కథలు - భాగవతాలు : వామనావతారం
అష్టమ స్కంధము - వామనావతారం - 1
అమృతోత్పాదనం అయిన తరువాత ఆ అమృతమును సేవించిన దేవతలు వార్ధక్యమును మరణమును పోగొట్టుకున్న వారై, మళ్ళీ పోగొట్టుకొనిన సామ్రాజ్యమును చేజిక్కించుకొని అత్యంత వైభవముతో జీవితమును గడుపుతున్నారు. ఇపుడు ఒక గొప్ప ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. అమృతం త్రాగిన తరువాత ఒకవేళ అది అహంకారమునకు కారణం అయితే పరిస్థితి ఏమిటి? ఈ అనుమానములను తీర్చడానికే కాలగమనంలో ఉత్థాన పతనములు జరుగుతాయి. రాక్షసులకు నాయకత్వం వహించిన బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయినందుకు బెంగ పెట్టుకోలేదు. తన గురువయిన శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి పాదములు పట్టుకున్నాడు. "మహానుభావా! మాకందరికీ కూడా అమృతోత్పాదనంలో భాగం ఇచ్చారు. కష్టపడ్డాము. కానీ అమృతమును సేవించలేకపోయాము. అమృతమును సేవించక పోవడం వలన ఇక మేము శాశ్వతంగా ఎప్పుడూ దేవతల కన్నా అధికులం కాకుండా ఉండిపోవలసినదేనా? అమృతం త్రాగిన వారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీ పాదముల నుండి వస్తుందని మేము నమ్ముతున్నాము. అందుకని మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి. నేను పరిపూర్ణమయిన విశ్వాసంతో మీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను" అన్నాడు.
ఇపుడు గురుశక్తి గొప్పదా? అమృతము గొప్పదా? ఈ విషయం తేల్చాలి. అపుడు శుక్రాచార్యుల వారు బలి చక్రవర్తితో "ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను. దీనిని "విశ్వజిత్ యాగము" అంటారు అని ఆ యాగమును బలిచక్రవర్తి చేత ప్రారంభింప జేశారు. యాగమునకు ఫలితము విష్ణువే ఇవ్వాలి. విశ్వజిత్ యాగము నడుస్తోంది. అది పరిపూర్ణం అయ్యేసరికి ఆ యాగ గుండములో నుండి ఒక బంగారు రథము బయటకు వచ్చింది. దానిమీద ఒక బంగారు వస్త్రము కప్పబడి ఉంది. సింహము గుర్తుగా గలిగిన పతాకం ఒకటి ఎగురుతోంది. అద్వితీయమయిన అక్షయ తూణీరముల జంట వచ్చింది. ఒక గొప్ప ధనుస్సు వచ్చింది. శుక్రాచార్యుల వారి అనుమతి మేరకు బలిచక్రవర్తి వీటిని స్వీకరించాడు. బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. ఆయన వచ్చి ఒక స్వర్ణ పుష్పమాల బలిచక్రవర్తి మేడలో వేశాడు. శుక్రాచార్యుల వారు అనుగ్రహంతో అమృతం తాగిన వాళ్ళని ఓడించడం అనేది బలిచక్రవర్తి కోరిక. విశ్వజిత్ యాగం ఫలించింది. స్వర్ణ పుష్పమాలను మేడలో వేసుకొని దివ్యరథమును ఎక్కి అమరావతి మీదకి దండయాత్రకు వెళ్ళాడు.
ఇంద్రుడు ఈవార్త తెలుసుకున్నాడు. "అవతలి వాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు. ఇప్పుడు నేను యుద్ధం చేయగలనా? శుక్రాచార్యులు బలిచక్రవర్తి చేత విశ్వజిత్ యాగం చేయించాడు. ఆయన శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇపుడు తను సలహా నిమిత్తం గురువుగారి దగ్గరకు వెళ్ళాలి" అనుకుని ఇంద్రుడు దేవతలతో కలిసి గురువు గారయిన బృహస్పతి వద్దకు వెళ్ళాడు. అపుడు దేవతలను ఉద్దేశించి ఆయన అన్నారు "ఈవేళ బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. నాకు తెలిసినంత వరకు బలిచక్రవర్తిని ఇప్పుడు ఓడించగలిగిన వాడు సృష్టిలో ఇద్దరే ఉన్నారు. ఒకడు శివుడు, రెండు కేశవుడు. ఈ ఇద్దరే ఓడించాలి తప్ప ఇంకెవరు బలిచక్రవర్తిని ఓడించలేరు. కాబట్టి మనం ఆయననే ప్రార్థన చేద్దాము" అని చెప్పగా వారందరూ శ్రీమహావిష్ణువును ప్రార్థన చేశారు.
అపుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఒక చిత్రమయిన మాట చెప్పారు "బృహస్పతి చెప్పినది యథార్థము. ఏ గురువుల అనుగ్రహంతో ఈవేళ బలిచక్రవర్తి ఈ స్థితిని పొందాడో మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికే బలిచక్రవర్తి దూరం అవాలి. అలా దూరమైన రోజున మీరు బలిచక్రవర్తిని చిటికిన వేలితో కొట్టగలరు. గురువుల అనుగ్రహం అంత స్థాయిలో ఉండగా మీరు వానిని ఏమీ చేయలేరు. యుద్ధం చేయడం అనవసరం. కాబట్టి మీరు అమరావతిని విడిచిపెట్టి వేషములు మార్చుకుని పారిపోండి" అని చెప్పాడు. అపుడు దేవతలు తలొక దిక్కుపట్టి వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి అమరావతి వచ్చి చూశాడు. ఒక్కడు కూడా లేడు. దివ్యమయిన అమరావతీ పట్టణం సునాయాసంగా తనది పోయింది. ఇంద్ర సింహాసనమును అధిరోహించి కూర్చున్నాడు. ఇకనుంచి యజ్ఞ యాగాది క్రతువులు ఏవి చేసినా హవిస్సులు తనకే ఇమ్మనమని ఆజ్ఞాపించాడు. ఇప్పటి నుంచి మళ్ళీ అహంకారము ప్రారంభమవుతుంది. బలిచక్రవర్తి వైభవం కొనసాగుతోంది. ఆయన దానధర్మములకు పెట్టింది పేరు. అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు. ముల్లోకములను పాలన చేస్తున్నాడు. ఆయన రావణాసురుని వంటి ఆగడములను చేసిన వాడు కాదు. మహాభక్తుడు. ఇటువంటి సమయంలో చిత్రమయిన ఒక సంఘటన జరిగింది.
కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు. ఒకరు అదితి, ఒకరు దితి. ఇంద్రాదులు అదితి కుమారులు. ఇవాళ వారు అమరావతిని విడిచిపెట్టి అరణ్యములలోకి వెళ్ళిపోయారు. ఆవిడ బాధ భరించలేక ఒకనాడు తన భర్త అయిన కశ్యప ప్రజాపతికి చెప్పింది. కశ్యప ప్రజాపతి గొప్ప బ్రహ్మ జ్ఞాని. ఆయన ఒక నవ్వు నవ్వి "అదితీ! ఈ భార్యలేమిటి? కొడుకులేమిటి? రాజ్యాలేమిటి? ఈ సింహాసనములు ఏమిటి? ఈ గొడవలు ఏమిటి? ఇదంతా నాకు అయోమయంగా ఉంది. ఈ సంబంధములకు ఒక శాశ్వతత్వం ఉన్నదని నీవు అనుకుంటున్నావా? నేను అలా అనుకోవడం లేదు. ఉన్నదే బ్రహ్మమొక్కటే అని అనుకుంటున్నాను. నీవు విష్ణు మాయయందు పడిపోయావు. అందుకని ఇవాళ నీ బిడ్డలు, దితి బిడ్డలు అని రెండుగా కనపడుతున్నారు. ఒకరికి ఐశ్వర్యం పోయింది. ఒకరికి ఐశ్వర్యం ఉన్నది అని బాధపడుతున్నావు. నేనొక మాట చెప్పనా! ఈ ప్రపంచంలో కష్టములో ఉన్నవానిని ఈశ్వరుడు ఒక్కడే రక్షించగలడు. ఆయనను అడగాలి గానీ నన్ను అడుగుతావేమిటి? నిజంగా రక్షణ పొందాలి, నీ కొడుకైన దేవేంద్రుడు దేవతలు తిరిగి ఆ సింహాసనమును పొందాలి అని నీవు అనుకున్నట్లయితే మహానుభావుడయిన ఆ జనార్దనుని పూజించు. ఆయన కానీ ప్రీతి చెందాడంటే ఆయన చేయలేనిది ఏదీ ఉండదు. సర్వేశ్వరుడయిన నారాయణుని ప్రార్థించు" అని చెప్పి "పయో భక్షణము" అనే ఒక వ్రతమును కల్పంతో ఆమెకు ఉపదేశం చేశాడు. ఆ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది మనందరం చేసే వ్రతం కాదు.
