పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

కథలు - భాగవతాలు : దక్షయజ్ఞం

చతుర్థ స్కంధము - దక్షయజ్ఞం

చతుర్ముఖ బ్రహ్మగారి శరీరంలోంచి కొంత సృష్టి జరిగిందని గతంలో చెప్పుకున్నాము. ఈశ్వరుని దేహములోంచి వచ్చిన సృష్టి కొంత ఉన్నది. అందులో పదిమంది ప్రజాపతులను ఆయన శరీరమునుండి సృష్టించాడు. అటువంటి వారిలో ఆయన బొటన వ్రేలులోంచి జన్మించినటువంటి వాడు దక్ష ప్రజాపతి. నేత్రములలోంచి జన్మించినటు వంటి వాడు అత్రిమహర్షి. అత్రి మహర్షి సంతానమే ఆత్రేయస గోత్రికులు. దక్షప్రజాపతి పదిమంది ప్రజాపతులకు నాయకుడు. అటువంటి దక్షప్రజాపతికి పదహారుమంది కుమార్తెలు కలిగారు. ఈ 16మంది కుమార్తెలకు ఆయన వివాహం చేశారు. అందులోనే "మూర్తి" అనబడే ఆవిడ గర్భం నుంచి నరనారాయణులు ఉద్భవించారు. వారే బదరీలో తపస్సు చేశారు. అందుకే ఉద్ధవుడు ఉండడం, నర నారాయణులు అక్కడ తపస్సు చేయడం, ప్రహ్లాదుడు అక్కడికి వెళ్ళడం - ఇలాంటి వాటివలన బదరీ క్షేత్రమునకు అంత గొప్పతనం వచ్చింది. బాదరాయణుడని పిలువబడే వ్యాసుడు అక్కడ కూర్చుని తపస్సు చేశాడు. భాగవతమును రచన చేశాడు. బదరికావనంలో తిరిగాడు కాబట్టి ఆయనకు "బాదరాయణుడు" అని పేరు వచ్చింది.

బ్రహ్మ బొటనవేలునుండి ఆవిర్భవించిన దక్షప్రజాపతికి కలిగిన కుమార్తెలలో సతీదేవిని రుద్రునకు ఇచ్చి వివాహం చేశారు. దక్ష కుమార్తెలలో 15మందికి సంతానం కలిగారు. కానీ శంకరునికి సతీదేవికి సంతానం కలగలేదు. శివుడు సాక్షాత్తుగా బ్రహ్మము. అటువంటి బ్రహ్మము అయినవాడికి మరల పిల్లలు, హడావుడి ఎక్కడ ఉంటుంది? అటువంటి తత్త్వము కలిగిన శంకరుడు, దక్షప్రజాపతి చాలా అనుకూలంగా చాలా సంతోషంగా ఉండేవారు.

ఆ సందర్భంలో ఒకానొకప్పుడు ప్రజాపతులు అందరూ కలిసి దీర్ఘసత్రయాగం చేశారు. ఎవరయితే ఋత్విక్కులుగా ఉంటారో వారే యజమానులుగా కూడా ఉండేటటువంటి యాగమునకు సత్రయాగమని పేరు. అక్కడికి బ్రహ్మగారు కూడా వెళ్ళారు. అక్కడ పరమశివుడు కూడా ఉన్నాడు. ఆ సభలోకి ఆలస్యంగా దక్ష ప్రజాపతి వచ్చాడు. ఆయన కత్తిచేత కూడా నరకబడడు. ఆయన శరీరం అంత మంత్రభూయిష్టం. ఆయనను చూసీ చూడడంతోనే అందరూ లేచినిలబడ్డారు. కానీ బ్రహ్మగారు, భర్గుడు మాత్రం లేవలేదు. బ్రహ్మగారు పెద్దవారు కనుక ఆయన లేవనవసరం లేదు. కానీ శివుడు బాహ్యమునందు దక్షప్రజాపతి అల్లుడు. మామగారు పితృ పంచకంలో ఒకడు. దక్షుడు లోపలి వచ్చి సభలో లేవని వాళ్ళు ఎవరా అని చూశాడు. అల్లుడు లేవకపోవడం గమనించాడు. కోపం వచ్చేసింది. క్రోధంతో సభలో వున్న వాళ్ళందరినీ చూసి శంకరుని చూపిస్తూ "వీడు ఎవడు" అన్నాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. శివుడు నవ్వుతూ కూర్చున్నాడు. అక్కడ వున్నవాళ్ళు లేచి ఈయన శివుడండీ అని జవాబిచ్చారు. వీనికి శివుడని పేరు ఎవరు పెట్టారు? వీనిని పట్టుకుని శివుడు అని పిలిస్తే నాకేమనిపిస్తుందో తెలుసా! యజ్ఞోపవీతం లేని వాడికి, ఉపనయన సంస్కారం జరగని వాడికి స్వర్గం తెలియని వాడికి వేదం పట్టుకెళ్ళి ఇచ్చినట్టు ఉంది" అన్నాడు.

