పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

కథలు - భాగవతాలు : ప్రియవ్రతుని చరిత్ర

పంచమ స్కంధము - ప్రియవ్రతుని చరిత్ర.

భగవత్కథ అనే దానికి అర్థం భగవంతుడిని నమ్ముకుని జీవితమును నడుపుకున్న మహా భాగవతుల చరిత్ర. భగవత్సంబధమైన కథ కనుక దీనికి భాగవతం అని పేరు వచ్చింది. భాగవతం తెలిసి వినినా తెలియక వినినా కేవలం కథా స్వరూపంగా వినపడినా జీవితమునకు ఒక గొప్ప అదృష్టమే!

స్వాయంభువ మనువుకు ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు. కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ప్రియవ్రతుడు జన్మతః విశేషమయిన భక్తితత్పరుడు. చిన్నతనంలోనే వైరాగ్య సంపత్తిని పొందాడు. దీనికి తోడూ బంగారు పళ్ళెమునకు గోడ చేరువబ్బినట్లు ఆయనకు నారద మహర్షి గురుత్వం లభించింది. నారద మహర్షి ఆయనను గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోబెట్టి జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు. ఇంత జ్ఞానమును పొంది ఇంత భక్తి పొంది ఇంత వైరాగ్యమును పొందినవాడు స్వాయంభువ మనువు రాజ్యమును స్వీకరించమంటే స్వీకరిస్తాడా? స్వీకరించడు. ఒకరోజున తండ్రిగారు వెళ్ళి కుమారుడిని అడిగాడు. "నాయనా, నీకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. నీ తోడబుట్టిన వాడికి ఇద్దరికీ సమానంగా రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇంకా ఈ రాజభోగములయందు విరక్తి చెంది వున్నాను. తపస్సుకు వెళ్ళిపోతున్నాను. అందుకని నీవు వచ్చి రాజ్యమును స్వీకరించు" అన్నాడు. ఇలా మాట్లాడడం చాలా కష్టం. కథలో చెప్పినంత తేలిక కాదు. అపుడు ప్రియవ్రతుడు "నాకు ఈ ప్రకృతి సంబంధము, దీని బంధనము గురించి బాగా తెలుసు. ఈ శరీరములోనికి వచ్చినది బంధనములను పెంచుకుని అవిద్యయందు కామక్రోధములయందు అరిషడ్వర్గములయందు కూరుకుపోవడానికి కాదు. పైగా నేను ఒకసారి రాజ్యం ఏలడం మొదలుపెట్టి అంతఃపురంలో జీవనం చేయడం ప్రారంభిస్తే నా అంత నేను తెలియకుండానే గోతిలో పడిపోతాను. అందుకని నాన్నగారూ, నాకు రాజ్యం అక్కరలేదు. నేను ఇలాగే ఉండి ఈశ్వరుడిని చేరుకుంటాను. భగవంతుడి గురించి తపిస్తాను అన్నాడు.

