కథలు - భాగవతాలు : బలరాముడు రుక్మిని చంపుట
బలరాముడు రుక్మిని చంపుట
రుక్మికి రుక్మిణీ దేవి అంటే చాలా ఇష్టం. కానీ కృష్ణుని మీద మాత్రం అంత పెద్ద ప్రీతి లేదు. పాము చుట్టం పడగ విరోధం. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చాలా కుటుంబాలలో ఈ లక్షణం ఉంటుంది. అల్లుడుగారు కావాలి. కానీ అల్లుడుగారి నాన్న గారు, అమ్మగారు కానీ ఉండకూడదు. ఆ అబ్బాయి వీళ్ళింటికి అల్లుడు అవ్వాలి. ఆ పిల్లవాడికి అక్క చెల్లెళ్ళు, ఉండకూడదు. అల్లుడు గారు తన భార్య అక్క చెల్లెళ్ళను ఎంతగానో ఆదరించాలి. కానీ ఆ పిల్లవాడు తన అక్కచెల్లెళ్ళను చూడకూడదు. కొంతమంది ఆలోచనలు ఇంత హేయంగా ఉంటాయి. ఇది వ్యక్తులకు ఉండవలసిన లక్షణం కాదు. రుక్మికి సంబంధించిన ఈ ఘట్టం యిందుకు సంబంధించిన విషయములను విశదపరుస్తుంది. పురాణమును మన జీవితమునకు సమన్వయము చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దాని వలన మనం ప్రయోజనమును పొందగలుగుతాము. లేకపోతె అది మన జీవితమును ఉద్ధరించదు.
రుక్మికి రుక్మిణి అంటే తోడపుట్టింది కాబట్టి ప్రేమ. కృష్ణ భగవానుడు అంటే అంత ప్రీతి లేదు. రుక్మి తన కుమార్తె అయిన రుక్మవతిని మేనల్లుడయిన ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడు. తన వేరొక కుమార్తె అయిన చారుమతిని కృతవర్మకు యిచ్చి వివాహం చేశాడు. మనవరాలయిన రుక్మలోచనను కృష్ణుని మనుమడయిన అనిరుద్ధునకిచ్చి వివాహం చేశాడు. ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు. అనిరుద్ధుని వివాహమునకు కృష్ణ పరమాత్మ బలరామునితో కలిసి విదర్భ రాజ్యమునకు వెళ్ళారు. అక్కడ వివాహ వేడుకలు చాలా సంతోషంగా జరిగిపోయాయి. వేడుకలు పూర్తి అయిన పిమ్మట కొత్త పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు అందరు బయలుదేరి పోవడానికి సిద్ధపడుతున్నారు. అక్కడికి కళింగరాజు వచ్చాడు. కళింగ రాజు లేనిపోని పెద్దరికం తెచ్చిపెట్టుకునే తత్త్వం కలిగిన వాడు. కడుపులో చాలా బాధ పడిపోతున్నాడు. వారందరూ అలా సుఖంగా ఉండడం అతనికి సహింపరానిది అయింది. వెంటనే అతను రుక్మి దగ్గరకు వెళ్లి “ఏమయ్యా నీకేమయినా బుద్ధి వున్నదా? నీకు జరిగిన అవమానమును ఎంత తొందరగా మర్చిపోయావు. నీ కూతురుని కృష్ణుడు కొడుకుకు యిచ్చి వివాహం చేస్తావా. ఆరోజున కృష్ణుడు తన ఉత్తరీయం తీసి నిన్ను బండి చక్రమునకు కట్టి కత్తిపట్టి నీ జడను పాయలు పాయలుగా గొరిగి వదిలిపెట్టాడు. అపుడు రాజు లందరూ నిన్ను చూసి నవ్వితే నీవు భోజ కటకమును రాజధానిగా చేసుకుని ఉండిపోయావు. ఇవాళ ఆ రుక్మిణీ దేవికి కృష్ణుని యందు పుట్టిన కొడుక్కి నీ కూతురును ఇచ్చి పెళ్ళి చేస్తావా! నీకు జరిగిన అవమానం చాలా తొందరగా మర్చిపోయావే. నీ మనస్సు మంచిదే. నీవు చాల తొందరగా నీ అవమానములు మర్చిపోతావు” అన్నాడు.
