పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (సంకర - సరసీరుహో)

శ్రీరామ

up-arrow

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


5191} సంకర్షుణుడు  - చతుర్వూహములలోని (1వాసుదేవ 2ప్రద్యుమ్న 3అనిరుద్ధ 4సంకర్షణ) సంకర్షణమనబడెడి వ్యూహము., సంకర్షణవ్యూహం: వైకారికమైన సాత్త్వికాహంకారాన్ని అధిష్ఠించి సంకర్షణవ్యూహం ఒప్పుతుంటుంది. వేయి పడగలతో ప్రకాశించేవాడూ, అనంతుడూ అయిన సంకర్షణ పురుషుడు మహానుభావుడై పంచభూతాలతో, పంచేంద్రియాలతో, మనస్సుతో నిండి ఉంటాడు. కర్త, కార్యం, కారణం అనే రూప భేదాలు కలిగి శాంతత్వం, ఘోరత్వం, మూఢత్వం మొదలైన లక్షణాలతో ఉల్లాసంగా ఉంటాడు. ఈ మేటి వ్యూహమే రెండవదైన సంకర్షణ వ్యూహం. దీనినుంచే మనస్తత్త్వం పుట్టింది. :-
[3-265.1-తే., 4-702.1-తే., 5.2-122.1-ఆ., 11-77-వ., 12-20-వ., 12-23.1-తే.]

5192} సంకేతస్థలము  - సంకేతము (రహస్యముగ ఏర్పాటు చేసుకొన్న గుర్తు)గా పెట్టుకొన్న చోటు :-
[10.1-1439-క.]

5193} సంక్రందనుడు  - శత్రువులను ఆక్రందనము (మొఱలు) పెట్టించు వాడు. దేవేంద్రుడు :-
[6-429-ఉ., 10.1-1562-వ.]

5194} సంక్రమణము  - సూర్యుడు ఒకరాశినుండి మరియొక రాశికి మారుట, దాటుట ఉదా. మకరసంక్రమణము :-
[4-383-తే.]

5195} సంగత్వము  - సంగములు (తగులములు) కల స్థితి :-
[1-498-క.]

5196} సంచితము - పోగుపడినవి వ్యు. సంచితి ప్రోగు (సమ్ + చి + క్తిన్), కృ.ప., గుంపు :-
[3-818-క.]

5197} సంచితము  - జన్మజన్మములకు పోగుచేయబడు పుణ్య, పాప, లేదా ఉభయ 4కర్మములు, అనారబ్దమైన కర్మము, ఆగామి సంచితము ప్రారబ్దము అని కర్మములు మూడు విధములు. వ్యు. సం + చి (చయనే) + క్త, కృ.ప్ర. :-
[10.2-701-చ.]

5198} సంతతక్లేశనాశనుడవు  - నిత్యము క్లేశముల (చిక్కుల)ను నాశనముచేయువాడవు, విష్ణువు :-
[4-918.1-తే.]

5199} సంతతభాగధేయుడు  - ఎడతెగని కర్మఫలముల రూపమైన వాడు, విష్ణువు :-
[4-286.1-తే.]

5200} సంతతభువనరక్షుడు  - సంతత (ఎల్లప్పుడు) భువన (జగత్తును) రక్షకుడు (రక్షించువాడు), విష్ణువు. :-
[3-309.1-తే., 4-193.1-తే.]

5201} సంతతానందుడు  - సంతత (ఎడతెగని) ఆనందుడు (ఆనందము గలవాడు), విష్ణువు :-
[8-483.1-తే.]

5202} సంతతాశ్రితనిర్వక్రము  - సంతతా (ఎల్లప్పుడును) ఆశ్రిత (ఆశ్రయించినవారికి) నిర్వక్రము (అనుకూలమైనట్టిది, వెనుదీయనిది), విష్ణుచక్రము :-
[3-678-మ.]

5203} సంతానవిస్తరార్థము  - కుమారు లున్నను ఇంకను కుమారులు పొందుటకు :-
[4-3.1-తే.]

5204} సంతోషుడు  - సంతోషము కలవాడు :-
[4-6-వ.]

5205} సందంశము  - పట్టుకొని కరచుటలు, నరక విశేషము :-
[5.2-136-వ.]

5206} సంధ్య  - పగలు రాత్రుల మధ్య కాలము సంధ్య అనబడును. ప్రొద్దుపొడుచుటకు ముందైదుగడియలవఱకును ప్రొద్దుగ్రుంకిన వెనుక మూడుగడియలవఱకును గల కాలము; :-
[3-727-క.]

5207} సంప్రదాయము  - తరతరములుగా ఇవ్వబడుచున్నది :-
[3-271-వ.]

5208} సంభూతులు  - సంభవించినవారు, భూతకాలము కలవారు :-
[2-84-వ.]

5209} సంయమని  - యముని పట్టణము :-
[10.2-601-వ.]

5210} సంయమి  - సంయమనము కలవాడు, ఋషి :-
[10.2-598-చ., 10.2-633-క., 11-9-క.]

5211} సంయమీశ్వరులు  - సంయమము (హింసాదులవలన విరమించుట) కలవారు, ముని :-
[7-349-మ.]

