కథలు - భాగవతాలు : దితి - కశ్యపుడు
తృతీయ స్కంధము - దితి - కశ్యపుడు
కశ్యప ప్రజాపతికి పదమూడుమంది భార్యలు. ఆయన తన 13మంది భార్యలతోను ధర్మ బద్ధమయిన జీవితం కొనసాగిస్తున్నాడు. ఒకరోజు సాయంకాలం ఆయన అగ్నికార్యం చేసుకుంటున్నాడు. అసుర సంధ్యాసమయం ప్రారంభం అయింది. ఆయన సాక్షాత్తుగా రాశీ భూతమయిన తపశ్శక్తి. అటువంటి మహానుభావుడు. ఆయన దగ్గరికి "దితి" వచ్చి ఆయనతో ఒక మాట అంది - "నామీద మన్మథుడు బాణ ప్రయోగం చేశాడు. నేను ఆ బాణ ప్రయోగపు తాకిడికి తట్టుకోలేక నిలువెల్లా కదిలిపోతున్నాను. నీవు నా భర్తవి. అందుచేత నీవు నన్ను అనుగ్రహించి నాలో కలిగిన ఈ కామావేశమునకు ఉపశాంతిని కలిగించు" అని చెపుతూ ఆవిడ ఒకమాట చెప్పింది. "నేను ఇలా అడగడం వెనకాల ఒక రహస్యం ఉంది" అంది. "అదేమిటో చెప్పవలసింది" అని అడిగాడు కశ్యపుడు.
ఆవిడా అంది "నీకు 13మంది భార్యలు ఉన్నారు. మేమందరం ఏకగర్భ సంజాతులం. 13 మందినీ ప్రజాపతి నీకిచ్చి వివాహం చేశాడు. అందులో 12మందికి సంతానం కలిగారు. ఇంకా నాకు సంతానం కలుగలేదు. సాధారణంగా భార్యాభర్తల అనుబంధంలో ఒక గొప్ప సిద్ధాంతం ఉంది. "ఆత్మావై పుత్రనామాసి" - భర్త భార్యకు అపురూపముగా ఇచ్చే కానుక ఏది? తానే తన భార్య కడుపున మళ్ళా ఉదయిస్తాడు. ధర్మపత్ని విషయంలో అది ధర్మం. ఒక దీపమును పట్టుకు వెళ్ళి ఇంకొక దీపమును వెలిగిస్తాము. రెండు జ్యోతులు వెలుగుతున్నట్లు కనపడుతుంది. కానీ వత్తులు పొడుగు పొట్టి ఉండవచ్చు. ప్రమిదల రంగులలో తేడా ఉండవచ్చు. కానీ దీపశిఖ మాత్రం సమాన ధర్మమును కలిగి ఉంటుంది. దీపం చివర వెలుగుతున్న జ్యోతి మాత్రం ఒకటే. రెండు దీపముల జ్యోతికి తేడా ఉండదు. కాబట్టి తండ్రికి, కుమారుడికి భేదం లేదు. తండ్రికీ, కుమారుడికీ భేదం లేకపోయినా రెండుగా కనపడేటట్లు చేయగలిగిన శక్తి ఈ ప్రపంచంలో ధర్మపత్ని ఒక్కతే. ఆవిడ మాత్రమే ఈ అధికారమును పొంది ఉంటుంది. ఆయన తేజస్సును తాను గ్రహించి తన భర్తను కొడుకుగా ప్రపంచమునందు నడిచేటట్లు చేయగలదు. కాబట్టి నీ తేజస్సును నాయందు ప్రవేశపెట్టమని అడుగుతున్నాను. ధర్మమునకు లోపము ఎక్కడ ఉంది? నాకు సంతానమును కటాక్షించు" అంది. ఆవిడ ఎంత ధర్మబద్ధంగా అడిగిందో చూడండి!అపుడు ఆయన అన్నాడు - "దితీ! నీవంటి భార్య దొరకడం నాకు చాలా సంతోషం. కానీ ఒక్కమాట చెపుతాను వినవలసింది. ఇది ఉగ్రవేళ. అసుర సంధ్యా కాలంలో పరమశివుడు వృషభవాహనమును అధిరోహించి భూమండలం మీద తిరుగుతాడు. ఈ సమయంలో ఆయన వెనక భూత గణములు వెడుతూ ఉంటాయి. వాళ్ళు చాలా ఉగ్రమూర్తులై ఉంటారు. వాళ్లకి ఆ సమయంలో శివుడి పట్ల ఎవరయినా అపచారముగా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకోవచ్చునేమో కానీ, ఆయన చుట్టూ ఉన్న గణములు అంగీకరించవు. చాలా తీవ్రమయిన ఫలితమును ఇచ్చేస్తారు. అందుచేత కొంతసేపు తాళవలసినది. ఒక్క ముహూర్త కాలము వేచి ఉండు. నీకు కలిగిన కోరికను భర్తగా నేను తీరుస్తాను" అన్నాడు.