ముళ్ళపంది లేదా అడవి పండి తన కోరతో పైకెత్తిన మట్టిని తీసుకొని ఒంటికి రాసుకుని స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకొని పన్నెండు రోజులు ఆ కల్పమును ఉపాసన చేయాలి. అలా చేయగలిగితే భగవంతుడిని సేవించగలిగితే పన్నెండు రోజులలో శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి భగవంతుడయిన శ్రీమన్నారాయణుని అనుగ్రహమును కోరి నీవు ఈ వ్రతమును చేయవలసింది" అని చెప్పాడు. ఆవిడ భర్త మాటలను నమ్మి పన్నెండు రోజులు ఈ వ్రతం చేయగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయాడు. ఆవిడ శ్రీమన్నారాయణుడు కనపడితే తన కొడుకుకి రాజ్యం ఇప్పించాలని వ్రతం చేస్తోంది. నిజంగా శ్రీమన్నారాయణుడు కనపడేసరికి అదితి ఆయన రూపమును కళ్ళతో జుర్రుకు త్రాగేసింది. గట్టిగ కంఠం రాక ఏమి మాట్లాడుతున్నదో కూడా వినపడకుండా అలా చూస్తూండిపోయింది. ఆమె చేస్తున్న ఆ స్తోత్రము అంతటా నిండి నిబిడీకృతమయిన వాడెవడున్నాడో ఆయనకే వినపడాలి.
అపుడు స్వామి అదితిని "నీవు ఈపూజ ఎందుకు చేశావు?" అని అడిగాడు. అపుడు ఆవిడ "స్వామీ! నా కుమారుడయిన దేవేంద్రుడు రాజ్య భ్రష్టుడు అయ్యాడు. నా కుమారునికి రాజ్యం ఇవ్వవలసింది" అని అడిగింది. కాని స్వామి "నీ కుమారునికి రాజ్యం ఇప్పిస్తాను" అని అనకుండా "అమ్మా! నీ కుమారుడు ఇంద్రుడు, కోడలు శచీదేవి బాధపడుతున్నారని అనుకుంటున్నావు కదా! వాళ్ళందరూ నీవు సంతోషించేటట్లు నేను తప్పకుండా నీవు అడిగిన పని చేస్తాను. కానీ అమ్మా, నాకు ఒక కోరిక ఉంది. "ఇపుడు ఈశ్వరుడు అదితిని వరం అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి! వరము అడగడానికి కూర్చున్న అదితిని నారాయణుడు వరము అడుగుతున్నాడు. "అమ్మా! నాకు నీ కొడుకునని అనిపించుకోవలెనని ఉంది. నీ గర్భవాసము చేయాలని అనిపిస్తోంది. నీ కొడుకుగా పుడతాను" అని అడిగాడు. అలా అడిగేసరికి అదితి తెల్లబోయింది. ఆడపు ఆమె అంది "స్వామీ నాకు అంతకన్నా భాగ్యమా! తప్పకుండా" అన్నది. అపుడు స్వామి "నీ భర్తను ఇదే రూపంతో ఇంతకు పూర్వం ఏ భక్తితో ఉన్నావో అలా నీ భర్తను సేవించు. నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తాను" అన్నాడు. ఎంత యథాపూర్వకంగా పుట్టాడో చూడండి. ఆమె గర్భమునందు ప్రవేశిస్తే బ్రహ్మగారు శ్రీమన్నారాయణుని స్తోత్రం చేశారు. ఇపుడు అదితి గర్భం గర్భాలయం అయింది.
