పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

కథలు - భాగవతాలు : గజేంద్రమోక్షం

అష్టమ స్కంధము - గజేంద్రమోక్షం -1

గజేంద్రమోక్షం సన్నివేశం చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం. "గజ" అనే అక్షరములను కొంచెం అటూ ఇటూ మారిస్తే "జగ" అవుతుంది. "జ" అంటే "జాయతే". "గ" అంటే "గచ్ఛతే". "జాయతే" అంటే వెళ్ళిపోవడం. "గచ్ఛతే" అంటే రావడం. వచ్చి వెళ్ళిపోయేది ఏది ఉన్నదో దానిని "జగము" అంటారు. శాశ్వతంగా ఉండిపోయేది ఉండదు. అలా ఏదయినా ఉండిపోయేది ఉన్నట్లయితే దానిని ఈశ్వరుడు అని పిలుస్తాము. ఈ జగము కథ ఇప్పుడు గజముగా చెప్పాలి. అదే గజేంద్రమోక్షంలో ఉన్న రహస్యం.

గజముగా ఎందుకు చెప్పాలి? అంటే ఈ ప్రపంచంలో ఏనుగు ఒక్కదానికి మాత్రమే ఒక బలహీనత ఉంది. భూమినుండి చాలా తక్కువ ఎటు మాత్రమే ఎగరగలిగిన ప్రాణి ఏనుగు ఒక్కటే. ఏనుగు పైకి ఎగరలేక పోవడానికి దాని శరీరబరువే దానికి అడ్డు వస్తుంది. మనిషి ఈశ్వరుడి వైపుకి ఊర్ధ్వ గతికి ఎందుకు నడవలేడు? అతని సంసారమే అతనికి బరువై ఉంటుంది. మగ్నత పెంచుకుంటున్న కొద్దీ సంసారం బరువైపోతూ ఉంటుంది. నిజమునకు అది ఏనుగు కథా లేక మన కథా? నిజంగా మీరు ఏనుగు కథగా విన్నా కూడా గజేంద్రమోక్ష కథను వింటే విశేషమయిన శుభ ఫలితం కలుగుతుందని ఆఖరున ఫలశ్రుతిలో చెప్తారు. నిత్య పారాయణము చేయవలసినది అని నిర్ణయింపబడిన కథ గజేంద్రమోక్ష కథ. అలాంటి గజేంద్రమోక్షం జీవితంలో ఒక్కసారి విన్నా చాలు. వారికి అపారమయిన ఫలితం కలుగుతుంది. సాధారణంగా ఫలశ్రుతిని ఎవరు గ్రంథమును రచించారో వారు చెబుతారు. గజేంద్రమోక్ష సన్నివేశంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఫలశ్రుతిని చెప్పారు. ఈ గజేంద్రమోక్ష కథా శ్రవణము ఒక పూజకాదు, ఒక కర్మ కాదు.

పరీక్షిత్తుతో శుకుడు ఏమన్నాడంటే "ఒకానొక మన్వంతరంలో శ్రీహరి ఒక ఏనుగును ఒక మొసలి పట్టుకుంటే ఆ ఏనుగు ప్రార్థన చేస్తే ఆయన వైకుంఠము నుండి కదలివచ్చి రక్షించాడు" అని తరువాతది చెప్పబోతున్నారు. అప్పుడు పరీక్షిత్తు "స్వామీ, ఏమిటా కథ? అంత విచిత్రంగా చెప్పారు" అన్నాడు. అపుడు శుకబ్రహ్మ పరీక్షిత్తు ఆర్తికి సంతోషించి గజేంద్రమోక్ష కథను చెప్పడం ప్రారంభించారు.