భయంకరమయిన శివనింద చేశాడు. ఈవిధంగా దక్షుడు ఇన్ని మాటలు అంటే నిజంగా మంగళం చేసేవాడు కాబట్టి ఆయన ఏమీ అనలేదు. ఆయనకు దూషణ భూషణ రెండూ ఒక్కలాగే ఉంటాయి. అలా ఉండగలగడం చాలా గొప్ప విషయం. అపుడు దక్షుడికి ఇంకా కోపం వచ్చేసింది. ఇన్ని మాటలు అన్నా నీవు పలకలేదు, లేవలేదు, నమస్కరించలేదు. కాబట్టి ఇవాల్టి నుంచి జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువులయందు నీకు హవిర్భాగము లేకుండు గాక" అని నిర్ణయించాడు. ఈవిధంగా దక్షుడు తన పరిధిని దాటిపోయాడు. శివుణ్ణి దక్షుడు తిడుతుంటే భ్రుగువుకు సంతోషం కలిగింది. ఇవన్నీ చూశాడు నందీశ్వరుడు. ఎక్కడలేని కోపం వచ్చింది. శంకరుని పట్టుకుని ఇంతంత మాటలు అంటాడా? నేనూ శపిస్తున్నాను దక్షుడిని. దక్షుడు ఇవాల్టి నుండి సంసారమునందు పడిపోవుగాక! కామమునకు వశుడగుగాక! అని శాపము ఇచ్చేశాడు. నందీశ్వరుడు శాపం ఇచ్చేసరికి భ్రుగువుకు కోపం వచ్చింది. ఆయన లేచి ఎవరయితే ఈ భూమండలం మీద శంకరుని వ్రతమును అవలంబిస్తారో, అటువంటి వారిని అనుసరించి ఎవరు వెడతారో వారు వేదమునందు విరక్తి కలిగి వేదమును దూషించి కర్మకాండను నిరసించి వారందరూ కూడా జడులై విభూతి పెట్టుకుని జటలు వేసుకుని ఉన్మత్తుల వలె భూమిమీద తిరిగెదరు గాక! అని వేదం విరుద్ధమయిన స్థితిని వారు పొందుతారు అని శాపం ఇచ్చేశాడు. సభలో పెద్ద కోలాహలం రేగిపోయింది. నవ్వుతూ లేచి శివుడు ఇంటికి వెళ్ళిపోయాడు. సతీదేవి ఎదురువచ్చింది. కానీ శంకరుడు దక్ష సభలో జరిగిన సంగతి ఏమీ ఆమెకు చెప్పలేదు. కొన్నాళ్ళయి పోయింది. ఇపుడు "నిరీశ్వర యాగం" అని కోట వ్రతం మొదలుపెట్టాడు. దానికి బృహస్పతి సవనము అని పేరు పెట్టాడు. దానికి ముందుగా వాజపేయం చేశాడు. వెళ్ళకపోతే ఏమి శాపిస్తాడో అని ఆ యాగమునకు అందరూ వెడుతున్నారు. అతడు చేస్తున్న యాగం మామూలుగా చేయడం లేదు. శంకరుడి మీద కక్షతో చేస్తున్నాడు. శ్రీమహావిష్ణువు, బ్రహ్మగారు రాలేదు.⁠⁠⁠⁠

