సర్వలోకాలను సంరక్షించుట అందు గట్టి సంకల్పం కల వాడిని, భక్తజనులను కాపాడుటలో మిక్కిలి తొందర కల వాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండభాండాలు సృజించే వాడిని, మహాత్ము డైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) కైవల్య పదము (నీవుగానే తప్ప నాకంటూ వేరే ఉనికి లేనంతగా నీలో ఐక్యం అయ్యే పదవిని) అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను. ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంథారంభ ప్రార్థనా పద్యం. ఈ తెలుగసేతను బమ్మెర పోతనామాత్యుల వారు తన మోక్షానికే కాదు మనందరి మోక్షాన్ని అపేక్షించి చేసారు. ఇది భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమాన మైంది. ఇష్టదేవతా స్తుతీ, వస్తు నిర్దేశమూ కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాని కంతా అద్దం పడుతుంది. శార్దూలవిక్రీడిత వృత్తం ఎన్నుకోడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి, నిర్దేశాలను పలికించే పద విన్యాసం బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు. (అ) శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ (ఆ) లోకరక్షైకారంభకున్ (ఇ) భక్తపాలన కళా సంరంభకున్ (ఈ) దానవోద్రేక స్తంభకున్ (ఉ) కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ (ఊ) మహానందాంగనా డింభకున్ అనే అద్భుత ప్రయుక్తాలు ఈ పద్యంలో ఆరు (6) ఉన్నాయి. భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్టరక్షణ పరాయణత్వ, దుష్ట శిక్షణ చణత్వ, విశ్వకర్తృత్వ, ఆనందమయత్వాలు అనే ఆరింటికి ప్రతీకలు యివి. (అ) శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ అనటంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. అలాగే ప్రథమ స్కంధంలోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైనవారి కథలూ, తృతీయ స్కంధంలోని దేవహూతి వృత్తాంతమూ, చతుర్థ స్కంధంలోని ధ్రువ చరిత్రా స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది. (ఆ) లోకరక్షైకారంభకున్ అనటంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపు కంస కాలయవనాదులను (తృతీయ, సప్తమ, దశమ స్కంధాలు) సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం సంస్థాపించబడింది.(ఇ) భక్తపాలన కళా సంరభకున్ అనటంలో భక్తులను పాలించటం భగవంతుని కళ, ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి అనే సూచన. అలాగే గజేంద్రుణ్ణి కాపాడటానికి మహా విష్ణువు వైకుంఠం నుంచి పరుగెత్తుకు వచ్చిన వృత్తాంతం (అష్టమ స్కంధం) స్పురిస్తూ భగవంతుని శిష్ట రక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది. (ఈ) దానవోద్రేకస్తంభకున్ అనటంతో అష్టమ స్కంధంలోని వామనావతారం వ్యంజకమైంది. తరువాతి మన్వంతరంలో ఇంద్రుడు కావలసిన బలి, వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించాడు. దుష్టశిక్షణచణు డైన స్వామి వామనుడై, ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపజేయటం ధ్వనించింది. (ఉ) కేళిలోల... కుంభకున్ అనటం వల్ల భగవంతుని విశ్వకర్తృకత్వాన్ని వెల్లడించే సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర (నవమస్కంధం) స్ఫురిస్తోంది. స్వామి విలాసంగా త్రిప్పే కళ్ళల్లో నుంచే కదా బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. సృష్టి జరుగుతుంది. నిజానికి స్వామి కళ్ళు సూర్యచంద్రులేగా. ఇంకా శ్రీహరే ప్రధానకర్తని ద్వితీయ స్కంధం నిరూపిస్తోంది. (ఊ) మహానందాంగనా డింభకున్ అనటం కృష్ణలీలా సర్వస్వమైన దశమ స్కంధానికి, ఆ నందాంగనకు ఆనందానికి, మహా ఆనందమే దేహంగా కల స్వరూపికి ప్రతీక.
పర్వతరాజు హిమవంతుని కుమార్తె ఉమాదేవి మాతృప్రేమ అనే సంపదను సంపాదించిన వాడు, సకల పాపాలను విరిసిపోయేలా చేసేవాడు, శరణాగతులకు వినోదములు కలుగజేయువాడు. సమస్త విఘ్నాలనే బంధనాలు ఛేదించు వాడు, మంజుల మధురంగా భాషించేవాడు.అఖిల లోకవాసులు అందరకు విశేష సంతోషాన్ని ప్రసాదించువాడు, ఉండ్రాళ్లూ ఆరగించువాడు. మదించిన మూషకరాజును మిక్కిలి సంతోషంగా అధిరోహించి విహరించువాడు, శుభాలు ప్రసాదించు వాడు ఐన వినాయకునకు చక్కటి మన్ననలతో నమస్కరిస్తున్నాను.
