పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

కథలు - భాగవతాలు : క్షీరసాగర మథనం

అష్టమ స్కంధము - క్షీరసాగర మథనం:

పంచమి ఉండగా ఉన్న శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆవిర్భవించగానే కేవలం ఆవిడ చూపుల చేత లోకములకన్నింటికి ఐశ్వర్యమును ఇచ్చింది. దానివలన మొట్టమొదట అనుగ్రహమును పొందినవాడు దేవేంద్రుడు. మనము ఐశ్వర్యమునకు గాని, అధికారమునకు గాని, భోగాలాలసతకు గాని, వైభోగమునకు కాని, ఇంద్రుణ్ణి ఒక హద్దుగా చెప్పుకుంటాము.

ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక అరణ్య ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఆయన సురాపానం చేసి రంభతో కలిసి విహరిస్తున్నాడు. ఆ సమయంలో అటుగా దుర్వాస మహర్షి వస్తున్నారు. ఆయన మహా బ్రహ్మజ్ఞాని. శంకరాంశ సంభూతుడు. ఇంద్రుడు ఆయనకు నమస్కారం చేశాడు. ఆయన చుట్టూ వున్న పరివారం దేవేంద్రుడిని కుశలం అడిగి దేవేంద్రుని ఆశీర్వచనం చేశారు. దుర్వాస మహర్షి చేతిలో ఒక పారిజాత పుష్పం ఉంది.

ఆ పారిజాత పుష్పమును ఈయన కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్ళినప్పుడు "మహానుభావా, ఈ పుష్పమును స్వీకరించండి" అని కృష్ణుడు ఇచ్చాడు. అది భగవంతునిచే స్వయంగా ఇవ్వబడినది. దీనిన్ ఈశ్వర నిర్మాల్యం అంటారు. లక్ష్మీదేవి అందులోనే ఉంటుంది. ఇంద్రుడు సురాపానం చేసి మదోన్మత్తుడై ఉన్నాడు. ఆ పువ్వును తీసుకున్నాడు. పువ్వును తీసుకున్నప్పుడు కళ్ళకు అడ్డుకుని పక్కన పెట్టాలి. ఈశ్వర నిర్మాల్యం అయినట్లయితే తలమీద కానీ చెవిలో కానీ పెట్టుకోవచ్చు. లేదా ఎవరూ తొక్కని చోట దానిని భద్రం చేయవచ్చు. ఇంద్రుడు ఆ పువ్వును తీసుకొని ఐరావతం మీదకి విసిరాడు. ఆ ఐరావతం విశేషమయిన తేజస్సును సంతరించుకుంది. అది భగవంతుని నిర్మాల్యం. అది దాని శిరస్సు మీద పడింది. అది దానిని స్వీకరించింది. అది తేజస్సును పొంది ఇంద్రుడిని మోయడం మానివేసి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అపుడు దుర్వాస మహర్షి ఇంద్రుడిని చూసి "నీవు ముకుంద పాదారవిందము నుండి వచ్చిన పారిజాత పుష్పమును తిరస్కరించావు. కనుక నీవు ఉత్తర క్షణం ఐశ్వర్య భ్రష్టుడవు అయ్యెదవు గాక! స్వర్గలక్ష్మి ఇప్పుడే బయలుదేరి స్వస్థానమయినటువంటి వైకుంఠములో ఉన్న మహాలక్ష్మిలో ఐక్యం అయిపోతుంది. ఇక నీకు స్వర్గంలో ఐశ్వర్యం ఉండదు" అన్నారు. ఈమాట వినగానే శత్రువులు వచ్చేస్తారు. ఐశ్వర్యం పోవడానికి ఒక కారణం ఉండాలి కదా! రాక్షసులు అందరూ వచ్చేశారు. చుట్టుముట్టి పడగొట్టేశారు. ఇంద్రుని ఐశ్వర్యం పోయింది. ఇప్పుడు, ఇంద్రునికి ఐశ్వర్యం పోవడానికి కారణం తెలిసింది. అపుడు దేవతలు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అపుడు బ్రహ్మగారు "అప్పుడప్పుడు నీవు కండకావారంతో ప్రవర్తిస్తూ ఉంటావు. ఒకప్పుడు బృహస్పతి జోలికి వెళ్లావు. ఇవాళ దుర్వాస మహర్షి జోలికి వెళ్ళావు. అందువలన ఐశ్వర్యం పోయింది. ఇపుడు నీకు మరల ఐశ్వర్యం ఆ పద్మనాభుడి అనుగ్రహంతోనే రావాలి. ఆయననే ధ్యానం చెయ్యాలి" అని కన్నులు మూసుకుని ధ్యానమునందు ఉన్నవాడి ఆ పరమాత్మను ధ్యానం చేసి పరమ సంతోషంతో చిరునవ్వు నవ్వాడు. అనగా ధ్యానమునందు ద్యోతకమైన నారాయణుడు ఒక మార్గోపదేశం చేశాడు.

ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు "ఇప్పుడు నీకు ఐశ్వర్యము పోయినది కదా! నీవయినా నేనయినా మరల ఐశ్వర్యము నిమ్మని శ్రీమన్నారాయణుని అడగాలి. ఆయన పాదముల మీద పువ్వును నీవు విసిరేశావు. అందుకు దుర్వాసునికి కోపం వచ్చింది. పరమాత్మకు కోపం రాదు. ఆయనా కోపం పెట్టేసుకుంటే ఇక లోకంలో ఉద్ధరించే వాడెవడు? పరమాత్మకి శాశ్వత కోపం ఉండదు. నీవు దుర్వాసుని నన్ను అర్థించడం వల్ల పరమాత్మ సంతోషిస్తున్నాడు. తప్పు చేసిన వాడు తనకు ఎంత దగ్గర వాడయినా పరమాత్మ శిక్షిస్తాడు. ఆయన శాశ్వతంగా ఎవరి పట్ల శత్రువు కాదు. శాశ్వత మిత్రుడు కాదు. మీ నడవడిని బట్టి ఆయన మిత్రత్వము కాని, శత్రుత్వము కానీ ఆవిష్కరింప బడుతుంది. ఇంద్రా! నేను కాని, దుర్వాసుడు కానీ, సమస్త దేవతలు కానీ ఎప్పుడు సంతోషిస్తామో తెలుసా? శ్రీమన్నారాయణుడికి మ్రొక్కి నమస్కరించినపుడే. మాకు నమస్కరించి శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందడం కాదు. శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తే మేమందరం నీకు ఆప్తులం అవుతాం. ఆయనను ప్రార్థన చేద్దాం" అన్నారు బ్రహ్మగారు.

ఆమాట చెప్పగానే ఇంద్రునికి ధైర్యం వచ్చింది. తప్పు చేసిన వాడిని పరమాత్మ రక్షిస్తాడు అనే జ్ఞానం కలిగింది.పశ్చాత్తాప ప్రకటన జరిగిందంటే వెంటనే స్వామి వరం ఇచ్చేస్తాడు. దితి సంధ్యాకాలంలో తప్పు చేసింది -హిరణ్యకశిపుడు పుట్టాడు. భర్త దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప పడింది. మనవడు ప్రహ్లాదుడు పుట్టాడు.తప్పు చెయ్యడం సహజం. పశ్చాత్తాప పడి మళ్ళీ ఆతప్పు చేయకుండా ఉండడం మంచి మనిషి లక్షణం. అపుడు ఇంద్రుడు తాను చేసింది తప్పు పనే అని, తనను మన్నించమని మనస్సులో అనుకుని స్వామిని ప్రార్థించాడు. అంతే! ఎక్కడికో వెళ్ళి కూర్చుని జీవితాంతం తపస్సు చేసిన వాళ్లకి దొరకని పరమాత్మ దర్శనం పశ్చాత్తాపం కలగగానే ఇంద్రునికి దొరికింది. వెంటనే పరమాత్మ ఇంద్రుని ఎదుట ప్రత్యక్షం అయిపోయాడు. అలా సగుణంగా కనపడగానే అందరూ చూడలేక కళ్ళు మూసేసుకున్నారు. ఎదురుగుండా ఉన్నదేదో అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు చూడడానికి కూడా ఈశ్వరానుగ్రహమే ప్రసరించింది. ఆయనను చూడడానికి ఆయన అనుగ్రహం కావాలి. అంతటా వ్యాపించిన ఆయన ఈ కంటితో చూడడానికి వీలుగా ఎదురుగుండా ఈశ్వరానుగ్రహంతోనే చూశారు. పరమాత్మ ప్రత్యక్షం అయేసరికి వీరందరి తరపున చతుర్ముఖ బ్రహ్మగారు పరమాత్మను ప్రార్థన చేశారు.

శ్రీమన్నారాయణుడు ఈ స్తోత్రం విని చాలా సంతసించాడు. "నీవు ఐశ్వర్యము పోయింది కదా అని విచారిస్తున్నావు. ఐశ్వర్యమేమిటి! ఈ శరీరమునకు యౌవనము పోకుండా; మృత్యువు రాకుండా; ప్రళయ కాలమునందు మాత్రమే మరల లీనమయేలా; వార్ధక్యం రాకుండా; ఐశ్వర్యం చెడకుండా; అనారోగ్యం రాకుండా; నిరంతరం తేజస్సుతో కనురెప్ప పడకపోయినా సరే; హాయిగా సమస్త తేజస్సును చూడగలిగి; భూమికి పాదము ఆనకుండా అంతటా తిరగగలిగిన; ఇన్ని శక్తులను ఈయగలిగిన అమృతమును మీకు ఇస్తాను" అని అన్నారు. అదీ ఈశ్వరానుగ్రహం అంటే. ఇంద్రుడు నోరు విప్పి ఏమీ అడగలేదు. పరమాత్మను మనసులో తలచుకొని "నాది తప్పే మహానుభావా" అన్నాడు. పరమాత్మ అమృతమును ఇస్తాను అంటున్నాడు. "మీరు అనేక ఓషధులను తీసుకురండి. గడ్డి తీసుకురండి. పువ్వులు తీసుకురండి. ఇవన్నీ పట్టుకు వెళ్ళి పాలసముద్రంలో వెయ్యండి. అపుడు మందర పర్వతమును తీసుకువచ్చి కవ్వంగా మెల్లగా పాలసముద్రంలోకి దించండి. దానికి వాసుకిని త్రాడుగా చుట్టండి. దేవతలు, దానవులు దానిని అటుఇటు పట్టుకోండి. ఇపుడు మీకు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు మీమాట వినరు. నాగుపాము కూడా ఎలుకను పట్టుకోవాలంటే కలుగులో నుంచి వచ్చి కాసేపు పడుకుంటుంది. దానవులను మట్టు పెట్టడానికి మీరు కొంచెం ఓర్పు వహించి స్నేహం చేయండి. వారిని క్షీర సాగర మథనమునకు తీసుకు వచ్చి సాగరమును చిలకండి. అపుడు అందులోంచి అమృతం పుడుతుంది. మొదట హాలాహలం వస్తుంది. అగ్నిహోత్రం వస్తుంది. భయపడకండి. పూనికతో మరల చిలకండి. చాలా గొప్ప గొప్ప వస్తువులు పుడతాయి. మనసు పారేసుకోవద్దు. నిగ్రహించుకొనండి. నేను ఇస్తే పుచ్చుకోండి. లేకపోతే ఊరుకోండి. ఎవరికీ ఏది ఇవ్వాలో నాకు తెలుసు. అది వాడికి ఇస్తాను.