చతుర్థ స్కంధము - వీరభద్ర విజితి

ఒకరోజున సతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తోంది. పైన అందరూ విమానములలో వెళ్ళిపోతున్నారు. అలా వెళుతూ వాళ్ళు చెప్పుకుంటున్నారు. . "దక్షప్రజాపతి యాగం చేస్తున్నాడు. ఆహ్వానం వచ్చింది. అందుకని మనందరం వెడుతున్నాం" అని చెప్పుకుంటుంటే ఆవిడ విని గబగబా అంతఃపురంలోంచి క్రిందికి దిగి శివుడి దగ్గరకు వచ్చి "స్వామీ! పుట్టింట్లో ఏదయినా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్లల మనసంతా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది. మా నాన్నగారు యాగం చేస్తున్నారట. నాకు నా తండ్రిగారు చేస్తున్న యాగమునకు వెళ్ళాలని అనిపిస్తోంది. మనం కూడా యాగానికి వెళ్ళదాం" అంది. తమకు ఆహ్వానం రాలేదు కదా అన్నట్లుగా శంకరుడు సతీదేవికేసి చూశాడు. ఆయన మనస్సులోని భావనను ఆమె పసిగట్టింది. "కొంతమంది పిలిస్తేనే వెళ్ళాలి కొంతమంది పిలవకపోయినా వెళ్ళాలి. తండ్రిగారి ఇంటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళవచ్చు. అంది. అపుడు శంకరుడు "దేవీ, నీవు చెప్పినది యథార్థమే పిలుపు లేకపోయినా సరే పుట్టింటికి ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు." "కానీ నేను కూడా ఒక మాట చెపుతాను విను. నేను లేచి నమస్కరించ లేదని నీ తండ్రిగారు నన్నొక సభలో అవమానం చేసి మాట్లాడారు. కాబట్టి ఇప్పటికి కూడా వారు నాయందు అనుకూల్యతతో ఉండరు. కాబట్టి ఇప్పుడు మనం వెళితే తలుపు తీసి అసలు పలుకరించరు. మాట్లాడరు. వాళ్ళు మనలను చాలా ధారుణంగా అవమానిస్తారు. కాబట్టి బంధువయినా సరే ఆదరణ లేనప్పుడు వాడు ఎంతగొప్పవాడయినా వాడి గడప తొక్కకుండా ఆర్యులు ఉండవచ్చు. కాబట్టి వెళ్ళవద్దు" అని చెప్పాడు. అపుడు ఆవిడ "నాకు వెళ్ళాలని అనిపిస్తోంది" అంది. అపుడు శివుడు "అయితే నీవు వెళ్ళవచ్చు" అన్నాడు ఆయన త్రికాలజ్ఞుడు, అన్నీ తెలుసు.