5212} సంవర్తకము - సవర్త (దీని యందు జగత్తు లయమగును) మేఘము, ప్రళయకాల మేఘ విశేషము :-
[11-52-వ.]

5213} సంవర్తకాది,నవమేఘములు  - 1సంవర్తకము 2ఆవర్తకము 3పుష్కరము 4ద్రోణము 5కాలము 6నీలము 7అరుణము 8తమస్సు 9వారుణము అనెడి మేఘములు :-
[10.1-899-వ.]

5214} సంశుద్ధుడు  - పరిశుద్ధమైన వాడు :-
[2-207-క.]

5215} సంసారబంధములు  - అష్టబంధములు, 1దయ 2జుగుప్స 3మోహము 4భయము 6సంశయము 7కులము 8శీలము :-
[10.1-1704.1-తే.]

5216} సంసారభయవిదూరుడు  - సంసారము (భవ) వలని భయములను మిక్కిలి దూరము చేయువాడు, విష్ణువు. :-
[3-308.1-తే., 4-179.1-తే., 4-286.1-తే.]

5217} సంసారము  - జననమరణముల పరంపర, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీజఠరే శయనం, ఆలుబిడ్డలతోడి యునికి :-
[10.1-568-వ.]

5218} సంసారి  - సంసారముగల గృహస్థు.డు :-
[10.2-268-వ.]

5219} సంసేవ్యుడు  - సం (చక్కగా) సేవ్యులు (సేవింపదగినవాడు), ప్రభువు :-
[7-55-మ.]

5220} సంస్కార  - ఆ పంచభూతముల విషయములైన శబ్ద స్పర్శాదులుగా నుండుట, అనుభూతార్థ స్మృతిపాకము :-
[10.1-537-వ.]

5221} సంస్కారములు  - గర్భాదానాది షోడశసంస్కారములు, 1. గర్భాధానము, 2. పుంసవనము, 3. సీమంతోన్నయనము, 4. జాతకర్మ, 5. నామకరణము, 6. నిష్క్రమణము, 7. అన్నప్రాశనము, 8. చౌలము, 9. ఉపనయనము, వేదవ్రత చతుష్టయము, 10. మహానామ్నీ వ్రతము, 11. మహావ్రతము, 12. ఉపనిషద్వ్రతము, 13. గోదానము, 14. కేశాంతము, 15. సమావర్తనము, 16. వివాహము. :-
[3-39-క.]

5222} సంస్కృతంబుగుణమగుట  - సంస్కృతమూలపదాల ప్రయోగం ఎక్కువ వుంటే నచ్చుట :-
[1-20-క.]

5223} సంస్తిమితము  - శబ్దస్పర్శాదివ్యాపారశూన్యములైన, వాటిపని అవి చేయలేని :-
[10.1-540-ఉ.]

5224} సకలకార్యములు  - అవ్యక్తము మహత్తత్వము అహంకారము పంచతన్మాత్రలు పంచభూతము అనెడి చతుర్దశ కార్యములు, శ్లో. కార్యోపాధిర యం జీవః, కారణోపాధిరీశ్వరః. :-
[10.1-683-వ., 10.2-660-వ.]

5225} సకలజగదీశ్వరుడు  - సమస్తమైన జగత్తులకు ఈశ్వరుడు, విష్ణువు :-
[4-421-వ.]

5226} సకలజీవులకెల్లఁబ్రకటదేహము  - సమస్త జీవులకన్నిటియందు వ్యక్తమగు రూపముకలవాడు, విష్ణువు :-
[3-198.1-తే.]

5227} సకలదిక్పాలభాస్వత్కిరీటన్యస్తపద్మరాగారుణపాదపీఠుఁడు  - సమస్త దిక్పాలుల కిరీటములు హత్తించిన పద్మరాగముల వంటి అరికాళ్ళు కలవాడు, విష్ణువు :-
[3-99.1-తే.]

5228} సకలనియంత  - సమస్తమును నియమించువాడు, విష్ణువు :-
[3-19-చ.]

5229} సకలభక్తచింతామణి  - సకల (సమస్తమైన) భక్త (భక్తులకు) చితామణి (కోరిన కోరికల నిచ్చు మణి వంటివాడు), విష్ణువు :-
[6-36-క.]

5230} సకలభూతనికాయగుహాశయుడు  - సకల (సమస్తమైన) భూతనికాయము (జీవజాలము) యొక్క గుహ (హృదయము) నందు శయుడు (పడుకొని ఉండువాడు), విష్ణువు :-
[3-861-క.]

5231} సకలభూతాతంరాత్ముడు  - సమస్తమైన భూతము (ప్రాణు) లందును ఆత్మరూపమున ఉండువాడు, విష్ణువు :-
[3-753.1-తే.]

5232} సకలలోకనమస్కృతచరణకమలు  - సమస్తమైన లోకులచేతను నమస్కారింపబడిన పాదపద్మములు కలవాడు, విష్ణువు :-
[3-924.1-తే.]

5233} సకలలోకేశ్వరుడు  - ఎల్లలోకములకు ప్రభువు, శివుడు :-
[7-394-వ.]

