పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

కథలు - భాగవతాలు : యాదవుల అంతమొందుట

యాదవుల అంతమొందుట

ఆడుకుంటున్న యాదవులు అకారణంగా రెండు పక్షములుగా విడిపోయి “యుద్ధం చేసుకోవడం మొదలుపెట్టి చిట్టచివర మిగిలిన వారు వాళ్ళు అరగదీసిన యినప రోకలి లోంచి పుట్టిన తెట్టు కలిపినపుడు పుట్టిన రెళ్ళు దుబ్బులు కోసి తెచ్చి వాటితో కొట్టుకుని ప్రాణములు వదిలేశారు. యాదవ కులం నాశనం అయిపొయింది. బలరాముని భార్యలు, కృష్ణుని భార్యలు చితులలోనికి ప్రవేశించారు. మిగిలినవారు ఎవరో కొద్దిమంది ఉంటె వారిని ఇంద్రప్రస్థం తీసుకు వెడదామని అర్జునుడ గాండీవము పట్టుకుని వారిని తీసుకువెడుతున్నాడు. చిత్రం ఏమిటంటే కృష్ణ పరమాత్మ అవతారం చాలించగానే పదిమంది గోపబాలుర చేతిలో గాండీవము ఉన్న అర్జునుడు ఓడిపోయాడు. ఆ విషయమును వచ్చి ధర్మరాజుకి చెప్తాడు. “గాండీవం ఉంది, పాశుపతాస్త్రం ఉంది గెలిచాననుకున్నాను. ఆ కృష్ణ పరమాత్మ సారధ్యం వలన గెలిచానని అనుకోలేదు. ఆ మహానుభావుడు నా సఖుడు వెళ్ళిపోయాడు అన్నాడు. అపుడు ధర్మరాజు గారు “అటువంటి మహానుభావుడు వెళ్ళిపోయిన తరువాత మనం యిక ఈ భూమండలం మీద ఉండవద్దు. రండి వెళ్ళిపోదాం అని పిచ్చివానిలా జుట్టు విరబోసుకుని ఆభరణములు అన్నీ తీసి పక్కన పెట్టేసి ఉత్తరాభిముఖుడై వెళ్ళిపోయాడు. మిగిలిన పాండవులు ద్రౌపది, కుంతి అంతా శరీరములు విడిచిపెట్టారు. కలియుగం ప్రవేశించింది.