పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

కథలు - భాగవతాలు : బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకు పిలువవచ్చుట

ఏకాదశ స్కంధము

బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకు పిలువవచ్చుట

కొన్ని సంవత్సరముల తర్వాత ఒకనాడు బ్రహ్మాది దేవతలు కృష్ణ పరమాత్మ మందిరమునకు విచ్చేసి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణుడు “ఈవేళ యింతమంది దేవతలు వచ్చారు. ఏమిటి విశేషం” అని అడిగాడు. అపుడు వాళ్ళు “ఈశ్వరా! రాక్షస సంహారం చెయ్యడం కోసమని మీరు వైకుంఠంనుండి బయలుదేరి యిక్కడకు వచ్చి కృష్ణుడు అనబడే పేరుతో కొంతకాలం అవతారం స్వీకరించి అందరికీ గొప్ప సులభుడవు అయ్యావు. గోపకులంలో పుట్టి గోవులు, గోపాల బాలురు, గోపకాంతలు అందరూ నీ ప్రేమ అనుభవించేటట్లుగా ప్రవర్తించావు. నీవు వచ్చి నూట యిరువది అయిదు సంవత్సరములు పూర్తి అయిపొయింది. కాబట్టి ఇంక నీవు ఈ అవతారమును విడిచిపెట్టి తిరిగి వైకుంఠధామమును చేరి నీ మూల స్థానమునందు ప్రవేశించవలసినది” అని అడిగారు. అప్పుడు భగవానుడు “ఓహో! అయితే యింక నేను ఈ అవతారమును చాలించవలసిన సమయం ఆసన్నమయినది కాబట్టి, అవతార పరిసమాప్తి చేస్తాను. తొందరలోనే బయలుదేరి మీ దగ్గరకు వచ్చేస్తాను” అని చెప్పి ఒకసారి మనసులో సంకల్పం చేశారు. “తాను వెళ్ళిపోయిన తరువాత యాదవులకు నాయకత్వం ఉండదు. కాబట్టి ఈ యాదవుల కులం అంతా కూడా తనతోపాటే నశించిపోవాలి. మొత్తం కులనాశనం జరగాలి” అని తలంచారు. తాను నాయకత్వము నందు ఉండగా దేవతలే వచ్చి నిలబడినా యాదవులను ఎవరూ చెణకలేరు. మనకి కృష్ణ పరమాత్మ తన అవతార పరిసమాప్తిలో కూడా ఒక రహస్యమును ఆవిష్కరిస్తారు. భగవంతుణ్ణి నమ్ముకున్న పరమ భాగవతోత్తములతోటి పరిహాసం ఎంత ప్రమాదమును తీసుకువస్తుందో చూపిస్తారు. అటువంటి ప్రమాదంతో కూడిన పనిని యాదవులచేత చేయించారు.

విశ్వామిత్ర వశిష్ఠ నారదాది మహర్షులు శ్రీకృష్ణుని సందర్శనమునకు వచ్చుట

ఒకరోజున అసితుడు, విశ్వామిత్రుడు, దుర్వాసుడు, భ్రుగువు, అంగీరసుడు, కశ్యపుడు, వామదేవుడు, వాలఖిల్యుడు, అత్రి, వశిష్ఠుడు వంటి మహర్షులు అందరూ కృష్ణ పరమాత్మ దర్శనమునకు వచ్చారు. వారు ఒక్కొక్కరు మహాపురుషులు. వారి పేరు విన్నంత మాత్రం చేత పాపరాశి అంతా ధ్వంసం అయిపోతుంది. వారందరూ కృష్ణ భగవానుడిని చూసి ఒకమాట అన్నారు. “నిన్ను సేవించని రోజు జీవితంలో ఏది ఉన్నదో అది నిరర్ధక మయిన రోజు. కొందరు ఈశ్వరుడు తప్ప మిగిలిన అన్నిటి వైపు తిరుగుతారు. అలా తిరగడం వలన మనుష్య జన్మ నిరర్థకం అయిపోతుంది. ఆ తరువాత మరల ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. వీళ్ళు పొందిన మనుష్య జన్మ గొప్పతనం వీళ్ళకి తెలియక ఈ శరీరమును నిలబెట్టుకోవడమే గొప్ప అనుకొని, కేవలం దీనిని పోషించుకొని దీనితో అనుభవించిన సుఖమును సుఖమనుకొని గడిపివేస్తున్నారు. కానీ ఈ శరీరమును అరణ్యంలోకి వెళ్లి దాచుకున్నా యిది ఉండదు. వెళ్ళిపోతుంది. అలాంటి శరీరమునందు మగ్నులై వెళ్ళిపోతున్నారు. అయితే ఈ కాలమునందు ఇలాంటి ఏమీ తెలియని అజ్ఞానమునకు హద్దులు లేని గోపాల బాలురతో కలిసి వారిని తిరిగి, కౌగలించుకొని, ఆడి పాడి యింతమందిని తరింపజేశావు. కృష్ణా, నీ లీలలు రాబోవుతరంలో విన్న వారిని, చదివిన వారిని, చెప్పిన వారిని, గోవింద నామమును పలికిన వారిని గట్టెక్కించేస్తాయి. తండ్రీ, నీవు అంత గొప్ప అవతారమును స్వీకరించావు. ఇలాంటి మూర్తి మరల దొరకమంటే దొరకదు. అందుకని ఒక్కసారి నిన్ను కనులార దర్శిద్దామని వచ్చాము”. వాళ్ళకి అవతార పరిసమాప్తి అయిపోతున్నదని తెలుసు. ఈశ్వరా, నీలాంటి అవతారం మళ్ళీ వస్తుందా అని మహర్షులు ఆపాదమస్తకం ఆ కృష్ణుడి వంక చూసి పొంగిపోయారు.

