పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

కథలు - భాగవతాలు : వేన జననం

చతుర్థ స్కంధము - వేన జననం:

ఒకానొక సమయంలో ఈ దేశమును అంగరాజు పరిపాలితూ ఉండేవాడు. ఆయన మహా ధార్మికుడు. కేవలము ధర్మానుష్టానము తప్ప ఎన్నడు అధర్మము చెయ్యని వాడు. అటువంటి అంగరాజు ఒకసారి అశ్వమేధయాగం చేస్తున్నాడు. ఆ సందర్భంగా దేవతలను అందరిని పిలిచి హవిస్సులు ఇస్తున్నాడు. ఆ రోజులలో స్వాహా అంటూ ఆ దేవతలను పిలిస్తే ఆ దేవత వచ్చి ఎదురుగా కూర్చుని హవిస్సును అగ్ని ముఖంగా పుచ్చుకుని నోట్లో వేసుకుని వెళ్ళేవారు. అక్కడ ఉన్నటువంటి ఋషులు మంత్రములతో దేవతలను ఆవాహన చేస్తున్నారు. ఒక్క దేవత రాలేదు! ఏ దేవతా రాకపోతే అంగరాజు ఆశ్చర్యపోయాడు. "ఎందుచేత ఇలా జరిగింది" అని ఋషులను అడిగాడు.

అపుడు ఋషులు "వేదము స్వరప్రాకటము. మా స్వరమునందు దోషము లేదు. కానీ వారు రావడం లేదంటే వారు నీయందు అప్రసన్నులై ఉన్నారు. అందుకు నీలో ఏదో దోషం ఉంది ఉండాలి. కానీ నీ చరిత్రను పరిశీలిస్తే నీయందు ఎక్కడా దోషం కనపడడం లేదు. కాబట్టి ఏ దోషం ఉన్నది అని విచారణ చేయాలి" అన్నారు. ఆయనలో గల దోషం గురించి విచారణ చేశారు. అంగమహారాజు అనపత్య దోషంతో బాధపడుతున్నాడు. అంటే ఆయనకు సంతానం లేదు. అందుచేత యజ్ఞములో ఆయన ఇచ్చిన హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రాలేదు. అపుడు ఋషులు "నీకు ఇప్పుడు ఉత్తరక్షణం సంతానం కలగాలి. గతజన్మలో నీవు చేసిన పాపములు ప్రతిబంధకంగా ఉండడం వలన ఈ జన్మలో నీకు సంతానం కలగడం లేదు. ఇప్పుడు ఈ ప్రతిబంధకమును తీసివేయాలి. అందుకు శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడు కావాలి. దానికి మేము యాగం చేస్తాము. ఆ యాగము చేత శ్రీమహావిష్ణువు తృప్తి పడితే నీకు సంతానం కలుగుతుంది" అన్నారు.

