కథలు - భాగవతాలు : ప్రహ్లాదోపాఖ్యానం
సప్తమ స్కంధము - ప్రహ్లాదోపాఖ్యానం-1
హిరణ్యకశిపుడు తపస్సుకు బయలు దేరి బయటకు వచ్చి తన దగ్గర ఉండే మంత్రి, సామంత్రులందరినీ పిలిచి "శ్రీమన్నారాయణుడంతటి దుండగీడు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. అతడు చేతకాని వాడు, పిరికివాడు. నా తమ్ముడిని సంహరించాడు. ఆ విష్ణువు మహా మాయగాడు. అతను ఉండే స్థానములు కొన్ని ఉన్నాయి. అవే బ్రాహ్మణులు, యజ్ఞయాగాది క్రతువులు, హోమములు, వేదము, ఆవులు, సాధుపురుషులు, ధర్మమూ, అగ్నిహోత్రము మొదలయినవి. చెట్టు మొదలును కాల్చేస్తే పైన ఉండే పల్లవములు శాఖలు తమంతతాము మాడిపోతాయి. అందుకని ఇలాంటివి ఎక్కడ కనపడినా ధ్వంసం చేయండి. ఎవడయినా తపస్సు చేస్తుంటే నరికి అవతల పారెయ్యండి. ఎవడయినా వేదం చదువుకుంటుంటే వాడిని చంపేయండి" అన్నాడు. ఆమాటలు వినడంతోనే భటులందరూ లోకం మీద పడ్డారు. "నేను అపారమయిన తపశ్శక్తి సంపన్నుడనయి ఈ మూడు లోకములను నేను పరిపాలిస్తాను. విష్ణువు అనేవాడు ఎక్కడ కనపడినా సంహరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ" అని బయలుదేరి మందర పర్వత చరియలలోకి వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు. మహా ఘోరమయిన తపస్సు చేశాడు. అయన కపాల భాగమునుండి తపోధూమము బయలుదేరింది. అది సమస్త లోకములను కప్పేస్తోంది. అస్థిపంజరం ఒక్కటే మిగిలింది. ఇటువంటి పరిస్థితులలో దేవతలు అందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి "అయ్యా, ఈ హిరణ్యకశిపుని తపో ధూమముచేత మేమందరమూ తప్తమయి పోతున్నాము. అందుచేత నీవు తొందరగా వెళ్ళి ఆయనకు దర్శనం ఇచ్చి ఏమి కావాలో ఆయనను అడిగి ఆయన కోర్కె సిద్ధింపచేయవలసింది" అన్నారు.
పక్కన దక్ష ప్రజాపతి భృగువు మున్నగువారు కొలుస్తూ వుండగా స్వామి హంసవాహనం మీద ఆరూఢూడై వచ్చి తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుని ముందుకు వచ్చి నిలబడి తన కమండలములో ఉన్న మంత్రజలమును తీసి పుట్టలు పట్టిపోయి వున్న హిరణ్యకశిపుని శరీరం మీద చల్లాడు. వెంటనే అతనికి అపారమయిన తేజస్సుతో కూడుకున్న నవయౌవనంతో కూడుకున్న శరీరం వచ్చింది. లేచివచ్చి సాష్టాంగ దండ ప్రణామం చేసి బ్రహ్మగారిని స్తోత్రం చేశాడు. ఆయన అన్నాడు "నీవు దుస్సాధ్యమయిన తపస్సు చేశావు. కాబట్టి నాయనా హిరణ్యకశ్యపా నీవు ఏమి కోరుకుంటావో కోరుకో" అన్నాడు.
"నాకు మృత్యువు ఉండకూడదు. గాలిచేత చనిపోకూడదు. ఏ దిక్కునుంచి వస్తున్న ప్రాణి చేత చనిపోకూడదు. పైన చనిపోకూడదు. క్రింద చనిపోకూడదు. ఇంట్లో చనిపోకూడదు. బయట చనిపోకూడదు. ఆకాశంలో చనిపోకూడదు. ప్రాణం ఉన్న వాటివలన చనిపోకూడదు. ప్రాణం లేని వాటి వలన చనిపోకూడదు. మృగముల చేత, పక్షుల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, దేవతల చేత, అస్త్రముల చేత, శస్త్రముల చేత, వీటి వేటి చేత పగలు కాని, రాత్రి కాని మరణములేని స్థితిని నాకు కటాక్షించు" అని కోరాడు. ఈ కోరికను విని బ్రహ్మగారు ఆశ్చర్యపోయారు. "తథాస్తు ఇచ్చేశాను. కానీ కొంచెం క్షేమంగా ఉండడం నేర్చుకొని లోకం గురించి అనుకూల్యతతో మంచి నడవడితో ప్రవర్తించు సుమా" అని చెప్పి హంసవాహనం ఎక్కి వెళ్ళిపోయారు.
