కథలు - భాగవతాలు : రుక్మిణీ కళ్యాణం
రుక్మిణీ కళ్యాణం
భాగవతంలో దశమస్కంధము ఆయువుపట్టు. ఈ దశమ స్కంధమును పూర్వోత్తర భాగాములని మరల రెండుగా విభజించారు. పూర్వభాగమును రుక్మిణీకళ్యాణం దగ్గర పూర్తి చేస్తారు. భాగవతంలో రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత, రుక్మిణీ కళ్యాణం చేసినందు వలన, చూసినందు వలన, వినినందు వలన, చదివినందు వలన కలిగే ఫలితం చెప్పడానికి మాటలు చాలవు. రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడయిన వరుడు కన్యకు వచ్చి తీరుతాడు. రుక్మిణీకళ్యాణ ఘట్టమును ప్రారంభం చేస్తూ పోతనగారు
వినుము విదర్భదేశమున వీరుఁడు కుండినభర్త భీష్మకుం
డను నొక దొడ్డరాజు గలఁ ; డాతని కేవురు పుత్రు లగ్రజుం< br >
డనయుఁడు రుక్మినాఁ బరఁగు ; నందఱకుం గడగొట్టు చెల్లెలై< br >
మనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణినాఁ బ్రసిద్ధయై.
విదర్భ దేశమును భీష్మకుడు అనే దొడ్డ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు అయిదుగురు కుమారులు. వాళ్ళ పేర్లు రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. వీరికి చిట్టచివర ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్ల రుక్మిణీదేవి.అయిదుగురి చెల్లెలయిన రుక్మిణి పెరిగి పెద్దది అవుతోంది.
పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబు లందు ;
గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి ;
రమణీయ మందిరారామ దేశంబులఁ బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు ;
సదమల మణిమయ సౌధభాగంబుల లీలతో భర్మడోలికల నూఁగు
బాలికలతోడఁ జెలరేగి బంతు లాడ శారికా కీర పంక్తికిఁ జదువుఁ జెప్పు<
బర్హి సంఘములకు మురిపములు గరపు మదమరాళంబులకుఁ జూపు మందగతులు.
ఆతల్లి చిన్నప్పటినుంచి కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేది. రుక్మిణీ దేవి అంతఃపురము నుండి ఎప్పుడూ డోలు, సన్నాయి వినబడుతూనే ఉండేవి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా ఒక కన్నెపిల్ల సువాసిని అయ్యేది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే స్త్రీకి పసుపుకుంకుమలు నిలబడతాయి. ఆవిడ గుజ్జనగూళ్ళను వండించి వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్ళిళ్ళు చేసి పెడుతూ ఉండేది. ఆడవాళ్ళు చేసే పనులు పరమ సౌకుమార్యంతో ఉంటాయి. ఆవిడ లతలకు, తీగలకు చక్కగా పందిరి వేసేది. ఎప్పుడూ ఊయలలు ఊగుతూ ఉండేది. చిలుకలకు పలుకులు నేర్పుతుండేది. హంసలకు నడకలు నేర్పేది. ఇటువంటి తల్లి శ్రీకృష్ణ భగవానుని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
రుక్మిణీ కళ్యాణం – 2
తండ్రి అయిన భీష్మకుని దగ్గరకు తరచుగా భాగవతులు వస్తూ ఉండేవారు. వచ్చిన భక్తులను ఆయన ఆదరణ చేస్తూ ఉండేవాడు. వారు ఎప్పుడూ భగవత్సంబంధమైన విషయములను మాట్లాడేవారు. కృష్ణుని కథలు వాళ్ళు చెప్పేవారు. భీష్మకుడు వాటిని వినేవాడు. ఆ సందర్భంలో రుక్మిణి కూడా వారు చెప్పే కథలను వినేది. అందువలన క్రమంగా ఆమె మనస్సు కృష్ణునియందు చేరింది. రుక్మిణీ కళ్యాణ ఘట్టమును కథగా వింటే మీకు కలిగే ప్రయోజనం తక్కువ. ఆ కథ ద్వారా మీ ఇల్లు ఎలా ఉండాలో మీరు చూసుకోవాలి. మీ యింటికి వచ్చేవారు పదిహేను నిమిషములు మాట్లాడితే కనీసంలో కనీసం అయిదు నిమిషములు భగవత్సంబంధమో, పిల్లలు విన్నా పనికివచ్చే మాటలో మాట్లాడేవాడు అయి వుండాలి. అంతే కానీ యింటికి