దితికి అటువంటి బుద్ధి కలిగింది. భాగవతంలో ధర్మ భ్రష్టత్వము ఎక్కడ వస్తుందో మీరు గమనించాలి. ఆవిడ ఒక వెలయాలు ప్రవర్తించినట్లు కశ్యప ప్రజాపతి పంచెపట్టి లాగింది. అపుడు ఆయన ఈశ్వరునికి నమస్కారం చేసి, తానూ ధర్మపత్ని పట్ల ఇంతకన్నా వేరుగా ప్రవర్తించకూడదు అనుకోని, ఆవిడ కోరుకున్న సుఖమును ఆవిడకు కటాక్షించి, స్నానం, ఆచమనం చేసి తన కార్యమునందు నిమగ్నుడయిపోయాడు. కొంతసేపు అయిపోయిన తరువాత దితికి అనుమానం వచ్చింది. చేయరాని పని చేశాను. దీని ఫలితము ఉగ్రముగా ఉంటుందేమోనని పరమశివుడికి, రుద్ర గణములకు క్షమాపణ చెప్పింది. కానీ అప్పటికి జరగవలసిన అపకారం జరిగిపోయింది. దితి చేసిన అకార్యమును భూత గణములలో భద్రాభద్రులు అనే వారు చూసి ఉగ్రమయిన ఫలితమును ఇచ్చేశారు.
పిమ్మట దితి కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి "అయ్యా, నా కడుపున పుట్టే బిడ్డలు ప్రమాదం తీసుకురారు కదా" అని అడిగింది. అపుడు కశ్యప ప్రజాపతి అన్నాడు "నేను వద్దని చెప్పాను. కానీ నీవు వినలేదు. నీ కడుపున పుట్టబోయే ఇద్దరు బిడ్డలు కూడా లోకకంటకులు అవుతారు. వాళ్ళు పుట్టగానే ఆకాశం నెత్తురు వర్షిస్తుంది. నక్కలు కూస్తాయి. వాళ్ళు కొన్నివేల స్త్రీల కళ్ళమ్మట నీళ్ళు కార్పిస్తారు. ఋషులను, బాలురను, బ్రాహ్మణులను, బ్రహ్మచారులను, వేదములను, దేవతలను అవమానపరుస్తారు. చిట్టచివరికి వాళ్ళు శ్రీహరి చేతిలో అంతమును పొందుతారు" అని చెప్పాడు.
ఈ మాటలను విని దితి బావురుమని ఏడ్చింది. "చివరకు నాకు ఇంత అపఖ్యాతా? దీనికి నీవారణోపాయం లేదా" అని అడిగింది. అపుడు కశ్యపప్రజాపతి "దీనికి పశ్చాత్తాపమే నివారణోపాయం. నీవు చాలా పశ్చాత్తాపం పడుతున్నావు. నీవు చేసిన దోషం పోదు. కానీ నీవు మహా భక్తుడయిన మనవడిని పొందుతావు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులలో ఒకనికి మహాభక్తుడయిన కుమారుడు పుడతాడు. నీ పశ్చాత్తాపము వలన ఒక మహాపురుషుడు, ఒక మహాభక్తుడు జన్మిస్తాడు. మనవడు అటువంటి వాడు పుడతాడు. కానీ అసురసంధ్య వేళలో నీవు చేసిన దుష్కృత్యము వలన కొడుకులు మాత్రం దుర్మార్గులు పుట్టి శ్రీహరిచేతిలో మరణిస్తారు" అని చెప్పాడు.