ఒకానొకప్పుడు క్షీరసాగరం ఉన్నది. అందు త్రికూటాచలం అనే పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతమును మూడు శిఖరములు ఉన్నాయి. ఒక శిఖరము బంగారముతోను, మరొక శిఖరము వెండితోను, మూడవది ఇనుముతోను చేయబడ్డాయి. అందు ఎన్నో రకముల వృక్షములు, తీగలు పెరుగుతూ ఉండేవి. ఈ పరిసరములలో ఎన్నో రకములయిన జంతువులు ఉండేవి. ఏనుగులు పెద్ద పెద్ద మందలుగా వెళ్ళిపోతూ ఉండేవి. ఆ ఏనుగులు బయటకు వస్తే అరణ్యంలో ఒక్క పులి మిగలదట. చామరీ మృగములు ఏనుగుల గుంపు చుట్టూ నిలబడి వాటి తోకలనే చామరములతో ఏనుగులకు విసిరేవి. ఆ ఏనుగులు ఎంత గొప్ప సేవలు అందుకున్నాయో చూడండి. అటువంటి ఏనుగులకు అధినాయకుడు ఒకాయన ఉండేవాడు. నాయకత్వం వహించే ఏనుగు కొన్ని ఏనుగులతో కలిసి దారి తప్పాడు. ఆ ఏనుగు ఆ మందకు రాజు. దానికి గల భార్యల సంఖ్య పదిలక్షల కోట్లు. జీవుడు ఒక్కడే కానీ ఎన్ని శరీరములో. ఈ పరివారంతో తిరుగుతున్నాడు. సంసారంలోకి ఎందుకు వచ్చాడో మరిచిపోయాడు. చాలా దూరం తిరిగాడు. నీటికోసం చాలా చోట్ల వెతికాడు. చిట్టచివరకు ఒక సరోవరం కనపడింది. అద్భుతమైన సరోవరం - అదే సంసారం. దీని ఒడ్డున వుండి నీరు త్రాగాలి. ఎందుకు అక్కడికి వచ్చాడో గుర్తు పెట్టుకోవాలి. కానీ ఈయన పొంగిపోయి అబ్బ! ఈ సరోవరం ఎంత బాగుందో అనుకుని తన భార్యలతో అ నీళ్ళలోకి దిగాడు. మిగిలిన పరివారం అంతా నీళ్ళలోకి దిగింది. ఇప్పుడు ఆయనకు ఒక కోరిక పుట్టింది. తానెంత మొనగాడో తన భార్యలందరికీ చూపించాలనుకున్నాడు.

తాగడానికి వెళ్ళినవాడు నీళ్ళు తాగడం మానివేసి గట్టిగా పాదములను ఊన్చుకుని నిలబడిన వాడై విపరీతమయిన శక్తితో తొండం నిండా నీళ్ళు లాగాడు. ఆ నీటివేగంతో లోపలి చేపలు వెళ్ళిపోయాయి. మొసళ్ళు వెళ్ళిపోయాయి. ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి. ఒకసారి భార్యల వంక చూశాడు. నీటిని తొండంలో నిలబెట్టాడు. ఇప్పుడు ఊన్చుకుని తొండమును పైకెత్తి ఆ నీళ్ళను ఆకాశం మీదకి విసిరాడు. ఇలా పైకి చిమ్మేసరికి లోపల ఉన్న గాలి శక్తితోటి తొండంలో వున్న చేపలన్నీ వెళ్ళిపోయి మీనరాశిలో పడిపోయాయి. అందులో ఉన్న ఎండ్రకాయలన్నీ కర్కాటక రాశిలో పడిపోయాయి. మొసళ్ళు అన్నీ మకరరాశిలో పడిపోయాయి. అలా మూడు రాశులలో పడేటట్లు కొట్టాడు. ఇది చూసి ఆకాశంలో తిరుగుతున్న దేవతలు ఆశ్చర్యపోయారు.

