కథలు - భాగవతాలు : అజామిళోపాఖ్యానం
షష్ఠ స్కంధము - అజామిళోపాఖ్యానం:
ఒకానొక సమయంలో కన్యాకుబ్జము అనబడే నగరంలో ఒక శ్రోత్రియుడయిన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన త్రికాల సంధ్యావందనమును ఆచరించి వేదవేదాంగములను తాను పఠించి పదిమందికి వేదమును వివరణ చేస్తూ పదిమందికి పురాణ ప్రవచనం చేస్తూ దొరికిన దానితో అత్యంత సంతోషంతో జీవితమును గడపగలిగిన సమర్థుడు అయినవాడు. యాదృచ్ఛికముగా ఆయనకు ఐశ్వర్యము సమకూరింది. ఆయన మనస్సు మాత్రం సర్వకాలముల యందు భగవంతుని యందు రమించే స్థితిని కలిగి వున్నవాడు. అటువంటి మహాపురుషుడికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు అజామిళుడు. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తదనంతరం ఆయనకు ఒక ఉత్తమమయిన సౌందర్యవతియైన కన్యను తెచ్చి వివాహం చేశారు. ఆయన శీలం ఎటువంటిది? పుట్టినపుడు గతంలో చేసిన సత్కర్మల వలన బ్రాహ్మణ కులమున జన్మించాడు. సత్కర్మ అంటే చేసిన పని. అజామిళుడు యజ్ఞోపవీతం వుంది సంధ్యావందనం చేసి గాయత్రీమంత్రం జపించేవాడు. ఈవిధంగా అతడు జ్ఞానమును పొందినవాడు. శాంత లక్షణమును కలిగి ఉన్నాడు. బ్రాహ్మణునకు మొట్టమొదటి లక్షణము శాంతము.
దాంతుడై ఉన్నాడు. దాంతుడు మనసును గెలవడం. మనస్సు ఇంద్రియముల మీద ఆధారపడి ఉంటుంది. ఆయన మనసును ఇంద్రియములను గెలిచాడు. ఇక్కడే మీరొక విషయమును గుర్తుపెట్టుకోవాలి. ఒకరాజు ఒక రాజ్యమును గెలిచాడనుకోండి. ఆయన మరణించే వరకు ఆ రాజ్యం ఆయ వద్దే ఉంటుందనే నమ్మకమేమీ ఉండదు. ఈయనకన్నా బలవంతుడయిన రాజు వచ్చి ఈయనను చంపి ఆ రాజ్యం ఆయన కొల్ల గొట్టవచ్చు. అలాగే ఇంద్రియములను గెలిచినా వాడు మరొక పదినిమిషములు గడిచిన తరువాత పతనమై క్రిందపడి పోవచ్చు. ఆయన మోక్షమును పొందితే ఆయన ఇంద్రియములను మనసును గెలిచినట్లు లెక్క. అవి ఏ క్షణంలో అయినా కాటు వేయడానికి నిరంతరమూ కాచుకుని ఉంటాయి. మంచి యౌవనమును పొందడానికి ముందు భార్యను చేపట్టక ముందు శాంతుడై, దాంతుడై ధర్మసంశీలుడై ఉన్నాడు.
శీలము అంటే స్వభావము. అజామిళుడు నిరంతరమూ తాను చేయవలసిన కర్తవ్యమును గూర్చి తాను ఆలోచించ గలిగినవాడు. తన ధర్మమును తాను నెరవేర్చిన వాడు. అంతమాత్రం చేత జ్ఞాని అయ్యాడని అనడానికి లేదు. తాను చదువుకున్నది అనుష్ఠాన పర్యంతము తీసుకువచ్చాడు. ఎన్నో మంత్రముల సిద్ధిని పొందాడు. అతని శరీరము మంత్రపూతమయింది. అంతగా దేవతానుగ్రహమును పొందాడు.