ఈమాట వినగానే చతుర్ముఖ బ్రహ్మగారు గబగబా కదిలివచ్చారు. ఎందుకని వచ్చారు అంటే ప్రజోత్పత్తి చేసి, రాజ్య పరిపాలన చేసి ధర్మమును నిర్వహించమని స్వాయంభువ మనువును బ్రహ్మగారు సృష్టించారు. ఇపుడు ఈ ప్రియవ్రతుడు ఈశ్వరాభిముఖుడై వెళ్ళిపోతానంటున్నాడు. అపుడు బ్రహ్మగారు ఊరుకున్నట్లయితే ఇదే లోకమున కట్టుబాటు అయిపోతుంది. గృహస్థాశ్రమమునందు ప్రవేశించడమనే అత్యంత ప్రమాదకరమయిన చర్య అని కాబట్టి దానియందు ప్రవేశించరాదు అని ప్రజలు భావిస్తారు. అపుడు వైదిక సంప్రదాయంలో వివాహం అనేది పవిత్రమయిన చర్యగా భావించబడదు. ఇక వంశోత్పత్తి ఉండదు. అందుకు కదిలారు బ్రహ్మగారు. "నాయనా ప్రియవ్రతా, సంసారములో ప్రవేశించనని నీ అంతట నీవు ఒక నిర్ణయమునకు వస్తున్నావు. నీకు, నాకు సమస్త లోకపాలురకు బ్రాహ్మణులకు ఎవరి వాక్కు శిరోదార్యమో ఒక ప్రమాణమేమయినా ఉన్నదా? ఇదియే ప్రమాణము అని చెప్పడానికి వేదమే ప్రమాణము అయి వుంటుంది. ఈశ్వరుడు లేదన్న వాడిని నాస్తికుడు అనరు. వేదము ప్రమాణము కాదు అన్న వాడిని నాస్తికుడు అంటారు. అందుకే వేదము కనపడినా వేద పండితుడు కనపడినా వెంటనే నమస్కరించాలి. సత్యం అంటే మారనిది, ధర్మం అంటే మారునది. మారిపోతున్న దానిని పట్టుకుని మారని దాంట్లోకి వెళ్ళాలి. ప్రతిక్షణం మారిపోయే దానిని ధర్మం అని పిలుస్తారు. మారుతున్న ధర్మమును అనుష్ఠానం చేయడానికి నీవు ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. వెళ్ళిన తరువాత నీకు వచ్చిన జ్ఞానము స్థిరమయిన జ్ఞానము. అందుకని నీవు అందులోకి ప్రవేశించు. లేకపోతే నీవు ఈశ్వరాజ్ఞను ఉల్లంఘించిన వాడవు అవుతావు. అయితే గృహస్థాశ్రమం లోకి వెళ్ళకుండా కొంతమంది సన్యసించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అందరూ తప్పుచేసిన వారా అనే సందేహం కలుగవచ్చు. మహాపురుషులు అయిన వారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. అపుడు ఆయన అన్నాడు - మహానుభావా, మీరు వచ్చి ఈ మాట చెప్పారు. కాబట్టి నేను తప్పకుండా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి రాజ్యపరిపాలన చేస్తాను అన్నాడు. ఇదీ ధర్మం అంటే! పెద్దలయిన వారు వచ్చి చెప్పినప్పుడు వారి మాట వినే లక్షణం ఎవరికీ ఉన్నదో వాడు బాగుపడతాడు. బ్రహ్మగారు చెప్పిన వాక్యమును విని ప్రియవ్రతుడు తగిన భార్యను చేపట్టాడు. ఆమె విశ్వకర్మ కుమార్తె. విశ్వకర్మ అంటే సాక్షాత్తు శ్రీమహావిష్ణువే. ఆమె పేరు బర్హిష్మతి. ఆమెయందు పదిమంది కుమారులను, ఊర్జస్వతి అనే కుమార్తెను కన్నాడు. దీనిచేత ఆయన తరించాడు. ఊర్జస్వతిని శుక్రాచార్యుల వారికి ఇచ్చి కన్యాదానం చేశాడు. వారిరువురికీ దేవయాని అనబడే కుమార్తె జన్మించింది.⁠⁠⁠⁠

