పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

కథలు - భాగవతాలు : శ్రీకృష్ణ జననం

దశమ స్కంధము – పూర్వ భాగము

[సౌజన్యం శ్రీ పైడి నాగ సుబ్బయ్య గారు]

శ్రీకృష్ణ జననం

భాగవతంలో దశమ స్కంధము ఆయువుపట్టు లాంటిది. ఈ దశమ స్కంధము జీవితంలో తప్పకుండా విని తీరాలి. ఇందులో వ్యాస భగవానుడు కృష్ణ భగవానుని లీలలను విశేషమయిన వర్ణన చేశారు. పోతనగారు దానిని ఆంధ్రీకరించి మనకి ఉపకారం చేశారు. దశమ స్కంధమును ప్రారంభం చేస్తూ ఒకమాట చెప్తారు. పూర్వకాలంలో భూమి గోరూపమును స్వీకరించి బ్రహ్మగారి వద్దకు వెళ్ళి ఏడ్చింది. “మహానుభావా! భూలోకంలో ఎందరో రాజులు భూమి పతులమని పేరు పెట్టుకొని పరమ దుర్మార్గమయిన పరిపాలన చేస్తూ ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నారు. ఎంతో మంది అధర్మాత్ములు ఈవేళ భూమిమీద తిరుగుతున్నారు. వారి భారం నాకు ఎలా తగ్గుతుంది? అటువంటి వారి మదమణచి భూమి భారమును తగ్గించవలసినది” అని ప్రార్థించింది. భూభారము అనేది తక్కెట్లో పెట్టి తూచే కొలత కాదు. ఎంతమంది బిడ్డలు పుట్టినా తల్లికి ఎప్పుడూ బరువు కానట్లే, ఎన్ని ప్రాణులు వున్నా, భూమికి ఎప్పుడూ బరువు కాదు. కాని ధర్మమూ తప్పి ప్రవర్తించే మనుష్యులను చూసి భూమి భారమని బాధపడుతుంది. అన్నిటిని సృష్టి చేసినది బ్రహ్మగారే కదా! అందుకని బ్రహ్మగారిని అడిగింది. “భారము తగ్గించడం, ఉన్నది నిలబెట్టడం స్థితికారకుడయిన శ్రీమహావుష్ణువు అనుగ్రహం కాబట్టి నీవయినా నేనయినా ఆయనను ప్రార్థన చేయాలి” అని ఆన్నాడు బ్రహ్మగారు ధ్యాన మగ్నుడై పురుషసూక్తంతో స్వామి వారిని ఉపాసన చేశారు. ఆ ధ్యానము నందు ఆయనకు ఒక వాణి వినపడింది. వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మగారు అన్నారు “భూమీ! నీవేమీ బెంగపెట్టుకోవద్దు. స్వామి తొందరలో కృష్ణావతారమును స్వీకరిస్తున్నారు. ఆ అవతారం చిత్రమయిన అవతారం. స్వామి కళ్ళు ఇంకా తెరవడం రాని పిల్లవాడిగా స్వీకరిస్తున్నారు. ఆ అవతారం చిత్రమయిన అవతారం. స్వామి కళ్ళు ఇంకా తెరవడం రాని పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షససంహారం ప్రారంభం చేసేస్తాడు. ఎందరో రాక్షసులు, దుర్మార్గులు మరణిస్తారు. నీకు భారము తగ్గుతుంది. దేవతలను, సుర కాంతలను తమతమ అంశలతో భూమిమీద జన్మించమని స్వామి ఆదేశం యిచ్చాడు. ఆయన యదుకులంలో యాదవుడిగా పశువులను కాసేవాడిగా జన్మించబోతున్నాడు. జగదాచార్యునిగా లోకమునకు జ్ఞానమును ఇస్తాడు” అని చెప్పాడు. అపుడు భూమాత పరమ సంతోషమును పొంది తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ ఆగమనం కోసమని నిరీక్షణ చేస్తోంది.

ఈలోగా భూలోకంలో యదువంశమునకు చెందిన శూరసేనుడు అనే రాజు మధుర రాజ్యమును పరిపాలిస్తున్నాడు. ఆయన కుమారుడు వసుదేవుడు. భోజవంశామునకు చెందినా వారు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒకాయన పేరు ఉగ్రసేనుడు. ఒకాయన పేరు దేవకుడు. వీరు ఇద్దరూ అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ములలో దేవకుని కుమార్తె దేవకి. ఉగ్రసేనుని కుమారుడు కంసుడు. అన్నదమ్ముల బిడ్డలు కనుక కంసుని చెల్లెలు దేవకీ దేవి. దేవకీదేవిని శూరసేనుని పుత్రుడు వసుదేవున కిచ్చి వివాహం చేశారు.