5234} సకలసంపూర్ణుడు  - సమస్తమునందు నిండి యుండువాడు, విష్ణువు :-
[10.1-1180.1-ఆ.]

5235} సకామజనఫలప్రాపకుడు  - కోరికలుకల జనులకు ఫలితము పొందించువాడును, శంకరుడు :-
[3-473-వ.]

5236} సగముచేసె  - అర్థ దేహము కలవానిగా చేసెను, అర్థనారీశ్వరునిగ చేసెను :-
[10.2-10.1-తే.]

5237} సగరుడు  - సూర్యవంశపు మహారాజు, విషముతోపాటు పుట్టినవాడు, ఇతని పుత్రులు తవ్వగ నేర్పడినదే సాగరము :-
[2-204.1-తే., 5.2-58-వ., 9-202.1-తే.]

5238} సగుణవిలాసి  - గుణత్రయముయొక్క విలాసముచే, సత్వగుణమువలన సకల దేవతల రూపములను రజోగుణముచేత సకల భూలోకజీవులను తమోగుణముచేత భౌతిక రూపములైన భూమి పర్వతములు శిలలు మున్నగునవి ధరించినవాడు :-
[10.1-553.1-ఆ.]

5239} సగుణుడు  - దివ్యగుణములు కలవాడు, విష్ణువు :-
[4-359.1-తే.]

5240} సచరాచరము  - స (కలిసి యున్న) చర (కదలికగలవి) అచర (కదలికలేనివి) కలది, ప్రపంచ మంతయు :-
[5.1-75-క.]

5241} సచరాచరములు  - చర (చరించగలవి) అచర (చరించలేనివి) కలిసిన మొత్తము, సకలజీవులు అన్నీ :-
[10.2-1070-చ.]

5242} సచ్చిదానందమయుడు  - సత్ (సత్య మైనది శాశ్వతమైనది) చిత్ (శుద్ధ చైతన్యమైనది) ఆనంద (ఆనందము) లతో మయుడు(నిండినవాడు), బ్రహ్మ :-
[7-87.1-ఆ.]

5243} సచ్చిదానందుడు - 1. పరమాత్మ, 2. విష్ణువు వ్యు. సత్ (నిత్య) చిత్ (జ్ఞాన) ఆనంద (సుఖ) స్వరూపమైనవాడు :-
[10.1-537-వ.]

5244} సజ్జనవిధేయుడు  - సత్ (మంచి) జన (వారికి) విధేయుడు (వశమైనవాడు), విష్ణువు :-
[7-459-ఉ.]

5245} సటి  - జూలు కలది, అడవిపంది, సింహము :-
[3-698-క.]

5246} సతతప్రసన్నస్మితవదనాంభోజుడు  - సతత (ఎల్లప్పుడును) ప్రసన్న (ప్రసన్నమైన) స్మిత (చిరునవ్వుతో కూడిన) వదన (మోము అనెడి) అంభోజుడు (పద్మము కలవాడు), విష్ణువు :-
[3-922.1-తే.]

5247} సతతోద్యజ్జయశబ్దసన్ముఖరభాస్వచ్ఛక్రము  - సంతత (ఎల్లప్పుడును) ఉద్యత్ (గట్టిగపలకబడు) జయ అను శబ్దముచేయు సత్ (మంచి) ముఖర (వాడియైన పళ్లు) కల భాస్వత్ (ప్రకాశించు) చక్రము, విష్ణుచక్రము :-
[3-678-మ.]

5248} సతి  - సత్ అను అస్తిత్వము యైన శక్తిరూపి :-
[4-35.1-తే.]

5249} సతీదేవిపతి  - పార్వతీపతి, శంకరుడు :-
[3-473-వ.]

5250} సత్కృపామూర్తి  - మంచి దయకు స్వరూపము ఐనవాడు, విష్ణువు :-
[3-311.1-తే.]

5251} సత్తపోనివహాభీష్టవరప్రదాత  - సత్ (మంచి, సత్యమైన) తపః (తపస్వుల) నివహా (సమూహముల) అభీష్ట (కోరిన) వర (వరములను) ప్రదాత (ప్రసాదించువాడు), బ్రహ్మ :-
[7-85-మ.]

5252} సత్త్వగుణగరిష్ఠుడు  - సత్త్వగుణములు కలవారిలో గొప్పవాడు, విష్ణువు :-
[3-145.1-తే.]

5253} సత్త్వగుణాశ్రయుడు  - సత్త్వగుణములను ఆశ్రయించి యుండువాడు, విష్ణువు :-
[4-195-చ.]

5254} సత్త్వగుణుడు  - సత్త్త్వగుణము గలవాడు, విష్ణువు :-
[4-918.1-తే.]

5255} సత్త్వమూర్తి  - సత్త్వ గుణము స్వరూపమైనవాడు, విష్ణువు :-
[4-936-వ.]

5256} సత్త్వాకరుడు  - సత్త్వగుణమునకు ఆకరుడు (ప్రధానుడు), విష్ణువు :-
[7-354.1-తే.]

