కథలు - భాగవతాలు : శ్రీమన్నారాయణ కవచం
షష్ఠ స్కంధము - శ్రీమన్నారాయణ కవచం
ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక పెద్ద సభను తీర్చి ఉన్నాడు. ఆ సభకి అశ్వనీ దేవతలు వచ్చారు. యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు వచ్చారు. ఎందఱో పెద్దలు వచ్చారు. వీరందరూ అక్కడ నిలబడి వుండగా అప్సరసలు సేవిస్తూ వుండగా ఇంద్రుడు సముచితమయిన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అందరూ ఇంద్రుని సేవించేవారే తప్ప ఇంద్రుడి చేత సేవింపబడే వారు ఆ సభలో లేరు. గురువులకు ఒక వరుస ఏర్పాటు చేయబడింది. ఇటువంటి సభ నడుస్తూ ఉండగా ఇంద్రుడు కించిత్ అహంకారమును పొంది ఉన్నాడు. అంతమంది తనను సేవిస్తూ ఉండగా తాను చాలా గొప్పవాడినన్న భావన ఆయన మనస్సులో బయలుదేరింది. తానంత గొప్పవాడు అవడానికి కారణమయిన గురువు కనపడినా లేస్తాడా అన్నది అనుమానమే. అహంకారపు పొర కమ్మింది. మహాపురుషుడైన బృహస్పతి సభలోకి విజయం చేస్తున్నారు. ఇంద్రుడు చూశాడు. చూసి వస్తున్నవాడు బృహస్పతి అని తెలుసు. సాక్షాత్తుగా తన గురువని తెలుసు. కానీ ఒక మాట అనుకున్నాడు. ఇంతమంది నన్ను సేవిస్తున్నారు. నేను లేచి నిలబడి ఎదురు వెళ్ళి నమస్కారం చేసి తీసుకువచ్చి ఆసనం మీద కూర్చోబెట్టడం ఏమిటి? అనుకున్నాడు. గురువు వస్తుంటే చెయ్యవలసిన మర్యాద ఒకటి ఉన్నది. ఇంద్రుడు ఆ మర్యాద చెయ్యలేదు. గురువు వస్తూ సభామంటపంలోకి వచ్చి రెండడుగులు వేసి చూశాడు. ఇంద్రుడు ఎవరో వస్తున్నాడులే అన్నట్లుగా కూర్చొని ఉన్నాడు. వెంటనే బృహస్పతి అనుకున్నాడు -
బృహస్పతికి మనస్సులో కించిత్ బాధ కలిగింది. గురువు వస్తుంటే లేచి నిలబడని కారణం చేత ఇంద్రునికి కలిగిన మద వికారమును తొలగించాలని అనుకుని తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఇంద్రుడు సభ ఆపక సభ నడిపించాడు. సభ అంతా అయిపొయింది. అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు మనసులో "అరెరే, ఇంతమంది నన్ను సేవించడానికి కారణం ఈశ్వరానుగ్రహం. అటువంటి ఈశ్వరానుగ్రహాన్ని నాకు తెచ్చి పెట్టినది గురువు బృహస్పతి. అటువంటి గురువు సభకు వస్తుండగా సింహాసనాధిష్టితుడయిన రాజు లేవకూడదని చెప్పినవాడు, అధర్మంతో మాట్లాడిన వాడు, ఇంద్రుడైన నేనే చెయ్యకూడని పని చేశాను. నావలన ఘోరాపచారం జరిగింది. ఖచితంగా ఇది నన్ను కట్టి కుదిపి తీరుతుంది. దీనిని మా గురువులే ఆపాలి" అని గబగబా పరుగెత్తుకుంటూ గురువుగారి ఇంటికి వెళ్ళాడు.
తనపట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఇంద్రుని మనస్సులో వస్తున్న భావజాలమును బృహస్పతి తన గృహమునందు కూర్చుని తెలుసుకుంటున్నాడు. ఇంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకోగానే అతనికొక పాఠం చెప్పాలని, తన యోగశక్తితో ఇంద్రుడికి దొరకకుండ అంతర్హితుడయిపోయాడు. ఇంద్రుడు వచ్చాడు. కానీ ఎక్కడా గురువుగారి దర్శనం అవలేదు. ఖిన్నుడై ఐరావతం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. "అయ్యో! గురువుగారు ఎక్కడా దొరకలేదు. గురువుగారి పట్ల అపచారం చేశాను. గురువులకు క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నాను" అని అనుకుంటున్నాడు. ఈ మాట వినవలసిన వాళ్ళు విననే విన్నారు. అదే ఉత్తర క్షణ ఫలితం అంటే. ఈయన మాటలను రాక్షసుల గూఢచారులు విన్నారు. వెంటనే పరుగుపరుగున వెళ్ళిపోయి రాక్షసులకు నివేదన చేశారు. "అయ్యా! ఇవాళ ఇంద్రునికి బృహస్పతి అనుగ్రహం తొలగిపోయింది. బృహస్పతికి ఆగ్రహం కలిగింది. గురువు ఆగ్రహం ఎవరిమీద కలిగిందో వాడిని పడగోట్టేయడం చాలా తేలిక. కాబట్టి, ఇపుడు ఇంద్రుడు గడ్డిపోచ. మనం యుద్ధమునకు వెళ్ళడం కేవలం నిమిత్తం. ఇంద్రుడు ఓడిపోయి తీరుతాడు. అందుకని మనం యుద్ధానికి బయలుదేరుదాం" అన్నారు. అంతే రాక్షస సైన్యం అంతా వచ్చేశారు. బ్రహ్మాండమయిన