కథలు - భాగవతాలు : కపిల గీత
తృతీయ స్కంధము - కపిల గీత
కపిల మహర్షి పెరిగి పెద్దవాడయ్యాడు. బిందు సరోవరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. కర్దమ ప్రజాపతి తన భోగోపకరణములనన్నిటిని భార్యకు ఇచ్చి వెళ్ళాడు. భర్త వెళ్ళిపోగానే ఇన్ని భోగోపకరణముల మీద దేవహూతికి వైరాగ్యం పుట్టింది. "నా భర్త అంతటి స్థితిని పొందాడు. నేను ఇంకా ఈ సంసార లంపటమునందు పడిపోయి ఉండి పోయాను. నేను కూడా ఉద్ధరింపబడాలి" అని అనుకుంది. అందుకని ఇప్పుడు దేవహూతి తన కొడుకు అయిన కపిల మహర్షి దగ్గరకు వెళ్ళి "నేను ఇంతకాలం మోహాంధకారంలో పడిపోయాను. ఈ ఇంద్రియముల సుఖములే సుఖములు అనుకొని ఈ సంసారమునందు ఉండిపోయాను. నీ తండ్రి సంసార సుఖములను అనుభవిస్తూ వైరాగ్య సంపత్తిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు. కాలమునందు నాకు కూడా సమయం అయిపోతున్నది. నేను ఏది తెలుసుకుని మోక్షమును పొందాలో అటువంటి తత్త్వమును నాకు బోధచెయ్యి" అని అడిగింది.
అప్పుడు కపిలుడు చెప్పడం మొదలుపెట్టాడు. దీనినే "కపిలగీత" అంటారు. కపిల గీత వినిన వాళ్లకి ఇంతకాలం ఏది చూసి సత్యమని భ్రమించారో, ఆ సత్యము సత్యము కాదన్న వైరాగ్య భావన ఏర్పడడానికి కావలసిన ప్రాతిపదిక దొరుకుతుంది. "అమ్మా, ప్రపంచంలో అనేకమయిన జీవరాశులు ఉన్నాయి. అందులో ప్రధానముగా మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైన జన్మ. ఈ దేహములు పొందిన వాటిలో ప్రాణములు కలిగినవి మొదట శ్రేష్ఠములు. చెట్లకి ప్రాణం ప్రాణం ఉన్నా చెట్లకన్నా గొప్పతనము ఒకటి ఉంది. స్పర్శ జ్ఞానము కలుగుట చేత వృక్షములకంటే స్పర్శ జ్ఞానము ఉన్నది గొప్పది. స్పర్శ జ్ఞానము ఉన్నదానికంటే రస జ్ఞానము ఉన్నది గొప్పది. రుచి కూడా చెప్ప గలిగినటువంటి ప్రాణి గొప్పది. దానికంటే వాసన కూడా చెప్పగలిగిన భృంగములు గొప్పవి. వాటికంటే శబ్దమును వినగలిగిన పక్షులు గొప్పవి. శబ్దములు వినగలిగిన దానికన్నా అనేక పాదములు ఉన్న జంతువు గొప్పది. దానికన్నా ఆవు, గేదె, మేక మొదలయిన నాలుగు పాదములు కలిగి సాధుత్వము ఉన్నవి గొప్పవి. నాలుగు పాదములు ఉన్న జీవికంటే శరభము రెండు పాదములు ఉన్న మనిషి గొప్పవాడు. రెండు పాదములు ఉన్న మనిషి సృష్టి యందు చాలా గొప్పవాడు.
అందరూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనం చేయలేరు. కాబట్టి ఆ స్వామి పరమ భక్తులయిన వారిని ఉద్ధరించడానికి ఒక మూర్తిగా వచ్చి నిలబడ్డాడు. ఒక మూర్తిని నీ హృదయ స్థానమునందు నిక్షేపించు. ఆ మూర్తిని ధ్యానం చెయ్యి. ధ్యానం అంటే ఎలా ఉండాలో తెలుసా! పరమ సంతోషంతో నీ మనస్సును ఆయన పాదారవిందముల దగ్గర చేర్చు. స్వామి సౌందర్యమును అనుభవించడం ప్రారంభిస్తే తేనేమరిగిన సీతాకోక చిలుకలా హృదయము దానియందే రంజిల్లడం మొదలిడుతుంది. అప్పుడు మనస్సుకి భోగములవైపు వెళ్ళాలని అనిపించదు. ప్రయత్నపూర్వకంగా భక్తియోగమును అనుష్ఠానం చేయాలి. చేతకాకపోతే కనీసం శ్రవణం చేయడం మొదలు పెట్టాలి. ఎవరు భాగవతులతో కూడి తిరుగుతున్నాడో, ఎవరు ధ్యానము లోపల చేయ గలుగుతున్నాడో, ఎవడు ఈశ్వరునియందు ఉత్సాహమును పెంచుకుంటున్నాడో వాడు పునరావృతరహిత శాశ్వత శివసాయుజ్యమును పొందుతున్నాడు" అని చెప్పాడు.
ఆ మాటలను విన్న దేవహూతి ఆ భోగములనన్నిటిని తిరస్కరించి శ్రీకృష్ణ పరమాత్మను హృదయమునందు నిలిపి ధ్యానము చేయసాగింది. ఈశ్వర స్మరణము వలన జ్ఞానము పొంది, ఈ విషయములు వినిన తరువాత ప్రయత్న పూర్వకముగా భోగములు మనను ఉద్ధరించేవి కావని తెలుసుకుని, వాటిని త్రోసిరాజని వైరాగ్యమును పొంది, భక్తి వైరాగ్యముల కలయిక వలన జ్ఞానమును పొంది, జ్ఞానమువలన మోక్షమును పొంది, శ్రీకృష్ణ భగవానుని యందు చేరి శాశ్వతమును పొందినది. ఇది జీవులందరినీ ఉద్ధరింపబడవలసిన మహోత్కృష్టమయిన్ గాథ.