పంచమ స్కంధము - అగ్నీధ్రుడు - నాభి

ప్రియవ్రతుడు అంతఃపురంలో కూర్చుని తాను చేసిన పనులన్నింటిని ఈశ్వరానుగ్రహాలుగా భావించాడు. ఆయన ఏది చేసినా భగవంతుడిని తలుచుకుని చేశాడు. అందువలన గృహస్థాశ్రమంలో ఉన్న ప్రియవ్రతుడు, సంసారమును వదిలిపెట్టి వెళ్ళి హిమాలయములలో కూర్చుని కొన్నివేల సంవత్సరములు తపస్సు చేసిన ఒక మహాయోగి ఎంతటి తేజస్సుతో కూడిన స్థితిని పొందుతాడో అంతటి స్థితిని పొందేశాడు. ఇప్పుడు ఆయనకు ఒక విచిత్రమయిన కోరిక పుట్టింది. మేరుపర్వతమునకు ఉత్తర దిక్కున సూర్యుడు ఉన్నపుడు భూమికి దక్షిణం దిక్కు చీకటిగా ఉంటుంది. సూర్యుడు దక్షిణ దిక్కుగా వుంటే ఉత్తరం చీకటిగా ఉంటుంది. "నేను గృహస్థాశ్రమంలో ఉంది ఈశ్వరారాధనము చేసి శ్రీమహావిష్ణువు అనుగ్రహం చేత ఇంతటి తేజస్సును పొందాను. గృహస్థాశ్రమ గొప్పతనం ఏమిటో శాశ్వతముగా లోకమునకు తెలిసేటట్లు చేయాలి. ఏడు రోజులు ఈ భూమండలమునందు చీకటి లేకుండా చేస్తాను. సూర్యుడు ఎంత వేగంతో తిరుగుతాడో అంత వేగంతో అలసిపోని రథమునెక్కి అంత తేజోవంతమయిన రథం మీద, సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో అంత తేజస్సుతో, సూర్యుడు ఉత్తరమున వుంటే నేను దక్షిణమున ఉంటాను. సూర్యుడు దక్షిణమునకు వచ్చేసరికి నేను ఉత్తరమునకు వెళ్ళిపోతాను. అలా ఏడురోజులూ అవిశ్రాంతంగా తిరుగుతాను. చీకటి లేకుండా అపర సూర్యుడనై తిరుగుతాను. గృహస్థాశ్రమంలో ఉంది పూజ చేసినవాడు ఈ స్థితిని పొందగలడని నిరూపిస్తాను" అని రథం ఎక్కాడు. అలా ఏడురోజులు మేరువు చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ఆ ఏడురోజులు బ్రహ్మాండమునందు చీకటి లేదు.

ఆయన మేరువును చుట్టి ప్రదక్షిణం చేస్తుంటే ఆయన రథపు జాడలు పడ్డాయి. ఏడుసార్లు ప్రదక్షిణంలో ఏడు జాడలలో లోతుగా పడిన చారికల లోనికి వచ్చి ఏడు సముద్రములు నిలబడ్డాయి. అవి - లవణ సముద్రము, ఇక్షు సముద్రము, సురా సముద్రము, దధి సముద్రము, మండోదసముద్రము, శుద్దోదక సముద్రము, ఘృత సముద్రము. రథపు గాడికి గాడికి మధ్యలో ఎత్తుగా భూమి నిలబడింది. అటూ ఇటూ నీరుండగా మధ్యలో ద్వీపములు ఏర్పడ్డాయి. ఇలా సప్త ద్వీపములు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ద్వీపములు అన్నీ ప్రియవ్రతుడు తిరిగినపుడు ఏర్పడిన ద్వీపములు. ఆవిధంగా రథపు గాడి మధ్యలో జంబూ, ప్లక్ష, శాల్మలీ, కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపములు అను ఏడు ద్వీపములు ఏర్పడ్డాయి. ఈ ద్వీపముల పేర్లు వినినంత మాత్రం చేత పాపములు తొలగిపోతాయని పెద్దలు చెప్తారు. ఇంత సాధించిన తర్వాత ఇంకా సంసారంలో ఉందామని ప్రియవ్రతుడు అనుకోలేదు. ఇక నేను ఇప్పటివరకు అనుభవించిన భోగముల వలన కలిగిన సుఖము ఏది ఉన్నదో ఆ సుఖము తాత్కాలికము. దేనివలన ఈ సుఖములు కలిగాయో అది శాశ్వతము. ధర్మానుష్ఠానము వలన సత్యమును తెలుసుకున్నాడు. సత్యమునందు నేను లీనమయిపోతాను అని ప్రవృత్తి మార్గంలోంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఈవిధంగా అరణ్యములకు వెళ్ళి ఘోరమయిన తపమాచరించి తనలోవున్న తేజస్సును ఈశ్వర తేజస్సుతో కలిపి మోక్షమును పొందాడు. బ్రహ్మగారు చెప్పిన మాటలను విని వాటిని మీరు ఆచరించగలిగితే గృహస్థాశ్రమమునందు మీరు సాధించలేనిది ఏదీ ఉండదు.