గర్భము నిలబడినది కనుక ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు వేడుక చేశారు. అమ్మ కడుపులో ఉండవలసిన కాలము పూర్తి అయిన తరువాత మంచి ముహూర్తం చూసుకొని శ్రావణ మాసంలో ద్వాదశి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ సంజ్ఞాత లగ్నంలో ఆయన జన్మించాడు. ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయస్సు పొందిన బాలుడిగా జన్మించాడు. పుడుతూ శంఖ చక్ర గదా పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. అదితి స్తోత్రం చేసింది. కశ్యప ప్రజాపతి స్తోత్రం చేశారు. వెంటనే ఆయన తన రూపమును ఉపసంహారం చేశారు. ఉపనయనం చేసుకునే వయస్సున్న వటువుగా బ్రహ్మచారిగా ఇంచుమించుగా ఎనిమిది సంవత్సరముల పిల్లవానిగా మారిపోయాడు. వటువుకి కశ్యప ప్రజాపతి ముంజెగడ్డితో చేసిన మొలత్రాడు ఇచ్చారు. తల్లి అదితి కౌపీనం ఇచ్చింది. బ్రహ్మగారు కమండలం ఇచ్చారు. సరస్వతీ దేవి అక్షమాలను ఇచ్చింది. సూర్యభగవానుడు ఆదిత్య మండలము నుండి క్రిందికి దిగి వచ్చి గాయత్రీ మంత్రంను ఉపదేశం చేశాడు. చంద్రుడు చేతిలో పట్టుకునే మోదుగ కర్రతో కూడిన దండమును ఇచ్చాడు. ఇంతమందీ ఇన్ని ఇస్తే కృష్ణాజినంతో కట్టుకునే నల్లటి జింక చర్మమును దేవతలు పట్టుకు వచ్చి ఇచ్చారు. యజ్ఞోపవీతమును పట్టుకుని దేవతలా గురువైన బృహస్పతి వచ్చారు. వీళ్ళందరూ ఉపనయన మంత్రములతో పిల్లవానికి సంస్కారములన్నీ చేశారు. భిక్షాపాత్రను సాక్షాత్తు కుబేరుడు ఇచ్చాడు. భవానీ మాత వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. ఇది తీసుకొని మహానుభావుడు బయలుదేరి బలిచక్రవర్తి కూర్చున్న చోటికి వెళ్ళాడు. బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చుని ఉన్నాడు. బలిచక్రవర్తి మహా తేజస్సుతో వస్తున్న వటువును చూశాడు. వటువు బ్రహ్మచారి కాబట్టి రాజును ఆశీర్వచనం చేయవచ్చు. అందుకని వటువు అన్నాడు "ఓహో! నీవేనా బలిచక్రవర్తివి. నీవేనా భూరి దానములు చేసే వాడివి. నీకు స్వస్తి స్వస్తి స్వస్తి. స్వస్తి అంటే శుభము. ఇలా బలిచక్రవర్తిని చూడగానే ఆశీర్వదించాడు.
బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించాలి. అపుడు బలిచక్రవర్తి వెంటనే లేచి నిలబడి వింధ్యావళిని బంగారు పళ్ళెమును తీసుకురమ్మనమని చెప్పాడు. వటువును ఉచితాసనము మీద కూర్చోబెట్టి ఆ బంగారు పళ్ళెమును వటువు కాళ్ళ క్రింద పెట్టి ఆయన పాదములు కడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు. వింధ్యావళికి తీర్థం ఇచ్చాడు. ఆయన పాదోదకమును శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు.