అజామిళుడు సత్యభాషణా నియమమును పెట్టుకున్నాడు. ధర్మమును వదలలేదు. నిత్య నైమిత్తిక కర్మలను వదిలి పెట్టలేదు. ఈవిధంగా అజామిళుడు రాశీభూతమయిన బ్రాహ్మణ తేజస్సు.
భగవంతుని గొప్పతనం గురించి ఎంత స్తోత్రం చేస్తారో అజామిళుడి యౌవనం గురించి పోతన గారు అన్ని పద్యములు వ్రాశారు. కొంచెం యుక్తాయుక్త విచక్షణతో దేనిని అసలు పెట్టుకోవాలి. దేనిని వదిలిపెట్టాలి అని తెలుసుకో గలిగినది, పట్టుకోవాలని తెలిసినా పట్టుకోవడానికి ఓపిక ఉన్నది యౌవనము మాత్రమే. ఈ యౌవనమును ప్రధానముగా రెండు భ్రంశము చేస్తాయి. ఒకటి అర్థార్జన. అర్థ సంపాదనకు అనువుగా అధికారులను పొగడుట యందు నిమగ్నమయిన వాడు, బెల్లపు పరమాన్నమయినా అదే రుచి, పంచదార పరమాన్నమయినా అదే రుచి - ఒకే పాయస పాత్రను తీసుకువచ్చి ఎన్ని గ్లాసులలోకి సర్దుకు తిన్నా ఒకే రుచి ఉంటుందని ఎరుగక కామినీ పిశాచము పట్టుకుని తన ధర్మపత్ని జంట వుండగా ఇతర స్త్రీలయందు వెంపర్లాట పెట్టుకున్న దౌర్భాగ్యుడు అలాగే నశించి పోతున్నాడు. ఈ రెండింటి చేత యౌవనము నశించిపోతున్నది. అలా నశించి పోవడం అత్యంత ప్రమాదకరము.
ఇప్పుడు అజామిళుడికి యౌవనం అంకురించింది. మానవుడు అయిదు ఇంద్రియములతో భోగములను అనుభవించవచ్చు. ఈశ్వరుడిని చేరుకోవచ్చు. కన్ను తప్పుగా భ్రమను కల్పిస్తే దీపపు పురుగు నశించి పోతుంది. దీపపు పురుగు దీపమును చూసి తినే వస్తువు అనుకుని దీపం మీదకి వెళుతుంది. రెక్కలు కాలి క్రింద పడిపోయి మరణిస్తుంది. దాని దృష్టికి దీపము ఆకర్షించేదానిలా ప్రవర్తిస్తుంది. మా ఇంటి దీపమే కదా అని ముసలాయన దీపమును ముద్దెట్టుకుంటే మూతి కాలిపోయినట్లు యౌవనంలో ఉన్న పిల్లవాడిని పొగిడి పాడు చేయకూడదు. కన్ను బాగా పనిచేస్తే దీపపు పురుగు నశించి పోయింది.
పాట అంటే చెవికి ప్రీతి. లేడికి ఒక పెద్ద దురలవాటు ఉంటుంది. వేటకాడు రెండు మూడు రోజులు వల పన్నుతాడు. ఒకవేళ జింక అటుగా రాకపోతే తానొక చెట్టు మీద కూర్చుని పాట పాడతాడు. ఎక్కడో గడ్డి తింటున్న లేడి ఆపాట విని దానికోసం పరుగెత్తుకుంటూ వచ్చి వేటగాని వలలో పడిపోతుంది. వెంటనే వేటగాడు దానిని చంపేస్తాడు. అందుకని చెవి వలన లేడి మరణిస్తోంది.
చర్మమునకు కండూతి" అనగా దురద ఉంటుంది. ఈ దురద ఏనుగుకి ఉంటుంది ఈ కండూతి దోషం. అందుకని ఏనుగులను పట్టుకునే వారు గొయ్యి తీసి పైన గడ్డి పరిచి అది ఒళ్ళు గోక్కోవడానికి వీలయిన పరికరములు అక్కడ పెడతాడు. ఏనుగు అక్కడకు వచ్చి ఒళ్ళు గోక్కుందామని ఆ కర్రలకు తగులుతుంది. ఆ ఊగుకి పుచ్చు కర్రలు విరిగిపోయి గోతిలో పడుతుంది. అలా ఏనుగు దొరికిపోతుంది. ఈవిధంగా స్పర్శేంద్రియ లౌల్యం చేత ఏనుగు నశించి పోతున్నది.