హిరణ్యకశిపుడు రాజధానికి తిరిగి వచ్చి అందరిని పిలిచి "నేను వరములు పుచ్చుకుని వచ్చేశాను. ఇప్పుడు విష్ణువు ఎక్కడ ఉన్నాడో పట్టుకొని సంహారం చేయాలి. పైగా ఇంద్రుడిని రాజ్యభ్రష్టుడిని చేయాలి. త్రిలోక్యాధిపత్యాన్ని పొందాలి" అని చెప్పి పెద్ద అసుర సైన్యమును తీసుకొని ఇంద్రలోకము మీదికి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రునికి ఈ వార్త అందిపోయింది. ఎప్పుడయితే హిరణ్యకశిపుడు ఇన్ని వరములు పొందాడని తెలిసిందో ఇక వానితో యుద్ధం అనవసరం అనుకుని సింహాసనం ఖాళీ చేసేశాడు. హిరణ్యకశిపుడు వచ్చి అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు. యజ్ఞయాగాది క్రతువులు లేనేలేవు. హవిస్సులన్నీ హిరణ్యకశిపుడికే. భయంకరమయిన పాలన సాగిస్తున్నాడు.
ఇపుడు దేవతలు అందరూ చాలా రహస్యమయిన సమావేశం ఒకటి పెట్టుకున్నారు. తమ కష్టములు తీర్చమని శ్రీమన్నారాయణుని ప్రార్థన చేశారు. అంతే అశరీరవాణి వినబడింది. "మీరందరూ దేనిగురించి బాధపడుతున్నారో నాకు తెలుసు. మీరు నాకేమీ చెప్పనవసరం లేదు. నేను సమస్తము తెలిసి ఉన్న వాడిని. కానీ నాకంటూ ఒక నియమం ఉన్నది. వాడు ధర్మము నుండి వైక్ల్యబ్యం పొందాలి. బాగా ధర్మం తప్పిపోవాలి. అప్పుడు వాడిని పట్టుకు చంపేస్తాను" అని స్వామి అనుజ్ఞ చేశారు. ఆ పని వాడు ఎప్పుడు చేస్తాడో కూడా నేను మీకు చెప్తున్నాను. వానికి ఒక కొడుకు పుడతాడు. అతని పేరు ప్రహ్లాదుడు. మహాభక్తుడు. అటువంటి ప్రహ్లాదుని ఆపదల పాలు చేయడం ప్రారంభం చేస్తాడో ఆనాడు వానిని సంహరించేస్తాను. అందుకని మీరెవ్వరూ బెంగపెట్టుకోకండి" అన్నాడు. ఈ మాటలు విని దేవతలందరూ సంతోషించారు.
హిరణ్యకశిపునికి లీలావతికి ప్రహ్లాదుడు జన్మించాడు ఆయన మహానుభావుడు. మహాజ్ఞాని. గురువులు కరచరణాదులతో కదిలివస్తున్న ఈశ్వరుడే అన్న భావన కలిగినవాడు. తనతో కలిసి చదువుకుంటున్న స్నేహితులను కేవలం స్నేహితులుగా కాక తన తోడబుట్టిన వాళ్ళలా చూసేవాడు. గురువులు చండామార్కులు. ఉన్నది రాక్షస విద్యార్థులు. ఒక్కనాడు అబద్ధం ఆడింది లేదు. మిక్కిలి మర్యాద కలిగిన వాడు. ప్రహ్లాదుని సుగుణములు అన్నీ ఇన్నీ అని చెప్పడానికి కుదరదు. ప్రహ్లాదుడిని చూసిన హిరణ్యకశిపుడు "ఏమిటో కనపడ్డ వాళ్ళందరినీ హింసించడం, బాధపెట్టడం వాడి దగ్గర వీడి దగ్గర అన్నీ ఎత్తుకురావడం ఇలాంటి పనులు చేయకుండా ఏమిటో జడుడిలా కూర్చుంటాడు. తనలో తాను నవ్వుకుంటాడు. కళ్ళు మూసుకొని ఉంటాడు. ఏమిటో ధ్యానం చేస్తూ ఉంటాడు. చదువుకోడు. ఓ పుస్తకం పట్టుకోడు. వీడు రేపు పొద్దున్న సింహాసనానికి ఉత్తరాధికారి ఎలా అవుతాడు. ఎలా కూర్చుంటాడు. ఎలా పరిపాలన చేస్తాడు. రాక్షసులను ఎలా సుఖపెడతాడు అని బెంగపెట్టుకున్నాడు.
అందుకని శుక్రాచార్యులవారి కుమారులయిన చండామార్కుల వారిని పిలిచాడు."అయ్యా, మీ భృగు వంశం మా రాక్షస జాతిని ఎప్పటినుంచో ఉద్ధరిస్తోంది. మా బిడ్డడయిన ప్రహ్లాదుడు జడుడిగా తిరుగుతున్నాడు. వీనికి నీతిశాస్త్రమూ, ధర్మ శాస్త్రమూ, కామ శాస్త్రమూ బోధ చెయ్యండి. వీనియందు కొంచెం కదలిక వచ్చి నాలుగు విషయములు తెలుసుకొని పదిమందిని పీడించడం నేర్చుకుంటే నా తరువాత సింహాసనం మీద కూర్చొనడానికి కావలసిన యోగ్యత కలుగుతుంది" అని ప్రహ్లాదుని తీసుకువెళ్ళి చండామార్కుడికి అప్పచెప్పాడు.