వచ్చేవాడు లౌకికమయిన విషయములు, వాడి మీద గోల, వీడి మీద గోల, అసలు పనికొచ్చే విషయములు మాట్లాడడం అలవాటు లేకపోయినట్లయితే అదే సంస్కృతి పిల్లలకు వస్తుంది. ఒక యింట్లో ఇంటాయనకు పరమాచార్య అంటే ప్రాణం అనుకోండి. ఆయన పరమాచార్యను అస్తమాను తలుచుకుంటుంటే యింట్లో పిల్లలకు పెద్దలఎడ భక్తి భావన గౌరవము ఏర్పడతాయి. యింట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు పిల్లలకు గొప్ప సంస్కృతిని నేర్పుతాయి. తన యింటికి వచ్చిన భాగవతుల మాటల వలన రుక్మిణికి కృష్ణ పరమాత్మయందు హృదయము కుదురు కొనినది. ఆయననే వివాహం చేసుకోవాలని మనస్సు నందు నిశ్చయించుకుంది. ఆవిడ ధైర్యము కలిగినదై, పరబ్రహ్మతత్వము తెలిసి వున్నదై ఇంతకు పూర్వం ఏ పురుషునికీ తన హృదయంలో స్థానము ఇవ్వనిదై కులవతియై ఆచారము సంప్రదాయము తెలిసి వున్నదై కేవలము కామముతో ఎవరో పురుషుని పొందేద్దాము అన్న ప్రయత్నము ఉన్నది కానిదై ఇతఃపూర్వము వేరొక పురుషుడు మనసులో కూడా నిలబడని స్వరూపము కలిగినదై తన భర్తను తాను ఎన్నుకొన్న స్త్రీగా రుక్మిణీదేవి నిలబడి ఉన్నది. ఆ స్థాయిని అమ్మవారు పొందారు.
బంధువు లెల్ల గృష్ణునకు బాలిక నిచ్చెద మంచు శేముషి
సింధువులై విచారములు సేయగా వారల నడ్డుపెట్టి దు
స్సంధుడు రుక్మి కృష్ణునెడ జాల విరోధము జేసి మత్తపు
ష్పందయవేణి నిత్తు శిశుపాలున కంచు దలంచె నంధుడై!!
నల్లటి తుమ్మెదలు ఎలా ఉంటాయో అటువంటి జుట్టు గలిగిన రుక్మిణీ దేవిని కళ్ళు లేనివాడై పెద్దన్న గారయిన రుక్మి శిశుపాలునకు యిస్తానంటున్నాడు. అమ్మవారు జుట్టు నలుపుకి రుక్మికి ఏమిటి సంబంధం? అంధత్వము చీకటిని చూపిస్తుంది. అమ్మవారి జుట్టు నల్లగా ఉంటుంది. అమ్మవారి జుట్టుకి ఒక లక్షణం ఉంది. నల్లని అమ్మవారి కబరీ బంధమును మీరు ధ్యానం చేసినట్లయితే అజ్ఞానము నశిస్తుంది. శిశుపాలుడు రుక్మిణీ దేవిని వివాహం చేసుకుందామని తరలి కన్యాదాతగారి యింటికి వచ్చేశాడు. ఇంకా అమ్మవారిని పెళ్లి కూతురుని చెయ్యాలి. శిశుపాలునితో జరాసంధుడు మొదలయిన వాళ్ళు వచ్చారు. ఇప్పుడు రుక్మిణి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుని ఆశ్రయించింది. ఆయనను పిలిచి ఒక మాట అంది. “మహానుభావా నేను శ్రీకృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవాలని అనుకున్నాను. కానీ నా అన్నగారయిన రుక్మి నన్ను తీసుకొని వెళ్ళి శిశుపాలున కిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుచేత నేను రాసిన ఈ లేఖను పట్టుకొని వెళ్ళి ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మకు అందించి నన్ను కృతార్థురాలిని చేయవలసింది” అని అడిగింది. వెంటనే అగ్నిద్యోతనుడు ఆ లేఖను పట్టుకొని ద్వారకా నగరమును చేరుకున్నాడు.
కృష్ణ పరమాత్మ అగ్నిద్యోతనుడు వచ్చాడని తెలుసుకున్నారు. కానీ అగ్నిద్యోతనుడు ఎక్కడి నుండి వచ్చాడో తెలిసివున్న వాడిలా ప్రవర్తించలేదు. బ్రాహ్మణుడు వచ్చాడని ఆయనను గౌరవించి, ఆయనకు అర్ఘ్య పాద్యాదులు ఇచ్చిన తరువాత ఆయనకు మధురాన్నములతో భోజనం పెట్టి, ఆయన కూర్చున్న తరువాత ఆయన పాద సంవాహనం చేస్తూ “అయ్యా మీరు ఏ దేశమునకు చెందినవారు. మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా?” అని అడిగాడు.అపుడు అగ్నిద్యోతనుడు “నేను భీష్మకుడను రాజు పరిపాలిస్తున్న కుండిన నగరం నుండి వచ్చాను. రుక్మిణీ దేవి మీకు యిచ్చిన లేఖను తీసుకువచ్చాను. ఈ లేఖను మీరు అవధరించవలసినది” అని ఆలేఖను తీసి కృష్ణునికి ఇచ్చాడు.
