాడు.

9-665-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాహ్లీకుం డనువానికి సోమదత్తుండు పుట్టె; సోమదత్తునకు భూరియు భూరిశ్రవసుఁడును శలుండు ననువారు మువ్వురు పుట్టిరి.

టీకా:

బాహ్లికుండు = బాహ్లికుడు; అను = అనెడి; వాని = అతని; కిన్ = కి; సోమదత్తుండు = సోమదత్తుడు; పుట్టెన్ = జనించెను; సోమదత్తున్ = సోమదత్తున; కున్ = కు; భూరియున్ = భూరి; భూరిశ్రవసుడునున్ = భూరిశ్రవసుడు; శలుండున్ = శలుడు; అను = అనెడి; వారు = వారు; మువ్వురు = ముగ్గురు; పుట్టిరి = జన్మించిరి.

భావము:

బాహ్లికుడికి సోమదత్తుడు; సోమదత్తునకు భూరి, భూరిశ్రవసుడు, శలుడు అని వారు ముగ్గురు కలిగారు.