అంగమహారాజు శ్రీ మహావిష్ణువు ప్రీతికొరకు యాగం చేశాడు. యాగం పూర్తవగానే అందులోంచి బంగారు వస్త్రములను ధరించ చిత్ర విచిత్రములైన మాలలు వేసుకుని చేతిలో బంగారు కలశమును పట్టుకుని ఒక పురుషుడు యజ్ఞగుండం లోంచి ఆవిర్భవించాడు. ఆ పురుషుడు "అంగరాజా, ఈ పాయస పాత్రలో వున్న పాయసమును నీ ధర్మపత్ని చేత తినిపించు. అపుడు నీకు అనపత్య దోషం పోయి సంతానం కలుగుతుంది" అని చెప్పాడు. పాయస పాత్ర తీసుకువెళ్ళి భార్యకి ఇచ్చాడు. ఆవిడ పేరు సునీథ. ఆవిడ భర్తృ సంగమము చేతనే సంతానమును పొందింది. తేజస్సు అంగరాజు తేజస్సే. కానీ ఇప్పుడు అది ప్రజోత్పత్తిని చేసింది. కారణమేమి? ఇన్నాళ్ళు ఎందుకు చేయలేక పోయింది? అనగా ప్రజోత్పత్తిని చెయ్యడానికి వీలు లేనటువంటి స్థితి పాపము ఇన్నాళ్ళు సంతానము కలుగకుండా చేసింది. ఇపుడు ఆ విఘ్నం పోయింది. కాబట్టి ఇపుడు సంతానం కలగడానికి కావలసిన యోగ్యత సిద్ధించింది. కానీ క్షేత్ర శుద్ధి జరుగలేదు. క్షేత్రమునందు దోషం ఉన్నది. ఆమె మృత్యువు పుత్రిక కావటం చేత యాగమునందు ఉద్భవించినటువంటి ప్రజాపత్య పురుషుడు ఇచ్చినటువంటి ప్రసాదము తిన్నప్పటికీ కుమారుడు వ్యగ్రస్వభావము కలిగినటువంటి వాడు జన్మించాడు. వానికి "వేనుడు" అని పేరు వచ్చింది. జన్మతః వచ్చిన బుద్ధి బోధకు మారడం చాలాకష్టం. వేనుడు ప్రతిరోజూ నిష్కారణంగా వేటకు వెళ్ళి కుందేలు పిల్లల దగ్గరనుంచి లేళ్ళు జింకల వరకు చంపేసేవాడు. ఆ చంపడంలో అర్థం లేదు. అతను వేటనుండి తిరిగి వస్తున్నప్పుడు క్రీడా మైదానంలో ఆడుకునే పిల్లలను చూసేవాడు. ఆడుకుంటున్న పిల్లలను బడిత పుచ్చుకుని వారు చచ్చిపోయేవరకు కొట్టేవాడు. వాడు సంతోషంగా వెళ్ళిపోయేవాడు. ఇలాంటి పిల్లవాడిని రోజూ దగ్గర కూర్చోపెట్టుకుని అంగరాజు ధర్మబోధ చేసేవాడు. ఈయన అలా చెపుతుంటే కొడుకు కనుబొమలు ఎగురవేసేవాడు. తండ్రి పట్ల మర్యాద ఉండేది కాదు. మరల తెల్లవారున లేవడం పాపకృత్యములు చేయడం! ఒకరోజు రాత్రి తండ్రి ప్రాణం విసిగిపోయింది. ఒకరోజు భార్య, కొడుకు నిద్రపోతున్నారు. అంగరాజు మాత్రం నిద్ర పట్టక "నా జీవితమునకు ఏమి సార్ధకత? నా కొడుకు సత్ప్రవర్తన కలిగిన వాడై నా తరువాత సింహానమును అధిష్ఠించి రాజ్యపాలనము చేసి చక్కగా నాకు పేరు తెచ్చి నా శరీరము పడిపోయిన తరువాత గయలో శ్రాద్ధం పెట్టాలి. అలా వాడయినా నన్ను ఉద్ధరించాలి. నాకు ఇంత దుష్దుడు పుట్టాడు. ఇలాంటి కొడుకు ఉన్న నాకు రాజ్యం ఉంటే ఎంత? సింహాసనం ఉంటే ఎంత? రోజూ వీడికి చెప్పుకునే కన్నా ఎక్కడికో పోయి ఈశ్వరారాధన చేసుకుని మట్టిలో కలిసిపోతే మంచిది. అనుకుని విరాగియై అన్ని భోగములు కలిగినటువంటి అంతఃపురమును, భార్యను, బిడ్డను విడిచి పెట్టి గురువులకు కూడా చెప్పకుండా తానొక్కడే కాలినడకన నడిచి అరణ్యములోకి వెళ్ళిపోయాడు. మరునాడు అంతఃపురంలో రాజు కనపడలేదు. వారు ఆయన తల్లిగారయిన సునీథతో మాట్లాడి వేనుడికి పట్టాభిషేకం చేశారు.⁠⁠⁠⁠

చతుర్థ స్కంధము - పృథు చరిత్ర

వేనుడు రాజు అయిన తరువాత ప్రజలకు ఇటు రాజు వైపునుండి బాధ అటు క్రూరుల వైపునుండి బాధ. యజ్ఞయాగాది క్రతువులు లేవు. రాజు ఈశ్వరుడు. కాబట్టి మీరు యజ్ఞం చేస్తే నాకు చెయ్యాలి. నా చిత్రపటములకే ఆరాధన చేయాలి అని వేనుడు ప్రకటించాడు. ఇపుడు భూదేవికి కోపం వచ్చింది. "వీళ్ళు తమ కొరకు మాత్రమే తింటున్నారు. వీళ్ళకి కృతజ్ఞత లేదు. యజ్ఞయాగాది క్రతువులు లేవు. కాబట్టి నేను ఓషధీశక్తిని ఉపసంహారము చేస్తున్నాను" అంది. భూమికి ఓషధీ శక్తి ఉంటేనే బ్రతుకుతారు. ఎప్పుడయితే ఓషధీశక్తి ఉపసంహారం అయిందో వెంటనే వచ్చే ఫలితం ప్రతి వాడికి దేశంలో ధర్మం అన్నమాట నీతి అన్నమాట కడుపులోకి పదార్ధం దొరికినంత సేపే ఉంటాయి. అసలు తినడానికి దొరకకపోతే భాగవతం చెపుతాను రమ్మనమంటే ఎవరయినా వస్తారా? ఎవరూ రాదు. ఎక్కడ చూసినా దేశంలో అసాంఘిక శక్తులు ప్రబలిపోయాయి. నేరముల సంఖ్య పెరిగిపోయింది. దొంగతనములు పెరిగిపోయాయి.

ఋషులు ఈ పరిస్థితిని గమనించారు. వారు సరస్వతీ నదీ తీరంలో సమావేశం అయ్యారు. రాజ్యంలోని అప్పటి దారుణ పరిస్థితులకు కారణం ఏమిటని ఆలోచన చేశారు. మహర్షులం అందరం వెళ్ళి వేనుడితో ఒక మాట చెబుదాం. అతడు మన మాటవిని మారిపోతే సంతోషం. మారక పోతే ఇంకా ఆ రాజు ఉండకూడదు కాబట్టి మన తపశ్శక్తి చేత వానిని సంహారం చేసేద్దాం అనుకోని బయల్దేరారు. రాజుకు ఆశీర్వచనం చేసి ఒకమాట చెప్పారు. "రాజా, నీవు యజ్ఞయాగాదులు చేసి ఈ భూమిని రక్షించాలి. శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలి. ఈశ్వరుని యందు బుద్ధి మరల్చుకో" అని చెప్పారు. అపుడు వేనుడు "అసలు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? కనపడని విష్ణువుకు యజ్ఞం చెయ్యమంటున్నారా? ఇంకొకసారి నోరు విప్పితే మీ కుత్తుకలు తెగిపోతాయి" అన్నాడు.

