పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ముందుమాట : ఉపోద్ఘాతం

1) భాగవతం – పురాణం

Telugu Bhagabvatam

“పురా అపి నవ ఇతి పురాణః”. ఎంత పురాతనమైనదై ఉండి ఎప్పటికప్పుడు సరికొత్తగా స్పురిస్తుండేది పురాణం. భాగవత మహా పురాణం అష్టాదశ పురాణాలలోనిది, కావ్యత్రయం లోనిది. ముందు పురాణం గురించి చూద్దాము. సర్గ, ప్రతిసర్గ, మనువులు, మన్వంతరము, వంశాను చరితములు పురాణానికి పంచలక్షణాలు అంటారు కొందరు. దశలక్షణాలు అంటారు కొందరు. సర్గము – మహదహంకార పంచతన్మాత్ర ఇంద్రియ భూతపంచ ప్రపంచ సృష్టి, విసర్గము – విరాట్పురుషుని వలనం సంభవించిన చరాచర భూత సృష్టి, స్థానము – శ్రీహరి అవతారములెత్తి జగత్తును పాలించుట, పోషణము – శ్రీహరి నిజభక్త జనోద్ధరణము చేయుట, ఊతులు – కర్మవాసనలు, పుణ్యపాపములు, మన్వంతరములు – పదునలుగురు మనువుల చరిత్రలు వారి ధర్మములు, ఈశాను కథలు – శ్రీహరి అవతార కథలు, అతని భక్తుల చరిత్రలు, నిరోధము – శ్రీమన్నారాయణుని యోగనిద్ర, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ముక్తి – అవిద్య త్యజించి నిశ్చల భక్తిచే శ్రీహరి రూపమును స్వస్వరూపముగ నొందుట, ఆశ్రయము – సృష్టి స్థితి లయములు ఎవ్వని వలన గలిగెనవో అతడే (పరమాత్మ) ఆశ్రయము.
అలాంటి పురాణాలు మనకి చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి అష్టాదశ పురాణాలు. అవి మత్య్య, మార్కండేయ, భాగవత, భవిష్యత్, బ్పహ్మాండ, బ్రాహ్మ, బ్రహ్మ, వైవర్త, వామన, వాయవ్య, వైష్ణవ, వారాహ,అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాందములు యని 18. వానిని అష్టాదశ పురాణాలు అంటారు. శ్లో. మద్వయం, భద్వయం, చైవ బ్రత్రయం, వచతుష్టయం. అ, నా, ప, లిం, గ, కూ, స్కాని పురాణాని పృథక్ పృథకి. ఇంకా అష్టాదశ ఉపపురాణాలు ఉన్నాయి. అవి – ఉశన, కపిల, కాళి, సనత్కుమార, శంభు, సౌర, దౌర్వాస, నందీయ, నారసింహ, నారదీయ, పారశర, అంగీరస సంహిత, భృగు సంహిత, మారీచ, మానవ, వాశిష్ఠ, లింగ, వాయు పురాణములు – యని 18.

2) భాగవతం - కావ్యం

Vyasa Bhagabvan

హైందవ సాహిత్యంలో ముఖ్యమైనవి మూడు రామాయణ భారత భాగవత ఇతిహాసాలు. వేదాలు పునాదిరాళ్ళు, ఈ కావ్య త్రయం స్తంభాలు లాంటివి. రామాయణంలో జీవన విలువలకు ప్రాధాన్యం, భారతంలో ఫలవంతమైన జీవనానికి ప్రాధాన్యం. భాగవతంలో పారమార్థానికి ప్రాధాన్యం. అందుకే పోతనామాత్యులవారు గ్రంధారంభం లోనే అన్నారు.
1-1 శ్రీకైవల్యపదంబుఁజేరుటకునై చింతించెదన్, లోకర
క్షైకారంభకు, భక్తపాలనకళాసంరంభకున్, దానవో
ద్రేస్తంభకుఁగేళిలోలవిలసదృగ్జాలసంభూతనా
నాకంజాతభవాండకుంభకు, మహానందాంగనాడింభకున్.

