పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

కథలు - భాగవతాలు : బలరాముడు_హస్తినను_గంగలో_త్రోయబూనుట

బలరాముడు_హస్తినను_గంగలో_త్రోయబూనుట

దుర్యోధనునకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు లక్షణ. ఆమెకు ఒకానొక సమయంలో వివాహమును నిర్ణయం చేశారు. కృష్ణ పరమాత్మ కుమారుడయిన సాంబుడు దుర్యోధనుని కుమార్తె అయిన లక్షణను తన వీరత్వమును ప్రకటించి ఆమెను తీసుకుని ద్వారకానగరం వైపుకి వచ్చేస్తున్నాడు. అపుడు దుర్యోధనుడు అందరూ సైన్యంతో వెళ్లి అతనిని ప్రతిఘటించండి అని తన సైన్యమును ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్లి సాంబుడిని ప్రతిఘటించారు. అపుడు సాంబుడు వారితో గొప్ప యుద్ధం చేశాడు. సాంబుడి ధనుస్సు విరిచేసి అశ్వములను కూలద్రోసి ఆయన సారధిని నిర్జించి సాంబుడిని, సాంబుడు తీసుకుపోతున్న కన్యయైన లక్షణను బంధించి తీసుకువచ్చి దుర్యోధనునకు అందజేశారు. ఆయన వాళ్ళిద్దరిని ఖైదు చేశాడు. ఈవార్త ద్వారకా నగరమునకు చేరింది. వెంటనే కృష్ణ భగవానుడు సర్వ సైన్యములతో దుర్యోధనుని మీదికి యుద్ధానికి బయలుదేరుతున్నాడు.

బలరాముడికి కౌరవులంటే కొంచెం పక్షపాతం ఉంది. దుర్యోధనుడు తన దగ్గర శిష్యరికం చేసినవాడు. ఈమాత్రం దానికి యుద్ధానికి వెళ్ళనవసరం లేదు. నేను వెళతాను. దుర్యోధనునకు నాలుగు మంచి మాటలు చెప్పి, లక్షణను మన కోడలిగా తీసుకువస్తాను” అని చెప్పి పెద్దలతో కలిసి బయలుదేరి వెళ్లి ఊరిలోకి ప్రవేశించకుండా ఊరిబయట ఉండే ఒక ఉద్యానవనంలో విడిది చేశారు. బలరాముడు మహా బలవంతుడు. బలరాముడితో పాటు ఉద్ధవుడు కూడా వచ్చాడు. భాగవతంలో పరమాత్మ అవతార సమాప్తి చేసేటపుడు ఉద్ధవుడిని పిలిచి వేదాంత బోధ చేస్తాడు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. బలరాముడు ఉద్ధవుడిని దుర్యోధనుని వద్దకు రాయబారిగా పంపాడు. ఉద్ధవుడు వెళ్లి ఒకమాట చెప్పాడు. “మీ అందరిచేత పూజింపబడవలసిన వాడయిన బలరాముడు పెద్దలయిన వారితో ఇవాళ ఈ పట్టణమునకు విచ్చేసి హస్తినాపురమునకు దూరంగా ఉండే ఒక ఉద్యానవనంలో విడిది చేసి ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి ఆయనను సేవించ వలసినది” అని చెప్పాడు. బలరాముడు వచ్చాడు అని తెలియగానే దుర్యోధనుడు కౌరవ పెద్దలను తీసుకొని బలరాముడు విడిది చేసిన ఉద్యానవనమునకు వెళ్ళాడు. బలరామునికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సేవించాడు. బలరాముడిని పొగిడాడు. అపుడు బలరాముడు “నా తమ్ము డయిన శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు నీ కుమార్తె అయిన లక్షణను చేపట్టాలని ప్రయత్నం చేస్తుంటే నీవు వానిని నిగ్రహించి ఖైదు చేశావని తెలిసింది. అందుకని నీవు నా తమ్ముని కుమారుని, కోడలిని విడిచిపెట్టి నాతొ పంపవలసింది” అన్నాడు. వెంటనే దుర్యోధనుడు “ఏమి చెప్పావయ్యా బాలరామా, కాలగతిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మే మెక్కడ! యాదవు లయిన మీ రెక్కడ! మీరు పశువులను తోలుకునే వారు మీకు రాజ్యాధికారం లేదు. మీకు మా పిల్ల కావలసి వచ్చిందా! నీ మాటలు వింటుంటే నాకు ఏమనిపిస్తోందో తెలుసా? కాళ్ళకి తొడుక్కోవలసిన చెప్పులు తలకెక్కాలని కోరుకుంటే ఎలా ఉంటుందో నువ్వు కోరిన కోరిక అలా ఉంది” అని యయాతి శాపం చేత అసలు యాదవు లయిన మీకు రాజ్యాధికారం చేసే అధికారం లేదు. కానీ మీరు రాజులు ధరించే ఛత్ర చామరాదులు అన్నీ ధరిస్తున్నారు. రాజభోగము లనన్నిటిని అనుభవిస్తున్నారు. ఇంతటి గౌరవమును పొందారు. కృష్ణుడిని చూసి మిమ్ములను చూసి ఎవరూ గౌరవించలేదు. కౌరవులతో మీకు సంబంధం ఉంది కాబట్టి మీరు దుర్యోధనుడి గురువుగారు అని మిమ్మల్ని గౌరవిస్తున్నారు. రాను రాను ఆ గౌరవమును పక్కన పెట్టి మాతోనే వియ్య మందాలని కోరిక పుట్టిందే మీకు! కాబట్టి ఇది జరిగే పని కాదు. మీ హద్దులో మీరు ఉండడం మంచిది” అని చెప్పి దుర్యోధనుడు అక్కడినుండి వెళ్ళిపోయాడు. బలరాముడు చెప్పిన జవాబు వినడానికి కూడా అక్కడ లేదు. ఆయనతో మాటలాడడ మేమిటన్నట్లుగా వెళ్ళిపోయాడు. అపుడు బలరాముడు అక్కడ ఉన్న కౌరవ పెద్దలను చూసి దుర్యోధనుని మాట తీరు మీరు చూశారు కదా! ఎవరి వలన ఎవరికి గౌరవం కలిగిందో చెప్తాను వినండి.