ఆ రోజులలో రాజాంతఃపుర ప్రాంగణం నందు ఒక విద్యాలయము ఉండేది. అందులో గురువులు శిష్యులకు విద్యలు నేర్పుతూ ఉండేవారు. ప్రహ్లాదుడు చిత్రమయిన పని చేస్తుండేవాడు. ఆయన ఏకసంథాగ్రాహి. గురువులు చెప్పిన విషయమును వెంటనే ఆయన మేధతో పట్టుకునేవాడు. కానీ తానుమాత్రం మరల బదులు చెప్పేవాడు కాదు. ఏమీ మాట్లాడేవాడు కాదు. అన్నీ వినేవాడు. వాళ్ళు అర్థశాస్త్రం నేర్చుకోమంటే నేర్చుకునేవాడు. వాళ్ళు దుర్మార్గమయిన నీతులు చెబితే ఆ నీతులు నేర్చుకునే వాడు. అప్పటికి వాళ్ళు చెప్పింది నేర్చుకునే వాడు. కానీ అది మనస్సులోకి వెళ్ళలేదు. అనగా అంత దుష్ట సాంగత్యమునందు కూడా తన స్వరూప స్థితిని తాను నిలబెట్టుకున్న మహాపురుషుడు ప్రహ్లాదుడు. ఇటువంటి స్థితిలో ఒకనాడు హిరణ్యకశిపునికి తన పిల్లవాని బుద్ధిని పరీక్షించాలని ఒక కోరిక పుట్టింది. గురువులు వెళ్ళి "మీరు చెప్పిన విధిని మేము నిర్వహించాము. మీ అబ్బాయి చాలా బాగా పాఠములు నేర్చుకున్నాడు" అన్నారు. అందుకని తన పిల్లవానిని సభా మంటపమునకు పిలిచాడు. తన కొడుడు తన తొడ మీద కూర్చుని అవన్నీ చెపుతుంటే సభలో ఉన్న వాళ్ళు చూసి తన కొడుకు తనకంటే మించిన వాడని పొంగిపోవాలని ఆయన అభిప్రాయం. అందుకని సభకు పిలిపించాడు. ప్రహ్లాదుడు వస్తూనే తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు. రెండు చేతులు చాపి తన పిల్లవాడిని ఎత్తుకున్నాడు. తన తొడమీద కూర్చోబెట్టుకుని "నీవు ఏమి నేర్చుకున్నావో ఏది నాలుగు మాటలు చెప్పు. నీవు నేర్చుకున్న దానిలో నీకు ఇష్టం వచ్చినది నీకు బాగా నచ్చింది ఏది ఉన్నదో అది ఒక పద్యం చెప్పు అని అడిగాడు. అపుడు ప్రహ్లాదుడు
ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతిలోపలం
ద్రెళ్ళక వీరు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవ
ర్తిల్లక సర్వము న్నతని దివ్య కళామయ మంచు విష్ణునం
దుల్లము జేర్చి తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ !
ప్రతి జీవుడు ప్రతి శరీరధారి శరీరమును పొంది ఇల్లు అనే ఒక చీకటి నూతిలోకి దిగిపోయి అక్కడి నుంచి "నేను", "మీరు" అనే భావన పుట్టి అందులోంచి అహంకారం, మమకారం పుట్టి నా వాళ్లకు మేలు జరగాలి, ఎదుటి వాళ్లకు కీడు జరగాలి అనుకుంటూ ఉంటారు. నేను నా వాళ్ళు అనే భావనను విడిచి పెట్టి జగత్తంతా ఉన్నది పరబ్రహ్మమే అనుకుని గుర్తెరిగి వాడు ఘోరారణ్యములోకి వెళ్ళి కూర్చున్నా ఉద్ధరించ బడుతున్నాడు. ఇది తెలుసుకోకుండా "నేను", "నాది" అన్న భావన పెంచుకున్న వాడు ఊరినడుమ కూర్చున్నా అటువంటి వాని వలన కలిగే ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకు వచ్చిన దిక్కుమాలిన రాజ్యం నీకిది. ఇంత తపస్సు చేసి నీవు ఏమి తెలుసుకుంటున్నావు? అందుకని నీవు మార్చుకోవలసిన పధ్ధతి ఉన్నది అని తండ్రితో మాట్లాడు తున్నాడు కనుక అన్యాపదేశంగా మాట్లాడాడు. ఈతని మాటలు విని హిరణ్యకశిపుడు తెల్లబోయాడు.