కృతికర్తలు-పద్యాలుభాగవతంలో రామాయణ భారత కథలు కూడ చెప్పబడతాయి. కావ్య లక్షణాలైన అలంకారాదులు విస్తారంగా గల బహు కథా రత్నాల మణిపూసల సమాహారం భాగవతం. వీటిలో చాలా వాటికి వైయక్తిక సంపూర్ణత కూడ గోచరిస్తుంది. ఈ సమాహారానికి సూత్రంగా శుక మహర్షి పరీక్షిన్మహారాజు లనే స్వర్ణ రజత దారాలు చక్కగ పేన బడ్డాయి. మధుర శృంగారము మధుర వైరాగ్యము కలగలసిన పురాణమిది. అందుకే మధురాధిపతి శ్రీకృష్ణులవారికి ప్రథమపీఠం వేసారు. ఈ మహా పురాణాన్ని వ్యాసమహర్షులవారు సంస్కృతంలో రచించారు. ఈ మూల భాగవత రచనా కాలన్ని నిర్ణయించడం కష్టం. ఇది అతి పురాతనమైనది అన్నది నిర్వివాదాంశం. అట్టి మహాభాగవతానికి తెలుగుసేత బమ్మెర పోతన చేయుట తెలుగజాతి అదృష్టం. ఎనిమిది స్కంధాలు (1, 2, 3, 4 మరియు 7, 8, 9, 10 స్కంధాలు) వీరి కృతి అని మిగిలిన 5, 6 స్కంధాలు గంగన, సింగనల కృతి అని, 11 మరియు 12 స్కంధాలు నారయ కృతి అని స్థూలముగా అనుకోవచ్చు. ఇలా స్థూలంగా తీసుకొంటే వారు వాడిన పద్యాల వ్యాప్తి పటం. 1 లో ఉదాహరణగా చూపబడినది.

3) పోతన

Pothana

పోతన గారి ప్రణీతము అంటే ప్రణిహితమే, ప్రాణిహితమే. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీ. శ. 1378 నుండి 1460 అని పలువుర చే నిర్ణయింపడినది. సంస్కృత మహాభాగవతాన్ని ప్రాంతీయ భాషాంతీకరణ చేసినవాటిలో ఇదే ప్రప్రథమమైనది అంటారు. వీరి ఇతర కృతులు వీరభద్ర విజయము, నారాయణ శతకము, భోగినీ దండకము. వీరు సహజ కవులు. వీరి రచనాశైలి చక్కెరపాకం ఆపాతమథురమని మహాపండితులు పేర్కొంటారు. పండిత పామరుల నిరువరను మెప్పిస్తుంది. ఇష్టమైన పద్యం లేదా ఇష్టమైన కథనం లేదా మొత్తం గ్రంధం ఏదైనా సరే విడిగా చదువుకోవచ్చు రసపూర్ణంగా స్వసంపూర్ణంగా ఉంటాయి. ఇందుకు భాగవతంలోని ఒక పద్యమేనా రానివాడు తెలుగువాడేకాదనెడి ననుడే నిదర్శనము. భాగవతంలో కథలు, శృంగారాలు, వైరాగ్యాలు, పద్యాలే కాదు వివిధ విషయాల వివరాలు, సాహిత్య ప్రక్రియలు చాలా ఉన్నాయి. వీటిలో పోతన గారి విశిష్ఠత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వీటిని గణించుట కూడ బహు ఆసక్తి కరంగాను, ప్రయోజనకరం గాను ఉంటుంది. అదే భాగవత గణనోపాఖ్యానము.

4) ఈ అంతర్జాల పుటలు – కంప్యూటరు దస్త్రములు

స్కంధాలు-పద్యాలుపోతనప్రణీతమైన ఆంధ్రమహాభాగవతమును అనేక మహాపండితులు ప్రసిద్ధ సంస్థలు పుస్తక రూపంలో ముద్రించాయి. అయితే ప్రస్తుత కాలానికి కావలసినట్లు అంతర్జాలం, కంప్యూటర్లలలో చదువు కొనుటకు వీలుగా దిగుమతికి వీలుగా అందిస్తున్నాము. విండోస్ ఉండి ఎమ్ ఎస్ ఆఫీసుల లో యూనికోడ్ లిపితో కావలసిన భాగం సులువుగా చదువుకొనుటకు వీలుగా చేసాము. భారతీయో వంటి ఓపెన్ ఆఫీసులలో కూడ పనిచేయును. ఏ భాగంకావాలంటే అది కాపీ-పేస్టు, వెదుకుటలకు వీలుగా ఉండేలా చేసాము. కొన్ని ముఖ్యమైన పద్యాలను పక్కన ఉటంకించాము. టీక టిప్పణులు (ప్రతిపదార్థములు) సంబంధించిన పద్యం కింద చూపు/దాచు బొత్తముతో ఇచ్చాము. కొన్ని పద ప్రయోగాల వివరణలను సేకరించి విస్తారించి అనుయుక్త/వివరణః పుటలో చూపాము. భాగవతంలో వాడిన ప్రతి అక్షరానికి అక్షరం, ప్రతి పదాలకి పదం, మక్కికి మక్కిగా, పరిశీలించి మధించి విడదీసి దత్తైలుగా చేసి గణాంకాల వివరాలు పుటలో పెట్టాము. వాటిని ఉపయోగించి జనింపజేసిన పటములు, పట్టికాదులు కొన్ని చూపాము. ఉదాహరణకి ఏ స్కంధంలో ఎన్ని పద్యాలున్నాయి చూపు పటం కింద ఇవ్వబడింది.