దశమ స్కంధము ఉపనిషత్ రహస్యము. దశమ స్కంధము ప్రారంభంలోనే ఒక లక్ష టన్నుల ప్రశ్న ఒకటి పడుతుంది. ఆ ప్రశ్నకు సమాధానమును తెలుసుకోగలిగారంటే మీ హృదయగ్రంథి విడిపోయినట్లే! కృష్ణ జననం పరమ పవిత్రమయిన ఆఖ్యానం. దేవకీ వసుదేవులకు వివాహం జరిగిన తర్వాత కొన్ని వందల గుర్రములను, బంగారు ఆభరణములతో అలంకరింపబడిన ఏనుగులను, కొన్ని వేల రథముల నిండా బంగారమును, కొన్ని వందలమంది దాసీజనమును ఏర్పాటు చేసి, మహానుభావుడయిన దేవకుడు తన కుమార్తెను అత్తవారింటికి పంపుతున్నాడు. రాజమార్గంలో కొన్ని వేల రథములు అనుసరించి వెడుతున్నాయి. దేవకీదేవి రథం బయలుదేరి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. రథమును చోదనం చేయడానికి ఒక సారథి ఉంటాడు. ఇలాంటి సమయంలో అక్కడికి కంసుడు అకస్మాత్తుగా వచ్చాడు. అతనికి చెల్లెలు అంటే మహాప్రేమ. ఆమె తన తండ్రిగారి సోదరుని కుమార్తె అయినా, కంసునికి దేవకీదేవి అంటే చాలా ప్రేమ. ఆయన దేవకీదేవి రథమును నడపడానికి సిద్ధపడ్డాడు. అందరూ చాలా సంతోషించారు. తానే చెల్లెలిని అత్తవారింటిలో దింపుతానని గుఱ్ఱముల పగ్గములు పట్టుకున్నాడు. వెనక దేవకీవసుదేవులు కూర్చున్నారు. రథం వెళ్ళిపోతున్నది.

అపుడు అశరీర వాణి కొన్ని మాటలు పలికింది. “అశరీరవాణి” చాలా గమ్మత్తయిన మాట. శరీరము వుంటే వాణి ఉంటుంది. వాణి ఉన్నది అంటే అది శరీరంలోంచి వస్తున్నదని గుర్తు. కనీసంలో కనీసం ఎదురుగుండా నామ రూపములతో ఏదో ఉండాలి. మనుష్యుడు లేకుండా మాట ఉండదు. కానీ యిక్కడ శరీరము లేదు కానీ మాట వినబడుతున్నది అంటున్నారు. అదీ చిత్రం. అశరీర వాణి ఏమని పలికిందంటే ““తలోదరి” అంటే పైకి కనపడని కడుపు కలది. కొంతమందికి కడుపు కనపడదు. అసలు కడుపు ఉన్నదా లేదా అనే అనుమానం ఉన్నట్లు ఉన్నవాళ్ళని “తలోదరి” అంటారు. అసలు కడుపు లేనట్లుగా శుష్కించిన కడుపులా కనపడుతోంది. ఈ కడుపులో ఎనమండుగురు పుట్టబోతున్నారు. వారిలో ఎనిమిదవ వాడు కంసుడిని చంపబోతున్నాడు. ఆవిడ చక్కగా వసుదేవుడిని వివాహం చేసుకుని రథం ఎక్కి వెళ్ళిపోతోంది. “ఆవిడ మెచ్చుకోవాలని చెల్లెలి సంతోషం కోసం పిచ్చివాడా, రథము నడుపుతున్నావు! కాని ఈమె ఎనిమిదవ గర్భము నిన్ను చంపేస్తుంది” అని అశరీర వాణి పలికింది.