అపుడు ఋషులు ఇక అతడు మారాడు అనుకున్నారు. "వీనికి బోధ అనవసరం. వీనవలన మొత్తం రాజ్యం నాశనం అయిపోతోంది. వీడు ఉండడానికి వీలులేదు." అనుకున్నారు. అపుడు ఋషులందరూ కోపం తెచ్చుకొని హుంకారమును చేశారు. అంతే! వేనుడు చచిపోయాడు. అహంకారం ప్రబలి ప్రబలి మహాత్ముల జోలికి వెళ్ళిన వారికి చిట్టచివరికి ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. వేనుని తల్లి అయిన సునీత గొప్ప మంత్రశక్తి కలిగినది. ఆవిడ దూరదృష్టితో ఆలోచించింది. తన మంత్రశక్తితో వెనుడి శరీరమును కాపాడింది. అందుకని. ఆ శరీరమునకు అంత్యేష్టి సంస్కారమును చేయలేదు. ఋషులు కొంతకాలం చూశారు. ఇపుడు నేరముల సంఖ్య ఇంకా పెరిగిపోతోంది. శిక్షించే నాథుడు లేదు. అప్పుడు ఋషులు అన్నారు "ఇప్పుడు మనం ఎలా అయినా సరే రాజుకి వంశాన్ని పెంచాలి. రాజు మరణించి ఉన్నాడు. ఇపుడు మనం మన తపశ్శక్తితో రాజు శరీరంలోంచి రాజు సంతానమును తీసుకురావాలి" అనుకున్నారు. తపశ్శక్తి ఉన్నవారు మూఢుల్ని మార్చలేకపోయారు. కానీ క్షేత్రములేకుండా శరీరంలోంచి సంతానమును సృష్టిస్తున్నారు కానీ వారి వాక్కుకు వాడు మాత్రం మారలేదు. ఋషులు వెళ్ళి మొట్టమొదట ఆయన తొడమీద మథనం చేశారు. అందులోంచి తపశ్శక్తితో మథనం చేస్తే పాపము పైకి రావడం మొదలు పెట్టింది. అందులోంచి బాహుకుడు అనబడే ఒక నల్లటి వాడు పొట్టి పొట్టి కాళ్ళు పొట్టి పొట్టి చేతులు ఎర్రటి కళ్ళు రాగి జుట్టుతో పుట్టుకొచ్చాడు. "నేను ఏమి చేయాలి" అని ఋషులను అడిగాడు. అపుడు ఋషులు వానివంక చూసి "వీడు రాజ్యపాలనము చేయగలిగిన వాడు కాలేడు అనుకోని నీవేమీ చేయవద్దు అన్నారు. ఇపుడు మరల సరియైన పిల్లవాడు రావాలి అంటే ఎక్కడ మథనం చేద్దామా అని ఆలోచిస్తున్నారు. ఈలోగా ఈ పిల్లవాడు లేచి మెల్లమెల్లగా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయి అక్కడ ఉండే కొండలలో నివసించడం మొదలు పెట్టాడు. అతని వంశీయులకే "నిషాదులు" అని పేరు వచ్చింది.

ఇపుడు ఋషులు "స్వామీ, ఒక కొడుకు పుట్టడమును మేము అడుగుట లేదు. లోకమును రక్షించగలిగిన కొడుకు కావాలని అడుగుతున్నాము కాబట్టి శ్రీమహావిష్ణువా, నీవే నీ అంశ చేత నీ తేజస్సు చేత ఈ బాహువులలోంచి బయటకు రా" అని బాహువులను మథించారు. ఆశ్చర్యకరంగా బాహువుల నుండి ఒక అందమయిన పురుషుడు, ఒక అందమయిన స్త్రీ పుట్టారు. ఆ పుట్టిన వారి పాదములను చూస్తే శంఖరేఖ, పద్మరేఖ, చక్రరేఖ కనబడ్డాయి. "ఓహో మనం ప్రార్థన చేసిఅట్లు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. కాబట్టి ఇక రాజ్యమునకు ఇబ్బందిలేదు" అనుకున్నారు. ఆ పిల్లవాడికి పృథువు అని పేరుపెట్టారు. ఆయన వెంటనే యౌవనమును సంతరించుకున్నాడు. ఆవిడకు "అర్చిస్సు" అని పేరు పెట్టారు. ఆయనే పృథు మహారాజు అయ్యారు.