నాల్గవది రసనేంద్రియము - నాలుక. దీనివలన పాడయిపోయేది చేప. ఈశ్వరుడు చేపలకు మొప్పలతో ప్రాణ వాయువును తీసుకుని బ్రతకగల శక్తిని ఇచ్చాడు. కానీ దానికి రుచులు అంటే ఎంత ఇష్టమో. ఎరను తిందామని ఉచ్చులో చిక్కుకుని ప్రాణం పోగొట్టుకుంటుంది. ఏది తిందామని వచ్చిందో అది ఇంకొకరికి ఆహారమై తినబడుతోంది. ఈవిధంగా రసనేంద్రియం చేత చేప నశించి పోతోంది.
ఇక వాసన. పద్మమునందు సుగంధము ఉంటుంది. ఆ సుగంధమును అనుభవించడం కోసం ఎక్కడినుంచో వస్తుంది సీతాకోక చిలుక. అది పువ్వులలో మకరందమును పీల్చి మకరందం అయిపోయినా సరే కాసేపు అక్కడే పడుకుంటుంది. దానికి ఆ వాసన మరిగి మత్తెక్కుతుంది. ఒక్కొక్క సారి చీకటి పడి పువ్వు ముకుళించుకు పోతుంది. అది పువ్వులో చిక్కుకు పోతుంది. ఆ సమయమునకు నీళ్ళు త్రాగుదామని ఏనుగులు వస్తాయి. అవి నీళ్ళు త్రాగి వెళ్ళిపోతూ ఈ పద్మములను తొండముతో పీకివేసి నేలమీద పారవేసి తొక్కేసి వెళ్ళిపోతాయి. పద్మమునందు సుగంధమును ఆఘ్రాణిస్తూ వున్న సీతాకోకచిలుక ఏనుగు పాదము క్రింద పడి మరణిస్తుంది. వాసన మరిగి సీతాకోక చిలుక నశించింది.
ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క లౌల్యమునకు నశించి పోతోంది. ఈ ఇంద్రియములలో ఏ ఇంద్రియమయినా మిమ్మల్ని కరచి వేయవచ్చు. ఇంద్రియములను త్రిప్పడానికి జ్ఞానమును ఉపయోగించాలి. అలా ఎవరు ఉపయోగించడో వాడు నశించిపోతాడు. ఇప్పుడు అజామిళుడు నిలబెట్టుకోగలడా? ఇది పరీక్ష. భాగవతమును అందరూ వినవచ్చు. కానీ యౌవనంలో ఉన్నవాడు విన్నట్లయితే జీవితమును సార్థకత చేసుకోగలడు. ఆయనను తండ్రిగారు ఒకరోజు పిలిచి రేపటి పూజకు దళములు, దర్భలు పువ్వులు తీసుకు రావలసినది అని చెప్పారు. తండ్రి మాట ప్రకారం అడవికి వెళ్ళి పువ్వులు, సమిధలు కోసి సంతోషంగా ఇంటివైపుకి వచ్చేస్తున్నాడు. అంతలో అతనికి ఒక పొదలో ఏదో ధ్వని వినపడింది. దానిని ముందు చెవి గ్రహించింది. అది వినవలసిన ధ్వని కాదు అని ఆయన వెళ్ళిపోయి ఉంటే వేరు. ఈ ధ్వని ఎటు వినపడిందో అటు కన్ను తిరిగింది. పొదవైపు చూశాడు. కల్లుకుండలు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని చాలా హీనమయిన జన్మను పొందిన ఒక స్త్రీ, ఆ కల్లును తాను విశేషముగా సేవించి శారీరకమయిన తుచ్ఛమయిన కామమునందు విశేషమయిన ప్రవేశము అనురక్త అయిన ఒక స్త్రీ కళ్ళు సేవించిన పురుషుడు శృంగార క్రీడయందు విశేషమయిన అభినివేశము ఉన్న వాడితో ఆనందముగా పునః పునః రతిక్రీడ జరుపుతున్నది.