ఇప్పటి వరకు కంసుడు పరమప్రేమతో ఉన్నాడు. ఆకాశంలోంచి ఈమాట వినపడగానే వెంటనే రథమును ఆపాడు. క్రిందికి దిగాడు. కళ్ళు ఎర్రబడిపోయి గుడ్లు తిరుగుడు పడ్డాయి. అపారమయిన కోపం వచ్చేసింది. తన ఎడమ చేతితో చెల్లెలి కొప్పు పట్టుకొని రథములో నుండి క్రిందకు లాగేశాడు. ఒరనుండి కరవాలమును తీసి ఆమెను నరికివేయడానికని సిద్ధపడుతున్నాడు. ఆసమయంలో వసుదేవుడు మాట్లాడాడు. ఇది చాలా గమ్మత్తయిన సన్నివేశం. ఇలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించరు. రథం నడుపుతున్న వాడు బావమరిది, తన చేల్లెలినే లాగేసి చంపేస్తాడని కాని, అశరీరవాణి పలుకుతుందని గాని వసుదేవుడు కల గనలేదు. ఇలాంటప్పుడు కూడా ఏమీ కంగారు పడకుండా, ధర్మం తప్పకుండా చాలా పెద్దమనిషిగా తాను అప్పుడు మాట్లాడిన మాట తాను తప్పలేని మాట అయ్యేటట్లుగా మాట్లాడగలగడం అంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈశ్వరానుగ్రహం లేనివాడు అలా మాట్లాడలేడు. ఆయన ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ముందు కంసుని అనుగ్రహం కోసమని బ్రతిమలాడాడు. ప్రపంచంలో పరమపవిత్రమయిన సంబంధములలో “అన్న” అనిపించుకున్న రక్తసంబంధం ఒకటి. అన్నగా పుట్టిన వాడికి ఒక మర్యాద ఉంటుంది. ఎప్పుడూ కూడా తన బావగారు బ్రతికి వుండాలని కోరుకోవాలి. “బావమరిది బ్రతక కోరతాడు” అని ప్రపంచంలో ఒక సామెత ఉంది. నీవు అన్నవి. కాబట్టి రథం తోలడానికి వచ్చావు. కాబట్టి నీ చెల్లెలిని సంతోష పెట్టాలి. చక్కని మాటలు నాలుగు మాట్లాడాలి. కానీ నువ్వు చంపేస్తాను అంటున్నావు. గాలి మాటలు నమ్మి చెల్లెలిని చంపేస్తావా! రేపు ప్రపంచం నిన్ను ఏమంటుంది? అరివీర పరాక్రమము కలిగినవాడు భోజవంశంలో పుట్టినవాడు అయిన కంసుడు ఒక చెల్లెలి ఎనిమిదవ గర్భము వలన చాచ్చిపోతాననే గాలిమాట విని, ఇంకా పాదముల పారాణి ఆరని ఆడపిల్లను చంపేశాడని లోకం చెప్పుకుంటుంది.. అది ఎంత మహాపాపం. అందుకని తొందరపడి చంపకు. నిన్ను అభ్యర్థిస్తున్నాను” అన్నాడు.

అపుడు కంసుడు “అది మిన్నులమోతో, అధికారిక వాక్యమో నాకు అనవసరం.ఈమె కడుపున పుట్టిన ఎనిమిదవ పిల్లాడి వలన నాకు ప్రాణహాని అని నాకు వినపడింది. అందుకని నేను చంపేస్తాను” అన్నాడు.

