పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

కథలు - భాగవతాలు : అఘాసుర వధ

అఘాసుర వధ

ఒకనాడు కృష్ణపరమాత్మ పిల్లలందరితో కలిసి వెనక్కి యింటికి వెళ్ళిపోతున్నాడు.అపుడు ఆయనకు ఒక ఊహ వచ్చింది. “రేపటి దినమున మనం అందరం కలిసి వనభోజనములకు వెడదాము. కాబట్టి పిల్లలారా! రేపు పొద్దున్న మీరందరూ బయలు దేరేటప్పుడు చక్కగా చిక్కములు పట్టుకొని, అందులో మీకిష్టమయిన మధుర మధురమయిన పదార్థములు పట్టుకొని రండి. మనందరం కలిసి వెడదాము. అరణ్యంలో మనందరం కలిసి కూర్చుని తెచ్చుకున్న చల్దులు ఆరగిద్దాము” అన్నాడు. కృష్ణుడు పిల్లలకు ఎంత చెపితే అంత. మరునాడు వాళ్ళందరూ వనభోజనములకు బయలుదేరారు. వారు వివిధరకముల ఆటలకు సంబంధించిన పందెములు వేసుకుంటూ, హాస్యమునకు ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ పశువుల వెంట సంతోషంగా అడవిలోకి వెళ్ళారు. అక్కడ కొలనులలో నీళ్ళల్లో పడి చేపల్లా ఈదేవారు. కృష్ణునితో ఆడుకునే వారు. కోతులతో సమానంగా చెట్లు ఎక్కేవారు. అక్కడ వాళ్ళు ఆడని ఆటలు లేవు. పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. ఇలా ఆడుకుంటుంటే అక్కడికి దేవతలను కూడా భయపెట్టగలిగిన రక్కసుడు ఒకడు వచ్చాడు. వాని పేరు అఘాసురుడు. అఘము అనగా పాపము. అతను బకాసురుని సోదరుడు. “నా సోదరుడైన బకాసురుని కృష్ణుడు నిర్జించాడు. గోపాల బాలురందరికి ప్రాణ సమానమయిన వాడు కృష్ణుడు. కాబట్టి ఈ కృష్ణుని చంపి తినేస్తాను” అనుకున్నాడు.

వాడు వచ్చి కొండచిలువ రూపంలో దారికి అడ్డంగా పడుకున్నాడు. కొండచిలువ వెంటాడి ఏ ప్రాణినీ చంపదు. అది పట్టింది అంటే మ్రింగి వేయడమే. అది ఏ చెట్టుకో చుట్టుకున్నప్పుడు లోపల ఉన్న ప్రాణి విరిగిపోతుంది. దానిని అలాగే జీర్ణం చేసేసుకుంటుంది. ఇప్పుడు అఘాసురుడు అనే కొండచిలువ మార్గమునకు అడ్డంగా పడుకుని ఉంది. దాని నోటి పైదవడ ఆకాశమునకు పెట్టింది. క్రింద దవడ భూమిమీదకి పెట్టింది. ఈ పిల్లలు అక్కడికి వచ్చారు. దారికి అడ్డంగా పడివున్న దానిని గుర్తించి దానిని కొండచిలువగా నిర్ధారించుకున్నారు. ఏమి చేయాలా అని వారు వెనక్కి తిరిగిచూశారు. వెనక చిన్నికృష్ణుడు నవ్వుతూ కనపడ్డాడు. వీళ్ళు అన్నారు “బకాసురుని చంపిన కృష్ణుడు మన వెనకాతల ఉన్నాడు. ఎదురు కొండచిలువ వుంటే మనకేమిటి భయం! మనం వెళ్ళిపోదాం” అని వారు నవ్వుకుంటూ, వారి చిక్కములు పట్టుకొని ఆవుల్ని, దూడలని, ఎద్దులని, అన్నింటిని ఆ కొండచిలువ నోట్లోకి తోలేసి వారు కూడా అందులో ప్రవేశించారు. ఆ కొండచిలువ అఘాసురుడు అని కృష్ణుడికి తెలుసు. “దూర్త అఘాసురుడు అడ్డంగా పడుకున్నాడు. గోపబాలురందరూ నేనున్నాని గోసంపదతో సహా అఘాసురుని నోటిలోపలికి వెళ్ళిపోయారు. అది నా కోసమే యింకా దవడలను మూయలేదు. ఇపుడు వారినందరినీ బ్రతికించడానికి నేను వెళ్ళాలి” అని కృష్ణుడు అనుకుని దాని నోటి దగ్గరకు వెళ్లేసరికి, వీరందరూ దాని కంఠం దగ్గరకు వెళ్ళిపోయారు. అది నాలుకను చుట్టి గబుక్కున మ్రింగేసింది. వాళ్ళు కడుపులోకి వెళ్ళిపోయారు. లోపల వున్నా విషజ్వాలలకి వారు మరణించారు.