ఆ లేఖను తీసుకొని పరమాత్మ దానిని చదువుతున్నారు. వ్యాసభగవానుడు సంస్కృతంలో రచించిన లేఖను పోతనగారు తెలుగులో చక్కని పద్యములలో ఆంధ్రీకరించారు. వ్యాస భగవానుని మూల శ్లోకములలోని శక్తి పోతనగారి పద్యములలో ఉంది. ఆ పద్యములు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తే గొప్ప ఫలితము కలుగుతుంది. కన్నె పిల్లలకు పెళ్లి అవుతుంది. రుక్మిణీదేవి ఎంత గొప్పగా అడిగిందో చూడండి “నీవు ధన్యుడవు, పదిమందిని ధన్యులను చేస్తావు. లోకమంతటికీ ఆనందమును చేకూరుస్తావు. నీవు భగవంతుడవు, ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శక్తి వీర్యము, తేజస్సు కలవాడివి” అని ఆవిడ భగవంతుని గుణములను ఆవిష్కరిస్తోంది. నేను కాని గత జన్మలలో ఎప్పుడయినా వ్రతం చేసిన దానను అయితే ఒక నోము నోచిన దానను అయితే ఒక మహానుభావుడయిన సద్గురువు పాదములు ఒత్తిన దానను అయితే మనస్ఫూర్తిగా వారి పాదములు ఒకరికి పట్టిన దానను అయితే నాకు అటువంటి పుణ్యమే వుంటే అధముడయిన చేది ప్రభువు శిశుపాలుడు నీచేతిలో మరణించుగాక! నేను నీ దానను ఔదును గాక! అంది.
ఇందులో రహస్యం అంతా ఉంది. భీష్మకుని అయిదుగురు కొడుకులకు రుక్మముతోనే పేర్లు పెట్టబడ్డాయి. రుక్మము అనగా బంగారము. బంగారము లోభమును కలిగిస్తుంది. మనకి అయిదు ఇంద్రియములు. ఈ అయిదు ఎప్పుడూ చేది ప్రభువును కోరుకుంటాయి. చిత్త ప్రభవమే కామము. ఇంద్రియములను అణచడం అంత తేలిక కాదు. ముందు పుట్టిన ఈ అయిదుగురు యింద్రియములు. చేది ప్రభువయిన శిశుపాలుడు కామం. రుక్మిణి అంటే బుద్ధి, మనస్సు. ఈవిడ కృష్ణుడు కావాలని కోరుకుంటోంది. పొందకుండా అడ్డుపడుతున్నవి ఇంద్రియములు. యింద్రియములను గెలవలేకపోతే శరణాగతి చేయాలి. “కృష్ణా నీవు చతురంగ బలంతో రావాలి. ఈశ్వర సంబంధమయిన గుణములు నాయందు ప్రవేశ పెట్ట్టాలి. నీవే నా దగ్గరికి రావాలి. నన్ను ధన్యురాలిని చెయ్యాలి. నాకు వున్న ఈ అరిషడ్వర్గములను అణచాలి. ఇంద్రియ లౌల్యమును తగ్గించాలి. తగ్గించి రాక్షస వివాహం ద్వారా నన్ను నీదానిని చేసుకోవాలి.
రుక్మిణీ నీవు చెప్పావు బాగానే ఉంది. నీవు ఎక్కడో అంతఃపురంలో ఉంటావు. నీదాకా వచ్చి నిన్ను నేను తీసుకు వెళ్ళాలంటే ఎందరినో చంపాలి. అడ్డువస్తే భీష్మకుడిని చంపవలసి ఉంటుంది. అపుడు నా కోరిక వల్ల ఇలా అయిపోయారా అని నీకు మోహబుద్ధి ఏర్పడితే అంటావేమో మా వాళ్ళు నన్ను పెళ్ళికి ముందు ఊరిచివర వున్నా పరమశివుని యిల్లాలయిన పార్వతీ దేవితో కలిసి కూర్చున్న మహాదేవుడయిన శంకరుని ఆలయమునకు పంపిస్తారు. నేను అక్కడికి వచ్చి సర్వమంగళాదేవిని అర్చన చేస్తాను. ఆ సమయంలో నీవు వచ్చి నన్ను నీ రథం ఎక్కించుకొని తీసుకు వెళ్ళిపో.” అని ఉపాయం కూడా అమ్మవారు బోధ చేసింది.
అమ్మవారు అలా చెప్పడంలో రహస్యం అది సర్వస్య శరణాగతి.
ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని ; కర్ణరంధ్రంబుల కలిమి యేల ? భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని ; చక్షురింద్రియముల సత్వ మేల ?