అజామిళుడు ఆ సన్నివేశము చూశాడు. శుకుడికి కూడా ఇదే పరీక్ష వచ్చింది. బ్రహ్మమని ఆయన వెళ్ళిపోయాడు. అందుకని భాగవతం చెప్పగలిగాడు. కానీ ఇక్కడ అజామిళుడి మనస్సును ఆ దృశ్యము ఆక్రమించింది. కర్మేంద్రియ సంఘాతము ఆయనను నిలబెట్టేసింది. చూస్తున్న సన్నివేశం మనస్సులో ముద్రపడడం ప్రారంభం అయిపొయింది. అలా నిలబడి తమకముతో ఆ సన్నివేశమును వీక్షించాడు. అనగా ఇన్నాళ్ళు వశములో ఉన్న ఇంద్రియ లౌల్యము గలవడం ప్రారంభం అయింది. వారిద్దరూ వెళ్ళిపోయిన తరువాత తానూ వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి దర్భలు తండ్రికి ఇచ్చి అసుర సంధ్య వేళా సంధ్యావందనమునకు కూర్చున్నాడు. కానీ మనస్సులో కనపడుతున్నది ప్రార్థనా శ్లోకము కాదు. పొదలమాటున తన కన్ను దేనిమీద నిలబడిందో అది కనపడుతోంది. ఇంట ధర్మపత్నియై సుగుణాల రాశియై సౌందర్యవతియైన భార్య ఉన్నది. కానీ ఆయన కోర్కె వేరొక కులటయందు ప్రవేశించింది. ఆచార్య వాక్కులు గుర్తు తెచ్చుకుని అధిగమించాలని ప్రయత్నం చేశాడు. కానీ అతడు చూసిన సన్నివేశము వీటన్నింటిని తొలగదోసినది. ఒకనాటి రాత్రి తన భార్యకు తల్లికి, తండ్రికి తెలియకుండా ఆ హీనకుల సంజాత అయిన ఆ స్త్రీని చేరాడు. సంధ్యావందన భ్రష్టుడై రాత్రింబవళ్ళు అక్కడే ఉన్నాడు. తల్లిదండ్రులను ఎదిరించాడు. భార్యను విడిచిపెట్టేశాడు. తల్లిదండ్రులు వృద్ధులైపోయారు. వారి ధనమును దోచుకున్నాడు. కులట స్త్రీయందు 9మంది బిడ్డలను కన్నాడు.
అతడు చేసిన ఒకే ఒక మంచి పని - ఆవిడ కడుపున పుట్టిన ఆఖరు బిడ్డడికి "నారాయణ" అని పేరు పెట్టడం. ఆఖరి పిల్లాడు అవడం మూలాన వాడిమీద మమకారం ఉండిపోయి వాడిని నారాయణ నారాయణ అంటూ తరచూ పిలుస్తూ ఉండేవాడు. ఆవిడ పిల్లల పోషణార్థమై డబ్బు సంపాదించుకు రమ్మనేది. అందుకుగాను దొంగతనములు చేయడం మొదలు పెట్టాడు. ఎంత వేదం చదువుకున్నాడో, ఎంత నిత్య నైమిత్తికములను నెరపినాడో, ఎంత శాంతుడై దాంతుడై సకల వేదములను చదివాడో ఎంత మంత్రసిద్ధులను పొందాడో అంతకు అంత అజామిళుడు ఈవేళ ఆరితేరిన దొంగయై అంతటి దొంగ లేడని అనిపించుకున్నాడు.