పోరు జరుగుతోంది. ఇంత బలవంతులయిన దేవతలు కూడా గడ్డిపోచల్లా ఎందుకూ పనికిరాకుండా ఓడిపోయి వెళ్ళిపోతున్నారు. రాక్షసులకు ఇప్పుడు గురుబలం ఉన్నది. వీళ్ళు దేవతలే కావచ్చు, గురుబలం లేదు. అందుచేత వీరు ఓడిపోయారు. అమరావతిని రాక్షసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంద్రాదులు భయపడి బ్రహ్మగారి దగ్గరకు పరుగెత్తారు. "అయ్యా, కనీ వినీ ఎరుగని విడ్డూరం. కొన్ని సంవత్సరములు పోరాడాం. మాకు ఓటమి తెలియదు. అటువంటిది నిన్న బృహస్పతి గారికి కోపం వచ్చి సభలోంచి వెళ్ళిపోయారు. ఇవాళ అమరావతి పోయింది. ఉత్తర క్షణంలో నేను రాజ్య భ్రష్టుడనైపోయాను. దేనిమీద కూర్చుని వీళ్ళందరూ నావాళ్ళు అనుకొని గౌరవింపబడ్డానో వాళ్ళ ఎదుటనే ఇంద్రుడు చేతకాని వాడయి ఓడిపోయాడు అనిపించుకుని తిరిగి వచ్చేశాను. దీనికంతటికీ కారణం నేను బృహస్పతిని అవమానించడమే అని అనుకుంటున్నాను. ఇప్పుడు మాకు జీవితం ఎలా గట్టెక్కుతుంది" అని అడిగాడు. బ్రహ్మగారు అన్నారు "మీరు అమృతం త్రాగామని, మరణం లేదని సంతోషపడుతున్నారు. మీరు పుట్టినప్పటి నుండి మహానుభావుడు బృహస్పతి బ్రహ్మవిద్యా నిపుణుడై అంతటా ఈశ్వరుడిని చూస్తూ తనకోసమని కాకుండా మహాత్యాగియై మీకందరికీ ఈ సుస్థిరమయిన స్థానములను కల్పించాడు. అటువంటి మహాపురుషుడిని ఎలా గౌరవించాలో మీకు చేతకాలేదంటే మీరు ఇవాళ మదించి ఉన్నారు. అందుకే మీరు సింహాసన భ్రష్టులయ్యారు". బ్రహ్మగారే తలచుకుంటే ఒకసారి బృహస్పతిని ప్రార్థన చేసి పిలువగలరు. కానీ గురువుపట్ల ఆయన చూపించిన మర్యాద చూడండి. "మీకు దేనివలన రాజ్యము పోయినది? మీకు బాగా ఎరుక కలిగిందా?" అని అడిగారు. అపుడు వాళ్ళు "అయ్యా, మాకు బుద్ధి వచ్చింది. మాకు ఇప్పుడు గురువుల అనుగ్రహం కావాలి" అని చెప్పారు.
గురువు గారి అనుగ్రహం గురువుగారి నుంచే వస్తుంది.
బ్రహ్మగారు దేవతలతో "గురుస్థానం ఖాళీగా ఉండకూడదు. అందాకా మీకొక అభయం ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఒక గురువును ఆశ్రయించి గురువు అనుగ్రహమును పొందండి. ఆచార్య పురుషునిగా ఉండడానికి ఎవరు అర్హుడో వారి పాదములు పట్టుకోండి" అన్నారు. అంటే వాళ్ళు "మాకేం తెలుసు. మీరే సెలవివ్వండి" అని అడిగారు. అపుడు బ్రహ్మ గారు "త్వష్ట అనే ప్రజాపతికి ఒక కుమారుడు ఉన్నాడు. వరుసకి ఆయన మీకన్నా చాలా చిన్నవాడు. కానీ ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని. మీరు అటువంటి మహాపురుషుని సేవించి గురు పదవియందు కూర్చోపెడితే ఆయన అనుగ్రహం చేత ఆయన ఆశీర్వచనం చేత మరల రాజ్యసంపదలు పొందగలరు. అందుకని మీరు వెళ్ళి త్వష్ట ప్రజాపతి కుమారుడయిన విశ్వరూపుని ప్రార్థన చేయండి" అన్నారు. అంతే వీళ్ళందరూ విశ్వరూపుని ఆశ్రయించారు. విశ్వరూపుడిని ప్రార్థన చేశారు. "ఇప్పుడు మాకు గురువు అంటే ఎవరో తెలిసింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి, పరతత్త్వానికి, గురువుకి తేడా లేదు. ఒకటే అయి ఉంటాడు. బ్రహ్మగారి రూపమే తండ్రిగా ఉంటుంది. అందుకే తండ్రి ఉపదేశం చేస్తే బ్రహ్మోపదేశమే! సోదరుడు ఇంద్రుని రూపంలో ఉంటాడు. అన్నగారిని సేవిస్తే దేవేంద్రుని సేవించినట్లు. అమ్మ భూదేవి రూపం. తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు సాక్షాత్తు రాశీభూతమయిన దయా స్వరూపములు. తన బావయే ధర్మ స్వరూపము. అభ్యాగతుడు అగ్నిదేవుని రూపం. సర్వభూతములు కేశవుని రూపములు. అందుకని నీకు మేము తండ్రుల వరుస అవుతాయి. ఎందుకంటే నువ్వు త్వష్ట ప్రజాపతి కుమారుడవు. కానీ ఇవాళ నీలో వున్న జ్ఞానమును మేము గుర్తించాము. నీయందు గురుత్వమును చూసి నిన్ను పరతత్త్వంగా చూసి నీ పాదములకు మా శిరస్సు తాటించి నమస్కరిస్తున్నాము. మాకు ఆచార్యత్వాన్ని వహించి మళ్ళీ దేవేంద్రాది పదవులు వచ్చేటట్లుగా అనుగ్రహాన్ని కటాక్షించు" అన్నారు.