కృష్ణుడు దాని కంఠం దగ్గరకి వెళ్ళగా కృష్ణుని కూడా మ్రింగబోయింది. పైనున్న దవడను నొక్కింది. నొక్కేసరికి స్వామీ నిటారుగా పెద్ద స్తంభంలా అయిపోయారు. అది నోటిని నొక్కేసరికి స్తంభం లాంటి పరమాత్మ శిరస్సు దాని దవడను పొడుచుకుని పైకి వచ్చింది. ఈయన తన శరీరమును పెంచాడు. డానికి లోపలికి ఊపిరి పీలిస్తే వెళ్ళడం లేదు. గిలగిల కొట్టుకుంది. అటు తిరిగింది. ఇటు తిరిగింది. తిరుగుడు పడిపోయి గిలగిల కొట్టుకుంటోంది. ఆ సమయంలో దాని కడుపులో ఉన్న మరణించిన వారినందరినీ కృష్ణుడు చూశాడు. అసురసంధ్యవేళ అవుతుండగా నక్షత్రములతో కలిసి ఆకాశామునందు ప్రకాశిస్తున్న చంద్రబింబములా కేవలము తన కన్నుల నుండి కారుణ్యామృతదృష్టిని చిన్ని కృష్ణుడు వాళ్ళమీద ప్రసరింప జేశాడు. ఆయన కారుణ్యామృతదృష్టి పడగానే మరణించిన పిల్లలందరూ ఒక్కసారిగా జీవించారు. ఆవులు, దూడలు, ఎద్దులు, అన్నీ జీవించాయి. అందరూ ఆ కొండచిలువ నోట్లోంచి ఇవతలికి వచ్చేశారు. బయరకు రాగానే వారొక అద్భుతమును చూశారు. ఆ పాము కొనప్రాణంతో కొట్టుకుంటోంది. చివరకు దాని ప్రాణం పోయింది. దానిలోంచి ఒక దివ్యమయిన వెలుగు వెలువడి పైకిలేచి చిన్నికృష్ణుడి లోకి వెళ్ళిపోయింది. దీనితో ఇంత పాపపు రక్కసుడు మోక్షమును పొందేశాడు. కృష్ణుడి స్పర్శ చేత అతనికి ఉన్న పాపములన్నీ విరిగిపోయాయి.