ఇపుడు దేవతలు శ్రీమన్నారాయణుని మాటలు శ్రద్ధగా విని తప్పకుండా అలా చేస్తాం అని చెప్పి వారు బయలుదేరారు. మొట్టమొదట మందర పర్వతమును తీసుకువెళ్ళి సముద్రంలో పెట్టాలి. ఇపుడు దేవతలు త్వష్ట ప్రజాపతి దగ్గరకు వెళ్ళి తమకొక పెద్ద తవుకోలను తయారుచేసి ఇవ్వవలసినదని కోరారు. త్వష్టప్రజాపతి ఎందుకు? అని అడిగాడు. అపుడు దేవతలు "మేము మందర పర్వతమును కింద తవ్వేస్తాము. తరువాత దానిని ఊడబెరికి సముద్రం వద్దకు తీసుకువెడతాము. అలా చేయమని శ్రీమన్నారాయణుడు చెప్పాడు అని చెప్పారు. ఆయన వారు కోరిన విధంగా తవుకోలను చేసి ఇచ్చాడు. వారు దానిని తీసుకువెళ్ళి మందరపర్వతం అడుగు భాగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతుంటే పెద్ద గొయ్యి పడింది. ఇపుడు మందర పర్వతమును తీసుకువెళ్ళి సముద్రంలో దింపాలి. అందుకని డాన్ని కొన్ని తాళ్ళు వేసి దానిని ఊపుతున్నారు. అలా ఊపి మొత్తం మీద మందరపర్వతమును అందరూ కలిసి పైకి ఎత్తారు. అయితే అది పక్కకి ఒరిగిపోయి పడిపోయింది. ఈ సందర్భంలో దానికింద పడి కొందరు మరణించారు. అపుడు మిగిలిన వారందరూ ప్రక్కకు చేరి ఈ మందరపర్వతమును సముద్రము వరకు తీసుకుని వెళ్ళడానికి మనం శ్రీహరి సహాయం అడగలేదు. అడిగి ఉంటే ఆయనే వచ్చి మనకు సహాయం చేసి ఉండేవాడు. ఆయన వస్తే ఎంత బాగుండునో" అని అనుకున్నారు. వాళ్ళు ఈమాట అనుకునేసరికి బంగారు రంగులో ఉన్న గరుడ పక్షిమీద నుంచి శ్రీమన్నారాయణుడు క్రిందకి దిగి దేవతలను ఓదార్చి మందరపర్వతమును బంతివలె నేర్పుతో చేతితో పట్టుకుని, దానిని తీసుకుని మరల గరుడ వాహనం ఎక్కి వెళ్ళిపోయారు. శ్రీమన్నారాయణుడు పాల సముద్రం ఒడ్డున దిగి గరుత్మంతుడిని వెనక్కు పంపించి వేశాడు. చిలికేటప్పుడు వాసుకి శరీరం ఒరిసి పోకుండా మందరపర్వతమును నునుపుగా చెక్కించారు. వాసుకిని తీసుకు వచ్చి పర్వతమునకు చుట్టారు. ఇప్పుడు మందర పర్వతమును పాలసముద్రం లోకి పెట్టారు. ఇప్పుడు అది మునిగి పోకూడదు. అపుడు దేవతలను పిలిచి వారిని వాసుకి తలవైపు పట్టుకొనమని రాక్షసులను పిలిచి వారిని తోకవైపు పట్టుకొనమని చెప్పాడు. వెంటనే దేవతలు అందరూ వెళ్ళి వాసుకి తలవైపు పట్టుకున్నారు. అపుడు రాక్షసులు "మేము తోక పట్టుకోవడం ఏమిటి? మేము తలవైపు పట్టుకుంటాము" అన్నారు. అందుకు స్వామి వెంటనే ఒప్పుకుని రాక్షసులను తలవైపు పంపి దేవతలను తోకవైపు పట్టుకొనమని చెప్పారు. దేవతలు మారు మాట్లాడకుండా వాసుకి తోకవైపు వెళ్ళి తోకను పట్టుకున్నారు. స్వామి మాటల పట్ల దేవతలకి గల విశ్వాసం వారిని అమృతం తాగేటట్లు చేస్తుంది.⁠⁠⁠⁠