5) సాంబశివరావు

భావగ్రహణం (conceptualisation) చేసి, సంకల్పించి, సంకలనం (compile) చేసిన వారు ఊలపల్లి సాంబశివ రావు. వీరు స్వభావ రీత్యా బహు గ్రంధ పాఠకులు. పౌగండ వయస్సులోనే పూజారి తాతగారి చలవ వలన అనేకమైన ఆధ్యాత్మికాది పుస్తకాలతో పరిచయం కలిగినవారు. వీరు కవి కారు, పండితులు కారు, రచయిత కారు. వృత్తి రీత్యా రాష్ట్ర విద్యుత్ సంస్థలో ఇంజనీరుగా జీవించి. తల్లిలాంటి ఆ సంస్థ చల్లని చూపుల వలన బరువు బాధ్యతల అనంతరం, ఈ పరిశోధాత్మక చిరు యత్నానికి ధైర్యం చేసారు. షిరిడి సాయి అనుగ్రహం వలన వలసిన కావలసినవన్నీ ఆయనే అనుగ్రహిస్తారన్నది వీరి ధైర్యం. వీరు భాగవత గణనాధ్యాయిని అని చెప్పుకుంటు ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. వీరి తల్లితండ్రులు ఇద్దరు పుట్టి బుద్దెరిగి పిల్లలను దండించి ఎరుగని సాత్వికులు. తల్లి వెంకటరత్నంగారు పరమ ఉత్తమురాలు. తండ్రి అచ్యుత రామయ్యి గారు రాష్ట్ర రివెన్యూ శాఖలో తూర్పుగోదావరి జిల్లాలో పనిచేసారు. గణితంలో ఉద్దండులు. వీరి పూర్వీకులది కరిణీకపు వంశము. పితామహులు చిట్టిరాజు గారు మాతామహులు సాంబశివరావు గారు కరణాలే. వీరి అన్నగారు లక్ష్మీ నారాయమ దేవ్, సివిలు ఇంజనీరు మరియు చెల్లెళ్లు శేష కుమారి, లక్ష్మి. వీరు ఇవటూరి భాస్కర రావు, ఛార్టెడు ఎక్కౌంటెంటు గారి పుత్రిక లలితను వివాహం చేసికొన్నారు. వీరికి ఫణి కిరణ్, భాస్కర కిరణ్ అని ఇద్దరు చక్కటి పుత్రులు.

6) కృతఙ్ఞతలు

ఊహా (conceptualisation) కర్త, సంకలన కర్త ఊలపల్లి సాంబశివ రావు; వెన్నుదన్ను గాత్ర ప్రదానం వెంకట కణాద, గాత్ర ప్రదాతలు వెంకట కణాద, రామక సత్యం, ఓగేటి కృపాలు; జాలగూడు నిర్మాణ నిర్వహణలు బాధ్యులు మోపూరు ఉమామహేశ్, మిరియాల దిలీప్; నిర్వహణాది బాధ్యులు బండి శ్రీనివాస్; సాంకేతిక సహాయం, సంచారిణిలలో పరివ్యాప్తి విఎఆర్ ఫణి కిరణ్; ముఖపుస్తకాదులలో పంచుట ఆదిత్య శ్రీరాంభట్ల ; ఇంకా ఇలా అనేకులు సాహిత్య పరంగాను, వ్యక్తి గతంగాను, సాంకేతికంగానుగాను సహాయ సహకార ప్రోత్సాహములు చేసిన వారు ఉన్నారు. ప్రత్యక్షంగా తమ సమయం వెచ్చించినవారు ఉన్నారు. వారందరికి మా కృతఙ్ఞతలు. వీరే కాక ఈ కృషికి ఉపయోగపడిన వివిధ పుస్తకముల రచయితలు, ప్రచురణకర్తలు మరియు ఈ కృషిని సాధ్యము చేసిన కంప్యూటరులు చేసిన హెచ్ సి ఎల్, డెల్, వ్యూసోనిక్ మున్నగు కంపెనీలు మరియు సహకరించి ప్రోత్సాహించిన అంతర్జాల సంస్థలు, హైదరాబాదు సింగపూరులలోని వివిధ గ్రంధాలయాలు ఇలా పరోక్షంగా అనేకులు సహాయపడ్డారు. అందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు. ఈ పనిని చూసి, ఆస్వాదించి, ఆశీర్వదించి, ఆదరించి, ప్రోత్సహించిన మహానుభావులు, పాఠకులు, భాగవతోత్తములు మరెందరో ఉన్నారు వారందరికి పేరుపేరునా మా హార్దిక ధన్యవాదములు. భాష తెలియక పోయిన ఆదరించి సహృదయంతో అభిమానం చూపి ప్రోత్సహించిన చైనా జాతీయుడైన ఎస్ కె చూహా (సింగపూరియను), తమిళులు పూవ రాఘవన్ అయ్యంగారు (ఆఫ్ఘనిస్థాన్) ఆర్తి (సింగపూరు) మున్నగువారు కొందరు ఉన్నారు వారికి ప్రత్యేక ధన్యవాద శతాలు.


Telugu Bhagabvatam