దయిత! నీ యధరామృతం బానఁగా లేని ; జిహ్వకు ఫలరససిద్ధి యేల ?
పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని ; తనులతవలని సౌందర్య మేల ?
“ప్రాణేశా! నీ గురించి వినని ఈ చెవులు వున్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. శిశుపాలుడు నీ గురించి మాట్లాడడు. అతను నీకు శత్రువు. అందుచేత అతని భర్తృత్వం నాకు అక్కరలేదు. నిన్ను చూడడానికి పనికిరాని ఈ కళ్ళు వున్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. నాకు ఎప్పుడూ కూడా నీ అధరామృతం పానం చేయాలని ఉంటుంది. నీవు అనుభవింపని సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకూ కొరగానిది. నిరంతరమూ నిన్ను గాఢాలింగనం చేసుకొని నీ మేడలో వున్న వనమాల వాసన చూడాలని నాకు కోరిక. ఎన్ని జన్మలెత్తితే ఎందుకు? ఎంత పెద్దపెద్ద శరీరములు వస్తే ఎందుకు? నీ సేవ చేయని శరీరం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే.
ఏ నీ గుణములు గర్ణేంద్రియంబులు సోఁక దేహతాపంబులు దీఱిపోవు
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల కఖిలార్థలాభంబు గలుగుచుండు<
నే నీ చరణసేవ యే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ దడవిన బంధసంతతులు వాయు
ఈశ్వరా, నీ గుణములు వింటుంటే, ఈశ్వరుని కథలు వింటుంటే సంసారంలో తిరగడం వలన కలిగిన తాపము ఉపశాంతి పొంది మనస్సు చల్లబడి హాయిగా ఉంటుంది. సంసార పాశములు తెగిపోయి పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని ఇవ్వగలిగిన నీ నామమును పలకగలిగిన నాడు నా నోరు నోరు. ఇంద్రపదవి అక్కరలేదు. ఈశ్వరా, నిన్ను చేరుకోవాలని కోరుకుంటున్నాను.
నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వాడెవరు నన్ను చేసుకోవడానికి? నీవు పురుష సింహానివి. సింహము తినవలసిన పదార్ధం నక్క తిందామనుకుంటే సింహము నక్కను ఎలా చీల్చేస్తుందో అలా నీవు వచ్చి నీ ప్రతాపం ఏమిటో చూపించి ఆ శిశుపాలుడిని పరిమార్చి నన్ను చేపట్టాలి. ఇది నా ప్రార్థన.
నీ పాదములనుండి స్రవించే ఆకాశగంగ యందు మునక వేయాలని కోరుకునే మహాపురుషుల వాలే ఈశ్వరా, ఈ జన్మకే కాదు. నూరు జన్మలయినా సరే పొందితే నిన్నే పొందుతాను. పొందకపోతే నీకోసం వ్రతములు చేస్తాను. అంతేకానీ అన్యులను మాత్రం భర్తగా అంగీకరించను” అని ఆ లేఖలో విషయములను పొందుపరచింది.
స్వామి ఈ లేఖను చదివి, దానిని పక్కనపెట్టి అగ్నిద్యోతనునీతో “ఈ పిల్ల నాకు లేఖ వ్రాయడం కాదు. ఈ పిల్ల గురించి నేను ఎప్పుడో విని రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని నిద్ర పోగొట్టుకుంటున్నాను. ఎంత తొందరగా వద్దామా అని అనుకుంటున్నాను” అన్నారు. ఈశ్వరుని దృష్టిలో రాత్రి నిద్రలేదు అంటే ఎవరు తనని పొందాలనుకుంటున్నారో అటువంటి వారిలో అజ్ఞానమును తీసి వాళ్ళను తాను పొందడానికి ఆ మహానుభావుడు ఆర్తి చెందిపోతూ ఉంటాడు. అప్పుడు అగ్నిద్యోతనుడు అన్నాడు “ఆ అమ్మాయి నీకు తగినది. ఆమెకు నీవు తగినవాడివి. మేము గురువులము. నేను అగ్నిద్యోతనుడిని. అగ్ని అనేది స్వయం ప్రకాశము. అజ్ఞానమును దగ్ధం చేసేస్తుంది. అటువంటి భగవంతుని చూపించేవాడు. గురువు ఈశ్వరదర్శనాభిలాషి అయిన వాడిని భగవంతుని వైపుకి తీసుకువెడతాడు. మేము గురువులము ఆశీర్వచనం చేస్తున్నాము. మీ యిద్దరికీ వివాహం అవుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం? ఈలోకంలో ఒక గొప్ప సంప్రదాయమును నిలబెట్టు. శరణాగతి చేసిన వారిని ఈశ్వరుడు రక్షిస్తాడు అనే ఒక ధైర్యం నిలబడాలి. కాబట్టి కృష్ణా నీవు వెంటనే బయలుదేరి రావలసినది” అని చెప్పాడు. ఈమాట వినగానే వెంటనే కృష్ణుడు తన రథసారథిని పిలిచాడు. అన్నగారికి కూడా ఈవిషయం చెప్పలేదు. మనస్ఫూర్తిగా పిలిచిన వాడికోసం పరుగెత్తడానికి పరమాత్మ ఎంత సిద్ధంగా ఉంటారో చూడండి. సారథిని పిలిచి రథం సిద్ధం చేయమన్నారు. అగ్నిద్యోతనునితో కలిసి రథం మీద కూర్చుని గబగబా వచ్చేస్తున్నారు.
“తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు?” అని బలరాముడు అడిగాడు. “విదర్భరాజ్యములోని కుండిన నగరమునకు రుక్మిణీ దేవిని రాక్షస వివాహం చేసుకొని తీసుకు రావడానికి వెళ్ళారు అన్నారు. అన్నగారి ప్రేమ అన్నగారిది. తమ్ముడు ఒక్కడే వెళ్ళాడని సైన్యమును తీసుకొని వెనకాతల బలరాముడు వెళ్ళాడు.
కృష్ణ పరమాత్మ కుండిన నగర వీధులలో తిరుగుతున్నారు. అక్కడి వారు ఆయనను చూసి ఏమి అందగాడురా మహానుభావుడు- ఆ నెమలి పింఛం, ఆ జుట్టు, ఆ నోరు, ఆ గడ్డం, ఆ ముక్కు , ఆ కిరీటం
కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరి చందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళీం
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః!!
ఎంత అందంగా ఉన్నాడు! నిజంగా వివాహం జరిగితే రుక్మిణీ కృష్ణులకే వివాహం జరగాలి” అని పొంగిపోతున్న సమయంలో అంతఃపురం లోపల పాపం రుక్మిణీదేవి కంగారు పడుతోంది.
ఘను డా భూసురు డేగెనో ? నడుమ మార్గశ్రాంతుఁ డై చిక్కెనో ?
విని కృష్ణుం డది తప్పుగాఁ దలఁచెనో ? విచ్చేసెనో ? యీశ్వరుం
డనుకూలింపఁ దలంచునో తలఁపడో ? యార్యా మహా దేవియున్
నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో ? నా భాగ్య మెట్లున్నదో ?
“అగ్నిద్యోతనుడు వెళ్ళాడో లేదో! మార్గమధ్యంలో ఏదయినా బడలికను పొందాడో! ఒకవేళ నిజంగా అంతఃపురంలోకి వెళ్లి నేను రచించిన లేఖను ఇచ్చినప్పటికీ ఆడపిల్ల ధూర్తతనంతో యిలా రాయడమేమిటని కృష్ణుడు రానని అన్నాడో! నేను కృష్ణుని పొందగలనో లేదో” అని ఆవిడ వ్యాకులత చెందుతోంది. కానీ కృష్ణుని చూసిన ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు.
"తగు నీ చక్రి విదర్భరాజసుతకుం ; దథ్యంబు వైదర్భియుం
దగు నీ చక్రికి ; నింత మంచి దగునే ? దాంపత్య మీ యిద్దఱం
దగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా ; దర్పాహతారాతియై
మగఁడౌఁ గావుతఁ జక్రి యీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్."
“నిజంగా చతుర్ముఖ బ్రహ్మగారు ఎంత గోప్పవారో! కృష్ణుడి కోసం రుక్మిణిని పుట్టించాడు. రుక్మిణి కోసం కృష్ణుడిని పుట్టించాడు. వీరిద్దరూ దంపతులయితే ఎంత బాగుంటుందో! కానీ తండ్రి ఈమెను శిశుపాలునకిచ్చి వివాహం చేస్తాను అంటున్నాడు. వీళ్ళిద్దరికీ వివాహం అవడానికి ఆ శిశుపాలుడి అడ్డం తొలగిపోయి కృష్ణుడు ఈవిడ పక్కన చేరడానికి మా పుణ్యములనన్నిటిని యిచ్చేస్తాము. మా పుణ్య ఫలములను కూడా ఆవిడే తీసుకొని కృష్ణుని భర్తగా పొందాలి” అని ఆ ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. ఈశ్వరుని చూసేసరికి ఆ జననీ జనకులిద్దరూ సింహాసనం మీద కనపడాలని లోకం తాపత్రయ పడిపోతుంది.
అమ్మవారు అన్న మాటలో “ఆర్యామహాదేవి” అనే ఒక గమ్మత్తయిన మాట వుంది. ఇదే రుక్మిణీ కళ్యాణమునకు ఆయువుపట్టు అంటారు పెద్దలు.