భాగవతం కాలస్వరూపం ఎలా ఉంటుందో, ప్రమాదములు ఎక్కడ నుండి వస్తాయో బోధ చేస్తుంది. దితి మహా పతివ్రత. అప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా! అసలు పిల్లలను కనడం మానివేసింది. కడుపులో ఉంచేసింది. వాళ్ళు బయటకు వస్తే చంపేస్తారేమోనని నూరు సంవత్సరములు గర్భమునందు ఉంచేసింది. అపుడు ఆ గర్భము నుంచి తేజస్సు బయలుదేరి లోకములను కప్పేస్తోంది. అపుడు అందరూ వెళ్ళి మళ్ళా మొరపెట్టుకున్నారు. దితి గర్భము నుండి వస్తున్న తేజస్సు లోకములను అపుడు అందరూ వెళ్ళి మళ్ళా మొరపెట్టుకున్నారు. దితి గర్భము నుండి వస్తున్న తేజస్సు లోకములను ఆక్రమిస్తోంది. కాబట్టి ఆవిడ బిడ్డలను కనేటట్టు చూడమని కశ్యప ప్రజాపతిని ప్రార్థించారు. అపుడు కశ్యప ప్రజాపతి దితితో - "నీవు చేస్తున్న పని సృష్టి విరుద్ధం. నీ బిడ్డలను కనవలసింది" అని చెప్పాడు. అపుడు దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించారు.
ఆ పుట్టేవాళ్ళు ఎలా ఉంటారో కశ్యప ప్రజాపతికి ముందరే తెలుసు. వాళ్లకి ఆ పేర్లు కశ్యప ప్రజాపతే పెట్టారు. అందుకే "హిరణ్య" ముందు పెట్టి ఒకనికి "అక్షి", రెండవ వానికి "కశిప" అని చేర్చి, ఒకనికి "హిరణ్యాక్షుడు", రెండవ వానికి "హిరణ్యకశిపుడు" అని పేర్లు పెట్టారు. ఒకడు కనబడ్డదానినల్లా తీసుకువెళ్ళి దాచేస్తాడు. ఒకడికి ఎంతసేపూ తానే గొప్పవాడినని, తానే భోగం అనుభవించాలని భావిస్తూ చివరకు యజ్ఞములు, యాగములు కూడా తన పేరు మీదనే చేయించుకుంటాడు. ఇద్దరూ అహంకార మమకారములే! ఈవిధంగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఇద్దరు దితి గర్భమునుండి జన్మించారు.
హిరణ్యాక్షుడు పుట్టీ పుట్టడం తోటే దుర్నిమిత్తములు అన్నీ కనబడ్డాయి. వాడు ఆకాశమంత ఎత్తు పెరిగిపోయాడు. వాడికి పుట్టినప్పటి నుంచి యుద్ధం చేయాలనే కోరికే! యుద్ధం కోసం అనేకమంది దగ్గరకు వెళ్ళాడు. చిట్టచివర సముద్రం లోపల ఉన్న వరుణుడి దగ్గరకి వెళ్ళాడు. వెళ్ళి "ఏమయ్యా, నీవు ఎక్కడో సముద్రంలో ఉంటావు. నా భుజముల తీట తీరాలి. అందుకని నీవు వచ్చి నాతొ యుద్ధం చెయ్యి" అన్నాడు. అపుడు వరుణుడు "నాకు నీతో యుద్ధం ఎందుకు? నీకోసం వచ్చేవాడు ఒకాయన ఉన్నాడు. నీవు ఎవరి చేతిలో చావాలని నిర్ణయం అయిందో వాడు వచ్చే సమయం అయిపొయింది. నీవు ఒక పర్యాయం సముద్రం మీదకు వెళ్ళు. ఆయన కనపడతాడు. ఆయనతో యుద్ధం చెయ్యి" అన్నాడు. ఈ విషయం వరుణుడు ఎలా చెప్పగలిగాడు? అంటే దీనికి వెనుక ఇంకొక ఆఖ్యానం కలుస్తుంది. భద్రాభద్రులు అనే రుద్ర గణములు చూసి దితి యందు ఉగ్రమయిన బిడ్డలు పుట్టాలని ఎప్పుడయితే నిర్ణయం జరిగిందో, అప్పుడు ఒక సంఘటన జరిగింది. పురాణము ఎంత శివ కేశవుల అభేదముగా నడుస్తుందో చూడండి!
తృతీయ స్కంధము - జయవిజయులకు శాపము.