పామును మందరపర్వతమునకు చుట్టారు. అందరూ కలిసి తిప్పాలి. అది క్రిందకు జారిపోకూడదు. దేవదానవులిరువురూ చిలకడం ప్రారంభించారు. గిరగిరమని పర్వతం తిరిగింది. భుగభుగభుగమని పాలసముద్రం లేచింది. నురగలు లేచాయి. కెరటములు లేచాయి. పక్షులు, పాములు, తాబేళ్లు, చేపలు, మొసళ్ళు ఎగిరెగిరి పడుతున్నాయి. కొన్ని చచ్చిపోతున్నాయి. విపరీతమయిన ధ్వని చేస్తోంది. దానికి తోడు వీళ్ళ అరుపులు. అంత కోలాహలంగా ఎవరి మానాన వారు మందరపర్వతమును గిరగిర తిప్పెస్తున్నారు. అపుడు వాసుకి "మీరు సరిగ్గా చిలకడం లేదు వదలండి" అని కేకలు వేశాడు. వాళ్ళందరూ వాసుకిని వదిలేశారు. పట్టు తప్పిపోయి మందర పర్వతం జారి క్రిందపడిపోయింది. ఇపుడు అందరూ శ్రీమన్నారాయణుని వైపు చూశారు. ఎవ్వరూ గమనించలేని స్థితిలో ఆది కూర్మావతారమును స్వీకరించాడు. కొన్ని లక్షల యోజనముల వెడల్పయిన పెద్ద డిప్ప. ఆ దిప్పతో పాలసముద్రం అడుగుకి వెళ్ళి ఇంతమంది కదల్చలేని మందరపర్వతమును తన వీపుమీద పెట్టుకున్నాడు. ముందు వచ్చి తుండమును అటూ ఇటూ ఆడిస్తున్నాడు. తన నాలుగు కాళ్ళను కదల్చకుండా తానె ఆధారమయి, మందరపర్వతమును వీపుపై ధరించి ఉన్నాడు. ఆ కూర్మము నిజంగా ఆహారమును తినినట్లయితే ఈ బ్రహ్మాండములనన్నిటిని జీర్ణము చేసుకొనగలదు. అటువంటి వాడై ఆది కూర్మమై పాలసముద్రం క్రింద పడుకున్నాడు. ఇపుడు మందరపర్వతమును ఆదికూర్మం భరిస్తోంది. మరల మందరపర్వతమును వాసుకిని చుట్టి రాక్షసులు తలవైపు దేవతలు తోకవైపు ఉంది, మరల చిలకడం ప్రారంభించారు. భూమి అదిరిపోతోంది. సముద్రంలోంచి కెరటములు పైకి లేస్తున్నాయి. సిద్ధులు, చారణులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఆకాశంలో నిలబడిపోయి ఆ దృశ్యమును చూస్తున్నారు.

ఎక్కడో సత్యలోకంలో బ్రహ్మగారు భావ సమాధిలో ఉన్నారు. ఈ చప్పుడు ఆయన చెవుల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు. సత్యలోకంలోంచి బయటకు వచ్చి ఏమిటి ఈ చప్పుడు? అన్నారు. అక్కడి వాళ్ళు స్వామీ, పాలసముద్రమును చిలుకుతున్నారు. అందులో నారాయణుడు కూడా ఉన్నాడు అన్నారు. బ్రహ్మగారు కూడా పైనుంచి క్రిందకు చూస్తున్నారు. ముందు అమృతం రాలేదు. హాలాహలం ముందు పుట్టుకు వచ్చింది. అది ఒక్కసారి పాలసముద్రం మీద నుండి పైకి లేచింది. ప్రళయకాలంలో వుండే అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉంది. అది వెంట తరుముతుంటే దేవతలు రాక్షసులు అందరూ వాసుకిని వదిలిపెట్టి పరుగు మొదలు పెట్టారు. అన్ని లోకములలో అగ్నిహోత్రం ప్రబలి పోతున్నది. పరుగెత్తి పరుగెత్తి కైలాసపర్వతం మీద వున్న పరమశివుని అంతఃపురము దగ్గరకు వెళ్ళి అక్కడి ద్వారపాలకులు అడ్డు పెట్టగా వారిని పక్కకు తోసివేసి లోపలి ద్వారం దగ్గరకు వెళ్ళి అక్కడే నిలబడి రక్షించు అని అరుస్తున్నారు. స్వామి పరమశివుడు వీరి అరుపులు విని స్వామి ఏదో ఆపద సంభవించి ఉండవచ్చునని బయటకు వచ్చారు. వారు శంకరునితో "ఈశ్వరా! నీవు ఈ విశ్వమంతా నిండి నిబిడీ కృతమయిన వాడివి. నీవు తండ్రివి. మేము చెయ్యకూడని పని ఒకటి చేశాము. ఇంట్లో ఏదయినా శుభకార్యం చేతున్నప్పుడు మనకొక సంప్రదాయం ఉన్నది. ముందుగా తల్లిదండ్రులకు నమస్కారం చేసి వారికి బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు. కానీ దేవదానవులు ఆ పని చేయలేదు. స్వామికి నమస్కరించలేదు. అందుకని స్వామి వీళ్ళకి పాఠం నేర్పాలి అనుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు "మేము మందరపర్వతం పెట్టి సముద్రమును చిలికితే హాలాహలం జనించింది. లోకములను కాల్చేస్తోంది. దయచేసి దానిని నీవు స్వీకరించవలసినది" అన్నారు.

మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు

భేదమగుచు దుది నభేదమై యోప్పారు బ్రహ్మమవగ నీవ ఫాలనయన!!

నీవు భూతభవిష్యద్వర్తమానరూపములలో ఉంటావు. నీవే బ్రహ్మవిష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు. నీవే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త రూపంలో ఉంటావు. అందుకని మూడింటికి ఆధారమయిన మూలపురుషుడవు కనుక ఈశ్వరా, ఈ హాలాహలమును నీవు పుచ్చేసుకో" అన్నారు. వారి కోరికను విన్న పరమశివుడు వెంటనే పార్వతీ దేవి వద్దకు వెళ్ళాడు. అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుంటుంది. శంకరుడు ఆమెవంక చూసి

"కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి; ప్రభువై

యుంటకు నార్తుల యాపద, గెంటించుట ఫలము; గాదె గీర్తి మృగాక్షీ!!

ఈ ఘట్టము వినిన వాళ్లకి కొన్ని కోట్ల జన్మల వరకు అయిదవతనం తరిగిపోకుండా కాపాడుతుంది. ఈ ఘట్టంలో అమ్మవారి మంగళ సూత్రం గురించి వస్తుంది. "చూశావా పార్వతీ, నీళ్ళలోంచి వేడి పుట్టింది. పాపం పిల్లలందరూ ఏడుస్తున్నారు. ప్రభువు అన్నవాడు బిడ్డలకు కష్టం వస్తే ఆదుకోవాలి. అందుకని వాళ్ళను రక్షించాలని అనుకుంటున్నాను" అన్నాడు. ఆవిడ సమస్త బ్రహ్మాండములకు తల్లి. మాతృత్వము ఒక్కొక్కసారి భర్తృత్వమును కూడా తోసేస్తుంది. అది తల్లితనానికి ఉన్న గొప్పతనం. అందుకని మాతృత్వమును ఆమెలోంచి ఉద్భుదం చేస్తున్నాడు శంకరుడు. "మీ అన్నయ్య స్థితికారుడు. లోకముల నన్నిటిని నిలబెట్టాలి. ఇపుడు లోకములకు ఇబ్బంది వచ్చింది. మరి నేను ఆయనను సంతోష పెట్టాలి కదా! అందుకని నేను హాలాహలమును త్రాగేస్తాను.

శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్

రక్షింతు ప్రాణి కోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖీ!!

నేను ఈ హాలాహలమును చిన్న ద్రాక్షపండును తినేసినట్లు తినేస్తాను. దానివలన నాకేమీ ఇబ్బంది రాదు. అలా చేసి ఈ ప్రాణికోట్లనన్నిటిని రక్షిస్తాను. అది నా దివ్యమయిన లీల. నాకేమయినా అవుతుందని నీవేమాత్రం బెంగ పెట్టుకోనవసరం లేదు. నేనెలా తినేస్తానో సంతోషంగా చూస్తూ ఉండు" అన్నాడు. అపుడు పార్వతీ దేవి "సరే, మీకు ఎలా ఇష్టమయితే అలా చేయండి" అంది.

మ్రింగెడు వాడు విభుండని మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్

మ్రింగు మనె సర్వమంగళ మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో!!

ఆవిడకు శంకరుడు త్రాగబోయేది విషం అని తెలుసు. విషం త్రాగితే ప్రమాదమనీ తెలుసు. త్రాగుతున్న వాడు తన భర్త అనీ తెలుసు. అయినా త్రాగమంది. ఆవిడ సర్వమంగళ. అందుకని తాగెయ్యమంది. శంకరుని జీవనమునకు హేతువు పార్వతీదేవి మెడలోని మంగళ సూత్రమని పోతనగారు తీర్పు ఇచ్చారు. దేవతలందరూ జయజయధ్వానాలు చేస్తుంటే హాలాహలమునకు ఎదురువెళ్ళి దానిని చేతితో పట్టుకుని ఉండచేసి నేరేడు పండంతచేసి గభాలున నోట్లో పడేసుకుని మింగేశాడు. ఎదురు వెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ మ్రింగినప్పుడు కానీ వేడిచేసి ఆయన ఒంటిమీద ఒక్క పొక్కు పుట్టలేదు. ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు. ఆయన చల్లని చూపులతో అలానే ఉన్నాడు. శంకరుని పాదములు నమ్ముకున్న వాడు హాలాహలం లాంటి కష్టము వచ్చినా కూడా అలా చల్లగా ఉంటాడు. అటువంటి వానికి బెంగ ఉండదు. ఆయన నోట్లో పెట్టుకుని మ్రింగుదామనుకున్నాడు. కంఠం వరకు వెళ్ళింది.

ఉదరము లోకంబులకును సదనంబాగు టెరిగి శివుడు చటుల విషాగ్నిం

గుదురుకొన గంఠబిలమున బదిలంబుగ నిలిపె సూక్ష్మ ఫలరసము క్రియన్!!

