పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

కథలు - భాగవతాలు : ఉలూఖల బంధనము

ఉలూఖల బంధనము

ఉలూఖల బంధనం ఒక అద్భుతమయిన శ్రీకృష్ణ లీల. భాగవతం మొత్తం మీద తలమానికమయిన లీల యిదే. చాలామంది ఈ లీలను చెప్పమని అడిగి, తమ యిండ్లలో చెప్పించుకుని విని పొంగిపోతూ ఉంటారు. ఒకనాడు యశోదమ్మ సంతోషంగా పెరుగు చిలుకుతున్నది. భగవానుడు జన్మించిన తరువాత నందవ్రజంలోని వారందరూ అధిక ఐశ్వర్యవంతులయారు. గొల్ల స్త్రీలు స్నానం చేసి శుభ్రమయిన వస్త్రములు ధరించి భగవన్నామము చెపుతూ చల్ల చిలికేవారు. యశోద పెరుగు చిలుకుతూ ఒకపక్క నోటివెంట భగవన్నామం పలుకుతోంది. భగవత్కథలు పలుకుతోంది. మనస్సులో కృష్ణయ్యను తలుచుకుంటోంది. ఆ సమయమునకు అక్కడికి బాలకృష్ణుడు వచ్చి అమ్మా నాకు బాగా ఆకలి వేస్తోంది. నాకు తొందరగా పాలు ఇవ్వు” అన్నాడు. ఆమె పిల్లవాడు ఏమి చేస్తాడో చూద్దామని పెరుగు చిలకడం ఆపకుండా ఇంకా చిలుకుతూనే ఉంది. అపుడు కృష్ణుడు “నువ్వు పాలు చిలకడం ఆపి నాకు పాలు యిస్తావా ఇవ్వవా? అని కవ్వం పట్టుకున్నాడు. కవ్వం తిరిగితే పిల్లవాని చెయ్యి నొప్పి పెడుతుందేమోనని తల్లి అనుకుని చల్ల చేయడం ఆపేసింది. కొడుకుని ఒడిలో పడుకోబెట్టుకుని స్తన్యం యిస్తోంది. పాలు తాగుతున్నాడు. దూరంలో పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి. అవి పొంగి పైకి రావడం ఆవిడ చూసింది. పాలు పొయ్యిలో పడిపోతాయేమోనని పక్కన ఒక పీటవేసి దానిమీద పిల్లవాడిని కూర్చోపెట్టి పొయ్యి దగ్గరికి వెళ్ళింది. పొయ్యి మీదవున్న పాలకుండను జాగ్రత్తగా దింపి చుట్ట కుదురు మీద పెట్టింది. ఈవిధంగా పాలు తాగుతున్న వాడిని పక్కన పెట్టేసి మరుగుతున్న పాలకుండను దింపడానికి వెళ్ళిపోయింది.

తల్లి తనను ఎందుకు దింపివేసినది అని చూశాడు. అంతే కృష్ణుడికి కోపం వచ్చేసింది. అపుడు అక్కడ వున్న ఒక రాయితీసి కుండకి వేసి కొట్టాడు. కుండ పగిలిపోయింది. అందులోంచి వెన్నముద్దలు తేలి, పైకి వస్తున్న పెరుగు ఒలికిపోయి పల్లంవైపు ప్రవహిస్తోంది. దీనిని తల్లి చూస్తే కోప పడుతుందని క్రిందపడిన వెన్నను నోట్లో పెట్టుకుని, గబగబా మింగేస్తూ తనకి పాలివ్వలేదని మధ్యమధ్యలో దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు. అమ్మ ఇంకా తనని చూడలేదు. ఆవిడ పాలకుండను పొయ్యిమీద నుంచి దించే ప్రయత్నంలో ఉండిపోయింది. ఆవిడ వచ్చి చూస్తే కోప పడుతుందని రెండుచేతులతో రెండు వెన్నముద్దలను పట్టుకుని గబగబా యింట్లోంచి బయటకు వచ్చి పక్క యింట్లోకి వెళ్ళిపోయాడు. ఆ యింట్లో దంచడానికి పనికిరాని కొయ్యరోలు ఒకటి ఉంది. ఆరోలును తిరగేసి దానిమీద ఎక్కి నిలబడ్డాడు. అమ్మ వస్తుందేమోనని తిరిగి చూస్తూ ఆకలివేస్తోంది అని మధ్య మధ్యలో దొంగ ఏడుపు రాగాలు తీస్తున్నాడు. అలా చేస్తూ అక్కడ చెట్ల మీద వున్నా కోతులను పిలిచాడు. ఆ పిల్ల కోతులన్నీ వచ్చి గోడ ఎక్కి కూర్చున్నాయి. వాటన్నిటికి ఆ యింట్లోని వెన్న తెచ్చి పెడుతున్నాడు. అవి చక్కగా ఆ వెన్నను తింటున్నాయి. మధ్యలో వెనక్కి తిరిగి చూసి దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు.