ఇంత పతనం ఎక్కడినుంచి వచ్చింది? ఒక్క ఇంద్రియ లౌల్యం వల్ల వచ్చింది. మనిషి మనిషిగా బ్రతకడం, ఈశ్వరుని చేరుకోవడం ఇంద్రియములను గెలవడం ఎంతకష్టమో చూడండి.
షష్ఠ స్కంధము - అజామిళుడు - 2
అన్నింటికంటే ఇంద్రియములను గెలవడం చాలా కష్టం. ఇంద్రియములను తొక్కిపట్టి ఉంచితే అవి వాటికి అవకాశం వచ్చినప్పుడు కాటువేసి మనిషిని పతనం చేస్తాయి. ఈవిధంగా అజామిళుడు చిట్టచివరకు దొంగ అయ్యాడు. అతను గ్రహించుకోలేనిది ఒకటి ఉంది. దాని పేరు కాలము. అటువంటి కాలము ఎవ్వరి గురించి ఆగదు. ఎప్పుడో ఒకరోజు మహా మరణ కాలము వస్తుంది. ఆ మృత్యువు కభళించక ముందే ఈశ్వరనామం చెప్పుకోవాలి. అజామిళుడు భోగములు, సుఖములు శాశ్వతం అనుకున్నాడు. కానీ అతనిని తీసుకువెళ్ళి పోయే సమయం వచ్చేసింది. భటులు భయంకరమయిన రౌద్ర రూపములతో వచ్చారు. బంధువులు అంతా వచ్చి ఏడుపులు మొదలుపెడతారు. అప్పుడు నిన్ను రక్షించేది ఏదయినా ఉన్నది అంటే అది నీవు చేసుకున్న సాధన ఒక్కటే! అప్పడు స్వామి నామమును ఉచ్ఛరించగలగాలి. "నీశరీరమును విడిచి పెట్టేటప్పుడు మురికిలో పడిన ఉత్తరీయము తీసి విసిరి పారేసినట్లు శరీరమును వదిలి ఈశ్వర పాదములయందు ప్రవేశించ గల ధృతిని పెంచుకో" అంటారు శంకరాచార్యుల వారు. అందుకు సాధన అవసరం. యమదూతలు వచ్చి అజామిళుడి ఎదురుగా నిలబడ్డారు. వాళ్ళను చూసేసరికి ఈయనకు విపరీతమైన భయం వేసింది. అంత భయంలో ఏం చేయాలో అర్థం కాక అప్రయత్నంగా నారాయణా! అని తన కొడుకును తలచుకుంటూ గొణిగాడు. అనగానే లేచిపోతున్న ఊపిరి నిలబడింది. ఇంతవరకు ఎంత భయమును పొందాడో ఆ భయమును మాయం చేయగలిగిన విచిత్ర విషయమును చూశాడు.
నలుగురు దివ్య తేజోవంతులయిన మహాపురుషులు వచ్చి యమధర్మరాజు భటులతో ఆ పాశములను తీసివేయమని చెప్పారు. అపుడు యమధర్మరాజు భటులు "మీరు ఎవరు?" అని ప్రశ్నించారు. "మేము ఎవరిమో చెప్తాము. ముందు ఆ పాశములను తీసివెయ్యండి" అన్నారు. అపుడు యమదూతలు తమ పాశములను విడిపించారు. అజామిళుడికి పూర్వపు ఓపిక వచ్చింది. వాళ్ళ మాటలు బయట వాళ్ళకు వినబడడం లేదు. కానీ అజామిళుడు మాత్రం వాళ్ళ మాటలను వింటున్నాడు. ఆవచ్చిన వాళ్ళు ఎవరా? అని అజామిళుడు విష్ణుదూతల వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. యమదూతలు "అయ్యా వీడెవడో తెలుసా! పరమ దుర్మార్గుడు. ఇటువంటి వాడిని మేము ఎందుకు విడిచిపెట్టాలి? మీరు వీడిని ఎందుకు వదలమంటున్నారు? మీరు ఎందుకు వచ్చారు? అసలు మీరు ఎవరు? అని అడిగాడు.