5257} సత్త్వాది  - సత్త్వ రజస్తమో గుణములు అనెడి త్రిగుణములు :-
[2-217.1-తే., 2-222-వ., 3-215-వ., 3-889-వ., 4-179.1-తే., 4-193.1-తే., 10.2-1203-వ.]

5258} సత్పుణ్యభూరివర్చస్సు  - సత్(సత్యమైన) భూరి గొప్ప వర్చస్సు (పర్కాశముగలవాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

5259} సత్పురుషుడు  - సత్ (సత్యవర్తనుడైన) పురుషుడు, సత్తునందు వర్తించు పురుషుడు, విష్ణువు :-
[3-246.1-తే.]

5260} సత్యంపరంధీమహి  - జ్ఞాని సత్యమే ఉత్కృష్ట మైనది :-
[1-35-వ.]

5261} సత్యకనందనుడు  - సాత్యకి, సత్యకుని కొడుకు, కృష్ణుని రథసారథి :-
[1-348.1-తే.]

5262} సత్యము  - సర్వకాలసర్వావస్తలందు వికారములు లేనిది, సత్తు, నిత్యము అనంతము అనితరము అవిభక్తము అవిభాజ్యము ఐనది సత్యము అదే పరబ్రహ్మము అని విచారించుట సత్యశోధన :-
[10.1-567.1-ఆ., 10.1-962-మ., 10.1-1474-ఆ.]

5263} సత్యుడు  - సత్తు అయినవాడు :-
[2-23-వ.]

5264} సత్రములు  - సత్రయాగములు 13 మొదలు 100 దినముల వరకు జరుగు యాగములు :-
[3-426-వ.]

5265} సత్రయాగము  - 13 మొదలు 100 దినముల వరకు చేసెడి యజ్ఞబేధము :-
[9-76-వ.]

5266} సత్వములు  - 1దేవ 2మనుజ 3నాగ 4యక్ష 5గంధర్వ 6పిశాచ 7వాయస 8వానర 9గార్దభ 10కూర్మ 11పర్యటన సత్వములు :-
[10.1-1495-ఉ.]

5267} సత్వాది, గుణత్రయము  - త్రిగుణములు సత్త్వ రజస్ తమస్ అను మూడుగుణములు :-
[10.2-248.1-తే., 12-24-వ.]

5268} సత్సుకరుడు  - సత్ (మంచి) సుకరుడు (మేలు) కరుడు (కలిగించువాడు), విష్ణువు :-
[9-142-మ.]

5269} సదసత్పూరుషుడు  - సత్ లోను అసత్ లోనూ నివసించు వాడు, భగవంతుడు :-
[2-207-క.]

5270} సదసద్విచారులు  - సత్ (సత్తును, సత్యమును) అసత్ (అసత్యమును, చిత్తును) విచారులు (తర్కించుకొనువారు), తత్వజ్ఞులు :-
[4-591.1-తే.]

5271} సదస్యశాల  - సభాస్థలిగల శాల, సభ్యులు ఉండు శాల :-
[4-118-వ.]

5272} సదానందమూర్తి  - శాశ్వత ఆనందమునకు స్వరూపము అయినవాడు, విష్ణువు :-
[3-203-దం.]

5273} సదాయాంతరంగుడు  - సత్ (మిక్కిలి) దయా (కృపగల) అంతరంగుడు (మనసు గలవాడు), విష్ణువు :-
[4-900-క.]

5274} సదారాముడు  - సదా (ఎల్లప్పుడును) ఆరాముడు (ఆనందమున యుండువాడు), శివుడు :-
[4-685.1-తే.]

5275} సదాశివభ్రాత  - సదాశివుని భ్రాత (సోదరుడు), కుబేరుడు :-
[4-361-తే.]

5276} సదాశివుడు  - శాశ్వతమైన శుభము యైనవాడు, శంకరుడు :-
[4-93-వ., 4-735-క.]

5277} సదుపాయము  - సత్ (మంచి) ఉపాయము (ఏర్పాటు, ఉపాయము), సౌకర్యము :-
[4-471-క.]

5278} సద్గణావళులు  - స (మంచి) గుణా ( గణముల) ఆవళి (సమూహములు) లు (కలవారు) :-
[2-211-ఉ.]

5279} సద్ధితఫలరూపకుడు  - సత్ (మంచివారి)కి ఫలితమే రూపము యైనవాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

5280} సనకసనందనాదులు  - కుమారచతుష్కము, 1సనక 2సనందన 3సనత్కుమార 4సనత్సుజాతులుఅను బ్రహ్మదేవుని కుమారులు :-
[7-21-వ., 11-105-వ.]

5281} సనకాదులు  - 1సనక 2సనందన 3సనత్కుమార 4సనత్సుజాతులు అనెడి ఆది యోగులు, బ్రహ్మదేవుని కొడుకులు, కుమారచతుష్కము :-
[3-502-క., 3-526-క., 4-509.1-తే., 4-543-క., 4-598-క., 4-604.1-తే., 4-636-వ., 4-695-మ., 7-453-వ., 10.1-383-క., 10.1-694-క., 10.1-1046-మ., 10.1-1234.1-ఆ., 10.1-1497-మ., 10.2-110-మ., 10.2-1071.1-తే., 10.2-1203-వ.]