ఆవిడ పాలకుండను దింపి వెనక్కి తిరిగివచ్చి కృష్ణుడి కోసం చూసింది. ఇంకెక్కడి కృష్ణుడు! కుండ పగిలిపోయింది. ప్రవహిస్తున్న మజ్జిగ, వెన్న వీటినన్నిటిని చూసింది. “గోపికలు చెప్పింది యథార్థమే. వీడు చాలా అల్లరి చేస్తున్నాడన్నమాట” అని అనుకుంది. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో చూడాలి. ఒక రోటిని తిరగేసి దానిమీద కూర్చుని కోతులకు వెన్న పెట్టేస్తున్న కృష్ణుని చూసింది. అపుడు ఆవిడ “వీడి అల్లరి ఎక్కువయి పోయింది. ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి వేడిని యివాళ కట్టి కట్టేస్తాను” అనుకుంది. గోపకాంతలు అందరూ యశోద ఏమి చేస్తుందా అని పరిశీలిస్తున్నారు. అపుడు యశోద “ఈవేళ నిన్ను పట్టుకుంటాను, కట్టేస్తాను” అంది. అనగానే కోతులకు పెడుతున్న వెన్న వదిలేసి ఆ రోలు మీదనుంచి దూకేశాడు. కృష్ణుడిని పట్టుకుందామని ఆవిడ వెతుకుతూ దగ్గరకు వెళ్ళింది. ఈయన పరుగెత్తుకుంటూ వెళ్ళి స్తంభం చాటున నక్కేవాడు. అమ్మా నేనింక ఎప్పుడూ దొంగతనం చేయను, ఎవరింటికీ వెళ్ళాను, వెన్న తిననే తినను, నన్ను కొట్టకు” అని కళ్ళు నులిమేసుకుని ఏడవడం మొదలుపెట్టాడు. అరిచెయ్యి అంటా కాటుక అయిపొయింది. బుగ్గలన్నీ కాటుక అయిపొయింది. ఈ లీల జరుగుతుంటే 33కోట్లమంది దేవతలు, పార్వతీ సహితుడై ఈశ్వరుడు, బ్రహ్మగారు ముక్కున వేలు పెట్టుకుని చూశారు. ఆయన ఆ రోజున అంత భయమును నటించాడు.

అమ్మ ఎటునించి వస్తుందోనని క్రీగంట చూస్తూ పరుగెడుతూనే ఉన్నాడు. ఆఖరికి దొరికిపోయాడు. కొడదామనుకుని చేయి ఎత్తింది. కానీ కళ్ళు నులుముకుంటూ ఏడుస్తున్న చిన్ని కృష్ణుని ముఖం చూసేసరికి కొట్టలేక “నిన్ను కట్టేస్తాను” అని మాత్రమె అనగలిగింది. యశోద ఎంత అదృష్టవంతురాలో. ఎవరికీ దొరకని పరమాత్మ ఆమె చేతికి దొరికిపోయాడు. అపుడు ఆమె కృష్ణుడిని కట్టెయ్యడం కోసమని తాడుకోసం వెడుతోంది. అక్కడ కవ్వమునకు అంతకు ముందు పెట్టి తిప్పిన తాళ్ళు ఉన్నాయి. వాటిని తీసి బొజ్జ చుట్టూ తిప్పుతోంది. తిప్పితే రెండు అంగుళములు తక్కువ వస్తోంది. ఎన్ని తాడులు ముడివేసి కడదామనుకున్నా ఎప్పుడూ రెండు అంగుళములు తక్కువ వస్తోంది.