అపుడు విష్ణు దూతలు "మమ్ములను విష్ణు పార్షదులు అంటారు. మేము శ్రీవైకుంఠము నుండి వచ్చాము. అజామిళుడిని విడిపించమని స్వామివారు ఆజ్ఞాపించారు. అందుకని వచ్చాము" అన్నారు.
అపుడు యమభటులు "ఇది ధర్మమా? ఇంతటి మహాపాపిని ఎలా విడిచిపెడతాము?" అని అడిగారు. అపుడు విష్ణుదూతలు " ఇది ధర్మమో అధర్మమో ధర్మమే తన పేరుగా గలిగిన యమధర్మరాజు గారిని అడగండి. మీరు యితడు ఈ జన్మలో చేసిన పాపముల గురించి మాట్లాడుతున్నారు. మేము ఇతని కోటిజన్మల పాపముల గురించి మాట్లాడుతున్నాము. అంత్యమునందు శరీరమునందు ప్రాణోత్క్రమణం జరుగుతున్న సమయంలో యితడు ఈశ్వరుని నామమును పలికాడు. అది అమృత భాండము. శ్రీహరి నామమును పలికిన కారణం చేత కోటిజన్మల పాపరాశి ధ్వంసము అయిపొయింది. కాబట్టి ఈతనిని మీరు తీసుకుని వెళ్ళడానికి అర్హత లేదు" అన్నారు. అపుడు యమదూతలు "అయితే వీడు చేసిన పాపములు అన్నీ ఏమయ్యాయి?" అని అడిగారు. అపుడు విష్ణుదూతలు నీవు మాతో రావచ్చు అని అజామిళుడిని వైకుంఠమునకు తీసుకు వెళ్ళిపోయారు. ఆయన శ్రీమన్నారాయణునిలో ఐక్యం అయిపోయాడు. భాగవతుల తోడి అనుబంధమే మనలను రక్షిస్తుంది.
వెనుదిరిగి వెళ్ళిపోయిన యమదూతలు యమధర్మరాజుగారి వద్దకు వెళ్ళి "మాకో అనుమానం. ఇన్నాళ్ళ నుండి నీవు తీసుకురమ్మన్న వాళ్ళను మేము వెళ్ళి తీసుకు వచ్చేవాళ్ళం. కానీ ఈవేళ మేము వెళ్లేసరికి అక్కడికి నలుగురు వచ్చి అజామిళుడిని వదిలిపెట్టమన్నారు. తెలిసో తెలియకో భగవంతుని నామం చెప్పడం వలన అతని పాపములు పోయాయి అంటున్నారు. పాపములు అలా నశించి పోతాయా? మా సందేహములను నివృత్తి చేయవలసింది" అని కోరారు. అపుడు యమధర్మరాజు తన భటులను అందరినీ పిలిపించి ఒక సమావేశామును ఏర్పాటు చేసి "జీవులు తమ జీవితములయందు అనేక పాప కర్మలను చేసి ఉంటారు. చేసిన పాపం నశించడం మాట ఎలా వున్నా చేసిన పాపము చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఒక కర్మ ఉన్నది. దానికి ప్రాయశ్చిత్తకర్మ అంటారు. ప్రాయశ్చిత్తము చేత వారు చేసిన పాపముల వ్యగ్రతను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కర్మను భక్తివైపుకి తిప్పుకోవాలి. భక్తికి బదులు వెర్రి అనుమానములు ప్రారంభమయిపోకూడదు. కలలో ఇందిరా రమణుని పాదములు కనపడని వాడు ఎవడయినా వుంటే వాడిని మీరు తీసుకువచ్చేయవచ్చు. అర్హతను మరచి పెద్దలు వ్రాసిన గ్రంథముల మీద తీర్పులు చెప్పేవాళ్ళని, యాత్రలకు వెళ్ళి గుడిని సమీపించి గుడిలోని దేవుని దర్శించని వాళ్ళను, దేవుని ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆ ఉత్సవం చూడడానికి అడుగుతీసి అడుగు పెట్టని దుర్మార్గామయిన పాదములు ఉన్నవారిని, మహాభాగవతులయిన వారి పదముల అడుగున వున్న ధూళి కణములను ఆశ్రయించి సమస్త తీర్థములు ఉన్నాయని తెలుసుకోలేక వారి ముందు వంగి నిలబడడమేమిటని ధ్వజ స్తంభాములా నిలబడిపోయిన దౌర్భాగ్యులను తీసుకు వచ్చేయండి. ఇప్పుడు నే చెప్పిన వారినే కాదు. ఇటువంటి దుర్మార్గులు ఎక్కడ పుడుతున్నారో వారికి సంబంధించిన వారిని నాలుగు తరముల వరకు ఏరి అవతల పారెయ్యండి. అలాంటి వారి దగ్గరకు చేరి దిక్కుమాలిన మాటలు మాట్లాడేవారిని కూడా లాగి అవతల పారవేయవచ్చు.