ప్రియవ్రతుని పెద్దకొడుకు అగ్నీధ్రుదు. అతడు రాజ్యమునకు ఆధిపత్యం వహించి పరిపాలన చేస్తున్నాడు. ఈయనకు కూడా వివాహం కావలసి ఉంది. అందుకని యోగ్యమయిన భార్యను పొందడం కోసమని హిమవత్పర్వత ప్రాంతంలో కూర్చుని బ్రహ్మగారి గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ఈయన యోగ్యతాయోగ్యతలను పసిగట్టి ఒక అప్సరసను పంపించాడు. ఆమె పేరు "పూర్వచిత్తి". పూర్వచిత్తి అంటే సుఖమును సుఖముగానే తలుచుకొనుట. పూర్వచిత్తి ఉన్నచోట మోక్షం ఉండదు. మీరు ఏ స్థితిలో ఉన్నారు అనే దానికి మీరే ఉదాహరణ. సుఖములే జ్ఞాపకం ఉండి, వానియందే పూనిక ఉన్నట్లయితే మనసు ఈశ్వరుడు వైపుకి తిరగక పోయినట్లయితే ఆ సుఖములు సుఖములు కావనే భావన కలగక పోయినట్లయితే మీరు పూర్వచిత్తికి లొంగుతున్నట్లు భావించుకోవాలి. దానివలన ఫలితం తెలుసుకోవాలంటే ఆగ్నీధ్రుడి చరిత్ర వినాలి.

ఆగ్నీధ్రుదు ఒక కన్యకామణి కొరకు బ్రహ్మగారిని గురించి తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మగారు వచ్చి చెప్పేవరకు వేచి వుండాలి. కానీ ఈయనకు సుఖము అన్నది అక్కడ కనపడితే చాలు అక్కడ మనసు లగ్నమవుతుంది. ఆయనకు అదొక అలవాటు. కాబట్టి ఆయన పూర్వచిత్తి గజ్జెల చప్పుడు విన్నాడు. కళ్ళు విప్పి చూసి ఆమె అంగాంగ వర్ణన చేశాడు. ఆమెతో మభ్యపెట్టే మాటలు మాట్లాడాడు. ఫలితంగా పూర్వచిత్తి లొంగింది. ఆమెతో కలిసి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఇలా గడపగా గడపగా ఆయనకీ నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావర్తుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భ్రద్రాశ్వువు, కేతుమానుడు అనే తొమ్మండుగురు కుమారులు జన్మించారు. వారు తొమ్మండుగురు అతి బలిష్ఠమయిన శరీరం ఉన్నవారు. పూర్వచిత్తి చాలాకాలం ఆగ్నీధ్రుడితో సంసారం చేసి ఆఖరుకి తన లోకం వెళ్ళిపోతానని చెప్పి ఈయనను విడిచిపెట్టి తన లోకం వెళ్ళిపోయింది. తరువాత ఆగ్నీధ్రుదు పూర్వచిత్తి ఎక్కడికి వెళ్ళిపోయిందో అక్కడికి వెళ్ళిపోవడం కోసం అనేక యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. చివరకు ఆమె వున్న లోకమును పొందాడు.