ఏ కృష్ణ భగవానుడి దగ్గరకు వచ్చి నరకాసురుని వధించాలని అనుకున్నప్పుడు యింద్రాది దేవతలు వచ్చి స్తోత్రం చేస్తారో, దేవేంద్రు డంతటి వాడు కూడా ఈవేళ భూలోకంలో తిరుగుతున్న కృష్ణు డంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని గౌరవించి భజించి స్తోత్రం చేస్తున్నాడో, ఏ పరమేశ్వరుని మందిరం కల్పవృక్షముల తోటయో, అక్కడకు వచ్చిన వారి కోరిక తీరకపోవడం అనేది ఉండదో, ఏ మహాత్ముడి కనుసైగ చేత అందరి కోరికలు తీరుతాయో, ఏ పరమేశ్వరుని పాదయుగళిని ప్రతినిత్యము సేవించాలని లక్ష్మీదేవి అంతటిది తాపత్రయ పడుతుందో, నిరంతరమూ సేవిస్తోందో, ఏ పరమేశ్వరుని అంశభూతముగా నేను చతుర్ముఖ బ్రహ్మ వంటి వారము జన్మించామో, అట్టి పరమేశ్వరుడు దుష్ట సంహారకుడయిన శ్రీకృష్ణ పరమాత్మ గొప్పతనం చేత ఇవ్వాళ ఉగ్రసేనుడు రాజ్యం చేస్తూ ద్వారకా నగరమును ఏలగలుగుతున్నాడు”. అది పరమ యథార్థము. కానీ ఇవాళ దుర్యోధనుడు మాకు కృష్ణుని వలన వైభవం రాలేదని అంటున్నాడు. ఇంతటి దుర్మార్గంగా మాట్లాడే వానికి తగిన బుద్ధి చెప్పి తీరాలి. అని లేచి గంగానది ఒడ్డుకు వెళ్లి ఈ హస్తినాపురము నంతటిని నాగలితో పట్టి లాగి తీసుకువెళ్ళి గంగానదిలో కలిపివేస్తాను” అని తన నాగలిని హస్తినాపుర నేల లోపలికంటా గుచ్చి లాగాడు. లాగితే సముద్రములో పడవ తరంగములకు పైకి తేలినట్లు యిన్ని రాజసౌధములతో ఉండే హస్తినాపురము అలా పైకి లేచింది. దానిని గంగానదిలోకి లాగేస్తున్నాడు. అంతఃపురము కదిలింది. దుర్యోధనుడు ఏమి జరిగింది అని అడిగాడు. నీవు అనిన మాటకి బలరాముడు హస్తినాపురిని నాగలికి తగిలించి గంగలో కలుపుతున్నాడు” అన్నారు. అప్పుడు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వంటి పెద్ద లందరినీ తీసుకుని దుర్యోధనుడు బలరాముని వద్దకు పరుగు పరుగున వచ్చాడు.

ఇప్పుడు దుర్యోధనుడు బలరాముని స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. నా తప్పు మన్నించండి అని ప్రార్థించాడు. అప్పుడు బలరాముడి కోపం చల్లారింది. బలరాముడికి అనేకమైన కానుకలను యిచ్చి లక్షణను సాంబుడిని రథము ఎక్కించి పంపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జీవితంలో ఈ విషయములను బాగా గుర్తుపెట్టుకో అని చెప్పడం కోసమని హస్తినాపురం దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది. ఉత్తరం వైపు పల్లంగా ఉంటుంది. ఆనాడు ఆ యుగంలో బలరాముడు తన నాగలితో ఎత్తిన భూమి మానవాళికి ఒక పాఠం చెప్పడానికి అలానే ఉండిపోయింది.