ఈ సంసారమును దాటడానికి నీ పాదములు ఆధారము. వచ్చే కష్టములు తొలగిపోవడానికి నీ పాదములు ఆధారము. వేదములు నీ పాదముల ఆభరణములు. అటువంటి నీ చరణారవిందములను ఈ మాంస నేత్రముతో చూడాలని వచ్చాము. మరల యిటువంటి పాదములు మాకు దొరుకుతాయా” ఇవి “అంగనామంగనామంతరే మాధవం” అని కొన్నివేలమంది గోపకాంతల మధ్యలో ఏమీ తెలియని వాడిలా గోపకాంతల చేతులు పట్టుకుని నర్తించిన పాదములు ఈ శ్రీపాదములు. నీ పాదములను గోపాల బాలురు “మా కృష్ణుడు” అని అనుకున్నారు తప్ప శ్రీమన్నారాయణుడు అని తెలియక ఆడుకున్న పాదములు. ఈ పాదములు వాళ్ళతో ఆడుకున్నపుడు వాళ్ళని తన్నిన పాదములు. లక్ష్మీదేవి అంతటిది వాటికి నమస్కరించడానికి ఉవ్విళ్ళూరుతుందని తెలియక హేలగా ఆ పాదములను ఒళ్ళో పెట్టుకుంటే గోపాలబాలుర చేత ఒత్తబడిన పాదములు. “బ్రహ్మ కడిగిన పాదము” అని బ్రహ్మగారి చేత కడిగించు కొనిన పాదములు. ఇంతమందిని తరింప జేసినా ఆ పాదములను ఒక్కసారి చూసి తరించి పోదామని వచ్చాము కృష్ణా” అని ఆ పాదముల వంక చూసి స్తోత్రం చేశారు.

కృష్ణా! నీనామము, నీ లీలలు, నీ కీర్తి, నీ కథలు ఎక్కడ స్తోత్రం చేయబడుతుంటాయో అక్కడ మళ్ళీ ఇలాంటి అవతారం ఉంటుందా అని ముప్ఫయిమూడుకోట్ల మంది దేవతలు కూడా కూర్చుని వింటారు. కలియుగామునకు నీ నామమే రక్ష. నీది చాలా తేలికయిన నామము. గోవింద నామము. నీ అంతట నీవు కష్టపడి సంపాదించుకున్న నామము. ఏడేండ్ల బాలుడవై ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండను ఎత్తి నిలబెట్టి గోపకులను రక్షించి నీవు సంపాదించుకున్న నామము గోవింద నామము. స్వామీ నిన్ను మరల ఎప్పుడు చూస్తాము! ఒక్కసారి నిన్ను ఆపాదమస్తకం చూసి తరించిపోదామని వచ్చాము” అని స్తోత్రం చేశారు. అపుడు కృష్ణ పరమాత్మ నవ్వి “నేను కూడా మిమ్మల్ని రప్పించడానికి కారణం ఉంది. మీరు నన్ను చూసి తరించారు కదా! చెప్పవలసిన మాట చెప్పారు. ఇదే లోకం కూడా తెలుసుకోవాలి. ఇప్పడు నేను నా మనస్సులో చేసిన సంకల్పం తీరడానికి మీరు ఒకసారి నది ఒడ్డుకు వెళ్ళండి. నదీ స్నానం చేయండి. అవతార పరిసమాప్తికి యాదవకుల నాశనం జరగాలి” అని చెప్పాడు. ఈ మహర్షులందరూ వెళ్ళి నదిలో స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని భగవంతుని కథలు తలుచుకుని పొంగిపోతున్నారు.