బాణత్వం వృషభత్వ మర్థవపుషా భార్యాత్వ మార్యాపతే
ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాది రూపం దధౌ
>త్వత్పాదే నయనార్పణంచ కృతవాన్ త్వద్దేహభాగో హరిః
పూజ్యాత్ పూజ్యతర స్స ఏవహి నచేత్ కోవా తదన్యోధికః!!
శ్రీమహావిష్ణువు శంకరుని అనేక రూపములతో సేవించి సేవించి ఆర్యామహాదేవి అనే పేరుతొ పరమశివుని ఇల్లాలు అయినాడు. ఈ ఆర్యామహాదేవికి సంబంధించిన పద్యం విన్నా, చదివినా, ఒక ఫలితం వస్తుంది. ఆడపిల్ల నొసటన అల్పాయుర్దాయం ఉన్నవాడు లేదా ఐశ్వర్య భంగమైపోయినవాడు లేదా సంతానమును పొందలేని వాడు ఇలాంటి భంగపాట్లు ఉన్న పురుషునితో వివాహం అవాలని ఆడపిల్లకు రాసి వుంటే ఎవరు ఈ పద్యములు వింటున్నారో, ఎవరు ఈ పద్యములు చదువుతున్నారో, ఎవరు రుక్మిణీ కల్యాణం చూస్తున్నారో, వారి నొసటవ్రాత మారి శిశుపాలుడు తప్పి కృష్ణుడు వచ్చినట్లు యోగ్యుడయిన వరుడు వస్తాడు. అందుకని పూర్వం కన్నెపిల్లల చేత రుక్మిణీ కళ్యాణం చదివించేవారు. రుక్మిణీకళ్యాణం చదివినా, చూసినా మనకి కొన్ని కోట్ల జన్మలనుండి వస్తున్న పాపరాశి వలన ఏర్పడిన కర్మవాసనలు తొలగి బుద్ధి చేత ఈశ్వర పాదములు పట్టగలుగుతాము. అది పెళ్లి అయిపోయిన వాళ్లకి వచ్చే ఫలితం. కాబట్టి అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళని రుక్మిణీ కళ్యాణం ఉద్ధరించేస్తుంది.
ఇప్పుడు అగ్నిద్యోతనుడు రుక్మిణీ దేవి వద్దక పరుగెత్తుకు వచ్చి “కన్యకా! కృష్ణుడు నీ గుణములు మెచ్చుకున్నాడు. నీవంటి శిష్యురాలికి గురువు నయినందుకు నాకు ఎంతో ధనమునిచ్చాడు. సుదర్శన చక్రమును పట్టుకొని వచ్చేశాడు. దేవతలు రాక్షసులు కలిసివచ్చినా సరే రాక్షస వివాహంతో నిన్ను తీసుకువెడతాడు. నీ జీవితం ఫలించింది” అన్నాడు. ఇప్పుడు రుక్మిణీదేవి పరమసంతోషమును పొందింది. అమ్మవారు రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరుల ఆరాధన చేసింది. ఆడపిల్ల అయిదవతనం నిలబడాలంటే గౌరీతపస్సు చేయాలి. గౌరీతపస్సు చేయించేటప్పుడు ఆమెచేత అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తారు. అమ్మవారి అనుగ్రహమును ఆ కుంకుమార్చన వలననే పొందగల్గుతారు. కన్య సువాసినిగా మారబోతోంది. ఆ పిల్ల ఆ తరువాత తల్లి కావడానికి అన్నిటికి కావలసిన అదృష్టం అప్పుడే కటాక్షింపబడుతుంది. గౌరీతపస్సు జరుగుతున్నంత సేపు ఆడపిల్ల తదేక దృష్టితో పార్వతీదేవిని ఆరాధన చేయాలి. అందుకే రుక్మిణీ దేవి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా దేవాలయమునకు వెళ్ళింది. భీష్మకుడు కొన్ని మంగళ సూత్రములు చేయించి వృద్ధ ముత్తైదువులకి ఇప్పించాడు. గౌరీతపస్సు అయ్యేవరకు ఆ పిల్ల మాట్లాడకూడదు. మీరు మాట్లాడించకూడదు. ఆమె గౌరీదేవి మీద కుంకుమ వేస్తూ తదేక ధ్యానంతో ఆ నామములు వినాలి. అప్పాలు పరమ పవిత్రమయిన వంటకము. భీష్మకుడు అప్పాలు వండించి ఒక్కొక్క అప్పం, చెరకు కర్ర, మంగళసూత్రం రుక్మిణి చేత ముత్తైదువలకు ఇప్పించాడు. అప్పుడు చెప్పింది
నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయు మమ్మ! ని
న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!”