ఇపుడు ప్రియవ్రతునికి ఆగ్నీద్రుడికి ఉన్న తేడాను ఒకసారి గమనించండి. ప్రియవ్రతుడు తానూ చేస్తున్న పని గురించి ప్రశ్న వేసుకుని భార్యను విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళాడు. ఆగ్నీధ్రుడు పూర్వచిత్తి వున్న లోకమును పొందాడు. ప్రియవ్రతుడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్యమును పొందాడు.

ఆగ్నీధ్రుడి పెద్ద కుమారుడు నాభి. ఆయన మేరుదేవి అనబడే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆవిడతో కలిసి సంతానమును పొందాలి అనుకున్నాడు. ఆయన అనేక యజ్ఞయాగాది క్రతువులను చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే తపస్సు చేసి కొడుకును పొందాడు ఆగ్నీధ్రుదు. యజ్ఞము చేసి కొడుకును పొందాడు నాభి. నాభి పరిపాలించాడు కాబట్టి ఈయనకు వచ్చిన రాజ్యమును "అజనాభము" అని పిలిచారు. ఈయన చేసిన యజ్ఞమునకు సంతసించి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షం అయ్యారు. ఈ సందర్భంలో అక్కడ ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. అక్కడ యజ్ఞం చేస్తున్న వాళ్ళని ఋత్విక్కులు అంటారు. శ్రీమన్నారాయణ దర్శనం కలుగగానే వారందరూ లేచి నిలబడ్డారు. నాభి కూడా లేచి నిలబడి "స్వామీ, నీవు పరాత్పరుడవు. నేను నిన్ను ఒక కోరికతో ఆరాధన చేసి యజ్ఞం చేశారు. నీవు ప్రత్యక్షం అయినపుడు నిన్ను మోక్షం అడగడం మానివేసి ఒక కొడుకును ప్రసాదించమని అడగడం ఒక ధనికుడిని దోసెడు ఊకను దానం చేయమని అడగడంతో సమానం. అయినా నేను అదే అడుగుతాను" అన్నాడు. గృహస్థాశ్రమం పట్ల నాభికి వున్న గౌరవం అటువంటిది. తను ఒక కొడుకును కంటే తప్ప పితృఋణం నుండి తాను విముక్తుడు కాదు. కానీ ఆ కొడుకు తనను ఉద్ధరించే కొడుకు కావాలి. అటువంటి కొడుకును పొందాలనుకున్నాడు.

శ్రీమహావిష్ణువు "అల్పాయుర్దాయం ఉన్న ఉత్తముడు కావాలా లేక దీర్ఘాయుర్దాయం ఉన్న మహాపాపి కావాలా" అని అడిగాడు. అపుడు నాభి ఒక తెలివైన పని చేశాడు. నాభి అన్నాడు "ఈశ్వరా, నాయందు వున్న భక్తిని నీవే ప్రచోదనం చేసి నాకు దర్శనం ఇచ్చి నన్ను ఉద్ధరించావు. ఇంతగా భక్తికి లొంగేవాడివి కాబట్టి నిన్నొక కోరిక కోరుతున్నాను. నీలాంటి కొడుకును నాకు ఒకడిని ప్రసాదించవలసినది అని కోరాడు. అపుడు శ్రీమహావిష్ణువు "నీవు ఇటువంటి స్తోత్రం చేసినందుకు లొంగాలో, ఈ ఋత్విక్కులు నీవు అలా అడుగుతున్నప్పుడు తథాస్తు అనినందుకు లొంగాలో - ఏమయినా నేను నీకు లొంగవలసిందే. కానీ నేను ఒకటే ఆలోచిస్తున్నాను. నేను ముందు నాభి తినే ఆహారంలోంచి నాభిలోనికి వెళతాను. నాభి జీర్ణం చేసుకున్న తరువాత నాభి వీర్యకణములను ఆశ్రయిస్తాను. నాభి తేజస్సుగా నాభిలోంచి నాభి బార్య అయిన మేరుదేవి లోకి వెళతాను. మీరు తథాస్తు అన్నందుకు పది నెలలపాటు గర్భస్థమునందు అంధకారంలో పడివుంటాను. నాభి కుమారుడనని అనిపించుకుని మేరుదేవి కడుపులోంచి ప్రసవమును పొంది పైకి వస్తాను" అన్నాడు. భక్తితో కొలిచిన వారికి ఈశ్వరుడు ఎందుకు లొంగడు!