శ్రీ మహావిష్ణువు దగ్గర జయ విజయులని ఇద్దరు పార్షదులు ఉన్నారు. వైకుంఠములో వారిద్దరూ ద్వారం దగ్గర నిలబడతారు. వైకుంఠమునకు ఏడు ద్వారములు ఉంటాయి. ఏడవ ద్వారం దాటి లోపలి వెళితే స్వామి దర్శనం అవుతుంది. జయవిజయులు ఏడవ ద్వారమునకు అటూ ఇటూ నిలబడి ఉన్నారు. అప్పుడు సనకసనందనాడులు స్వామి దర్శనార్ధమై అక్కడికి వచ్చారు. వాళ్ళు మహా జ్ఞానులు. నిరంతరమూ భగవంతుని పాదములయందు భక్తితో ఉండే స్వరూపం ఉన్నవారు. వారు ఏడవ ద్వారం దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు. అపుడు జయవిజయులు వారిని "లోపలికి వెళ్ళడానికి వీలు లేదు" అని అడ్డుపెట్టారు.
అపుడు సనకసనందనాదులు "ఇది వైకుంఠము. ఇక్కడ మాత్సర్యము ఉండదు. ఇక్కడ ఎవరికీ కూడా ఒకరి మీద ఒకరికి మత్సరము ఉండదు. అటువంటప్పుడు లోపలికి వెళ్ళి ఈశ్వరుని దర్శించుకుందుకు అభ్యంతరము ఎందుకు? మమ్మల్ని ఎందుకు ఆపినట్లు? లోపల ఉన్న స్వామి భక్త పరాధీనుడు. భక్తులయిన వారు వస్తే చాలు ఆయనే ఆర్తితో ఎదురువచ్చే స్వభావం ఉన్నవాడు. అటువంటి వాడు లోపల ఉంటే వెళ్ళడానికి మేము వస్తే మా హృదయంలో ఆయనను దర్శనం చేయాలన్న కాంక్ష తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డుపెట్టడం మీకు మించిన స్వాతంత్ర్యము. కాబట్టి ఏది ఎక్కడ ఉండకూడదో దానిని మీరు చూడడం మొదలు పెట్టారు. కాబట్టి అది ఎక్కడ పుష్కలంగా దొరుకుతుందో ఆ భూలోకమునకు పొండి" అన్నారు. అనేటప్పటికి జయవిజయులిద్దరూ సనకసనందనాడులు కాళ్ళ మీద పడి పెద్ద ఏడుపు మొదలు పెట్టారు.
ఇప్పుడు శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చాడు. ఆయన శరీరం మీద నల్లని పుట్టుమచ్చ ఒకటి ఉంటుంది. ఆ పుట్టుమచ్చను శ్రీవత్సము అని పిలుస్తాము. ఆ పుట్టుమచ్చను చూసి, ఆయన స్వరూపమును చూసి సనక సనందనాదులు పొంగిపోయారు. "మా అదృష్టం పండి ఇంతకాలం తర్వాత నీ స్వరూపమును దర్శనం చేయగలిగాము. మా భాగ్యం పండింది" అని ఆయన పాదముల మీద పడి నమస్కారం చేసి "పుష్పములో చేరే గండు తుమ్మెద ఎలా చేరుతుందో నిరంతరమూ నీ పాదములయందు అటువంటి భక్తి మాకు ప్రసాదించవలసింది" అని ప్రార్థించారు.
అపుడు శ్రీమన్నారాయణుడు - "మీ స్తోత్రమునకు నేను చాలా సంతోషించాను. కానీ ఇక్కడ ఏదో చిన్న అల్లరి జరిగినట్లు నాకు అనిపించింది. ఏమయింది?" అని అడిగాడు.
అపుడు వాళ్ళు - "స్వామీ మేము తప్పే చేశామో ఒప్పే చేశామో మాకు తెలియదు. కానీ మేము లోపలకి వస్తున్నప్పుడు ఏడవ ద్వారం దగ్గర ఈ పారిషదులు మమ్ములను అడ్డుపెట్టారు. మత్సరములు ఉండడానికి అవకాశం లేని వైకుంఠమునందు నీ దర్శనమునకు మమ్మల్ని పంపలేదు కనుక, వారు మాయందు విముఖులయి ఉన్నారు కనుక వారిని భూలోకమునందు జన్మించమని శపించాము. ఇప్పుడు నీవు ఎలా చెపితే అలా ప్రవర్తిస్తాము. ఒకవేళ మావలన అపరాధం అంటే మన్నించవలసినది" అన్నారు.