ఆయన విష్ణు అంశతో ఋషులు మథిస్తే పుట్టిన వాడు కనుక ఆయన రాజ్యపాలనం చేయడానికి కావలసిన ఉపకరణములు తమంత తాము గబగబా దిక్పాలకులు పట్టుకువచ్చారు. కుబేరుడు ఆయన కూర్చొనుటకు కావలసిన సింహాసనం తెచ్చాడు. వరుణుడు గొడుగు తెచ్చాడు. వాయువు చామరం, ధర్ముడు మేడలో వేసుకునేందుకు సుగంధమాల తీసుకువచ్చారు. బ్రహ్మగారు వేదమనబడే కవచమును ఇచ్చారు. సరస్వతీ దేవి మేడలో వేసుకునే హారమును, పూర్ణాంశలో ఉండే స్వామి శ్రీమహావిష్ణువు సుదర్శనమును, లక్ష్మీదేవి ఐశ్వర్యమును, పరమశివుడు దశచంద్రమనబడే కత్తిని ఇచ్చాడు. ఈ కత్తి పెట్టడానికి ఒర కావాలి. పార్వతీదేవి శతచంద్రమనబడే ఒరను / డాలు ఇచ్చింది. సోముడు గుర్రమును, త్వష్ట రథమును, అగ్ని ధనుస్సును, సూర్యుడు బాణమును, సముద్రుడు శంఖమును, ఇచ్చాడు. స్వామి జన్మించగానే సమస్త దేవతలు తమ శక్తులు ధారపోశారు. పృథు మహారాజు పరిపాలన చేయడం కోసం సింహాసనం మీద కూర్చోగానే వంధిమాగధులు స్తోత్రం చేశారు. అపుడు పృథువు వాళ్లకి బహుమానములను ఇచ్చి సంతోషించాడు. ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి "మహానుభావా ఇన్నాళ్ళు మాకు చెప్పుకోవడానికి దిక్కు ఎవరూ లేరు. ఆకలితో అన్నమో రామచంద్రా అని అలమటించి పోతున్నాము. ఎందుకు అంటే భూమి ఓషధీ శక్తులు అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. మేము పంటలు పండిద్దామన్నా పండడం లేదు. నీవు మమ్మల్ని అనుగ్రహించవలసినది" అన్నారు.

పార్వతీ దేవి శాకాంబరి అయినట్లు వెంటనే పృథు మహారాజు తన ధనుస్సు పట్టుకుని రథం ఎక్కి భూమిని వెంబడించాడు. "అసలు ఈ భూమి పంట పండుతుందా? పండదా? నా బాణశక్తి చేత ఈ భూమిని భిన్నం చేస్తాను" అన్నాడు. పృథు మహారాజు గారి ఆగ్రహమును చూసి భయపడి భూమి గోరూపమును పొంది పరుగెడుతోంది. ఏ దిక్కుకి పరుగెడితే ఆ దిక్కుకు ఎదురువచ్చాడు. అపుడు గోవు ప్రార్థన చేసింది. "స్వామీ నీవే ఒకనాడు యజ్ఞవరాహామై నీ దంష్ట్రలతో భూమిని పైకి ఎత్తావు. నీవే ఈ భూమిలోంచి అన్ని రకములైన శక్తులు కలిగే అదృష్టమును నాకు కటాక్షించావు. ప్రజలు ఎవరూ యజ్ఞయాగాదులు చెయ్యలేదు. వేనుడు చెయ్యవద్దని శాసించాడు. ప్రజలు మానివేశారు. యజ్ఞయాగాదులు మానడం ఎంతటి ప్రమాదకరమో భాగవతం చెపుతోంది. అందుకని నేను నా ఓషధీ శక్తులను గ్రసించాను(నమలకుండా మ్రింగివేయడం). అలా గ్రసించడం వలన ఓషధీశక్తి లోపలికి వెళ్ళి జీర్ణం అయిపొయింది. ఇప్పుడు లేదు. కానీ ఒక లక్షణం ఉంది. నేను గోరూపంలో తిరుగుతాను. జీర్ణమయిన శక్తి మరల పాలరూపంలో బయటకు వస్తుంది. నేను పాలరూపంలో ఈ శక్తులన్నీ నీకు ఇవ్వాలి. నువ్వు రాజ్య క్షేమము కోరిన వాడివి కనుక నీకోసం విడిచిపెడతాను. కానీ నీవు వచ్చి దూడగా నిలబడతానంటే కుదరదు. ఇపుడు దూడ రూపంలో ఎవరయినా రాగలరా? దూడగా ఎవరిని తీసుకు వస్తావు" అని అడిగింది.