"నాయనా వడుగా! నీవు ఎవరి వాడివి? ఎక్కడ ఉంటావు? నీవు రావడం వలన ఇవాళ ఈ కాలము మంగళప్రదమయింది. బ్రహ్మచారీ! వడుగు చేసుకొనిన వాడవు నీవు వచ్చావు. ఇప్పటి వరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది. నీవు రాగానే అగ్నిహోత్రం మహా ప్రకాశంతో పైకి లేస్తోంది. నీరాక వలన నా వంశము నా జన్మ సఫలం అయిపోయాయి. ఇంతకుముందు 99యాగములు చేశాను. ఇది నూరవది. నా జన్మ ధన్యమయింది" అన్నాడు. ఇపుడు బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక నవ్వు నవ్వి "ఓ చక్రవర్తీ! నేను ఒకచోట ఉంటాను అని చెప్పలేను. అంతటా తిరుగుతుంటాను. ఒకళ్ళు చెప్పినట్లు వినడం నాకు అలవాటు లేదు. నే చెప్పినట్లే ఇంకొకరు వింటూ ఉంటారు. నాకు ఏది తోస్తే అది నేను చేస్తాను. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు అది చదువుకోలేదు, అది రాదు అని చెప్పడం ఎలా కుదురుతుంది~ ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నీవు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చునని నీవు అనుకో! పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని చెప్పడం కూడా కష్టమే. కానీ నేను మూడు రకములుగా మాత్రం ప్రవర్తిస్తూ ఉంటాను. నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవడూ లేదు. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది. బ్రహ్మచారి ఎక్కడ మంచిమాట వినబడితే అక్కడ వినాలి. అందుకని మంచి వాళ్ళదగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఎవరు నన్ను కోరుకుంటుంటారో వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను" అన్నాడు. ఆ మాటలను విన్న బలిచక్రవర్తి ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలున్నాయో అని ఆశ్చర్యపోయాడు. పొంగిపోయి "పిల్లవాడా! నిన్ను చూస్తె నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు వటువువి. నేను చక్రవర్తిని కాబట్టి నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి. కాబట్టి నీకు ఏమి కావాలో కోరుకో".
వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో
హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీ ఖండమొ కాక ఏమడిగెదో దాత్రీ సురేంద్రోత్తమా!!
ఈ భూమిమీద పుట్టిన అద్భుతమయిన బ్రహ్మచారీ! నీకేమి కావాలో అడుగు. ధనమా? గోవులా? కన్యలా? రథములా? బంగారమా? వజ్రములా? రాజ్యములో భాగమా? నీకు ఏమి కావాలి? నేను ఏదయినా ఇవ్వగల సమర్థుడిని. నీకు ఏమి కావాలో అడుగు. నీకిచ్చేస్తాను" అన్నాడు. అపుడు వామనుడు నవ్వి "నాకు ఏది కావాలంటే అది నీవు ఇస్తావా! నేను అల్పమునకు సంతోషించేవాడిని. కాబట్టి నాకు నీవు ఇవ్వగలిగినదేమిటి? నేను తృప్తి పొందేవాడిని. అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని నీవు అడిగావు కదా! నాకు ఒకటి రెండు అడుగుల నేల ఇవ్వు. చాలామంది దీనిని కూడేసి బలిచక్రవర్తి మూడడుగుల నేల ఇమ్మనమని అడిగాడు అని చెపుతారు. వామనుడు అలా అడగలేదు. నీవు నాకు ఒకటి రెండడుగుల నేలను ఇస్తే దానితో ఒక అడుగుతో ఊర్ధ్వలోకములను కొలుస్తాను. ఒక అడుగుతో అధో లోకములను కొలుస్తాను. మూడవ అడుగు పెట్టడానికి మళ్ళీ నిన్ను చోటు అడుగుతాను. నీవు కానీ ఒకటి రెండు అడుగులు నేలను ఇచ్చాను అని అంటే నేను బ్రహ్మానందమును పొందేస్తాను. ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాను" అన్నాడు.
అపుడు బలిచక్రవర్తి "నీవు పిల్లవాడివి. నీకు అడగడం కూడా చేతకాదు. నీవు మూడు అడుగుల భూమిని కొలిస్తే నీకు ఎంత వస్తుంది? నేను బ్రహ్మాండముల నన్నిటిని జయించిన వాడిని. మూడడుగుల నేలా నేను నీకు ఇవ్వడం! ఇంకేదయినా అడుగు. నీవు ఏది అడిగితె అది ఇస్తాను" అన్నాడు.
వామనుడు ఆశ్రమ ధర్మమును పాటించాడు
గొడుగో. జన్నిదమో, కమండలువొ. నాకున్ ముంజియో, దండమో,
వడుఁ గే నెక్కడ" భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె
క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.