ఈమాట వినిన తరువాత నాభి చాలా సంతోషించాడు. మేరుదేవి గర్భమును ధరించింది. "నల్లనివాడు" నేను పుడతాను అని వరం ఇస్తే తెల్లగా వచ్చాడు. అంటే లోకానికి ఏదో జ్ఞానబోధ చేయడానికి వచ్చాడన్నమాట! అన్ని రంగులు తెలుపులోంచి పైకి వచ్చి మరల తెలుపులోకి వెళ్ళిపోతాయి. అనగా సృష్టి ఎందులోంచి వచ్చి ఎందులోకి వెళ్ళిపోతోందో చెప్పే మహాజ్ఞానిగా రాబోతున్నాడు. దానివలన తనను కొడుకుగా కావాలని అడిగినందుకు పైన వంశం అంతా తరించిపోవాలి. జ్ఞాని పుట్టుకచేతనే కదా ఏడుతరాలు తరిస్తాయి! అందుకని ఇపుడు తెల్లటివాడిగా వచ్చాడు. ఈ పిల్లవాడిని చూసి మురిసిపోయి నాభి కొడుక్కి "ఋషభుడు" అని పేరు పెట్టుకున్నాడు.

ఋషభుడు బాహ్యపూజ చేసేవాడు కాదు. అంతరమునందు విశేషమయిన యోగమును అనుసంధానం చేస్తూ ఉండేవాడు. ఋషభుడు బాహ్యకర్మలు చేయడం లేదని ఇంద్రునికి కోపం వచ్చి వర్షం కురిపించడం ఆపేశాడు. "మన రాజ్యంలో వర్షం పడడం లేదు. క్షామం వచ్చేటట్లు ఉంది" అని తండ్రి వెళ్ళి కుమారుని వద్ద బాధపడ్డాడు. అపుడు ఋషభుడు ఒకనవ్వు నవ్వి తన యోగబలంతో మేఘములను సృష్టించి తన రాజ్యం ఎంత వరకు ఉన్నదో అంతవరకూ వర్శములను కురిపించాడు. దానిచేత ఎక్కడ చూసినా పంటలు పండి సస్యశ్యామలమై పోయి నాభి పరమసంతోష పడేటట్లుగా ఈ ఋషభుడు ప్రవర్తించాడు. పరమ సంతోషమును పొంది ఋషభుడికి పట్టాభిషేకం చేసి తపస్సు చేసుకునేటందుకు నాభి ఇల్లు విడిచి పెట్టి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి తపస్సు చేసి బ్రహ్మమునందు కలిసిపోయాడు.⁠⁠⁠⁠

పంచమ స్కంధము - ఋషభుడు - భరతుడు

ఇపుడు నాభి ఒక కొత్త మార్గమును ఆవిష్కరించాడు. ఆయన యజ్ఞము గొప్పతనమును ఆవిష్కరించాడు. యజ్ఞము చేత భక్తిచేత పరమేశ్వరుడిని కట్టి ఎలాగ తన కొడుకుగా తెచ్చుకోవచ్చునో నిరూపించాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఏ స్థితిని పొందవచ్చునో తెలియజేశాడు. ఆయన భగవంతుడిని మోక్షం ఇమ్మని అడగలేదు. ఋషభుడిని కొడుకుగా పొంది వైరాగ్య సంపత్తి చేత తాను మోక్షమును పొందాడు. ఇది నాభి వృత్తాంతము.