మింగేస్తే అడుగున అధోలోకములు ఉన్నాయి. కాలిపోతాయని మింగలేదు. పైన ఊర్ధ్వలోకములు ఉన్నాయి. కక్కితే ఊర్ధ్వలోకములు పోతాయి. పైకీ వదలలేదు, క్రిందకీ వదలలేదు. కంఠంలో పెట్టుకున్నాడు. ఆయన అలా చేసేసరికి పార్వతీ దేవి చాలా సంతోషించింది. లోకం పొంగిపోయింది. అప్పటినుండి ఆయనకు నీలలోహితుడు, నీలగ్రీవుడు అని పేరు వచ్చింది. ఆయనకు నీలకంఠుడు అని పేరు. "నీలకంఠా అని పిలిస్తే చాలు ఆయన పొంగిపోతాడు. హాలాహాల భక్షణం కథ వీనిన వాళ్లకి మూడు ప్రమాదములు జరుగవు. ఈ కథ వినిన వాళ్ళని పాము కరవదు. హాలాహలభక్షణం కథను నమ్మిన వాళ్ళని తేలు కుట్టదు. అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదములు రావు. అంతంత శక్తులు ఇటువంటి లీలలయందు ఉన్నాయి. వాటిని క్షీరసాగర మథనంలో ఆవిష్కరించి వ్యాస భగవానుడు ఫలశ్రుతి చెప్పారు.

మళ్ళీ అందరూ బయలుదేరి ఆనందంతో పాలసముద్రం దగ్గరకి వెళ్ళిపోయారు. క్షీరసాగరమథనం మొదలుపెట్టారు. అలా మథిస్తుంటే సురభి కామధేనువు పైకి వచ్చింది. ఆ కామదేనువుకి అందరూ నిలబడి నమస్కారం చేశారు. దేవమునులకు లౌకికమయిన కోరికలు ఉండవు. వారు కామధేనువు పాలతో హవిస్సులను అర్చిస్తాము అని అన్నారు. లోక కళ్యాణార్థం హవిస్సులను ఇస్తారు. ఆ గోవును స్వామి దేవమునులకు ఇచ్చి మీరు దీని పాలతో దేవతలకు హవిస్సులను అర్పించాలి. అపుడు దేవతలు సంతోషించి వర్షములు కురిపిస్తారు. అందరూ బాగుంటారు. అందరికీ పనికి వచ్చేవాడికి కామధేనువు ఉండాలి. అందుకని కామధేనువు దేవమునులకు ఇవ్వబడింది. వారు దానిని పుచ్చుకున్నారు.⁠⁠⁠⁠

మళ్ళీ పాలసముద్రమును చిలకడం మొదలుపెట్టారు. ఇపుడు అందులోంచి ఒక తెల్లటి గుఱ్ఱము ఒకటి బయటకు వచ్చింది. దానిని ఉచ్చైశ్రవము అంటారు. ఈ గుఱ్ఱమును చూడగానే ఇంద్రునికి కించిత్ మమకారం పుట్టింది. కానీ శ్రీమన్నారాయణుని సూచన మేరకు ఏమీ మాట్లాడలేదు. ఆ అశ్వమును బలిచక్రవర్తి తనకిమ్మనమని అడిగాడు. ఆ తరువాత మళ్ళీ చిలకడం మొదలు పెట్టారు. ఇపుడు పాల సముద్రంలోంచి బ్రహ్మాండమయిన కల్పవృక్షం ఒకటి వచ్చింది. ఆ కల్పవృక్షమునకు పువ్వులు పూసి ఉన్నాయి. ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వారికి అయిదవతనం తరగదు. దానిమీద నుండి వచ్చే గాలి ఎవరు పీలుస్తారో వారి ఆరోగ్యం పాడవదు. ఎవరు కల్పవృక్షం దగ్గరకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వారికి ఫలముల రూపంలో కోర్కెలు తీర్చేస్తుంది. ఈ కల్ప వృక్షమును ముందు ఇంద్రునికి ఇచ్చారు. ఆయన దానిని తీసుకున్నాడు. తరువాత అప్సరసలు పుట్టారు. ఆ అప్సరసలు దేవకాంతలై, దేవ నర్తకీ మణులై ఉండిపోయారు. తరువాత పాల సముద్రమును ఇంకా చిలకడం మొదలు పెట్టారు. ఇప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భావం జరుగబోతోంది. ఆమె శుక్రవారం పంచమి నాడు పుట్టింది.