ఆయన గురుపదవిని స్వీకరించి వచ్చాడు. వస్తూనే ఆయన ఒక మహోత్కృష్టమయిన పని చేశాడు. రాక్షసులకు ఇవాళ ఇంత శక్తి ఎక్కడ నుంచి వచ్చింది అని బేరీజు వేశాడు. వారు ఆ శక్తిని శుక్రాచార్యుల వారి అనుగ్రహం నుండి పొందారని గ్రహించాడు. ఇపుడు దేవతలకు ఎంత శక్తి వస్తే ద్విగుణీకృత ఐశ్వర్యమును ఇంద్రుడు పొంది రాక్షసులను చంపగలడో లెక్క గట్టాలి. ఇది లెక్క గట్టడానికి ఆ తేజస్సును గణించగల శక్తి ఇక్కడ ఉండాలి. అదీ ఆచార్యపదవి అంటే. అదీ గురుత్వం అంటే! ఇప్పుడు ఇంద్రుని కూర్చోబెట్టి నారాయణ కవచం ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసి ఒక మాట చెప్పాడు. "ఇంతకూ పూర్వం ఈ నారాయణ కవచమును "కౌశికుడు" అనే బ్రాహ్మణుడు ఉపదేశం పొందాడు. ఆయన ఎడారిలో తిరుగుతూ ఉండగా నారాయణ కవచమునే ఉపదేశం తీసుకుని దానినే ధ్యానం చేస్తూ ప్రాణములను విడిచిపెట్టేశాడు. అపుడు ఆ నారాయణ కవచము తేజస్సు ఆయన అస్థికలకు పట్టేసింది. ఆయన ఆస్థి పంజరము ఆ ఎడారిలో ఇసుకలో పడిపోయి ఉండిపోయింది. చిత్రరథుడు అనే గంధర్వుడు ఆకాశమార్గంలో భార్యలతో కలిసి విమానంలో వెళ్ళిపోతున్నాడు. ఆ విమానం ఎడారిలో పడిపోయి ఉన్న అస్థిపంజరము దగ్గరకు వచ్చింది. రాగానే దానిని దాటడం మానేసి ఆ విమానం క్రింద పడిపోయింది. అందులోంచి గంధర్వుడు భార్యలతో బయట పడిపోయాడు. అకస్మాత్తుగా విమానం భూమిమీద పడి పోయిందేమిటని తెల్లబోయాడు. ఈ సమయంలో ఒక మహానుభావుడు వాలఖిల్యుడు అనే మహర్షి అక్కడికి వచ్చి "నీ విమానం పడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా - నారాయణ కవచము ఉపదేశం తీసుకుని నారాయణ కవచమును సశాస్త్రీయంగా ఉపాసిన చేసిన ఒక మహాపురుషుడు కౌశికుడు అనే బ్రాహ్మణుడు, ఇక్కడ ధ్యానంలో శరీరం విడిచి పెట్టాడు. ఆ కవచ ప్రభావం అస్థికలకు ఉండిపోయింది. ఎవరూ ఆ అస్తికలను దాటి వెళ్ళలేరు. కాబట్టి నీవు ఆ అస్తికలను తీసి మూటగట్టి వాటిని దగ్గరలో ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆ తదనంతరం నువ్వు స్నానం చేసి ఆచమనం చేసి మరల వచ్చి విమానం ఎక్కితే నీ విమానం కదులుతుంది" అన్నాడు. ఆ చిత్రరథుడు ఎముకలనన్నిటిని ఏరి మూటగట్టి తీసుకువెళ్ళి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి, స్నానం చేసి, ఆచమనం చేసి వచ్చి విమానం ఎక్కాడు. అప్పుడు విమానం ఆ ప్రదేశమును దాటి వెళ్ళింది. ఈ నారాయణ కవచమునకు వున్న శక్తి అంత గొప్పది. నీకు ఉపదేశం చేస్తున్నాను స్వీకరించి అని ఆ నారాయణ కవచమును ఉపదేశం చేశాడు. ఇప్పుడు శుక్రాచార్యుల వారు రాక్షసులకు ఇచ్చిన శక్తి కన్నా ఇంద్రుడి శక్తి ఎక్కువయిపోయింది. గురువుల అనుగ్రహం కలిగింది. అంతే రాక్షసులను అందరినీ ఓడించి మరల అమరావతిని స్వాధీనం చేసుకుని ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు.