సనాతనులయిన పార్వతీ పరమేశ్వరులను నేను మదిలో నమ్ముకుని ఉన్నాను. మీరు యిద్దరు కూడా సనాతనముగా ఆదిదంపతులు. అమ్మా, నీవు తరగని అయిదవ తనంతో ఉన్నావు. అలా నన్ను కూడా అయిదవతనంతో నిలబెట్టవా! ఓ యీశ్వరీ, నీవు దయకు సముద్రము వంటి దానివి. కృష్ణుని నాకు భర్తగా చేయవలసింది. నిన్ను నమ్మిన వాళ్లకు ఎన్నటికీ నాశనమన్నది లేదు. రక్షించి తీరుతావు” అంది. తాను చేసిన ఆరాధనకు కృష్ణుడు వచ్చి తీరుతాడని తలచినది.
రుక్మిణీదేవి సౌందర్యమును చూసిన ఎందఱో రాజులు తట్టుకోలేక తమ తమ రథముల నుండి క్రింద పడిపోయారు.
కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం , గంఠీరవేంద్రావల
గ్ను , నవాంభోజదళాక్షుఁ , జారుతరవక్షున్ , మేఘ సంకాశదే
హు , నగారాతిగజేంద్రహస్తనిభబాహుం , జక్రిఁ , బీతాం బరున్ ,
ఘనభూషాన్వితుఁ గంబుకంఠు , విజయోత్కంఠున్ జగన్మోహనున్!!
రుక్మిణీ దేవికి, రథంలో నిలబడి పట్టుపీతాంబరము కట్టుకొని, ఎడం చేతితో అలవోకగా పగ్గములు పట్టుకుని చిరునవ్వుతో రుక్మిణీదేవి వంక చూస్తూ, నవ్వుతూ నిలబడిన కంబుకంఠుడయిన పరమాత్మ దర్శనం అయింది. పగ్గములు విడిచిపెట్టాడు. రథమును దిగాడు. శరణాగతి చేసిన వారి కోసం తానే దిగివచ్చి నడిచి వచ్చాడు. శరణాగతిలో ఈశ్వర వైభవం ప్రకాశించింది.
ఈశ్వర ప్రతిజ్ఞ! తానే రథం దిగి నడిచి వచ్చాడు. అలవోకగా అమ్మవారి చెయ్యి పట్టుకున్నాడు. తన రథం ఎక్కించుకున్నాడు. ఇంతమందీ వాళ్ళిద్దరినీ చూస్తూనే ఉన్నారు. ఎవరికీ స్పృహ లేదు. రథమును తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తరువాత వీళ్ళందరికీ స్పృహ వచ్చింది. కృష్ణుడు రుక్మిణీ దేవిని ఎత్తుకుపోయాడు అన్నారు. పరుగు పరుగున వెళ్లి ఈ విషయమును శిశుపాలుడికి, జరాసంధుడికి చెప్పారు. కొంతమంది కృష్ణుని పట్టుకుందామని కృష్ణుని రథం వెంట పడ్డారు. కృష్ణుడు సుదర్శన చక్రంతో వారి కుత్తుకలను కత్తిరించేశాడు. శిశుపాలుడు జరాసంధుడి దగ్గరకు వెళ్ళాడు జరాసంధుడు అన్నాడు
బ్రతకవచ్చు నొడల ప్రాణంబులుండిన.
బ్రతుకు కలిగెనేని భార్య కలదు
బ్రతికితీవు ; భార్యపట్టు దైవమెరుంగు ,
వగవ వలదు చైద్య! వలదు వలదు!!
శిశిపాలా, నీవు చాలా అదృష్టవంతుడివి. కృష్ణుడి దగ్గరకు వెళ్లి చచ్చిపోకుండా వెనక్కి వచ్చావు. పెళ్లి అయిపోతే పోయింది. మరొక భార్య దొరుకుతుంది. బ్రతికానని సంతోషపడు” అన్నాడు. ఒక్క రుక్మి మాత్రం ఒక గోపాల బాలుడు తన చెల్లిని అపహరించడం ఏమిటని అపారమయిన ఆవేశంతో కృష్ణుని రథం వెంట పడి
మా సరివాడవా మా పాప గొనిపోవ ? నేపాటి గలవాడ ? వేది వంశ ?
మెందు జన్మించితి ? వెక్కడ బెరిగితి ? వెయ్యది నడవడి ? యెవ్వడెరుగు ?
మానహీనుడ వీవు ? మర్యాద లెరుగవు ; మాయ గైకొని కానీ మలయ రావు ;
నిజరూపమున శత్రు నివహంబుపై బోవు ; వసుధేశుడవు గావు వావి లేదు ;
కొమ్మ నిమ్ము ; నీవు గుణరహితుండవు,
విడువు ; విడువవేని విలయకాల
శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల
గర్వమెల్ల గొందు గలహమందు!!