ప్రహ్లాదుని మాటలు విన్న హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. అటువంటి ఆలోచనలు ఎవరయినా తన కుమారునికి నేర్పారేమోనని ఆయనకు అనుమానం కలిగి "నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నీవు రాక్షసునికి జన్మించిన వాడివి. ఇలాంటి బుద్ధులు నిజంగా నీకే పుట్టాయా లేక ఎవరయినా పిల్లలు పక్కకి తీసుకెళ్ళి రహస్యంగా నీచేత చదివిస్తున్నారా?" అని అడిగాడు. "ఈ గురువులు నిన్ను చాటుకు తీసుకు వెళ్ళి ఇలాంటివేమయినా నేర్పుతున్నారా? శ్రీమహావిష్ణువు మన జాతికంతటికీ అపకారం చేసినవాడు. అటువంటి వాడిని స్తోత్రం చేస్తావా? అలా చెయ్యకూడదు" అన్నాడు. ఇవన్నీ విని ప్రహ్లాదుడు. . .
మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీవీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు! వినుత గుణశీల, మాటలు వేయునేల?
ఎక్కడయినా పారిజాత పుష్పములలో ఉండే తేనె త్రాగడానికి అలవాటు పడిపోయిన తుమ్మెద ఎక్కడో ఉన్న ఉమ్మెత్త పువ్వు మీద వాలుతుందా? ఎక్కడో హాయిగా ఆకాశములో ఉండే మందాకినీ నదిలో విహరించడానికి అలవాటు పడిపోయిన రాజహంస ఎండిపోతూ దుర్గంధ భూయిష్టమయిన ఒక చెరువు దగ్గరకు వెళ్ళి ఆ నీళ్ళు తాగుతుందా? ఎక్కడయినా లేత మామిడి చిగురు తాను తిని "కూ" అంటూ కూయడానికి అలవాటు పడిన కోయిల ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అడవిమల్లెలు పూసే చెట్టుమీద వాలుతుందా? పూర్ణ మయిన చంద్రబింబం లోంచి వచ్చే అమృతమును త్రాగడానికి అలవాటు పడిపోయిన చకోరపక్షి పొగమంచును త్రాగడానికి ఇష్టపడుతుందా? సర్వకాలముల యందు తామరపువ్వుల వంటి పాదములు కలిగిన శ్రీమన్నారాయణుని పాదములను భజించడం చేత స్రవించే భక్తి తన్మయత్వమనే మందార మకరందపానమును త్రాగి మత్తెక్కి ధ్యానమగ్నుడనై ఉండే నాకు నీవు చెప్పే మాటలు ఎలా తలకెక్కుతాయి? నేను ఇతరములయిన వాటిమీద దృష్టి ఎలా పెట్టగలుగుతాను?" అని అడిగి "వేయిమాటలెందుకు? నాకు నీవు చెప్పిన లక్షణములు రమ్మనమంటే వచ్చేవి కావు" అని అన్నాడు.
ప్రహ్లాదుడు అలా అనేసరికి హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి గురువుల వంక చూసి "మీరు వీడికి పాఠం చెప్పడంలో ఏదో తేడా ఉన్నదని నేను అనుకుంటున్నాను. లేకపోతే నేను ఎంత చెప్పినా వీడు ఇలా చెపుతున్నాడేమిటి? ఈమాటు తీసుకు వెళ్ళి చాలా జాగ్రత్తగా వేయి కళ్ళతో చూస్తూ ఈ పిల్లవాడికి విద్య నేర్పండి. అన్నాడు. చండామార్కులు పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్లకి భయం వేసింది. వాళ్ళు ప్రహ్లాదునితో "నాయనా, మేము నీకు నేర్పినది ఏమిటి? నువ్వు చెప్పినది ఏమిటి? మీ నాన్నకి మామీద అనుమానం వచ్చింది. ఇపుడు మా ప్రాణములకు ముప్పు వచ్చేటట్లు ఉంది. కాబట్టి మేము ఏమి చెప్తున్నామో అది జాగ్రత్తగా నేర్చుకో. మాకు ఏమి చెప్తున్నావో అవి మీ నాన్న దగ్గరికి వెళ్ళి అప్పచెప్పు. ఇంక ఎప్పుడూ నీవు అలాంటి పలుకులు పలుకకూడదు. గురువుల మయిన మేము ఏమి చెప్పామో అది మాత్రమే పలకాలి అర్థమయిందా?" అన్నారు. అపుడు ప్రహ్లాదుడు "అయ్యా, చిత్తం. మీరు ఏమి చెపుతారో దానిని నేను జాగ్రత్తగా నేర్చుకుంటాను" అని చక్కగా నేర్చుకున్నాడు. ఎక్కడనుంచి ఏది అడిగినా వెంటనే చెప్పేసి చక్కా వ్యాఖ్యానం చేసేస్తున్నాడు. ఇప్పుడు పిల్లవాడు మారాడని వారు అనుకున్నారు. ఎందుకయినా మంచిదని తల్లి దగ్గర కూర్చుని మాట్లాడడానికి, తండ్రి దగ్గర మాట్లాడదానికి పెద్ద తేడా ఉండదని ముందుగా అతనిని తల్లి లీలావతి దగ్గరకు తీసుకువెళ్ళారు.
