పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

కథలు - భాగవతాలు : చల్దులు గుడుచుట

చల్దులు గుడుచుట

బ్రహ్మ గోవత్సములను, గోప బాలకులను అంతర్దానంబు చేయుట ఇక్కడ శుకుడు పరీక్షిత్తుకు ఈ కథను చెపుతూ చిన్న మెలిక పెట్టారు. దీనిని “కౌమార పౌగండ లీల” అంటారు అని చెప్పారు. మొదటి అయిదేళ్ళ వయస్సును కౌమారము అంటారు. తరువాతి అయిదేళ్ళను పౌగండము అంటారు. మరి పిల్లలు కౌమారములో జరిగినది పౌగండములో ఎలా చెప్పారు? పిల్లలందరికీ ఈ కథ అయిదవ ఏట జరిగింది. ఏడాది పాటు ఈ పిల్లలు యింటికి వెళ్ళలేదు. అందుకని ఈ లీలను శుకుడు “కౌమారపౌగండలీల” అని చెప్పారు. అపుడు పరీక్షిత్తు ఈ లీల చాలా ఆశ్చర్యంగా ఉన్నది. కౌమారంలో జరిగిన విషయం పౌగండంలో ఎందుకు చెప్పారు? ఏడాది పాటు పిల్లలు యింటికి ఎందుకు వెళ్ళలేదు? నాకీ కథ దయచేసి వివరంగా చెప్పవలసింది” అని శుకమహర్షిని ప్రార్థించాడు. ఆర్తి కలిగిన శిష్యుడు ఉంటే గురువుకి ఉత్సాహంగా ఉంటుంది. అపుడు శుకమహర్షి నీ ఆనందమును చూస్తే నాకు తప్పకుండా చెప్పాలనిపిస్తోంది. వినవలసింది” అని డానికి సంబంధించిన కథను చెప్పడం ప్రారంభించారు. ఈ పిల్లలను బ్రతికించిన తరువాత కృష్ణ పరమాత్మ వీరినందరినీ తీసుకొని బృందావనం లోపలి వెళ్ళాడు. బాగా ఎండగా ఉంది. అపుడు కృష్ణుడు గోపబాలురతో

“ఎండన్ మ్రగ్గితి రాఁకటం బడితి రింకేలా విలంబింపఁగా

రండో బాలకులార! చల్ది గుడువన్ రమ్యస్థలం బిక్క డీ

దండన్ లేఁగలు నీరు ద్రావి యిరవందం బచ్చికల్ మేయుచుం

దండంబై విహరించుచుండఁగ నమందప్రీతి భక్షింతమే ?”

మీరు ఇప్పటివరకు ఎండలో తిరిగారు. బాగా ఆకలివేస్తోంది. దాహం వేస్తోంది. మనం చల్దులు తెచ్చుకున్నాం కదా! నీడలో కూర్చుని వాటిని తిందాము” అన్నాడు.

జలజాంతస్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న ఱే
కుల చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁ గూర్చుండి వీక్షించుచున్
శిలలుం బల్లవముల్దృణంబులు లతల్ చిక్కంబులుం బువ్వు లా
కులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా!

గోపాల బాలురికి తాము ఎందులో తింటున్నాము, ఏమిటి తింటున్నాము అనేది లెక్కలేదు. తామరపువ్వు బాగా విచ్చుకుంటే దాని రెక్కలనీ ఒకదానిమీద ఒకటి వుండి మధ్యలో కర్ణిక ఉంటుంది. కర్ణికకు చుట్టూ రేకులన్నీ విచ్చుకుని ఉంటాయి. అలా కృష్ణుడిని వారందరి మధ్యలో కూర్చుండ జేశారు. వీళ్ళందరూ కృష్ణుని చుట్టూ కూర్చున్నారు. వాళ్ళు గోపబాలురు. వారికి శౌచము అంతగా తెలియదు. ఒకడు రాయి తెచ్చుకుని, తను తినే ఆహార పదార్ధమును ఆ రాతిమీద పెట్టుకున్నాడు. ఒకడు నాలుగు చిగురుటాకులు కోసుకు తెచ్చుకుని తను తినే ఆహారం దానిమీద పెట్టుకున్నాడు. ఒకడు కొద్ది గడ్డికోసి తెచ్చుకుని ఆ గడ్డిని కంచంలా అమర్చి, దానిమీద తను తెచ్చుకున్న చల్దిమూటను పెట్టుకున్నాడు. ఒకడు తాను తెచ్చుకున్న చిక్కమును పరుచుకుని ఆ చిక్కంమీద తినేస్తున్నాడు. ఒకడు చెట్లకు అల్లుకొనిన పెద్ద పెద్ద తీగలలో ఒక తీగ కోసి దానిమీద పెట్టుకుని తింటున్నాడు. ఒకడు ఒక పెద్ద అడివి పువ్వును కోసితెచ్చి ఆ పువ్వులో పెట్టుకుని తింటున్నాడు.