గజేంద్రుడు అలా చేసేసరికి దీనిని చూసి ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు చాలా సంతోషపడిపోయారు. అందరూ సరోవరంలో దిగి నీళ్ళు తాగేస్తున్నారు, చిమ్మేస్తున్నారు, తొండంతో కొట్టేస్తున్నారు. కనపడిన చిన్న మొసళ్ళను తొక్కి చంపేస్తున్నారు. పావుగంట అయేసరికి నీరు బురద అయిపోయి అంతా కల్మషం అయిపొయింది. ఇంత అల్లరి చేస్తుంటే, ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఒకరు చూశారు. గ్రహణంలో సూర్యుడిని పట్టినట్లు ఆ నీటిలో ఉన్న పెద్ద మొసలి చూసింది. ఈ ఏనుగులు చాలా అల్లరి చేస్తున్నాయి. ఈ అల్లరికి ఈ నాయక ఏనుగే ప్రధాన కారణము. దీనిని పట్టుకోవాలి అనుకుని తలపైకెత్తి చూసింది. భుగ భుగమనే చప్పుళ్ళతో పెద్ద పెద్ద బుడగలను పుట్టించి నీటిని జిమ్మీ తోక కొట్టి దూరం నుంచి చూసి నీటిలో మునిగి ఏనుగుకాలు ఎక్కడ ఉంటుందో పట్టేసుకుంది. మొసలి నీటి అడుగునుంచి పట్టుకోవడం అంటే సంసారం ఇంద్రియములు పట్టుకోవడం ఒక లక్షణం. కాలము నడిచి వెళ్ళిపోతుంటుంది. కాలాంతర్గతంగా మృత్యువు వస్తుంది. కాబట్టి మృత్యువు కాలును పట్టింది. ఇహ కదలడు. పట్టు విడిపించుకుందామని చూస్తోంది. ఇపుడు మిగిలిన కోరికలన్నింటినీ పక్కన పెట్టేసినట్లయితే ఏనుగుకి వున్న కోరిక ఒక్కటే. ఆ మొసలి పట్టు తప్పించుకుని గట్టు ఎక్కేద్దామని ఏనుగు చూస్తోంది. ఏనుగు గట్టెక్కకుండా నీళ్ళలోకి లాగేద్దామని మొసలి చూస్తోంది. ఇప్పడు గజరాజుతో కూడివున్న మిగిలిన పరివారం ఏమి చేస్తున్నారు?

మకరితోడ బోరు మాతంగ విభుని నొక్కరుని దించి పోవ గాళ్ళు రాక

కోరి చూచుచుండె గుంజరీ యూధంబు మగలు దగులు గారే మగువలకును!!

ఈ పద్యం ఒక్కటి రోజూ స్మరణ చేసుకుంటే చాలు. వైరాగ్యం వస్తుంది. ఆయన మాతంగ విభుడు. గొప్ప ఏనుగు. ఈయన నీళ్ళల్లో యుద్ధం మొదలు పెట్టినప్పుడు ఒడ్డున చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ రాజుగారు యుద్ధంలో నెగ్గి బయటకు వచ్చేస్తాడని గట్టుమీద వుండి చూస్తున్నారు. గజేంద్రుడు అలా ఎంతకాలం యుద్ధం చేశాడంటే వెయ్యేళ్ళు యుద్ధం చేసింది. అలా పట్టుకున్న మొసలి పట్టు తప్పుకోలేక అప్పుడు ఏనుగు అనుకుంటుంది "అయ్యో! భూమిమీద ఉంటే నాకు బలం. నిష్కారణంగా నీళ్ళలోకి ప్రవేశించాను. ఈ నీళ్ళలోకి ప్రవేశించిన తరువాత "నావారు" అనుకున్న వారు వెళ్ళిపోయారు. ఒక్కడినే సరోవరంలో నిలబడిపోయాను. ఇప్పుడు నన్ను రక్షించే వారు ఎవరు?" అని ఆ ఏనుగు అనుకుంటూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఇంతకు పూర్వం అతడు చేసిన పుణ్యం పూజ వలన ఆ స్థితిలో జ్ఞాపకమునకు వచ్చింది.

పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యముల వల్ల ఈనాడు స్మృతిలోకి వచ్చిన జ్ఞానము నొకదానిని ఏనుగు ప్రకటన చేస్తోంది.

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;

యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం

బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైనవాఁ

డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్!!

ఎవరు సృష్టికర్తో, ఎవరు స్థితి కార్తో, ఎవరు ప్రళయ కర్తో, లోకములన్నిటిని ఎవరు సృష్టించారో, ఎవరు యందు లోకములు ఉన్నాయో. లోకములు ఎవరియందు పెరుగుతున్నాయో, లోకములు ఎవరి యందు లయము అయిపోతున్నాయో. ఎవరు అంతటా నిండి నిబిడీ కృతమై ఉన్నాడో, ఎవరి మాయ చేత ఇది జగత్తుగా కనపడుతున్నదో అటువంటి వాడు నన్ను రక్షించుగాక!" అని స్తోత్రం చేస్తోంది. ఏనుగు చేసిన ప్రార్థనకు ముప్పది మూడుకోట్ల దేవతలు లేచి నిలబడ్డారు.

లోకంబులు లోకేశులు

లోకస్థులుఁ దెగినఁ తుది నలోకం బగు పెం

జీకఁటి కవ్వల నెవ్వఁడు -

నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్!!

లోకములు, దీనిని పరిపాలిస్తున్నామని అనుకుంటున్న రాజులు, దేవతలు, ఈ లోకంలో ఉన్నామని అనుకున్న వాళ్ళు, ప్రళయం వచ్చి ఇవన్నీ ఒక్కటై పోయి నీరై పోయి ముద్దయి పోయి, గాడాంధకారం కమ్మేస్తే ఈ గాడాంధకారమునకు అవతల తానొక్కడే పరంజ్యోతి స్వరూపమై వెలిగిపోతున్నాడు.

ఎటువంటి మహాపురుషుడయిన వాడు, తానొక్కడే వుండి. అనేకులుగా కనపడుతున్న వాడెవడో అలాంటి వాడిని ఎవరూ స్తుతి చెయ్యలేరో, ఆయన చేసే పనులను ఎవరు గుర్తుపట్టలేరో ఎవరూ చెప్పలేరో అటువంటి వాడు నన్ను రక్షించుగాక!" దేవతలు ఎవరి మటుకు వాళ్ళు ఏనుగు తమను ప్రార్థించడం లేదని కూర్చున్నారు. దేవతలు అలా కూర్చోవడంలో ఒక రహస్యం కూడా ఉన్నది. ఇప్పుడు ఏనుగు అడుగుతున్నది రక్షణ. మొసలిని చంపి రక్షించాలి. అంటే రక్షణ చేసేవాడు స్థితికారుడై ఉండాలి. స్థితికారుడు శ్రీమహావిష్ణువు. కాబట్టి అందులో రక్షణ అంతర్లీనంగా ఉంది. కాబట్టి అందరూ దేవతలు ఎవరి మానాన వాళ్ళు కూర్చున్నారు. ఏనుగు ఎంత స్తోత్రం చేసినా మరి భగవంతుడు ఎందుకు రాలేదు? ఏనుగు ఇన్నీ చెప్పి చివర ఒకమాట అంది

కలడందురు దీనులయెడ గలడందురు పరమయోగి గణముల పాలం

గలడందు రన్ని దిశలను గలడు కలండనెడి వాడు గలడో లేడో!

ఇంతా చెప్తోంది కానీ దానికో అనుమానం. నిజంగా దీనులయిన వారు పిలుస్తే వస్తాడా? అంతటా ఉన్నాడు అని అంటారు. కానీ అలా ఉన్నాడని చెప్పబడుతున్న వాడు కలడు కలండనెడివాడు కలడో లేడో! అంది. ఆ ఏనుగుకి ఇంత అనుమానం ఉన్నప్పుడు తానెందుకు రావడం అని పరమాత్మ ఊరుకున్నాడు.

లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్

ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్

రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా!!

నీవు తప్ప నాకిప్పుడు దిక్కులేదు. నేను దీనుడిని. నా తప్పులన్నీ క్షమించు ఈశ్వరా! వరములను ఇచ్చేవాడా నీవు రావాలి. వచ్చి ఓ భద్రాత్మకుడా నన్ను రక్షించు అని పిలిచి స్పష్టమయిన శరణాగతి చేసింది. ఏనుగు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేస్తున్న సమయంలో పరమాత్మ తనను తాను మరిచిపోయి రావాలని ప్రార్థించింది. వైకుంఠము నుండి రావాలి.⁠⁠⁠⁠

అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా

పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో

త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ప్రసన్నుండు వి

హ్వల నాగేంద్రము పాహిపాహి యనగుయ్యాలించి సంరంభియై!!

ఎక్కడో వైకుంఠపురం లోపల వున్నాడు. బయట సనక సనందనాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు - ఆయన ధనుస్సు, కౌమోదకి అనబడే గద - అన్నీ పురుషాకృతులలో బయట ఎదురు చూస్తున్నారు. ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరం. దాని ప్రక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడిన పర్యంకము మీద అంతా అలంకారం చేయబడి పరచబడిన అరవిరిసిన కలువపువ్వులు, ఆ పువ్వుల మధ్యలో పడుకున్న లక్ష్మీ దేవి. ఆ లక్ష్మీదేవి ప్రక్కన కూర్చుని, ఆవిడ పైట కొంగును చేతితో పట్టుకొని వేళ్ళకు చుట్టుకొని చంటి పిల్లవానిలా ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు. అలాంటి స్థితిలో ఉన్నా సరే తనని ఎవరయినా పిలిస్తే ఒక్కసారి మనఃస్ఫూర్తిగా పిలిస్తే పరుగెత్తుకు వచ్చే లక్షణము ఉన్నవాడు, ఏనుగు తనను రక్షించమని దీనముగా ప్రార్థించేసరికి శరణాగతి చేసి దాని దురవస్థను గమనించాడు.

సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే

పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం

తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో

పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై!!

లక్ష్మీదేవికి చెప్పలేదు. చెప్పకుండా పమిట కొంగు పట్టుకుని అలాగే వెళ్ళిపోతున్నాడు. శంఖము, చక్రము, గద, పద్మము ఇవేమీ లేవు. నాలుగు చేతులు ఖాళీగా ఉన్నాయి. వెనక వస్తున్న పరివారంతో ఒకమాట మాట్లాడడు. తనను అధిరోహించమని గరుత్మంతుడు ఎదురువస్తున్నాడు. ఆయనని తోసి అవతల పారేస్తున్నాడు. ఆయనవి పెద్ద పెద్ద కళ్ళు. జుట్టు ఆ కళ్ళమీద పడిపోతోంది. ఆ జుట్టును వెనక్కి తోసుకోవడం కానీ వెనక్కి సర్దుకోవడం కానీ చేయడం లేదు. "అయ్యయ్యో! అలా పమిట పట్టుకు వెళ్ళిపోతున్నారేమిటి - వదలండి" అని వెనుకనుండి లక్ష్మీదేవి అంటోంది. కానీ ఆయన ఆమె మాట వినిపించుకోవడం లేదు. ఆ ఏనుగు ప్రాణములు రక్షించడం కోసమని ఆయన అలా వెళుతున్నాడు. ఒక్కనాడు పూజ చేయని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమమునకు స్వామి లొంగిపోయాడు. స్వామి ఎంత సౌజన్యమూర్తియో కదా!

తన వెంటన్ సిరి, లచ్చివెంట నవరోధ వ్రాతమున్, దానివె

న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ

క్రనికాయంబును, నారదుండు, ధ్వజినీ కాంతుండు, రావచ్చి రొ

య్యన వైకుంఠ పురంబునం గలుగువా రాబాల గోపాలమున్!!

ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. పచ్చని పట్టు పీతాంబరం కట్టుకుని అమ్మవారి కొంగు పట్టుకొని వెళ్ళిపోతుంటే, ఆవిడ తన కొంగును రెండు చేతులతో పట్టుకుని ఆయన వెనుక ఆవిడ గబగబా వెళ్ళిపోతుంటే ఆవిడ వెనుక అంతఃపుర కాంతలు అందరూ పరుగెడుతున్నారు. ఆ వెనుక గరుడ వాహనం పరుగెడుతోంది. శంఖము, చక్రము, కౌమోదకి, శార్ఙ్గమనే ధనుస్సు, బాణములు పెట్టుకునే తూణీరము, ఇవన్నీ కూడా ఆయన వెనుక పురుష రూపమును దాల్చి పరుగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. విష్వక్సేనుడు, నారదుడు వచ్చేస్తున్నారు. ఆ వైకుంఠములో ఉన్న ఆబాలగోపాలం వరకు అందరూ ఆకాశంలో వచ్చేస్తున్నారు.

వాళ్ళు అమ్మవారి దగ్గరకు వెళ్ళి "అమ్మా! ఆయన సంగతి నీకు తెలుస్తుంది కదా! అసలు ఆయన ఎక్కడికి వెళుతున్నాడు? అలా ఇంతకు పూర్వం ఎప్పుడయినా వెళ్ళాడా?" అని అడిగారు. అపుడు అమ్మవారు -"ఆయన అలా వెళ్ళిపోతున్నారు అంటే ఎవరో ఖలులు వేద ప్రపంచమును సోమకుడు తస్కరించినట్లు తస్కరించి ఉండవచ్చు. లేకపోతే ఏదయినా సభలలో ఆర్తి చెందిన కాంతలు గోవిందా అని ప్రార్థన చేస్తే వెడతారు. చిన్న పిల్లలను పట్టుకుని ఏదిరా పరమాత్మ ఎక్కడ ఉన్నాడో చూపించమని పెద్దవాళ్ళు ధిక్కరిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలను రక్షించడానికి వెడుతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి సందర్భములు ఏమైనా వచ్చినవేమో! అందుకని అలా స్వామి పరుగెడుతున్నారు" అంది.

అడిగెదనని కడువడి జని,

నడిగిన దన మగుడ నుడువడని నడ యుడుగున్

వెడ వెడ సిడి ముడి తడబడ,

నడు గిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!!

అలా వెడుతున్న అయ్యవారి అడుగుల్లో అమ్మవారి కాళ్ళు పడిపోతూ, ఇలా అడుగుతున్న వాళ్ళ మాటలకు జవాబులు చెప్పలేక, అమ్మవారి అడుగులు తడబడుతూ, అయ్యవారి వెనకాతల నడిచింది. అలా వెళ్ళిపోతుంటే చెవులకు పెట్టుకున్న తాటంకములు ఊగుతున్నాయి. అవి అమ్మవారి ఎర్రటి చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి. ఇంతలో దేవలోకములలో ఉన్నవాళ్ళు, మనుష్య లోకంలో ఉన్నవాళ్ళు ఏమిటో ఇంత వెలుతురుగా ఉన్నదేమిటని ఆకాశం వంక చూశారు. ఒక్కసారి ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడి పోయారు. తపస్సులు చేస్తే కనపడని వాడు ఈవేళ ఇలా వెళ్ళిపోతున్నాడు చూడండి చూడండి అని చూపిస్తున్నారు. జనులందరూ అలా వెళ్ళిపోతున్న వారిని చూస్తూ "నమో నారాయణా" అంటూ నమస్కారములు చేస్తూ నిలబడ్డారు. కానీ పరమాత్మ మాత్రం తొందరగా వెళ్ళి ఏనుగుని రక్షించాలని గబగబా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరకు వెళ్ళి నిలబడి సుదర్శన చక్రమును పిలిచి, వెళ్ళి ఆ మొసలి కుత్తుకను కత్తిరించమని చెప్పాడు. వెంటనే సుదర్శన చక్రం నీళ్ళలో పడింది. గుభిల్లుమని శబ్దం వచ్చింది. సుదర్శన చక్రం మొసలి కుత్తుకను కత్తిరించేసింది. సుదర్శన చక్రం మొసలి తలకాయను కోస్తుంటే మకరము అనే పేరు గలవి అన్నీ మిక్కిలి భయపడ్డాయి.

