కథలు - భాగవతాలు : ఫలశ్రుతి
ఫలశ్రుతి
కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఒకమాట చెప్పారు. “ఎవరు ఈ భాగవత కథ వింటున్నారో వాళ్ళందరూ కూడా చెవుల ద్వారా అమృతమును పానము చేసినట్లే. వాళ్ళందరూ నన్నే చేరుతారు. నేను అభయం యిస్తున్నాను” అన్నారు. అటువంటి వారు కన్ను మూసినపుడు కన్ను తెరిచినపుడు కృష్ణ దర్శనమే అగుట కొరకు పోతనగారు మనకొక భిక్ష పెట్టారు. వ్యాసుడు సంస్కృతంలో చెప్పిన శ్లోకమును యథాతథంగా తెలుగులోకి అనువాదం చేశారు. అది భాగవతమునకు జీవనాడి. భాగవత పఠన ఫలితమును కోరుకున్న వారందరూ ఈ పద్యములను తప్పనిసరిగా పఠించాలి. మనుష్య జన్మకు ఇంతకన్నా ప్రయోజనం వేరొకటి ఉండదు. ఎవరు ఈ పద్యమును పఠిస్తారో వారు మాత్రమే భాగవతమును వినడం వలన కాని, చదవడం వలన కాని కలిగే శుభఫలితములు పొందగలరని ఫలశ్రుతి చెప్పబడింది.
నగుమొగమున్ సుమధ్యమును నల్లనిదేహము లచ్చి కాటప
ట్టగు నురమున్ మహాభుజము లంచిత కుండలకర్ణముల్ మదే
భగతియు నీలవేణియుఁ గృపారస దృష్టియుఁ గల్గు వెన్నుఁ డి
“ఈశ్వరా! నా కన్ను మూసినప్పుడు, నా కన్ను తెరిచినప్పుడు నువ్వు నాకు ఎలా కనపడాలో తెలుసా! నవ్వు ముఖముతో, సన్నని నడుముతో, నల్లని శరీరంతో, లక్ష్మీదేవికి స్థానమయిన వక్షస్థలముతో, మమ్మల్ని రక్షించగలిగిన భుజ స్కంధములతో, కుండలములు దాల్చిన కర్ణ యుగళితో ఏనుగు నడకవంటి నడకతో, నల్లని వెంట్రుకలతో, కృప వర్షించే కన్నులతో, నాయందు అనుగ్రహించి నా కోరిక తీర్చుగాక! నిద్రపోయినప్పుడు నీ అనుగ్రహమునే సమాధిలో నేను అనుభవించాలి. కళ్ళు తెరుచుకుని ఉదయం లేచిన దగ్గరనుంచి నీవే నాకు సారధియై నడిపించాలి. చిట్టచివర నా కన్నులు మూతపడిపోయినప్పుడు నీవే అనుగ్రహించి నాకు మోక్షమును ఇవ్వాలి. వేరొకసారి నాకు జన్మవద్దు. స్వామీ నన్ను యిలా అనుగ్రహించు” అని గొప్ప పద్యమును మనకు పోతనగారు భిక్షపెట్టి పూర్తిచేస్తూ అంటారు
“ఈ కథ విన్నను వ్రాసిన, బ్రాకటముగ లక్ష్మి యశము భాగ్యము గలుగుం జేకొని యాయువు ఘనుడై, లోకములోనుండు నరుడు లోకులు వొగడన్!! ఎవరయితే భాగవతంలోని ఈ ఆఖ్యానమును వింటున్నారో యిది వినిన వాళ్ళకి ఇది వ్రాసిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సిరిసంపదలు కలుగుతాయి. ఆయుర్దాయం కలుగుతుంది. ఏమయినా ప్రమాదములు ఉంటే తప్పిపోతాయి. వాళ్ళు బ్రతికిన బ్రతుకు ఎలా ఉంటుందంటే లోకంలో వున్న వాళ్ళందరూ ఆయనతో కలిసి ఉండాలని, ఆయనను చూడాలని, ఆయన వద్ద వినాలని కోరుకునేటట్లుగా జన్మ సార్థకత పొంది నడుస్తుంది. అటువంటి కీర్తిని కృష్ణ పరమాత్మ కటాక్షిస్తారు” అని ఈ ఆఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పబడింది.
భాగవత ప్రవచన పాఠం సంపూర్ణం
ఓం నమో భగవతే వాసుదేవాయః<
ఓం ఓం ఓం
ఓం శాంతిః శాంతిః శాంతిః<
సర్వే జనాః స్సుఖినో భనంతు