బలరాముడు తీర్థయాత్రకు జనుట

బలరాముడు ఒకసారి చాలా ఆశ్చర్యకరమయిన లీల చేశాడు. ఆయన సూతుడిని చంపివేశాడు. సూతుడు పురాణములను చెప్తూ ఉండే మహానుభావుడు. సత్త్వ గుణమునకు పేరెన్నిక గన్నవాడు. భగవత్కథలు చెప్పుకునే సూతుడిని బలరాముడు చంపివేయడం ఏమిటి? అనగా బలరాము డంతటి మహాత్ముడు కూడా కోపమును నిగ్రహించుకొనక పొతే ఎంత పొరపాటు జరిగిపోతుందో ఈ కథలో మనకి చూపిస్తారు. ఒకనాడు నైమిశారణ్యంలో దీర్ఘసత్రయాగం జరుగుతుంటే బలరాముడు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ సూతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు. అక్కడ ఆయన దగ్గర ఉన్న పెద్ద లందరూ ఆయన ప్రవచనం వింటున్నారు. బలరాముడు అక్కడికి వచ్చినప్పుడు అందరూ లేచి నమస్కారం చేశారు. ఒక్క సూతుడు మాత్రం నమస్కారం చేయలేదు. బలరాముడు చూసి యితనికి బుద్ధి చెప్పాలి అని అనుకుని సూతునికి దగ్గరగా వచ్చి అక్కడ ఒక దర్భనొక దానిని చేతిలోకి తీసుకొని ఆ దర్భతో సూతుని కంఠం మీద కొట్ట్టాడు. కొడితే సూతమహర్షి కంఠం తెగిపోయి కిందపడిపోయాడు. సభలో హాహాకారములు చెలరేగాయి. బలరాముడు “నాపట్ల అధిక్షేపించి ప్రవర్తించాడు కాబట్టి నేను ఆయన కంఠమును నరికేశాను” అన్నాడు. అక్కడ పురాణమును వింటున్న వాళ్ళు “బాలరామా, నీవలన జరుగకూడని అపచారం జరిగింది. సూతుడు ధర్మాధర్మ వివక్షత తెలిసి ఉన్నవాడు. మహానుభావుడు. ఆయన లేవకపోవడానికి కారణాలు మేము చెప్తాము “నీకు తెలియని రహస్యము లున్నాయా! నీకు తెలియని ధర్మ సూక్షము లున్నాయా! ఆయనకు మేము బ్రహ్మాసనమును ఇచ్చాము. ఆయన బ్రహ్మయై కూర్చుని ఉండగా నీవు సభలోనికి వచ్చావు. ఎవరు బ్రహ్మగా కూర్చుని ఉన్నాడో అటువంటి వాడు లేఛి నిలబడవలసిన అవసరం లేదు. అందుకని సూతుడు కూర్చున్నాడు. సూతుని యందు దోషం లేదు. యిప్పుడు నిన్ను పాపం పట్టుకుంది. నీవు చేసినది సామాన్య మయిన పాపం కాదు” అని చెప్పారు.

అపుడు బలరాముడు తానుచేసిన పనికి చాలా బాధపడి యిప్పుడు నేను ఏమి చేయాలి? మీరు నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి” అని అడిగాడు. అప్పుడు మహర్షులు “నేను అనంతుడను” అని అన్నావు కదా ఆ ఈశ్వర శక్తితో సూతుడికి మరల ప్రాణం పోయవలసింది అన్నారు. అప్పుడు బలరాముడు “నిజమే సూతుడు బ్రతక వలసిన వాడు. లోకమునకు పనికివచ్చేవాడు. కాబట్టి ఈ సూతుడిని నా యోగ శక్తిచేత బ్రతికిస్తాను” అన్నాడు. యికపై సూతునకు రోగమనేది ఉండదు. బుద్ధి యందు ధారణాశక్తి చెడిపోవడం అనేది ఉండదు. అపారమైన విద్యాబలంతో ఉంటాడు. గొప్ప శక్తి కలవాడై ఉంటాడు. అటువంటి సామర్థ్యములను సూతునకిచ్చి పునఃజీవితమును ఇస్తున్నాను అని మరణించిన సూతుని బ్రతికించాడు. నేను చేసిన తప్పు పనికి నా మనస్సు బాధ తీరలేదు. మీరు యింకా ఏదయినా అడగండి. చేసిపెడతాను అన్నాడు. పొరపాటు ప్రతివాడు చేస్తాడు. పొరపాటు చెయ్యడం తప్పుకాదు. మనుష్య జీవితంలో పొరపాటు చేయనివాడు ఉండడు. పొరపాటు చేసిన వాడు బలరాముడిలా ప్రవర్తించాలి. తప్పు తెలుసుకుని ఆ తప్పును అంగీకరించి దానిని సరిద్దిద్దుకోవాలి. అది జీవితమునకు వెలుగునిస్తుంది.⁠⁠⁠⁠