నా స్వామి చరణములు నాకు చాలు అని స్వామి పాదములను గట్టిగా పట్టుకొనిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు భక్తితో ఈశ్వరుడి పాదములు పట్టుకుంటున్నారో కష్టంలో సుఖంలో ఆయన పేరు చెబుతుంటారో అటువంటి వారిని, ఈశ్వరుని నామం చెప్పిన వారిని, వారికి సంబంధించిన నాలుగు తరముల వాళ్ళని, వారితో కలిసివుండే వాళ్ళని తొందరపడి తీసుకురావద్దు. బాగా పరిశీలించండి. సాధ్యమైనంత తేలికగా విడిపించండి. ఈలోగా అక్కడికి విష్ణుదూతలు కనుక వచ్చినట్లయితే మీరు వచ్చేయండి. వాళ్ళ జోలికి వెళ్ళవద్దు" అని తీర్పు చెప్పాడు. దీనిని బట్టి మనకు అన్నిటికన్నా ఈశ్వరనామము గొప్పది అని తెలుస్తోంది. అందుకని మీరు నామమును పట్టుకోవడం ముందు నేర్చుకోవాలి. అటువంటి విశిష్టమయిన విషయమును చెప్పినది ఈ ఆఖ్యానము. "నిరంతరమూ నా నాలుకమీద ఈశ్వరనామము నర్తన చేయగలిగిన అదృష్టమును ఈశ్వరా నిర్హేతుకముగా కటాక్షించు" అన్నారు రామదాసు గారు. చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖరరక్షమాం!!
అని మార్కండేయుడు ఈశ్వరనామమును చెపుతుంటే స్వామి యమధర్మరాజు గారిని తన్నాడు.
వక్షస్తాడనమంతకస్య కఠినాపస్మార సంమర్దనం
భూభృత్ పర్యటనం నమత్సుర-శిరః కోటీర సంఘర్షణమ్
కర్మేదం మృదులస్య తావక-పద ద్వంద్వస్య గౌరీ-పతే
మచ్చేతో మణి-పాదుకా విహరణం శంభో సదాంగీ-కురు!!
అంటూ శంకర భగవత్పాదులు శివానందలహరిలో పొంగిపోతారు. అటువంటి వైభవము కలిగిన నామము ఏది ఉన్నదో ఆ నామము వ్యాసభగవానుడి అనుగ్రహంగా, పోతనామాత్యుల అనుగ్రహంగా, మన గురువుల అనుగ్రహంగా, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంగా, నిరంతరమూ మన నాలుకయందు నర్తించు భాగ్యము మనకు కలుగుగాక యని ఈశ్వరుడు మనలను కటాక్షించుగాక!
ఈ అజామిళోపాఖ్యానం ఎవరు చదివారో వారు విశ్వాసముతో నామము చెప్పి ఈశ్వరుడికి నమస్కరిస్తే వాళ్లకి ఈ జన్మలో యమదూతలతో సంవాదము లేదు అని వ్యాసమహర్షి అభయం ఇచ్చారు. అదీ దాని ఫలశ్రుతి!