ఋషభుడు చాలాకాలం రాజ్యం చేసి వివాహం చేసుకున్నాడు. తరువాత తన కుమారులను పిలిచి రాజ్యం అప్పచెప్పి వెళ్ళిపోయే ముందు పిల్లలను పిలిచి ఒకమాట చెప్పాడు. ఋషభుడి చరిత్ర వింటున్న వారికి చదువుచున్న వారికి సాక్షాత్తుగా శ్రీమహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది అని పెద్దలు చెపుతారు. "కుమారులారా! కుక్క ఎన్ని కష్టాలు పడుతోందో అత్యంత పవిత్రమయిన ఉపాధిని పొందిన మనిషి కూడా అన్ని కష్టాలు పడుతున్నాడు. దేనివల్లనో తెలుసా? కేవలము కామము చేత కష్టములు పడుతున్నాడు. కామము అంటే కేవలము స్త్రీపురుష సంబంధమైన గ్రామ్య సుఖము మాత్రమే కాదు. కామము అంటే కోరిక. కోరికకు ఒక లక్షణం ఉంటుంది. అది లోపల అంధత్వమును ఏర్పరుస్తుంది. మీరు ఒక కోరికకు లొంగినట్లయితే ఒక పరిమితమైన కోర్కె పెట్టుకొని మీ శక్తిని దృష్టిలో పెట్టుకుని అక్కడవరకు ప్రయాణం చేయడం గృహస్థాశ్రమంలో దోషం కాదు. కానీ వాళ్ళను చూసి వీళ్ళను చూసి అలవికాని కోర్కెను పెంచుకున్నారనుకోండి ఆ కోరిక మిమ్మల్ని బంధిస్తుంది. అపుడు ధర్మము గాడితప్పవచ్చు. లేదా ఉండవలసిన దానికన్నా అనవసరమైన దానికి తిరగడంలో మీరు చేయవలసిన ఈశ్వరారాధన మీరు వదులుకుంటున్నారు. కాబట్టి కోరికలు మిమ్మల్ని మిమ్మల్ని బంధించి వేసి కళ్ళల్లో ధూళి పోసి కనపడకుండా చేస్తాయి. అప్పుడు మనిషి కుక్కకన్నా హీనం అయిపోతాడు. అందరిచేత ఛీ అనిపించుకుంటావు. కామమును అదుపు చెయ్యి. మనసులో ధారణ ఉండాలి, పూనిక ఉండాలి. అందుచేత కామం పెరిగిపోవడమే బంధహేతువు అయిపోతుంది. దీనిని విరగ్గొట్టడానికి నేను రెండు మార్గములు చెపుతాను జ్ఞాపకం పెట్టుకోండి. అందులో మొదటి తపము చేయడం. తపము లేక ధ్యానము చేయండి. ఈశ్వరునియందు భక్తిని పెంపొందించుకోండి. రెండవది సజ్జన సాంగత్యము. సజ్జన సాంగత్యము ఒక్కటే ఈశ్వరుని దగ్గరకు తీసుకువెళుతుంది. ప్రయత్నపూర్వకంగా భగవద్భక్తులతో స్నేహం చేసి వాళ్ళను గౌరవించడం నేర్చుకో. క్రమక్రమంగా అంతటా ఈశ్వరుడిని చూడడం నేర్చుకో. "నేను, నాది" అనే భావన విడిచిపెట్టు. అని బిడ్డలకి చెప్పి నేను బయలుదేరుతున్నాను అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంటే ఆయన రూపమును చూసి ఏమి అందగాడని ప్రజలంతా మోహమును పొందారు. ఆయన మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. స్నానం లేదు. ఒళ్ళంతా ధూళి పట్టేసింది. ఇంతకు పూర్వం ఋషభుడిని చూసిన వారు ఇప్పుడు ఆయనను చూసినా గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. అలా వెళ్ళిపోయి చాలా కాలానికి "అజగరవ్రతము" అని ఒక చిత్రమయిన వ్రతం పట్టాడు.