అపుడు పృథు మహారాజు "ఇప్పుడు నీవు చెప్పిన మాటకు చాలా సంతోషం. తల్లీ, నీకు నమస్కారం. నీకు దూడగా స్వాయంభువ మనువును తీసుకువస్తాను. ఆయన భూమిని చాలా గొప్పగా పరిపాలించినవాడు" అని చెప్పాడు. స్వాయంభువ మనువు పేరు వినగానే భూమాత చాలా సంతోషించింది. స్వాయంభువ మనువు దూడగా వచ్చి ఆ శిరములను ఒక్కసారి కదిపాడు. ఒక్కసారి లోపల ప్రేమ కలిగి ఆ శిరములలోంచి పాలు కారిపోయాయి. ఈ ఓషధీశక్తిని పితకగలిగిన వాడు ఉండాలి. ఎవరు పితకాలి? పృథు మహారాజు వెళ్ళి పొదుగు దగ్గర కూర్చున్నాడు. ఇపుడు ఓషధీశక్తులను తట్టుకోగలిగిన పాత్ర కావాలి. తన చేతిని పాత్రగా చేసి రెండవ చేతితో పాలు పితికాడు. ఆ పాలను భూమిపై చల్లాడు. వెంటనే పంటలు పండాయి. భూమి సస్యశ్యామలం అయిపొయింది. ఇపుడు ఆకలి ఎక్కువ పండేటటువంటి భూమి తక్కువ. అందుకని పృథువు తన ధనుస్సును చేతపట్టి వంచి ధనుస్సు చివరి భాగంతో కొన్ని పర్వతములను పడగొట్టి భూమిని సమానం చేశారు. అలా చేసేసరికి కొన్ని వేల ఎకరముల భూమి మరల వ్యవసాయ యోగ్యమయింది. దీని మీదకు వచ్చి నీరు నిలబడింది. విశేషమయిన పంటలు పండాయి. పృథివి మీద ఉన్నవాళ్ళు అందరూ చాల సంతోషించారు. భూమిని పృథు మహారాజు పిండితే "పృథివీ" అనే పేరు వచ్చింది. అందుకే జీవితంలో పృథు మహారాజు గురించి వినినట్లయితే మన కోరికలు అన్నీ తీరిపోతాయని పెద్దలు చెపుతారు.⁠⁠⁠⁠

చతుర్థ స్కంధము - పృథుని యజ్ఞాలు

పృథు మహారాజు ఎప్పుడయితే పిండుకున్నారో దేవతలు అందరూ పరుగెత్తుకు వచ్చారు. సురరాజును దూడగా వదిలారు. అమ్మ వాళ్లకి "వీర్యము", "ఓజము", "ఋతము" అనబడే టటువంటి మూడింటిని విడిచిపెట్టింది. రాక్షసులు ప్రహ్లాదుడిని దూడగా చేసుకొని లోహ పాత్రలలో మూడు రకముల సుర పిండుకున్నారు. గంధర్వులు అప్సరసలు విశ్వావసుని దూడగా వదిలి పద్మంలోకి సౌందర్యమును మధువును పిండుకున్నారు. అందుకే పద్మము అంత సౌందర్యంగా ఉంటుంది. పితృగణములు ఆర్యముని దూడగా చేసి పచ్చి మట్టి పాత్రలో దవ్యమును పిండుకున్నారు. సిద్ధులు కపిల మహర్షిని దూడగా చేసి ఆకాశమనే పాత్రలోకి సిద్ధులు పిండుకున్నారు. అందుకే వాళ్ళు ఆకాశగమనం చేయగలుగుతుంటారు. కింపురుషులు మయుడిని దూడగా చేసి యోగమనే పాత్రలోనికి ధారణ అనే శక్తిని పిండుకున్నారు. యక్ష భూత పిశాచాది గణములు రుద్రుడిని దూడగా చేసుకుని కపాలంలోకి రక్తమును పిండుకున్నారు. పాములు తక్షకుడిని దూడగా చెసుకొని తమ పుట్టలనబడే పాత్రలలోకి "పురువులు" "ఫలములు" అనే వాటిని పిండుకున్నాయి. వృక్షములు తమ పట్టలలోనికి రసమును పిండుకున్నాయి. అందుకే మనకి అన్ని రకముల రుచులు చెట్లనుండే వస్తాయి. అవి ఆయా రుచులను కలిగి వుంది మనకు రసపోషణం చేస్తున్నాయి.

అలా పృథు మహారాజు ఆనాడు ఎవ్వరూ పొందనటువంటి విజయమును సాధించి భూమండలమును అద్భుతముగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజలు అందరూ పరమ సంతోషంగా జీవితములను గడుపుతున్నారు. ఇటువంటి స్థితిలో ఆయన నూరు అశ్వమేధ యాగములు చేయాలి అని సంకల్పించాడు. బ్రహ్మావర్తము అని స్వాయంభువ మనువు పరిపాలించిన ప్రాంతమునకు వెళ్ళి "సరస్వతి" "తృష ద్వతి" అనబడే రెండు నదుల మధ్య ప్రాంతంలో యజ్ఞశాల కట్టి 99 అశ్వమేధ యాగములు చేశాడు. నూరవది చేస్తుండగా దేవేంద్రుడు ఒక విచిత్రమైన రూపంతో పెద్ద పెద్ద జడలు కట్టుకుని వచ్చి ఆ యాగాశ్వమును ఎత్తుకు పోతున్నాడు. దానిని అత్రిమహర్షి కనిపెట్టాడు. బాణం వేసి యాగాశ్వమును వెనక్కి తెమ్మన్నారు. పృథు మహారాజు కుమారుడు బయలుదేరాడు. కానీ జడలు కట్టుకుని ఋషి వేషధారియై ఉన్న వాడిమీద బాణం వేయడానికి అనుమానపడ్డాడు. అత్రిమహర్షి అన్నారు "గుర్రమును ఎత్తుకు పోతున్న వాడు ఇంద్రుడే. నువ్వు నిర్భయంగా ఆ బాణం వదిలెయ్యి అన్నాడు. బాణం వదలడానికి పృథు కుమారుడు సిద్ధపడ్డాడు. ఇంద్రుడు భయపడి ఆ రూపమును, అశ్వమును విడిచిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు అపహరించిన గుర్రమును వెనక్కి తెచ్చాడు కాబట్టి అతనికి "విజితాశ్వుడు" అని పేరు పెట్టారు.