అపుడు శ్రీహరి - "నా పాదములు మీవంటి బ్రహ్మ జ్ఞానులు నమ్మి అర్చించిన పాదములు. కనుక ఇంతమంది చేత ఆరాధింపబడుతున్నాయి. మీవంటి వారిచేత పూజించబడి మిమ్మల్ని రక్షించుటకు పూనికతో తిరిగి మీకు దర్శనం ఇస్తాను కనుక, నిత్యాపాయినియై నిరంతరమూ లక్ష్మి నావెంట వస్తోంది. నేను భక్త పరాధీనుడను. భక్తులయిన వారు పిలిస్తే పరుగెత్తుకు వెళ్ళడం నా ధర్మం. ఒకవేళ అలా పరుగెత్తుకు వెళ్ళి వాళ్ళని రక్షించడంలో అడ్డువస్తే నా చేతిని నేను నరికేస్తాను" అన్నాడు. ఎంతపెద్ద మాటో చూడండి! ఎందుకు అంటే ఆ చేయి లోకములనన్నిటిని రక్షించే చేయి. అటువంటి మీరు నిరంతరమూ నన్ను తప్ప వేరొకరిని కొలవని వారు, ఎప్పుడూ నా పాదముల యందు మనస్సు పెట్టుకున్నవారు, చతుర్ముఖ బ్రహ్మ అంతటి వారు సంసారమునందు ప్రవర్తించి సృష్టి చేయమంటే చేయకుండా కేవలము నా పాదపంజరము చేరారు. వీళ్ళు మహాపచారం చేశారు. వీళ్ళు చేసిన అపచారం వలన నా కీర్తి నశిస్తుంది." ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమయిన విషయమును ప్రతిపాదన చేశారు.
"నేను ఎందుకు మీరు ఇచ్చిన శాపమును అంగీకరిస్తున్నానో తెలుసా! వీరికి యుక్తాయుక్త విచక్షణ లేదు. వీళ్ళకి ఈ అధికారం నేను ఇచ్చాను. ఏడవ ప్రాకార ద్వారము వద్ద వుండి వచ్చిన వాళ్ళని లోపలి పంపించండి అని చెప్పాను, లోపలికి ఎవరు వెళ్ళాలి, ఎవరిని తొందరగా ప్రవేశపెట్టాలి అని అంతరము తెలుసుకొని, ముందు వాళ్ళకి నమస్కారం చేసి, లోపలి ప్రవేశ పెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు అక్కడ ఉండాలి. వీళ్ళు అలా ఉండలేదు. పరమ భాగవతులయిన వారికి కలిగిన మనఃక్లేశము పట్టి కుదిపేస్తుంది. మీలాంటి వారిని కాపాడడానికి నేను లోపల ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు నావద్దకు రాకుండా వీళ్ళు అడ్డుపడ్డారు. తన శరీరమునందు పుట్టిన కుష్ఠు తనని పాడు చేసినట్లు, నేను వీళ్ళకి పదవి ఇస్తే ఆ పదవిని అడ్డు పెట్టుకుని ఈ జయవిజయులు నాకే తప్పు పేరు తీసుకువస్తున్నారు. మీవంటి వారికే వైకుంఠమునందు ప్రవేశము నిరాకరింప బడితే భక్త కోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది? లోకము పాడయిపోతుంది. నేను భక్త పరాధీనుడను. అటువంటి నాకు దుష్ట పేరు తెచ్చారు. కాబట్టి వాళ్ళను మీరు శపించడం కాదు నేను చెపుతున్నాను."
"వీళ్ళు ఉత్తర క్షణం భూలోకమునకు వెళ్ళి రాక్షసయోని యందు జన్మించి ఉగ్రమయిన రాక్షసులై అపారమయిన లోభత్వమును పొందుతారు" అన్నాడు.
అప్పుడు జయవిజయులిద్దరు శ్రీమన్నారాయణుడి చరణారవిందముల మీద పడి "స్వామీ, లోపల ఉన్నవాడి హృదయమును అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది. మమ్ములను క్షమించు. మళ్ళా మాకు ఎప్పుడు వైకుంఠమునకు ఆగమనం" అని అడిగారు. అపుడు స్వామి "మీరు మూడు జన్మలలో గొప్ప రాక్షసులు అవుతారు. కానీ మిమ్మల్ని మళ్ళా దునుమాడవలసిన అవసరం కూడా నాదే. అందుకని నేనే మీ కోసం అవతారం స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి మళ్ళా తెచ్చి నా వాళ్ళుగా చేసుకుంటాను" అని ప్రతిజ్ఞ చేశాడు. అందులో కూడా రక్షణే!