5282} సనత్కుమారాదులు  - కుమార చతుష్కయము, 1సనకుడు 2సనందనుడు 3సనత్కుమారుడు 4సనత్సుజాతుడు :-
[6-476-వ.]

5283} సనాతనుడు  - శాశ్వతుడు, పురాతనుడు, శివుడు, విష్ణువు :-
[4-138.1-తే., 4-900-క.]

5284} సన్నియామకుడు  - సత్ (సత్యమైన) నియామకుడు, విష్ణువు :-
[4-704-తే.]

5285} సన్మహితవివేకశాలి  - మంచి మరియు గొప్ప వివేకము కలవాడు, విష్ణువు :-
[3-572-చ.]

5286} సన్ముక్తి  - సత్ + ముక్తి, మోక్షము, శ్లో. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః....భజగోవిందం... (ఆదిశంకరాచార్యులవారు) :-
[10.1-1663.1-తే.]

5287} సన్యాసము  - సర్వసంగపరిత్యాగము కలగిన ఆశ్రమము, చతురాశ్రమములలో నాలుగవది. :-
[7-460-వ.]

5288} సపత్నలు  - భూమికి పత్నులు (భర్తలు) కనుక తోటి (శత్రు) రాజులు సపత్నులు, సవితులు :-
[10.2-74-క.]

5289} సప్తగోదావరి  - గోదావరి సముద్రమున కలియుటకు ముందు సప్తర్షుల నామములతో ఏడు పాయలుగా ప్రవహిస్తుంది. దానిని సప్తగోదావరి అంటారు. :-
[10.2-950-ఆ.]

5290} సప్తచ్ఛందస్సులు  - 1గాయత్రి 2ఉష్టిక్ 3త్రిష్టుప్ 4అనుష్టుప్ 5జగతీ 6పంక్తి 7బృహతి అనెడి ఏడు ఛందస్సులు :-
[5.2-83-వ.]

5291} సప్తద్వీపములు  - 1జంబూ(జంబూద్వీపము) 2ప్లక్ష(ప్లక్షద్వీపము) 3శాల్మలి(శాల్మలీద్వీపము) 4కుశ(కుశద్వీపము) 5క్రౌంచ(క్రౌంచద్వీపము) 6శాక(శాకద్వీపము) 7పుష్కరములు(పుష్కరద్వీపములు) :-
[5.1-18-వ., 5.1-19.1-తే., 5.1-19.1-తే., 5.1-22-వ., 5.1-89-వ., 7-104.1-తే., 8-574-క., 9-81-శా., 9-205.1-తే., 9-560-శా.]

5292} సప్తధాతువులు  - అ)వసాదులు (వస, అసృక్కు, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్లములు) ఆ) రోమాది (రోమ, త్వక్, మాంస, అస్థి, స్నాయువు, మజ్జ, ప్రాణములు) (ఇ) త్వగాది (1త్వక్, మాంస, రుధిర, మేధో, మజ్జ, అస్థి, శుక్లములు) :-
[2-269-వ., 3-426-వ., 3-992-వ., 8-155-వ., 8-224.1-తే., 10.1-91.1-తే.]

5293} సప్తప్రకృతులు  - (అ) పృథివ్యాది (1పృథివి 2అప్పు 3తేజస్ 4వాయుః 5ఆకాశః 6మహత్ 7అహంకారములు) (ఆ) అమాత్యాది (1అమాత్యులు 2జనపద 3దుర్గ 4ద్రవిణ 5సంచయ 6దండ 7మిత్రములు) :-
[6-449-వ., 6-449-వ.]

5294} సప్తర్షిమండలము  - సప్తర్షులు నక్షత్రముల రూపముననుండెడి మండలము, :-
[9-488-క.]

5295} సప్తర్షులు  - 1మరీచి 2అత్రి 3అంగిరుడు 4పులస్త్యుడు 5పులహుడు 6క్రతువు 7వసిష్ఠుడు (మరియొక క్రమమున) 1కశ్యపుడు 2అత్రి 3భరద్వాజుడు 4విశ్వామిత్రుడు 5గౌతముడు 6జమదగ్ని 7వసిష్ఠుడు :-
[5.2-32-వ., 5.2-91-క., 9-488-క.]

5296} సప్తవరూధము  - వరూధము అంటే కవచము సప్తవరూధమును సప్తధాతువులుకు ప్రతీకగా పురంజయనోపాఖ్యానంలో ప్రయోగించారు :-
[4-771.1-తే.]

5297} సప్తవాయువులు  - (అ) ప్రవాహాది (1ప్రవహము 2వివహము 3ఆవహము 4ప్రతివహము 5ఉద్వహము 6సంవహము 7పరివహము), (ఆ) గగనాది (1గగనము 2స్పర్శనము 3వాయువు 4అనిలము 5ప్రాణము 6ప్రాణేశ్వరము 7జీవము) :-
[10.2-165-వ.]

5298} సప్తవింశతితత్త్వములు  - 5 పంచభూతములు 5 పంచతన్మాత్రలు 5 పంచకర్మేంద్రియములు 5 పంచజ్ఞానేంద్రియములు 4 చతురంతఃకరణములు మరియు 1 పురుషుడు 1 ప్రకృతి 1 మహత్తు మొత్తము 5+5+5+5+4+1+1+1 27 :-
[3-204.1-తే.]

5299} సప్తవ్యసనములు  - కామక్రోధముల వలన కలిగెడు దోషములు ఇవి ఏడు (1పానము 2స్త్రీ 3మృగయ 4ద్యూతము (ఇవి కామమువలన పుట్టినవి) 5వాక్పారుష్యము 6దండపారుష్యము 7అర్థపారుష్యము (ఇవి కోపమువలన పుట్టునవి) :-
[6-192-వ.]

5300} సప్తసంతానములు  - తటాకము, నిధి, అగ్రహారము, దేవాలయము, వనము, ప్రభందము, పుత్రుడు. :-
[2-227.1-తే.]

5301} సప్తసముద్రములు, సప్తజలధులు, సప్తసాగరములు  - 1క్షార(కారపు సముద్రము) 2ఇక్షురస(చెరకురసముసముద్రము) 3సుర(సురాసముద్రము) 4ఆజ్య(నేయ్యిసముద్రము) 5క్షీర(పాలసముద్రము) 6దధి(పెరుగుసముద్రము) 7ఉదకంబులు(నీటిసముద్రము) :-
[3-603-తే., 5.1-18-వ., 5.1-19.1-తే., 5.1-22-వ., 7-73-మ., 9-333.1-ఆ., 10.1-106.1-తే.]

5302} సప్తస్కంధములు  - 1ఆవహము 2ప్రవహము 3సంవహము 4ఉద్వహము 5నివహము 6పరివహము 7పరావహము యనెడి సప్తవిధవాయువులు, 1.కాళి, 2. కరాళి, 3. విస్ఫులింగిని, 4. ధూమ్రవర్ణ, 5. విశ్వరుచి, 6. లోహిత, 7. మనోజవ ఇవి సప్తస్కంధశిఖలు :-
[7-285-వ.]

5303} సప్తస్కంధశిఖలు  - ఏడు నాలుకల అగ్ని శిఖలు అగ్ని ఏడు నాలుకలు కాళి, కరాళి, విస్ఫులింగిని, ధూమ్రవర్ణ, విశ్వరుచి, లోహిత, మనోజవ :-
[2-185-శా.]

5304} సప్తస్వరములు  - సంగీత స్వరములు ఏడు, స, రి, గ, మ, ప, ద, ని. (షఢ్జమ, ఋషభ, గాంధార, మధ్యమ, పంచమ, ధైవత, నిషాదములు) :-
[3-388-వ.]

5305} సప్తార్చి  - సప్త (ఏడు, 7) అర్చి (జ్వాలలుగలవాడు), అగ్ని :-
[8-14.1-ఆ.]

5306} సప్తావరణలు  - 1మహత్తు 2అహంకారము 3పంచభూతములు ఐదు అనెడి ఈ ఏడు (7) ఆవరణలు :-
[3-972-వ.]

5307} సప్తాశ్వస్పురత్  - ఏడు గుఱ్ఱములతో వెలుగొందునది (సూర్యమండలము), సప్తాశ్వాల పేర్లు గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి. :-
[2-185-శా.]

5308} సఫలంబులు  - తగిన ప్రయోజనములు గలవి, సార్థకములు :-
[7-366-వ.]

5309} సభ  - అనేకులు చేరిన కూటమి. కొలువు కూటము, పరిషత్తు, సంసత్తు, సంస్థ, సదము, సదస్సు, సమజ్య, సమావేశము. :-
[10.1-1359-ఆ., 10.1-1597-శా.]

5310} సభార్యులు  - సభా (సదస్సునకు) ఆర్యులు (పెద్దలు) :-
[4-55-చ.]

5311} సమతలము  - మిట్టపల్లములు లేని ప్రదేశము :-
[10.1-1310.1-ఆ.]

5312} సమత్వము  - కష్ట సుఖములెడ సమభావము :-
[1-403-వ.]

5313} సమదమూషకవాహనుడు  - సమద (మదించిన, బలమైన) మూషక (ఎలుక) వాహనుడు (వాహనముగా గలవాడు), విఘ్నేశ్వరుడు :-
[6-4-ఉ.]

5314} సమదర్శనము  - సర్వభూతములను సమముగ చూచుట, ఆత్మీయ పరకీయ భ్రాంతి లేకుండుట :-
[7-409-వ.]

5315} సమపాదతానకము  - రెండు కాళ్ళు సమముగా ఉంచి నటించుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

5316} సమపాదపార్థివచారము  - సరిగా అడుగులుంచుచు పోవుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

5317} సమలోష్టహేముడు  - సమ (సమదృష్టి) లోష్ట (మట్టిపెళ్ళలు) హేమ (బంగారము)లందు గలవాడు, సమదృష్టిగలవాడు :-
[9-84.1-ఆ.]