షష్ఠ స్కంధము - వృతాసుర వృత్తాంతము
అమరావతిని స్వాధీనం చేసుకొని ఇంద్రుడు ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కానీ పూర్వం "మా ఐశ్వర్యం అంతా మీది" అని ఒక మాట అన్నాడు కదా! "మహానుభావా, మీ వలననే మరల నేను ఈ అమరావతిని పొందాను. ఈ ఐశ్వర్యం అంతా మీదే. మీరు ఈ ఐశ్వర్యమును అనుభవించవచ్చు" అన్నాడు. తనవలన శిష్యుడు అంట ఐశ్వర్యమును పొందాడని, వాని ఐశ్వర్యమును పొందే ప్రయత్నమును గురువు చెయ్యడు. విశ్వరూపుడు అన్నాడు " నీ ఐశ్వర్యం నాకెందుకు? నేను అలా పుచ్చుకునే వాడిని కాను. నీ ఐశ్వర్యం నాకు అక్కర్లేదు" అన్నాడు. ఇంత గొప్ప విశ్వరూపుడు తదనంతరం యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులను స్వీకరిస్తూ ఉండేవాడు. ఇంద్రాదులకు ఆ హవిస్సులు ఇస్తూ ఉండేవాడు. కానీ ఆయన తల్లిగారి పేరు "రచన". ఆవిడ రాక్షస వంశమునకు చెందినది. మేనమామలైన రాక్షసులు వచ్చి "ఒరేయ్, నువ్వు మా మేనల్లుడివి. నీవల్ల మేము స్వర్గమును పోగొట్టుకున్నాము. నీవు వెళ్ళి దేవతలకు గురుత్వము వహించావు. ఇంద్రుడికి నీమీద నమ్మకం ఎక్కువ. కాబట్టి ఇంద్రుడు చూడకుండా మాకు కొద్దిగా హవిర్భాగములు పెట్టేస్తూ ఉండు" అన్నారు.
ఇలా చేయడం తప్పే అందులో సందేహం లేదు. అయితే విశ్వరూపుడు పెట్టాడు. అయితే ఎందుకు పెట్టాడు? విశ్వరూపుడు తన స్వరూపం ఏమిటో ముందరే చెప్పాడు. "నాకు రాగద్వేషములు తెలియవు. నేను అంతటా బ్రహ్మమునే చూస్తాను. ఎవరైనా ప్రార్థన చేస్తే గబుక్కున వారిమాట వినేస్తాను" అని చెప్పాడు. అందుకని వాళ్లకి హవిర్భాగములు ఇవ్వడం మొదలు పెట్టాడు. ఇది ఒకరోజున ఇంద్రుడు గమనించాడు. మరుక్షణం యుక్తాయుక్త విచక్షణ కోల్పోయాడు. వెంటనే తన చేతిలో వున్న చంద్రహాసమును తీసుకొని మహానుభావుడైన విశ్వరూపుని మూడు తలకాయలు తెగిపోయేటట్లు నరికేశాడు. ఆయన మూడు తలకాయలలో ఒక తలకాయతో యజ్ఞవేదిలో సురాపానం చేస్తూ ఉంటాడు. సురాపానం చేసే తల క్రింద పడగానే అది ఆడ పిచ్చుకగా మారిపోయింది. సోమపానం చేసే తలకాయ కౌజు పిట్టగా మారిపోయింది. అన్నం తినే తలకాయ తీతువు పిట్టగా మారిపోయింది. అందుకే ఇప్పటికీ తీతువు పిట్ట అరిచింది అంటే అమంగళము అని అంటారు. ఎందుకు అంటే ఆనాడు ఇంద్రుని వలన బ్రహ్మహత్య జరిగింది. ఎవరిని గురువుగా పెట్టుకున్నాడో అటువంటి గురువు తలకాయ కోసేశాడు. అలా కోసేసినపుడు పడిపోయిన తలకాయే తీతువు పిట్ట అయింది. అటువంటి కూత వినపడితే అమంగళము. అది ఒక్క కృష్ణ స్మరణం చేత మాత్రమే పోతుంది. అందుకే తీతువు పిట్ట అరిచినపుడు కృష్ణ స్మరణ చేస్తూ ఉంటారు.
ఈవిధంగా తెగిపడిన విశ్వరూపుని మూడు తలలు మూడు పిట్టలయ్యాయి. ఈ మూడు పిట్టలు కూస్తూ ఇంద్రుని వెంట పడ్డాయి. ఆ ఘోరమయిన కూతలను వినలేక ఏడాదిపాటు భరించాడు. బ్రహ్మ హత్యాపాతకం వలన అతనికి మనశ్శాంతి పోయింది. దీనిని ఎవరికయినా ఇచ్చివేయాలి. ఎవరు పుచ్చుకుంటారు? ఆ రోజులలో ఇంద్రుని మాట కాదనలేక బ్రహ్మ హత్యాపాతకమును పుచుకోవడానికి నలుగురు ఒప్పుకున్నారు. అవి భూమి, చెట్లు, జలము, స్త్రీలు. ఈ నలుగురు పావు వంతు చొప్పున పుచ్చుకున్నారు. తీసుకొనినందుకు గాను తమకు వరముల నిమ్మని ఇంద్రుని అడిగారు. అపుడు ఇంద్రుడు వాటికి వరములు ఇచ్చాడు. భూమికి "ఎవరయినా గొయ్యి తీసినా ఆ గొయ్యి కొంత కాలమునకు తనంత తాను పూడుకుపోతుంది" అని, చెట్లకు "ఎవరయినా చెట్లను కత్తితో నరికేసినా మొదలు ఉంటే చాలు మరల చిగురించేలా", "ఏ పనిచేసినా ప్రక్షాళనము అనబడే మాట దానియందు ప్రయోగింప బడదు. మీరు ఏదో ముట్టుకోకూడని వస్తువును ముట్టుకుని ఒక కాగితమునకు తుడుచు కున్నారనుకోండి అది ప్రక్షాళనము అనరు. నీటి చుక్క ముట్టుకున్నట్లయితే వెంటనే ప్రక్షాళనము అయిపోతుంది. అందుకే మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలోని పువ్వులు ఈశ్వరుడి పాదాల మీద వేస్తే ఒక చుక్క నీరు చేతిలో వేస్తే చెయ్యి తుడుచుకుంటాము. ఒక్క చుక్కయినా చాలు. అటువంటి ప్రక్షాళన చేయగలిగే శక్తి నీటికి ఇచ్చాడు. కామోప భోగములందు ఎక్కువ సుఖము కలిగేటట్లు స్త్రీలకి వరం ఇచ్చాడు. ఈవిధంగా నలుగురుకి నాలుగు వరములు ఇచ్చాడు.