లీలావతి కుమారుని ప్రశ్నించింది "నాయనా, బాగా చదువుకుంటున్నావా? ఏది నీవు నేర్చుకున్నది ఒకమాట చెప్పు" అంది. ధర్మార్థ శాస్త్రములలోంచి కొన్ని మాటలు చెప్పాడు తల్లికి. తన కుమారుడు చాలా మారిపోయినందుకు తల్లి చాలా సంతోషించింది. గురువులు కూడా సంతోషించి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి దగ్గరకు తీసుకువెళ్ళారు. హిరణ్యకశిపుడు కుమారుని చూసి "నీ బుద్ధి మారిందా? గురువులు ఏమి చెప్తున్నారో అది తెలుసుకుంటున్నావా? గురువులు చెప్పిందే తెలుసుకుంటున్నావా? లేక సొంత బుద్ధితో ఏమయినా నర్చుకుంటున్నావా?" అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు
"చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులు నే
జదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల జదివితి తండ్రీ!!
గురువులు నన్ను చదివించారు. ధర్మశాస్త్రం, అర్థ శాస్త్రములను నూరిపోశారు. ఇవే కాకుండా నేను ఇంకా చాలా చదువుకున్నాను. చదువుల వలన తెలుసుకోవలసిన చదువేదో దానిని నేను తెలుసుకున్నాను అన్నాడు. అపుడు హిరణ్యకశిపుడు నువ్వు తెలుసుకున్న మొత్తం చదువులోంచి సారభూతమై పిండి వడగడితే ఇది వింటే చాలు అన్న పద్యం ఒక్కటి నాకు చెప్పు" అని కుమారుని అడిగాడు. అపుడు ప్రహ్లాదుడు
తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనం
బనునీతొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మిస
జ్జనుడైయుండుట భద్రమంచు దలతున్ సత్యంబుదైత్యోత్తమా!!
"శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం!!
అంటారు వ్యాసమహర్షి. "తండ్రీ ఈ శరీరం ఉన్నందుకు మనం ఈశ్వరుడిని తొమ్మిది రకములుగా సేవించాలి. ఇదే నేను చదువుకున్న చదువుల మొత్తం సారాంశము" అని చెప్పాడు. ఈమాటలకు హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. అపుడు అతను అన్నాడు "ఒరేయ్, ఇది గురువులు చెప్పలేదు, నేను చెప్పలేదు. అలాంటి ఆలోచన నీకు ఎక్కడినుంచి వస్తోంది? నువ్వు రాక్షస జాతిలో పుట్టావు. కంటికి కనపడని శ్రీమన్నారాయణుని మీద నీకు భక్తి ఎక్కడినుండి వచ్చింది?" అని అడిగాడు. అపుడు ప్రహ్లాదుడు "తండ్రీ, మీకందరికీ రాని యాలోచన నాకెందుకు వస్తోందని అడిగావు కదా! ఆయనను విడిచిపెట్టి మిగిలినవి నీవు ఎన్ని చేసినా అవి అన్నీ ఎటువంటి పనులో చెపుతాను. పుట్టు గుడ్డి వాడిని తీసుకు వెళ్ళి పున్నమి చంద్రుని దగ్గర కూర్చోబెట్టి పున్నమి చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో చూడరా అంటే ఎంత అసహ్యమో ఈశ్వరుడిని విడిచి పెట్టి సంసారం చాలా బాగుంటుంది అనుకోవడం అంత అసహ్యకరం.
కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు; మధువైరిఁ దవిలిన మనము మనము;
భగవంతు వలగొను పదములు పదములు; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;
తే. దేవదేవుని చింతించు దినము దినము;
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి!!
కమలముల వంటి కన్నులు ఉన్న శ్రీమన్నారాయణుని అర్చించిన చేతులు ఏవయితే ఉంటాయో వాటికి చేతులని పేరు. శ్రీ మహావిష్ణువు గురించి పరవశించి పోయి స్తోత్రం చెయ్యాలి. అర్చన చేసేటప్పుడు ఒకమెట్టు పైన నిలబడి లింగాభిషేకం చేయమన్నారు. శేషశాయికి మొక్కని శిరము శిరము కాదు. ఆ మహానుభావుడి గురించి కీర్తనము చేయని నోరు నోరు కాదు. ఆయనకు ప్రదక్షిణలు చేయని కాళ్ళు కాళ్ళు కాదు. ఆయనను లోపల ధ్యానం చేయని మనస్సు మనస్సు కాదు. ఆయనను గురించి చెప్పని గురువు గురువు కాదు" అని ఇంకొక మాట చెప్పాడు.