ఈ లీలలోని అంతరార్థం మనం తెలుసుకోవాలి. అఘాసురుడు ఒక పాపపు రక్కసుడు. పాపము అనగానేమి? పాపము అంటే దుష్కర్మ. పాపకర్మనుండి దుఃఖము వస్తుంది. పాపకర్మ కొండచిలువలా నోరు తెరుచుకుని మనదారిలోనే పడుకుంటుంది. పాపకర్మ మనమే దానిలోకి నడిచేటట్లుగా చేస్తుంది. అది ఎప్పుడూ తనంత తానుగా వచ్చి మింగదు. పాపకర్మ మిమ్ములను మింగలేదు. “నేను పాపము చేయను” అని మీరు అనుకుంటే పాపము మీచేత చెడ్డపనిని చేయించలేదు. కానీ మనలో మోహ బుద్ధి బయలుదేరుతుంది. ఏదో అప్పటికి ఒక సుఖమును కోరి ఫరవాలేదులే చేసేద్దాం అనుకుని పాపపు పనిని చేస్తాడు. అందుకని కొండచిలువ నోట్లోకి వీళ్ళే వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళకి పాపకర్మ, పుణ్య కర్మ అంటే ఏమిటో తెలియాలంటే సత్కర్మకీ, దుష్కర్మకీ భేదం తెలియాలంటే వేదం తెలియాలి. అందులో ధర్మమునకు సంబంధించిన భాగములను చదవాలి. పెద్దల దగ్గర శ్రవణం చేయాలి. గోపాల బాలురకి అవన్నీ తెలియవు. పాపకర్మకి దేవతలు కూడా భయపడతారు. అటువంటి పాపకర్మ యందు వీళ్ళు లోపలికి వెళ్ళారు. కానీ వెడుతున్నప్పుడు ఒకపని చేశారు. “వెనక కృష్ణుడు ఉన్నాడు” అని కృష్ణ భగవానుని మీద పూర్తీ నమ్మకం కలిగి వుండి దాని నోటిలోకి ప్రవేశించారు. అలా చేయడం పాపమా, పుణ్యమా అనేది వారికి తెలియదు. పాపపు పనిని చేసి ఈశ్వరుడు చేయిస్తున్నాడని మాత్రం అనకూడదు. తెలిసి నీవు పాపమును చేస్తే ఆ పాపఫలితమును నీవే అనుభవించవలసి ఉంటుంది. అందుకే శాస్త్రము మరణము పాపము వలన వస్తుంది అని చెపుతోంది. పాపమే మరణమును ఇస్తుంది. చేసిన పాపము భయంకరమైనది అయితే అకాల మృత్యువు ఇవ్వబడుతుంది. పుణ్య చేసిన వాడికి కూడా మృత్యువు వస్తుంది కానీ అనాయాస మరణం వస్తుంది. మనం పూజ చేసినప్పుడు, దేవాలయమునకు వెళ్ళినప్పుడు, పుణ్య నదీస్నానం చేసినప్పుడు “అనాయాసేన మరణం – వినా దైన్యేన జీవితం” ఈ రెండింటినీ అడగాలి. చేసిన పాపమును అనుభవములోనికి ఈశ్వరుడు వృద్ధాప్యము నందు తెస్తాడు. ప్రతిజీవికీ మరణం తథ్యం. కానీ చనిపోయేటప్పుడు పువ్వులా వెళ్ళిపోవాలి. అందుకే చేసిన పాపపుణ్యములు మృత్యు సమయమునందు తెలుస్తాయి” అని పెద్దలు అంటారు. “అనాయాసేన మరణం – వినా దైన్యేన జీవితం” – ఈ రెండు ఎప్పుడు వస్తాయి? మీ వెనకాల ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి మీరు ప్రవరించగలిగితే చాలు. మీరు చేస్తున్న ప్రతి సత్కర్మ ఈశ్వరుడు చేయిస్తున్నాడు అనుకోవాలి. ఒకవేళ ఎప్పుడయినా తప్పు చేస్తే దేవుడి ముందు అంగీకరించి ఆ తప్పునకు భగవంతుని క్షమాపణ అడగాలి. అప్పుడు తప్పులు చేయడం అనేదే ఉండదు. దీనికి ముందు భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి. ఆయన చూస్తున్నాడన్న భయం మనసులో ఉండిపోతుంది.

అఘాసుర వధ ఘట్టంలో గోపబాలురను ఈశ్వరుడు రక్షించగలిగాడు. ఇది పరమాత్కృష్టమయిన కథ ఇది మనకందరికీ చిరస్మరణీయమై, నిత్య స్మరణీయమై, ప్రతిరోజూ భగవంతుని యందు పూనికను పెంచి, ఈశ్వరుడు మనలను అనుగ్రహించగలిగిన స్థితిని ఆవిష్కరిస్తుంది.