కథలు - భాగవతాలు : ఋషుల శాపము
ఋషుల శాపము
వారికి కొద్ది దూరంలో వున్న కొందరు యాదవులు నవ్వుతూ తుళ్ళుతూ దూరం నుండి ఆ మహర్షులను చూశారు. కృష్ణుని ప్రచోదనం చేత వాళ్ళలో ఒక చిత్రమయిన బుద్ధి పుట్టింది. సాంబుడికి చీరకట్టి ఆడదానిలా అలంకరించి కడుపు ఎత్తుగా కనపడేటట్లు చేసి వీళ్ళు ఏపాటి పరిజ్ఞానంతో చెపుతారో చూద్దామని అతడిని ఆ మహర్షుల దగ్గరికి తీసుకువచ్చారు. వారు సాంబుడిని మహర్షుల ముందు నిలబెట్టి “మీరు మహాత్ములు కదా! మీకు తెలియని విషయములు ఉండవు కదా. మీరు త్రికాలవేదులు. ఈ ఆడపిల్ల కడుపులో మగవాడు ఉన్నాడా, ఆడపిల్ల ఉందా కవలలు ఉన్నారా ఏ విషయం మాకు చెప్పండి” అన్నారు. అనేసరికి వాళ్ళు ఆ స్త్రీవంక చూశారు. వాళ్లకి మహా ఆగ్రహం వచ్చింది. “మీకు భగవద్భక్తులతో పరాచికమా? కృష్ణుడు ఉన్న గడ్డమీద వున్న మీరు యిటువంటి పరిహాసం చేయడానికి సిగ్గుపడడం లేదా? ఏ కృష్ణ భగవానుడు బ్రాహ్మణులను చూడగానే భక్తితో సేవిస్తారో, వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్ళు తలమీద చల్లుకుంటాడో అటువంటి కృష్ణుడితో కలిసివున్న మీకు యింతటి దుస్సాహసమా? మాతో పరిహాసమా?” అని వాళ్ళు
“కొడుకూ కాదు, కూతురూ కాదు. క్షణం ఆలస్యం లేకుండా ఆమె కడుపునుంచి ముసలం ఒకటి పుడుతుంది. ఆ రోకలి మీ అందరి తీట తీర్చేస్తుంది. దానితో మీ యదుకులం నాశనం అవుతుంది. పరిహాసం చేస్తున్న వారికి భయం వేసింది. ఇలా అన్నారేమిటని సాంబుడికి చీర విప్పారు. ఆ చీరలోంచి కడుపు దగ్గర నుంచి ఒక పెద్ద యినుప రోకలి కిందపడింది. వాళ్లకి భయంవేసి ఆ రోకలి తీసుకుని పరుగుపరుగున కృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి “మేము తెలియక మహర్షులతో పరిహాసం ఆడాము. వారు శపించారు. ఈ రోకలి పుట్టింది. ఇప్పుడు మమ్మల్ని ఏమి చేయమంటావు?” అని అడిగారు. అపుడు కృష్ణ పరమాత్మ – “ఈమధ్య దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. యివి యదుకుల నాశానమును సూచిస్తున్నాయి. మీ అందరు ఆ ఇనప ముసలము చేత మరణిస్తారు. కాబట్టి దీనిని తీసుకుని సముద్రపు ఒడ్డుకు వెళ్ళండి. అక్కడ పెద్ద శిఖరం ఒకటి ఉన్నది. ఆ శిఖరం మీద ఈ ఇనుప ముసలమును అరగదీసి దీనిని సముద్రంలో కలిపివెయ్యండి” అని చెప్పాడు. అపుడు వారు ఆ ముసలమును పట్టుకుని ఆ శిఖరం మీదికి వెళ్ళి ఆ ముసలమును అరగదీయడం మొదలు పెట్టారు. అది కరిగి కరిగి నల్లని తెట్టు కారుతోంది. ఆ తెట్టు తీసుకువెళ్ళి సముద్రంలో కలిపేస్తున్నారు. అరగదియ్యగా అరగదియ్యగా చివరకు చిన్న ఇనప ములుకు ఒకటి మిగిలింది. ఆ ములుకు వల్ల ప్రమాదం ఏమీ లేదని భావించి ఆ ములుకును సముద్రంలోకి విసిరేశారు.
ఆ ములుకును ఒక చేప మింగింది. ఒక బోయవాడు పక్షులు దొరక్క చేపలు పట్టుకుందుకు సముద్రం దగ్గరకు వచ్చాడు. వాడి వలలో ఈ చేప పడింది. వాడు యింటికి వెళ్ళి ఈ చేపను కోశాడు. దాని కడుపులోంచి ఆ ఇనుప ముళ్ళు కనపడింది. ఆ ఇనపముల్లును తన బాణమునకు పెట్టుకుని ఆ బాణంతో దేనిని కొట్టాలా అని అడవిలో తిరుగుతున్నాడు.