నేలకు నెన్నుదురు తాకేలా సాగిలపడి మ్రొక్కి, సైకత శ్రోణీ, చదువులవాణీ, అలినీలవేణీ ఐన వాణిని సన్నుతిస్తాను. సుధలు వర్షించే సుందర సుకుమార సూక్తులతో అరవిందభవుని అంతరంగాన్ని ఆకర్షించే సౌందర్యరాశిని; కటాక్ష వీక్షణాలతో సుర నికరాన్ని కనికరించే కరుణామయిని; ఒక చేతిలో అక్షమాల, ఇంకో చేతిలో రాచిలుక, వేరొక చేతిలో తామర పువ్వు, మరో చేతిలో పుస్తకం ముచ్చటగా ధరించే ఆ తల్లిని సదా సంస్తుతిస్తాను.
పుట్టన్ = పుట్టలో; పుట్ట = పుట్ట లేదు (వాల్మీకిని కాదు); శరంబునన్ = రెల్లుపొదలో (బాణము అనే పదం గల పేరుతో); మొలవ = పుట్ట లేదు (సుబ్రహ్మణ్యుడను కాదు, బాణుడను కాదు) {పాఠాంతరం - పుట్టంబుట్టశిరంబున్ మొలువ = శిరస్సు మీద పుట్టపుట్టి ఉన్నవాడను కాదు (వాల్మీకిని కాదు)}; అంభస్ = జల; యాన = ప్రయాణ; పాత్రంబునన్ = సాధనములో - పడవలో; నెట్టన్ = యదార్థానికి; కల్గను = పుట్ట లేదు (వ్యాసుని కాదు); కాళిన్ = కాళి; కొల్వను = ఆరాధించను (కాళిదాసును కాదు); పురాణింపన్ = పురాణ (భాగవత) రచనకి; దొరంకొని = పూనుకొని; ఉంటిని = ఉన్నాను; మీఁదు = ముందు చెప్పిన; ఎట్టే = అటువంటి వారి; వెంటన్ = పద్ధతినే; చరింతున్ = నడుస్తాను; తత్ = ఆ; సరణి = విధమును; నాకు = నాకు; ఈవు = ఇవ్వుము; అమ్మ = తల్లీ; ఓ = ఓ; అమ్మ = అమ్మ; మేల్ = మంచి; పట్టున్ = దన్నుగా; నాకు = నాకు; అగుము = ఉండుము; అమ్మ = తల్లీ; నమ్మితిన్ = (నిన్నే) నమ్మొకొంటిని; చుమీ = సుమా; బ్రాహ్మీ = సరస్వతీదేవీ {బ్రాహ్మి - బ్రహ్మ దేవుని భార్య, సరస్వతి}; దయ = దయకు; అంభోనిధీ = సముద్రమా.
భావము:
అందరిని పుట్టించే బ్రహ్మదేవుని అర్థాంగీ! సరస్వతీదేవి! *నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను; బాణం నుంచి వచ్చిన పేరు కలిగిన బాణుడను కాను (రెల్లుపొదలో పుట్టిన సుబ్రహ్మణ్యుడను కాను); పడవలో పుట్టిన వ్యాసుడను కాను; కాళీమాతను కొలిచిన కాళిదాసుని కాను; కాని మాతా! ఈ భాగవత పురాణ రచన కూడ వారి లాగే గంభీరంగా చేయాలని పూనుకున్నాను. దీనిని కూడ వారి రచనల వలెనె శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు తల్లీ! నిన్నే నమ్ముకున్నానమ్మా. నన్ను అత్యుత్తమ మార్గంలో నడిపించు. దయామయీ! {*‘పుట్టంబుట్టశిరంబునన్ మొలవ’ అనే పాఠ్యాంతరం ప్రకారం పుట్టలో పుట్టి శిరస్సున పుట్ట పుట్టిన వాల్మీకిని కాదు}
తల్లీ! వికాస ప్రకాశాలకి ప్రతీకగా అప్పుడే వెల్లి విరుస్తున్న పద్మం అలంకరించిన హస్తంతో, శరచ్చంద్రుని వెన్నెల వికాసానికి చల్లదనానికి అనురూప మైన శ్వేత స్వరూపంతో, విజ్ఞాన స్వరూపాలై దిగ్దిగంతాలు సర్వం వెలిగిస్తున్న ఆభరణాల లోని మణి మాణిక్యాల కాంతులతో, వేదసూక్తులు వెల్లడిచేసే స్వీయ ప్రభావంతో, ఉత్తమతమ భావాల పరంపరలలో విస్తృతంగా విహారిస్తుండే భారతీదేవి! నీ దయాపూరిత దృక్కులతో అనుగ్రహించమ్మా!. అంబ నంవాంబుజోజ్వల. . . పద్యం -1-9-ఉ. ఎఱ్ఱన భారతం నుండి గ్రహించబ బడింది. ఇది మన బమ్మఱ పోతనామాత్యులు పూర్వకవులపై నుండే గౌరవం కొలది / ఈ పద్యంలోని మాధుర్యంపై ఇష్టం చేత తన భాగవతారంభ పద్యాలలో చేర్చారు. ఇది బహుధా ముదవహం అని నా భావన.
దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; దైత్యులను నాశనము చేసి వారి తల్లియైన దితి కడుపులో దుఃఖము చేకూర్చిన తల్లి; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో మహత్వము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.