మాటిమాటికి వ్రేలు మడిఁచి యూరించుచు ;
నూరుఁగాయలు దినుచుండు నొక్క ;
డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి ;
చూడు లేదని నోరు చూపునొక్కఁ ;

డేగు రార్గురి చల్దు లెలమిఁ బన్నిదమాడి ;
కూర్కొనికూర్కొని కుడుచు నొక్కఁ ;
డిన్నియుండఁగఁ బంచి యిడుట నెచ్చలితన ;
మనుచు బంతెనగుండు లాడు నొకఁడు ;

కృష్ణుఁ జూడు మనుచుఁ గికురించి వడి మ్రోల ,
మేలి భక్ష్యరాశి మెసఁగు నొకఁడు ;
నవ్వు నొకఁడు ; సఖుల నవ్వించు నొక్కఁడు ;
ముచ్చటాడు నొకఁడు ; మురియు నొకఁడు.

ఒకడు వాని యింటినుంచి ఊరగాయలు తెచ్చాడు. ఎడమచెయ్యి పూజయందు గాని, భోజనమునందు కానీ దూష్యము. కానీ వాడు చల్దిముద్ద ఎడమచేతిలో పెట్టుకున్నాడు. ఊరగాయ అన్నం తింటూ పక్కవాడికి వాడి ఊరగాయలను చూపించి ఊరించేవాడు. ఒకడు పక్కవాని చల్దిమూట నుంచి ఊరగాయను తీసి అవతలి వానికి తెలియకుండా గుటుక్కున మ్రింగి, పక్కవాడు అడిగితె నోరు చూపించి “నేనెక్కడ తిన్నాను?” అనేవాడు. ఒకడు పక్కవాళ్ళు విస్తళ్ళకు ఆకులు తెచ్చుకుందామని పక్కకి వెడితే వాళ్ళ చల్ది మూటలలోని కొన్ని ఆహార పదార్థములను తీసేసుకొని గబగబా అయిదారుగురి చల్ది తననోట్లో కుక్కేసుకునేవాడు. ఒకడు తాను బంతెనగుండ్లు తింటాననే వాడు. బంతెన గుండ్లు అంటే అందరి విస్తళ్ళ నుండి కొంచెం కొంచెం తీసుకుని నోట్లో పడేసుకుంటూ ఉండడం. ఒకడు కృష్ణుని చూపించి “ఆ ఆవకాయ ముక్కలు పట్టుకుని కృష్ణుడు ఎలా ఉన్నాడో చూడరా” అనేవాడు పక్కవాడు కృష్ణుడి వంక చూసేసరికి వాడి విస్తరిలోని ఆవకాయ ముక్కను వీడు తినేవాడు. ఒకడు నవ్వుకుంటూ, ఒకడు తాను నవ్వకుండా తన మాటలచేత పక్కవాళ్ళని నవ్విస్తున్నాడు. ఇన్ని రకములుగా వీరందరూ అక్కడ అన్నం తింటున్నారు. కృష్ణుడు వీరందరి మధ్యలో కూర్చున్నాడు. వీళ్ళు కృష్ణుణ్ణి చూస్తూ తింటున్నారు. వాళ్ళకి కృష్ణుణ్ణి చూస్తూ తినడంలో కడుపు నిండుతుంది. వీళ్ళకి అదొక గమ్మత్తు.

కడుపున దిండుగా గట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి
విమల శృంగంబును వేత్ర దండంబును జాఱి రానీక డా చంక నిఱికి
మీగడపెరుగుతో మేళవించిన చల్ది ముద్ద డాపలి చేత మొనయ నునిచి
చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు వ్రేళ్ళసందులయందు వెలయ నిఱికి

సంగడీల నడుమ జక్కగ గూర్చుండి నర్మభాషణముల నగవు నెఱపి
యాగభోక్త కృష్ణు డమరులు వెఱగంద శైశవంబు మెఱసి చల్ది గుడిచె!!

