పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

శ్రీ పోతన రామాయణము : శ్రీ పోతన రామాయణము మిగతా భావము

9-351-మత్త.
ట్టిమ్రాకులు పల్లవింప నవారియై మధుధార దా
నుట్టఁబాడిన వారిపాటకు నుర్వరాధిపుఁడుం బ్రజల్
బిట్టుసంతస మంది; రయ్యెడఁ బ్రీతిఁ గన్నుల బాష్పముల్
దొట్టనౌఁదల లూఁచి వారలతోడి మక్కువ పుట్టఁగాన్.

భావము:

 ఆ విధంగా శ్రీరాముని యాగసాలలో ఎండిన మోళ్ళు చిగురించేలా, అమృత ధారలు జాలువారేలా పాడరు. వారి పాటను మహారాజు, ప్రజలు అందరూ తలలూపుతూ, ఆనందభాష్పాలు కారుతుండగా మిక్కిలి సంతోషించారు. అప్పుడు, వారిపై ఎక్కువ మక్కువ కలిగింది.

9-352-వ.
అంతనా రామచంద్రుండు కుమారుల కిట్లనియె.

భావము:

 అప్పుడు శ్రీరాముడు పిల్లలతో ఇలా అన్నాడు.

9-353-ఆ.
"చిన్నయన్నలార! శీతాంశుముఖులార!
ళినదళవిశాలయనులార!
ధురభాషులార! హిమీఁద నెవ్వరు
ల్లిదండ్రి మీకు న్యులార? "

భావము:

 ఓ చిన్ని బాబులు! మీ మోములు చంద్రబింబాల్లా ప్రకాశిస్తున్నాయి. మీ కన్నులు కలువరేకులలా వెడల్పుగా అందంగా ఉన్నాయి. మీ పలుకు మధురంగా ఉన్నాయి. లోకంలో మీలాంటి వారి తల్లిదండ్రులు ధన్యులు; మీ తల్లిదండ్రులు ఎవరు నాయనలారా?
– అని మర్యాదకు మారుపేరైన శ్రీరామచంద్రమూర్తి తన యజ్ఞశాలకి వచ్చి రామకథ గానం చేస్తున్న కుశలవులను ప్రశ్నించాడు. పోతనగారి పాత్రౌచిత్య, సందర్భౌచిత్యమైన లలిత పదాలు, నడక లాలిత్యం ఈ మృదు మధురమైన పద్యంలో ప్రతిఫలిస్తున్నాయి.

9-354-వ.
అనిన వార “లేము వాల్మీకి పౌత్రులము; రాఘవేశ్వరుని యాగంబు చూడ వచ్చితి” మనవుడు; మెల్లన నగి “ యెల్లి ప్రొద్దున మీ తండ్రి నెఱింగెద; రుండుం” డని యొక్క నివాసంబునకు సత్కరించి పనిచె; మఱునాఁడు సీతం దోడ్కొని కుశలవుల ముందట నిడుకొని వాల్మీకి వచ్చి రఘుపుంగవునిం గని యనేక ప్రకారంబుల వినుతించి యిట్లనియె.

భావము:

 ఇలా అడిగిన శ్రీరామునితో వారు ఇలా అన్నారు. “మేము వాల్మీకి మనుమలం. శ్రీరాముని యాగం చూడ్డానికి వచ్చాం.” వారి పలుకులు విని మెల్లిగా నవ్వి, “రేపు ఉదయం మీ తండ్రిని తెలుసుకుందురు గాని, రండి.” అని సత్కరించి పంపించాడు. మరునాడు వాల్మీకిమహర్షి సీతను, కుశలవులను వెంటబెట్టుకొని వచ్చి శ్రీరాముని పెక్కువిధా స్తుతించి ఇలా అన్నాడు.

9-355-ఆ.
"సీత సుద్దరాలు, చిత్తవాక్కర్మంబు
లందు సత్యమూర్తి మలచరిత
పుణ్యసాధ్వి విడువఁ బోలదు చేకొను
వికులాబ్ధిచంద్ర! రామచంద్ర!"

భావము:

 “రామా! రవికులాబ్ధిసోమా! సీతాదేవి పవిత్రురాలు (త్రికరణ శుద్ధిగా) మనోవాక్కాయకర్మలలోను సత్యనిష్ఠగల సాధ్వి, పరిశుద్ధ వర్తనురాలు, మహాపుణ్యాత్మురాలు, పతివ్రత. ఈమెను విడుచుట తగినపని కాదు. స్వీకరించు.”

9-356-వ.
అని వాల్మీకి పలుక, రామచంద్రుండు పుత్రార్థి యై విచారింపఁ, గుశ లవులను వాల్మీకికి నొప్పగించి, రామచంద్రచరణధ్యానంబు చేయుచు నిరాశ యై సీత భూవివరంబు జొచ్చెను; అయ్యెడ.

భావము:

 అని వాల్మీకి చెప్పగా, శ్రీరాముడు కొడుకుల గురించి విచారించాడు. నిరాశచెందిన సీతాదేవి, వాల్మీకికి కుశలవులను అప్పచెప్పి, భర్త పాదాలు ధ్యానిస్తూ భూగర్భములోకి ప్రవేశించింది. అప్పుడు...