"అవన్నీ ఇస్తానంటావేంటయ్యా! నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారిని పట్టుకుని వరచేలంబులు, మాడలు, ఫలములు, వన్యంబులు, గోవులు మొదలయిన వాటిని పుచ్చుకొనమంటావేమిటి? వాటిని నేను పుచ్చుకోకూడదు. నేను గొడుగు, యజ్ఞోపవీతము, కమండలము, ముంజి, దండము మొదలయిన వాటిని మాత్రమే అడగాలి. నాకెందుకు ఇవన్నీ? నాకివన్నీ అక్కరలేదు. నేను జపం చేసుకోవడానికి నేను అగ్నికార్యం చేసుకోవడానికి నాకు మూడడుగుల నేల ఇస్తే చాలు" అన్నాడు. అపుడు బలిచక్రవర్తి
"ఓ వటువా! ఇదిగో బంగారు పాత్ర ఇక్కడ పెట్టాను. వచ్చి నీ పాదములు ఇందులో పెట్టు. వింధ్యావళీ, బంగారు చెంబుతో నీళ్ళు పొయ్యి, ఆ పిల్లవాడి పాదములు కడిగి వానికి మూడడుగుల నేల ధారపోసేస్తాను. నీళ్ళు పట్టుకొని రా" అన్నాడు. వింధ్యావళి వటువు వంక చూసి పొందిపోతూ నీళ్ళు పట్టుకు వద్దామని లోపలి వెళుతోంది. ఈలోగా బ్రహ్మచారి బంగారు పాత్రలో పాదములు పెట్టబోతున్నాడు. అపుడు అక్కడికి శుక్రాచార్యుల వారు పరుగుపరుగున వచ్చారు. "రాజా! నీచేత విశ్వజిత్ యాగమును చేయించి ఇవాళ నీకు ఇంత వైభవమును ఇచ్చాను. వచ్చినవాడు ఎవరో తెలుసా? ఏమయినా మాట యిచ్చావా? అని అడిగాడు. అపుడు బలిచక్రవర్తి "గురువుగారూ, ఈ బ్రహ్మచారి మూడు అడుగుల నేల అడిగాడు. ఇస్తానన్నాను" అన్నాడు. అపుడు శుక్రాచార్యులు "రాజా! ఆ వచ్చినవాడు శ్రీమహావిష్ణువు. ఎప్పుడూ ఆయన ఎవరి దగ్గర ఏదీ పుచ్చుకోలేదు. ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకున్తున్నాడు. ఎందుకు పుచ్చుకుంతున్నాడో తెలుసా! ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి. ఆ వంశంలో వాడిని ఆయన నిగ్రహించడు. ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ క్రింద వాళ్ళకి ప్రమాదం ఉండదు. కాబట్టి నీజోలికి రాలేడు. అందుకని నీతో యుద్ధం చేయకుండా ఇప్పుడు నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాజ్యమును లాగి ఇంద్రునకు ఇస్తాడు. అందుకని మూడడుగులు పుచ్చుకుంటున్నాడు. నేను నా దివ్యదృష్టితో చూసి చెపుతున్నాను. ఆ రెండడుగులతో ఉత్తరక్షణం ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోతాడు. మూడవ అడుగు ఎక్కడ పెట్టను అని అడుగుతాడు. నువ్వు నీ నెత్తిమీద పెట్టించుకోవాలి. నా మాట విను. నేను నీ గురువుని కాబట్టి నీకొక గొప్ప ధర్మశాస్త్ర విషయం చెపుతున్నాను. తనకు మాలిన దానం గృహస్థు చేయనవసరం లేదు. మాట యిచ్చినా తప్పవచ్చు. ఇంకొక మాట కూడా చెపుతున్నాను.
వారిజాక్షులందు వైవాహికములందు, బ్రాణ విత్తమాన భంగమందు
జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు, బొంకవచ్చు నఘము వొందదధిప!!
