కథలు - భాగవతాలు : ప్రలంబాసుర వధ
ప్రలంబాసుర వధ
ఒకనాడు కృష్ణుడు, బలరాముడు గోపబాలురు అందరూ కలిసి ఆడుకుంటున్నారు. వారు రెండు జట్లుగా విడిపోయారు. ఒక జట్టుకు బలరాముడు నాయకుడు. రెండవ జట్టుకు కృష్ణుడు నాయకుడు. కృష్ణుడు చాలా చమత్కారి. జట్ల ఎంపిక చేస్కునే ముందు కృష్ణుడు బలరాముని ఓ చెట్టు చాటుకు తీసుకువెళ్ళి “అన్నయ్యా, ఈవేళ గోపబాలురలో ప్రలంబుడు అనే రాక్షసుడు ప్రచ్ఛన్న రూపంలో వచ్చి చేరాడు. వాడు నా జోలికి రాడు. నిన్ను చంపుదామనే వచ్చాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. వాడిని నేను నా జట్టులో పెట్టుకుని వెయ్యి కళ్ళతో కనిపెడుతూ ఉంటాను. వాడిని నీ జట్టులోకి కోరవద్దు” అని చెప్పాడు. ఆమాట చెప్పిన తరువాత యిద్దరూ వెనక్కి వచ్చారు. ప్రలంబాసురుడికి కడుపులో ఒక బెంగ ఉంది. కృష్ణుడు మీదికి గతంలో చాలామంది రాక్షసులు వచ్చి మడిసిపోయారు. కృష్ణుడికి ప్రమాదం తెచ్చిన వారు ఎవరూ లేరని ప్రలంబాసురునికి తెలుసు. కాబట్టి కృష్ణుడి జోలికి వెళ్ళడం కన్నా బలరాముని జోలికి వెళ్ళడం తేలిక అనుకున్నాడు. బలరాముడికి ఏదైనా ప్రమాదం చేసేస్తే అన్నగారిని విడిచి ఉండలేక కృష్ణుడు తానె ప్రమాదం కొని తెచ్చుకుంటాడని అతడు భావించాడు. బలరాముడికి ఏదయినా ప్రమాదం తెద్దామనే ఆలోచనలో ఉన్నాడు. తన అన్నగారిని, తనను నమ్ముకున్న వాడిని, తన కోసమని అవతారమును స్వీకరించిన వాడిని, తాను పడుకుంటే పరుపయిన వాడిని, తాను కాలుపెడితే పాదపీఠమయిన వాడిని, తాను కూర్చుంటే పైన గొడుగయిన వాడిని, తాను నడుస్తుంటే ఛత్రము పట్టిన వాడిని ఈశ్వరుడు అంత తేలికగా వదిలిపెడతాడా? తన వారన్న వాళ్ళని ఈశ్వరుడు వెయ్యి కళ్ళతో కాపాడుకుంటాడు. అందుకని ప్రలంబుడిని తన జట్టులో పెట్టుకున్నాడు.
ఆట ప్రారంభం అయింది. ఈరోజున కృష్ణుడు బృందం ఓడిపోయింది. బలరాముడి బృందం గెలిచింది.ఇప్పుడు బలరాముడి బృందాన్ని కృష్ణుడి బృందం మోయాలి. ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రలంబుడు బలరాముడిని తాను మోస్తానని ముందుకు వచ్చాడు. బలరాముడికి అర్థం అయి సరే మొయ్యి అన్నాడు. అక్కడ ఒక ఒక నియమం పెట్టబడింది. ఎవరు ఎవరిని మోసినా అక్కడ గీయబడిన గీతవరకు తీసుకువెళ్ళి అక్కడ వదిలెయ్యాలి. అక్కడవరకు మాత్రం మొయ్యాలి. సరేనని బలరాముడిని ప్రలంబుడు ఎక్కించుకున్నాడు. “పర్వతమంత బరువు వున్నాడేమిటిరా?” అని అనుకుంటున్నాడు. పరుగెడుతున్న ప్రలంబుడు గీతదాటి వెళ్ళిపోతున్నాడు. పైన కూర్చున్న బలరాముడు, ప్రలంబుని ఆగమని అరుస్తున్నాడు. కానీ వాడు ఆగడం లేదు. ఇంకా బాలుడి రూపంలో మొయ్యలేనని రాక్షసుడు అయిపోయాడు. తమ్ముడు ముందుగానే చెప్పాడు కాబట్టి ఏ భయం లేకుండా బలరాముడు వాడి శిరస్సు మీద ఒక గుద్దు గుద్దాడు. అపుడు ప్రలంబాసురుని తల బ్రద్దలై వాడు నేలమీద పడిపోయి మరణించాడు. అప్పుడు పైనుంచి దేవతలు బలరాముడి మీద పుష్పవృష్టి కురిపించారు.
ఈలీలలో మనం తెలుసుకోవలసిన గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఒకటి ఉంది. సాధారణంగా భగవంతుడిని ఏమీ చేయలేక, భగవంతుని భక్తులను హింసించే ప్రయత్నం కొంతమందిలో ఉంటుంది. భగవంతుడే అటువంటి వాళ్ళ మృత్యువుకు మార్గమును తెరుస్తాడు. ఆ భక్తుడిని ఆయనే, బలరాముడిని కృష్ణుడు రక్షించుకున్నట్లు రక్షించుకుంటాడు. కాబట్టి భగవద్భక్తులను హింసించడం, తిరస్కరించడం, భగవంతుని పట్ల ప్రేమగా వున్నట్లు నటించడం పరమ ప్రమాదకరం. దాని వలన ఈశ్వరానుగ్రహమును పొందరు. బలరాముడిని చంపితే కృష్ణుడు చనిపోతాడన్న ప్రలంబుడి ఊహ ఎంత ప్రమాదకరమో భగవద్భక్తుల జోలికి మనం వెళ్ళగలము, వాళ్ళను ఉపేక్షించవచ్చు, వాళ్ళని ప్రమాదం లోనికి తీసుకువెళ్లవచ్చు భగవంతుడిని ఏమీ చేయలేం కాని భక్తులను ఏమైనా చేయవచ్చు అని అనుకోవడం అంత అవివేకం. ఈశ్వరుడు భక్తులను కంటిని రెప్ప కాపాడినట్లు కాపాడుతూనే ఉంటాడు. భగవంతుని వలన వారు అటువంటి రక్షణ పొందుతారని భాగవతులయిన వారందరికీ కూడా ఒక గొప్ప అభయమును ఇస్తూ ఈశ్వరుడు ప్రలంబవధ అనబడే ఈ లీలను చేసి, మనకందరికీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి యిన్ని గొప్ప విషయములను ఆవిష్కరించి ఉన్నాడు.