వెంటనే తల్లి పుట్టింటికి బయలుదేరింది. ఆమె కాళ్ళకు ఉన్నటువంటి గజ్జెలు మ్రోగుతుండగా పట్టుపుట్టం కట్టుకుని బయలుదేరితే వెంటనే శివుడు సైగ చేశాడు. ప్రమథగణములు అందరూ అమ్మవారి వెంట బయలుదేరారు. అమ్మవారి పుట్టింటికి వచ్చేసరికి దక్షప్రజాపతి ఎదురుగుండా కూర్చుని ఉన్నాడు. పరివారం అంతా కూర్చుని ఉన్నారు. వృషభవాహనం దిగి సతీదేవి ఇంట్లోకి వస్తోంది. ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకుమలు నిలబడతాయో, ఏ తల్లి అనుగ్రహం వుంటే ఐశ్వర్యం వస్తుందో అటువంటి తల్లి తన కూతురు, దాక్షాయణి అని పేరుపెట్టుకుని నడిచి వస్తోంది. దక్షుడు లేవలేదు, పలకరించలేదు. తండ్రి తన భర్తను నిందించాడు. వచ్చిన కూతురు మీద తండ్రి ప్రేమను చూపించలేదు. ఆమె చాలా బాధపడింది. దీనిని మణిభద్రుడు అన్నవాడు చూశాడు. అమ్మవారు ఉగ్రమయిన తేజస్సుతో చూస్తోంది. ఆమె సమస్త బ్రహ్మాండములను కాల్చివేయ గల శక్తి గలది. ప్రమథగణములు చూశాయి. విచ్చుకత్తులు పైకి తీసి ఈ దక్షుడిని చంపి అవతల పారేస్తామన్నాయి. అమ్మవారు వారించింది. దక్షుడిని తనవద్దకు పిలిచి పరమశివుని నీ చిత్తం వచ్చినట్లు కూశావు. ఇప్పుడు చెపుతున్నాను నీకొక మాట "ఎవరయినా శంకరుణ్ణి నిందచేస్తే వాని నాలుక పట్టి పైకి లాగి కొండనాలుక వరకు కత్తితో కోసివేయవచ్చు. అలా నీకు చేయడానికి అధికారం లేని పక్షంలో ఉత్తరక్షణం శివనింద ఎక్కడ జరిగిందో అక్కడ చెవులు మూసుకుని బయటకు వెళ్ళిపోయి ప్రాయశ్చిత్తంగా ఆ రోజు అన్నం తినడం మానివేయాలి. నువ్వు దుర్మార్గుడివి. దుష్టాత్ముడివి. అందుకే శంకరుణ్ణి నిందచేశావు. నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకముందు నేను ఎప్పుడయినా పరమ పవిత్రుడయిన శంకరునిసాన్నిధ్యంలో కూర్చుని వుంటే దాక్షాయణీ అని పిలుస్తారు. దుర్మార్గుడవయిన నీ కుమార్తెగా పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను. అందుకని నేను ఈ శరీరమును వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతాను" అని పద్మాసనం వేసుకుని కూర్చుని ప్రాణాపానవ్యాన వాయువులను నాభిస్థానమునందు నిలబెట్టింది. ఆపైన ఉదాన వాయువును హృదయం మీద నుంచి పైకి తీసుకువచ్చి కనుబొమల మధ్యలో నిలబెట్టి ఇంద్రియములు అన్నితిలోంచి అనిలము అనే అగ్నిని ప్రేరేపణ చేసి ఆ యోగాగ్ని యందు శరీరమును దగ్ధం చేసి బూడిదకుప్పై క్రిందపడిపోయింది. సభలో హాహాకారములు మిన్నుముట్టాయి. ప్రమథ గణములకు ఎక్కడలేని కోపం వచ్చి కత్తులు తీసి దక్షుడి మీద పడ్డారు. భ్రుగుడికి చాలా సంతోషం కలిగింది. వెంటనే హోమం చేసి అందులోంచి "రుభులు" అనబడే దేవతలను సృష్టించి రుద్ర గణములను తరిమికోట్టించాడు. ఈ విషయములను నారదుడు వెళ్ళి శంకరునకు చెప్పాడు. ఆయన ప్రశాంతంగా ధ్యానమగ్నుడై కూర్చుని ఉన్నాడు. శంకరునకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఇంత శాంతమూర్తి రుద్రుడయిపోయాడు. ఒక్కసారి లేచాడు. పెద్ద వికటాట్టహాసం చేశాడు. ఆ నవ్వుకి బ్రహ్మాండములు కదిలిపోయాయి. మెరిసిపోతున్న జటనొకదానిని ఊడబెరికి నేలకేసి కొట్టాడు. ఒక్కసారి అందులోంచి ఒక పెద్ద శరీరం పుట్టింది. ఆ శరీరమును చూసేటప్పటికే హడలిపోయారు అందరూ. వీరభద్రావతారం ఉద్వేగంతో ఒక్కసారి దూకి శంకరుని పాదములకి నమస్కరించి బయల్దేరాడు. బయల్దేరేముందు పరమశివుడి కి ప్రదక్షిణం చేసి "తండ్రీ, నాకు ఏమి ఆనతి" అని అడిగాడు. "సతీదేవి శరీరమును విడిచిపెట్టింది. దక్షయజ్ఞమును ధ్వంసం చెయ్యి" అన్నాడు శంకరుడు.