శుక్రాచార్యుల వారు రాక్షస నీతి చెప్పారు. మనం చేయకూడదు. దానిని ప్రాణ భయంతో ఉన్నప్పుడు రాక్షస నీతిగా ఆయన చెప్పారు. అంతేకానీ ఈ నీతి మనందరి కోసం కాదు. ఆయన చెప్పిన విషయం "ఆడవారి విషయంలో, వివాహ విషయంలో, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, అబద్ధం చెప్పవచ్చు. గోవుల విషయంలో, బ్రాహ్మణులను రక్షించే విషయంలో అబద్ధం చెప్పవచ్చు. దాని వలన పాపం రాదు. అందుకని మూడు అడుగుల నేల ఇవ్వనని చెప్పు. ఒక్క అడుగు కూడా ఇవ్వకు. ప్రమాదం. ఆయనను నమ్మకు" అన్నాడు.
అంటే బలిచక్రవర్తి శుక్రాచార్యుల వంక చూసి "ఎంతమాట అన్నారు! లక్ష్మీ నాథుడయిన వాడు వచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెపుతున్నారు.
ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై నంసోత్తరీయంబుపై
బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ
ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్
గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే!!
"ఆయన చేయి లక్ష్మీ అమ్మవారి కొప్పుపై పడుతుంది. ఆచేయి ఆవిడ శరీరమును నిమురుతుంది. ఒక్కొక్కసారి చేతితో ఆవిడ పమిట పట్టుకుని ఆడుకుంటాను. ఒక్కొక్క సారి ఆ చేతితో ఆవిడ పాదములు పట్టుకుంటాడు. అమ్మవారి బుగ్గలను నిమురుతాడు. ఆ చెయ్యి లక్ష్మీదేవిని పొంగి పోయేటట్లు చేయగలిగిన చెయ్యి. కొన్ని కోట్లమంది ఏ తల్లి అనుగ్రహమునకై చూస్తున్నారో అటువంటి తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోతుంది. దేవదానవులను శిక్షించిన చెయ్యి. భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి. పాంచ జన్యమును పట్టుకునే చెయ్యి. ఏ చేయి వరదముద్ర చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అటువంటి చెయ్యి భిక్ష కోసమని క్రింద నిలబడుతోంది. నా చేయి పైదవుతోంది. నాకీ అదృష్టం చాలదా! మళ్ళీ పుడతానా? రాజ్యం ఉండిపోతుందా? దేహం ఉండిపోతుందా? పోతే పోనీ ఈ రాజ్యముకాదు, ఈ శరీరము కాదు నేను కాదు ఏది పోయినా పరవాలేదు".
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ.
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై.
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యి క్కాలమున్? భార్గవా!!
"ప్రపంచంలోనికి ఎంతోమంది రాజులు వచ్చారు. వచ్చిన వారందరూ తాము భూమికి పతులమని పరిపాలించామని అన్నారు. వారేరి? నాది నాదని ఇంత సంపాదించాను అని అన్నారు. ఏ కొద్ది కూడా పట్టుకెళ్ళిన వాడు ఈ భూమిమీద లేడు. కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలయిన మహాపురుషులు అద్భుతమయిన దానములు చేశారు. వాళ్ళు యశోశరీరులై నిలబడిపోయారు. అంతేకానీ ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా! ఈ శరీరం ఉండిపోతుందా! నాకు రాజ్యం తీసేస్తాడు, దరిద్రుడను అయిపోతానని అంటున్నావు కదా! నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకుని నేను భిక్షువునై తిరుగుతాను. నాకు బెంగలేదు. నాకు దరిద్రం రావచ్చు, జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు. మాట పోయిన తరువాత ఆ మనిషి బ్రతికినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే. భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదు. మాట తప్పే వాళ్ళ బరువును తాను మోయలేనని ప్రార్థన చేస్తుంది. నేను అటువంటి జాబితాలో చేరను. నేను దానం చేసేస్తాను" అన్నాడు. అపుడు శుక్రాచార్యుడు "నేను నా తపశ్శక్తితో అమృతం తాగిన వాళ్ళని ఓడిపోయేటట్లు చేశాను. ఇవాళ మళ్ళీ నీవు నీ గురువు మాట కాదన్నావు. కాబట్టి ఇపుడు నిన్ను శపిస్తున్నాను. ఉత్తర క్షణం నీవు రాజ్యభ్రష్టుడవు అవుతావు గాక!" అని శపించాడు.