అపుడు వసుదేవుడు “నీ అదృష్టం కొద్దీ నీ చావుకు ఒక కారణం తెలిసింది. ఒకవేళ నీవు ఈమెను చంపివేశావనుకో నీకు చావు రాకుండా ఉంటుందా? చెల్లెలిని చంపిన పాపమునకు అధోగతికి వెళ్ళిపోతావు. కాబట్టి నీ చెల్లెలిని విడిచిపెట్టెయ్యి” అన్నాడు. ఎంత గొప్ప వేదాంతమును చెపితే మనసు మారే అవకాశం ఉంటుందో దానిని చెప్పాడు. ఏడురోజులు వినేది శుకబ్రహ్మ పరీక్షిత్తుకు చెప్పారు. ఏడు క్షణములలో వినేది వసుదేవుడు కంసునికి చెప్పాడు. కానీ వాని మనస్సు మారలేదు. అపుడు కంసుడు “నేను అలా విడిచిపెట్టను. నువ్వు చాలా తేలికగా మాట్లాడుతున్నావు. నేను మరణమును అంగీకరించను. దేవకిని చంపేస్తాను” అన్నాడు. ఇపుడు వసుదేవుడు ఆలోచించాడు. ఉన్నదున్నట్లు చెపితే కంసుని తలకెక్కదని భావించాడు. ఇపుడు తానొక ధర్మము నిర్వర్తించాలి. తన భార్యను రక్షించుకోవాలి. జ్ఞాన బోధ చేస్తే వీని బుద్దకు ఎక్కదు. అలాగని ఎలాగయినా తన భార్యను రక్షించుకోవాలని అసత్యమును చెప్పకూడదు. సత్యమే చెప్పాలి. కానీ అది కంసుని మనస్సుకు నచ్చేది అయి ఉండాలి. ముందు అసలు నేను తక్షణం చేయవలసిన పని దేవకీదేవి ప్రాణములను రక్షించడం అనుకుని “బావా, అయితే నీకొక మాట చెబుతాను. నీ చెల్లెలికి పుట్టిన ఎనిమిదవ వాని చేత కదా నీవు మరణించగలనని అనుకుంటున్నావు. కాబట్టి ఈ దేవకీ దేవి గర్భమునుండి పుట్టిన ప్రతి పిల్లవాడిని, పుట్టీ పుట్టగానే తీసుకువచ్చి నీకు యిచ్చేస్తాను. వాడిని నువ్వు చంపెయ్యి. అపుడు నీకు మృత్యువు రాదు కదా! అంతేకానీ నీ చెల్లెలిని చంపడం ఎందుకు? పాపకర్మ కదా! నీ మృత్యుహేతువును నువ్వు చంపినట్లయితే ప్రపంచం నిన్ను తప్పు పట్టదు. నువ్వూ ధర్మం తప్పనక్కరలేదు. నేనూ ధర్మం తప్పనక్కరలేదు. ఆమెను విడిచి పెట్టు” అన్నాడు.

అపుడు కంసుడు “ఇదేదో బాగానే చెప్పాడు” అనుకుని మీ యిద్దరు హాయిగా అంతః పురమునకు వెళ్ళిపొండి” అని ఆ రథమును వదిలిపెట్టేశాడు. దేవకీ వసుదేవులు ఎంతో సంతోషంగా ఉన్నారు.⁠⁠⁠⁠

దేవకీ వసుదేవులు సంతోషంగా ఉంటూ ఉండగా వారికి మొట్టమొదట కొడుకు పుట్టాడు. పుట్టిన కొడుకును పుట్టినట్లుగా పట్టుకువెళ్ళి కంసునికి ఇచ్చేశాడు. వసుదేవుని చూసి “బావా, చూశావా నువ్వు ఎంత మాట తప్పని వాడవో! పిల్లవాడు పుట్టగానే నీవే తీసుకు వచ్చి ఇచ్చావు. నాకు అందుకే నీవంటే అంత గౌరవం. నువ్వు మాట తప్పని వాడవు. కానీ బావా, ఎనిమిదవ వాడు కదా నన్ను చంపేది! మొదటి వాడిని చంపడమెందుకు? తీసుకువెళ్ళిపో” అన్నాడు. వసుదేవుడు పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. రెండవ కొడుకు పుట్టాడు. ఎనిమిదవ గర్భమును కదా ఇమ్మన్నాడు. అందుకని రెండవ పిల్లవానిని తీసుకు వచ్చి యివ్వలేదు. ఇలా ఆరుగురు పిల్లలు పుట్టారు. ఆ ఆరుగురు పిల్లలతోటి అమ్మకి, నాన్నకి మిక్కిలి అనుబంధం ఏర్పడింది. ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒకరోజున కంసుని దగ్గరికి నారదుడు వచ్చాడు. ఆయన మహాజ్ఞాని. ఎప్పుడు వచ్చినా ఏదో లోకకళ్యాణం చేస్తాడు. కంసుని దగ్గరకు వచ్చి “కంసా! ఎంత వెర్రివాడవయ్యా! అసలు నీవు ఎవరిని వదిలిపెడుతున్నావో వారెవరూ మనుష్యులు కారు. నువ్వు క్రిందటి జన్మలో “కాలనేమి” అను పేరు గల రాక్షసుడవు. నిన్ను శ్రీమహావిష్ణువు సంహరించారు. నీ తండ్రి, తల్లి, దేవకీ, వసుదేవుడు, పక్క ఊళ్ళో ఉన్న నందుడు, ఆవులు, దూడలు వీరందరూ దేవతలు. నిన్ను చంపడానికే వచ్చారు” అని చెప్పి ఆయన హాయిగా నారాయణ సంకీర్తనం చేసుకుంటూ ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయాడు.