అందరి మధ్య నిలబడి కృష్ణపరమాత్మ తనమీద ఉన్న ఉత్తరీయం తీసి, నడుముకి కట్టి అందులోకి వేణువును దోపి, ఆవులను తోలే కర్ర, ఊదే కొమ్ముబూరను ఎడమ చంకలో పెట్టుకుని, ఎడమచేతిలో చద్ది అన్నపు ముద్ద పెట్టుకుని గోపబాలురు ఎంగిలి చేసి ఇచ్చిన ఊరగాయ ముక్కలను తన వేళ్ళ సందులో పెట్టుకుని దానిని నంజుకుంటూ అన్నమును తింటున్నాడు. కృష్ణుడు తన చేతిలో పెట్టుకున్నది గతరాత్రి వండిన పదార్ధం. నిలవ వున్న పదార్థం ఈశ్వర నివేదనమునకు పనికిరాదు. ఒక్క బెల్లం ముక్కకు మాత్రమే ఆ అర్హత ఉన్నది. డానికి నిలవ దోషం లేదు. ఆయన యాగభోక్త. మామూలుగా పెడితే తినడు. యాగం చేసి “ఓం నమోనారాయణాయ స్వాహా” అని మంత్రం చెప్పి స్రుక్కు సృవములతో నేతిని పోస్తే హవిస్సు వేస్తే, అగ్నిముఖంగా మాత్రమే స్వీకరించే పరమాత్మ ఈవేళ గోపబాలురందరితో కలిసి ఎంగిలి ముక్కలు నంజుకుని తింటున్నాడు. యాగభోక్త అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఇలా తింటుంటే అమరులు అన్ని లోకములనుండి వచ్చేశారు. “ఏమి ఆశ్చర్యం! యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప హవిస్సులు స్వీకరించని పరమాత్మ, గోపబాలురతో కలిసి స్నానం చెయ్యకుండా, ఇంతమంది మధ్య కూర్చుని తాము ఎంగిలి చేసి పెట్టినది తింటున్నాడు. ఏమి ఆశ్చర్యము” అని వారందరూ తెల్లబోయి చూస్తున్నారు. రంభాది అప్సరసలు పొంగిపోయి నాట్యములు చేస్తున్నారు. దేవతలు అందరూ ఆనందముతో “గోవిందా గోవిందా” అని అరుస్తున్నారు. ఈ మాటలు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి చెవిన పడ్డాయి. ఈ అల్లరి ఏమిటో చూసి రావాలని ఒకసారి సత్యలోకం నుండి బయటకు వచ్చి భూమండలం వైపు చూశాడు. అక్కడ బృందావనంలో శ్రీకృష్ణుడు గోపబాలురందరితో కలిసి తింటున్నాడు. “ఈ ఎంగిలి ముద్దలు ఎడమ చేతిలో పెట్టుకుని తింటున్నవాడు పరబ్రహ్మా? అఘాసురుని కడుపులోకి వెళ్ళిపోయిన వాళ్ళని యితడు బ్రతికించాడా? యాగములందు తప్ప హవిస్సులు స్వీకరించని పరబ్రహ్మ యింత సులభుడయినాడా? ఇది నేను నమ్మను. ఆ పిల్లవాడు పరబ్రహ్మము కాదు” అని అనుకున్నాడు.

“నేను చతుర్ముఖ బ్రహ్మను, ఇంటి పెద్దను. నాలుగు మోములు కలవాడిని. వేదములు చదివినవాడిని. నా మాయ తప్పించుకోలేడు” అని వెంటనే ఒక మాయ చేశాడు, అక్కడే నీరు త్రాగి పచ్చిక తింటున్న ఆవులని, దూడలని, ఎద్దులను కొంచెం దూరముగా తీసుకువెళ్ళి మాయం చేసేసి, వాటినన్నిటిని ఒక కొండగుహలో పెట్టేశాడు. అన్నం తింటున్న పిల్లలకు “కృష్ణా మన ఆవులను దూడలను నేను వెళ్ళి వెతికి తీసుకువస్తాను. మీరు అన్నం తింటూ వుండండి” అని చెప్పి ఆవులను వెతకడానికి కృష్ణుడు బయలుదేరి వెళ్ళాడు. వాటి పాదముల జాడలు కనపడ్డాయి. చాలా దూరం వెళ్ళాడు. ఒకచోట మంద అంతా విడిపోయి వెళ్ళినట్లు కనపడింది. ఆవులు కనపడక పోయేసరికి తిరిగి వెనక్కి వచ్చేశాడు. ఈలోగా బ్రహ్మగారు కృష్ణుడు ఏమి చేస్తాడో చూద్దామని అక్కడ వున్న గోపాల బాలురను మాయం చేసేశాడు. ఇక్కడ చూస్తే గోపాల బాలురు లేరు. అక్కడ ఆవులు లేవు. దూడలు లేవు. ఎద్దులు లేవు. సాయంకాలం అయిపోతోంది. ఇక యింటికి వెళ్ళిపోవాలి. వెళ్ళగానే మా పిల్లలేరి, మా ఆవులేవి అని అడుగుతారు. అందుకని అవి ఏమైపోయాయి అని ఒకసారి దివ్యదృష్టితో చూశాడు. తన నాభికమలంలో నుండి పుట్టిన బ్రహ్మగారికి ఈవేళ మొహబుద్ది పుట్టింది. ఆయన తనమీద మాయ చేశాడని తెలుసుకున్నాడు. ఒక చిరునవ్వు నవ్వుకున్నాడు. తాను ఒక్కసారి సంకల్పం చేశాడు. ఎన్ని ఆవులు వచ్చాయి అన్ని ఆవులు, ఎద్దులు, దూడలు, గోపాలబాలురు అయిపోయాడు. అన్నీ తానే, తానే అన్నీ అయిపోయాడు. తానే తనని తోలుకుని అన్నింటితో కలిసి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళాడు.