9-357-మ.
ముదితా! యేటికిఁ గ్రుంకి తీవు మనలో మోహంబు చింతింపవే
నాంభోజము చూపవే మృదువు నీ వాక్యంబు విన్పింపవే
తుదిచేయం దగ దంచు నీశ్వరుఁడునై దుఃఖించె భూపాలుఁ డా
గాదే ప్రియురాలిఁ బాసిన తఱిన్ భావింప నెవ్వారికిన్?

భావము:

 తాను భగవంతుడే అయినా రాముడు సీత కోసం దుఃఖిస్తూ, ఇలా అన్నాడు. “ఓ కాంతా! అయ్యో నీవు ఎందుకు భూమిలోకి కుంగిపోయావు. మన మధ్య ఉన్న ప్రేమను గుర్తుచేసుకో. నీ ముఖపద్మాన్ని చూపించు. నీ మృదుమధుర వాక్కులు వినిపించు. ఇలా నన్ను విడిచి పోవద్దు.” అవును, ఎంతటివారికి అయినా ప్రియురాలు దూరమైతే దుఃఖం కలగుతుంది కదా..

9-358-వ.
అని వగచి, రామచంద్రుండు బ్రహ్మచర్యంబు ధరియించి, పదుమూఁడువేల యేం డ్లెడతెగకుండ నగ్నిహోత్రంబు చెల్లించి తా నీశ్వరుండు గావునఁ దన మొదలినెలవుకుం జనియె నివ్విధంబున.

భావము:

 ఇలా బాధపడిన శ్రీరాముడు బ్రహ్మచర్యం చేపట్టి పదమూడువేల (13,000) సంవత్సరాలు ఎడతెగకుండా హోమాలు నడిపించి భగవంతుడు కనుక తన మూలస్థానం పరమపదానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా....

9-359-ఆ.
దిదేవుఁడైన యారామచంద్రుని
బ్ధి గట్టు టెంత సురకోటి
జంపు టెంత కపుల సాహాయ్య మది యెంత
సురల కొఱకుఁ గ్రీడ జూపెఁగాక.

భావము:

 దేవతల కోసం లీలలు చూపించడానికి తప్పించి, ఆదిదేవుడైన ఆ రామచంద్ర మూర్తికి సముద్రానికి సేతువు కట్టుట అనగా ఎంతపని? రాక్షససంహారం అనగా ఎంతపని? ఆయనకు వానరులు తోడా అది ఏపాటిదనవచ్చు?

9-360-చ.
శుఁడుగ మ్రొక్కెదన్ లవణవార్ధి విజృంభణతా నివర్తికిన్
దిగధీశమౌళిమణి ర్పణమండిత దివ్యకీర్తికిన్
శతభానుమూర్తికి సుధారుచిభాషికి సాధుపోషికిన్
రథరాజుపట్టికిని దైత్యపతిం బొరిగొన్న జెట్టికిన్.

భావము:

 సాగరుని అహంకారం సర్వం అణచినవానికి; సకల దిర్పాలకుల కిరీటాలలోని మణులు అనె దర్పణాలలో ప్రతిఫలించే గొప్ప యశస్సు గలవానికి; వెలసూర్యులతో సమానమైన ప్రకాశంగల మహామూర్తికి; అమృతం అంత మధురంగా మాట్లాడు వానికి; సాధులను పాలించువానికి; దశరథరాజు కుమారునికి; రావణాసురుని సంహరించిన వీరునికి; వినమ్రుడనై మ్రొక్కుతాను.

9-361-ఉ.
ల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ
ల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
ల్లెడువాఁడు నైన రఘుత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్.

భావము:

 నల్లటివాడు, పద్మాలవంటి కళ్ళు గలవాడు, గొప్ప ధనుస్సు బాణాలు ధరించు వాడు, విశాలమైన వక్షస్థలం గలవాడు, మేళ్ళు అనేకం సమకూర్చువాడు, ఎగుభుజాలు గలవాడు, అన్ని దిక్కులకు తన కీర్తిని వ్యాపింపజేసిన వాడు, రఘు కులోత్తముడు అయిన శ్రీరామచంద్రుడు మా కోరికలు తీర్చుగాక.

9-362-ఆ.
రామచంద్రుఁ గూడి రాకలఁ పోకలఁ
దిసి తిరుగువారుఁ న్నవారు
నంటికొన్నవారు నాకోసలప్రజ
రిగి రాదియోగు రుగు గతికి.

భావము:

 శ్రీరామునితో కలిసిమెలసి మెలగిన వారు; తనివితీరా చూసిన వారు; ప్రేమతో తాకిన వారు అయిన ఆ కోసల ప్రజలు ఆదియోగులు పొందే సద్గతిని పొందారు.

9-363-క.
మంనములు సద్గతులకుఁ
బొంనములు ఘనములైన పుణ్యముల కిదా
నీంనపూర్వమహాఘ ని
కృంనములు రామనామ కృతి చింతనముల్.