ఇపుడు కంసుడికి అనుమానం వచ్చింది. నారదుడు అనవసరంగా అబద్ధం చెప్పడు కదా! వసుదేవుడిని ఆరుగురి పిల్లలను తీసుకురమ్మనమని కబురుచేశాడు. “ఎనిమిదవవాడికి వీళ్ళు సహాయ పడితే నా బ్రతుకు ఏమయిపోవాలి? అందుకని ఉన్నవాళ్ళను ఉన్నట్లుగా సంహరించాలి” అనుకుని పిల్లలను చంపేశాడు. తరువాత తన తల్లిని, తండ్రిని, దేవకిని, వసుదేవుని అందరినీ కారాగారంలో పెట్టి బకుడు, తృణావర్తుడు, పూతన – ఇలాంటి వారినందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేశాడు. తరువాత వస్తున్న గర్భం ఏడవ గర్భం. కాబట్టి జాగ్రత్త పడిపోవాలని దేవకీ వసుదేవులను అత్యంత కట్టుదిట్టమయిన కారాగారంలో పెట్టాడు. రోజూ తానే వెళ్ళి స్వయంగా చూస్తుండేవాడు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావాలి. వసుదేవుని పిల్లలు పసివారు. నారదుడు మహానుభావుడు. లోకకళ్యాణకారకుడు. “నారం దదాతి యితి నారదః” అని ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. అటువంటి వాడు ఆరుగురు పిల్లలు చచ్చిపోవడానికి ఎందుకు కారకుడు అయ్యాడు? ఇపుడు వచ్చి ఆయన చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి? కంసునితో ఎందుకు అలా చెప్పాడు అని అనుమానం వస్తుంది. భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు. దీనికి పరిష్కారం దొరకాలంటే దేవీభాగవతం చదవాలి. దేవీ భాగవతంలో ఈ రహస్యమును చెప్పారు. పూర్వం మరీచి, ఊర్ణాదేవి అని యిద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఆరుగురు పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. వీళ్ళు ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి సభకు వెళ్ళారు. వాళ్ళు నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చుని ఉండగా ఒక నవ్వు నవ్వారు. అపుడు బ్రహ్మగారు “మీరు రాక్షసుని కడుపునా పుట్టండి” అని శపించారు. అందువలన వారు ఆరుగురు క్రిందటి జన్మలో “కాలనేమి”కి కుమారులుగా జన్మించారు. అలా కాలనేమి పుత్రులుగా కొంతకాలం బ్రతికి తదనంతరం హిరణ్యకశిపుని కడుపునా పుట్టారు. అప్పటికి వాళ్ళకి వున్న రజోగుణ తమోగుణ సంస్కారం తగ్గింది. మరల బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు వారికి దీర్ఘాయుర్దాయమును ప్రసాదించారు. ఈ విషయమును వారు తండ్రి అయిన హిరణ్యకశిపునకు చెప్పారు. అపుడు హిరణ్యకశిపునికి కోపం వచ్చింది. “నేను యింకా తపస్సు చేసి దీర్ఘాయుర్దాయమును పొందలేదు. మీరు అప్పుడే పొందేశారా? కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాను. మీరు దీర్ఘనిద్రలో ఉండి మరణించండి.

అంతేకాకుండా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గతజన్మలో తండ్రి ఆ జన్మలో మిమ్మల్ని చంపుతాడు” అన్నాడు. వాళ్ళు దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు. మరుజన్మలో మరీచి ఊర్ణల కొడుకులు ఇప్పుడు దేవకీదేవి కడుపునా పుట్టారు. వాళ్ళ శాపం ఈజన్మతో ఆఖరయిపోతుంది. వీళ్ళు యిప్పుడు గతజన్మలోని తండ్రి చేతిలో చచ్చిపోవాలి. గతజన్మలో వీరి తండ్రి కాలనేమి. కాలనేమి యిపుడు కంసుడిగా ఉన్నాడు. కాబట్టి వీరు కంసుడి చేతిలో మరణించాలి. వారికి ఆ శాప విమోచనం అయిపోయి వారు మరల బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి. అందుకని నారదుడు వచ్చి వాళ్ళు శాప విమోచనం పొందేలా చేశాడు. అదీ నారదుని రాకలో గల కారణం. ఇది దేవీ భాగవతాంతర్గతం.

కుండలోపల వెలుగుతున్న దీపంలా లోకములనన్నింటినీ తన కడుపులో పెట్టుకున్న శ్రీమహావిష్ణువుని తనకడుపులో మోయవలసినటువంటి దేవకి కంసుని కారాగారమునందు మగ్గుతున్నది. ఈ స్థితిలో ఒక చిత్రం జరిగింది. శ్రీమన్నారాయణుడు తాను అవతరించాలని అనుకున్నాడు. తనకన్నా ముందు శేషుడు బయలుదేరుతున్నాడు. ఆదిశేషుడు ముందు అన్నగారుగా పుట్టాలి. అందుకని యోగమాయను పిలిచి ఒకమాట చెప్పాడు. “నీవు భూమి మీదకి వెళ్ళు. అక్కడ కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులు ఉన్నారు. కంసుడు వసుదేవుని భార్యలందరినీ ఖైదు చేశాడు. ఒక్క రోహిణి మాత్రం నందవ్రజంలో నందుని దగ్గర ఉంది. ఇప్పుడు వసుదేవుని తేజస్సు దేవకీదేవిలో ఏడవ గర్భంగా ఉన్నది. అందులో శేషుని అంశ ఉన్నది. అందుకని ఎవరికీ తెలియకుండా ఆ గర్భస్థమయిన పిండమును వెలికి తీసి దానిని తీసుకు వెళ్ళి నందవ్రజంలో ఉన్న రోహిణీ గర్భమునందు ప్రవేశపెట్టు. గర్భస్రావం అయిందని అందరూ అనుకుంటారు. అప్పుడు యిక్కడ జారిపోయిన పిండము అక్కడ పెరుగుతుంది. పెరిగి అక్కడ వర్ధిల్లుతాడు. శేషుడు బలరాముడన్న పేరుతొ జన్మిస్తాడు. నన్ను సేవించాలని కోరుకుంటున్నాడు. అందుకని నీవు వెళ్ళి ఆపని చేయవలసినది” అని చెప్పాడు. వెంటనే యోగమాయ బయలుదేరి వచ్చింది. ఏడవ గర్భంలో దేవకీదేవి గర్భము నిలిచి సంతోషంగా ఉన్న సమయంలో ఆమె కడుపులో ఉన్న పిండమును బయటికి లాగి నందవ్రజంలో నందుని దగ్గర వున్న రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టింది.

ఇవాళ భాగవతమును వింటున్నప్పుడు యిది జరుగుతుందా అని మనమెవ్వరమూ సందేహించనవసరం లేదు. ఇప్పుడు యిటువంటివి ప్రపంచంలో జరుగుతున్నాయి కదా! ఇప్పుడు మనవాళ్ళు చేసే పనిని అప్పుడు భాగవత కాలంలోనే మహర్షులు చేశారు. చాలా బలవంతుడయిన వాడు కాబట్టి ఆయనకు “బలభద్రుడు” అని పేరు. లోకముల నన్నింటిని ఆనందింప చేస్తాడు కాబట్టి రామ శబ్దమును ప్రక్కన పెట్టి “బలరామా” అని పిలిచారు. ఈ అమ్మ కడుపులోంచి లాగబడి వేరొక అమ్మ కడుపులోకి ప్రవేశ పెట్ట బడ్డాడు అందుకని “సంకర్షణుడు” అని పేరు వచ్చింది. ఈవిధంగా బలరాముని ఆవిర్భావం జరిగింది. తదనంతరం కృష్ణపరమాత్మ ఆవిర్భవించాలి. శ్రీమన్నారాయణుని పూర్ణమయిన తేజస్సు బయలుదేరి వసుదేవుడిని ఆవహించింది. వసుదేవుడి లోంచి ఆ తేజస్సు దేవకీ గర్భంలోనికి ప్రవేశించింది. కృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నాడు. ఈ గర్భంలోకి ముప్పది కోట్ల మంది దేవతలు బ్రహ్మగారితో కలిసి వచ్చి దేవకీదేవి కడుపులోకి వెళ్ళి నిలబడ్డారు. ఇదీ గర్భశుద్ధి అంటే. వారందరూ మహానుభావా! నీవు మాయందు అనుగ్రహించాలి. కంసాదులు రాజ్యం చేస్తూ భక్తులయిన వారిని నిగ్రహిస్తున్నారు. కాబట్టి ముకుందా నీవు అమ్మ గర్భంలోనుండి బయటకు రావసింది అని పరమాత్మను స్తోత్రము చేస్తున్నారు.

ఇక్కడ కంసుని పరిస్థితి దారుణంగా ఉంది. దేవకికి అష్టమ గర్భం వచ్చేసింది. నెలలు పెరుగుతున్నాయి. తొమ్మిదవ నెల వచ్చేసింది. స్పష్టంగా తేజస్సు కనపడుతోంది. ఆ అష్టమ గర్భంలో పుట్టేవాడు తనను చంపేస్తాడని భయం. జ్ఞానము చేత లోకమంతా ఒక ఈశ్వరుడు కనపడ్డట్టే కంసునికి కూడా కనపడుతోంది. అందుకనే నారదుడు ధర్మరాజు గారితో “కొందరు వైరముతో కూడా ఈశ్వరుని పొందుతున్నారు” అన్నాడు. కంసుడు ఎవరిని చూసినా శ్రీహరే కనపడుతున్నాడు. కృష్ణుడు ఆవిర్భవించే సమయం ఆసన్నమవుతోంది. శ్రావణ మాసంలో అర్థరాత్రి పన్నెండు గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావం జరిగింది. అప్పుడు ఆకాశం అంతా మబ్బులు పట్టి ఉంది. కంసుడు గాఢనిద్రలో ఉన్నాడు. భటులను పెట్టాడు. తలుపులు దగ్గరికి వేసి వాటికి యినుప గొలుసులు వేశాడు. వాటిలో మేకులు దింపాడు. తాళములు వేశాడు. తాళం చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. వసుదేవుడు ఏమయినా చేస్తాడేమోననే అనుమానంతో వసుదేవుని కాళ్ళకు చేతులకు యినుప సంకెళ్ళు వేశాడు. ఆనాడు దేవకీ ప్రసవ సమయమందు సహాయం చేసిన వారు లేరు. ఆతల్లి అంత బాధపడింది. అటువంటి స్థితిలో అర్థరాత్రి పన్నెండు గంటల వేళయింది.

మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. నాలుగు బాహువులతో, నల్లటి మబ్బు వంటి కాంతితో, పట్టు పీతాంబరము కట్టుకుని, శంఖ చక్ర గదా పద్మములను పట్టుకొనిన వాడై, మహానుభావుడు వజ్ర వైడూర్యములు పొదగబడిన కిరీటముతో, నల్లటి కుంతలములతో, చెవులకు పెట్టుకొనబడిన కర్ణాభరణముల కాంతి గండ స్థలములయందు ప్రకాశిస్తూ ఉండగా, మెడలో కౌస్తుభమనే రత్నమును ధరించి, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో, సమస్త లోకములు కొలిచే పాదపద్మములతో, చంటిపిల్లవాడిగా వసుదేవునికి దర్శనం యిచ్చాడు. అటువంటి పిల్లవానిని చూసి సంకెళ్ళలో ఉన్న వసుదేవుడు పొంగిపోయాడు. అన్ని లోకములను కాపాడేవాడు ఈవేళ నాకు కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకు పుడితేనే గోదానం, వస్త్రదానం, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాను నేను ఎన్ని దానాలు చెయ్యాలి. కానీ కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చేయాలి. కానీ నేను చెయ్యడానికి కూడా లేదు. “కృష్” అనగా నిరతిశయ ఆనందరూపుడు. ఆ కృష్ణ దర్శనంతో కలిగిన ఆనందములో ఆయన స్నానం చేసేశాడు. తరువాత ఒక్కసారి నీళ్ళు ముట్టుకున్నాడు. మానసికముగా పదివేల మంది బ్రాహ్మణులకు పదివేల గోవులను దానం చేశాడు. “నేను కారాగారమునుండి బయటకు వచ్చిన తరువాత తీర్చుకుంటాను” అనుకుని పిల్లవాడుగా ఉన్న స్వామిని చూసి దేవకీ వసుదేవులు నమస్కరించారు. అపుడు కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ “భయపడకండి. అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెపుతాను వినండి.⁠⁠⁠⁠