పచ్చటి కాంతితో, తెల్లటి వస్త్రములు కట్టుకుని "పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే" అని నల్లని కన్నులతో సొగసయిన చూపులతో మాతృ వాత్సల్యంతో అందరివంక చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారు చూపులు ఎంతవరకు పడ్డాయో అంతవరకూ దరిద్రములు అన్నీ తొలగిపోయాయి. అందరూ ఆనందమును పొందారు. లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టం ఎవరు విన్నారో వారికి కొన్ని కోట్ల జన్మల నుండి వెంటబడిన దరిద్రం నశితుంది. ఇది పరమయధార్థం. పుడుతూనే ఆ తల్లి యౌవనంలో పుట్టింది. ఇంద్రుడు వెంటనే కలశ స్థాపనం చేసి అమ్మవారిని దర్శనం చేసి చెప్పిన స్తోత్రం వ్యాసభాగవతంలో లేదు. కానీ దేవీ భాగవతంలో ఉంది. దానికి పెద్దలు ఒకమాట చెపుతారు. ఈ స్తోత్రమును చెయ్యడానికి కొన్ని రోజులు నియమం ఉంది. అలా ఈ స్తోత్రమును తెలిసికానీ, తెలియక కానీ చేస్తే ఆ వ్యక్తి భూమండలమును శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు. పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది. అమ్మవారు తెల్లని చీర కట్టుకుంది. పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మెరిసిపోతూ ఉంది. నల్లని జుట్టు కలిగి ఉంది. కబరీ బంధం చుట్టూ చక్కటి మల్లెపువ్వులు, సంపంగి పువ్వులు, జాజి పువ్వులు, అలంకరించుకుని వుంది. మెడనిండా హారములు వేసుకుని ఉంది. వరదముద్రపట్టి చేతితో ఐశ్వర్యమును కురిపిస్తూ మీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తోంది. రెండు పాదములను కలిపి పద్మాసనం వేసుకుని ఉంది.

నమః కమల వాసిన్యై నారాయణ్యై నమోనమః

కృష్ణ ప్రియాయై సతత౦ మహాలక్ష్మ్యై నమోనమః!!

పద్మ పత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమోనమః

పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః!!

సర్వస౦పత్స్వరూపిణ్యై సర్వారాధ్యాయై నమోనమః

హరిభక్తి ప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై చ నమోనమః

కృష్ణ వక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమోనమః

చ౦ద్రశోభా స్వరూపాయై రత్నపద్మే చ శోభనే!!

స౦పత్త్యధిష్ఠాతృ దేవ్యై మహాదేవ్యై నమోనమః

నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయ్యై నమోనమః!!

యథామాతా స్తనా౦ధానా౦ శిశూనా౦ శైశవే సదా

తథా త్వ౦ సర్వదా మాతా సర్వేషా౦ సర్వరూపతః!!

(శ్రీదేవీ భాగవతం - 9వ స్కంధము)

పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా విన్న బిడ్డడిని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మపాలు తప్ప వేరొకటి లేదు. ఈలోకము నందు మనము సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కులేదు. అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే. ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు. తృప్తి ఉండాలి. అమ్మా! ఆనాడు బిడ్డడయినందుకు అమ్మ పాలిచ్చి బ్రతికించినట్లు సమస్త లోకములకు తల్లివయిన నీవు కూడా దయతో మాకు ఐశ్వర్యమును యిచ్చి కాపాడు" అని ఇంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు. అటువంటి తల్లి మనకు విష్ణు భక్తిని ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది.

అమ్మవారు ఆవిర్భవించడం ఒక ఎత్తు. ఆమె అయ్యవారిని చేరడం ఒక ఎత్తు. శక్తి అనేది కంటికి కనపడదు. అనుభవైకవేద్యము. పరమాత్మ శక్తితో కూడినవాడై అనుగ్రహిస్తాడు. ప్రక్కన లక్ష్మి చేరి ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఇంద్రుడికి ఐశ్వర్యమును అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు ఆవిడకు భర్త నిర్ణయింపబడాలి. అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు? ఎక్కడ పుట్టిందో అక్కడి వాడు తండ్రి అవుతాడు. కాబట్టి ఇపుడు పాలసముద్రుడే తండ్రి. అందుకనే మనం ప్రతిరోజూ "లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం" అని పిలుస్తూ ఉంటాం కదా అమ్మవారిని. ఇపుడు ఈ తల్లికి మంగళ స్నానం చేయించడానికి అన్నీ సమకూరుస్తున్నారు. ఆ తల్లి మంగళ స్నానం చేయడం కోసమని ఒక పీట మీద కూర్చోవాలి. అందుకని దేవేంద్రుడు ఒక మణిమాయ పీఠమును తెచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఈ పీఠం ఇచ్చిన వాడికి పీఠం దక్కుతోంది. లక్ష్మీదేవికి మీరు ఏమి ఇస్తే అది మీకు దక్కుతుంది. అమ్మవారు మంగళ స్నానం చేయడానికి దానిమీద కూర్చుంది. ఇపుడు అమ్మవారు స్నానం చేయడానికి నీళ్ళు తీసుకు రావాలి. పసుపు కుంకుమలకి లోటు లేకుండా చాలాకాలం నుండి పసుపు కుంకుమలతో ఉన్న యువతులు నీరు తీసుకువచ్చి అక్కడ పెట్టారు. ఆ నీటిలో కొద్దిగా పసుపు కలపాలి. తరువాత దానిలోకి పల్లవములు వెయ్యాలి. పల్లవములు వేయడం చేత జలములు మంగళ స్నానములకు యోగ్యములు అవుతాయి. అటువంటి పల్లవములను భూదేవి తెచ్చి యిచ్చింది. గోవులు వచ్చి పంచద్రవ్యములను ఇచ్చాయి. వసంతుడు తేనెను తెచ్చి ఇచ్చాడు. మంగళ స్నానం చేయించే ముందు వధువుకి కొద్దిగా తేనె ఇవ్వాలి. లోపల మంగళ స్నాన క్రియ జరుగుతుంటే బయట వచ్చిన బ్రాహ్మణులు కూర్చుని చక్కటి స్వస్తి మంత్రములు చెప్తూ ఉంటారు. అక్కడ స్వస్తి మంత్రములు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి. ఇక్కడ మహర్షులు వేదం మంత్రములను చదువుతున్నారు. ఇప్పుడు మంగళ ధ్వనులు జరగాలి. లక్ష్మీ దేవి మంగళ స్నానానికి మేఘములు మంగళ ధ్వనులు చేశాయి. మేఘములే వేణువులను ఊదాయి. పరమ సంతోషంతో గంధర్వసతులు అందరూ అక్కడ లక్ష్మీదేవికి మంగళ స్నానములు జరుగుతున్నాయని నాట్యం చేస్తున్నారు.