భావము:

 శ్రీరామచంద్రమూర్తిని గుఱించి చేసెడు తలపులు సద్గతులు కలిగించే ఏకాంతమార్గములు, గొప్ప పుణ్యాలు కలిగిస్తాయి. పూర్వజన్మలలోను , యీ జన్మలోను చేసిన పాపాలను తొలగిస్తాయి. అవి మహిమాన్వితములు.

9-364-వ.
ఆ రామచంద్రునకుఁ గుశుండును, గుశునకు నతిథియు, నతిథికి నిషధుండును, నిషధునకు నభుండును, నభునికిఁ బుండరీకుండును బుండరీకునకు క్షేమధన్వుండును, క్షేమధన్వునకు దేవానీకుండును, దేవానీకునకు నహీనుండును, నహీనునకుఁ బారియాత్రుండును, బారియాత్రునకు బలుండును, బలునకుఁ జలుండును, జలునకు నర్కసంభవుం డగు వజ్రనాభుండును, వజ్రనాభునకు శంఖణుండును, శంఖణునకు విధృతియు, విధృతికి హిరణ్యనాభుండును జనియించి; రతండు జైమిని శిష్యుండైన యాజ్ఞవల్కముని వలన నధ్యాత్మయోగంబు నేర్చి, హృదయకలుషంబులం బాసి యోగచర్యుండయ్యె నా హిరణ్యనాభునకుఁ బుష్యుండును, బుష్యునకు ధ్రువసంధియు, ధ్రువసంధికి సుదర్శనుండును, సుదర్శనునకు నగ్నివర్ణుండును, నగ్నివర్ణునకు శీఘ్రుండును, శీఘ్రునకు మరువను రాజశ్రేష్ఠుండును బుట్టి: రా రాజయోగి సిద్ధుండయి కలాపగ్రామంబున నున్నవాఁడు కలియుగాంతంబున నష్టంబయ్యెడు సూర్యవంశంబుఁ గ్రమ్మఱఁ బుట్టింపంగలవాఁ; డా మరువునకుఁ బ్రశుశ్రుకుండును, నా ప్రశుశ్రుకునకు సంధియు, నతనికి నమర్షణుండును, నా యమర్షణునికి మహస్వంతుండును, నా మహస్వంతునకు విశ్వసాహ్యుండును, నా విశ్వసాహ్యునకు బృహద్బలుండును, జనియించి; రా బృహద్బలుఁడు భారతయుద్ధంబున మీ తండ్రి యగు నభిమన్యు చేత హతుండయ్యె; వినుము.

భావము:

 శ్రీరామునికి కుశుడు; కుశునికి అతిథి; అతిథికి నిషధుడు; నిషధునికి నభుడు; నభునికి పుండరీకుడు; పుండరీకునికి క్షేమధన్వుడును; క్షేమధన్వునికి దేవనీకుడును; దేవానీకునికి అహీనుడు; అహీనునికి పారియాత్రుడు; పారియాత్రునికి బలుడు; బలునికి చలుడు; చలునికి సూర్యాంశతో పుట్టిన వజ్రనాభుడు; వజ్రనాభునికి శంఖణుడు; శంఖణునికి విధృతి; విధృతికి హిరణ్యనాభుడు పుట్టారు. అతడు జైమిని శిష్యుడైన యజ్ఞవల్క మహర్షి నుండి అధ్యాత్మయోగం నేర్చుకొని హృదయంలోని కలతలు అన్నీ విడిచిపెట్టి యోగం ఆచరించాడు. ఆ హిరణ్యనాభునికి పుష్యుడు; పుష్యునికి ధ్రువసంధి; ధ్రువసంధికి సుదర్శనుడు; సుదర్శనునికి అగ్నివర్ణుడు; అగ్నివర్ణునికి శీఘ్రుడు; శీఘ్రునికి మరువు అనె రాజశ్రేష్ఠుడు జన్మించారు. ఆ రాజర్షి యోగసిద్ధి పొంది కలాపగ్రామంలో ఇప్పటికి ఉన్నాడు. కలియుగం చివరలో నాశనమైపోయే సూర్యవంశాన్ని మరల ప్రతిష్టిస్తాడు. ఆ మరువునకు ప్రశుశ్రుకుడు; ఆ ప్రశుశ్రుకునికి సంధి; అతనికి అమర్షణుడు; ఆ అమర్షణునికి మహస్వంతుడు; ఆ మహస్వంతునికి విశ్వసాహ్యుడు; ఆ విశ్వసాహ్యునికి బృహద్బలుడు పుట్టారు. ఆ బృహద్బలుడు భారతయుద్ధంలో మీ తండ్రి అభిమన్యుని చేతిలో మరణించాడు. వినుము.

ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బయిన శ్రీ మహాభాగవతం బను మహాపురాణాంతర్గతంబైన శ్రీరామకథ మఱియు శ్రీరామదుల వంశము నను కథలు గల పోతన రామాయణం బను ఉపాఖ్యానంబు సుసంపూర్ణంబు