మరల యజ్ఞం జరుగుతోంది. ఒకరోజు ఇంద్రుడు తన శక్తితో చీకట్లు కమ్మేటట్లు చేశాడు. గాఢాంధకారంలో ఉండగా మరల యాగాశ్వమును అపహరించి తీసుకు వెళ్ళిపోయాడు. ఈసారి మరల అత్రి కనిపెట్టాడు. ఈసారి ఇంద్రుడు ఖట్వాంగము చేతితో పట్టుకుని దానిమీద ఒక పుర్రె బోర్లించి వెళ్ళిపోతున్నాడు. అటువంటి వాడు సాధారణంగా మాంత్రిక శక్తులను కలిగినటువంటి వాడు, కొంచెం సాధన చేసిన వాడు అయి ఉంటాడు. లేదా బ్రహ్మహత్యా పాప విముక్తి కోసం వెడుతున్న సాధు పురుషుడు కూడా అయి ఉంటాడు. కాబట్టి అతనిని వధించాలా వద్దా అని పృథువు అనుమాన పడుతున్నాడు. అపుడు అత్రి "నీవేమీ బెంగ పెట్టుకోనవసరం లేదు. అతడు ఇంద్రుడే. బాణం వెయవలసింది" అని చెప్పాడు. పృథువు బాణం తీశాడు. అపుడు ఇంద్రుడు ఆ రూపమును, గుర్రమును అక్కడ వదిలిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు వదిలిపెట్టిన రూపమునకు "పాషండరూపము" అని పేరు. పాషండము అంటే పాప ఖండము. అందులోంచి పాషండులు పుట్టారు. వాళ్ళు పైకి చూడడానికి వేదమును అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులను చేసేవారిలా కనపడతారు. కానీ వాళ్ళు వేదం విరుద్ధమయిన మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ధర్మం గతి తప్పిపోతుంది. రెండుమార్లు యాగాశ్వమును అపహరించాడనే కోపంతో పృథువు యజ్ఞం పాడయిపోతే పాడై పోయిందని లేచి నిలబడి ధనుస్సు పట్టుకుని బాణమును సంధించి ఇంద్రుని మీదకి వదలడానికి సిద్ధపడ్డాడు. అపుడు ఋషులు "నీవు యజమానివి. నీవు ఎందుకు బాణం వదలడం? నీవు చేస్తున్న నూరవ యజ్ఞం పాడుచేశాడు కనుక మా మంత్రశక్తి చేత ఈ హోమంలో ఇంద్రుడిని పారేస్తాము" అన్నారు.

అపుడు ఇంద్రుని మీద క్షాత్ర శక్తి, తపశ్శక్తి రెండూ కలిసిపోయాయి. అపుడు చతుర్ముఖ బ్రహ్మ గారు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆయన అన్నారు "మీరిద్దరూ పొరపాటు పడ్డారు మీకింత తపశ్శక్తి ఉన్నది ఇంద్రుడిని అగ్నిహోత్రంలో పారెయ్యడానికా! పృథూ నీకింత క్షాత్ర శక్తి వున్నది ఇంద్రుడిని బాణం వేసి సంహరించడానికా! మీరు ఇద్దరు చేసింది పొరబాటే" అన్నారు. అదే సమయానికి ఆశ్చర్యకరంగా సభలోనికి పూర్ణాంశతో శ్రీమహావిష్ణువు వచ్చారు. పృథువు స్తోత్రం చేసి నమస్కరించాడు. స్వామి గరుడవాహనం దిగి "పృథూ, ఇప్పటికి నీవు 99 అశ్వమేధ యాగములు చేశావు. ఇంకొకటి చేస్తే ఏమవుతుంది? సంఖ్య పెరుగుతుంది. ఇలా జరిగిపోతుంటే ఈ కర్మకు అంతమేమయినా ఉందా? 99 అశ్వమేధ యాగములు చేసి నీవు ఏమి తెలుసుకున్నావు? ఏమీ తెలియలేదు. ఇంద్రుడు అడ్డు వచ్చాడు కాబట్టి ఆయనను చంపి అవతల పారేస్తాను అంటున్నావు. అనగా నీకు దేహాత్మాభిమానము ఉండిపోయింది. ఇంద్రుడిని విడిచిపెట్టి ఉండి ఉంటే నీవు బ్రహ్మజ్ఞానివి అయిపోయేవాడవు. ఇంద్రుడి మీద బాణం వేయడంలో దేహాత్మాభిమానంతో క్రిందికి జారిపోయావు. అతడు అలా ఎందుకు చేశాడో నీవు గురించావా? నీయందు జ్ఞానము కలగాలని అది జరిగింది తప్ప ఇంద్రుడు నీయందు అమర్యాదగా ప్రవర్తించలేదు. కానీ అతని చర్య పైకి దోషంగా కనపడుతోంది. ఇందుకని నీవు బాణం వెయవలసింది ఇంద్రుని మీద కాదు. నేకు బోధ చేయడం కోసం ఇంద్రుడు విడిచిపెట్టినటువంటి రూపం నుండి అప్పుడే పాషండులు పుట్టి పాషండ మతవ్యాప్తి చేతున్నారు. వారి మాటలను విని సంతోషపడి పోయి వేలకొద్దీ జనం పాషండులు అయిపోతున్నారు. ఇపుడు నీవు నీ బాణం పట్టుకుని ఈ పాషండ మతమును నాశనం చెయ్యి" అని చెప్పాడు. వెంటనే పృథువు ఇంద్రునితో స్నేహం చేశాడు.