మకర రాశి సూర్యుని చాటుకు వెళ్ళి నక్కింది. నవ నిధులలో ఒక నిదియైన మకర నిధి భయపడిపోయి కుబేరుని చాటుకు వెళ్ళి దాగుంది. మొసలి అని పేరున్న ప్రతి మొసలి కూడా భయపడి అవి ఆదికూర్మం చాటుకు వెళ్ళి దాక్కున్నాయి. ఎప్పుడయితే సుదర్శనం మొసలి కుత్తుకను కత్తిరించి స్వామి చేతిని అలంకరించిందో ఆ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుని నావాడన్న వాడు, ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈయన ఒక్కడే. మిగిలినవి అన్నీ కృతకములే అని తెలుసుకుంది. అలా తెలుసుకున్నదై కాలు నొకసారి విదుల్చుకొని మెల్లగా ఒక తామరపువ్వును తీసుకుని మెల్లగా అడుగులు వేస్తూ గట్టెక్కుతోంది. గజరాజు బ్రతికేశాడని కబురు వెళ్ళింది. అంతే మరల అందరూ వచ్చేశారు. ఒక తామర పువ్వును తీసుకు వెళ్ళి శ్రీమన్నారాయణుడి పాదముల మీద పెట్టి కుంభస్థలమును వంచి నమస్కరించింది. దానిలో ఉన్న జ్యోతి బయలు దేరి శంఖచక్రగదాపద్మములతో శ్రీమన్నారాయణుని రూపమును పొంది ఆయన పక్కన వైకుంఠమునకు వెళ్ళిపోయింది. మొసలి చనిపోయినపుడు ఒక గంధర్వుడు బయటికి వచ్చాడు. ఆ గంధర్వుడు గంధర్వ లోకమునకు వెళ్ళాడు.