సూతుడు ఈవిధంగా చెప్పారు. ఇల్వలుడు అనే రాక్షసుని కుమారుడు పల్వలుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు మేము చేసే యజ్ఞయాగాదులను పాడుచేస్తూ ఉంటాడు. మేము యజ్ఞం మొదలుపెట్టి అరణి మంథనం చేసి అగ్నిహోత్రం తీసుకువచ్చి యజ్ఞవేదిలో పెట్టి హవిస్సు ఇవ్వడం మొదలుపెట్టగానే వాడు ఆకాశంలోకి వచ్చేస్తాడు. మలమూత్రములు, రక్తము యివన్నీ తెచ్చి అగ్నిహోత్రంలో వేస్తాడు. వేదిలో ఉన్న అగ్నిహోత్రం చల్లారిపోతుంది. అపుడు వాడు పెద్దగా పకపక నవ్వేసి వెళ్ళిపోతాడు. అందుకని నీవు పల్వలుని సంహరించు. అపుడు మేము యజ్ఞ యాగాదులను ఆటంకం లేకుండా చేసుకుంటాము” అని చెప్పారు. ఋషులు పల్వలుని సంహరించమని బలరాముని కోరిన కోరిక చాలా అర్థవంత మయిన కోరిక. బలరాముడు వెంటనే వెళ్లి పల్వలుని చంపలేదు. అతడు “ఏమి చేస్తాడు” అని అడిగాడు. “మేము యజ్ఞం చేస్తే పాడుచేస్తాడు” అని ఋషులు చెప్పారు. అయితే మీరు యజ్ఞం చేయడం ప్రారంభించండి. వాడు వచ్చి నట్లయితే సంహరిస్తాను అని చెప్పాడు. ఆయన మాట ప్రకారం ఋషులు ఒక యజ్ఞమును ప్రారంభించారు. పల్వలుడు వచ్చినట్లయితే సంహరిస్తాను” అని చెప్పాడు. ఆయన మాట ప్రకారం ఋషులు ఒక యజ్ఞమును ప్రారంభించారు. పల్వలుడు వచ్చి యజ్ఞ గుండంలో మలమూత్రములను విసరడం ప్రారంభించాడు. బలరాముడు చూశాడు. వెంటనే ఎడమచేతితో నాగాలి తీసి వాడి తలకాయకు వేసి కిందికి లాగాడు. కుడిచేత్తో రోకలి పుచ్చుకుని తలమీద ఒక దెబ్బ కొట్టాడు. నెత్తురు బుగబుగ కక్కుకుంటూ పల్వలుడు మరణించాడు. తరువాత బలరాముడు “నేను పల్వలుని చంపివేశాను. మీరు యజ్ఞ యాగాదులు చేసుకుంటారు. కానీ యింకా నేను చేసిన పొరపాటు నన్ను వేధిస్తోంది. ఇంతకుపూర్వం నేను చేసిన పాపములు పోవడానికి ఈ పనులు చేశాను. ఇపుడు నేను కొంత పుణ్య బలమును సమకూర్చుకోవా లనుకుంటున్నాను. నేను కొన్నాళ్ళు ఏ మంచి పనులు చేస్తే వ్యగ్రత ఉండదో నాకు అటువంటి మంచిపనులు ఏమయినా చెప్పండి అని అడిగాడు. అపుడు ఋషులు “నీవు పన్నెండు నెలలు యింటి ముఖానికి వెళ్ళకుండా దేశం అంతా తిరిగి పుణ్య తీర్థములు అన్నిటిలో స్నానం చెయ్యి. అప్పుడు నీ మనసు ప్రశాంతత పొంది, పుణ్యమును పొంది సత్త్వ గుణమును పొందుతావు. మనస్సు నందు పాపపు ఆలోచన అహంకారము పైకిరావు. వినయముతో నిలబడగలుగుతావు” అన్నారు. బలరాముడు అప్పుడు బయలుదేరి పుణ్య తీర్థములలో స్నానము చేశాడు.

మనం పుణ్య క్షేత్రములకు ఎందుకు వెళ్ళాలో ఎందుకు తీర్థములందు స్నానం చేస్తామో ఎటువంటి మనశ్శాంతి పొందాలో మహానుభావుడు చిన్నదయినా సరే యింత పరమపవిత్ర మయిన ఈ ఆఖ్యానము నందు పొందుపరచారు.