కంజాక్షునకు గాని కాయంబు కాయమే? పవన గుంభిత చర్మభస్త్రి గాక
వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే? ఢమఢమ ధనితోడి ఢక్క గాక
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? తరుశాఖ నిర్మిత దర్వి గాక
కమలేశు జూడని కన్నులు కన్నులే? తను కుడ్య జాల రంధ్రములు గాక
చక్రిచింత లేని జన్మంబు జన్మమే? తరళ సలిల బుద్భుదంబు గాక
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే? పాదయుగము తోడి పశువు గాక!!
ఈశ్వరుడు మహోదారుడు. ఆయన నిర్మించిన ఈ శరీరము చాలా గొప్పది. తొమ్మిది రంధ్రములు కలిగిన తోలు తిత్తియందు పడి వాయువులు ఆయన శాసనము అయ్యేంతవరకు బయటకు వెళ్ళడానికి వీలులేదు. అలా నిక్షేపించి నడిపిస్తున్న పరమాత్ముని తలుచుకోని వాడు, ఆ కంజాక్షుని సేవించడానికి సిద్ధపడని శరీరము శరీరము కాదు. అది వట్టి తోలుతిత్తి. అందుచేత తండ్రీ చెయ్యవలసినది ఏదయినా వుంటే ఒక్క కైంకర్యము చేయడానికే మనిషి బ్రతకాలి. అటువంటి బుద్ధితో ఉండాలి అన్నాడు
సప్తమ స్కంధము - ప్రహ్లాదోపాఖ్యానం-3
ప్రహ్లాదుడు చెప్తున్న విషయములను విని హిరణ్యకశిపుడు కోపించిన వాడై గురువుల వంక చూశాడు. మేమేమీ చెప్పలేదు మహా ప్రభో అన్నట్లు హడలిపోయి చూస్తున్నారు చండామార్కులు. "ఈ పద్యములన్నీ నీకు ఎక్కడినుంచి వచ్చాయి? శ్రీమన్నారాయణుని సేవించాలని ఎలా చెప్తున్నావు? నీకీ భక్తి ఎలా కలిగింది? వాళ్ళెవరో నాకు చెప్పు. వాళ్ళ సంగతి చూస్తాను" అన్నాడు. ప్రహ్లాదుడు అన్నాడు "నాన్నా నీలాంట్ వాడికి శ్రీమన్నారాయణుని గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు అని చెప్పినా నీకు అర్థంకాదు. నీ కళ్ళను మూసుకున్నావు. అజ్ఞానంలో పడిపోయిన వారికి చెపితే తలకెక్కుతుందా! అజ్ఞానావస్థలో కోరికోరి కూరుకుపోతూ సంసారము సత్యమని నమ్మే నీలాంటి అహంకార పూరితమయిన వ్యక్తులకి ఎవరు చెప్పారని చెపితే నీకు అర్థం అవుతుంది?" అని అన్నాడు.
ఈతని మాటలు వినేసరికి హిరణ్యకశిపునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. రాక్షసులను పిలిచి "వీడిని చంపండి. వీడిని తీసుకెళ్ళి మంచులో నిలబెట్టండి, కొన్నాళ్ళు అన్నం ఇవ్వడం మానేయండి. ఆ తరువాత వీడి నవరంధ్రములు మూసేసెయ్యండి. ఆ తరువాత నేను నా మాయను చూపెట్టి భయపెదతాను. మరుగుతున్న నూనెలో వేయండి. పర్వత శిఖరముల మీదనుండి కింద తొయ్యండి. ఏనుగులతో తొక్కించండి. సముద్రంలో పారెయ్యండి" అన్నాడు.