ఆ ఏనుగుకు అంత పుణ్యం ఎలా వచ్చిందో చెప్పమని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగాడు. అపుడు శుకుడు ఇలా చెప్పాడు. ఒకనాడు ఇంద్రద్యుమ్న మహారాజు గారు ద్రవిడ దేశమును పరిపాలించేవాడు. అష్టాక్షరీ మంత్రోపదేశమును పొంది అంతఃపురంలో అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదని ఊరికి చివరగా ఉన్న పర్వత శిఖరం మీద కూర్చుని అష్టాక్షరీ మంత్రం ఉపాసన చేద్దామని అక్కడికి వచ్చి మంత్రజపం చేస్తున్నాడు. అక్కడికి అగస్త్య మహర్షి వచ్చారు. తాను మంత్రజపం చేసుకుంటున్నాడు కదా అని రాజు లేవలేదు, పూజించలేదు. అగస్త్య మహర్షికి ఆగ్రహం వచ్చి మంత్రజలములను తీసి నీవు తమో గుణముతో ప్రవర్తించావు కాబట్టి ఏనుగు యోనియందు జన్మించెదవు గాక అని శపించారు. అగస్త్యునికి పూజ చేసి వుంటే ఆ జన్మలోనే మోక్షం పొంది ఉండేవాడు. మహా పురుషులయిన వారు మీ యింటికి ఏనాడు వస్తారో ఆనాడు మీపూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి. అందుకని ఈనాడు ఏనుగుగా పుట్టి గతజన్మలో చేసిన మంత్రానుష్టాన ప్రభావం వలన ఈ జన్మలో ప్రాణం పోయేటప్పుడు శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు. కాబట్టి ఒంట్లో ఓపిక వుండగా పుణ్యం చేసి నామం చెప్పుకోవడం నేర్చుకోవాలి. మొసలి లోంచి వచ్చిన గంధర్వుని పేరు "హూహూ". ఆయన ఒకనాడు గంధర్వ కాంతలతో కలిసి నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు. మద్యపానం చేసి ఉన్నాడు. పక్కన అప్సరసలు ఉన్నారు. మదోన్మత్తుడై ఉన్నాడు. అదేసమయంలో దేవల మహర్షి వచ్చి స్నానం చేస్తున్నారు. ఆయన తపస్వి. ఉరః పంజరం బయటకు వచ్చేసి బక్క చిక్కిపోయి ఉన్నాడు. అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాను కదా - హాస్యం ఆడితే వాళ్ళు నవ్వుతారనుకుని - మహర్షిని చూసి హాస్యం ఆడాడు. వాళ్ళని బాగా సంతోష పెడదామని నీటి కిందనుండి ఈదుతూ వచ్చి దేవల మహర్షి కాళ్ళు పట్టి లాగేశాడు. ఆయన అర్ఘ్యం ఇస్తూ నీళ్ళలో పడిపోయారు. పడిపోయి లేచి అన్నారు "నీకు నీటి అడుగునుండి వచ్చి కాళ్ళు పట్టి లాగడం చాలా సంతోషంగా ఉన్నది కనుక, నీళ్ళ అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటు వున్న మొసలివై జన్మించెదవు గాక" అని శపించారు. మహాత్ముల జోలికి వెళితే అలాంటివే వస్తాయి. కాబట్టి మొసలి అయి పుట్టాడు. ఈ జన్మలో శ్రీమన్నారాయణుని చక్రధారల చేత కంఠం తెగిపోయింది. మోక్షము రాలేదు. శాపవిమోచనం మాత్రమే అయింది. అందువలన గంధర్వుడై గంధర్వ లోకమునకు వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు భాగవతములో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు. ఒక్క గజేంద్రమోక్షం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ గజేంద్రమోక్షమును చెప్పి ఒడ్డున నిలబడిన శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పారు -"ఎవరయితే ఈ గజేంద్రమోక్షణమనే కథను శ్రద్ధగా వింటున్నారో, లేదా చేతులు ఒగ్గి నమస్కరిస్తూ ఈ స్వామి కథను వింటున్నారో అటువంటి వారికి దుస్స్వప్నముల వలన వచ్చే బాధలు పోతాయి. పాపములు పరిహరింపబడతాయి. దరిద్రము తొలగిపోతుంది. ఐశ్వర్యము కలిసివస్తుంది. గ్రహదోషముల వలన కలిగే పీడలు తొలగిపోతాయి. అపారమయిన సుఖము కలిగి మనశ్శాంతితో ఉంటారు. ఇంట్లో అస్తమాను మంగళ తోరణం కట్టి శుభకార్యములు చేస్తూనే ఉంటారు. అందునా విశేషించి గొప్ప గొప్ప వ్రతములు ఏమయినా చేసిన పిమ్మట గజేంద్ర మోక్షమును వినడం ద్విగుణీకృతమయిన పుణ్యం. ప్రతిరోజూ ఏ కోరికా లేకుండా ఈ పద్యములను అలా చెప్పుకునే అలవాటు వున్న బ్రాహ్మణుడు ఎవడు ఉన్నాడో అటువంటి బ్రాహ్మణుడు అంత్యకాలమునందు యమదర్శనము చేయడు. అతను శ్రీమన్నారాయణుని దర్శనమును పొంది ఆయన విమానంలో వైకుంఠమును చేరుకుని మోక్షమును పొందుతాడు అని శ్రీమన్నారాయణుడే స్వయంగా ఫలశ్రుతిని చెప్పారు.⁠⁠⁠⁠