పృథు మహారాజులో ఉన్న గొప్పతనం కేవలం భూమిని గోవుగా చేసి పితకడం కాదు. మనకి నవవిధ భక్తులు ఉన్నాయి.

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం!

అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం!!

ఇందులో అర్చన భక్తికి పృథు మహారాజు గొప్పవాడు. పృథు మహారాజు జీవితంలో ఈ ఘట్టములను వింటే సంతానము లేని వాళ్లకు సంతానము కలుగుతుంది. ఇప్పుడు శ్రీమహా విష్ణువు "పృథూ, నీకేమి వరం కావాలో కోరుకో" అన్నాడు. అడిగితే పృథు మహారాజు "స్వామీ, నన్ను మరల మోహపెడదామని అనుకుంటున్నావా! నాకెందుకు స్వామీ వరాలు. నాకు అక్కర్లేదు. నాకు ఏ వరం కావాలో తెలుసా! నీ పాదారవిందములను గూర్చి వర్ణన చేసి, నీ గురించి స్తోత్రం చేస్తుంటే, నీ కథలు చెపుతుంటే అలా విని పొంగి పోయేటటువంటి స్థితి నాకు చాలు. మోక్షం వస్తే నీలో కలిసిపోవడం వలన మరల నాకు ఆ శ్రవణానందం దొరకదు. ఈశ్వరుడి కథలు చెపుతుంటే విని పొంగిపోయే అదృష్టం ఉండదు. అందుకని నాకేమీ వరం అక్కర్లేదు. నీ కథలు వినగలిగినటువంటి అదృష్టమును నాకు కలిగించు" అన్నాడు. ఇదీ పృథు మహారాజు గారి పూజా నిష్ఠ అంటే. అందుకే మనకి షోడశోపచారములు వచ్చాయి. ఇటువంటి అర్చనను చేశాడు పృథువు. అలా అర్చన చేస్తే ఈశ్వరుడు ఆయనపట్ల విశేషమయిన ఆనందమును పొందాడు.

ఒకనాడు సత్రయాగం చేసి అందరికీ బ్రాహ్మణుడు ఎలా జీవించాలో, క్షత్రియుడు ఎలా జీవించాలో, భూమిని ఎలా రక్షించాలో వారి వారి విధులను గూర్చి ప్రసంగం చేశాడు. ఇపుడు కర్మయందు శుద్ధి కలిగి భక్తికి దారి తీసింది. అపారమైన భక్తి వైరాగ్యమునకు దారితీసింది. ఒకరోజు సత్రయాగం జరుగుతుండగా సనకసనందనాది మహర్షులు క్రిందికి దిగారు. మహా పురుషులయిన వారు లేచి నడిచి వస్తున్నప్పుడు అంత తేజస్సు లేనివాడు కూర్చుంటే ఆయుర్దాయం తగ్గిపోతుంది. ప్రాణములు తమ తమ స్థానములలోంచి లేస్తాయి. అందుకని లేచి నిలబడితే అవి కుదురుకుంటాయి. అందుకని పెద్దలు వచ్చినపుడు నిలబడతారు. సనక సనందనాదులు రాగానే పృథువు లేచి నిలబడ్డాడు. వారిని అర్చించాడు. వారిని ఉచితాసనమున కూర్చోబెట్టి "స్వామీ, మేము సంసారమునందు వున్న తిన్గారులము. మేము ఎలా తరిస్తాము? మేము తొందరగా తరించడానికి ఏదయినా మార్గం ఉన్నదా? మాకు కృప చేయండి" అని "బాహ్యమునందు ఒక వ్యక్తి చాలా ఐశ్వర్యవంతుడిలా కనిపించవచ్చు. ఒకడు దరిద్రుడిలా కనిపించ వచ్చు. కానీ అంతరమునందు ఒకడు ఈశ్వరుని దృష్టిలో గొప్ప ధనవంతుడు. వేరొకడు కటిక దరిద్రుడు. ఏకారణము చేత" అని అడిగితె సనక సనందనాదులు "ఎవరు మహా పురుషుడిని ఇంటికి తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇచ్చి గడప దాటించి వారి పాదములకు వంగి నమస్కరించి తన ఇంటిలో వున్న తృణమో పణమో వారికి సమర్పించి గృహస్థాశ్రమము సన్యాసాశ్రమమునకు భిక్ష పెట్టడానికి ఉపయోగిస్తున్నాడో అటువంటి వాడు ఈశ్వరుని దృష్టిలో అపారమైన ఐశ్వర్యవంతుడు" అని చెప్పారు. వాళ్లు ఇంకా ఇలా అన్నారు "గృహస్థాశ్రమంలో ఉంది చాలా కాలం పాపకర్మల యందు నిమగ్నుడై ఈశ్వరుని వైపు తిరగని వాడు జీవితం తరించదానికి చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? భగవంతుని పాదములు పట్టి నమస్కరించ గలిగి యా నిపుణత కలిగిన ఒక మహాభక్తునితో స్నేహం పెట్టుకో. మెల్లగా భగవంతునితో అనుబంధమును పెంచుకునేలా చేస్తారు. అటువంటి వారితో కలిసి తిరిగి సంబంధం ఏర్పరచుకుంటే ఆ భక్తి క్రమంగా నిష్కామ యోగమునకు దారితీసి ఉన్న ఒకే మట్టి ఇన్ని పాత్రలుగా కనపడుతోందన్న అనుభవం లోపల సిద్ధించి ఆ జ్ఞానమునండు నిలబడిపోయిన తరువాత ఘటము పగిలిపోతే కుండలో వున్న ఆకాశము అనంతాకాశంలో కలిసినట్లు నీవు మోక్ష పదవిని అలంకరిస్తావు. సుఖదుఃఖములను దాటి ఉపాధిని విడిచిపెట్టి జ్ఞానముచేత ఈశ్వరునిలో కలిసిపోతావు. సాయుజ్యము కలుగుతుంది" అన్నారు.