తనని శూలంపెట్టి రాక్షసులు పొడిచేస్తుంటే, పర్వత శిఖరం మీదనుంచి కింద పారేస్తుంటే, సముద్రంలోకి విసిరేస్తుంటే, కిందపడేసి ఏనుగుల చేత తొక్కేస్తుంటే, రాక్షసులలో, తండ్రిలో, అందరిలో, అంతటా, శ్రీమన్నారాయణుని చూసి పొంగిపోతుంటే గుప్తరూపంలో స్వామి లక్ష్మీ సహితుడై వచ్చి ప్రహ్లాదుని పట్టుకుంటున్నాడు. ఇంతమంది కలిసి కుమ్మితే ఏమీ జరగడం లేదు. ఈశ్వరుడిని నమ్ముకున్న వాడికి ఏమి లోటు ఉంటుంది. రాక్షసులు అలా హింసిస్తుంటే ప్రహ్లాదుడు ఎక్కడ ఉన్నవాడు అక్కడే నిలబడి నారాయణ జపం చేస్తుంటే అంతకంతకీ తేజోవిరాజితుడు అయిపోతున్నాడు. హిరణ్యకశిపుడికి ఒక్కొక్క వార్త వస్తోంది. ప్రహ్లాదుడు ప్రకృతికి అతీతమయిన స్థితిని పొందాడు. తన వాడయిన కారణం చేత, తనయందు భక్తి కలిగిన కారణం చేత ఈశ్వరుడు ఆనాడు ప్రహ్లాదుడిని రక్షించుకున్నాడు. హిరణ్యకశిపుడు రాత్రింబవళ్ళు దీనవదనంతో కూర్చుని ఉన్నాడు. ప్రహ్లాదుని చంపడానికి ఎన్ని ఉన్నాయో అన్నింటిని ప్రయోగించాడు. కానీ అతడు చచ్చిపోలేదు. కనీసం నీరసపడలేదు. పైగా తాను ప్రయత్నించే కొలదీ పిల్లవాడు ఎక్కువ తేజమును పొందుచున్నాడు. ఇప్పుడు గురువులు "బెంగ పెట్టుకోవద్దు. చావుతో సమానమయిన మందు ఒకటి మావద్ద ఉంది. వీనిని తీసుకువెళ్ళి అది వేసేస్తాము. ఈ పిల్లవాడికి వయస్సు వస్తోంది కాబట్టి చాలా గొప్పగా రకరకాలుగా కామశాస్త్రాన్ని బోధ చేసేస్తాము. వీడు భ్రష్టుడు అయిపోతాడు. సంసరమునందు అనురక్తి కలుగుతుంది" అని చెప్పి పిల్లవాడిని తీసుకువెళ్ళి అతనికి శాస్త్ర బోధ ప్రారంభించారు. పరమ సంతోషంగా కూర్చుని గురువులు చెప్పినది చక్కగా నేర్చుకుంటున్నాడు.
ఒకరోజున గురువులు తమ గృహకార్యములను నిర్వర్తించుటకు లోపలికి వెళ్ళారు. వెంటనే ప్రహ్లాదుడు పిల్లలందరినీ పిలిచి "ఒరేయ్ మీరు ఈ ఆటలు ఎంతకాలం ఆడతారు కానీ నేను మీకొక విషయం చెప్తాను. మీరందరూ కూర్చోండి. అని మనకి ఆయుర్దాయం నూరు సంవత్సరములు. రాత్రి అయితే నిద్రపోటాము. కాబట్టి ఏభై ఏళ్ళు నిద్రలో పోతుంది. ఇరవై ఏళ్ళు శిశువుగా బాల్యంలో పోతుంది. ఇంకా మిగిలింది ముప్పది ఏళ్ళలో మన కోరికలన్నీ అక్కర్లేని వాటికన్నింటికీ తగుల్కొని అరిషడ్వార్గాలకి లొంగిపోతాయి. నా మాట వినండి. ఈ పంచ భూతములను, మూడు గుణములను, ఇరవై ఏడు తత్త్వములను నిర్మించి మాయచేత పరమాత్మ ఈశ్వర దర్శనం కాకుండా కప్పి ఉంచాడు. ఆత్మ ఒక్కటే స్థిరంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆత్మా దర్శనాభిలాషులు అవండి. నామాట నమ్మండి" అన్నాడు. వాళ్ళు "ఈపాఠం చాలా గమ్మత్తుగా ఉంది. నువ్వు మాతోనే కలిసి ఇక్కడ చేరావు. మాతోనే చదువుకున్నావు. గురువులు మాకేమి చెప్పారో నీకు కూడా అదే చెప్తున్నారు. గురువులు చెప్పని విషయములు నీకు ఎవరు చెప్తే వచ్చాయి?" అని అడిగారు. అపుడు ప్రహ్లాదుడు "మహానుభావుడయిన నారదుడు చెప్పాడు" అని బదులిచ్చాడు. అపుడు వాళ్ళు "నారదుని నీవు ఎప్పుడు కలుసుకున్నావు? ఎప్పుడు నేర్చుకున్నావు?" అని అడిగారు.