ఇతని మాటలు విన్న రుక్మి “బలరామ కృష్ణులను ఎలా అవమానించ గలను?”అని కళింగ రాజుని అడిగాడు. అపుడు కళింగ భూపతి “ఏమీ లేదయ్యా బలరాముడికి ద్యూతం ఆడడం అంత బాగా రాదు. ద్యూతమునకు రమ్మన మని ఆహ్వానిస్తే రానని అనడు కదా! కాబట్టి బలరాముణ్ణి ద్యూతమునకు రమ్మన మని పిలు. అతను వస్తాడు. పందెములు పెట్టు. వరుసగా ఓడిపోతాడు. ఓడిపోయినప్పు డల్లా నవ్వుతూ ఉండు. బలరాముడు కుపితు డయిపోతాడు. అన్నగారు అలా ఓడిపోతూ నువ్వు నువ్వుతుంటే కృష్ణుడి మనస్సు ఖేదపడిపోతుంది. అలా నీవు నీకు వచ్చిన పాచికలతో వాళ్ళని అవమానం చెయ్యి” అన్నాడు.
ఇప్పటి వరకు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. రుక్మి బలరాముని ద్యూతమునకు పిలిచి ఓడిపోయినప్పుడల్లా ఉండేవాడు. బలరాముడు సహిస్తున్నాడు. కృష్ణుడు అన్నీ ఎరిగి వున్నవాడు కాబట్టి ఏమీ తెలియని వాడిలా చూస్తున్నాడు. ఆఖరున బలరాముడికి కోపం వచ్చి లక్ష రూకలను ఒడ్డాడు. బలరాముడు గెలిచాడు. “నేను గెలిచాను” అన్నాడు బలరాముడు. నువ్వు గెలవలేదు అన్నాడు రుక్మి. అక్కడ కూర్చున్న వారు రుక్మి పక్షం వహించినట్లుగా ఏమీ జవాబు చెప్పకుండా ఊరుకున్నారు. అపుడు బలరాముడు సరే వేరొకసారి లక్ష ఒడ్డుతున్నాను అని మళ్ళీ ఆడి గెలిచాడు. ఇప్పుడు కూడా నేనే గెలిచాను అని అన్నాడు రుక్మి. అశరీరవాణి ఈ ఆటలో బలరాముడే గెలిచాడు అని పలికింది. ఇంత అశరీర వాణి చెప్పినా రుక్మి నవ్వుతూ నువ్వు గొల్లలలో పుట్టిన వాడివి, ఆవుల వెంట, దూడల వెంట అరణ్యములలో తిరుగుతూ గోవులను కాసుకునే వాడివి. నీవు రాజులతో ద్యూతం ఆడడం ఏమిటి? నీవేమి మాట్లాడుతున్నావు? అన్నాడు. బలరాముడు ఇంక వీడిని ఊరుకోవడానికి వీలు లేదని అనుకున్నాడు. రుక్మిని ప్రోత్సహించిన కళింగ భూపతిని చూసి తను కూర్చున్న ఆసనం మీదనుంచి లేచి కళింగ భూపతి ముఖం మీద చెయ్యి వేసి మెడ విరిచేశాడు. పళ్ళు ఊడిపోయి క్రింద పడిపోయి కళింగ భూపతి నెత్తురు కక్కుకుని చచ్చిపోయాడు. రుక్మి దగ్గరకు వచ్చి కంఠం క్రింద చెయ్యి వేసి పైకెత్తి ఒక్కదెబ్బ కొట్టాడు. మూతి వెనక్కు వెళ్ళిపోయి నెత్తురు కక్కుకుని రుక్మి చచ్చిపోయాడు. అపుడు కృష్ణుడు లేచి “రుక్మిణీ బయలు దేరదామా” అన్నాడు. అయ్యో తప్పకుండా బయలుదేరదాము అన్నది. ఆవిడకి కృష్ణుడు ఎంత చెప్తే అంతే. తన పుట్టింటివారనే మమకారములు ఆవిడకు లేవు. “నా భర్త ధర్మమూర్తి. ఆయనకు తెలుసు ఏమిచేయాలో, ఆయన ఏమి చేస్తే అదే యదార్థం. అని ఆమె భావించింది. తన భర్తతో కలిసి రుక్మిణీ దేవి రథం ఎక్కి వెళ్ళిపోయింది. బలరాముడు వెళ్ళిపోయాడు. యాదవులు వెళ్ళిపోయారు.