5318} సమవాయికారణము  - సృష్టికి / ఏపనికైనా మూడు (3) కారణములు అవసరము అవి 1 ఉపాదానకారణము (సమవాయికారణము, ముఖ్యకారణము. వివ. ఘటమునకు మృత్తిక, వస్త్రమునకు తంతువులు ఉపాదాన కారణములు) 2 అసమవాయికారణము (వస్త్రమునకు తంతువులు సంయోగము) 3 నిమిత్తకారణము (కార్యోత్పత్తికి సాధనమైనది, వస్త్రమునకు మగ్గము మున్నగునవి, కుండకు కుమ్మరి సారె మున్నగునవి) :-
[3-345.1-తే.]

5319} సమస్తచేతననికాయహృదీప్సితదాయి  - సమస్తమైన చేతనుల (జీవుల) నికాయము (సమూహము)లకును హృద (హృదయములకు) దీప్సిత (కోరికను) దాయి (ఇచ్చువాడు), విష్ణువు :-
[3-844-చ.]

5320} సమస్తపావనుడు  - సమస్తమును పావనము చేయువాడు, విష్ణువు :-
[3-570-ఉ.]

5321} సమస్తభూతపతి  - సమస్తమైన భూత (జీవులకు) పతి (భర్త), శంకరుడు :-
[3-473-వ.]

5322} సమస్తము  - ద్రష్ట దృక్ దృశ్య మయమైన సమస్తము :-
[10.1-682.1-తే.]

5323} సమస్తలోకైకశరణ్యుడు  - సమస్తమైన చతుర్దశ భువనములకు ఒక్కడే ఐన రక్షకుడు, విష్ణువు :-
[10.1-688-ఉ.]

5324} సమస్తశేషకారణుడు  - సమస్తము తనలోని భాగము కాగా శేషము(మిగిలినదాని)నకు కారణము యైనవాడు, విష్ణువు :-
[4-705-వ.]

5325} సమస్తహితుడు  - సమస్త మైన వారికి హితుడు, విష్ణువు :-
[6-216-ఉ.]

5326} సమస్తార్థలిఙ్గము  - సమస్త ప్రయోజనములకు లింగము (చిహ్నము) యైనవాడు, విష్ణువు :-
[4-704-తే.]

5327} సమానాధికవిరహితుండు  - సమానమైన లేదా అధికమైన వారు ఎవ్వరూ లేనివాడు, విష్ణవు :-
[3-99.1-తే.]

5328} సమాశ్రితచింతామణి  - సమ (చక్కగా) ఆశ్రిత (ఆశ్రయించిన వారికి) చింతామణి (కోరిన కోరిక లనుగ్రహించు మణి వంటి వాడు), విష్ణువు :-
[6-34-క.]

5329} సమీరనందనుడు  - సమీర (వాయు) నందనుడు, భీముడు :-
[10.2-742-వ.]

5330} సమీరసఖుడు  - వాయువు మిత్రుడు, అగ్ని :-
[10.2-1174-వ.]

5331} సమీరసూతి  - వాయుదేవుని కొడుకు, భీముడు :-
[3-26-చ.]

5332} సమీరుడు  - లెస్సగా చరించువాడు, వాయువు, వాయవ్య దిక్పతి :-
[10.2-773-చ.]

5333} సముడు  - సర్వము యెడల సమమైన భావము గలవాడు, విష్ణువు :-
[2-207-క., 4-936-వ., 6-327.1-తే.]

5334} సముదంచితహారి  - చక్కగా ఒప్పుచున్న హారములు ధరించిన వాడు, విష్ణువు :-
[3-335-ఉ.]

5335} సముద్ధతి  - గురువు దగ్గర శిక్షింపబడని వానివలె, చూపు మిక్కిలి ఆటోపము :-
[1-189.1-తే.]

5336} సముద్రము  - వ్యు. సమ్+ఉద్+ద్రు+ఘఞ్, సముద్రవంతి అస్మాత్ భూతాని, సమువంతి ఏనం భూతాని, ప్రాణులు, భూతములు ఇక్కడ నుండి పుట్టును, దీని యందు లీనమగును. (అథ. 4.30.7) :-
[10.2-4-వ., 11-26-వ.]

5337} సమ్యగ్భోగము  - చక్కటి అనుభవము :-
[1-381-వ.]

5338} సరభసము  - వేగముగా, త్వరగా పోవునది, కాలము. :-
[4-771.1-తే.]

5339} సరసదయాపాంగుడు  - సరస (చక్కటి) దయా (దయతోకూడిన) అపాంగుడు (కటాక్షముగలవాడు), రాముడు :-
[4-975-క.]

5340} సరసవచోవిలాసుడు  - సరస (మనోహర మైన) వచస్ (పలుకలతో) విలాసుడు (శోభిల్లువాడు), రామ :-
[4-974-చ.]

5341} సరసవినుతగుణసూరి  - సరస (రసస్ఫూర్తితో) వినుత (స్తుతించెడి) గుణ (సుగుణములు గల) సూరి (పండితులు గలవాడు), రాముడు :-
[4-976-మాలి.]