ముందు భూమి పుచ్చుకుంది. ఊసర క్షేత్రములు వచ్చాయి. అంటే ఉప్పుతో కూడిన పంటలు పండని ఇసుక పర్రలు ఏర్పడ్డాయి. దానిమీద మొక్క మొలవదు. చెట్టు పుచ్చుకుంది. చెట్టులోంచి జిగురు కారుతుంది. అందుకే చెట్టు జిగురు వికారమును స్పృశించకూడదు అంటారు. నీటియందు బుడగగాని, నురుగు కాని ఉంటే అది బ్రహ్మహత్యా పాతక రూపం. ఆచమనం చేసేటప్పుడు నీటిలో బుడగగాని, నీటియందు నురుగు కాని ఉంటే ఆ నీళ్ళని పక్కకి వదిలి పెట్టేస్తారు. కొత్తగా ప్రవాహం వచ్చేముందు పెద్ద పెద్ద నురుగు వస్తుంది. దాంట్లోకి ప్రవేశించి స్నానం చేయడం కానీ, ఆ నరుగు ముట్టుకోవడం కానీ చెయ్యరు. స్త్రీలయందు రజోగుణ దర్శనము బ్రహ్మహత్యా పాతక రూపం. వారియందు ఆ నియమం ఉంచారు. ఇంద్రుడు తన బ్రహ్మ హత్యాపాతకము నుండి నివారణ పొంది మరల సింహాసనాదిష్టుడు అయ్యాడు. ఒకనాడు బృహస్పతి సభలోకి వచ్చినపుడు లేవనందుకు సంభవించిన పాపం ఇప్పటికీ తను సింహాసనం మీద సంతోషంగా కూర్చున్నాను అనడానికి వీల్లేకుండా ఎన్ని కష్టాలు ఒకదాని వెనుక మరొకటి తీసుకు వచ్చేస్తోందో చూడండి!
విశ్వరూపుడు మరణించాడు అని త్వష్ట ప్రజాపతికి తెలిసి కోపముతో ఒక పెద్ద యజ్ఞం మొదలు పెట్టాడు. ఇంద్రుడిని సంహరించే వేరొక కొడుకు ఆ యజ్ఞంలోంచి రావాలని అన్నాడు. యజ్ఞం పరిసమాప్తము అవుతుండగా ఒక బ్రహ్మాండమయిన రూపము ఆ యజ్ఞ గుండంలోంచి బయటకు వచ్చింది. ఆ యజ్ఞ గుండంలోంచి బయటకు వచ్చిన రూపమునకు పేరు తండ్రిగారు పెట్టలేదు.అది పుట్టీ పుట్టగానే మొత్తం ఈ బ్రహ్మాండము ఎంతవరకు ఉన్నదో అంతవరకూ వ్యాపించేసి నిండిపోయింది. ఇంకా చోటు లేదు. అంత నిండిపోయింది కాబట్టి దానికి "వృతాసురుడు" అని పిలిచారు. ఆయన తలకాయను నరకడానికి ఇంద్రునికి ఒక ఏడాదికాలం పట్టింది. వజ్రాయుధంతో ఆయన కంఠం చుట్టూ తిరుగుతూ ఒక ఏడాదిపాటు నరికాడు. కోస్తే ఉత్తరాయణ, దక్షిణాయన మధ్య కాలానికి కోయడం పూర్తయింది. అతడు పుడుతూనే ఆకాశం అంతటిని నోట్లో పెట్టుకుని చప్పరించాడు. ఆ తరువాత అది ఏమయినా రుచిగా ఉంటుందేమోనని ఒక్కొక్క గ్రహమును నాకి అవతల పారేస్తూ ఉండేవాడు. అలా గ్రహములను, నక్షత్రములను, బ్రహ్మాండములను, అన్నింటినీ చేత్తో పట్టుకుని వాటిని నాకి అవతల పారేస్తూ ఉండేవాడు. వాడు పుడుతూనే "ఇంద్రుడు అనేవాడు ఉండాలి. ఎక్కడ ఉంటాడు" అని అడిగాడు. అంటే వాడు తనని చంపడానికి వచ్చేస్తున్నాడని ఇంద్రుడికి తెలిసిపోయింది. ఇప్పుడు ఇంద్రుడు సైన్యం అంతటినీ తీసుకుని యుద్ధమునకు వెళ్ళాడు. వీరు వేసిన అస్త్రములను తన గుప్పెటతో పట్టుకుని నోట్లో వేసుకుని చప్పరించేశాడు. ఇంకా వానితో యుద్ధం లాభం లేదని, ముందు బతికితే చాలనుకుని దేవతలందరూ పారిపోవడానికి నిశ్చయించుకున్నారు. శ్రీమన్నారాయణ దర్శనం కోసం వైకుంఠ ద్వారం వద్దకు వెళ్ళి నిలబడి శ్రీమన్నారాయణుని ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఆయనకు ఆర్తత్రాణ పరాయణుడు అని బిరుదు. ఆర్తితో ప్రార్థన చేస్తే తప్పుచేశాడా, ఒప్పు చేశాడా అని చూడడు. గభాలున వచ్చి దర్శనం ఇచ్చి రక్షిస్తారు. తనను నమ్మినవారి పట్ల అలా ప్రవర్తిస్తారు. స్వామి దర్శనం ఇచ్చి "మీరేమీ బెంగ పెట్టుకోకండి. భయపడకండి" అని అభయ ప్రకటన చేశారు. అపుడు వీరందరూ స్వామిని స్తోత్రం చేశారు.