వీరభద్రుడు ఒక పెద్ద శూలం పట్టుకు బయలుదేరాడు. ఆయనతో ప్రమథ గణములన్నీ వచ్చేస్తున్నాయి. ఆ శబ్దమును యాగంలో వున్న వాళ్ళు విన్నారు. దక్షప్రజాపతి భార్య "ఉపద్రవం వచ్చేసింది" అనుకుంది. వీరభద్రుడు రుద్రగణములతో కలిసి యజ్ఞమంటపములన్నిటినీ పడగొట్టేశాడు. పిమ్మట నందీశ్వరుడు భ్రుగువు దగ్గరకు వెళ్ళాడు. "ఆనాడుసభలో శంకర నింద జరుగుతుంటే కళ్ళు ఎగుర వేసిన వాడివి నీవేకదా! ఇప్పుడు దానికి తగిన శిక్ష అనుభవిస్తావు" అని గడ్డం క్రింద ఎడమచెయ్యి వేసి పట్టుకొని ముంజికాయను బొటనవ్రేలు పెట్టి పైకెత్తేసినట్లు బొటనవేలితో రెండు కనుగుడ్లు ఉత్తరించేశాడు. అప్పుడు భ్రుగుడి కళ్ళు ఊడి క్రిందపడిపోయాయి. "పూష" అనే సూర్యుడు ఉన్నాడు. "ఏమయ్యా, నువ్వు శంకర నింద జరుగుతుంటే పెద్దగ నోరు తెరచి నవ్వావు. ఇప్పుడు నీకు శిక్ష చూడు" అని ఆయన నోటిని గట్టిగా పట్టుకుని నొక్కారు. రెండు దవడలు తెరిచి పళ్ళు పీకేశారు. ఆఖరున వీరభద్రుడు దక్షప్రజాపతి దగ్గరకు వెళ్ళాడు. ఆయనను క్రిందపారేసి గుండెలమీద ఎక్కి కూర్చుని కత్తితో కంఠమును కోసేశాడు. కంఠం తెగలేదు. ఆశ్చర్యపోయాడు. దక్షుని శరీరం అంతా మంత్రపూత మయిపోయి వుంది. ఎలా త్రుంచాలా అని ఆలోచించాడు." ఈ దుర్మార్గుడు శివ నింద చేసినందుకు యజ్ఞ పశువు శరీరమును ఎలా తుంచేస్తామో అలా తుంచేస్తాను అని గుండెల మీద కుడి కాలు వేసి తొక్కిపట్టి తోటకూర కాడను తిప్పెసినట్లు కంఠమును తిప్పేసి ఊడబెరికి దానిని తీసుకువెళ్ళి యజ్ఞంలో వెలుగుతున్న అగ్నిహోత్రంలో పారవేశాడు. ఆ శిరస్సు యజ్ఞంలో కాలిపోయింది. తలలేని మొండెం ఉండిపోయింది. అక్కడ వాళ్ళని రక్షించిన వాడు లేదు. శివనింద ఎంత ప్రమాదకరమో, భగవంతుని యందు భేద దృష్టి ఎంత ప్రమాదకరమో వ్యాసుల వారు జాతికి భిక్ష పెట్టి చెప్తున్నారు. మనం ఈశ్వరుడిని ఒక్కడిగా చూడడం నేర్చుకోవాలి. లేకపోతే పాడైపోతాము. అప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి "అయ్యా, పాపకర్మ చేశాము దానివలన ఇంత ఉపద్రవం వచ్చింది. ఏమి చేయమంటావు" అని అడిగారు.