అమ్మవారు స్నానం చేసిన తరువాత ఆరోజున అమ్మవారు కట్టుకోవలసిన పట్టు చీరను తండ్రి సముద్రుడు నిర్ణయం చేసి వస్త్రద్వయమును ఇచ్చాడు. వస్త్రద్వయం అనగా చీరతో బాటు ఒక రవికల గుడ్డ లేక మరొక వస్త్రం పెట్టి ఇవ్వాలిలేదా ఒక వస్త్రం మీద కనీసం ఒక దూదిపోగు పెట్టి ఇవ్వాలి. ఇంటి యజమానికి సన్నిహితుడయిన స్నేహితుడు ఉంటాడు. ఆయనన్ "సుహృత్" అంటారు. ఆయన బిడ్డను తన బిడ్డగా భావిస్తాడు. ఇక్కడ సముద్రుడు తండ్రి అయితే సముద్రములో వున్న వరుణుడే సుహృత్. అటువంటి సుహృత్ అమ్మవారు వేసుకుందుకు వైజయంతీ మాలను ఇచ్చాడు. అమ్మవారు వేసుకోవడానికి కావలసిన గాజులు హారములు నగలు వీటినన్నిటిని ఒక దంతపు పెట్టెలో పెట్టి విశ్వకర్మ తెచ్చి అమ్మవారికి ఇచ్చాడు. సరస్వతీ దేవి ఒక మంచి తారహారమును ఇచ్చింది. బ్రహ్మగారు ఒక తామరపువ్వును ఇచ్చాడు. నాగరాజులు అమ్మవారు చెవులకు పెట్టుకునే కుండలములు ఇచ్చారు. శృతి తనంత తానుగా ఒక రూపమును దాల్చి అమ్మవారికి ఆశీఃపూర్వకమయిన భద్రతను చేకూర్చగలిగిన మంత్రమును ఆమ్నాయం చేసింది. దిక్కులను స్త్రీలతో పోలుస్తారు. దిశాకాంతలందరూ "అమ్మా! లక్ష్మీ నీవు ఎల్ల లోకములకు ఏలిక రాణివై పరిపాలించెదవు గాక! అని ఆశీర్వచనం చేశారు. ఇప్పుడు ఆ తల్లికి తనంత తానుగా వరుడిని ఎంచుకోగలిగిన పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు. ఆమె చేతికొక చెంగల్వ పూదండ ఇచ్చాడు. ఇపుడు దండ పట్టుకుని ఎవరి మేడలో వేయాలి అని బయలుదేరుతోంది. లక్ష్మీదేవికి సంబంధించిన ఈ పద్యములు వింటే కన్నెపిల్లలకు అటువంటి భర్తలు వస్తారు అంటారు. ఆవిడ జగత్తునకంతటికీ తల్లి. నారాయణుడి వంక చూసింది. ఇలాంటి వాడు నాకు భర్త కావాలి అనుకుంది. తామర పువ్వుల వంటి కన్నులు ఉన్న శ్రీమన్నారాయణుడు ఏమీ తెలియని వానిలా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అమ్మవారు గబగబా సింహాసనం దిగి నడిచి వచ్చి ఆ వరమాలను ఆయన మెడలో వేసింది. ఆ సమయంలో అమ్మవారు అందరినీ చూసింది కానీ రాక్షసుల వైపు చూడలేదు. అంతే వారు దరిద్రులయిపోయారు. వాళ్లకి అమృతం పోయింది. ఇప్పుడు సముద్రుడు మామగారు అయ్యాడు. అమ్మాయి అయ్యవారి దగ్గరకు చేరితే తాను మామగారు అవుతాడు. మామగారు తన కొడుకుకి అల్లుడికి అభేదం పాటించాలి. కొడుకుకి ఎంత అమూల్యమయిన వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి. ఎందుకు అంటే ఆయన ఇపుడు పితృపంచకంలోకి వెళ్ళాడు. మామగారు అవగానే సముద్రుడు తనలో వున్న కౌస్తుభమును తీసుకువచ్చి శ్రీమన్నారాయణునికి బహూకరించాడు. శ్రీమన్నారాయణుడు ఆ కౌస్తుభమును తన మెడలో పెట్టుకున్నాడు. ఒక పక్క శ్రీవత్సము అనే పుట్టుమచ్చ మెరుస్తోంది.⁠⁠⁠⁠