వెంటనే స్వామి పోనీలెండి మీరేమీ బెంగ పెట్టుకోకండి వృతాసురుణ్ణి సంహరించి మిమ్మల్ని రక్షిస్తాను అని అనలేదు. ఇక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతోంది? బ్రహ్మజ్ఞానుల పట్ల జరుగుతోంది. అంటే ఎక్కడో మనస్సులో వాళ్ళ పట్ల చులకన భావం ఉంది. మనం పలుమార్లు వాళ్ళను తెచ్చుకోవచ్చు. ఎలాగయినా వాడుకోవచ్చు అనే భావన ఒకటి మనసులో మెదలుతోంది. ఇది ముందు లోపల సంస్కార బలంతో మార్చుకోవాలి. అందుకని ఇప్పుడు గురువుల అనుగ్రహం ఎలా ఉంటుందో, వారి త్యాగం ఎలా ఉంటుందో చూపించాలి అనుకుని "మిమ్మల్ని రక్షించడానికి మీకు అస్త్ర శస్త్రములు పోయాయి కదా! వృతాసురుణ్ణి సంహరించడానికి కావలసిన ఆయుధమును ఇవ్వగలిగిన వాడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు. ఆయనే దధీచి మహర్షి. మీకు వలయు ఆయుధం ఆయన శరీరం నుండి వస్తుంది. ఆయన నిరంతరం నారాయణ కవచమును పారాయణం చేశాడు. అందుకని ఆయన వద్దకు వెళ్ళి "అయ్యా, మీ శరీరం ఇచ్చేయండి" అని అడగండి. ఆయన బ్రహ్మజ్ఞాని. తన శరీరమును ఇచ్చేస్తాడు. ఆయన శరీరం ఇచ్చిన తరువాత ఆయన శరీరమును కోసివేయండి. లోపల ఉన్న ఎముకలను పైకితీసి మూట కట్టుకుని పట్టుకు వెళ్ళి విశ్వకర్మకు ఇవ్వండి విశ్వకర్మ ఆ ఎముకలలోంచి నూరు అంచులు కలిగిన వజ్రాయుధమును తయారుచేస్తాడు. దానితో వృతాసురుడు సంహరింప బడతాడు. అందుకని వెళ్ళి దధీచిని ప్రార్థించండి అని చెప్పాడు. గతంలో త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుని సంహరించడం వల్ల తనకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. ఇపుడు వృత్రాసురుని సంహరించడం వలన మరలతనకు ఏమి కీడు మూడుతుందో నాన్న ఆలోచన ఇంద్రునికి కలిగింది. ఈవిషయమునే దేవతలకు చెప్పాడు. ఇపుడు ఇంద్రునిలో కొంచెం పాప పుణ్యముల విచారణ ప్రారంభం అయింది. అపుడు దేవతలు "మేము నీచేత అశ్వమేధ యాగమును చేయించి ఎలాగోలాగ నీవు బ్రహ్మ హత్యాపాతకం నుండి విముక్తుడవయెలా చూస్తాము. ముందు వెళ్ళి ఆ దధీచి శరీరమును అడగవలసినది" అని చెప్పారు. ఇప్పుడు పరుగెత్తుకుంటూ దేవతలను తీసుకుని దధీచి దగ్గరకు వెళ్ళాడు.
షష్ఠ స్కంధము - వృత్రాసుర సంహారం - 2
ఇంద్రుడు దధీచి దగ్గరకు వెళ్ళి "అయ్యా, నేను ఇంద్రుడనని చాలా గొప్పవాడిని అనే అహంభావంతో మా గురువుగారు సభలోకి వచ్చినపుడు లేవకుండా కూడ్చుని ఆయనకు అపచారం చేశాను. ఈవేళ నేను ఏ స్థితికి వచ్చానో తెలుసా! నేను దేహంతో ఉండడానికి దేహీ, అని అభ్యర్ధిస్తున్నాను. అంతకన్నా నాకు బ్రతుకు లేదు. నేను బ్రతికి ఉండడానికి దయచేసి "మీ దేహమును నాకీయవలసినది. ఇంతకన్న నేను ఏమి అడగను. ఇలా అడగడంలోనే నేను చాలా చచ్చిపోయాను" అని ఇంతటి ఇంద్రుడు తలదించుకుని అడిగాడు.