ఒక్కొక్క తల్లి దగ్గర ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. ఒక్క కృష్ణుడే ఇంతకు ముందు ఏ తల్లుల దగ్గర ఏ పిల్లలు ఏ దూడలు, ఆవులు, ఎద్దులు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాయో అలా ప్రవర్తించాడు. ఆ తల్లిదండ్రులు, గోపకాంతలు, గోపాల బాలురని చూసి మా పిల్లవాడే అని మురిసిపోయారు. కృష్ణుడు రోజూ ఇలాగే చేస్తున్నాడు. ఈలోగా త్రుటికాలం కనురెప్ప మూసి తెరచినంతకాల అయింది. బ్రహ్మగారికి త్రుటి అంటే మనకి సంవత్సరకాలం. సంవత్సరం అయిన తరువాత కృష్ణుడు ఏమిచేస్తున్నాడో చూద్దామని చతుర్ముఖ బ్రహ్మగారు తలను ఇటు తిప్పాడు. అవే ఆవులు, అవే దూడలు, గోపాల బాలురు యిక్కడ ఉన్నారు. తాను దాచాడు కదా అని తాను దాచిన గుహను చూశాడు. వారందరూ గుహలో ఉన్నారు. ఇప్పుడు మాయ చేద్దామనుకున్నవాడు మాయలో పడ్డాడు. బ్రహ్మనయిన నేను ప్రాణులన్నింటినీ సృష్టిస్తాను. నేను సృష్టించిన ఆవులు, దూడలు, గోపబాలురు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ ఇవే అక్కడ ఉన్నారు. “అయితే నేను కాకుండా మరొక బ్రహ్మ ఎవడయినా ఉన్నాడా” అని అనుమానం వచ్చి వెనక్కి తిరిగి తన సింహాసనం చూసుకున్నాడు. అది ఖాళీగానే ఉంది. కాబట్టి తానే సృష్టికర్తగా ఉన్నాడు. మరి అక్కడ కనపడుతున్న వారెవరా అని ఆలోచించాడు. అపుడు బ్రహ్మగారికి గుర్తు వచ్చింది. “నన్ను కూడా సృష్టించిన వాడెవడో అతడు పరబ్రహ్మ. ఎవని నాభికమలము నుండి నేను పుట్టానో వాడు యిపుడు చిన్ని కృష్ణునిగా ఉన్నాడు. వాని మాయ ముందు నా మాయ తుత్తునియలయిపోయింది. నేను దీనిని తెలుసుకోలేక పోయాను” అని అనుకోగానే ఒక్కసారి మొహబుద్ది విడిపోయింది. ఇప్పుడు చిన్ని కృష్ణుని పరబ్రహ్మమును చూద్దామని అటుచూశాడు. చూసేసరికి ఆవులలో, దూదలలో, ఎద్దులలో, పిల్లలలో, కృష్ణుడిలో నాలుగు భుజములతో, శంఖచక్రగదాపద్మములను పట్టుకొని పట్టు పీతాంబరములతో శ్రీవత్సముతో కౌస్తుభ మణితో, వనమాలతో, కిరీటముతో, పెద్ద పెద్ద కుంతలములతో, వెలిగిపోతున్న పరబ్రహ్మము అనేకముగా దర్శనం ఇచ్చాడు. ఇన్ని కాంతి పుంజములను చూసి బ్రహ్మగారు అయోమయంలోకి వెళ్ళిపోయారు. ఎందుకిలా అయిందని కళ్ళు మూసుకుని ఆలోచించాడు. “నా మాయ దేనిమీద పనిచేయ్యదో దానిమీద మాయకమ్మే ప్రయత్నం చేశాను” అనుకుని “స్వామీ! దయచేసి నేను చూడగలిగినట్లు కనపడు” అని ప్రార్థించాడు. అపుడు ఆవులను దూడలను వెతకడానికి వెళ్ళిన కృష్ణుడు ఎలా ఉంటాడో అలా కనపడ్డాడు. ఈ లీలను బలరాముడు ఒక్కడు మాత్రమే కనిపెట్టాడు. ఈ లీలను చేసినది తానేనని ఒకరోజున కృష్ణుడు బలరాముడికి చెప్పాడు.

ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి

శంపాలతికతోడి జలదంబు కైవడి ;
మెఱుఁగు టొల్లియతోడి మేనివానిఁ
కమనీయ మృదులాన్నకబళ వేత్ర విషాణ ;
వేణుచిహ్నంబుల వెలయువాని

గుంజా వినిర్మిత కుండలంబులవాని ; శిఖిపింఛవేష్టిత శిరమువానిఁ
వనపుష్పమాలికావ్రాత కంఠమువాని ;
నళినకోమల చరణములవానిఁ

గరుణ గడలుకొనిన కడకంటివాని గో
పాలబాలుభంగిఁ బరగువాని నగుమొగంబువాని ననుఁగన్నతండ్రిని నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష!

శంపాలతిక అంటే మెరుపుతీగ. కృష్ణుడు మెరుపుతీగతో కూడిన వర్షాకాలములోని నల్లని మబ్బు ఎలా ఉంటుందో అటువంటి శరీరంతో ఉన్నాడు. పైన చిన్న ఉత్తరీయం ఉంది. ఎడమచేతిలో పెరుగు అన్నపు ముద్ద ఉంది. ఎడమ చంకలో కొమ్ము బూర ఉంది. చేతిలో కర్ర ఉంది. పీతాంబరమును కట్టుకున్నాడు. ఏనుగు దంతంతో చేయబడిన కుండలములు పెట్టుకున్నాడు. చక్కటి నెమలి ఈక నొకదానిని పెట్టుకున్నాడు. అరణ్యములలో దొరికిన పద్మములతో కూడిన తీగనొకదానిని దండగా మేడలో వేసుకున్నాడు. అలా కనపడుతున్న కృష్ణుని పాదములమీద పది బ్రహ్మగారు స్తోత్రం చేశారు.

ఏలా బ్రహ్మపదంబు ? వేదములకున్ వీక్షింపఁగారాని ని న్నీలోకంబున నీ వనాంతరమునం దీ మందలోఁ గృష్ణ యం చాలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు నీ వ్రేలం దొక్కని పాదరేణువులు పై వేష్ఠించినం జాలదే ?

నాకీ దిక్కుమాలిన బ్రహ్మపదవి ఎందుకు? బ్రహ్మాండములన్నీ నిండి నిబిడీ క్రుతమయిన నీవు, ఈ వేళ ఇక్కడ ఈ అరణ్యంలో తిరుగుతున్నావు. నీతోకలిసి ఆడుకుని పొంగిపోయిన ఈ గోపబాలుర పాదములకు అంటుకొనిన ధూళికణమును తీసి నా శిరస్సు మీద వేసుకునే అదృష్టమును నాకు కటాక్షించు. నాకు ఈ బ్రహ్మపదవి వద్దు” అన్నాడు.

ఎవరు ఈ బ్రహ్మగారు చేసిన స్తుతిని చదువుతారో వారిని మాయ విడిచిపెడుతుంది. అంతటా కృష్ణుడు కనపడుతుండగా ఏ భయం లేకుండా, అంతటా సంతోషముతో చూస్తూ, తేలికగా ప్రాణములు ఉగ్గడింపబడి చక్కగా పరబ్రహ్మములో కలిసిపోతారు. ఇహమునందు వారు కోరుకున్న కోరికలు తీరుతాయి. ఈవిధంగా కౌమారం నందు జరిగిన లీల పౌగండమునందు చెప్పబడింది. ఏడాది పాటు కృష్ణుడే అన్నీ అయి వున్నాడు⁠⁠⁠⁠⁠⁠⁠⁠