అపుడు బ్రహ్మగారు "పరమేశ్వరుడికి యజ్ఞంలో హవిస్సులు లేకుండా యజ్ఞం చేశారా? ఎందుకు ఆ యజ్ఞం? మీకు ఒక్కటే మార్గం ఉంది. మీరు ఎవరిపట్ల తప్పు చేశారో వాని దగ్గరకు వెళ్ళి కాళ్ళమీద పడిపోండి. ఎన్ని తప్పులు చేసినా ఆయన కాళ్ళమీద పడిపోతే మరల రక్షిస్తాడు" అని సలహా చెప్పాడు. అపుడు వాళ్ళు "మాతో నీవు కూడా రావలసింది" అని ప్రార్థించారు. "సరే పదండి" అని బ్రహ్మగారు వీరిని తీసుకొని కైలాసం వెళ్ళారు. వీరు వెళ్లేసరికి అత్యంత ప్రశాంతచిత్తుడై ఒక రావిచెట్టు క్రింద శంకరుడు కూర్చుని ఉన్నాడు. బ్రహ్మగారు వెళ్ళి పరమశివుని ముందు స్తోత్రం చేశారు. అయ్యా, తెలియక నీపట్ల దోషం చేశారు. నీవు సాక్షాత్తు పరబ్రహ్మవు. సృష్టి,స్థితి,లయలు ఈ మూడూ నీయందు జరుగుతుంటాయి. తెలియనటువంటివారు ఈ రకంగా అపచార బుద్ధితో ప్రవర్తించారు. వీరిని క్షమించు" అన్నారు బ్రహ్మగారు. మహానుభావుడు భోళాశంకరుడు కదా! అభయంకరుడు. "మీ అందరికీ నిష్కల్మష చిత్తంతో అభయం ఇస్తున్నాను." యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు. ఎవరు యజ్ఞము చేయాలో అటువంటి దక్ష ప్రజాపతికి ఈవేళ ముఖం లేదు. అందుకని దక్షుని మొండెమునకు గొర్రె ముఖమును తీసుకువెళ్ళి అతికించండి. మిగిలిన యజ్ఞభాగాన్ని పూర్తిచేస్తాడు. పూష తానూ ఏదయినా తినవలసి వచ్చినపుడు యజమాని దంతములతో తింటాడు. భ్రుగునికి నేతములు ఇస్తాను. కానీ ఇకనుంచి తాను తినవలసినటువంటి హవిస్సులు భ్రుగువుకి కనపడతాయి. ఎవరెవరు దెబ్బలు తిన్నారో ఎవరెవరు అంగవికలురు అయ్యారో వాళ్ళందరికీ తిరిగి స్వాస్థ్యమును ప్రసాదిస్తున్నాను. ఈ యజ్ఞమును సంతోషంతో పూర్తి చేసుకోండి" అని వరములను ఇచ్చేశాడు. దక్షప్రజాపతికి గొర్రె తలకాయ తీసుకు వెళ్ళి పెట్టారు. వెంటనే ఆయన లేచి నిలబడి పరుగెత్తుకుంటూ కైలాసమునకు వచ్చి శంకరుణ్ణి చూసి ప్రార్థన చేశాడు. "స్వామీ నీవు నన్ను దండించడాన్ని రక్షణగా భావిస్తున్నాను. దీనివలన ఇక భవిష్యత్తులో ఎప్పుడూ ఎవరూ ఇటువంటి అపరాధములు చేయకుందురు గాక! స్వామీ నన్ను మన్నించు" అని నమస్కరించాడు. వెళ్ళి యాగమును పూర్తిచెయ్యి అన్నాడు శంకరుడు. తరువాత దక్ష ప్రజాపతి తన యజ్ఞమును పూర్తిచేసి శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తే అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. "స్వామీ నీవు యజ్ఞభర్తవి అని నమస్కరించాడు. ఎవరు దక్షయజ్ఞ ద్వంసమును చదువుతున్నారో వారికి తుట్టతుద ఊపిరి తీస్తున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి శివనామమును చెప్తూ కైవల్యమును పొందగలరు. అటువంటి గొప్ప ఫలితమును దక్షయజ్ఞ ధ్వంసమునకు ప్రకటించారు.⁠⁠⁠⁠