5342} సరసహృదయవాసుడు  - సరసుల హృదయము లందు వసించెడివాడు, శ్రీకృష్ణ :-
[5.1-183-మాలి.]

5343} సరసి  - సరసున పుట్టునది, పద్మము :-
[2-243-చ.]

5344} సరసిగర్భుడు  - సరసి (పద్మము)న పుట్టిన వాడు, బ్రహ్మ దేవుడు :-
[2-243-చ., 2-260-క.]

5345} సరసిజగర్భసన్నుతుడు  - సరసిజగర్భ (బ్రహ్మదేవునిచే) సన్నుతుడు (కీర్తింపబడు వాడు), రాముడు :-
[7-482-చ.]

5346} సరసిజగర్భుడు  - సరసిజ (పద్మము)న గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-672-క., 3-777-క., 4-38-చ.]

5347} సరసిజజని  - సరసిజ (పద్మము)నందు జని (పుట్టినవాడు), బ్రహ్మ :-
[8-152-క.]

5348} సరసిజదళనేత్రుడు  - సరసిజ (పద్మము యొక్క) దళ (రేకు)లవంటి నేత్రములు కలవాడ, శ్రీకృష్ణ :-
[5.1-182-క.]

5349} సరసిజదళము  - సరసున జ (పుట్టినది, పద్మము) యొక్క దళ (రేకులు) :-
[2-287-మాలి.]

5350} సరసిజనయనుడు  - సరసిజము (పద్మము) వంటి నయనుడు (కన్నులు ఉన్నవాడు), విష్ణువు :-
[3-832-క.]

5351} సరసిజనాభనందనుడు  - పద్మనాభుని (కృష్ణుని) కొడుకు, ప్రద్యుమ్నుడు :-
[10.2-872-చ.]

5352} సరసిజనాభుడు  - సరసిజము (పద్మము) నాభి (బొడ్డు)న కలవాడు, విష్ణువు :-
[3-1003-చ., 4-718-చ., 5.1-61-చ.]

5353} సరసిజనిభహస్తుడు  - సరసిజ (పద్మము) నిభ (వంటి) హస్తుడు (అరచేతులు కలవాడు), శ్రీరాముడు :-
[10.1-1791-మాలి.]

5354} సరసిజనేత్రుడు  - సరసిజముల (పద్మము) వంటి నేత్రములు కలవాడు, విష్ణువు :-
[3-242-చ., 3-510-చ., 3-677-క.]

5355} సరసిజపత్త్రనేత్రుడు  - పద్మపత్రములవంటి నేత్రములు కలవాడు, శ్రీరాముడు :-
[10.2-1340-చ.]

5356} సరసిజపత్రలోచనుడు  - తామర రేకుల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు :-
[10.2-1095-చ.]

5357} సరసిజభవుడు  - సరసిజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[3-158-క., 3-365-క., 3-737-క.]

5358} సరసిజము  - సరసునందు జనించునది, కమలము :-
[3-224-క., 10.1-915-క.]

5359} సరసిజముఖి  - సరసిజము (సరసున పుట్టు పద్మము) వంటి ముఖము కలామె, స్త్రీ :-
[4-84-క.]

5360} సరసిజలోచనుడు  - సరసిజముల (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-52-క., 3-157-క., 3-526-క.]

5361} సరసిజహితుడు  - పద్మబంధువు, సూర్యుడు :-
[12-42-క.]

5362} సరసిజాక్షి  - సరసిజము (పద్మముల) వంటి అక్షి (కన్నులు కల వాడు), స్త్రీ :-
[4-844-చ.]

5363} సరసిజానన  - సరసిజము (పద్మముల) వంటి ఆనన (కన్నులు కలామె), స్త్రీ :-
[10.2-822.1-తే.]

5364} సరసిజాసనుండు  - సరసిజము (పద్మము) ఆసనుండు (ఆసనముగా గలవాడు), బ్రహ్మదేవుడు :-
[5.1-12-ఆ.]

5365} సరసిజోదరుడు  - సరసిజము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు :-
[3-937-వ., 4-753.1-తే., 6-55.1-తే.]

5366} సరసిరుహోదరుడు  - సరసిరుహ (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు :-
[3-235-క., 3-629-చ., 4-888-చ.]

5367} సరసీరుహజాతుడు  - సరసీరుహము (పద్మము)న జాతుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[4-124-చ.]

5368} సరసీరుహము  - సరసునందు రుహము(పుట్టునది), పద్మము :-
[1-2-ఉ., 3-180.1-తే., 3-505-ఉ., 4-31.1-తే., 4-917-చ.]

5369} సరసీరుహాక్షుడు  - సరసీరుహము (పద్మముల) వంటి అక్షుడు (కన్నులుకలవాడు), విష్ణువు :-
[3-845.1-తే.]

5370} సరసీరుహాసనుడు  - సరసీరుహము (పద్మము)న ఆసీనుడు (కూర్చుండువాడు), బ్రహ్మదేవుడు :-
[4-436.1-తే.]

5371} సరసీరుహోదరుడు  - సరసీరుహము (పద్మము) ఉదరమున గలవాడు, విష్ణుమూర్తి :-
[3-185-త., 3-191-క.]