చిక్కడు సిరి కౌగిటిలో ,
జిక్కడు సనకాది యోగి చిట్టాబ్జములం
జిక్కడు శృతిలతికావలి ,
జిక్కె నాతడు లీల దల్లి చేతన్ రోలన్!!

ఆయన లక్ష్మీదేవి అంతటిది కౌగిలించుకుందామనుకుంటే ఆమె కౌగిలికి దొరకని వాడు, సనక సనందనాది మహర్షుల మనస్సులకు చిక్కనివాడు, వేదమంత్రములకు దొరకని వాడు, ఇప్పుడు అమ్మ చేతికి దొరికి రోటికి కట్టబడినాడు. చివరికి యశోదాదేవి కృష్ణుడిని త్రాటితో రోటికి కట్టేసి నీతులు చెప్పడం ప్రారంభించింది. అపుడు నిజంగా కొడుతుందని భయపడిన వాడిలా అమాయకంగా చూస్తున్న స్వామికి, ఒంటిమీద శ్రీవత్సం తప్ప మరొక మచ్చలేని స్వామికి, పొట్టభాగం అంతా తాడుతో నలిగిపోయి గుర్తు పడిపోయింది.

రెండు అంగుళముల తాడు తక్కువ అవడం అంటే ఏమిటి? భగవంతుని పూజ చేసేటప్పుడు మనం ఎందుకు పూజ చేస్తున్నామో మరిచిపోవాలి. నా స్వామికి యిది చేయకుండా నేను ఎలా ఉండగలను? అనే భావాన పెరగాలి. అపుడు మీరు చేసిన పూజకు కోరిక ఉండదు. ఒక ప్రయోజనమును ఆశించి చేస్తున్నాను, నేను ఈ పూజను చేస్తున్నాను అను ఈ రెండు భావనలను మరిచిపోతారు. అదీ విచిత్రం. అపుడు పూజలో తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోతారు. ఈ రెండు భావనలను మరచి పోవడమే తాడు రెండు అంగుళములు తక్కువ అవుతున్నదనే విషయమును మరిచిపోవడం. అలా ఎలా తక్కువవుతున్నదాని తెలియక పోవడం. ఇటువంటి తాదాత్మ్యానికి ఈశ్వరుడు పొంగిపోతాడు. కేవలము భక్తి చేత పరమాత్మ వశుడు అవుతాడు.

జ్ఞానులచే మౌనులచే ,
దాసులచే యోగసంవిధానుల చేతం
బూని నిబద్ధుండగునే ,
శ్రీనాథుడు భక్తి యుతుల చేతం బోలెన్ ?

మౌనముగా వున్న వాళ్లకు, జ్ఞానులకు, ద్యానం చేసేవాళ్ళకు, దానం చేసేవాళ్ళకు భగవంతుడు యిలా లొంగుతాడని చెప్పలేము. కేవలము పరమ భక్తితో ఆయన వెంటపడి మీరు ఏ రకంగా పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నా, అది ఉద్ధరించి ఈశ్వరుని కట్టి మీ దగ్గరకు తీసుకువచ్చి నిలబెట్టగలదు. అది కేవలం భక్తికే సాధ్యం.

ఇక్కడ పరమాత్మ యశోద భక్తికి లొంగి ఆమెకు పట్టుబడిపోయాడు.⁠⁠⁠⁠