దధీచి గొప్పతనం ఏమిటంటే ఆయన ఇంతకుముందు రెండుమార్లు చచ్చిపోయాడు. ఆయన ఒకసారి తపస్సు చేసుకుంటుంటే అశ్వనీ దేవతలు వచ్చి "అయ్యా, మీరు మాకు "అశ్వశిరము" అనే మంత్రమును ఉపదేశం చెయ్యాలండి" అన్నారు. అపుడు దధీచి ఇపుడు నేను ఒకయాగం చేసుకుంటున్నాను. అది పూర్తయిపోయిన తరువాత తనది. తప్పకుండా ఉపదేశం చేస్తాను అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత ఇంద్రుడు దధీచి దగ్గరకు వచ్చి మీరు ఆ విద్య అశ్వనీ దేవతలకు చెప్పినట్లయితే మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు. తరువాత మరల అశ్వనీ దేవతలు వచ్చారు. అపుడు దధీచి నేను మీకు ఆ మంత్రమును ఉపదేశించినట్లయితే ఇంద్రుడు నన్ను చంపేస్తానన్నాడు. అందుకని ఎలాగ అన్నాడు అశ్వనీ దేవతలు "నీవు మాకు విద్య ఉపదేశం చేశావని చెప్పగానే ముందు వెనుక చూడకుండా ఇంద్రుడు నీ కంఠమును కోసేస్తాడు. ఆ పనేదో మేమే చేసేస్తాము. ఒక గుఱ్ఱం తలకాయ తీసుకు వచ్చి నీకు పెట్టేస్తాము. ఆ విద్య పేరు ఎలాగు అశ్వశిరము కదా. నువ్వు గుర్రం తలకాయతో మాకు చెప్పెయ్యి. తరువాత ఇంద్రుడు వచ్చి కోపంతో ముందు వెనుక చూడకుండా ఆ తలకాయ కొట్టేస్తాడు. అపుడు మేము ఆ గుర్రం తలకాయ తీసివేసి అసలు తలకాయ పెట్టేస్తాము అన్నారు.
గురువు అంటే ఎలా ఉంటాడో ఎంత స్వార్థ త్యాగంతో ఉన్నాడో చూడండి! దధీచి నరికెయ్యండి అన్నాడు. వెంటనే వారు దధీచి కంఠం నరికేసి ఒక గుర్రం తలకాయను తెచ్చి అతికేశారు. ఇంద్రుడు వచ్చి మరల తలకాయ నరికేశాడు. వీళ్ళు ఆ గుర్రం తలకాయను ప్రక్కన పెట్టి దధీచికి మామూలు తలను పెట్టేశారు. ఆయన ప్రాణంతోనే ఉన్నాడు. కాబట్టి బ్రహ్మహత్యాపాతకం రాలేదు. దధీచి ద్విజుడు. మహాపురుషుడు. అటువంటి మహాపురుషుని దగ్గరకు వెళ్ళి ఈమాట అడిగితె ఆయన వీళ్ళను చూసి ఒక చిరునవ్వు నవ్వి "నేను ప్రపంచంలో కోర్కెలను అడిగిన వారిని చూశాను. కానీ మీరు నా శరీరమును అడుగుతున్నారు. ఓ;ఇలా అడగడానికి మీకు సిగ్గుగా లేదా? మీరు బ్రతకడానికి ఇంకొకరిని చంపుతారా? ఇలా అడగవచ్చునా? అన్నారు. అంటే వాళ్ళు "అయ్యా, మాకు ఇంతకన్న వేరు మార్గం లేదు. అందుకే మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఇప్పుడు మమ్మల్ని రక్షించడానికి మీరు తప్ప ఈ ప్రపంచమునందు వేరొకరు లేరు అన్నారు.
దధీచి "ఈ శరీరం నేను కాదు. నేను ఆత్మని. మీకు శరీరం కావాలి తీసుకోండి. అని చెప్పి యోగవిద్యతో తనలో ఉన్న ప్రాణవాయువును పైకిలేపి అనంతంలో కలిపేసి శరీరమును కిందపడగొట్టేశాడు. తరువాత వీళ్ళందరూ ఆ శరీరము కోసి అందులోని ఎముకలను తీసుకొని విశ్వకర్మకు ఇచ్చారు. అందులోంచి విశ్వకర్మ నూరు అంచులు కలిగిన వజ్రాయుధమును తయారు చేశాడు.
ఈలోగా వృత్రాసురుడు లోకములన్నింటిని గడగడలాడించేస్తున్నాడు. ఇంద్రుడు గబగబా వెంటనే ఈ వజ్రాయుధమును చేతిలో పట్టుకుని ఐరావతమునెక్కి తన సైన్యమునంతటిని తీసుకుని యుద్ధభూమికి వెళ్ళాడు. వృత్రాసురుడితో యుద్ధం చేశాడు. వృత్రాసురుడు అన్నాడు "నేను ఈ విశ్వమంతా నిండిపోయి వుంది నీవేమి చేస్తున్నావో చూస్తూనే ఉన్నాను. నువ్వు శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని, దధీచి ఎముకలు పట్టుకుని దానితో వజ్రాయుధం చేయించుకుని నన్ను చంపడానికి వచ్చావు. నేను నీ చేతిలో చచ్చిపోతాను. ఎందుకంటే శ్రీమన్నారాయణుడి అండ ఉంది నీకు. వజ్రాయుదానికి నేను చచ్చిపోతానని స్వామి చెప్పారు. ఆయన వాక్కుకు తిరుగులేదు. నేను చచ్చిపోతానన్న భయం లేదు. నాకు ఎప్పటికయినా భగవంతుని సేవ చేసి భగవద్వాక్యములు చెప్పే వారితోటి కూడిక కావాలి. నేను శ్రీమన్నారాయణుని పాదములలో చేరిపోవడానికి పరితపిస్తున్న వాడిని. అందుకని తొందరగా నీ వజ్రాయుధమును నామీద ప్రయోగించి ఇంద్రా నన్ను తుదముట్టించు" అన్నాడు.