హిరణ్యకశిపుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు గర్భిణి అయిన లీలావతిని చెరపట్టి ఇంద్రుడు ఈడ్చుకుపోతున్నాడు. నారదుడు ఎదురువచ్చి "మహాపతివ్రత అయిన కాంతను ఎందుకు చెరపట్టి తీసుకువెళుతున్నావు" అని అడిగాడు. ఆయన "నాకు ఆవిడ మీద క్రోధం లేదు. ఆవిడ గర్భమునందు హిరణ్యకశిపుని తేజం ఉన్నది. వాడు తపస్సుయందు మడిసిపోతాడని మేము అనుకుంటున్నాము. ఈలోగా బిడ్డపుట్టి వాడు కూడా పెరిగి పెద్ద వాడయితే చాలా ప్రమాదం. అందుకని ఆ బిడ్డడు పుట్టగానే సంహారం చేసి ఈమెను విడిచిపెడతాను అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు "నీకేమి తెలుసు! ఆవిడ గర్భంలో మహావిష్ణు భక్తుడయిన వాడు ఉన్నాడు. వాడు జన్మచేత భక్తిజ్ఞాన వైరాగ్యములతో పుడుతున్నాడు. అటువంటి మహాపురుషుని కథ వింటే తరించిపోతాము. అందుకని లీలావతిని నా ఆశ్రమమునకు తీసుకువెడతాను" అని తీసుకు వెళ్ళి అక్కడ వేదాంత తత్త్వమును ప్రబోధం చేశాడు. చెబుతున్నప్పుడు లీలావతి వింటూ ఉండేది. చిత్రమేమిటంటే విన్న లీలావతి మరిచిపోయింది. కడుపులో వున్న పిల్లవాడికి జ్ఞాపకం ఉండిపోయింది. అలా జ్ఞాపకం ఉండడానికి కారణం తన గొప్పతనమని ప్రహ్లాదుడు చెప్పలేదు. "మా అమ్మ మళ్ళీ వచ్చి హిరణ్యకశిపుడితో సంసారంలో పడిపోయి భోగభాగ్యములలో నారడుచు చెప్పిన బోధ మరిచిపోయింది. అందుకు కారణం గురువుల అనుగ్రహం మా అమ్మయందు లేదు. గురువుల అనుగ్రహం, దైవ అనుగ్రహం నాయందు ఉన్నది. అందుకని అమ్మ కడుపులో విన్న నాకు నిలబడిపోయింది. గురువు అనుగ్రహం, దైవానుగ్రహం జ్ఞానం నిలబడడానికి ఎంత అవసరమో చూశారా" అన్నాడు.
అపుడు పిల్లలందరూ లేచి నారాయణ భజన చేయడం మొదలు పెట్టారు. లోపలనుంచి గురువులు బయటకు వచ్చారు. ప్రహ్లాదుడిని పట్టుకుని జరజర ఈడుస్తూ హిరణ్యకశిపుని వద్దకు తీసుకువెళ్ళి "అయ్యా, తులసివనంలో గంజాయి పుట్టినట్లు రాక్షస వంశంలో నీ కొడుకు పుట్టాడు. వీడికి పాఠం చెప్పడం దేవుడెరుగు, వీడు రాక్షస బాలకులనందరిని పాడుచేసేశాడు. అందరిని నారాయణ భక్తులుగా చేసేస్తున్నాడు" అన్నారు. ఇలా అనేసరికి హిరణ్యకశిపుడు "ఎవరి దిక్కు చూసూకుని ఎవరి బలం చూసుకొని నీవు ఇలా ప్రవర్తిస్తున్నావు" అని కుమారుని చూసి అడిగాడు.
బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్!
బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్రా!!
"నాన్నా, నీలో బలానికి కారణమెవడో వాడే నాలో బలమునకు కూడా కారణం. బలహీనుడయిన వానిలో వున్న కొంచెం బలానికి కారణం ఎవరో లోకములను సంపాదించిన మహాబలవంతుల బలమునకు కారణమెవడో వాడు నాకు దిక్కు" అన్నాడు. "ఏమిరా, వాడు దిక్కు దిక్కు అంటున్నావు కదా, వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పగలవా?" అని హిరణ్యకశిపుడు అడిగాడు. "నాన్నా, ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతావేమిటి? ఇదొక వెర్రి ప్రశ్న. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుం
ఎందెందు వెదకి చూసిన నందందే కలడు దానవాగ్రణి వింటే!!
జ్ఞాననేత్రంతో చూసే దంతి కనపడదు. దారువు కనపడుతుంది. ఆభరణం కనపడదు. స్వర్ణం కనపడుతుంది. పాత్ర కనపడదు. మట్టి కనపడుతుంది. జ్ఞాన నేత్రంతో చూడు. ఉన్నది నారాయణుడు ఒక్కడే. అంతటా స్వామి ఉన్నాడు. నువ్వు చూడడానికి ప్రయత్నం చెయ్యి" అన్నాడు. ఒక ప్రక్క తండ్రి ఆగ్రహంతో ఉంటే అంతటా నారాయణుడు ఉన్నాడని చెప్పడానికి ఆనంద పారవశ్యం వచ్చేసి పొంగిపోతూ ప్రహ్లాదుడు నాట్యం చేస్తూ
కలడంబోధి, గలండు గాలి, గలడాకాశంబునం, గుంభినిం
గల, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గల, డోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటం
గల, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్!!
నాన్నా, ఈశ్వరుడు ఎక్కడలేడు అని అడుగు. ఈశ్వరుడు లేని ప్రదేశం లేదు. రాత్రులందు పగలందు, ఆకాశమునందు పైన మధ్యలో సర్వభూతములయందు అగ్నియందు ఓంకారము నందు సమస్త ప్రపంచమునందు నిండి నిబిడీ కృతమై ఉన్నాడు. ఆయనలేని ప్రదేశం లేదు" అనేసరికి హిరణ్యకశిపునికి చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది.