కథలు - భాగవతాలు : శ్రీరామ చరిత్ర
నవమస్కంధము - శ్రీరామ చరిత్ర :
నవమస్కంధములో ఒక గమ్మత్తు చేశారు. నవమి నాడు రామచంద్రమూర్తి పుట్టారు. దశమ స్కంధమును ప్రారంభం చేసేముందు నవమ స్కందములో రామాయణమును చెప్పారు. నవమ స్కందములో రామచంద్ర ప్రభువు సంకీర్తనము విశేషంగా చేయబడింది. ఇక్ష్వాకు వంశములో జన్మించిన దశరథ మహారాజు గారికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేస్తే, సంతానం కలగడానికి ప్రతిబంధకమయిన పాపము పరిహరింప బడి, యజ్ఞపురుషుని అనుగ్రహము చేత లభించిన పాయస పాత్రలోని పాయసమును తన ముగ్గురు ధర్మపత్నులయిన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచి యిస్తే పుట్టిన రామలక్ష్మణభరత శత్రుఘ్నుల నలుగురు కుమారుల యందు మహాధర్మాత్ముడయిన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలనం కోసమని, తాను వివాహం చేసుకున్న సీతమ్మతో కలిసి తండ్రిని సత్య వాక్యమునందు ప్రతిష్ఠితుని చేయడం కోసం, పద్నాలుగు సంవత్సరములు అరణ్య వాసమునకు బయలుదేరి వెళ్ళి అక్కడ శూర్పణఖ ముక్కు చెవులు కోసి మారీచాది రాక్షసుల పీచమడచి, అక్కసుతో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తరువాత అరణ్యకాండలో కబంధ వధ జరిగిన తరువాత సుగ్రీవుని జాడ తెలుసుకుని, సుగ్రీవునితో మైత్రి చేసి, వాలిని సంహరించి, హనుమ సహాయంచే నూరు యోజనముల సముద్రమునకు ఆవల దక్షిణ దిక్కున వున్న లంకా పట్టణంలో రావణాసురుని ప్రమదావనంలో బంధింపబడిన సీతమ్మజాడ హనుమ ద్వారా తెలుసుకుని, సముద్రమునకు సేతువు కట్టి, ఆవలి ఒడ్డుకు చేరి, రావణ కుంభకర్ణాది రాక్షసులను తెగటార్చి, తిరిగి సీతమ్మను తాను పొంది పదకొండు వేల సంవత్సరములు రామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసి, రామరాజ్యము అని పేరుతెచ్చి, ఎన్నో ఆశ్వమేధములు, వాజపేయములు, పౌండరీకములు మొదలయిన యాగములు చేసి, మనిషి ఎలా ప్రవర్తించాలి అనే దానికి ఒక అద్భుతమయిన కొలమానమును ఏర్పాటు చేసిన విశేషమయిన అవతారము రామావతారము.
ఆ రామచంద్రమూర్తి అనుగ్రహమే పోతనగారియందు ప్రసరించి భాగవతమును ఆంధ్రీకరించుటకు తోడ్పడినది. రాముడు కృష్ణుడు అని యిద్దరు లేరు కనుక ఆ రాముడే కృష్ణకథ చెప్పించాడు.