రుక్మి తెలియకుండానే స్తుతి చేసేస్తున్నాడు. “నువ్వు గోపాల బాలుడివి. ఎక్కడో పుట్టిన వాడివి. ఆలమందల వెనకాల తిరిగిన వాడివి. నీకు మా పిల్ల కావలసి వచ్చిందా! మా పిల్లను ఎత్తుకు పోతావా? నిలు నిలు కృష్ణా, నిన్ను యిప్పుడే తుదముట్టించేస్తాను” అని వస్తున్నాడు.
కృష్ణుడు చూశాడు. రుక్మి తనను ఇంత నింద చేస్తున్నాడు. కానీ అది స్తుతిపాఠం అయిపొయింది. నిజంగా పరమాత్మకు జన్మమేమిటి? కులం ఏమిటి? వంశం ఏమిటి? ఇది తెలియక వెర్రివాడు ప్రలపిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఒక్కసారి సుదర్శన చక్రమును చేత్తో పట్ట్టుకొని సంకల్పం చేస్తున్నారు.
అని డగ్గుతికతో మహాభయముతో నాకంపితాంగంబుతో
వినత శ్రాంత ముఖంబుతో శ్రుతిచలద్వేణీకలాపంబుతోఁ
గనుదోయిన్ జడిగొన్న బాష్పములతోఁ గన్యాలలామంబు మ్రొ
క్కిన రుక్మిం దెగవ్రేయఁబోక మగిడెం గృష్ణుండు రోచిష్ణుఁడై.
అసలు కన్నులమ్మట నీరు పెట్టవలసిన అవసరం లేక తన కడగంటి చూపులతో లోకమునకు ఐశ్వర్యము నీయగలిగిన శ్రీమహాలక్ష్మి తనతోడబుట్టిన వాడు మరణిస్తాడేమోనని యింకా పెళ్ళి కాకుండానే కృష్ణుడితో వెళుతున్నది, భయపడి పోయి వణికిపోతున్న శరీరముతో ఆయన కాళ్ళు పట్టుకొని కళ్ళ వెంబడి నీళ్ళు కారిపోతుండగా “ఈశ్వరా, నా అన్నకు ప్రాణ భిక్ష పెట్టు” అని ఆయన పాదములు పట్టుకుంది. అప్పుడు కృష్ణుడు “వీనికి ప్రాణం తీసినంత పని చేస్తాను” అని కిందికి దిగి, కత్తి తీసి, రుక్మి తల పట్టుకొని పాయలు పాయలుగా తల గెడ్డం గొరిగేసి వదిలి పెట్టేశారు. వాడు గుంజుకుంటుంటే కృష్ణుడు తనపై ఉత్తరీయము తీసి రుక్మిని బండికి వేసి కట్టేసి తల గొరిగి విరూపుని చేసి వదిలేశారు. రుక్మిణీదేవి చాలా బాధ పడింది. బలరాముడు వచ్చి ఓదార్చాడు.
తదనంతర రుక్మిణీ కృష్ణులు హాయిగా ద్వారకా నగరమును చేరుకున్నారు.
ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై
భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం
ధవ సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్
సువిభూషాంబర ధారిణిన్ గుణవతీచూడామణిన్ రుక్మిణిన్.
ఆరోజున శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పెండ్లి చేసుకున్నాడు. మంచి పట్టుపుట్టం కట్టుకున్నది, దరిద్రమును నాశనం చేయగలిగినది, ఇంటికి వచ్చిన బంధువులను స్నేహితులను ఆదరముతో చూడగలిగినది, పుత్రపౌత్రాభివృద్ధిగా వంశమును పెంచగలిగినది, చక్కటి చిరునవ్వుతో అందరిని ఆదరించే స్వరూపం ఉన్నది, మంచి గుణములు కలిగినది, అయిన రుక్మిణీ దేవిని కృష్ణుడు ద్వారకా నగరమునందు పెద్దలందరి సమక్షములో వివాహమును చేసుకున్నాడు.
అనఘ! ఆదిలక్ష్మియైన రుక్మిణి తోడ
గ్రీడ సలుపుచున్న కృష్ణు జూచి
పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ,
ప్రీతు లగుచు ముక్త భీతు లగుచు!!
ఆ శ్రీమహాలక్ష్మియే రుక్మిణీ దేవి. “ఆవిడ పక్కన కృష్ణుడు కూర్చుంటే ఆవిడ మన మొరలు వినిపిస్తుంది. దయాశాలియై మనలను రక్షిస్తుంది. ఇంక మనకి ఏమి కావాలి! మనం అందరం భయములను వదిలిపెట్టి పరమసంతోషంగా ఉండవచ్చు” అని ప్రజలందరూ భావించారని శుకయోగీంద్రుడు పరీక్షిత్తుకు రుక్మిణీకళ్యాణగాథ వినిపించాడు.