సనక సనందనాదుల బోధ చేత జ్ఞానమును పొందిన వాడై కొడుకులకి రాజ్యం ఇచ్చేసి ఉత్తర దిక్కుకు ప్రయాణించి ఆశ్రమ వాసం చేసి, తపస్సు చేసి, ఇంద్రియములను గెలిచి, అంత్యమునందు తన గుదస్థానమునందు ఉన్న వాయువును ప్రేరేపించి పైకి కదిపి షట్చక్రభేదనం చేసి తనలో వున్న పృథివీ తత్త్వమును బ్రహ్మాండములో వున్న పృథువికి కలిపి జలమును జలమునకు కలిపి, ఆకాశమును ఆకాశమునకు కలిపి, తనలో వున్న తేజస్సును ఊర్ధ్వ ముఖం చేసి పునరావృత్తి రహిత విష్ణు సాయుజ్యము కొరకు బ్రహ్మాండమంతా ఆవరించివున్న విష్ణుశక్తి వ్యాపకత్వమునందు కలిపి వేశాడు. ఈవిధంగా పృథు మహారాజు పునరావృత్తి రహిత మోక్షమును పొందాడు. పిమ్మట ఆయన భార్య అర్చిస్సు వెంటనే భర్తకి తర్పణం విడిచి తలస్నానం చేసి అగ్నిహోత్రమునందు ప్రవేశించి శరీరమును విడిచి పెట్టి భర్తృ ధ్యానం చేస్తూ భర్త ఏ లోకమునకు వెళ్ళిపోయాడో ఆవిడ కూడా ఆలోకమునకు వెళ్ళిపోయి ఆయనతో పాటు నారాయణ శక్తియందు లీనమయింది.

ఇంత పరమ పవిత్రమయిన ఈ ఆఖ్యానమును వినినా చదివినా అత్యంత శుభాఫలితం కలుగుతుంది. సంధ్యావందనం చేయడం మానివేసిన వాడు కూడా పృథు మహారాజుగారి చరిత్ర వింటే ఆ దోషం నివారణ అయి బ్రహ్మ వర్చస్సును పొందుతాడు. క్షత్రియుడు తనకు ఫలానా రాజ్యం కావాలని పృథు మహారాజు చరిత్ర విని యుద్ధమునకు వెడితే జగత్తునంతటిని గెలిచి సార్వభౌముడు అవుతాడు. వైశ్యుడు పృథు మహారాజు చరిత్ర వింటే అతనికి వ్యాపారంలో అనేకమయిన లాభములు కలిగి ధన సంపత్తిని పొందుతాడు. ఇతరములయిన వారు పెద్దలను సేవించే తత్త్వము ఉన్నవారు పెద్దల అనుగ్రహమును పొంది వారి కుటుంబములు వృద్ధిలోకి వస్తాయి. ఏమీ తెలియని వాడు కూడా ఇటువంటి పృథు చరిత్ర వింటే సర్వ సిద్ధులను పొంది సర్వ పాపములు నశించి శ్రీకృష్ణ పరమాత్మ పాదారవిందముల యందు భక్తిని పొంది ఇహమునందు పొందవలసినవి పొంది అంత్యమునందు మోక్ష స్థితిని పొందడానికి కావలసిన జ్ఞానము వాడికి ఈ జన్మలో బోధ జరిగేటటువంటి అదృష్టమును పొంది ఆ అర్హతను పొందుతున్నాడు అని వేదవ్యాసుడు ఈ పురాణాంతర్గతం చేస్తే మనమీద అనుగ్రహంతో మహాపురుషుడయిన పోతనామాత్యుడు ఆంధ్రీకరించారు.⁠⁠⁠⁠