అజగరము అంటే కొండచిలువ. కొండచిలువ ఎలా భూమిమీద పడిపోయి ఉండిపోతుందో అలా ఒకచోట భూమిమీద పడిపోయి ఉండిపోయాడు. అతడు పొందిన యోగసిద్ధికి సిద్దులన్నీ "అయ్యా మేము నిన్ను వరిస్తున్నాము, స్వీకరించండి" అని అడిగాయి. నాకీ సిద్ధులు అక్కరలేదు అని వెళ్ళిపొమ్మన్నాడు. అలా చాలాకాలం పడివుండి ఒకనాడు దక్షిణ కర్ణాటక రాష్ట్రమునందున్న అరణ్యమునందు నడుస్తున్నాడు. ఆయన అలా నడిచివెడుతుంటే అక్కడ వున్న చెట్లు ఒకదానితో ఒకటి రాపాడి ఒక అగ్నిహోత్రము బయలుదేరింది. పెద్ద అగ్నిజ్వాలలు రావడం ప్రారంభించాయి. ఆయన వాటివంక చూస్తూ నవ్వుతూ నిలబడ్డాడు. అవి వచ్చి అంటుకుంటే శరీరం పడిపోతుంది అనుకున్నాడు. యధార్థమునకు అలా ఉండడం అంత తేలికకాదు. అందుకే అన్నారు - ఋషభుడి కథ అసుర సంధ్యవేళ ఎవరు వింటున్నారో వాళ్లకి సమస్త కామితార్థములు ఇవ్వబడతాయి అని చెప్పబడింది. ఆ అగ్నిహోత్రం శరీరమును పట్టుకుంటుంటే నవ్వుతూ నిలబడ్డాడు. శరీరం కాలిపోయింది. తాను ఆత్మలో కలిసిపోయాడు. ఋషభుడు ఇలా శరీరమును వదిలిపెట్టాడు అని రాజ్యమును ఏలుతున్న అరహన్ అనే రాజు తెలుసుకున్నాడు. తెలుసుకుని "మనకు ఒక సత్యం తెలిసింది. లోపల ఉన్నది ఆత్మా. ఈ శరీరం మనకు కాదు. కాబట్టి ఈ రాజ్యంలో వున్న వాళ్ళెవరూ స్నానం, సంధ్యావందనం చేయనక్కరలేదు. దేవాలయములకు వెళ్ళక్కరలేదు. పూజలు చేయనక్కర లేదు. బ్రాహ్మణులను గౌరవించనక్కరలేదు. యజ్ఞయాగాదులు చేయనవసరం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతారు" అని చెప్పాడు. వాళ్ళందరూ ఈ ప్రక్రియ మొదలు పెట్టారు.

అయితే వ్యాసుల వారు ఇది మహా దోషము అన్నారు. ఎందుచేత? ఇది కలియుగ లక్షణము. మీరు ప్రయత్నపూర్వకంగా జ్ఞానిని అనుకరించరాదు, అనుకరించలేరు. మీరు ఎన్నడూ అజ్ఞానిని అనుకరించరాదు. మీరు కర్మ చెయ్యాలి. అదే మిమ్మల్ని జ్ఞానిని చేస్తుంది. కానీ మహాజ్ఞానిని గౌరవించి వారి బోధనలు విని అటువంటి స్థితిని పొందడానికి భక్తితో కూడిన కర్మాచరణము చేయాలి. అది వైరాగ్యమును ఇచ్చి మిమ్ములను ఒకనాటికి జ్ఞానిగా నిలబెట్టవచ్చు. ఇక్కడ కొంతమంది పొరపడుతుంటారు. అదే అరహన్ చేసిన భయంకర కృత్యము. కాబట్టి ఒక మహాపురుషుని జీవిత కథగా దీనిని విని చేతులు ఒగ్గి నమస్కరించాలి. అలా చేస్తే మీకు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి మీరు కృష్ణ పాదములను చేతుకుంటారు. మీకు ఇహమునందు సమస్తము కలుగుతుంది.