వాని మాటలకు ఇంద్రుడు ఆశ్చర్యపోయి "నిన్ను చూస్తుంటే నాకు నారాయణునే చూస్తున్నట్లు ఉంది నీకు నమస్కారం చెయ్యాలనిపిస్తోంది. నీవు రాక్షసుడవు ఏమిటి, నీకు యుద్ధం ఏమిటి" అని అడిగాడు. ఆయన "ధర్మము ధర్మమే. నీవు మా అన్నయ్యను చంపేశావు. కాబట్టి చచ్చిపోయేవరకు నీతో యుద్ధం చేస్తాను" అని ఒక శూలం తీసి ఐరావతం తలమీద కొట్టాడు. ఆ దెబ్బకు తలబద్దలై నెత్తురు కారుతూ ఐరావతం పడిపోయింది. ఆ శూలం తీసి లెంపకాయ కొట్టినట్లు ఇంద్రుని చెంపమీద కొట్టాడు. ఆ దెబ్బకు తల గిర్రున తిరిగి ఇంద్రుడు తన చేతిలో వున్న వజ్రాయుధమును క్రింద పడేశాడు. అది భూమిమీద పడిపోయింది. ఇంద్రా, వజ్రాయుధమును తీసుకోని నాతొ యుద్ధం చెయ్యి" అన్నాడు. నిజంగా ఆ వృత్రాసురుడు ఎంతటి ధర్మాత్ముడో చూడండి. ఇంద్రుడు అనుమాన పడుతూనే వజ్రాయుధాన్ని చేతితో పట్టుకుని ఆయన రెండు చేతులు నరికేశాడు. అలాగే వాడు పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ దగ్గరకు వచ్చి నోటితో ఉఫ్ అన్నాడు. ఆ గాలికి ఇంద్రుడు, ఇంద్రుని ఐరావతము అన్నీ కలిసి ఆయన నోట్లోకి వెళ్ళిపోయాయి. గుటుక్కున మింగేశాడు. వృత్రాసురుని కడుపులోకి వెళ్ళిపోయిన ఇంద్రుడు అదృష్టవశాత్తు ఇంతకు పూర్వం విశ్వరూపుని దగ్గర నారాయణ కవచం పొందాడు. ఆ నారాయణ కవచ స్మరణం చేత వైష్ణవీ విద్య చేత అతడు వృత్రుని కడుపులోకి వెళ్ళిపోయినా జీర్ణము కాలేదు. వృత్రాసురుని కడుపులో ఉండిపోయి వజ్రాయుధంతో ఆయన కడుపు కత్తిరించి బయటకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఒక సంవత్సరం పాటు ఆయన కంఠం చుట్టూ తిరుగుతూ వజ్రాయుధంతో ఆయన కంఠమును కట్టిరించాడు. ఉత్తరాయణ దక్షిణాయనముల సంధికాలంలో వృత్రాసురుని శిరస్సు దుళ్ళి క్రింద పడిపోయింది. వృత్రాసురుడు రాక్షసుడే కానీ పోతన గారు అన్నారు -
అఖిల దుఃఖైక సంహారాది కారణం; బఖిలార్థ సంచ యాహ్లాదకరము
విమల భక్త్యుద్రేక విభవ సందర్శనం; బనుపమ భక్త వర్ణనరతంబు
విబుధహర్షానేక విజయ సంయుక్తంబు; గ్రస్తామరేంద్ర మోక్షక్రమంబు
బ్రహ్మహత్యానేక పాపనిస్తరణంబు; గమనీయ సజ్జన కాంక్షితంబు
నైన యీ యితిహాసంబు నధిక భక్తి, వినినఁ జదివిన వ్రాసిన ననుదినంబు
నాయు రారోగ్య విజయ భాగ్యాభివృద్ధి, కర్మనాశము సుగతియుఁ గల్గు ననఘ!
ఎవరికయినా విశేషమయిన కష్టములు, బ్రహ్మహత్యాపాతకం వంటి కష్టములు వస్తే వృత్రాసుర వధలో వున్న పద్యములను, వచనములను కూర్చుని ఒక పుస్తకంలో వ్రాస్తే చాలు వాళ్ళ కష్టములు పోతాయి. చెపితే చాలు కష్టములు పోతాయి. ఎంతటి మహాపాపం తరుముకు వస్తున్నా వృత్రాసుర వధ వింటే చాలు ఆ పాపములన్నీ పోతాయి.
ఇదంతా విని పరీక్షిత్తు ఒక ప్రశ్న అడిగాడు. ఇప్పటివరకు నీవు నాకు ఎన్నో విషయములు చెప్పావు. కానీ ఇలాంటి రాక్షసుని గురించి నేను వినలేదు. ఏమి ఆశ్చర్యము! నన్ను తొందరగా చంపెయ్యి - నేను శ్రీమన్నారాయణుడిలోకి వెళ్ళిపోతానన్న రాక్షసుడిని ఇంతవరకు నేను చూడలేదు. ఈ వృత్రాసురుడికి ఇంత మహిత భక్తి ఎలా కలిగింది - ఇంతజ్ఞానం ఎలా కలిగినదో నాకు చెప్పు - నా మనస్సు ఆత్రుత పడిపోతోంది అన్నాడు. అంటే మహానుభావుడు శుకుడు ఆనాడు చెప్పాడు.